మీ విధేయతను యెహోవా అమూల్యమైనదిగా పరిగణిస్తాడు
మీ విధేయతను యెహోవా అమూల్యమైనదిగా పరిగణిస్తాడు
“నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము.”—సామెతలు 27:11.
నే డు లోకంలో స్వేచ్ఛాపూరితమైన, అవిధేయతా స్వభావం వ్యాపించివుంది. ఇలా ఎందుకుందో వివరిస్తూ అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైనవారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.” (ఎఫెసీయులు 2:1, 2) అవును, “వాయుమండల సంబంధమైన అధిపతి” అయిన అపవాదియగు సాతాను ఈ లోకమంతటిని అవిధేయతా స్వభావంతో నింపేశాడని మీరనవచ్చు. అతడు మొదటి శతాబ్దంలో అలా చేశాడు, మొదటి ప్రపంచయుద్ధ కాలంలో పరలోకం నుండి పడద్రోయబడినప్పటినుండి దానిని మరింత తీవ్రతరం చేశాడు.—ప్రకటన 12:9.
2 అయితే, యెహోవా మన సృష్టికర్త, మన జీవ సంరక్షకుడు, ప్రేమగల సర్వాధిపతి, మన విమోచనకర్త కాబట్టి ఆయన మన హృదయపూర్వక విధేయత పొందేందుకు అర్హుడనే విషయం క్రైస్తవులుగా మనకు తెలుసు. (కీర్తన 148:5, 6; అపొస్తలుల కార్యములు 4:24; కొలొస్సయులు 1:13; ప్రకటన 4:10-11) మోషే కాలంలోని ఇశ్రాయేలీయులకు యెహోవా వారి జీవదాతని, వారి విమోచకుడని తెలుసు. కాబట్టి, మోషే వారికిలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవలెను.” (ద్వితీయోపదేశకాండము 5:33) అవును, వారి విధేయతను పొందేందుకు యెహోవా అర్హుడు. కానీ వారు అనతికాలంలోనే తమ సర్వాధిపతికి అవిధేయులయ్యారు.
3 విశ్వ సృష్టికర్తకు మనం లోబడడం ఎంత ప్రాముఖ్యం? దేవుడు ఒకసారి రాజైన సౌలుతో చెప్పమని సమూయేలు ప్రవక్తకు ఇలా చెప్పాడు: “బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుట . . . శ్రేష్ఠము.” (1 సమూయేలు 15:22, 23) ఎందుకు వినాలి?
విధేయత ఎలా ‘బలులకన్నా శ్రేష్ఠం’?
4 యెహోవా సృష్టికర్త కాబట్టి వస్తుపరంగా మనకున్నవన్నీ నిజానికి ఆయనకు చెందినవే. కాబట్టి, మనమాయనకు ఇవ్వగలిగింది ఏమైనావుందా? ఉంది, ఆయనకు మనం అత్యంత విలువైనదే ఇవ్వగలం. ఏమిటది? అదేమిటో ఈ క్రింది ఉపదేశంలో మనం చూడవచ్చు: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” (సామెతలు 27:11) మనం దేవునికి విధేయతను చూపించవచ్చు. మానవులు పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు వారు దేవునిపట్ల విశ్వసనీయంగా ఉండరని అపవాదియగు సాతాను దురుద్దేశపూరితంగా ఆరోపించాడు కాబట్టి, మన పరిస్థితులు, నేపథ్యాలు విభిన్నంగావున్నా, మనలో ప్రతీ ఒక్కరం దేవునికి విధేయులుగా ఉండడం ద్వారా సాతాను చేసిన ఆరోపణకు ప్రత్యుత్తరమివ్వవచ్చు. అదెంతటి ఆధిక్యతో కదా!
5 మనం తీసుకునే నిర్ణయాలపట్ల దేవుడు ఆసక్తి కనబరుస్తాడు. మనం అవిధేయులమైతే అది ఆయనను ప్రభావితం చేస్తుంది. ఎలా? ఎవరైనా అలాంటి అవివేక మార్గాన్ని చేపట్టడం చూసినప్పుడు ఆయనకు బాధ లేదా సంతాపం కలిగిస్తుంది. (కీర్తన 78:40, 41) ఉదాహరణకు, మధుమేహ వ్యాధిగ్రస్తుడు తన మేలుకోసం సూచించబడిన ఆరోగ్యకరమైన ఆహారం తినేబదులు తనకు హాని కలిగించే ఆహారాన్నే తింటున్నాడని అనుకుందాం. ఆయన బాగోగులు చూస్తున్న వైద్యునికి ఏమనిపిస్తుంది? జీవం కోసం తానిచ్చిన సూచనల్ని నిర్లక్ష్యం చేయడంవల్ల కలిగే పర్యవసానాలు యెహోవాకు తెలుసు కాబట్టి, మానవులు అవిధేయులవడాన్ని చూసినప్పుడు ఆయనకు సంతాపం కలుగుతుందని మనం గ్రహించవచ్చు.
6 వ్యక్తిగతంగా విధేయతను చూపించేందుకు మనకేది సహాయం చేస్తుంది? మనలో ప్రతీ ఒక్కరం రాజైన సొలొమోనులాగే “వివేకముగల [‘విధేయతగల,’ NW] హృదయము” దయచేయమని దేవుణ్ణి అడగడం సముచితమే. తనతోటి ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చడానికి ‘మంచిచెడ్డలు వివేచించేలా’ అలాంటి హృదయం దయచేయమని ఆయన అడిగాడు. (1 రాజులు 3:9) అవిధేయతా స్వభావం వ్యాపించివున్న లోకంలో మంచిచెడ్డలను వివేచించాలంటే మనకు ‘విధేయతగల హృదయం’ అవసరం. మనం ‘విధేయతగల హృదయాన్ని’ పెంపొందించుకోగలిగేలా దేవుడు మనకు తన వాక్యాన్ని, బైబిలు అధ్యయన ఉపకరణాల్ని, క్రైస్తవ కూటాల్ని, శ్రద్ధగల సంఘపెద్దల్ని ఇచ్చాడు. అలాంటి ప్రేమపూర్వక ఏర్పాట్లను మనం సద్వినియోగం చేసుకుంటున్నామా?
7 దీనికి సంబంధించి, జంతుబలులకన్నా విధేయత మరింత ప్రాముఖ్యమని తన ప్రాచీనకాల ప్రజలకు యెహోవా గతంలో వెల్లడిచేశాడని గుర్తుచేసుకోండి. (సామెతలు 21:3, 27; హోషేయ 6:6; మత్తయి 12:7) అలాంటి బలులు అర్పించమని తన ప్రజలకు యెహోవా ఆజ్ఞాపించాడు కదా, అలాంటప్పుడు ఆయనెందుకు అలా అన్నాడు? బలి అర్పించే వ్యక్తి ఏ ఉద్దేశంతో దానిని అర్పిస్తున్నాడు? దేవుణ్ణి సంతోషపెట్టేందుకే ఆయన బలి అర్పిస్తున్నాడా? లేక ఆ వ్యక్తి కేవలం ఆచారబద్ధంగా దానిని అర్పిస్తున్నాడా? దేవుణ్ణి సంతోషపర్చాలని నిజంగా కోరుకునే ఆరాధకుడు, దేవుని ఆజ్ఞలన్నింటికీ విధేయత కనబర్చేందుకు శ్రద్ధ చూపిస్తాడు. దేవునికి జంతు బలులు అక్కర్లేదు, అయితే మనమాయనకు అర్పించగలవాటిలో విధేయత అత్యంత విలువైనది.
హెచ్చరికా ఉదాహరణ
8 రాజైన సౌలును గురించిన బైబిలు వృత్తాంతం విధేయత అత్యంత ప్రాముఖ్యమనే విషయాన్ని నొక్కిచెబుతోంది. సౌలు తన పరిపాలనను, వినయస్థునిగా, ‘తన దృష్టికి తానే అల్పునిగావున్న’ నమ్రతగల పాలకునిగా ప్రారంభించాడు. కానీ ఆ తర్వాత, అహంకారం, అబద్ధ తర్కం ఆయన నిర్ణయాలను నిర్దేశించడం ఆరంభించాయి. (1 సమూయేలు 10:21, 22; 15:17) ఒకసారి సౌలు యుద్ధంలో ఫిలిష్తీయులను ఎదుర్కోవలసి వచ్చింది. తానొచ్చి యెహోవాకు బలులు అర్పించి అదనపు నిర్దేశమిచ్చేవరకు వేచివుండమని రాజుతో సమూయేలు చెప్పాడు. అయితే సమూయేలు వస్తాడని ఎదురుచూసినంత త్వరగా ఆయన రాలేదు, దానితో ప్రజలు అక్కడనుండి చెదిరిపోవడం ఆరంభించారు. అదిచూసి సౌలు “దహనబలి అర్పిం[చాడు].” అది యెహోవాను నొప్పించింది. చివరకు సమూయేలు వచ్చినప్పుడు, ఆయన రాక ఆలస్యమవడంతో యెహోవాను శాంతిపర్చేందుకు తానే ‘సాహసించి’ దహనబలిని అర్పించానని రాజు తన అవిధేయతకు సాకు చెప్పాడు. సమూయేలు వచ్చి ఆ బలి అర్పించేవరకు వేచివుండాలని తానుపొందిన నిర్దేశానికి విధేయుడవడంకన్నా బలి అర్పించడమే రాజైన సౌలుకు మరింత ప్రాముఖ్యమైంది. సమూయేలు ఆయనకిలా చెప్పాడు: “నీ దేవుడైన యెహోవా నీ కిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి.” యెహోవాకు అవిధేయత చూపించడంవల్ల సౌలు తన రాజరికాన్ని పోగొట్టుకున్నాడు.—1 సమూయేలు 10:8; 13:5-13.
9 ఈ అనుభవాన్నుండి ఆ రాజు పాఠం నేర్చుకున్నాడా? లేదు! ఆ తర్వాత, యెహోవా ఇశ్రాయేలును ఎలాంటి కారణం లేకుండా అంతకుముందు ముట్టడించిన 1 సమూయేలు 15:1-15.
అమాలేకీయుల జనాంగాన్ని నిర్మూలించమని సౌలుకు ఆజ్ఞాపించాడు. వారి పశువులను కూడా ఆయన విడిచిపెట్టకూడదు. ‘అమాలేకీయులను హవీలానుండి శూరువరకు తరిమి హతము చేయుటలో’ ఆయన యెహోవాకు విధేయత చూపించాడు. తనను కలుసుకునేందుకు సమూయేలు వచ్చినప్పుడు రాజైన సౌలు విజయోల్లాసంతో ఇలా అన్నాడు: “యెహోవావలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని.” అయితే వారు పొందిన స్పష్టమైన ఆదేశాలకు భిన్నంగా సౌలు, ఆయన మనుష్యులు రాజైన అగగును, “గొఱ్ఱెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొఱ్ఱెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము” చేయలేదు. రాజైన సౌలు తన అవిధేయతను సమర్థించుకుంటూ ఇలా అన్నాడు: “నీ దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకు జనులు గొఱ్ఱెలలోను ఎడ్లలోను మంచివాటిని ఉండనిచ్చిరి.”—10 అప్పుడు సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు: “తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.” (1 సమూయేలు 15:22) ఆ పశువులు నిర్మూలించబడాలని యెహోవా నిర్ణయించాడు కాబట్టి, అవి బలియర్పణకు అంగీకృతం కావు.
అన్ని విషయాల్లో విధేయత చూపించండి
11 తన విశ్వసనీయ సేవకులు హింసవున్నా స్థిరంగా ఉండడాన్ని, అనేకమంది ఉదాసీనత కనబరుస్తున్నా రాజ్యం గురించి ప్రకటించడాన్ని, జీవనోపాధి ఒత్తిడిని భరిస్తూకూడా క్రైస్తవ కూటాలకు హాజరవడాన్ని చూసినప్పుడు యెహోవా ఎంత సంతోషిస్తాడో కదా! మన ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి ప్రాముఖ్యమైన అంశాల్లో విధేయత చూపించడం ఆయన హృదయాన్ని సంతోషింపజేస్తుంది. మనం ప్రేమతో యెహోవాను ఆరాధించేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన వాటిని విలువైనవిగా పరిగణిస్తాడు. మన కృషిని మానవులు గమనించకపోవచ్చు, కానీ మన హృదయపూర్వక అర్పణలను దేవుడు గమనిస్తూ వాటిని గుర్తుంచుకుంటాడు.—మత్తయి 6:4.
12 అయితే మన దేవుణ్ణి సంపూర్ణంగా సంతోషపర్చేందుకు మనం మన జీవితంలోని అన్ని రంగాల్లో విధేయత చూపించాలి. మన జీవితపు ఇతర రంగాల్లో దేవుని ఆరాధిస్తున్నంతవరకు ఆయన కట్టడల విషయంలో కొంత స్వేచ్ఛ తీసుకోవచ్చని ఆలోచిస్తూ ఎన్నడూ మనల్నిమనం మోసగించుకోకూడదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి లాంఛనప్రాయమైన ఆరాధనలో యాంత్రికంగా పాల్గొంటూవుంటే, తాను దుర్నీతికి లేదా ఇతర ఘోరమైన అపరాధానికి గలతీయులు 6:7, 8.
పాల్పడినా శిక్ష తప్పించుకోవచ్చని ఆలోచిస్తూ తననుతాను మోసంచేసుకోవచ్చు. అదెంత తప్పో కదా!—13 కాబట్టి, మనల్నిమనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘వ్యక్తిగత విషయాల్లా కనిపించిన వాటితోసహా, నేను నా దైనందిన కార్యకలాపాల్లో యెహోవాకు విధేయత చూపిస్తున్నానా?’ యేసు ఇలా అన్నాడు: “మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.” (లూకా 16:10) ఇతరులు మనల్ని చూడనప్పుడు మన ‘ఇంట్లో’ కూడా మనం ‘యథార్థ హృదయంతో నడుచుకుంటున్నామా’? (కీర్తన 101:2) అవును, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మన యథార్థత పరీక్షించబడవచ్చు. గృహోపకరణాల్లో కంప్యూటర్లు సర్వసాధారణమైన చాలాదేశాల్లో, సులభంగా అశ్లీల దృశ్యాలను చూడవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక వ్యక్తి దుర్నీతికర వినోదాన్ని చూపించే స్థలాలకు వెళ్లకుండా అలాంటి దృశ్యాలను చూడడం సాధ్యమయ్యేది కాదు. “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” అని యేసు చెప్పిన మాటలను మనం విధేయతాపూర్వకంగా లక్ష్యపెడతామా? మనం దుర్నీతికరమైన చిత్రాలను చూడడాన్ని కూడా నిరాకరిస్తామా? (మత్తయి 5:28; యోబు 31:1, 9, 10; కీర్తన 119:37; సామెతలు 6:24, 25; ఎఫెసీయులు 5:3-5) హింసాపూరిత లేదా బలాత్కారం నిండిన టీవీ కార్యక్రమాల విషయమేమిటి? దేవునిలాగే మనం ‘బలాత్కారాసక్తులను అసహ్యించుకుంటున్నామా’? (కీర్తన 11:5) లేదా ఏకాంతంలో అమితంగా మద్యపానం సేవించే విషయమేమిటి? బైబిలు త్రాగుబోతుతనాన్ని ఖండించడమే కాక, క్రైస్తవులు ‘మద్యపానాసక్తులై’ ఉండకూడదని కూడా హెచ్చరిస్తోంది.—తీతు 2:3; లూకా 21:34, 35; 1 తిమోతి 3:2.
14 మనం జాగ్రత్తగా ఉండవలసిన మరో రంగం, డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు. ఉదాహరణకు, మోసానికి దగ్గరి సంబంధమున్న చిటికెలో ధనవంతులయ్యే పథకాల్లో మనం పాల్గొంటామా? పన్నులు ఎగవేసేందుకు చట్టవిరుద్ధమైన మార్గాలు చేపట్టేందుకు మనం శోధించబడతామా? లేక ‘ఎవనికి పన్నో వానికి పన్ను చెల్లిస్తూ అందరికి వారివారి రుణములు తీర్చుడి’ అనే ఆజ్ఞకు మనం జాగ్రత్తగా లోబడతామా?—రోమీయులు 13:7.
ప్రేమనుండి చిగురించే విధేయత
15 దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం ఆశీర్వాదాలు తెస్తుంది. ఉదాహరణకు, పొగాకును విసర్జించడం ద్వారా, నైతిక జీవనం జీవించడం ద్వారా, రక్తానికున్న పవిత్రతను గౌరవించడం ద్వారా మనం కొన్నిరకాల వ్యాధుల బారినపడకుండా ఉండవచ్చు. అంతేకాక, జీవితపు ఇతర రంగాల్లో బైబిలు సత్యానికి అనుగుణంగా జీవించడం ద్వారా మనం ఆర్థికంగా, సామాజికంగా లేదా కుటుంబంగా ప్రయోజనం పొందవచ్చు. (యెషయా 48:17) అలాంటి ఏ భౌతిక ప్రయోజనాలనైనా దేవుని నియమాల ఆచరణీయతను నిరూపించే ఆశీర్వాదాలుగానే దృష్టించవచ్చు. అయినప్పటికీ, మనం యెహోవాకు విధేయత చూపించడానికి ముఖ్య కారణం మనమాయనను ప్రేమించడమే. మనం స్వార్థపూరిత కారణాలనుబట్టి దేవుణ్ణి సేవించం. (యోబు 1:9-11; 2:4, 5) మనం కోరుకున్నవారికి విధేయత చూపించడాన్ని ఎన్నుకునే స్వేచ్ఛను దేవుడు మనకిచ్చాడు. మనం యెహోవాను సంతోషపెట్టాలని, సరైనది చేసేందుకు ప్రయత్నించాలని మనం కోరుకుంటాం కాబట్టే మనమాయనకు విధేయత చూపించేందుకు ఎన్నుకుంటాం.—రోమీయులు 6:16, 17; 1 యోహాను 5:3.
16 యెహోవాపట్ల హృదయపూర్వక ప్రేమనుబట్టి ఆయనకు విధేయత చూపించడంలో యేసు పరిపూర్ణ మాదిరివుంచాడు. (యోహాను 8:28, 29) యేసు భూమ్మీద ఉన్నప్పుడు “తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొ[న్నాడు].” (హెబ్రీయులు 5:8, 9) ఎలా? యేసు, “మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొ[న్నాడు].” (ఫిలిప్పీయులు 2:7, 8) యేసు అప్పటికే పరలోకంలో విధేయునిగా ఉన్నప్పటికీ, భూమ్మీద ఆయన విధేయత మరింతగా పరీక్షించబడింది. కాబట్టి యేసు తన ఆధ్యాత్మిక సహోదరుల కోసం, అలాగే విశ్వసించే మానవుల్లోని ఇతరుల కోసం ప్రధానయాజకునిగా సేవచేసేందుకు అన్నివిధాలా అర్హుడని మనం నమ్మవచ్చు.—హెబ్రీయులు 4:15; 1 యోహాను 2:1, 2.
17 మరి మన విషయమేమిటి? దేవుని చిత్తానికి విధేయత చూపించడానికి ప్రాధాన్యతనివ్వడంలో మనం యేసును అనుకరించవచ్చు. (1 పేతురు 2:21) యెహోవా ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించేందుకు ఒత్తిడి చేయబడిన లేదా శోధించబడిన సమయాల్లో కూడా ఆయన ఆజ్ఞాపించినట్లు చేసేందుకు దేవునిపట్ల మనకున్న ప్రేమ మనల్ని పురికొల్పినప్పుడు మనం సంతృప్తిని చవిచూడవచ్చు. (రోమీయులు 7:18-20) దీనిలో, సత్యారాధనలో సారథ్యం వహిస్తున్నవారు అపరిపూర్ణులైనా, వారిచ్చే నిర్దేశాలకు విధేయత చూపించేందుకు మనం ఇష్టపడడం కూడా ఇమిడివుంది. (హెబ్రీయులు 13:17) మన ఏకాంత జీవితంలో దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం యెహోవా దృష్టిలో విలువైనదిగా ఉంటుంది.
18 నేడు మనం యెహోవాకు విధేయత చూపించడంలో మన యథార్థతను కాపాడుకునేందుకు హింసను సహించడం ఇమిడివుండవచ్చు. (అపొస్తలుల కార్యములు 5:29) అంతేకాక, ప్రకటించి బోధించమని యెహోవా మనకిచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించాలంటే మనం ఈ విధానాంతం వరకు సహించాల్సిరావచ్చు. (మత్తయి 24:13, 14; 28:19, 20) ఈ లోకపు ఒత్తిళ్ల భారం మనమీదున్నా మన సహోదరులతో ఎడతెగక సమకూడేందుకు మనకు సహనం అవసరం. ఈ రంగాల్లో విధేయత చూపించేందుకు మనం చేస్తున్న ప్రయత్నాలు మన ప్రేమగల దేవునికి పూర్తిగా తెలుసు. అయితే సంపూర్ణ విధేయత చూపించేందుకు మనం మంచిపట్ల ప్రేమను పెంపొందించుకుంటూనే మన పాపభరిత శరీరంతో పోరాడాలి, చెడునుండి వైదొలగాలి.—రోమీయులు 12:9.
19 ప్రేమనుబట్టి, కృతజ్ఞతాపూర్వక హృదయాన్నిబట్టి మనం యెహోవాను సేవించినప్పుడు, ఆయన ‘తనను వెదికే మనకు ఫలము దయచేస్తాడు.’ (హెబ్రీయులు 11:6) సరైన అర్పణలు అవసరమైనవి, కోరదగినవైనా, యెహోవాపట్ల ప్రేమతో చూపించే సంపూర్ణ విధేయత మాత్రమే ఆయనను అమితంగా సంతోషపరుస్తుంది.—సామెతలు 3:1, 2.
మీరెలా జవాబిస్తారు?
• యెహోవాకు విలువైనది ఇవ్వగలమని మనమెందుకు చెప్పవచ్చు?
• సౌలు ఏ తప్పులు చేశాడు?
• బలికన్నా విధేయత శ్రేష్ఠమని మీరు నమ్ముతున్నట్లు మీరెలా చూపించవచ్చు?
• యెహోవాకు విధేయత చూపించేలా మిమ్మల్ని ఏది పురికొల్పుతోంది?
[అధ్యయన ప్రశ్నలు]
1. నేడు సమాజంలో ఎలాంటి స్వభావం వ్యాపించివుంది?
2, 3. యెహోవాకు విధేయత చూపించేందుకు మనకెలాంటి కారణాలున్నాయి?
4. మనం ఏ భావంలో యెహోవాకు విలువైనది ఇవ్వగలం?
5. అవిధేయత సృష్టికర్తను ఎలా ప్రభావితం చేస్తుంది? ఉదాహరించండి.
6. దేవునికి విధేయులుగా ఉండేందుకు మనకేమి సహాయం చేస్తుంది?
7. బలులకన్నా విధేయతను యెహోవా ఎందుకు నొక్కిచెప్పాడు?
8. సౌలును రాజుగా దేవుడెందుకు నిరాకరించాడు?
9. సౌలు ఎలా దేవునికి అవిధేయత చూపించే విధానాన్ని కనబర్చాడు?
10. సౌలు ఏ పాఠం నేర్చుకోవడంలో విఫలుడయ్యాడు?
11, 12. (ఎ) మన ఆరాధనలో యెహోవాను సంతోషపెట్టడానికి మనం చేసే ప్రయత్నాలను ఆయన ఎలా దృష్టిస్తాడు? (బి) ఒక వ్యక్తి నిజానికి అవిధేయునిగా ఉంటూనే తాను దేవుని చిత్తం చేస్తున్నాననే ఆలోచనతో ఎలా తననుతాను మోసం చేసుకోవచ్చు?
13. ఏకాంతంలో, యెహోవాపట్ల మన విధేయత ఎలా పరీక్షించబడవచ్చు?
14. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో దేవునిపట్ల మన విధేయతను చూపించే కొన్ని మార్గాలేమిటి?
15. యెహోవా ఆజ్ఞలకు మీరెందుకు విధేయత చూపిస్తారు?
16, 17. (ఎ) హృదయపూర్వక ప్రేమనుబట్టి యేసు దేవునిపట్ల ఎలా విధేయతను చూపించాడు? (బి) మనం యేసును ఎలా అనుకరించవచ్చు?
18, 19. దేవునిపట్ల మన హృదయపూర్వక విధేయతవల్ల ఎలాంటి ఫలితాలొస్తాయి?
[26వ పేజీలోని చిత్రం]
తాను సిఫారసు చేసినవాటిని లక్ష్యపెట్టని రోగి గురించి శ్రద్ధచూపే వైద్యుడు ఏమనుకుంటాడు?
[28వ పేజీలోని చిత్రం]
రాజైన సౌలు యెహోవా కోపానికి ఎందుకు గురయ్యాడు?
[30వ పేజీలోని చిత్రాలు]
ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు మీరు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తున్నారా?