మీరు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేశారా?
మీరు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేశారా?
“మరణకరమైన పాపము కలదు.”—1 యోహాను 5:16.
జర్మనీలో నివసిస్తున్న ఓ స్త్రీ దేవుణ్ణి సేవిస్తున్నప్పటికీ, “నేను పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేశాననే తలంపు నన్ను పీడిస్తోంది” అని వ్రాసింది. నిజానికి ఒక క్రైస్తవుడు దేవుని పరిశుద్ధాత్మకు లేదా చురుకైన శక్తికి విరుద్ధంగా పాపంచేసే అవకాశముందా?
2 ఉంది, యెహోవా పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపంచేసే అవకాశముంది. “మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు” అని యేసుక్రీస్తు అన్నాడు. (మత్తయి 12:31) మనమిలా హెచ్చరించబడ్డాం: “మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుట . . . ఉండును.” (హెబ్రీయులు 10:26, 27) అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “మరణకరమైన పాపము కలదు.” (1 యోహాను 5:16) అయితే తాను “మరణకరమైన పాపము” చేశానో లేదో నిర్ధారించుకోవడం ఘోరమైన పాపం చేసిన వ్యక్తికే వదిలివేయబడిందా?
పశ్చాత్తాపపడితే క్షమాపణ లభిస్తుంది
3 దోషులకు తీర్పుతీర్చేది యెహోవాయే. నిజానికి, మనలో ప్రతీ ఒక్కరం ఆయనకు లెక్క అప్పగించవలసిన వాళ్ళమైవున్నాం, ఆయన ఎల్లప్పుడూ న్యాయం చేస్తాడు. (ఆదికాండము 18:25; రోమీయులు 14:11) మనం క్షమించరాని పాపం చేశామా, మననుండి తన ఆత్మను తీసేయాలా వద్దా అనేది నిర్ణయించేది యెహోవాయే. (కీర్తన 51:11) అయితే మనం చేసిన పాపాన్నిబట్టి తీవ్రంగా దుఃఖిస్తే మనం నిజంగా పశ్చాత్తాపపడుతున్నట్లే. అయితే నిజమైన పశ్చాత్తాపమంటే ఏమిటి?
4 పశ్చాత్తాపపడడమంటే, మనం చేసిన పాపంపట్ల లేదా మనం చేయాలనుకున్న అపరాధంపట్ల మన దృక్పథాన్ని మార్చుకోవడమని అర్థం. అంటే మనం నొచ్చుకొని లేదా దుఃఖపడి పాపపు విధానంనుండి వైదొలగడమని అర్థం. మనం గంభీరమైన పాపంచేసినా మనం నిజంగా పశ్చాత్తాపపడ్డామని చూపించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నప్పుడు, కీర్తనకర్త పలికిన ఈ మాటల నుండి ఓదార్పు పొందవచ్చు: “మన పాపములనుబట్టి [యెహోవా] మనకు ప్రతికారము చేయలేదు; మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు. తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.”—కీర్తన 103:10-14.
5 అపొస్తలుడైన యోహాను వ్రాసిన ఈ మాటలు కూడా ఓదార్పునిస్తాయి: “ఇందువలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి 1 యోహాను 3:19-22.
అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.”—6 మనం సహోదర ప్రేమను కనబరుస్తాము, అలవాటుగా పాపము చేయము కాబట్టి, మనం “సత్యసంబంధులమని” మనకు తెలుసు. (కీర్తన 119:11) ఏదైనా కారణాన్నిబట్టి దోషారోపణా భావం మనలో కలిగితే, “దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు” అని మనం గుర్తుంచుకోవాలి. మన “నిష్కపటమైన సహోదర ప్రేమ,” పాపానికి వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటం, ఆయన చిత్తం జరిగించేందుకు మనం చేస్తున్న ప్రయత్నాలు ఆయనకు తెలుసు కాబట్టి యెహోవా మనపట్ల జాలి చూపిస్తాడు. (1 పేతురు 1:22) యెహోవాను విశ్వసిస్తే, సహోదర ప్రేమను కనబరిస్తే, ఉద్దేశపూర్వకంగా పాపం చేయడంలో కొనసాగకపోతే మన హృదయం మనపై “దోషారోపణ” చేయదు. అలాంటప్పుడు, మనం ప్రార్థనలో “దేవుని యెదుట ధైర్యముగల”వారిగా ఉండడమే కాక, ఆయన ఆజ్ఞలను గైకొనడాన్నిబట్టి ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు.
వారు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేశారు
7 ఎలాంటి పాపాలు క్షమించబడవు? ఈ ప్రశ్నకు జవాబిచ్చేందుకు మనం కొన్ని బైబిలు ఉదాహరణలను పరిశీలిద్దాం. ఈ పరిశీలన, మనం పశ్చాత్తాపపడిన తర్వాత కూడా, మన గంభీరమైన తప్పుల విషయమై మనమింకా తీవ్రవ్యధను అనుభవిస్తుంటే మనకు ఓదార్పునివ్వాలి. ఒక వ్యక్తి ఎలాంటి పాపం చేశాడనేది కాదుగానీ, అతని ఉద్దేశం, హృదయ స్థితి, ఎంతమేరకు సుముఖత కనబర్చాడు అనేవి ఆ పాపం క్షమార్హమైనదా కాదా అనేది నిర్ణయిస్తాయి.
8 దురుద్దేశంతో యేసుక్రీస్తును వ్యతిరేకించిన మొదటి శతాబ్దపు యూదా మతనాయకులు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేశారు. యెహోవాను ఘనపర్చిన అద్భుతాలను యేసు చేస్తుండగా వారు దేవుని ఆత్మ పనిచేయడం చూశారు. అయినా క్రీస్తు శత్రువులు ఆ శక్తిని అపవాదియగు సాతానుకు ఆపాదించారు. యేసు ఉద్దేశం ప్రకారం, అలా దేవుని పరిశుద్ధాత్మను దూషించినవారు “ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను” క్షమించబడని పాపం చేసినట్లే.—9 దూషణ అంటే కించపర్చడం, తిట్టడం లేదా చెడుగా మాట్లాడడం. పరిశుద్ధాత్మకు మూలం దేవుడే కాబట్టి, ఆయన ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడడమంటే యెహోవాకు వ్యతిరేకంగా మాట్లాడడమే. పశ్చాత్తాపపడకుండా అలా మాట్లాడేందుకు ఒడిగట్టడం క్షమార్హం కాదు. అలాంటి పాపాన్ని గురించి యేసు చెప్పిన మాటలు, దేవుని పరిశుద్ధాత్మ ప్రక్రియను బుద్ధిపూర్వకంగా వ్యతిరేకించేవారి గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడని చూపిస్తున్నాయి. యెహోవా ఆత్మ యేసుపై పనిచేయడాన్ని చూసికూడా ఆ శక్తిని అపవాదికి ఆపాదించిన కారణంగా వారు ఆ ఆత్మను దూషించి పాపం చేసినవారయ్యారు. అందువల్ల యేసు ఇలా అన్నాడు: “పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడై యుండును.”—మార్కు 3:20-29.
10 ఇస్కరియోతు యూదా విషయం కూడా పరిశీలించండి. అతడు తనకు అప్పగించబడిన డబ్బుసంచిలో నుండి డబ్బు దొంగిలిస్తూ మోసకరమైన మార్గాన్ని అవలంబించడం మొదలుపెట్టాడు. (యోహాను 12:5, 6) యూదా ఆ తర్వాత, యూదుల అధికారుల దగ్గరకువెళ్ళి యేసును 30 వెండి నాణెములకు అప్పగించేందుకు ఏర్పాటు చేసుకున్నాడు. నిజమే, యేసును అప్పగించిన తర్వాత యూదా తాను చేసిన తప్పుకు బాధపడ్డాడే గానీ తన బుద్ధిపూర్వక పాపం విషయమై ఎన్నడూ పశ్చాత్తాపపడలేదు. తత్ఫలితంగా యూదాకు పునరుత్థాన అర్హతలేదు. అందుకే యేసు అతణ్ణి “నాశనపుత్రుడు” అని పిలిచాడు.—యోహాను 17:12; మత్తయి 26:14-16.
వారు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేయలేదు
11 తాముచేసిన ఘోరమైన పాపం ఒప్పుకుని సంఘ పెద్దలనుండి ఆధ్యాత్మిక సహాయం పొందిన క్రైస్తవులు అప్పుడప్పుడు, దేవుని ధర్మశాస్త్రం విషయంలో గతంలో తాము చేసిన తప్పులకు సంబంధించిన చింతతో ఇంకా పీడింపబడుతుండవచ్చు. (యాకోబు 5:14) ఈ విధంగా మనం వ్యక్తిగతంగా పీడింపబడుతుంటే, పాపాలు క్షమించబడినవారి గురించి లేఖనాలు చెప్పేది పరిశీలించడం ద్వారా మనం తప్పక ప్రయోజనం పొందవచ్చు.
12 రాజైన దావీదు, ఊరియా భార్యయైన బత్షెబ విషయంలో ఘోరమైన పాపం చేశాడు. దావీదు తన మిద్దెమీద నుండి క్రిందికి చూస్తుండగా సమీపంలో సౌందర్యవతియైన ఈ స్త్రీ స్నానం చేయడం గమనించి ఆమెను తన రాజభవనానికి రప్పించుకొని ఆమెతో శయనించాడు. ఆ తర్వాత ఆమె గర్భవతియైనదని తెలుసుకున్నప్పుడు ఆ వ్యభిచారాన్ని కప్పిపుచ్చేందుకు ఆమె భర్త ఆమెతో శయనించేలా పథకం పన్నాడు. కానీ ఆ పథకం పారకపోవడంతో, ఊరియా యుద్ధంలో మరణించేలా రాజు ఏర్పాటుచేశాడు. ఆ తర్వాత బత్షెబ దావీదుకు భార్యయై ఆయనకొక కుమారుణ్ణి కన్నది, కానీ ఆ కుమారుడు చనిపోయాడు.—2 సమూయేలు 11:1-27.
13 దావీదు, బత్షెబలకు సంబంధించిన విషయంతో యెహోవా వ్యవహరించాడు. ఆయన దావీదును క్షమించాడు, దావీదు చూపించిన పశ్చాత్తాపం, ఆయనతో తాను చేసిన రాజ్య నిబంధన వంటి అంశాలను దేవుడు పరిగణలోకి తీసుకున్నాడని స్పష్టమవుతోంది. (2 సమూయేలు 7:11-16; 12:7-14) బత్షెబకు పశ్చాత్తప్త మనోవైఖరి ఉందని స్పష్టమౌతోంది, ఎందుకంటే రాజైన సొలొమోనుకు తల్లిగా, యేసుక్రీస్తు పూర్వికురాలయ్యే ఆధిక్యత ఆమెకు లభించింది. (మత్తయి 1:1, 6, 16) మనం పాపం చేసినప్పుడు యెహోవా మన పశ్చాత్తప్త మనోభావాన్ని గమనిస్తాడని గుర్తుంచుకోవడం మంచిది.
14 యూదా రాజైన మనష్షే విషయంలో కూడా యెహోవా ఎంతమేరకు క్షమిస్తాడో ఉదాహరించబడింది. ఆయన యెహోవా దృష్టికి చెడునడత నడిచాడు. మనష్షే బయలుకు బలిపీఠాలు నిలబెట్టి, “ఆకాశనక్షత్ర సమూహమును” ఆరాధించడమే కాక, మందిరపు రెండు ఆవరణాల్లో అబద్ధ దేవతలకు బలిపీఠాలు నిర్మించాడు. తన కుమారులను అగ్నిలోగుండా దాటించి, అభిచార క్రియలను ప్రోత్సహిస్తూ, యూదా యెరూషలేము వాసులు, “ఇశ్రాయేలీయులయెదుట ఉండకుండ యెహోవా నశింపజేసిన అన్యజనులకంటె . . . మరింత అక్రమముగా ప్రవర్తించునట్లు చేయుటకు కారకుడాయెను.” దేవుని ప్రవక్తలు చేసిన హెచ్చరికలను లక్ష్యపెట్టలేదు. చివరకు అష్షూరు రాజు మనష్షేను బంధీగా తీసుకుపోయాడు. అక్కడ బంధీగా ఉన్నప్పుడు మనష్షే పశ్చాత్తాపపడి ఎడతెగక దేవుణ్ణి ప్రార్థించగా, దేవుడాయనను క్షమించి తిరిగి యెరూషలేములో రాజయ్యేలా చేశాడు, ఆయనక్కడ సత్యారాధనను ప్రోత్సహించాడు.—2 దినవృత్తాంతములు 33:2-17.
15 శతాబ్దాల తర్వాత, అపొస్తలుడైన పేతురు యేసు ఎవరో తనకు తెలియదని బొంకి ఘోరమైన పాపం చేశాడు. (మార్కు 14:30, 66-72) అయితే యెహోవా పేతురును ‘బహుగా క్షమించాడు.’ (యెషయా 55:7) ఎందుకు? ఎందుకంటే పేతురు నిజంగా పశ్చాత్తాపపడ్డాడు. (లూకా 22:62) దేవుడు క్షమించాడనేది స్పష్టంగా రుజువైంది, ఎందుకంటే 50 రోజుల తర్వాత పెంతెకొస్తు దినాన యేసును గురించి ధైర్యంగా సాక్ష్యమిచ్చే ఆధిక్యత పేతురుకు ఇవ్వబడింది. (అపొస్తలుల కార్యములు 2:14-36) నిజంగా పశ్చాత్తాపపడుతున్న క్రైస్తవులను దేవుడు నేడు క్షమించడని నమ్మేందుకు ఎలాంటి కారణమైనా ఉందా? “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? . . . నీయొద్ద క్షమాపణ దొరుకును” అని కీర్తనకర్త ఆలపించాడు.—కీర్తన 130:3, 4.
పాపాన్ని గురించిన భయాన్ని తగ్గించుకోవడం
16 పైన ప్రస్తావించబడిన ఉదాహరణలు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేయడాన్ని గురించిన చింతను తగ్గించుకునేందుకు మనకు సహాయం చేయాలి. పశ్చాత్తాపపడిన పాపులను యెహోవా క్షమిస్తాడని అవి చూపిస్తున్నాయి. అత్యంత ప్రాముఖ్యమైన విషయం చిత్తశుద్ధితో దేవునికి ప్రార్థించడం. మనం పాపం చేసినప్పుడు, యేసు విమోచన క్రయధన బలి, యెహోవా కనికరం, మన వారసత్వ అపరిపూర్ణత, మన నమ్మకమైన సేవ వంటివాటి ఆధారంగా క్షమాపణ కోసం ప్రార్థించవచ్చు. యెహోవా కృప తెలిసినవారిగా ఎఫెసీయులు 1:7.
ఆయన క్షమిస్తాడనే నమ్మకంతో క్షమాపణ కోసం మనం వేడుకోవచ్చు.—17 మనం పాపం చేసి, ఆ పాపం మనల్ని ఆధ్యాత్మిక రోగిని చేసిన కారణంగా ప్రార్థన చేయలేకపోతుంటే అప్పుడేమిటి? దీనిగురించి శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “[అలాంటి వ్యక్తి] సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థనచేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.”—యాకోబు 5:14, 15.
18 తప్పిదస్థుడు పశ్చాత్తాపం చూపించని కారణంగా సంఘం నుండి బహిష్కరించబడినా అతని పాపం క్షమించరానిదని చెప్పలేం. కొరింథులో బహిష్కరించబడిన ఒక అభిషిక్త తప్పిదస్థుని గురించి పౌలు ఇలా వ్రాశాడు: “అట్టివానికి మీలో ఎక్కువమందివలన కలిగిన యీ శిక్షయే చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును.” (2 కొరింథీయులు 2:6-8; 1 కొరింథీయులు 5:1-5) కానీ ఆధ్యాత్మికంగా పునరుద్ధరించబడేందుకు తప్పిదస్థులు క్రైస్తవ పెద్దలందించే బైబిలాధారిత ఆధ్యాత్మిక సహాయాన్ని అంగీకరించి, నిజమైన పశ్చాత్తాపానికి సంబంధించిన రుజువునివ్వాలి. వారు “మారుమనస్సుకు తగిన ఫలములు ఫలిం[చాలి].”—లూకా 3:8.
19 మనం పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేశామనే భావనకు ఏది కారణం కావచ్చు? అతి సున్నితత్వం లేదా బలహీనమైన శారీరక, మానసిక ఆరోగ్యం కారణాలుగా ఉండవచ్చు. అలాంటప్పుడు, ప్రార్థన, మరింత విశ్రాంతి తీసుకోవడం సహాయకరంగా ఉండవచ్చు. ముఖ్యంగా మనం దేవుని సేవను ఆపేలా నిరుత్సాహపర్చేందుకు సాతానుకు అవకాశమివ్వకూడదు. దుష్టులు మరణించడం యెహోవాకు ఇష్టముండదు కాబట్టి, తన సేవకులను పోగొట్టుకోవాలని ఆయన ఖచ్చితంగా కోరుకోడు. కాబట్టి పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేశామని మనం భయపడుతుంటే, కీర్తనల్లో ఉన్నలాంటి ఓదార్పుకరమైన భాగాలతోపాటు మనం ఎడతెగక దేవుని వాక్యం చేత పోషించబడుతూ ఉండాలి. అలాగే మనం సంఘ కూటాలకు హాజరౌతూ, రాజ్య ప్రకటనాపనిలో భాగం వహిస్తూ ఉండాలి. అలా చేయడం మనం ‘విశ్వాస లోపములేనివారమై’ ఉండేందుకు సహాయం చేయడమే కాక, క్షమించరాని పాపం చేశామేమో అనే చింతలేకుండా ఉంటాం.—తీతు 2:2.
20 పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేశామని భయపడేవారు తమనుతాము ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను పరిశుద్ధాత్మకు విరుద్ధంగా దూషణ చేశానా? నేను నా పాపం విషయంలో యథార్థంగా పశ్చాత్తాపపడ్డానా? దేవుని క్షమాగుణంపట్ల నాకు విశ్వాసముందా? నేను ఆధ్యాత్మిక వెలుగును తిరస్కరించిన మతభ్రష్టునిగా ఉన్నానా?’ అలాంటి వ్యక్తులు తాము దేవుని పరిశుద్ధాత్మకు విరుద్ధంగా దూషణ చేయలేదని లేక మతభ్రష్టులు కాలేదని గ్రహించే అవకాశముంది. వారు పశ్చాత్తాపపడ్డారు, యెహోవా క్షమాగుణంలో వారికి బలమైన విశ్వాసముంది. అలాగైతే, వారు యెహోవా పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేయలేదు.
21 మనం నిశ్చయంగా పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేయలేదని తెలుసుకోవడం ఎంత ఆశీర్వాదకరమో కదా! అయితే పరిశుద్ధాత్మకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు తర్వాతి ఆర్టికల్లో పరిశీలించబడతాయి. ఉదాహరణకు, మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను నిజంగా దేవుని పరిశుద్ధాత్మచేత నడిపించబడుతున్నానా? పరిశుద్ధాత్మ ఫలాలు నా జీవితంలో స్పష్టంగా కనబడుతున్నాయా?’
మీ జవాబేమిటి?
• పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపంచేసే అవకాశముందని మనమెందుకు చెప్పవచ్చు?
• పశ్చాత్తాపపడడమంటే ఏమిటి?
• యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఆత్మకు విరుద్ధంగా ఎవరు పాపం చేశారు?
• క్షమించరాని పాపం చేశామేమో అనే చింతనెలా అధిగమించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. దేవుని పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపంచేసే అవకాశముందని మనకెలా తెలుసు?
3. మనం చేసిన పాపాన్నిబట్టి తీవ్రంగా దుఃఖిస్తే నిజంగా ఏమి చేసినట్లే?
4. (ఎ) పశ్చాత్తాపపడడమంటే ఏమిటి? (బి) కీర్తన 103:10-14లోని మాటలు అంత ఓదార్పుకరంగా ఉండడానికి కారణమేమిటి?
5, 6. మొదటి యోహాను 3:19-22లోని ముఖ్య విషయాన్నిచెప్పి, అపొస్తలుని మాటల భావాన్ని వివరించండి.
7. ఫలాని పాపం క్షమార్హమైనదా కాదా అనేదానిని ఏవి నిర్ణయిస్తాయి?
8. మొదటి శతాబ్దపు యూదా మతనాయకుల్లో కొందరు ఎలా పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేశారు?
9. దూషణ అంటే ఏమిటి, దాని గురించి యేసు ఏమిచెప్పాడు?
10. యూదాను యేసు “నాశనపుత్రుడు” అని ఎందుకు పిలిచాడు?
11-13. బత్షెబ విషయంలో రాజైన దావీదు చేసిన పాపమేమిటి, దేవుడు వారితో వ్యవహరించిన తీరునుబట్టి ఎలాంటి ఓదార్పును పొందవచ్చు?
14. రాజైన మనష్షే విషయంలో, దేవుడు ఎంతమేరకు క్షమిస్తాడో ఎలా ఉదాహరించబడింది?
15. యెహోవా ‘బహుగా క్షమిస్తాడు’ అని అపొస్తలుడైన పేతురు జీవితంలో జరిగిన ఏ సంఘటన చూపిస్తోంది?
16. ఏ పరిస్థితులనుబట్టి దేవుడు క్షమిస్తాడు?
17. మనం పాపం చేసి, మనకు ఆధ్యాత్మిక సహాయం అవసరమైనప్పుడు ఏమి చేయాలి?
18. ఒక వ్యక్తి సంఘాన్నుండి బహిష్కరించబడినా ఆయన పాపం క్షమార్హం కాదని ఎందుకు చెప్పలేం?
19. ‘విశ్వాస లోపములేనివారమై’ ఉండేందుకు మనకేది సహాయం చేయగలదు?
20. పరిశుద్ధాత్మకు విరుద్ధంగా తాను పాపం చేయలేదని చూసేందుకు ఒక వ్యక్తికి ఎలాంటి తర్కం సహాయం చేయవచ్చు?
21. తర్వాతి ఆర్టికల్లో ఏ ప్రశ్నలు పరిశీలించబడతాయి?
[17వ పేజీలోని చిత్రం]
యేసు సాతాను శక్తితో అద్భుతాలు చేస్తున్నాడని చెప్పినవారు దేవుని పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేశారు
[18వ పేజీలోని చిత్రం]
యేసు తనకు తెలియదని పేతురు బొంకినా, ఆయన క్షమించరాని పాపం చేయలేదు