ఇతరులపట్ల శ్రద్ధ కనబరచడంలో మీరు యెహోవాను అనుకరిస్తున్నారా?
ఇతరులపట్ల శ్రద్ధ కనబరచడంలో మీరు యెహోవాను అనుకరిస్తున్నారా?
“ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు [‘ఆయనకు మీపట్ల శ్రద్ధవుంది,’ NW] గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.” (1 పేతురు 5:7) అదెంతటి ప్రేమపూర్వకమైన ఆహ్వానమో కదా! యెహోవా దేవునికి తన ప్రజలపట్ల వ్యక్తిగత శ్రద్ధ ఉంది. ఆయన కాపుదలలో మనం సురక్షితంగా ఉన్నామని భావించవచ్చు.
మనం కూడా అలాంటి ప్రేమపూర్వక శ్రద్ధను వృద్ధిచేసుకుని, ఇతరులపట్ల దానిని కనబరచాలి. మనం అపరిపూర్ణులం కాబట్టి, ఇతరులపట్ల వ్యక్తిగత శ్రద్ధను కనబరుస్తున్నప్పుడు ఎదురయ్యే కొన్ని ప్రమాదాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రమాదాల్లో కొన్నింటిని పరిశీలించబోయే ముందు, యెహోవా తన ప్రజలపట్ల వ్యక్తిగత శ్రద్ధను కనబర్చే కొన్ని విధానాలను మనం పరిశీలిద్దాం.
ఒక కాపరి ఉదాహరణను ఉపయోగిస్తూ, కీర్తనకర్తయైన దావీదు దేవుడు కనబరిచే శ్రద్ధను ఇలా వర్ణించాడు: “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు . . . గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు.”—కీర్తన 23:1-4.
దావీదు స్వయంగా ఒక గొర్రెలకాపరి కాబట్టి, మందను జాగ్రత్తగా చూసుకోవడంలో ఏమి ఇమిడివుందో ఆయనకు తెలుసు. కాపరి తన గొర్రెలను సింహాలు, తోడేళ్లు, ఎలుగుబంట్ల వంటి క్రూర జంతువుల నుండి రక్షిస్తాడు. ఆయన మంద చెదరిపోకుండా చూస్తాడు, తప్పిపోయిన గొర్రెలను వెదకుతాడు, అలసిపోయిన గొర్రెపిల్లను తన రొమ్మున చేర్చుకొని మోస్తాడు, అనారోగ్యంతో ఉన్న వాటిపట్ల, గాయపడినవాటిపట్ల శ్రద్ధ వహిస్తాడు. ప్రతీరోజు మంద త్రాగడానికి నీళ్ళు పెడతాడు. అంతమాత్రాన గొర్రెల ప్రతీ కదలికను కాపరి నియంత్రిస్తున్నాడని దాని భావంకాదు. గొర్రెలు స్వేచ్ఛగా తిరిగినా అవి కాపాడబడతాయి.
అదేవిధంగా యెహోవా తన ప్రజలపట్ల శ్రద్ధ కనబరుస్తాడు. అపొస్తలుడైన పేతురు ఇలా వివరిస్తున్నాడు: ‘మీరు దేవుని శక్తిచేత కాపాడబడుతున్నారు.’ ఇక్కడ ‘కాపాడబడుతున్నారు’ అంటే అక్షరార్థంగా జాగ్రత్తగా గమనించబడుతున్నారు అని భావం. (1 పేతురు 1:5) యెహోవాకు మనపట్ల నిజమైన శ్రద్ధ ఉంది కాబట్టి, మనం సహాయం కోసం అడిగినప్పుడల్లా సహాయం చేయడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటూ అనుక్షణం మనల్ని గమనిస్తూ ఉంటాడు. యెహోవా మనల్ని నైతిక స్వేచ్ఛగలవారిగా సృష్టించాడు కాబట్టి, మనం చేసే పనులన్నింటిలో, తీసుకునే నిర్ణయాలన్నింటిలో ఆయన జోక్యం చేసుకోడు. ఈ విషయంలో మనం యెహోవాను ఎలా అనుకరించవచ్చు?
మీ పిల్లలపట్ల శ్రద్ధ వహించడంలో దేవుణ్ణి అనుకరించండి
“కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము.” కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడి, వారిపట్ల శ్రద్ధ కనబరచాలి. (కీర్తన 127:3) అలా శ్రద్ధ కనబరచడంలో పిల్లల ఆలోచనలను, వారి భావాలను తెలుసుకొని, వారితో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని పరిగణలోకి తీసుకోవడం కూడా ఇమిడివుండవచ్చు. తమ పిల్లల కోరికలను నిర్లక్ష్యంచేసి, వారి ప్రతీ కదలికను నియంత్రించడానికి ప్రయత్నిస్తే, అది ఒక కాపరి తన గొర్రెలను తాడుతో కట్టి నియంత్రించడానికి చేస్తున్న ప్రయత్నంలా ఉంటుంది. ఏ కాపరి తన మందను అలా కాయాలనుకోడు, యెహోవా కూడా మనతో అలా వ్యవహరించడు.
మారికో * ఇలా ఒప్పుకుంటోంది: “చాలాకాలం వరకు నేను నా పిల్లలకు ‘ఇది చేయండి’, ‘అది చేయకండి’ అని ఎప్పుడూ చెబుతుండేదాణ్ణి. అలా చెప్పడం తల్లిగా నా బాధ్యతని అనుకున్నాను. నేను వారిని ఎప్పుడూ మెచ్చుకునేదాణ్ణే కాదు, మనసువిప్పి వారితో ఎప్పుడూ మాట్లాడేదాణ్ణి కాదు.” మారికో వాళ్ల కూతురు తన స్నేహితులతో గంటలకొద్దీ ఫోనులో మాట్లాడేది, కానీ వాళ్ళమ్మతో మాత్రం కొద్దిసేపే మాట్లాడేది. మారికో ఇంకా ఇలా చెబుతోంది: “ఆ తేడా ఎందుకు ఉందో అప్పుడు అర్థమైంది, తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, మా అమ్మాయి ‘అవును, నిజమే’ లేదా ‘నాకు అలానే అనిపిస్తుంది’ వంటి తదనుభూతిపూర్వక మాటలను ఉపయోగించేది. మా అమ్మాయి భావాలను తెలుసుకోవడానికి నేను కూడా అలాంటి మాటలనే ఉపయోగించడం మొదలుపెట్టాను, కొద్దికాలంలోనే మేము ఎక్కువసేపు మాట్లాడుకోవడం మొదలుపెట్టాం, మా సంభాషణ ఆహ్లాదకరంగా కూడా మారింది.” మంచి సంభాషణ ఎంత ప్రాముఖ్యమో అది నొక్కిచెబుతోంది, ఆ సంభాషణలో కేవలం ఒక్కరే మాట్లాడరు గానీ ఇద్దరూ మాట్లాడుకుంటారు.
తల్లిదండ్రులు తమ పిల్లల భావాలను తెలుసుకోవాలి, అలాగే పిల్లలు, తల్లిదండ్రులు చూపించే శ్రద్ధ తమకు ఎలా ఒక కాపుదలగా ఉండగలదో అర్థం చేసుకోవాలి. తమ తల్లిదండ్రులకు విధేయత చూపించమని బైబిలు పిల్లలకు ఉపదేశిస్తోంది; ఆ తర్వాత దానికిగల కారణాన్ని అది ఇలా వివరిస్తోంది: ‘నీకు మేలు కలుగును. అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవవుతావు.’ (ఎఫెసీయులు 6:1-3) లోబడి ఉండడంవల్ల కలిగే ప్రయోజనాలను బాగా అర్థంచేసుకున్న పిల్లలు విధేయతను చూపించడం సులభమని గుర్తిస్తారు.
యెహోవా మందపట్ల శ్రద్ధ కనబరచడం
యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధ క్రైస్తవ సంఘంలో కనబడుతుంది. సంఘానికి శిరస్సుగా, యేసుక్రీస్తు తన మందను శ్రద్ధగా చూసుకోమని పెద్దలకు నిర్దేశిస్తున్నాడు. (యోహాను 21:15-17) పైవిచారణకర్త అనే గ్రీకు పదానికి, “జాగ్రత్తగా గమనించండి” అని అర్థాన్నిచ్చే క్రియాపదంతో దగ్గర సంబంధముంది. దాన్ని ఎలా చేయాలో నొక్కిచెబుతూ, పేతురు పెద్దలకిలా ఉపదేశిస్తున్నాడు: “బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి.”—1 పేతురు 5:2, 3.
అవును, పెద్దలు చేయాల్సిన పని కాపరుల పనిలాగే ఉంటుంది. పెద్దలు ఆధ్యాత్మికంగా రోగగ్రస్థులైనవారిపట్ల శ్రద్ధ కనబరిచి, వారు తమ జీవితంలో నీతి ప్రమాణాలను కనబరచేలా వారిని సరిదిద్దాలి. సంఘ కార్యకలాపాలను సంస్థీకరించడం, కూటాల కోసం ఏర్పాట్లు చేయడం, సంఘంలో క్రమబద్ధతను కాపాడడంవంటి బాధ్యతలు పెద్దలవే.—పేతురు పైమాటలు, పెద్దలు సంఘంమీద “ప్రభువులుగా” వ్యవహరించే ఒక ప్రమాదం ఉందని మనల్ని హెచ్చరిస్తున్నాయి. ఆ ప్రమాదాల్లో ఒకటేమిటంటే, ఒక పెద్ద అనవసరమైన నియమాలను పెట్టడం. మందను కాపాడాల్సిన తన బాధ్యతను సరిగా నిర్వర్తించాలనే భావంతో ఒక పెద్ద అతిగా హద్దులు విధించవచ్చు. రాజ్యమందిరంలో ఇతరులను ఎలా పలకరించాలనే విషయంలో తూర్పు దేశంలో ఉన్న ఒక సంఘంలోని పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. సంఘంలో సమాధానానికి దోహదపడుతుందనే నమ్మకంతో వారు ఎవరు ముందు పలకరించాలి అనే విషయంలో నియమాలు పెట్టారు. ఆ పెద్దలకు సదుద్దేశమున్నా తన ప్రజలపట్ల శ్రద్ధ కనబరిచే యెహోవాను వారు అనుకరిస్తున్నారా? అపొస్తలుడైన పౌలు మానసిక దృక్పథం గమనార్హమైన రీతిలో ఆయన మాటల్లో ఇలా ప్రతిబింబిస్తోంది: “మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసము చేతనే మీరు నిలుకడగా ఉన్నారు.” (2 కొరింథీయులు 1:24) యెహోవా తన ప్రజలను నమ్ముతున్నాడు.
అంతేగాక, శ్రద్ధగల పెద్దలు లేఖనరహిత నియమాలను పెట్టకుండా ఉండడమేకాక, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడిచేయకుండా ఉండడం ద్వారా కూడా తమ నిజమైన శ్రద్ధను కనబరుస్తారు. వారు “పరునిగుట్టు బయటపెట్టకుము” అనే దైవిక హెచ్చరికను గుర్తుంచుకుంటారు.—సామెతలు 25:9.
అపొస్తలుడైన పౌలు అభిషిక్త క్రైస్తవుల సంఘాన్ని మానవ శరీరంతో పోల్చాడు: “శరీరములో వివాదములేక, ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు . . . శరీరమును అమర్చియున్నాడు.” (1 కొరింథీయులు 12:12, 24-26) “పరామర్శించు” అనే గ్రీకు పదానికి ‘ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ కనబరచడం’ అనే అక్షరార్థ భావం ఉంది. క్రైస్తవ సంఘంలోని సభ్యులు ఒకరిపట్ల ఒకరు ప్రగాఢమైన శ్రద్ధ కనబర్చేవారిగా ఉండాలి.—ఫిలిప్పీయులు 2:4.
నిజ క్రైస్తవులు ‘ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ కనబరుస్తున్నారని’ ఎలా చూపించవచ్చు? వారు తమ ప్రార్థనలద్వారా, అవసరంలో ఉన్నవారికి తగిన సహాయం చేయడం ద్వారా సంఘంలోని ఇతర సభ్యులపట్ల తమకు శ్రద్ధ ఉందని చూపించవచ్చు. ఇతరులు మంచి లక్షణాలను పెంపొందించుకునేందుకు అది సహాయం చేస్తుంది. అలాంటి ప్రేమపూర్వక శ్రద్ధ ద్వారా టాడాటాకా ఎలా సహాయాన్ని పొందాడో గమనించండి. ఆయన తన 17వ ఏట బాప్తిస్మం తీసుకున్నాడు, అప్పటికి తన కుటుంబంలో ఆయన ఒక్కడే యెహోవాను సేవిస్తున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “సంఘంలోని ఒక కుటుంబపువారు భోజనానికీ, పార్టీలకూ నన్ను తరచూ ఆహ్వానించేవారు. నేను స్కూలుకు వెళ్తున్నప్పుడు దాదాపు ప్రతీరోజు ఉదయం వాళ్ళింటికి వెళ్ళి, వారితో కలిసి బైబిలు వచనాన్ని చర్చించేవాణ్ణి. స్కూల్లో ఎదురయ్యే సమస్యలతో ఎలా వ్యవహరించాలో నాకు సలహాలిచ్చేవారు. వాటి విషయంలో మేము కలిసి ప్రార్థించేవాళ్ళం. ఇతరులకు ఇచ్చే స్ఫూర్తిని నేను ఆ కుటుంబం నుండే నేర్చుకున్నాను.” టాడాటాకా, యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవ చేయడంద్వారా తాను నేర్చుకున్నవాటిని ఇప్పుడు ఆచరణలో పెడుతున్నాడు.
అపొస్తలుడైన పౌలు ఇతరులపట్ల శ్రద్ధ కనబరుస్తున్నప్పుడు ఎదురయ్యే ఓ ప్రత్యేకమైన ప్రమాదం గురించి హెచ్చరించాడు. ఆయన ‘ఇంటింట తిరుగులాడుచు, ఆడరాని మాటలాడుచు, వదరుబోతులును పరులజోలికి పోయేవారిగా’ మారిన కొందరు స్త్రీల గురించి పేర్కొన్నాడు. (1 తిమోతి 5:13) మనం ఇతరులపట్ల శ్రద్ధ కనబరచడం మెచ్చుకోదగినదే అయినా, వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునేంత దూరం వెళ్ళకుండా ఉండేలా జాగ్రత్తపడాలి. ‘ఆడరాని మాటలు మాట్లాడడం’ అంటే విమర్శనాత్మకంగా మాట్లాడడం ఇతరులపట్ల అతిగా శ్రద్ధ కనబర్చడాన్ని వెల్లడిచేయవచ్చు.
క్రైస్తవులు తమ వ్యక్తిగత పనులను ఎలా చక్కబెట్టుకుంటారు, ఎలాంటి ఆహారాన్ని తినాలనుకుంటారు, ఎలాంటి ఉల్లాస కార్యకలాపాలను ఎంపికచేసుకుంటారు అనే విషయాల్లో వారికి భిన్నాభిప్రాయాలుండవచ్చని మనం గుర్తుంచుకోవాలి. బైబిల్లో సూచించబడిన సూత్రాల పరిధుల్లోనే తాము చేయాలనుకున్న వాటి విషయంలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రతీ ఒక్కరికీ ఉంది. రోములోని క్రైస్తవులకు పౌలు ఇలా ఆదేశించాడు: “మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము . . . సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము.” (రోమా 14:13, 19) మనకు సంఘంలోని ఇతరులపట్ల ఉన్న నిజమైన శ్రద్ధను, ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం ద్వారా కాదుగానీ, సహాయం చేయడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉండడం ద్వారానే కనబరచాలి. మనం ఈ విధంగా ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ కనబరచినప్పుడు, ఇటు కుటుంబంలోను, అటు సంఘంలోను ప్రేమ, ఐక్యత వెల్లివిరుస్తాయి.
[అధస్సూచి]
^ పేరా 9 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
[19వ పేజీలోని చిత్రం]
మెచ్చుకోలుతో, తదనుభూతితో మీ పిల్లల భావాలను తెలుసుకోండి