సౌలు పాత స్నేహితులను, మునుపటి శత్రువులను కలుసుకోవడం
సౌలు పాత స్నేహితులను, మునుపటి శత్రువులను కలుసుకోవడం
అపొస్తలుడైన పౌలుగా ఆ తర్వాత పేరుపొందిన సౌలు, క్రైస్తవునిగా మారిన తర్వాత మొదటిసారిగా యెరూషలేముకు తిరిగి వెళ్తున్నప్పుడు కొంతమేర భయపడి ఉండవచ్చు. * ఆయన యేసు శిష్యులను బెదిరించి హత్యచేయడానికి మూడేళ్ల క్రితం ఆ నగరాన్ని వదిలివెళ్లాడు. దమస్కులో తనకు కనిపించే క్రైస్తవులను బంధించే అధికారం ఆయన పొందాడు.—అపొస్తలుల కార్యములు 9:1, 2; గలతీయులు 1:18.
సౌలు తానే క్రైస్తవునిగా మారిన తర్వాత పునరుత్థానం చేయబడిన మెస్సీయపట్ల తనకున్న విశ్వాసం గురించి ధైర్యంగా ప్రకటించాడు. అందుకే, దమస్కులోని యూదులు ఆయనను చంపాలనుకున్నారు. (అపొస్తలుల కార్యములు 9:19-25) యెరూషలేములోని తన మునుపటి స్నేహితులు తనను సాదరంగా ఆహ్వానిస్తారని ఆయన నిజంగా ఎదురుచూడవచ్చా? యెరూషలేములోని క్రీస్తు అనుచరులను కలుసుకోవడం గురించే సౌలు ఎక్కువగా ఆలోచించాడు. అదంత సులభమైన పనేమీ కాదు.
“అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసికొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి.” (అపొస్తలుల కార్యములు 9:26) నిజానికి వారి భయం అర్థం చేసుకోదగినదే. క్రైస్తవులను క్రూరంగా హింసించిన వ్యక్తిగానే ఆయన వారికి ఇంతవరకు తెలుసు. ఆయన క్రైస్తవుణ్ణని చెప్పుకోవడం సంఘంలో జొరబడ్డానికి పన్నిన పన్నాగంగా అనిపించవచ్చు. కాబట్టి, యెరూషలేములోని క్రైస్తవులు ఆయనను ఆమడ దూరంలోనే ఉంచాలనుకున్నారు.
కానీ, వారిలో ఒకరు సౌలుకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. బర్నబా, గతంలో హింసకునిగావున్న ఆయనను “అపొస్తలులయొద్దకు” తీసుకొని వెళ్లి, వారికి సౌలు మారడం గురించి, దమస్కులో ఆయన చేసిన ప్రకటనాపని గురించి వివరించాడని బైబిలు పేర్కొంటోంది, ఆ అపొస్తలులు పేతురు (కేఫా), ప్రభువు సహోదరుడైన యాకోబు కావచ్చు. (అపొస్తలుల కార్యములు 9:27; గలతీయులు 1:18, 19) సౌలుమీద బర్నబాకు నమ్మకం ఎలా కలిగిందో బైబిలు వివరించడంలేదు. వారిద్దరికీ పరిచయం ఉంది కాబట్టి సౌలును పరీక్షించి ఆయన నిజాయితీని ధ్రువీకరించాలని బర్నబా అనుకున్నాడా? దమస్కులోని కొందరు క్రైస్తవులతో బర్నాబాకు పరిచయముంది కాబట్టి, సౌలులో వచ్చిన మార్పు గురించి ఆయనకు తెలుసా? ఏదేమైనా, సౌలు గురించిన అనుమానాలను బర్నబా పటాపంచలు చేశాడు. అందువల్లే, సౌలు అపొస్తలుడైన పేతురుతోపాటు 15 రోజులు ఉండగలిగాడు.
పేతురుతో పదిహేను రోజులు
సౌలు గలతీయులకు నొక్కిచెప్పినట్లు ఆయన మానవుల నుండి ఎలాంటి అనుమతి పొందాల్సిన అవసరం లేకుండానే, నేరుగా యేసుచేత ఆజ్ఞాపించబడ్డాడు. (గలతీయులు 1:11, 12) అయితే సౌలు, యేసు పరిచర్య గురించి ఎక్కువగా తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఖచ్చితంగా గుర్తించాడు. పేతురు ఉంటే పరిచర్య గురించి తెలుసుకోవడానికి సౌలుకు ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. (లూకా 24:12; 1 కొరింథీయులు 15:3-8) సౌలు పేతురును, యాకోబును ఎన్నో విషయాలు అడగాలని అనుకునివుండవచ్చు, అలాగే వారు కూడా సౌలు పొందిన దర్శనం గురించి, ఆయనకివ్వబడిన ఆజ్ఞ గురించి కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకునివుండవచ్చు.
మునుపటి స్నేహితుల నుండి ఎలా రక్షించబడ్డాడు?
స్తెఫను మొదటి క్రైస్తవ హతసాక్షిగా పిలవబడ్డాడు. స్తెఫను గతంలో ‘లిబెర్తీనులదనబడిన సమాజపువారిలో కురేనీయుల సమాజపువారిలో, అలెక్సంద్రియుల సమాజపువారిలో, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలో’ కొందరితో తర్కించాడు. ఇప్పుడు సౌలు “గ్రీకు భాషను మాట్లాడు యూదులతో” లేక హెల్లేనిస్టులతో తర్కిస్తూ ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు. వారెలా ప్రతిస్పందించారు? వారు ఆయనను చంపాలనుకున్నారు.—అపొస్తలుల కార్యములు 6:9; 9:28-29.
సౌలు తన మునుపటి స్నేహితులకు తాను జీవితంలో చేసుకున్న పెను మార్పుల గురించి వివరించి, మెస్సీయ గురించి ఉపదేశించడానికి ప్రయత్నించాలనుకోవడం సహజమే. అయితే యూదా హెల్లేనిస్టులు తాము ద్రోహిగా భావించిన సౌలుమీద విషంకక్కారు.
సౌలు తానెంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడో గ్రహించాడా? ఆయన ఆలయంలో ప్రార్థిస్తున్నప్పుడు పరవశుడై యేసును చూశాడని మనం చదువుతాం, ఆయన సౌలుకు ఇలా ఆజ్ఞాపించాడు: “నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరు.” దానికి సౌలు ఇలా జవాబిచ్చాడు: “ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచునుంటినని వారికి బాగుగా తెలియును. మరియు నీ సాక్షియైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేనుకూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి[తిని].”—అపొస్తలుల కార్యములు 22:17-20.
సౌలు తనకు ప్రమాదం పొంచివుందని అంగీకరించినట్లు ఆయన జవాబు తెలియజేస్తుంది అని కొందరు అనుకుంటారు. మరికొందరు ఆయన ఇలా చెప్పాడని అనుకుంటారు: ‘నేను వారిలాగే క్రైస్తవులను హింసించాను, అది వారికీ తెలుసు. ఖచ్చితంగా నేను క్రైస్తవునిగా మారానన్న విషయాన్ని వారు గంభీరంగా తీసుకోవాలి. వారు సత్యం అర్థం చేసుకోవడానికి నేను సహాయం చేయగలనేమో.’ ఆ యూదులు ఒక “మతభ్రష్ఠుని” సాక్ష్యాన్ని లక్ష్యపెట్టరని యేసుకు తెలుసు. ఆయన సౌలుకు ఇలా ఆజ్ఞాపించాడు: “వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదును.”—అపొస్తలుల కార్యములు 22:21, 22.
ఆయనకు పొంచివున్న ప్రమాదాన్ని తోటి క్రైస్తవులు గ్రహించినప్పుడు, వారు సౌలును త్వరత్వరగా కైసరయ ఓడరేవుకు తీసుకొని వెళ్లి, 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన సొంత నగరమైన తార్సుకు పంపించారు. (అపొస్తలుల కార్యములు 9:30) ఎన్నో ఏళ్లు గడిచిన తర్వాతే సౌలు యెరూషలేముకు తిరిగివచ్చాడు.
ఆయన త్వరగా వెళ్లిపోవడం క్రైస్తవ సంఘాన్ని కాపాడివుండవచ్చు. గతంలో క్రైస్తవులను హింసించిన వ్యక్తి తమ మధ్య ఉంటే వారికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. సౌలు అక్కడి నుండి వెళ్లిన తర్వాత, “యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.”—అపొస్తలుల కార్యములు 9:31.
జాగ్రత్తగా ఉండే విషయంలో పాఠాలు
మొదటి శతాబ్దంలోని పరిస్థితుల్లాగే నేడు కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. మనం అనవసరంగా అపరిచితులకు భయపడాల్సిన అవసరం లేదు. అయితే, కొన్నిసార్లు మోసపూరితులైన వ్యక్తులు, వ్యక్తిగత లాభాల కోసం గానీ సంఘానికి హాని తలపెట్టాలనే ఉద్దేశంతో గానీ యెహోవా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి, మోసగాళ్ల వంచనలకు ఎరగా మారకుండా ఉండడానికి మనం వివేచనను ఉపయోగిస్తాం.—సామెతలు 3:27; 2 తిమోతి 3:13.
యెరూషలేములోని ప్రకటనా పని విషయంలో సౌలు ప్రతిస్పందన, క్రైస్తవులు మరో విధంగా ఎలా జాగ్రత్తగా వుండవచ్చో తెలియజేస్తుంది. కొన్ని స్థలాల్లో సాక్ష్యమివ్వడం లేక మునుపటి స్నేహితులతో సహా కొందరు వ్యక్తులకు సాక్ష్యమివ్వడం భౌతికంగా, ఆధ్యాత్మికంగా లేదా నైతికంగా కూడా ప్రమాదకరం కావచ్చు. సమయం, స్థలం ఎంపిక చేసుకోవడంవంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.—సామెతలు 22:3; మత్తయి 10:16.
ఈ దుష్టవిధానాంతానికి ముందే దేవుని రాజ్యసువార్త ప్రకటించబడుతుందనే నమ్మకంతో మనం ఉండవచ్చు. ఆ విషయంలో సౌలు ఎంత చక్కని మాదిరినుంచాడో కదా, ఆయన పాత స్నేహితులకు, మునుపటి శత్రువులకు కూడా “ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధిం[చాడు].”—అపొస్తలుల కార్యములు 9:28.
[అధస్సూచి]
^ పేరా 2 సౌలు నేడు అపొస్తలుడైన పౌలుగానే సుపరిచితుడు. అయితే, ఈ ఆర్టికల్‌లో ఉదాహరించబడిన అనేక బైబిలు లేఖనాల్లో ఆయన సౌలు అనే తన యూదా పేరుతోనే ప్రస్తావించబడ్డాడు.—అపొస్తలుల కార్యములు 13:9.
[16వ పేజీలోని చిత్రం]
సౌలు యెరూషలేముకు వచ్చిన తర్వాత, గ్రీకు మాట్లాడే యూదులకు ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు