మీరు ఇతరులకు ఊరటనిచ్చేవారిగా ఉంటున్నారా?
మీరు ఇతరులకు ఊరటనిచ్చేవారిగా ఉంటున్నారా?
యాన్టీ లెబనన్ పర్వతశ్రేణికి దక్షిణవైపు చివరిలో హెర్మోను కొండ ఉంది. అబ్బురపరిచే దాని శిఖరం సముద్ర మట్టానికి 2,814 మీటర్ల ఎత్తులో ఉంది. దాదాపు సంవత్సరమంతటా హెర్మోను శిఖరం మంచుతో కప్పబడివుంటుంది, అందువల్ల రాత్రివేళ దానిమీదుగా వీచే వెచ్చని ఆవిరి ఘనీభవించి మంచుబిందువులుగా ఏర్పడుతుంది. ఆ మంచు బిందువులు పర్వతపు ఏటవాలు ప్రాంతాల్లో ఉండే చెట్లపైన, దిగువన ఉండే ద్రాక్షతోటలపైన కురుస్తాయి. ప్రాచీన ఇశ్రాయేలులో దీర్ఘకాలంపాటువుండే వేసవి కాలంలో ప్రాముఖ్యంగా ఈ మంచు బిందువులవల్లే పంటలకు తేమ లభిస్తుంది.
దైవ ప్రేరణతో రాయబడిన ఒక పాటలో యెహోవా ఆరాధకుల మధ్య ఉండే క్షేమాభివృద్ధికరమైన ఐకమత్యం “సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు”తో పోల్చబడింది. (కీర్తన 133:1, 3) హెర్మోను పర్వతం మీది మంచు బిందువులు ఎలా పంటచేలకు తేమనిస్తాయో, అలాగే మనం కూడా ఇతరులకు ఊరటనిచ్చేవారిగా ఉండవచ్చు. ఇతరులకు మనమెలా ఊరటనివ్వవచ్చు?
ఊరటనిచ్చే యేసు మాదిరి
యేసుక్రీస్తు ఇతరుల్ని ఎంతో ప్రభావితం చేశాడు. ఆయనతో గడిపే కొద్ది సమయం కూడా ఎంతో ఊరటనిచ్చేది. ఉదాహరణకు సువార్త రచయిత మార్కు ఇలా చెబుతున్నాడు: “[యేసు] బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.” (మార్కు 10:16) ఆ పిల్లలకు అదెంత ఊరటనిచ్చి ఉంటుందో కదా!
భూమ్మీద మానవునిగా ఉన్న చివరి రాత్రి యేసు తన శిష్యుల కాళ్లను కడిగాడు. ఆయన వినయం వారి హృదయాలను కదిలించివుంటుంది. యేసు వారితో, “నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని” అని చెప్పాడు. (యోహాను 13:1-17) అవును, వారు కూడా వినయస్థులుగా ఉండాలి. అపొస్తలులు వెంటనే ఆ విషయాన్ని గ్రహించలేకపోయినా, అదే రాత్రి ఎవరు తమలో గొప్పవారని వాదులాడుకున్నా యేసు వారిని కోప్పడలేదు. బదులుగా ఆయన ఓపికగా వారితో తర్కించాడు. (లూకా 22:24-27) “[యేసు] దూషింపబడియు బదులు దూషింపలేదు.” నిజానికి “ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.” ఊరటనిచ్చే యేసు మాదిరి అనుసరణీయమైనది!—1 పేతురు 2:21, 23.
యేసు, “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును” అని చెప్పాడు. (మత్తయి 11:29) నేరుగా యేసు నుండే నేర్చుకోవడాన్ని ఊహించుకోండి! ఆయన స్వగ్రామంలోని వారు ఆయన తమ సమాజమందిరంలో బోధించడాన్ని విన్న తర్వాత, “ఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతని కెక్కడనుండి వచ్చినవి” అని ఆశ్చర్యపోయారు. (మత్తయి 13:54) యేసు జీవితం, పరిచర్య గురించి చదవడం ద్వారా ఇతరులకు ఎలా ఊరటను ఇవ్వవచ్చనే విషయం గురించి ఎంతో నేర్చుకోవచ్చు. యేసు ప్రోత్సాహకరమైన మాటల ద్వారా, సహాయం చేయాలనే వైఖరి కలిగివుండడం ద్వారా ఎలా ఉత్తమమైన మాదిరినుంచాడో పరిశీలిద్దాం.
ప్రోత్సాహకరమైన సంభాషణ
ఒక కొత్త ఇల్లును కట్టడంకన్నా దాన్ని పడగొట్టడమే చాలా సులభం. అదే సూత్రం మన మాటలకు కూడా వర్తిస్తుంది. అపరిపూర్ణ మానవులుగా మనమందరం పొరపాట్లు చేస్తూవుంటాం. “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు” అని రాజైన సొలొమోను అన్నాడు. (ప్రసంగి 7:20) అవతలి వ్యక్తిలోని లోపాల్ని కనిపెట్టి సూదుల్లాంటి మాటలతో ఆయనను కృంగదీయడం చాలా సులభం. (కీర్తన 64:2-4) కానీ, ప్రోత్సాహకరంగా మాట్లాడడానికి కృషి అవసరం.
లూకా 8:1) తన శిష్యులైనవారికి తన పరలోక తండ్రిని గురించి చెప్పడం ద్వారా ఆయన వారికి కూడా ఊరటనిచ్చాడు. (మత్తయి 11:25-27) అందుకే ప్రజలు యేసువైపు ఆకర్షించబడేవారు.
యేసు ఇతరులను ప్రోత్సహించేలా మాట్లాడాడు. వారికి రాజ్య సువార్త ప్రకటించడం ద్వారా వారికి ఆధ్యాత్మికంగా ఊరటనిచ్చాడు. (యేసుకు పూర్తి భిన్నంగా శాస్త్రులు, పరిసయ్యులు ఇతరుల అవసరాల్ని పట్టించుకునేవారు కాదు. వారు “విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను” కోరుకుంటారని యేసు చెప్పాడు. (మత్తయి 23:6, 7) నిజానికి వారు సాధారణ ప్రజలను చిన్నచూపు చూస్తూ “ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని” అనేవారు. (యోహాను 7:49) వారి వైఖరి ఏమాత్రం ఊరటనిచ్చేదిగా లేదు!
మన మాటలు తరచూ మన మనసులోని భావాలకు, ఇతరుల గురించి మనకున్న అభిప్రాయాలకు అద్దంపడతాయి. “సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును” అని యేసు చెప్పాడు. (లూకా 6:45) మరి మన మాటలు ఇతరులకు ఊరటనిచ్చేవిగా ఉండాలంటే మనమేమి చేయవచ్చు?
ఒక సలహా ఏమిటంటే, మనం మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. “నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును” అని సామెతలు 15:28 చెబుతోంది. అలా యుక్తమైన జవాబివ్వడానికి చాలాసేపు ఆలోచించాల్సిన అవసరం లేదు. మాట్లాడే ముందు కాస్త ఆలోచిస్తే మన మాటల ప్రభావం ఎలా ఉంటుందో మనం గ్రహించవచ్చు. మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను ఫలానా విధంగా మాట్లాడడం ప్రేమపూర్వకంగా ఉంటుందా? నేను చెప్పేది నిజమేనా లేక అవి గాలికబుర్లా? అవి ‘సమయోచితమైన మాటలేనా’? నేను మాట్లాడే వ్యక్తికి నా మాటలు ఊరటనిస్తాయా?’ (సామెతలు 15:23) మనం మాట్లాడబోయేది మంచిది కాదు లేదా అది చెప్పడానికి సరైన సమయం కాదు అని మనకనిపిస్తే, అలా చేయకుండా ఉండడానికి మనం శాయశక్తులా ప్రయత్నిద్దాం. అలా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నిస్తూనే ప్రోత్సాహకరమైన, సమయోచితమైన విధంగా మాట్లాడడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? అనాలోచితంగా పలికే మాటలు “కత్తిపోటువంటివి,” అయితే మంచి మాటలు “ఆరోగ్యదాయకము.”—సామెతలు 12:18.
మరో సలహా ఏమిటంటే, దేవుడు మన తోటి విశ్వాసుల్లోని ఏ లక్షణాలనుబట్టి వారిని విలువైనవారిగా పరిగణిస్తున్నాడో, ఆ లక్షణాల గురించి ఆలోచించండి. “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” అని యేసు అన్నాడు. (యోహాను 6:44) యెహోవా తనకు నమ్మకంగా ఉండే ప్రతీ సేవకునిలో, చివరికి ఇతరులతో పొసగని వ్యక్తి అని మనకు అనిపించే వ్యక్తిలో కూడా మంచి లక్షణాలను చూస్తాడు. ఇతరుల్లోని మంచి లక్షణాలను గుర్తించడానికి కృషి చేసినప్పుడు, వారి గురించి మనం మంచిగా మాట్లాడగలుగుతాం.
ఇతరులకు సహాయపడండి
అణచివేయబడిన ప్రజల పరిస్థితిని యేసు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. నిజానికి, “ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున మత్తయి 9:36) యేసు వారి దుస్థితిని చూడడం మాత్రమే కాదు ఆ విషయంలో సహాయక చర్య కూడా తీసుకున్నాడు. ఆయన వారిని, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అని ఆహ్వానించాడు. అంతేకాక, “నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి” అనే హామీనిచ్చాడు.—మత్తయి 11:28, 30.
వారిమీద కనికరప[డ్డాడు].” (నేడు మనం ‘అపాయకరమైన కాలాల్లో’ జీవిస్తున్నాం. (2 తిమోతి 3:1) అనేకమంది “ఐహికవిచారము”వల్ల మానసికంగా కృంగిపోతున్నారు. (మత్తయి 13:22) ఇతరులు వ్యక్తిగత పరిస్థితులు సరిగా లేక బాధపడుతున్నారు. (1 థెస్సలొనీకయులు 5:14) అవసరంలో ఉన్నవారికి మనమెలా ఊరటనివ్వవచ్చు? క్రీస్తులాగే మనం కూడా వారి బాధలను తక్కువ చేయడంలో సహాయం చేయవచ్చు.
కొంతమందికి, తమ సమస్యల గురించి ఇంకొకరితో చెప్పుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. కృంగిపోయినవారు సహాయం కోసం ఒకవేళ మన దగ్గరకు వస్తే, వారు చెప్పేది శ్రద్ధగా వినడానికి మనం సమయం తీసుకుంటామా? సానుభూతితో వినడానికి క్రమశిక్షణ అవసరం. అంటే వారు చెప్పేదానికి ఎలా జవాబివ్వాలనో ఆ సమస్యను ఎలా పరిష్కారించాలనో ఆలోచించకుండా అవతలి వ్యక్తి చెప్పేదాన్ని సరిగ్గా వినడం అవసరం. పూర్తి అవధానంతో వినడం ద్వారా, వారివైపు చూడడం ద్వారా, సముచితమైనప్పుడు చిరునవ్వు చిందించడం ద్వారా వారిపట్ల మనకు శ్రద్ధ ఉందని చూపిస్తాం.
తోటి విశ్వాసులను ప్రోత్సహించే అవకాశాలు క్రైస్తవ సంఘంలో చాలా ఉంటాయి. ఉదాహరణకు, మనం కూటాల కోసం రాజ్య మందిరానికి వెళ్లినప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నవారితో మాట్లాడవచ్చు. కూటానికి ముందో లేదా ఆ తర్వాతనో వారిని బలపర్చడానికి కొన్ని నిమిషాలు ప్రోత్సాహకరంగా మాట్లాడితే చాలు. మనం హాజరయ్యే సంఘ పుస్తక పఠనానికి రాలేకపోయినవారిని గుర్తుపెట్టుకోవచ్చు. బహుశా మనం ఫోన్ చేసి వారి యోగక్షేమాలు కనుక్కోవడం ద్వారా లేదా సహాయం అవసరమేమో అడగడం ద్వారా శ్రద్ధ చూపించవచ్చు.—ఫిలిప్పీయులు 2:4.
క్రైస్తవ పెద్దలకు సంఘంలో ఎన్నో బరువైన బాధ్యతలుంటాయి. వారికి సహకరించడం ద్వారా, మనకివ్వబడిన నియామకాలను వినయంగా పూర్తిచేయడం ద్వారా వారి బరువును ఎంతో తేలిక చేయవచ్చు. “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి” అని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తోంది. (హెబ్రీయులు 13:17) విధేయత చూపించడం ద్వారా “బాగుగా పాలనచేయు” వారికి మనం ఊరటనివ్వవచ్చు.—1 తిమోతి 5:17.
మరింత ప్రోత్సాహకరంగా మాట్లాడండి, మరింత సహాయపడండి
అద్భుతరీతిలో, మెల్లగా కురిసే వేవేల అతిసూక్ష్మమైన నీటిబొట్లతో మంచు ఏర్పడినట్లే, ఇతరులకు ఊరటనివ్వాలంటే ఒక మంచిపని చేయడం మాత్రమే సరిపోదు గానీ అన్ని సమయాల్లో క్రీస్తులాంటి లక్షణాలను ప్రదర్శించాలి.
“సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (రోమీయులు 12:10) మనం పౌలు ఉపదేశాన్ని అన్వయించుకుందాం. మన మాటల్లోనూ, చేతల్లోనూ నిజంగా ఇతరులకు ఊరటనిచ్చేవారిగా ఉందాం.
[16వ పేజీలోని చిత్రాలు]
హెర్మోను పర్వతంమీది మంచు దిగువనున్న పంటలకు తేమనిచ్చేది
[17వ పేజీలోని చిత్రం]
సానుభూతితో వినేవారు ఇతరులకు ఊరటనిస్తారు