‘మంచి దేశములో’ ఒక ఏడాది
‘మంచి దేశములో’ ఒక ఏడాది
యెరూషలేముకు పశ్చిమానున్న తీర ప్రాంతంలో బైబిల్లో పేర్కొనబడిన గెజెరు నగరం ఉంది, 1908వ సంవత్సరంలో, ఆ నగరంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. సా.శ.పూ. పదవ శతాబ్దానికి చెందినదిగా భావించబడిన సున్నపురాయితో చేయబడిన ఒక చిన్న శిలాఫలకం లేక పలక అక్కడ దొరికింది. అది ప్రాచీన హీబ్రూ లిపిలో ఉంది, దానిలో సరళీకృత వ్యవసాయ సంవత్సరం లేక చక్రంతోపాటు ఆ ప్రాంతంలో జరిగే వివిధ వ్యవసాయ కార్యకలాపాలుగా భావించబడుతున్న అంశాలున్నాయి. ఆ పలక గెజెర్ క్యాలెండర్‌గా పేరుపొందింది.
ఆ పలకమీద అబీయా అనే సంతకం ఉంది. ఆ పలక ఒక పాఠశాల విద్యార్థి కావ్యరూపంలో రాసిన హోమ్‌వర్క్ అని చాలామంది భావిస్తారు, అయితే పురావస్తుశాస్త్రజ్ఞులందరూ దానితో ఏకీభవించరు. * ఆ కాలంలో జీవించిన ఆ అబ్బాయి దృక్కోణంలో మీరు వివిధ రుతువులను చూడాలనుకుంటున్నారా? అలా చూడడం కొన్ని బైబిలు సంఘటనలను గుర్తుకుతెచ్చుకునేందుకు మీకు సహాయం చేయవచ్చు.
రెండు నెలలు ఫలసంగ్రహం
ఈ ప్రాచీన క్యాలెండర్ రచయిత సాధారణ ఫలసంగ్రహ నెలతో తన సంవత్సరాన్ని ప్రారంభించాడు. ఈ క్యాలెండర్‌లో ఫలసంగ్రహ నెల మొదటిగా పేర్కొనబడినప్పటికీ అది వ్యవసాయ సంవత్సరంలోని ప్రధాన భాగంలో చివరి లేక ఆఖరి నెలగా ఇశ్రాయేలీయులు ఎందుకు పరిగణించేవారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఏతనీము నెల (ఆ తర్వాత తిష్రీ అని పిలవబడింది) మన ప్రస్తుత క్యాలెండర్‌లోని సెప్టెంబరు/అక్టోబరు నెలల్లో వస్తుంది. అప్పటికి కోతపని చాలావరకు పూర్తవుతుంది కాబట్టి ఈ నెలలో ప్రత్యేకంగా పండుగ వాతావరణం నెలకొనివుంటుంది, యౌవనస్థుడైన అబీయా దానిలో పాలుపంచుకొనివుండవచ్చు. తమ పొలాల్లో మంచి పంట పండినందుకు ఆనందంగా వారం రోజులపాటు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు వారు పర్ణశాలలను నిర్మించేవారు. తమ గృహాలుగా మారే పర్ణశాలను నిర్మించడంలో వాళ్ల నాన్నకు సహాయం చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఎంత ఉత్తేజాన్ని పొందివుంటాడో ఊహించండి!—ద్వితీయోపదేశకాండము 16:13-15.
ఆ సమయంలోనే ఒలీవచెట్ల కొమ్మల్ని కొట్టి వాటిపండ్లను అబీయా కుటుంబం ఏరుకోవడానికి అవి దాదాపు పక్వానికి ద్వితీయోపదేశకాండము 24:20) ఆ తర్వాత వారు ఏరిన ఒలీవపండ్ల నుండి నూనె తీయడానికి దగ్గర్లోని తిరుగటిరాయి ఉన్న స్థలానికి వాటిని తీసుకెళ్లివుండవచ్చు. లేక ఆ కుటుంబం కొంత నూనెను సులభమైన పద్ధతిలో తయారుచేసివుండవచ్చు, నలగగొట్టబడిన లేదా పగులగొట్టబడిన ఒలీవపండ్లను నీళ్లల్లో వేసి నీటి ఉపరితలంమీద తేలే నూనెను వారు సేకరించివుండవచ్చు. ఏదేమైనా, ఈ అమూల్యమైన నూనె కేవలం ఆహారంగా మాత్రమేకాక, దీపాలకు ఇంధనంగా, అబీయా వంటి పిల్లలు ఆడుతున్నప్పుడు తగిలే దెబ్బలకూ గాయాలకూ ఔషధంగా కూడా ఉపయోగించబడేది.
వస్తాయి, అబీయాకు అది ఎంతో కష్టమైన పనిగా అనిపించినా ఆ పనిని చేస్తున్నప్పుడు చూడడానికి ఆ బాలుడు ఎంతో ఇష్టపడివుండవచ్చు. (రెండు నెలలు విత్తనాలు విత్తడం
తొలకరి జల్లులు పడడం మొదలై, చల్లని ఆ చిరుజల్లులు తన శరీరాన్ని స్పృశించినప్పుడు అబీయా సంతోషించివుండవచ్చు. వాళ్ల నాన్న, దేశానికి ఆ వర్షం ఎంత ప్రాముఖ్యమో ఆయనకు చెప్పివుండవచ్చు. (ద్వితీయోపదేశకాండము 11:14) కొన్ని నెలలపాటు సూర్యుని ప్రతాపంవల్ల ఎండిపోయి గట్టిబడిన నేల ఈ వర్షానికి మెత్తబడి దున్నడానికి అనువుగా మారేది. ప్రాచీనకాలంలో నేలను దున్నే వ్యక్తి లోహపు మొన బిగించిన కొయ్య నాగలితో నైపుణ్యంగా దున్నివుండవచ్చు, ఆయన అలా దున్నడానికి ఒక పశువును ఉపయోగించేవాడు. ఆయన నేలలో వంకరటింకరగాలేని చాళ్లను దున్నాలనుకునేవాడు. నేల విలువైనది కాబట్టి ఇశ్రాయేలు వ్యవసాయదారులు ఏటవాలు ప్రాంతాలతోపాటు చిన్న స్థలాల్లో కూడా వ్యవసాయం చేసేవారు. అయితే ఆ ప్రాంతాల్లో వారు వ్యవసాయం చేయడానికి చేతి పనిముట్లను ఉపయోగించాల్సి వచ్చేది.
మెత్తబడిన నేలను ఒకసారి దున్నిన తర్వాత గోధుమ, యవలను విత్తవచ్చు. ఆసక్తికరంగా, తర్వాతి రెండు నెలల్లో విత్తనాలు విత్తబడేవని గెజెరు క్యాలెండరు పేర్కొంటోంది. విత్తనాలను
విత్తే వ్యక్తి విత్తనాలను తన బట్టల మడతలో పెట్టుకొని వాటిని చేత్తో పొలంలో జల్లేవాడు.రెండు నెలలు కడవరి పంట నాటడం
‘మంచి దేశములో’ ఎల్లప్పుడూ పంట పండేది. (ద్వితీయోపదేశకాండము 3:25) డిసెంబరు నెలలో వర్షపాతం అధికంగా ఉండేది కాబట్టి, దేశం సస్యశ్యామలంగా కనిపించేది. ఆ నెలలో బటానీలు, శనగల వంటి కాయధాన్యాలతోపాటు ఇతర కూరగాయలను కూడా పండించేవారు. (ఆమోసు 7:1, 2) వాటిని “వసంతరుతువులోని పచ్చిక బయళ్లు” అని అబీయా ఆ పలకమీద పేర్కొన్నాడు, లేక మరో అనువాదం ప్రకారం అది “కడవరి పంట,” ఆ సమయంలో అనేక కూరగాయలతో రుచికరమైన వంటలను వండుకునేవారు.
కొంతమేరకు శీతలంగావున్న వాతావరణం వేడెక్కుతున్నప్పుడు, వసంతరుతువు ఆగమనాన్ని చాటిచెప్పే బాదంచెట్లకు తెలుపు, గులాబి రంగుల్లో పూలు పూసేవి. వాతావరణం కొద్దిగా వేడెక్కినప్పుడు, కొన్నిసార్లు జనవరి నెలలోనే అవి పూయడం ఆరంభించేవి.—యిర్మీయా 1:11, 12.
ఒక నెల జనుపకట్టెను కోయడం
అబీయా ఆ తర్వాత జనుపకట్టె గురించి ప్రస్తావించాడు. అది విన్న తర్వాత అబీయా కాలానికి ఎన్నో శతాబ్దాల క్రితం యూదయ కొండలకు తూర్పున చోటుచేసుకున్న ఒక సంఘటనను బహుశా మీరు గుర్తుచేసుకోవచ్చు. యెరికో నగరంలో, రాహాబు ఇద్దరు వేగులవారిని తన మిద్దమీద ఎండబెట్టిన “రాశివేసియున్న జనుపకట్టెలో” దాచింది. (యెహోషువ 2:6) ఇశ్రాయేలీయుల జీవితాల్లో జనుపకట్టె ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది. జనుపకట్టె నారలను వేరు చేయాలంటే ముందుగా దానిమొక్క కుళ్లాలి. దానిమీద మంచు కురిస్తే అది నిదానంగా కుళ్లుతుంది లేదా దాన్ని చెరువులో లేక వాగులో నానబెట్టినప్పుడు అది మరింత త్వరగా కుళ్లుతుంది. దాన్నుండి నారలు విడిపోయిన తర్వాత వాటిని నారబట్టలను తయారు చేయడానికి ఉపయోగించేవారు, ఆ నారబట్టతో తెరచాపలను, గుడారాలను, బట్టలను తయారుచేసేవారు. దీపపు వత్తులను తయారుచేయడానికి కూడా జనుపకట్టెను ఉపయోగించేవారు.
గెజెరు ప్రాంతంలో నీటి ఎద్దడి కొంతమేరకు ఉన్నందువల్ల అక్కడ జనుపకట్టె పెంచబడే అవకాశమే లేదని కొందరు భావిస్తున్నారు. జనుపకట్టె సంవత్సరంలోని తర్వాతి నెలల్లోనే సాగుచేయబడేదని మరికొందరు వాదిస్తున్నారు. అందుకే కొందరు, గెజెరు క్యాలెండర్‌లో ఉన్న “జనుపకట్టె” అనే పదం ఎండు “గడ్డి”కి పర్యాయపదమని భావిస్తున్నారు.
ఒక నెల యవల కోత
ప్రతీ ఏడాది జనుపకట్టెను కోసిన నెల తర్వాత పచ్చని యవల వెన్నులను అబీయా గమనించేవాడు, ఆ అబ్బాయి తన క్యాలెండరులో ఆ పంట గురించి తర్వాత పేర్కొన్నాడు. హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఆబీబు నెలలో ఆ పంట పండుతుంది. దానికి “పచ్చని వెన్నులు” అని భావం, ఇది వెన్నులు పక్వానికొచ్చినా ఇంకా మెత్తగా ఉండే దశను సూచిస్తుండవచ్చు. యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను.” (ద్వితీయోపదేశకాండము 16:1) ఆబీబు నెల (ఆ తర్వాత నీసాను అని పిలవబడింది) నేటి మార్చి, ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఆ కాలంలో యవలు కోతకు వచ్చే కాలాన్నిబట్టి ఈ నెల ఆరంభం నిర్ధారించబడివుండవచ్చు. ఇప్పటికీ కైరైట్ యూదులు క్రొత్త సంవత్సరాన్ని ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయించడానికి యవలు కోతకు వచ్చే కాలాన్ని గమనిస్తారు. ఏదేమైనా, ఆబీబు నెలలోని 16వ రోజున యవల మొదటి పంటను యెహోవా ముందు అల్లాడించాలి.—లేవీయకాండము 23:10, 11.
అనేకమంది ఇశ్రాయేలీయులు తమ అనుదిన జీవితాల్లో యవలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు. అది గోధుమకన్నా చౌకగా లభించేది కాబట్టి, ముఖ్యంగా పేదవారు రొట్టెను తయారుచేసుకోవడానికి యవలను ఎక్కువగా ఉపయోగించేవారు.—యెహెజ్కేలు 4:12.
ఒక నెల కోత కోయడం, కొలవడం
మీరు అబీయా కాలం గురించి ఊహిస్తే, ఒక రోజు పెందలాడే దట్టమైన మబ్బులు చెదిరిపోవడాన్ని ఆ బాలుడు గమనించివుండచ్చని మీరు మనసులో ఊహించుకోవచ్చు, ఇక కొంతకాలంవరకు వర్షం కురవదు. మంచి దేశంలోని మొక్కలు ఇప్పుడు మంచుమీద ఆధారపడుతున్నాయి. (ఆదికాండము 27:28; జెకర్యా 8:12) సంవత్సరంలోని ఎక్కువగా ఎండకాసే నెలల్లో కోత కోయబడే అనేక పంటలకు పెంతెకొస్తు పండుగవరకు కాస్త సమతుల్యంగా వీచే గాలి అవసరమని ఇశ్రాయేలీయుడైన వ్యవసాయదారునికి తెలుసు. ఉత్తర దిశనుండి వీచే శీతలమైన, తేమగల గాలులు, పెరుగుతున్న తృణధాన్యాలకు మేలు చేకూర్చివుండవచ్చు గానీ అవి పూతపూసిన పండ్ల చెట్లకు హానికరంగా ఉండేవి. దక్షిణ దిశనుండి వీచే వేడిగా ఉండే పొడి గాలులు పండ్ల చెట్ల పూలు వికసించి పుప్పొడిని వెదజల్లేందుకు దోహదపడేవి.—సామెతలు 25:23; పరమగీతము 4:16.
వాతావరణ పరిస్థితులకు కర్తయైన యెహోవా చక్కగా క్రమబద్ధం చేయబడ్డ ఆవరణ వ్యవస్థను సృష్టించాడు. అబీయా కాలంలో, ఇశ్రాయేలు నిజంగా “గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లును గల దేశము, ఒలీవనూనెయు తేనెయు గల దేశము.” (ద్వితీయోపదేశకాండము 8:8) అబీయా వాళ్ల తాతయ్య, జ్ఞానియైన సొలొమోను రాజు పరిపాలనా కాలంలో ఉన్న అసాధారణ సమృద్ధి గురించి ఆ అబ్బాయికి చెప్పివుండవచ్చు, అది యెహోవా ఆశీర్వాదానికి స్పష్టమైన నిదర్శనం.—1 రాజులు 4:20.
కోతకాలం గురించి పేర్కొన్న తర్వాత ఆ క్యాలెండర్‌లో “కొలవడం” అనే అర్థమున్న పదముందని కొందరు భావిస్తారు. అది పొలాల యజమానులకు, పనివారికి లభించే పంటలోని భాగాలను కొలవడాన్ని లేక పన్ను చెల్లించడానికి ఇచ్చే భాగాలను కొలవడాన్ని కూడా సూచిస్తుండవచ్చు. అయితే, ఆ హీబ్రూ పదానికి “విందు చేసుకోవడం” అనే అర్థముందని, అది సీవాను నెలలో (మే/జూన్) ఆచరించే వారముల పండుగను పరోక్షంగా సూచిస్తుందని ఇతర విద్వాంసులు భావిస్తున్నారు.—నిర్గమకాండము 34:22.
రెండు నెలలు ఆకులు త్రుంచడం
అబీయా ఆ తర్వాత దాదాపు రెండు నెలల వరకు కొనసాగే ద్రాక్షచెట్ల సాగు గురించి రాశాడు. ద్రాక్షపండ్లమీద ఎండ పడేటట్లు ఆ చెట్లకు సమృద్ధిగా ఉండే ఆకులను తెంపడంలో ఆ అబ్బాయి వాళ్ల నాన్నకు సహాయం చేసివుండవచ్చు. (యెషయా 18:5) దాని తర్వాత ద్రాక్షలను కోసే సమయం వస్తుంది, ఆ కాలంలోని యౌవనస్థులు ఆ సమయాన్ని ఎంతో ఇష్టపడేవారు. మొట్టమొదటిగా పండిన ద్రాక్షపండ్లు ఎంత రుచికరంగా ఉండివుంటాయో కదా! వాగ్దాన దేశానికి మోషే పంపించిన 12 మంది వేగులవారి గురించి అబీయా వినివుండవచ్చు. ఆ దేశం ఎంత బాగుందో చూడడానికి వారు ద్రాక్షల ప్రథమ పక్వకాలంలో వెళ్లారు. ఆ సందర్భంలో ఒక ద్రాక్ష గెల ఎంత పెద్దగా ఉందంటే దానిని ఇద్దరు మోసుకొని రావల్సివచ్చింది!—సంఖ్యాకాండము 13:20, 23.
ఒక నెల వేసవి పండ్ల సాగు
అబీయా క్యాలెండర్‌లో ఆఖరిగా వేసవి పండ్ల గురించి ప్రస్తావించబడింది. ప్రాచీన మధ్య ప్రాచ్యలో వేసవికాలం వ్యవసాయ సంవత్సరంలో భాగంగా ఉండేది, ఆ కాలంలో పండ్లను సాగు చేసేవారు. అబీయా కాలం తర్వాత యెహోవా ‘తన జనులైన ఇశ్రాయేలీయుల అంతం సమీపించింది’ అని వివరించడానికి హీబ్రూ భాషలో “వేసవికాలపు పండ్లు,” “అంతము” అనే పదాలను నైపుణ్యంగా ప్రయోగిస్తూ “వేసవికాలపు పండ్లగంప” అనే వాక్యాన్ని ఉపయోగించాడు. (ఆమోసు 8:2) ఆ వాక్యం, తమ అంతం సమీపించిందనీ, త్వరలో తాము యెహోవా తీర్పును ఎదుర్కోబోతున్నామనీ అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులకు గుర్తుచేసివుండవచ్చు. అబీయా ప్రస్తావించిన వేసవికాలపు పండ్లలో అంజూరపు పండ్లు కూడా ఉండివుండవచ్చు. వేసవి అంజూరపు పండ్ల నుండి తినుబండారాలైన అడలను తయారుచేయవచ్చు లేక వాటిని కురుపులపై ఉపయోగించే ఔషధ మిశ్రమంలో ఉపయోగించవచ్చు.—2 రాజులు 20:7.
గెజెర్ క్యాలెండర్ మరియు మీరు
యౌవనస్థుడైన అబీయా ఆ దేశపు వ్యవసాయ పనుల్లో స్వయంగా పాల్గొనివుండవచ్చు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు వ్యవసాయ పనులను ఎక్కువగా చేసేవారు. మీకు వ్యవసాయ పనులతో అంతగా పరిచయం లేకపోయినా, మీరు బైబిలు చదువుతున్నప్పుడు దానిలోని అంశాలు కళ్లకు కట్టినట్లు ఉండేలా చేసి చదువుతున్నవాటిని సులభంగా అర్థం చేసుకునేందుకు, బైబిలు పఠనాన్ని అర్థవంతంగా చేసుకునేందుకు గెజెర్‌లో దొరికిన ఈ పలకలోని విషయాలు సహాయం చేస్తాయి.
[అధస్సూచి]
^ పేరా 3 గెజెర్ క్యాలెండర్‌లో పేర్కొనబడిన నెలలకూ, బైబిల్లో సాధారణంగా అనుసరించబడే నెలలకూ మధ్య ఉన్న సారూప్యత గురించి ఏకాభిప్రాయం లేదు. అంతేకాక వాగ్దాన దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొన్ని వ్యవసాయ కార్యకలాపాలు కొద్దిగా వేర్వేరు సమయాల్లో జరిగే అవకాశం ఉంది.
[11వ పేజీలోని బాక్సు/చిత్రం]
గెజెర్ క్యాలెండర్‌ను ఇలా అనువదించవచ్చు:
“ద్రాక్షపంటల, ఒలీవ పంటల నెలలు;
విత్తనాలు విత్తే నెలలు;
వసంతరుతువులోని పచ్చిక బయళ్ల నెలలు;
జనుపకట్టె కోత నెల;
యవల కోత నెల;
గోధుమ కోత, కొలిచే నెల;
కొమ్మలను కత్తిరించే నెల;
వేసవి పండ్ల నెల.”
[సంతకం:] అబీయా *
[అధస్సూచి]
^ పేరా 41 జాన్ సి. ఎల్. గిబ్సన్ రచించిన టెక్స్‌ట్‌బుక్ ఆఫ్ సిరియన్ సెమిటిక్ ఇన్స్‌క్రిప్షన్స్, 1వ సంపుటి ఆధారంగా.
[చిత్రసౌజన్యం]
Archaeological Museum of Istanbul
[9వ పేజీలోని చార్టు/చిత్రాలు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
నీసాను (ఆబీబు)
మార్చి
యియార్ (జీప్)
ఏప్రిల్
సీవాను
మే
తమ్మూజు
జూన్
అబ్
జూలై
ఏలూలు
ఆగస్టు
తిష్రీ (ఏతనీము)
సెప్టెంబరు
హెష్‌వాన్ (బూలు)
అక్టోబరు
కిస్లేవు
నవంబరు
టెబేతు
డిసెంబరు
శెబాటు
జనవరి
అదారు
ఫిబ్రవరి
వీయాదారు
మార్చి
[చిత్రసౌజన్యం]
వ్యవసాయదారుడు: Garo Nalbandian
[8వ పేజీలోని చిత్రం]
గెజెర్‌లో త్రవ్వకాలు జరిగిన చోటు
[చిత్రసౌజన్యం]
© 2003 BiblePlaces.com
[10వ పేజీలోని చిత్రాలు]
బాదం చెట్టు
[10వ పేజీలోని చిత్రం]
జనుపకట్టె మొక్క
[చిత్రసౌజన్యం]
Dr. David Darom
[10వ పేజీలోని చిత్రం]
యవలు
[చిత్రసౌజన్యం]
U.S. Department of Agriculture