‘మీ తండ్రి కనికరముగలవాడు’
‘మీ తండ్రి కనికరముగలవాడు’
“మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై యుండుడి.”—లూకా 6:36.
మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో దాదాపు 600 ఆజ్ఞలు, నియమాలు ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞల్ని పాటించాల్సివున్నా, కనికరం చూపించడం కూడా అత్యంత ప్రాముఖ్యం. కనికరంలేని స్వభావాన్ని కనబర్చిన పరిసయ్యులతో యేసు పలికిన మాటలను పరిశీలించండి. “కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను” అని దేవుడు ఆజ్ఞాపించిన దానిని సూచిస్తూ రెండు సందర్భాల్లో ఆయన వారిని గద్దించాడు. (మత్తయి 9:10-13; 12:1-7; హోషేయ 6:6) యేసు తన పరిచర్య ముగింపులో ఇలా అన్నాడు: “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి.”—మత్తయి 23:23.
2 నిశ్చయంగా యేసు కనికరాన్ని అత్యంత ప్రాముఖ్యమైన లక్షణంగా పరిగణించాడు. ఆయన తన అనుచరులకిలా చెప్పాడు: “మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై యుండుడి.” (లూకా 6:36) అయితే ఈ విషయంలో ‘దేవునిపోలి నడుచుకునేందుకు’ మనం నిజమైన కనికరమంటే ఏమిటో తెలుసుకోవాలి. (ఎఫెసీయులు 5:1) అంతేకాక, కనికరం యొక్క ప్రయోజనాలను అర్థం చేసుకోవడం మన జీవితాల్లో ఈ లక్షణాన్ని మరి ఎక్కువగా కనబర్చేందుకు మనల్ని పురికొల్పుతుంది.
అవసరంలో ఉన్నవారిపట్ల కనికరం చూపించడం
3 కీర్తనకర్త ఇలా ఆలపించాడు: “యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీదనున్నవి.” (కీర్తన 145:8, 9) యెహోవా “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు.” (2 కొరింథీయులు 1:3) కనికరంగల వ్యక్తి ఇతరులతో దయగా వ్యవహరిస్తాడు. ఇది దేవుని వ్యక్తిత్వంలో ప్రధానాంశం. ఆయన మాదిరి, ఆయన మనకిచ్చిన ఆదేశాలు నిజమైన కనికరమంటే ఏమిటో మనకు బోధిస్తాయి.
4యెషయా 49:15లో వ్రాయబడినట్లుగా, యెహోవా ఇలా అంటున్నాడు: “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా?” ఇక్కడ ‘కరుణ’ అని అనువదించబడిన పదానికి దగ్గరి సంబంధమున్న హీబ్రూ పదాలు పైన ఉల్లేఖించబడిన కీర్తన 145:8, 9లో, కనికరానికి సంబంధించి ఉపయోగించబడ్డాయి. కనికరపడేలా యెహోవాను పురికొల్పే భావావేశం సాధారణంగా, పాలిచ్చే తల్లికి తన బిడ్డపట్ల ఉండే వాత్సల్యభావానికి పోల్చబడింది. బిడ్డకు ఆకలి వేయవచ్చు లేదా వేరే అవసరం ఏర్పడవచ్చు. తనలో ఉత్పన్నమయ్యే వాత్సల్యంతో లేదా కరుణతో పురికొల్పబడిన ఆ తల్లి తన బిడ్డ అవసరాలు తీరుస్తుంది. తాను కనికరం చూపించేవారిపట్ల యెహోవాకు అలాంటి వాత్సల్య భావాలే ఉన్నాయి.
5 కనికరపడడం ఒక విషయమైతే, అవసరంలో ఉన్నవారి ప్రయోజనార్థం దానికి అనుగుణంగా చర్య తీసుకోవడం మరో విషయం. దాదాపు 3,500 సంవత్సరాల క్రితం తన ఆరాధకులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా ఎలా స్పందించాడో పరిశీలించండి. ఆయన మోషేతో ఇలా అన్నాడు: “నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు . . . పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి యున్నాను.” (నిర్గమకాండము 3:7, 8) ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించబడిన దాదాపు 500 సంవత్సరాల తర్వాత యెహోవా వారికిలా గుర్తుచేశాడు: “నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశములోనుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండియు, మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశములో నుండియు విడిపించితిని.” (1 సమూయేలు 10:18) దేవుని నీతి ప్రమాణాలనుండి వైదొలగినందున ఇశ్రాయేలీయులు తరచూ దుఃఖకర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, యెహోవా వారిపై కనికరపడి, పదేపదే వారిని రక్షించాడు. (న్యాయాధిపతులు 2:11-16; 2 దినవృత్తాంతములు 36:15) అవసరంలో, అపాయంలో లేదా కష్టంలో ఉన్నవారి విషయంలో ప్రేమగల దేవుడెలా స్పందిస్తాడో ఇది ఉదాహరిస్తోంది. యెహోవా “కరుణాసంపన్నుడు.”—ఎఫెసీయులు 2:4.
6 యేసుక్రీస్తు భూమ్మీద జీవించిన కాలంలో, కనికరం చూపించడంలో తన తండ్రిని పరిపూర్ణంగా అనుకరించాడు. ఇద్దరు గ్రుడ్డివారు, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుము” అని వేడుకున్నప్పుడు యేసు ఎలా స్పందించాడు? అద్భుతరీతిలో తమకు చూపు తిరిగి రప్పించమని వారు యేసును యాచిస్తున్నారు. యేసు అలాగే చేశాడు, అయితే ఆయన ఏ విధమైన సానుభూతి లేకుండా ఆ అద్భుతం చేయలేదు. “యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొందిరి” అని బైబిలు చెబుతోంది. (మత్తయి 20:30-34) గ్రుడ్డివారికి, దయ్యం పట్టినవారికి, కుష్ఠరోగులకు, వ్యాధిగ్రస్థ పిల్లలున్న తల్లిదండ్రులకు ఉపశమనం తీసుకొచ్చేలా అనేక అద్భుతాలు చేయడానికి కనికరమే యేసును పురికొల్పింది.—మత్తయి 9:27; 15:22; 17:15; మార్కు 5:18, 19; లూకా 17:12, 13.
7 కనికరం చూపించడంలో యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఉంచిన మాదిరి, కనికరానికి ఈ రెండు అంశాలున్నట్లు చూపిస్తున్నాయి: అవసరంలో ఉన్నవారిపట్ల కనికరభావం, సానుభూతి లేదా జాలి చూపించడమే కాక, వారికి ఉపశమనం కలిగించే చర్య తీసుకోవడం. కనికరం చూపించేందుకు ఈ రెండు అంశాలు అవసరం. లేఖనాల్లో, కనికరం అత్యంత తరచుగా అవసరంలో ఉన్నవారిపట్ల క్షేమాభివృద్ధికరమైన సానుకూల వైఖరిని సూచిస్తోంది. అయితే న్యాయసంబంధ విషయాల్లో కనికరాన్ని ఎలా చూపించవచ్చు? దానిలో ప్రతికూల చర్యగా దృష్టించబడే అవకాశమున్నది అంటే శిక్షించకుండా వదిలేయడం వంటిది కూడా ఇమిడివుందా?
తప్పిదస్థులపట్ల కనికరం
8 ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు బత్షెబతో చేసిన వ్యభిచారం గురించి ప్రవక్తయైన నాతాను నేరుగా దావీదుతో ప్రస్తావించిన తర్వాత ఏమి జరిగిందో పరిశీలించండి. పశ్చాత్తప్త దావీదు ఇలా ప్రార్థించాడు: “దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. కీర్తన 51:1-4.
నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను, నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను.”—9 దావీదు తీవ్ర వేదన అనుభవించాడు. యెహోవా ఆయన పాపాన్ని క్షమించి ఆయనకు, బత్షెబకు తీర్పు అమలు చేయకుండా నిగ్రహం చూపించాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, దావీదు బత్షెబ ఇద్దరూ మరణ శిక్ష అనుభవించాల్సింది. (ద్వితీయోపదేశకాండము 22:22) వారు తమ పాప పర్యవసానాలన్నింటినీ తప్పించుకోకపోయినా, వారి ప్రాణాలు రక్షించబడ్డాయి. (2 సమూయేలు 12:13) దేవుడు కనికరం చూపించడంలో తప్పు క్షమించడం కూడా ఇమిడివుంది. అయితే ఆయన సముచితమైన శిక్ష విధించకుండా ఉండడు.
10 ‘ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపము లోకములో ప్రవేశించింది’ మరియు “పాపమువలన వచ్చు జీతము మరణము” కాబట్టి, మానవులందరూ మరణించాల్సిందే. (రోమీయులు 5:12; 6:23) తీర్పు తీర్చేటప్పుడు యెహోవా కనికరం చూపిస్తున్నందుకు మనమెంత కృతజ్ఞత కలిగివుండవచ్చో కదా! అయితే దేవుని కనికరాన్ని తేలికగా తీసుకోకుండా మనం జాగ్రత్తపడాలి. “ఆయన చర్యలన్నియు న్యాయములు” అని ద్వితీయోపదేశకాండము 32:4 చెబుతోంది. దేవుడు కనికరం చూపించేటప్పుడు తన పరిపూర్ణ న్యాయ ప్రమాణాలను ఉపేక్షించడు.
11 దావీదు, బత్షెబల విషయంలో మరణశిక్షకు సంబంధించిన తీర్పును తగ్గించడానికి ముందు వారి పాపం క్షమించబడాలి. ఇశ్రాయేలు న్యాయాధిపతులకు అలా క్షమించే అధికారం లేదు. ఆ వ్యాజ్యాన్ని విచారించేందుకు వారిని అనుమతిస్తే, మరణశిక్ష విధించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం వారికుండేది కాదు. ధర్మశాస్త్రం మరణశిక్షనే ఆదేశించింది. అయితే దావీదుతో తానుచేసిన నిబంధననుబట్టి దావీదు పాపాన్ని క్షమించడానికి ఆధారముందేమో చూసేందుకు యెహోవా ఇష్టపడ్డాడు. (2 సమూయేలు 7:12-16) కాబట్టి “హృదయ పరిశోధనచేయుచు,” “సర్వలోకమునకు తీర్పు తీర్చు” యెహోవా దేవుడు వారి విషయంలో స్వయంగా తీర్పు తీర్చేందుకు నిర్ణయించుకున్నాడు. (ఆదికాండము 18:25; 1 దినవృత్తాంతములు 29:17) దేవుడు దావీదు హృదయాన్ని నిశితంగా పరిశీలించి, ఆయన పశ్చాత్తాప నిజత్వాన్ని తెలుసుకొని ఆయనను క్షమించగలిగాడు.
12 వారసత్వ పాపాన్నిబట్టి సంక్రమించే మరణశిక్ష నుండి మన విడుదలను సాధ్యం చేయడం ద్వారా యెహోవా మనపై చూపించే కనికరం ఆయన న్యాయానికి అనుగుణంగా ఉంది. న్యాయ ఉల్లంఘన జరగకుండానే మనకు పాప క్షమాపణను సాధ్యం చేసేందుకు యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు విమోచన మత్తయి 20:28; రోమీయులు 6:22, 23) వారసత్వ పాపాన్నిబట్టి కలిగే మరణశిక్ష నుండి మనల్ని రక్షించగల దేవుని కనికరం నుండి మనం ప్రయోజనం పొందాలంటే, మనం ‘కుమారునియందు విశ్వాసముంచాలి.’—యోహాను 3:16, 36.
క్రయధన బలిని ఏర్పాటు చేశాడు, కనికరం చూపించడంలో ఇంతకు మించిన వ్యక్తీకరణ మరొకటి లేదు. (కనికరం, న్యాయంగల దేవుడు
13 యెహోవా కనికరం ఆయన న్యాయ ప్రమాణాల్ని ఉల్లంఘించకపోయినా, అది ఏదోక రీతిలో ఆయన న్యాయాన్ని ప్రభావితం చేస్తుందా? కనికరం దేవుని న్యాయ తీవ్రతను మితంచేస్తూ దాని ప్రభావాన్ని తగ్గిస్తుందా? తగ్గించదు.
14 హోషేయ ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతినిబట్టి తీర్పుతీర్చుటవలనను, దయాదాక్షిణ్యములు చూపుటవలనను నిన్ను ప్రధానము చేసికొందును.” (హోషేయ 2:19) ఈ మాటలు యెహోవా చూపించే కనికరం, ఎల్లప్పుడూ న్యాయంతోసహా ఆయన ఇతర లక్షణాలకు అనుగుణంగా ఉంటుందని స్పష్టంగా చూపిస్తున్నాయి. “యెహోవా కనికరము, దయ . . . చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు.” (నిర్గమకాండము 34:6, 7) యెహోవా కనికరం, న్యాయంగల దేవుడు. ఆయన గురించి బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు.” (ద్వితీయోపదేశకాండము 32:4) దేవుని కనికరంలాగే ఆయన న్యాయమూ పరిపూర్ణమైనది. ఏదీ ఒకదానికన్నా మరొకటి ఎక్కువకాదు లేదా ఒకదాని ప్రభావాన్ని మరొకటి తగ్గించదు. బదులుగా ఈ రెండు లక్షణాలు పరస్పరం పరిపూర్ణ పొందికతో పనిచేస్తాయి.
15 యెహోవా న్యాయం కఠినమైనది కాదు. న్యాయానికి దాదాపు అన్ని సందర్భాల్లోనూ చట్టపరమైన విషయాలతో సంబంధం ఉంటుంది, న్యాయతీర్పు సాధారణంగా తప్పిదస్థులకు తగిన ప్రతిదండన విధించడాన్ని కోరుతుంది. కానీ దేవుని న్యాయంలో అర్హులైనవారికి రక్షణకూడా లభిస్తుంది. ఉదాహరణకు, సొదొమ గొమొఱ్ఱా పట్టణాల్లోని దుష్టులు నాశనం చేయబడినప్పుడు, పితరుడైన లోతు ఆయన ఇద్దరు కుమార్తెలు రక్షించబడ్డారు.—ఆదికాండము 19:12-26.
16 ప్రస్తుత దుష్ట విధానానికి యెహోవా తీర్పు తీర్చినప్పుడు, “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసుకొనిన” సత్యారాధకుల “గొప్పసమూహము” తప్పించుకుంటుందని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. ఆ విధంగా, వారు “మహాశ్రమల నుండి” ప్రాణాలతో బయటపడతారు.—ప్రకటన 7:9-14.
కనికరం ఎందుకు చూపించాలి?
17 అవును, యెహోవా, యేసుక్రీస్తుల ఉదాహరణలు నిజమైన కనికరమంటే ఏమిటో మనకు బోధిస్తాయి. కనికరం చూపించేందుకు మనకున్న ప్రాథమిక కారణాన్ని సూచిస్తూ సామెతలు 19:17 ఇలా చెబుతోంది: “బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.” మన పరస్పర వ్యవహారాల్లో కనికరం చూపించడం ద్వారా తనను, తన కుమారుణ్ణి అనుకరించడం యెహోవాను సంతోషపరుస్తుంది. (1 కొరింథీయులు 11:1) ఇతరులు కూడా కనికరం చూపించేందుకు ప్రోత్సహించబడతారు, ఎందుకంటే మనం కనికరం చూపిస్తే ఇతరులు కూడా చూపిస్తారు.—లూకా 6:38.
18 కనికరంలో అనేక చక్కని లక్షణాలు మిళితమై ఉన్నాయి. దానిలో కృప, ప్రేమ, దయ, మంచితనం ఉన్నాయి. కనికరం చూపించేందుకు వాత్సల్య భావాలు లేదా సానుభూతి పురికొల్పునిస్తాయి. దైవిక కనికరంలో న్యాయంతో రాజీపడడం ఉండకపోయినా, తప్పిదస్థులు పశ్చాత్తాపం చూపించేందుకు యెహోవా దీర్ఘశాంతంతో, ఓపికతో వారికి తగినంత సమయమిస్తాడు. (2 పేతురు 3:9, 10) ఆ విధంగా కనికరం ఓపికకు, దీర్ఘశాంతానికి ముడిపడివుంది. దేవుని ఆత్మఫలాల్లోని అనేక అంశాలతోసహా కోరదగిన ఇంకా అనేక లక్షణాలతో సమ్మిళితమైన కనికరం ఆ లక్షణాలను అలవర్చుకునే అవకాశాన్నిస్తుంది. (గలతీయులు 5:22) కాబట్టి, కనికరం చూపించేందుకు మనం కృషిచేయడం ఎంత ప్రాముఖ్యమో కదా!
“కనికరముగలవారు ధన్యులు”
19 మన జీవితాల్లో కనికరం ఎందుకు ఆవశ్యకమైన లక్షణంగా ఉండాలో శిష్యుడైన యాకోబు మనకు చెబుతున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “కనికరము తీర్పును మించి అతిశయపడును.” (యాకోబు 2:13బి) యెహోవా ఆరాధకుడు ఇతరులపట్ల చూపించే కనికరం గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి “తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవ[లసిన]” సమయమొచ్చినప్పుడు, ఆ వ్యక్తి కనికరంతో వ్యవహరించిన సందర్భాలను యెహోవా పరిగణలోకి తీసుకొని తన కుమారుని విమోచన క్రయధన బలి ఆధారంగా ఆయనను క్షమించినప్పుడు అది తీర్పును మించి అతిశయపడుతుంది. (రోమీయులు 14:11-12) బత్షెబతో చేసిన పాపం విషయంలో దావీదు కనికరించబడేందుకు ఒక కారణం, నిస్సందేహంగా ఆయన ఇతరులపట్ల కనికరం చూపించడమే. (1 సమూయేలు 24:4-7) మరోవైపు, “కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును.” (యాకోబు 2:13ఎ) “నిర్దయులు” లేదా కనికరం లేనివారు “మరణమునకు తగినవారు” అని దేవుడు దృష్టించేవారిలో ఉన్నారంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.—రోమీయులు 1:31, 32.
20 కొండమీది ప్రసంగంలో యేసు ఇలా అన్నాడు: “కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.” (మత్తయి 5:7) దేవుని కనికరాన్ని కోరుకునేవారు తాము కనికరం చూపించేవారిగా ఉండాలని ఆ మాటలు ఎంత బలంగా నొక్కిచెబుతున్నాయో కదా! దైనందిన జీవితంలో మనమెలా కనికరం చూపిస్తూ ఉండవచ్చో తర్వాతి ఆర్టికల్ చర్చిస్తుంది.
మీరేమి తెలుసుకున్నారు?
• కనికరమంటే ఏమిటి?
• కనికరం ఏయే విధాలుగా కనపర్చబడుతుంది?
• యెహోవా కనికరం, న్యాయంగల దేవుడని ఎలా చెప్పవచ్చు?
• మనమెందుకు కనికరం చూపించాలి?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. యేసు శాస్త్రులు, పరిసయ్యులతోను, తన అనుచరులతోను మాట్లాడిన మాటలు, కనికరం కోరదగిన లక్షణమని ఎలా చూపిస్తున్నాయి?
3. నిజమైన కనికరమంటే ఏమిటో తెలుసుకునేందుకు మనమెందుకు యెహోవావైపు చూడాలి?
4. యెషయా 49:15 కనికరం గురించి మనకేమి బోధిస్తోంది?
5. ఇశ్రాయేలీయులపట్ల తాను ‘కరుణాసంపన్నునిగా’ ఉన్నట్లు యెహోవా ఎలా చూపించాడు?
6. కనికరం చూపించడంలో యేసుక్రీస్తు తన తండ్రినెలా అనుకరించాడు?
7. కనికరం విషయంలో యెహోవా దేవుని, ఆయన కుమారుని ఉదాహరణలు మనకేమి బోధిస్తున్నాయి?
8, 9. బత్షెబతో వ్యభిచరించిన తర్వాత దావీదుపట్ల చూపించబడిన కనికరంలో ఏమి ఇమిడివుంది?
10. తీర్పు విధించేటప్పుడు యెహోవా కనికరం చూపించినా, ఆయన కనికరాన్ని మనమెందుకు తేలికగా తీసుకోకూడదు?
11. బత్షెబతో దావీదు చేసిన పాపంతో వ్యవహరించే విషయంలో యెహోవా ఎలా సముచితంగా న్యాయం తీర్చాడు?
12. పాపులైన మానవులు దేవుని కనికరం నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?
13, 14. దేవుని కనికరం ఆయన న్యాయాన్ని ప్రభావితం చేస్తుందా? వివరించండి.
15, 16. (ఎ) దేవుని న్యాయం కఠినమైనది కాదని ఏది చూపిస్తోంది? (బి) ఈ దుష్ట విధానానికి యెహోవా తీర్పు తీర్చినప్పుడు ఆయన ఆరాధకులు దేనిగురించి నిశ్చయత కలిగివుండవచ్చు?
17. కనికరం చూపించేందుకు ప్రాథమిక కారణమేమిటి?
18. కనికరం చూపించేందుకు మనమెందుకు కృషిచేయాలి?
19, 20. ఏ విధంగా కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది?
[21వ పేజీలోని చిత్రం]
అవసరంలో ఉన్నవారిపట్ల యెహోవాకున్న వాత్సల్యం, ఒక తల్లికి తన బిడ్డపట్ల ఉండే వాత్సల్యంలా ఉంటుంది
[23వ పేజీలోని చిత్రం]
యేసు చేసిన అద్భుతాల నుండి కనికరాన్ని గురించి మనమేమి తెలుసుకుంటాం?
[24వ పేజీలోని చిత్రం]
యెహోవా దావీదుపై కనికరం చూపించడం ద్వారా తన న్యాయాన్ని ఉల్లంఘించాడా?
[25వ పేజీలోని చిత్రం]
పాపులైన మానవులపట్ల దేవుడు చూపించే కనికరం ఆయన న్యాయానికి అనుగుణంగా ఉంది