“జ్ఞానము ఆశ్రయాస్పదము”
“జ్ఞానము ఆశ్రయాస్పదము”
“అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్ఠము. వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు” అని సామెతలు 16:16 చెబుతోంది. జ్ఞానం ఎందుకంత విలువైనది? ఎందుకంటే, “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును.” (ప్రసంగి 7:12) జ్ఞానం దానిని పొందినవారి ప్రాణాల్ని ఎలా రక్షిస్తుంది?
దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోవడమంటే దేవుని వాక్యమైన బైబిలు గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం, దానికి అనుగుణంగా ప్రవర్తించడమని అర్థం. ఇది మనం యెహోవాకు ఆమోదయోగ్యమైన రీతిలో నడిచేందుకు సహాయం చేస్తుంది. (సామెతలు 2:10-12) ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను ఇలా అన్నాడు: “చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును.” (సామెతలు 16:17) అవును, జ్ఞానం దాన్ని పొందినవారిని చెడు మార్గాలనుండి తప్పించి, వారి ప్రాణాల్ని కాపాడుతుంది! సామెతలు 16:16-33లోని సంక్షిప్తమైన, జ్ఞానవంతమైన మాటలు, దైవిక జ్ఞానం మన ప్రవర్తనా తీరుపై, మనం మాట్లాడే తీరుపై, మన చేతలపై ఎలా మంచి ప్రభావాన్ని చూపిస్తుందో వివరిస్తున్నాయి. *
‘దీనమనసు కలిగి ఉండండి’
వ్యక్తిగా చిత్రీకరించబడిన జ్ఞానం ఇలా అంటున్నట్లు వర్ణించబడింది: “గర్వము అహంకారము . . . నాకు అసహ్యములు.” (సామెతలు 8:13) గర్వం, జ్ఞానం రెండూ భిన్నధ్రువాలు. మనం జ్ఞానంతో ప్రవర్తిస్తూ, అహంకారపూరిత స్వభావాన్ని పెంపొందించుకోకుండా జాగ్రత్తపడాలి. మనం జీవితంలోని కొన్ని రంగాల్లో విజయాన్ని సాధించినట్లైతే లేదా క్రైస్తవ సంఘంలో ఏదైనా బాధ్యతాయుతమైన స్థానం పొందినట్లైతే మనం మరింత జాగ్రత్తపడాలి.
“నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును” అని సామెతలు 16:18 హెచ్చరిస్తోంది. తనంతట తానే అపవాదియైన సాతానుగా మారిన దేవుని పరిపూర్ణ ఆత్మకుమారుని పతనం గురించి ఆలోచించండి, అది విశ్వంలోనే అత్యంత గొప్ప పతనం. (ఆదికాండము 3:1-5; ప్రకటన 12:9) అతడు తన పతనానికి ముందు అహంకారపూరిత స్వభావాన్ని కనబర్చలేదా? కొత్తగా సత్యాన్ని స్వీకరించిన వ్యక్తి “గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు” క్రైస్తవ సంఘంలో పైవిచారణకర్తగా నియమించబడకూడదనే విషయాన్ని చెబుతున్నప్పుడు బైబిలు ఆ అపవాదికున్న అహంకారపూరిత స్వభావం గురించి వివరిస్తోంది. (1 తిమోతి 3:1, 2, 6) ఇతరులు గర్వించేలా ప్రోత్సహించకుండా, మనలో అది పెంపొందింపజేసుకోకుండా జాగ్రత్తపడడం ఎంత ప్రాముఖ్యమో కదా!
“గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు” అని సామెతలు 16:19 చెబుతోంది. అదొక జ్ఞానవంతమైన ఉపదేశం అని ప్రాచీన బబులోను రాజైన నెబుకద్నెజరు విషయంలో తెలుస్తుంది. అతడెంతో గర్వంగా బహుశా ఎత్తైన తన ప్రతిమను దూరాయ మైదానంలో నిలబెట్టించాడు. అది 27 మీటర్ల ఎత్తు ఉండేలా దాన్ని ఎత్తైన పాదపీఠంపై ఆయన నిలబెట్టించివుండవచ్చు. (దానియేలు 3:1) ఆ ఎత్తైన ప్రతిమ నెబుకద్నెజరు సామ్రాజ్య వైభవానికి ప్రతీకగా ఉండేందుకు నిలబెట్టించబడింది. అలాంటి ఎత్తైన, వైభవోపేతమైన ప్రతిమలు, స్తంభాలు, కట్టడాలు, ఆకాశహార్మ్యాలు మానవులను ఆకట్టుకోవచ్చేమోగానీ దేవుణ్ణి ఆకట్టుకోలేవు. కీర్తనకర్త ఇలా పాడాడు: “యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.” (కీర్తన 138:6) నిజానికి, “మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము.” (లూకా 16:15) “హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై” ఉండడం మనకు శ్రేయస్కరం.—రోమీయులు 12:16.
‘అంతర్దృష్టితో,’ ‘ఒప్పించేవిధంగా’ మాట్లాడండి
జ్ఞానం సంపాదించుకోవడం మనం మాట్లడే తీరుపై ఎలా ప్రభావం చూపిస్తుంది? జ్ఞానియైన రాజు ఇలా చెబుతున్నాడు: “ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్య [‘ఒప్పించే సామర్థ్యం,’ NW] యెక్కువగును. తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట. మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి [‘అంతర్దృష్టి,’ NW] కలిగించును వాని పెదవులకు విద్య [‘ఒప్పించే సామర్థ్యాన్ని,’ NW] విస్తరింపజేయును.”—సామెతలు 16:20-23.
మనం అంతర్దృష్టితో, ఒప్పించే విధంగా మాట్లాడడానికి జ్ఞానం మనకు సహాయం చేస్తుంది. ఎందుకు సహాయం చేస్తుంది? ఎందుకంటే జ్ఞానంగల వ్యక్తి ఒక విషయంలో “మేలు” వెదకడానికి ప్రయత్నించి, ‘యెహోవాను ఆశ్రయిస్తాడు’ లేదా ఆయనపై నమ్మకాన్ని ఉంచుతాడు. ఇతరుల్లో మేలును చూసేందుకు ప్రయత్నిస్తే మనం వారి గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడ్డానికే మొగ్గుచూపుతాం. మన మాటలు కఠినంగా, వాదించేలా కాక ఇంపైనవిగా, ఒప్పించే విధంగా ఉంటాయి. ఇతరుల పరిస్థితుల గురించిన అంతర్దృష్టి, వారు ఎంతగా కష్టాలను ఎదుర్కొంటున్నారో, వాటిని ఎలా సహిస్తున్నారో మనం అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తుంది.
రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో కూడా జ్ఞానవంతమైన మాటలు మాట్లాడడం చాలా ప్రాముఖ్యం. మనం ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారికి ఆధ్యాత్మిక సమాచారాన్ని అందించడం మాత్రమే మన ఉద్దేశం కాదు. వారి హృదయాల్ని చేరుకోవాలనే లక్ష్యం కూడా మనకుంది. అంటే మనం ఒప్పించే విధంగా మాట్లాడడం అవసరం. అపొస్తలుడైన పౌలు తన సహచరుడైన తిమోతి, తను “రూఢియని తెలిసికొన్న [‘ఒప్పించబడిన,’ NW]” విషయాలను 2 తిమోతి 3:14, 15.
పాటించడంలో నిలకడగా ఉండమని ప్రోత్సహించాడు.—గ్రీకులో “ఒప్పించు” అనే పదానికి “తర్కాన్ని ఉపయోగించి లేదా నైతిక కారణాలను వివరించి ఒకరి మనసును మార్చడం” అనే అర్థముందని డబ్ల్యూ. ఇ. వైన్ వ్రాసిన యాన్ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్ట్‌మెంట్ వర్డ్స్ చెబుతోంది. శ్రోతల మనసు మారేలా ఒప్పించే విధంగా తర్కించాలంటే, మనకు వారి ఆలోచనా తీరు, వారి ఇష్టాలు, వారున్న పరిస్థితులు, వారి నేపథ్యం గురించిన అంతర్దృష్టి ఉండాలి. అలాంటి అంతర్దృష్టి మనకెలా లభిస్తుంది? శిష్యుడైన యాకోబు దానికిలా జవాబిస్తున్నాడు: ‘వినుటకు వేగిరపడువారిగా, మాటలాడుటకు నిదానించువారిగా ఉండండి.’ (యాకోబు 1:19) వినేవారిని ప్రశ్నలు అడగడం ద్వారా, వారు చెప్పేది శ్రద్ధగా వినడం ద్వారా మనం వారి హృదయాల్లో ఏముందో తెలుసుకోవచ్చు.
ఇతరులను ఒప్పించడంలో అపొస్తలుడైన పౌలు ఎంతో నైపుణ్యవంతుడు. (అపొస్తలుల కార్యములు 18:4) ఆయనను వ్యతిరేకించినవారిలో ఒకడైన దేమేత్రియ అనే కంసాలి ఇలా ఒప్పుకున్నాడు: “ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రి[ప్పాడు].” (అపొస్తలుల కార్యములు 19:26) తాను సమర్థంగా ప్రకటనా పనిని చేయడానికి తన శక్తిసామర్థ్యాలే కారణమని పౌలు చెప్పుకున్నాడా? ఎంతమాత్రం చెప్పుకోలేదు. ఆయన తన ప్రకటనా పనిని “[దేవుని] పరిశుద్ధాత్మయు శక్తియు కనుపరచు దృష్టాంతమ[ని]” భావించాడు. (1 కొరింథీయులు 2:4, 5) యెహోవా అందించే పరిశుద్ధాత్మ సహాయం మనకు కూడా ఉంది. మనం యెహోవాపై నమ్మకముంచుతాం కాబట్టే, మనం పరిచర్యలో అంతర్దృష్టితో, ఒప్పించే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉంటాం.
“జ్ఞానహృదయుడు,” “వివేకి” లేదా వివేచనగలవాడు అని పిలువబడడంలో ఆశ్చర్యం లేదు. (సామెతలు 16:21) అవును, అంతర్దృష్టి ఉన్నవారికి అది “జీవపు ఊట.” మరి మూఢుల మాటేమిటి? వారు “జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.” (సామెతలు 1:7) వారు యెహోవా ఉపదేశాన్ని తిరస్కరించడంవల్ల ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కొంటారు? పైన పేర్కొనబడినట్లుగా సొలొమోను ఇలా చెబుతున్నాడు: “మూఢులకు వారి మూఢత్వమే శిక్ష.” (సామెతలు 16:22) అలాంటి వారికి తరచూ తీవ్రమైన శిక్ష రూపంలో మరింత క్రమశిక్షణ లభిస్తుంది. మూఢులు కష్టాలను, అవమానాన్ని, రోగాలను, చివరకు అకాల మరణాన్ని కూడా కొనితెచ్చుకోవచ్చు.
మనం మాట్లాడేతీరుపై ఆ జ్ఞానం చూపించే మంచి ప్రభావం గురించి చెబుతూ ఇశ్రాయేలు రాజు ఇలా అంటున్నాడు: “ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి.” (సామెతలు 16:24) తేనె తీయనిదేకాక ఆకలితో ఉన్న వ్యక్తికి తక్షణమే శక్తినిస్తుంది, అలాగే ఇంపైన మాటలు ప్రోత్సాహకరమైనవిగా, సేదదీర్పునిచ్చేవిగా ఉంటాయి. ఒక వ్యక్తికి మంచి ఆరోగ్యాన్నిచ్చే, వ్యాధి నివారణా కారకాలు కూడా తేనెలో ఉన్నాయి. అలాగే ఇంపైన మాటలు ఆధ్యాత్మికంగా ఒకరిని ఆరోగ్యంగా ఉంచుతాయి.—సామెతలు 24:13, 14.
‘యథార్థంగా కనబడే మార్గం’ విషయంలో జాగ్రత్తగా ఉండండి
“ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును” అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 16:25) తప్పుడు తర్కం విషయంలో, దైవిక నియమాలకు వ్యతిరేకమైన మార్గాన్ని అనుసరించే విషయంలో అదొక హెచ్చరిక. ఒక మార్గం అపరిపూర్ణ మానవుల దృక్కోణం నుండి సరైనదిగానే కనబడినా, నిజానికి అది దేవుని వాక్యంలోని నీతియుక్తమైన సూత్రాలకు వ్యతిరేకంగా ఉండవచ్చు. అంతేకాక, ఒక వ్యక్తి తనకు సరైనదనిపించే మార్గంలోనే నడిచేందుకు పురికొల్పబడేలా సాతాను అలాంటి మోసపూరితమైన ఆలోచనను ప్రేరేపిస్తున్నాడు, కానీ నిజానికి ఆ మార్గం మరణానికే నడిపిస్తుంది.
జ్ఞానవంతమైన, వివేచనగల హృదయం, దేవుని వాక్య జ్ఞానానుసారంగా ఉపదేశించబడిన మనస్సాక్షి మనల్ని మనం మోసగించుకోకుండా సమర్థవంతంగా కాపాడతాయి. మనం మన జీవితంలో నైతిక విషయాల్లో, ఆరాధన విషయంలో లేదా మరే విషయాల్లోనైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మనం ఆత్మవంచన చేసుకోకుండా ఉండాలంటే మంచిచెడుల విషయంలో దేవుని ప్రమాణాలచేత నిర్దేశించబడడమే శ్రేష్ఠమైన మార్గం.
“పాటుపడేవారి ఆకలి వారి పక్షాన పని చేస్తుంది”
“కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును” అని జ్ఞానియైన రాజు ఇంకా చెబుతున్నాడు. (సామెతలు 16:26) పనివాని ఆకలి అతనిని ‘తొందరపెడుతుంది’ లేదా పురికొల్పుతుంది కాబట్టి అది ‘వానిచేత కష్టం చేయిస్తుంది.’ దాన్ని పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం ఇలా అనువదించింది: “పాటుపడేవారి ఆకలి వారి పక్షాన పని చేస్తుంది. నోరు తినమంటుంది.” ఆకలివంటి సహజమైన కోరిక మనం పనిచేసేలా ప్రేరేపించగలదు. అలాంటి కోరిక ప్రయోజనకరమైనది. అయితే, అలాంటి సరైన కోరిక మితిమీరడాన్ని అనుమతించడంవల్ల అది దురాశగా మారితే ఏమౌతుంది? దాని పర్యవసానాలు ఎలా వుంటాయంటే, వంట చేసుకోవడానికి వేసుకునే చిన్నమంట అడవిని కాల్చేంత పెద్ద మంటగా మారినప్పుడు పర్యవసానాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. కోరిక మితిమీరితే అది దురాశగా మారుతుంది, అది హానికరమైనది. ఈ ప్రమాదాన్ని గ్రహించి, జ్ఞానంగల వ్యక్తి సరైన కోరికల్ని కూడా అదుపులో పెట్టుకుంటాడు.
‘మంచిది కాని మార్గంలో’ నడవకండి
మనం పలికే మాటలు రగిలే జ్వాలలు కలిగించేంత హానిని కలిగించవచ్చు. ఇతరుల్లోని తప్పులను వెదకి, వాటిని ప్రచారం చేయడంవల్ల కలిగే హాని గురించి సొలొమోను ఇలా అంటున్నాడు: “పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును.”—సామెతలు 16:27, 28.
తోటివ్యక్తి మంచిపేరును పాడుచేయాలని ప్రయత్నించే వ్యక్తి “పనికిమాలినవాడు.” మనం ఇతరుల్లో మంచిని చూసేందుకు, వారిపట్ల ఇతరులకు గౌరవం కలిగేలా మాట్లాడేందుకు ప్రయత్నించాలి. ఇతరుల గురించి హానికరమైన పుకార్లు ప్రచారం చేసేవారు చెప్పేదాన్ని మనం వినే విషయమేమిటి? వారి మాటలు సులభంగా లేనిపోని అపోహలు కలిగేలా చేస్తాయి, స్నేహితులను విడగొట్టడమేకాక సంఘంలో విభేదాలు ఏర్పడడానికి కూడా కారణమవ్వవచ్చు. అలాంటివారు చెప్పేది వినకుండా జ్ఞానం మనలను అడ్డుకుంటుంది.
సామెతలు 16:29, 30, ఈజీ-టు-రీడ్-వర్షన్.
ఒక వ్యక్తి తప్పుడు మార్గాన్ని అనుసరించేలా చేసే మోసగించే శక్తిని గురించి హెచ్చరిస్తూ సొలొమోను ఇలా చెబుతున్నాడు: “త్వరగా కోపం వచ్చే మనిషి తన స్నేహితులకు చిక్కు పెడ్తాడు. మంచిది కాని మార్గంలో అతడు వారిని నడిపిస్తాడు. కన్నుగీటి, చిరునవ్వు నవ్వేవాడు ఏదో అక్రమం, కీడు తలపెడ్తున్నాడు.”—దౌర్జన్యం, మోసగించే దాని శక్తిని సత్యారాధకుల మీద చూపించగలదా? అనేకులు నేడు ‘కీడును తలపెట్టేలా’ మోసగించబడ్డారు. వారు దౌర్జన్యపూరితమైన పనులను ప్రోత్సహిస్తారు లేదా వాటిని చేస్తారు. అలాంటి దౌర్జన్యపూరితమైన పనులు చేయకుండా ఉండడం మనకంత కష్టమనిపించకపోవచ్చు. అయితే వాటికి మోసపూరితమైన రీతుల్లో ఆకర్షింపబడడం మాటేమిటి? లక్షలాదిమంది దౌర్జన్యాన్ని ఘనపర్చే వినోద కార్యక్రమాలను, క్రీడలను చూసి ఆనందించేలా ఆకర్షింపబడడంలేదా? లేఖనాధారమైన ఈ హెచ్చరిక స్పష్టంగా ఉంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) దైవిక జ్ఞానం ఎంతటి రక్షణ కల్పిస్తుందో కదా!
తన జీవితమంతా జ్ఞానంతో, వివేకంతో నడుచుకుంటూ “మంచిది కాని మార్గంలో” నడవని ఒక వ్యక్తి గురించి ఏమని చెప్పవచ్చు? జీవితాన్ని నీతియుక్తంగా గడిపినవారు దేవుని దృష్టిలో సొగసైనవారు, వారు గౌరవార్హులు. “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి యుండును” అని సామెతలు 16:31 చెబుతోంది.
మరోవైపు, మితిమీరిన కోపం ఏవిధంగానూ సొగసైనది కాదు. ఆదాము హవ్వలకు పుట్టిన మొదటి కుమారుడైన కయీను తన తమ్ముడైన హేబెలుపై “మిక్కిలి కోపము” తెచ్చుకొని ‘ఆయన మీద పడి చంపాడు.’ (ఆదికాండము 4:1, 2, 5, 8) కొన్నిసార్లు మనం కోపపడడానికి కారణం ఉండవచ్చు కానీ ఆ కోపాన్ని మితిమీరనివ్వకుండా చూసుకోవాలి. “పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు” అని సామెతలు 16:32 స్పష్టంగా చెబుతోంది. మితిమీరిన కోపం బలానికి సూచనా కాదు, అదొక సుగుణం అంతకన్నా కాదు. అది మనం “మంచిది కాని మార్గంలో” నడిచేలా చేసే ఒక బలహీనత.
ఎప్పుడు ప్రతీ ‘తీర్పు యెహోవా వశం’ అవుతుంది?
“చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము” అని ఇశ్రాయేలు రాజు చెబుతున్నాడు. (సామెతలు 16:33) ప్రాచీన ఇశ్రాయేలులో, యెహోవా తన చిత్తాన్ని వెల్లడిచేసేందుకు కొన్నిసార్లు చీట్లను ఉపయోగించాడు. ముందుగా, ఒక విషయాన్ని నిర్ణయించమని యెహోవాకు ప్రార్థించేవారు. తర్వాత ఆ చీట్లను వస్త్రంలోని మడతల్లోకి వేసి ఆ తర్వాత ఒకదాన్ని బయటకు తీసేవారు. వచ్చే ఫలితాన్ని దేవుని నిర్ణయంగా భావించేవారు.
యెహోవా తన చిత్తాన్ని తన ప్రజలకు తెలియజేసేందుకు ఇప్పుడు చీట్లను ఉపయోగించడం లేదు. తన చిత్తాన్ని ఆయన తన వాక్యమైన బైబిల్లో తెలియజేశాడు. బైబిల్లోని ఖచ్చితమైన జ్ఞానం, మనం దైవిక జ్ఞానాన్ని పొందేందుకు చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన జీవితాల్లో ప్రేరేపిత లేఖనాలను చదవని రోజంటూ లేకుండా చూసుకుందాం.—కీర్తన 1:1, 2; మత్తయి 4:4.
[అధస్సూచి]
^ పేరా 3 సామెతలు 16:1-15 వచనాల చర్చ కోసం కావలికోట మే 15, 2007 సంచికలోని 17-20 పేజీలు చూడండి.
[8వ పేజీలోని చిత్రం]
జ్ఞానం ఎందుకు అపరంజికంటే శ్రేష్ఠమైనది?
[9వ పేజీలోని చిత్రం]
మీరు పరిచర్యలో ఒప్పించే విధంగా మాట్లాడడానికి ఏది సహాయం చేస్తుంది?
[10వ పేజీలోని చిత్రం]
“పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును”
[11వ పేజీలోని చిత్రం]
మితిమీరిన కోపం మనం “మంచిది కాని మార్గంలో” నడిచేలా చేస్తుంది
[12వ పేజీలోని చిత్రం]
దౌర్జన్యానికి మోసగించే శక్తివుంది