కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పోలాండ్‌కు “గొప్ప బహుమానం”

పోలాండ్‌కు “గొప్ప బహుమానం”

పోలాండ్‌కు “గొప్ప బహుమానం”

హోహెన్‌జోలెర్న్‌కు చెందిన ఆల్‌బ్రెక్ట్‌ అనే డ్యూక్‌, 1525 జూలై 6న లూథరనిజమ్‌ను అధికారిక మతంగా ప్రకటించాడు. ఆ విధంగా, అప్పట్లో పోలాండ్‌ రాజ్యానికి చెందిన ఇనాము ప్రాంతంగా ఉన్న డ్యూకల్‌ ప్రష్యా, యూరప్‌లో మార్టిన్‌ లూథర్‌ బోధలను అధికారికంగా స్వీకరించిన మొదటి రాష్ట్రమైంది.

తూర్పు ప్రష్యా రాజధానియైన కోనిన్స్‌బర్గ్‌ను ప్రొటస్టెంటుల సాంస్కృతిక కేంద్రంగా చేయాలని ఆల్‌బ్రెక్ట్‌ ఆశించాడు. ఆయన ఆ నగరంలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, లూథరన్‌ వ్రాతలు వివిధ భాషల్లో ముద్రించబడడానికి తోడ్పడ్డాడు. తన ప్రాంతాల్లోని పోలాండ్‌ దేశస్థులు తమ భాషలో పరిశుద్ధ లేఖనాల్లోని భాగాలు చదవబడుతున్నప్పుడు వినాలని కూడా డ్యూక్‌ 1544లో ఆజ్ఞ జారీచేశాడు. అయితే బైబిలు అప్పటికింకా పోలిష్‌ భాషలోకి అనువదించబడలేదు.

“వాడుక భాషలోకి” అనువాదం

ఈ లోటును తీర్చడానికి, ఆల్‌బ్రెక్ట్‌ క్రైస్తవ గ్రీకు లేఖనాలను పోలిష్‌ భాషలోకి అనువదించగల వ్యక్తి కోసం అన్వేషించడం ప్రారంభించాడు. ఆయన దాదాపు 1550లో, రచయిత, పుస్తక విక్రయకర్త, ముద్రణకర్త అయిన జాన్‌ సెక్లూజ్యన్‌ అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నాడు. సెక్లూజ్యన్‌ లీప్‌జిగ్‌ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు, ఆయనకు ప్రొటస్టెంటు బోధలను వ్యాప్తిచేస్తూ క్యాథలిక్‌ చర్చికి కోపం తెప్పించేవాడనే పేరుంది. వాస్తవానికి, ముందొకసారి ఆయన తన మతనమ్మకాలను ప్రచారం చేస్తున్నందుకు ఆయనపై పెట్టిన న్యాయవిచారణా కేసును తప్పించుకోవడానికి కోనిన్స్‌బర్గ్‌కు వెళ్ళాడు.

జాన్‌ సెక్లూజ్యన్‌ లేఖనాలను పోలిష్‌ భాషలోకి అనువదించాలని ఎంతో ఉత్సాహపడ్డాడు. సెక్లూజ్యన్‌ నియమింపబడిన ఒక్క సంవత్సరానికే, మత్తయి సువార్త మొదటి ప్రతులు ముద్రించబడ్డాయి. ఈ సంచికలో, కొన్ని పదబంధాలకు సంభావ్య ప్రత్యామ్నాయ అనువాద పదబంధాలను చూపించే సహాయకరమైన మార్జినల్‌ నోట్సు, సవివరమైన వ్యాఖ్యానం ఉన్నాయి. ఆ తర్వాత, సెక్లూజ్యన్‌ మొత్తం నాలుగు సువార్తలున్న సంచికను ముద్రించే పనిని పర్యవేక్షించాడు. మూడు సంవత్సరాల్లోనే, ఆయన మొత్తం క్రైస్తవ గ్రీకు లేఖనాలను ముద్రించాడు.

ఖచ్చితమైన అనువాదాన్ని తయారుచేయడానికి, అనువాదకుడు గ్రీకు మూలపాఠాలను సంప్రదించాడు. అలాగే, లాటిన్‌ అనువాదాలను, “మరితర భాషా అనువాదాలను సంప్రదించడం” కూడా జరిగిందని 1551 సంచిక ముందుమాట పేర్కొంది. స్టడీస్‌ ఆన్‌ ద పోలిష్‌ లాంగ్వేజ్‌ ఆఫ్‌ ద సిక్స్‌టీన్త్‌ సెంచురీ రచయితయైన స్టానిస్లా రోస్‌పాండ్‌ ఈ అనువాదాన్ని, “రమ్యమైన, సరళమైన” అనువాదమని అభివర్ణించాడు. “అనువాదకుడు గ్రాంథిక భాషకు” పరిమితం కాలేదని రోస్‌పాండ్‌ పేర్కొన్నాడు. బదులుగా అనువాదకుడు “వాడుక భాషకు దగ్గరగా” ఉన్న పోలిష్‌ పదాలను ఉపయోగించడానికి కృషి చేశాడు.

సెక్లూజ్యన్‌ ఈ పథకాన్ని సమన్వయపరచినప్పటికీ, ఆయన అనువాదకుడు కాదని సాక్ష్యాధారం చూపిస్తోంది. మరైతే పాండిత్యంగల ఆ అనువాదకుడెవరు? ఆ అనువాదకుని పేరు స్టానిస్లా మూర్జీనావ్‌స్కీ, ఈయనను కష్టభరితమైన ఆ పనికి సెక్లూజ్యన్‌ నియమించేనాటికి ఆయనకు దాదాపు 23 సంవత్సరాలు.

మూర్జీనావ్‌స్కీ ఒక గ్రామంలో జన్మించాడు, కానీ ఆయన పెద్దవాడైన తర్వాత ఆయన తండ్రి ఆయనను గ్రీకు హీబ్రూ భాషల అధ్యయనం ప్రారంభించడానికి కోనిన్స్‌బర్గ్‌కు పంపించాడు. ఆ తర్వాత ఆయన జర్మనీలోని విట్టన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో చేరాడు, బహుశా అక్కడే ఆయన మార్టిన్‌ లూథర్‌ను కలిసి ఉంటాడు. ఈ యువ విద్యార్థి ఫిలిప్‌ మెలాన్క్‌తాన్‌ ప్రసంగాలను విన్నాడు, తప్పకుండా ఈయనే గ్రీకు, హీబ్రూ భాషల్లో ప్రావీణ్యం సాధించడానికి ఆయనకు సహాయం చేసి ఉంటాడు. మూర్జీనావ్‌స్కీ ఇటలీలో తన చదువులు ముగించుకుని కోనిన్స్‌బర్గ్‌కు తిరిగివచ్చి, ఆల్‌బ్రెక్ట్‌ డ్యూక్‌కు తన సేవలను అందించాడు.

“మూర్జీనావ్‌స్కీ శ్రద్ధగా, సమర్థవంతంగా పనిచేశాడు. అయితే ఆయన ఎప్పుడూ తనవైపుకు అవధానం మళ్ళించుకోలేదు, ప్రముఖస్థానం కోసం ప్రయత్నించలేదు లేదా అనువాదపు టైటిల్‌ పేజీలో తన పేరు ముద్రించాలనీ కోరలేదు” అని ద బైబిల్‌ ఇన్‌ ద పోలిష్‌ లాంగ్వేజ్‌ అనే తన పుస్తకంలో మారియా కొస్సోవస్కా వ్రాసింది. వాస్తవానికి ఈ యౌవనస్థుడు తన సొంత సామర్థ్యాల గురించి ఇలా వ్రాశాడు: “నాకు లాటిన్‌లో గానీ, పోలిష్‌లో గానీ వ్రాయడం అంతంత మాత్రమే వచ్చు.” మూర్జీనావ్‌స్కీకు సందేహాలున్నా ఆయన పోలిష్‌ ప్రజలకు దేవుని వాక్యాన్ని అందుబాటులోకి తేవడంలో కీలకపాత్ర వహించాడు. ఆయన సహవాసియైన సెక్లూజ్యన్‌ తాము రూపొందించిన అనువాదం పోలాండ్‌కు “గొప్ప బహుమానం” అని వర్ణించాడు.

అతిగొప్ప బహుమానాల్లో ఒకటి

బైబిలు మొదటిసారి పోలిష్‌ భాషలోకి అనువదించబడిన తర్వాత, ఇతరులు కూడా ఆ భాషలోకి బైబిలును అనువదించారు. 1994లో క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతనలోక అనువాదము, ఆ తర్వాత 1997లో మొత్తం పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము పోలిష్‌ భాషలో విడుదల చేయబడ్డాయి. తమవైపుకు అవధానం మళ్లించుకోని అనువాదకులు ఖచ్చితమైన విధంగానే కాక, పదహారవ శతాబ్దపు వాడుక భాషకు కాదు గానీ నేటి వాడుక భాషకు దగ్గరగా ఉన్న భాషలో దాన్ని అందజేయడానికి కృషిచేశారు.

నేడు బైబిలు మొత్తంగా గానీ, కొంతభాగంగా గానీ దాదాపు 2,400 భాషల్లో అందుబాటులో ఉంది. మీరు మీ సొంత భాషలో దేవుని వాక్యపు ఖచ్చితమైన అనువాదాన్ని పొందగలిగితే, అది మీరు అందుకోగల అతిగొప్ప బహుమానాల్లో ఒకటి, అది మీ నిర్దేశం కోసం యెహోవా దేవుడు అనుగ్రహించిన బహుమానం.—2 తిమోతి 3:15-17.

[20వ పేజీలోని చిత్రం]

“క్రొత్త నిబంధన” గ్రంథాన్ని పోలిష్‌ భాషలోకి అనువదించిన స్టానిస్లావ్‌ మూర్జీనావ్‌స్కీ స్మారకచిహ్నం

[21వ పేజీలోని చిత్రం]

స్టానిస్లావ్‌ మూర్జీనావ్‌స్కీ అనువదించిన మత్తయి పుస్తకంలోని 3వ అధ్యాయం

[చిత్రసౌజన్యం]

Dziȩki uprzejmości Towarzystwa Naukowego Plockiego