యౌవనులారా మీ తల్లిదండ్రుల హృదయాలను మీరు ప్రభావితం చేయగలరు
యౌవనులారా మీ తల్లిదండ్రుల హృదయాలను మీరు ప్రభావితం చేయగలరు
“నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు” అని వృద్ధ అపొస్తలుడైన యోహాను రాశాడు. (3 యోహాను 4) ఈ బైబిలు వచనంలో పేర్కొనబడిన పిల్లలు క్రైస్తవ శిష్యులను సూచిస్తున్నప్పటికీ, యోహాను వ్యక్తం చేసిన ఆ భావాలను దైవభయంగల తల్లిదండ్రులు సులభంగా అర్థం చేసుకోగలరు. తల్లిదండ్రులు ఎలాగైతే తమ పిల్లల జీవితాలను ప్రభావితం చేస్తారో అలాగే పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల జీవితాలనెంతో ప్రభావితం చేస్తారు.
పిల్లలు తమ తల్లిదండ్రులను ఎంతగా ప్రభావితం చేయగలరో ఇశ్రాయేలు రాజైన సొలొమోను వివరించాడు. ఆయన ఇలా రాశాడు: “జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.” (సామెతలు 10:1) కాబట్టి, పిల్లలతోపాటు, వయోజనులు కూడా తమ క్రియలు తమ తల్లిదండ్రులను ఎంతగా ప్రభావితం చేస్తాయో పరిశీలించడం మంచిది. అలా చేయడం ఎందుకు సరైనది?
దైవభయంగల మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచే విషయంలో పడిన పాట్ల గురించి ఒక్కసారి ఆలోచించండి! మీరు పుట్టకముందు చాలారోజుల నుండే వారు మీ గురించి ఆలోచించారు, మీ కోసం ప్రార్థనలు చేశారు. మీరు పుట్టిన తర్వాత వారిద్దరూ మీతో అవినాభావ సంబంధాన్ని ఏర్పరుచుకున్నారు. పిల్లల్ని పెంచడమనే అద్భుతమైన, అదే సమయంలో గంభీరమైన ఆధిక్యతను, బాధ్యతను తమకిచ్చినందుకు వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించివుండవచ్చు. నిస్సహాయ స్థితిలో ఉన్న పసికందు ఇప్పుడు వారి సంరక్షణలో ఉంది, యెహోవా ఆరాధకులుగా వారు ఆ బాధ్యతను గంభీరంగా తీసుకున్నారు.
మీ తల్లిదండ్రులు నిజక్రైస్తవులు కాబట్టి, వారు నమ్మదగిన మార్గనిర్దేశం కోసం బైబిలును, బైబిలు ఆధారిత సాహిత్యాన్ని ఆశ్రయించారు, పిల్లల్ని పెంచి పెద్ద చేసిన ఇతరుల సలహాను తీసుకున్నారు. అంతేకాక, వారు తమ చింతలను ప్రార్థనలో దేవునికి ఎల్లప్పుడూ తెలియజేశారు. (న్యాయాధిపతులు 13:8) మీరు ఎదిగే కొద్దీ, మీ తల్లిదండ్రులకు మీ బలాలు ఏమిటో తెలిశాయి, అలాగని వారు మీ బలహీనతలనూ ఉపేక్షించలేదు. (యోబు 1:5) మీరు కౌమారదశకు చేరుకున్నప్పుడు వారికి క్రొత్త సవాళ్లు ఎదురయ్యాయి. కొన్నిసార్లు మీరు వారికి ఎదురు తిరిగివుండవచ్చు, అప్పుడు మీ తల్లిదండ్రులు మరింతగా ప్రార్థించారు, మరింతగా ప్రచురణలు చదివారు, మీరు మీ పరలోక తండ్రి అయిన యెహోవాను ఆరాధించడంలో కొనసాగేందుకు మీకెలా సహాయం చేయాలా అని ఎంతో ఆలోచించారు.
మీరెంత పెద్దవారైనా మీ తల్లిదండ్రులకు మీరింకా పిల్లలే. మీరు వయోజనులైనా వారు మీ భౌతిక, మానసిక, భావోద్రేక, ఆధ్యాత్మిక సంక్షేమం గురించి ఆలోచిస్తారు. అయితే, ఆ సమయమంతటిలో, మీరు స్వేచ్ఛాచిత్తంగల వ్యక్తులని, మీ జీవితం ఎలా మలుపులు తిరుగుతుందో చెప్పడానికి వీలుకాదని వారు గుర్తుంచుకుంటారు. మీరు ఏ మార్గాన్ని ఎంచుకోవాలనేది చివరికి మీరే నిర్ణయించుకోవాలి.
పిల్లలు “సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని” వినడం కన్నా “ఎక్కువైన సంతోషము” తల్లిదండ్రులకు ఉండదని, అలాగే వారు నడుచుకోనప్పుడు తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తారని చెప్పడం సహేతుకం కాదా? అవును, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లలు తమ తల్లిదండ్రులకు మనోవేదన కలిగిస్తారు. సొలొమోను ఇలా చెప్పాడు: “బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును.” (సామెతలు 17:25) పిల్లవాడు సత్యదేవుని ఆరాధనను విడిచిపెట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంతటి మనోవేదనను అనుభవిస్తారో కదా!
స్పష్టంగా, మీరు మీ కుటుంబం మీద, ఇతర అంశాలమీద ఎంతో ప్రభావం చూపించగలరు. మీ ప్రవర్తన మీ తల్లిదండ్రుల హృదయాలను ఎంతో ప్రభావితం చేస్తుంది. మీరు దేవుణ్ణి, ఆయన సూత్రాలను తిరస్కరిస్తే మీ తల్లిదండ్రులు బాధపడతారు. మీరు వాటిని పాటిస్తే వారు ఆనందిస్తారు. మీరు యెహోవాకు నమ్మకంగా, విధేయులుగా ఉన్నట్లయితే మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. మీ తల్లిదండ్రుల హృదయాలను సంతోషపెట్టాలనే దృఢనిశ్చయంతో ఉండండి! మిమ్మల్ని పెంచి, సంరక్షించి, ప్రేమించినవారికి అంతకన్నా ఏ గొప్ప బహుమానం మీరివ్వగలరు?