సహనంతో యెహోవా దినంకోసం ఎదురుచూడడం
సహనంతో యెహోవా దినంకోసం ఎదురుచూడడం
“మీ విశ్వాసమునందు . . . సహనమును . . . అమర్చుకొనుడి.”—2 పేతురు 1:5, 7.
యెహోవా మహా దినము సమీపించింది. (యోవేలు 1:15; జెఫన్యా 1:14) దేవునిపట్ల యథార్థతను కాపాడుకోవాలని నిర్ణయించుకున్న క్రైస్తవులమైన మనం యెహోవా సర్వాధిపత్యం సత్యమని నిరూపించబడే సమయం కోసం ఆకాంక్షతో ఎదురుచూస్తున్నాం. ఈలోగా మనం ద్వేషాన్ని, నిందను, హింసను మన విశ్వాసాన్నిబట్టి మరణాన్ని ఎదుర్కొంటాం. (మత్తయి 5:10-12; 10:22; ప్రకటన 2:10) దీనికి మనకు సహనం అంటే వ్యతిరేకతను తట్టుకుని నిలబడే సామర్థ్యం అవసరం. అపొస్తలుడైన పేతురు మనల్నిలా ప్రోత్సహిస్తున్నాడు: “మీ విశ్వాసమునందు . . . సహనమును . . . అమర్చుకొనుడి.” (2 పేతురు 1:5, 7) మనకు సహనం అవసరం, ఎందుకంటే యేసు ఇలా అన్నాడు: “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.”—మత్తయి 24:13.
2 మనం అనారోగ్యాన్ని, వియోగ దుఃఖాన్ని, ఇతర పరీక్షలను కూడా ఎదుర్కొంటాం. మనమొకవేళ విశ్వాసం నుండి తొలగిపోతే సాతాను ఎంతగా సంతోషిస్తాడో కదా! (లూకా 22:31, 32) యెహోవా తోడ్పాటుతో మనం వివిధ పరీక్షలను సహించవచ్చు. (1 పేతురు 5:6-11) మనం సహనంతో, అచంచలమైన విశ్వాసంతో యెహోవా దినంకోసం ఎదురుచూడవచ్చని నిరూపించే కొన్ని నిజజీవిత అనుభవాలను పరిశీలిద్దాం.
అనారోగ్యం వారిని ఆపలేదు
3 దేవుడు నేడు మనల్ని అద్భుతరీతిలో బాగుచేయడు, కానీ అనారోగ్యాన్ని తాళుకోవడానికి అవసరమైన బలాన్ని మనకిస్తాడు. (కీర్తన 41:1-3) “నాకు ఊహ తెలిసినప్పటి నుండి చక్రాల కుర్చీయే ఎల్లవేళలా నా సహచరి. పుట్టిన దగ్గర నుండి సెరెబ్రల్ పాల్సీ (మెదడుకు సంబంధించిన పక్షవాతం) నా బాల్యదశ ఆనందాల్ని హరించివేసింది” అని షారన్ చెబుతోంది. యెహోవా గురించి, పరిపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన ఆయన వాగ్దానాల గురించి తెలుసుకోవడం షారన్కు నిరీక్షణనిచ్చింది. మాట్లాడడం, నడవడం కష్టమైనా, ఆమె క్రైస్తవ పరిచర్యలో ఆనందిస్తోంది. దాదాపు 15 సంవత్సరాల క్రితం ఆమె ఇలా అంది: “నా ఆరోగ్యం అంతకంతకు క్షీణించవచ్చు, అయితే దేవునిపై నా నమ్మకం, ఆయనతో నాకున్న సంబంధం నా ప్రాణాధారంగా ఉన్నాయి. యెహోవా ప్రజల్లో ఉన్నందుకు, ఆయన నిరంతర మద్దతును కలిగివున్నందుకు నేనెంత సంతోషిస్తున్నానో!”
4 “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి” అని అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకలోని క్రైస్తవులను ప్రోత్సహించాడు. (1 థెస్సలొనీకయులు 5:14) తీవ్ర నిరాశవంటి కారకాలు కృంగుదలకు కారణమౌతాయి. షారన్ 1993లో ఇలా రాసింది: “విపరీతమైన నిరాశా భావంతో నేను . . . మూడు సంవత్సరాలు ఎంతో మానసిక కృంగుదలకు లోనయ్యాను. . . . పెద్దలనుండి నాకు ఓదార్పు, ఉపదేశం లభించాయి. . . . కావలికోట పత్రిక ద్వారా తీవ్ర మానసిక కృంగుదలకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకునేలా యెహోవా వాత్సల్యపూరితంగా నాకు సహాయం చేశాడు. అవును, ఆయన తన ప్రజలపట్ల శ్రద్ధవహిస్తూ మన భావాలను అర్థం చేసుకుంటాడు.” (1 పేతురు 5:6, 7) షారన్ యెహోవా దినంకోసం ఎదురుచూస్తూ నమ్మకంగా దేవుని సేవచేస్తూనే ఉంది.
5 కొందరు క్రైస్తవులు జీవితపు గత అనుభవాలనుబట్టి తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తారు. రెండవ ప్రపంచయుద్ధ భీకర పోరాటాన్ని చూసిన హార్లీకి యుద్ధానికి సంబంధించిన పీడకలలు వచ్చేవి. నిద్రలోనే ఆయన, “జాగ్రత్త! జాగ్రత్త!” అని అరిచేవాడు. మెలకువ వచ్చేసరికి ఆయన ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయ్యేది. అయితే ఆయన భక్తిప్రదమైన జీవితం గడపగలిగాడు, కొంతకాలానికి అలాంటి పీడకలలు తరచూ రావడం తగ్గిపోయింది.
6 బైపోలార్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ క్రైస్తవునికి ఇంటింటా ప్రకటించడం చాలా కష్టమైంది. అయితే ఆయన పట్టుదలతో ముందుకుసాగాడు, ఎందుకంటే పరిచర్య అంటే తనకూ, సానుకూలంగా స్పందించేవారికీ జీవమని ఆయన గ్రహించాడు. (1 తిమోతి 4:16) కొన్నిసార్లు ఇంటి తలుపు తట్టేందుకు కూడా చాలా కష్టపడేవాడు, అయితే ఆయనిలా చెప్పాడు: “కొద్దిసేపటికే నేను నా భావావేశాలను అదుపులోకి తెచ్చుకొని తర్వాతి ఇంటికివెళ్లి మళ్లీ ప్రయత్నిస్తాను. పరిచర్యలో కొనసాగడం ద్వారా నా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని చాలామేరకు కాపాడుకున్నాను” అని ఆయన చెప్పాడు. కూటాలకు హాజరవడం కూడా కష్టమే, అయితే ఈ సహోదరునికి ఆధ్యాత్మిక సహవాస విలువలో గట్టి నమ్మకముంది. అందువల్ల, అక్కడ ఉండేందుకు అవసరమైన ప్రయత్నం చేశాడు.—హెబ్రీయులు 10:24, 25.
7 కొంతమంది క్రైస్తవులకు కొన్ని పరిస్థితులంటే లేదా వస్తువులంటే విపరీతమైన భయం. ఉదాహరణకు, వారు అందరిలో మాట్లాడేందుకు లేదా కూటానికి హాజరయ్యేందుకు భయపడవచ్చు. అలాంటి వారికి క్రైస్తవ కూటాల్లో వ్యాఖ్యానించాలన్నా లేక దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ప్రసంగమివ్వాలన్నా ఎంత కష్టంగా ఉంటుందో ఊహించండి! అయినా వారు సహిస్తున్నారు, వారు కూటాలకు హాజరవజాన్నిబట్టి, వాటిలో భాగం వహించడాన్నిబట్టి మనం ప్రోత్సహించబడుతున్నాం.
8 భావావేశ ఇబ్బందులను సహించేందుకు ఒక వ్యక్తికి మరింత విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం సహాయం చేయవచ్చు. వైద్య సహాయం అవసరం కావచ్చు. అయితే, దేవునిపై ప్రార్థనాపూర్వకంగా ఆధారపడడం విశిష్టమైన ప్రభావం చూపించవచ్చు. “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు” అని కీర్తన 55:22 చెబుతోంది. కాబట్టి నిశ్చయంగా “నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.”—సామెతలు 3:5, 6.
వియోగ దుఃఖాన్ని సహించడం
9 మరణం కుటుంబ సభ్యులను విడదీసినప్పుడు, అలాంటి వియోగం అంతులేని దుఃఖానికి కారణమౌతుంది. అబ్రాహాము తన ప్రియమైన భార్య శారా మరణించినప్పుడు ఆమెనుగూర్చి ఏడ్చాడు. (ఆదికాండము 23:2) పరిపూర్ణుడైన యేసు కూడా తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు “కన్నీళ్లు విడిచెను.” (యోహాను 11:35) కాబట్టి మీరు ప్రేమించే ఎవరైనా చనిపోయినప్పుడు విషాదాన్ని అనుభవించడం సహజమే. అయితే పునరుత్థానముంటుందని క్రైస్తవులకు తెలుసు. (అపొస్తలుల కార్యములు 24:14-15) అందువల్ల, వారు ‘నిరీక్షణలేని ఇతరులవలే దుఃఖించరు.’—1 థెస్సలొనీకయులు 4:13.
10 వియోగ దుఃఖాన్ని మనమెలా భరించవచ్చు? బహుశా ఒక ఉపమానం సహాయం చేయవచ్చు. మన స్నేహితుడెవరైనా ఎక్కడికైనా వెళ్లినప్పుడు సాధారణంగా మనం ఎంతోకాలం విషాదంతో ఉండం, ఎందుకంటే ఆయన తిరిగివచ్చినప్పుడు ఆయనను మళ్లీ చూస్తామనే నిరీక్షణతో మనముంటాం. నమ్మకమైన క్రైస్తవుని మరణం విషయంలో అలాంటి దృక్కోణాన్నే కలిగివుండడం మన దుఃఖాన్ని తగ్గిస్తుంది, ఎందుకంటే ఆయనకు పునరుత్థాన వాగ్దానముందని మనకు తెలుసు.—ప్రసంగి 7:1.
11 “సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవునిపై” పూర్తిగా ఆధారపడడం వియోగ దుఃఖాన్ని భరించేందుకు 2 కొరింథీయులు 1:3, 4) మొదటి శతాబ్దానికి చెందిన విధవరాలైన అన్న చేసినదాని గురించి ఆలోచించడం కూడా సహాయకరంగా ఉంటుంది. ఆమె పెళ్లి చేసుకున్న ఏడు సంవత్సరాలకే విధవరాలైంది. కానీ ఆమె 84 ఏళ్ల వయసులో కూడా యెహోవా ఆలయంలో సేవచేస్తూ వచ్చింది. (లూకా 2:36-38) అలాంటి భక్తిప్రదమైన జీవితం తన దుఃఖాన్ని, ఒంటరితనాన్ని తాళుకునేందుకు ఆమెకు నిస్సందేహంగా సహాయం చేసింది. రాజ్య ప్రకటనాపనితో సహా క్రైస్తవ కార్యకలాపాల్లో క్రమంగా పాల్గొనడం వియోగ దుఃఖాన్ని భరించేందుకు మనకు సహాయం చేయగలదు.
మనకు సహాయం చేస్తుంది. (వివిధ పరీక్షలతో వ్యవహరించడం
12 కొందరు క్రైస్తవులు కుటుంబంలో పరీక్షలను సహించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, వివాహ భాగస్వామి వ్యభిచారానికి పాల్పడినప్పుడు, అది కుటుంబంపై ఎంత బాధాకరమైన ప్రభావాన్ని చూపిస్తుందో కదా! దిగ్భ్రాంతికి, దుఃఖానికి, నమ్మకద్రోహానికి గురైన వివాహ భాగస్వామి నిద్రపోలేకపోవచ్చు, తట్టుకోలేనంతగా దుఃఖించవచ్చు. చిన్నపనులు చేసుకోవడం కూడా తీవ్ర ఒత్తిడికి గురిచేయవచ్చు, తప్పులు దొర్లవచ్చు లేదా ప్రమాదాలు సంభవించవచ్చు. ద్రోహానికి గురైన వివాహ భాగస్వామి ఆహారం తినలేకపోవచ్చు, బరువు కోల్పోవచ్చు, భావోద్రేకంగా ఇబ్బందిపడవచ్చు. క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొనడం కష్టంగా ఉండవచ్చు. పిల్లలపై అదెంతో ప్రభావాన్ని చూపించవచ్చు!
13 మనమలాంటి పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు, యెహోవా మనకవసరమైన సహాయాన్ని దయచేస్తాడు. (కీర్తన 94:19) దేవుడు తన ప్రజల ప్రార్థనలను ఆలకిస్తాడు, ఈ విషయం యెహోవా ఆలయ ప్రతిష్ఠాపన సమయంలో రాజైన సొలొమోను చేసిన ప్రార్థనలో చూపించబడింది. సొలొమోను దేవునికిలా ప్రార్థించాడు: “ఇశ్రాయేలీయులగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసికొనును గదా; ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసినయెడల ప్రతి మనిషియొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాసస్థలమందు విని, క్షమించి దయచేసి యెవరి ప్రవర్తననుబట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రదుకు దినములన్నిటను వారు నీయందు భయభక్తులు కలిగియుండునట్లు చేయుము; నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలిసికొని యున్నావు.”—1 రాజులు 8:38-40.
మత్తయి 7:7-11) ఆత్మఫలాల్లో సంతోషం, సమాధానం వంటి లక్షణాలున్నాయి. (గలతీయులు 5:22) మన పరలోకపు తండ్రి మన ప్రార్థనలకు జవాబిచ్చినప్పుడు అంటే దుఃఖం స్థానంలో సంతోషం, ఆందోళన స్థానంలో సమాధానం చోటుచేసుకున్నప్పుడు అదెంత ఊరటనిస్తుందో కదా!
14 పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తూ ఉండడం ప్రత్యేకంగా సహాయకరంగా ఉండగలదు. (15 మనం తీవ్ర ఒత్తిడిని సహించాల్సి వచ్చినప్పుడు కొంతైనా చింత ఉంటుందని ఎదురుచూడవచ్చు. అయితే యేసు చెప్పిన ఈ మాటలను మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ చింతను కొంతైనా తగ్గించుకోవచ్చు: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి. . . . కాబట్టి మీరు ఆయన రాజ్యమును [దేవుని] నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:25, 33, 34) “ఆయన [దేవుడు] మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” అని అపొస్తలుడైన పేతురు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. (1 పేతురు 5:6, 7) సమస్య పరిష్కారానికి ప్రయత్నించడం మంచిదే. అయితే మనం చేయగలిగింది చేసిన తర్వాత, చింతించడానికి బదులు ప్రార్థన చేయడం మనకు సహాయం చేస్తుంది. “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును” అని కీర్తనకర్త ఆలపించాడు.—కీర్తన 37:5.
16 పౌలు ఇలా వ్రాశాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:6, 7) ఆదాము అపరిపూర్ణ సంతానం సహజంగానే చింతను పూర్తిగా తప్పించుకోలేరు. (రోమీయులు 5:12) హిత్తీయురాండ్రైన ఏశావు భార్యలు ఏశావు తల్లిదండ్రులైన దైవభక్తిగల ఇస్సాకుకు, రిబ్కాకు “మనోవేదన కలుగజేసిరి.” (ఆదికాండము 26:34, 35) తిమోతి, త్రోఫిము వంటి క్రైస్తవులకు కలిగిన అనారోగ్యం చింత కలిగించి ఉండవచ్చు. (1 తిమోతి 5:23; 2 తిమోతి 4:20) పౌలుకు తోటి విశ్వాసుల గురించిన చింత ఉండవచ్చు. (2 కొరింథీయులు 11:28) కానీ “ప్రార్థన ఆలకించువాడు” తనను ప్రేమించేవారి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు.—కీర్తన 65:2.
17 మనం యెహోవా దినంకోసం ఎదురుచూస్తుండగా, “సమాధానకర్తయగు దేవుని” మద్దతు, ఆదరణ మనకుంటాయి. (ఫిలిప్పీయులు 4:9) యెహోవా ‘కనికరము, దయగలవాడు,’ “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు,” మరియు “మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు.” (నిర్గమకాండము 34:6; కీర్తన 86:5; 103:13, 14) కాబట్టి, ‘మన విన్నపములను దేవునికి తెలియజేద్దాం’ అందువల్ల మనం “దేవుని సమాధానము”ను, అంటే మానవ అవగాహనకు మించిన మనశ్శాంతిని పొందుతాం.
18 మన ప్రార్థనలకు జవాబు దొరికినప్పుడు, దేవుడు మనతోకూడా ఉన్నాడని మనకు తెలుసు. యోబు తనకు కలిగిన పరీక్షలను సహించిన తర్వాత ఇలా అన్నాడు: “వినికిడిచేత నిన్ను [యెహోవా] గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను.” (యోబు 42:5) అవగాహన, విశ్వాసం, కృతజ్ఞత అనే నేత్రాలతో దేవుడు మనతో వ్యవహరించిన తీరును ధ్యానిస్తూ క్రితమెన్నడూ చూడని రీతిలో ఆయనను ‘చూడవచ్చు.’ అలాంటి సన్నిహితత్వం మన హృదయానికి, మనసుకు ఎంతటి సమాధానాన్ని తీసుకొస్తుందో కదా!
19 ‘మన చింత యావత్తు యెహోవామీద వేస్తే,’ మన హృదయాలకు తలంపులకు కావలివుండే అంతరంగ ప్రశాంతతతో పరీక్షలను మనం సహించవచ్చు. మన అలంకారార్థ హృదయపు లోతుల్లో, మనం చింత, భయం, కలత నుండి విముక్తి పొందుతాం. ఆందోళనతో లేదా చింతతో మన మనసు కంగారుపడదు.
20 శిష్యుడైన స్తెఫను తీవ్రమైన విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నప్పుడు ప్రశాంతతను కనబర్చాడు. ఆయన చివరిసారిగా సాక్ష్యమివ్వడానికి ముందు, న్యాయసభలో ఉన్నవారు “అతని ముఖము దేవదూత ముఖమువలె” ఉండడం చూశారు. (అపొస్తలుల కార్యములు 6:15) ఆయన ముఖం దేవుని సందేశకుడైన దేవదూత ముఖంలా ప్రశాంతంగా కనిపించింది. యేసు మరణం విషయంలో వారి దోషాన్ని స్తెఫను బహిర్గతం చేసిన తర్వాత, ఆ న్యాయాధిపతులు “కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి.” స్తెఫను “పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూ[శాడు].” ఆ దర్శనంచేత బలపర్చబడిన స్తెఫను మరణంవరకు నమ్మకస్థునిగా తనను నిరూపించుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 7:52-60) మనకు దర్శనాలు ఇవ్వబడకపోయినా, హింసించబడినప్పుడు దేవుడు అనుగ్రహించే ప్రశాంతతను మనం కూడా కలిగివుండవచ్చు.
21 రెండవ ప్రపంచ యుద్ధకాలంలో నాజీల చేతుల్లో మరణించిన కొంతమంది క్రైస్తవుల మనోభావాలు ఎలావున్నాయో పరిశీలించండి. న్యాయస్థానంలో తన అనుభవాన్ని వివరిస్తూ ఒకాయన ఇలా చెప్పాడు: “నాకు మరణ శిక్ష విధించబడింది. నేనది విని, ఆ పిమ్మట ‘మరణంవరకు నమ్మకంగా ఉండుము’ అనే మాటలతోపాటు ప్రభువు చెప్పిన మరికొన్ని మాటలు మాట్లాడిన తర్వాత, అంతా ముగిసింది. . . . ఇక దాని గురించి ఆలోచించకండి. నేనిప్పుడు ఎంత నెమ్మదిగా, ప్రశాంతంగా ఉన్నానో బహుశా మీరు ఊహించలేరు!” శిరచ్ఛేదనం ద్వారా మరణాన్ని ఎదుర్కొనబోతున్న ఒక యౌవన క్రైస్తవుడు తన తల్లిదండ్రులకు ఇలా రాశాడు: “ఇప్పటికే అర్థరాత్రి దాటింది. మనసు మార్చుకునేందుకు నాకింకా సమయముంది. ప్రభువును కాదనుకున్న తర్వాత ఈ లోకంలో నేను మళ్లీ సంతోషంగా ఉండగలనా? అది అసాధ్యం! అయితే నేను సంతోషంగా, సమాధానంగా ఈ లోకాన్ని విడిచివెళ్తున్నాననే హామీతో మీరుండవచ్చు.” యెహోవా తన యథార్థ సేవకులకు మద్దతిస్తాడనడంలో సందేహమే లేదు.
మీరు కూడా సహించగలరు!
22 మనం పరిశీలించిన కొన్ని సవాళ్లను మీరు ఎదుర్కోకపోవచ్చు. అయితే దైవభయంగల యోబు, “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును” అని సరిగానే చెప్పాడు. (యోబు 14:1) మీరు మీ పిల్లలకు ఆధ్యాత్మిక నడిపింపునిచ్చేందుకు తీవ్రంగా కృషిచేస్తున్న తల్లిగానో, తండ్రిగానో ఉండవచ్చు. వారు పాఠశాలలో ఎదురయ్యే పరీక్షలను సహించాలి, అయితే వారు యెహోవా పక్షాన, ఆయన నీతిసూత్రాల పక్షాన స్థిరంగా నిలబడినప్పుడు మీరెంత సంతోషిస్తారో కదా! బహుశా మీరు మీ ఉద్యోగ స్థలంలో కష్టాలను, శోధనలను ఎదుర్కొంటుండవచ్చు. కానీ వీటిని, ఇతర పరిస్థితులను సహించవచ్చు, ఎందుకంటే ‘యెహోవా అనుదినము మీ భారమును భరిస్తున్నాడు.’—కీర్తన 68:19.
23 నేను సగటు వ్యక్తినని మిమ్మల్ని గురించి మీరు ఆలోచిస్తుండవచ్చు, అయితే యెహోవా మీ పనిని, తన పరిశుద్ధ నామంపట్ల మీరు చూపించిన ప్రేమను ఎన్నటికీ మర్చిపోడని గుర్తుంచుకోండి. (హెబ్రీయులు 6:10) ఆయన సహాయంతో మీరు విశ్వాస పరీక్షలను సహించవచ్చు. కాబట్టి దేవుని చిత్తం చేయడాన్ని మీ ప్రార్థనల్లో, పథకాల్లో చేర్చండి. అప్పుడు మీరు సహనంతో యెహోవా దినంకోసం ఎదురుచూస్తుండగా దేవుని ఆశీర్వాదం, మద్దతు ఉంటాయనే నమ్మకంతో ఉండవచ్చు.
మీరెలా స్పందిస్తారు?
• క్రైస్తవులకు సహనం ఎందుకు అవసరం?
• అనారోగ్యాన్ని, వియోగ దుఃఖాన్ని భరించేందుకు మనకేది సహాయం చేయగలదు?
• పరీక్షలను సహించేందుకు ప్రార్థన మనకెలా సహాయం చేస్తుంది?
• సహనంతో యెహోవా దినంకోసం ఎదురుచూడడం ఎందుకు సాధ్యం?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. సహనమంటే ఏమిటి, క్రైస్తవులకు అదెందుకు అవసరం?
3, 4. అనారోగ్యంగావున్నా మనం నమ్మకంగా యెహోవాను సేవించవచ్చని చూపించే ఒక ఉదాహరణ చెప్పండి.
5. క్రైస్తవులు తీవ్రమైన ఒత్తిడిని సహించవచ్చని చూపించేందుకు ఏ రుజువు ఉంది?
6. ఒక క్రైస్తవుడు భావావేశ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు?
7. అందరిలో మాట్లాడేందుకు లేదా కూటానికి హాజరయ్యేందుకు కొందరు భయపడినా వారెలా సహనం చూపిస్తున్నారు?
8. భావావేశ ఇబ్బందులను సహించేటప్పుడు ప్రత్యేకంగా ఏది ప్రభావవంతంగా ఉంటుంది?
9-11. (ఎ) మనకు ప్రియమైనవారెవరైనా మరణించినప్పుడు కలిగే దుఃఖాన్ని భరించేందుకు మనకేది సహాయం చేయగలదు? (బి) అన్న మాదిరి, వియోగ దుఃఖాన్ని భరించేందుకు మనకెలా సహాయం చేయగలదు?
12. కొందరు క్రైస్తవులు కుటుంబ జీవితానికి సంబంధించిన ఎలాంటి పరీక్షను సహించారు?
13, 14. (ఎ) ఆలయ ప్రతిష్ఠాపనా సమయంలో సొలొమోను చేసిన ప్రార్థననుండి మీరెలాంటి ప్రోత్సాహం పొందుతున్నారు? (బి) పరిశుద్ధాత్మ కోసం మనమెందుకు ప్రార్థిస్తాం?
15. చింతను తగ్గించుకునేందుకు ఏ లేఖనాలు మనకు సహాయం చేస్తాయి?
16, 17. (ఎ) మనమెందుకు చింతను పూర్తిగా తప్పించుకోలేం? (బి) ఫిలిప్పీయులు 4:6, 7ను అన్వయించుకున్నప్పుడు మనమేమి అనుభవిస్తాం?
18. యోబు 42:5లో వ్రాయబడినట్లుగా, దేవుణ్ణి చూడడం ఎలా సాధ్యమౌతుంది?
19. ‘మన చింత యావత్తు యెహోవామీద వేస్తే’ ఏమి జరుగుతుంది?
20, 21. (ఎ) హింసించబడుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండవచ్చని స్తెఫను అనుభవం ఎలా రుజువుచేస్తోంది? (బి) పరీక్షల్ని సహిస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండవచ్చనేందుకు ఒక ఆధునిక ఉదాహరణను పేర్కొనండి.
22, 23. సహనంతో యెహోవా దినంకోసం ఎదురుచూస్తుండగా ఏ విషయంలో మీరు నమ్మకంతో ఉండవచ్చు?
[29వ పేజీలోని చిత్రం]
వియోగ దుఃఖాన్ని భరించేందుకు యెహోవాపై ఆధారపడడం మనకు తోడ్పడుతుంది
[31వ పేజీలోని చిత్రం]
విశ్వాస పరీక్షలను సహించేందుకు హృదయపూర్వక ప్రార్థన మనకు సహాయం చేస్తుంది