కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సర్వాధిపత్యం, దేవుని రాజ్యం

యెహోవా సర్వాధిపత్యం, దేవుని రాజ్యం

యెహోవా సర్వాధిపత్యం, దేవుని రాజ్యం

“యెహోవా . . . మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది.”—1 దినవృత్తాంతములు 29:11.

“యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలన చేయుచున్నాడు.” (కీర్తన 103:19) ఆ మాటలతో కీర్తనకర్త పరిపాలనకు సంబంధించిన ప్రాథమిక సత్యాన్ని తెలియజేశాడు. యెహోవా దేవుడు సృష్టికర్త కాబట్టి, సర్వాధిపతిగా ఈ విశ్వాన్ని పరిపాలించే హక్కు ఆయనకుంది.

2 సర్వాధిపతిగా పరిపాలించేందుకు ఒక పరిపాలకునికి పరిపాలించబడే ప్రజలుండాలి. తొలుత యెహోవా తాను సృష్టించిన ఆత్మప్రాణులపై పరిపాలన చేశాడు. వారిలో ఆయన మొట్టమొదట తన అద్వితీయ కుమారుణ్ణి, ఆ తర్వాత దేవదూతలను సృష్టించాడు. (కొలొస్సయులు 1:15-17) చాలాకాలం తర్వాత ప్రవక్తయైన దానియేలుకు యెహోవా పరిపాలనా విధానం లీలగా చూపించబడింది. ఆయన, “ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహావృద్ధుడొకడు కూర్చుండెను. . . . వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి” అని నివేదించాడు. (దానియేలు 7:9, 10) ‘మహావృద్ధుడైన’ యెహోవా తన చిత్తంచేస్తూ ‘పరిచారకులుగా’ సేవచేసే, క్రమశిక్షణతో మెలిగే విస్తారమైన తన ఆత్మకుమారుల కుటుంబంపై అనేక యుగాలు సర్వాధిపతిగా పరిపాలించాడు.—కీర్తన 103:20, 21.

3 చివరకు యెహోవా, భూమితోసహా విశాలమైన, సంక్లిష్టమైన భౌతిక విశ్వాన్ని సృష్టించడం ద్వారా తన పరిపాలనను విస్తరింపజేశాడు. (యోబు 38:4, 7) ఆకాశ గ్రహాలు ఎంత క్రమబద్ధంగా, ఖచ్చితంగా పరిభ్రమిస్తాయంటే, భూమ్మీద నుండి చూసే వ్యక్తికి అవి ఎవరూ నిర్దేశించాల్సిన లేదా నియంత్రించాల్సిన అవసరం లేనివన్నట్లు అనిపిస్తాయి. అయితే కీర్తనకర్త ఇలా అన్నాడు: “యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను . . . ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచియున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు.” (కీర్తన 148:5, 6) యెహోవా అటు ఆత్మసంబంధ రాజ్యానికి, ఇటు భౌతిక విశ్వానికి సంబంధించిన కార్యకలాపాలను నిర్దేశిస్తూ, క్రమపరుస్తూ సర్వాధిపతిగా పరిపాలిస్తూనేవున్నాడు.—నెహెమ్యా 9:6.

4 దేవుడు మొదటి మానవ దంపతులను సృష్టించినప్పుడు ఆయన తన సర్వాధిపత్యాన్ని ఇంకొక విధంగా చూపించాడు. మానవులు సంకల్పవంతమైన, సంతృప్తికరమైన జీవితం జీవించేందుకు కావలసినవన్నీ సమకూర్చడమే కాక, వారికి వాటన్నిటితోపాటు భూమ్మీది అల్ప ప్రాణులపై ఆధిపత్యాన్ని కూడా ఇచ్చాడు, అంటే మానవులకు ఆయన కొంత అధికారాన్ని అప్పగించాడు. (ఆదికాండము 1:26-28; 2:8, 9) కాబట్టి దేవుని పరిపాలన ప్రయోజనకరంగా, ప్రేమపూర్వకంగా ఉండడమే కాక, అది ఆయన పరిపాలించే ప్రజలను గౌరవించి, ఘనపరుస్తుందనీ స్పష్టమైంది. ఆదాము హవ్వలు యెహోవా సర్వాధిపత్యానికి లోబడినంతకాలం భూపరదైసులో నిరంతరం జీవించే నిరీక్షణ వారికుంటుంది.—ఆదికాండము 2:15-17.

5 దీనంతటి నుండి మనమే నిర్ధారణకు రావచ్చు? మొదటిది, యెహోవా తన సృష్టియంతటిపై నిరంతరం సర్వాధిపతిగానే ఉన్నాడు. రెండవది, దేవుని పరిపాలన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది, వారిని గౌరవిస్తుంది. చివరది, మనం దేవుని పరిపాలనకు లోబడి, దానికి మద్దతిచ్చినప్పుడు మనం నిత్యాశీర్వాదాలను అనుభవిస్తాం. కాబట్టి ప్రాచీనకాల ఇశ్రాయేలు రాజైన దావీదు, “యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు” అని చెప్పేందుకు పురికొల్పబడడంలో ఆశ్చర్యం లేదు.—1 దినవృత్తాంతములు 29:11.

దేవుని రాజ్యమెందుకు అవసరం?

6 విశ్వసర్వాధిపతియైన యెహోవా తన అధికారాన్ని, తన బలాన్ని ఎల్లప్పుడూ చూపిస్తూనే ఉన్నాడు కదా, అలాంటప్పుడు దేవుని రాజ్యమెందుకు అవసరం? సాధారణంగా ఒక పరిపాలకుడు తన ప్రజలపై తాను ఏర్పాటుచేసిన ప్రభుత్వ విధానం ద్వారా పరిపాలిస్తాడు. అదేవిధంగా దేవుడు తన ప్రాణులపట్ల తన విశ్వసర్వాధిపత్యాన్ని చూపించే ఒక విధానం దేవుని రాజ్యం, ఆయన దానిని తన పరిపాలనకు ఒక ఉపకరణంగా ఉపయోగించుకుంటాడు.

7 యెహోవా వివిధ కాలాల్లో వివిధ రీతుల్లో సర్వాధిపతిగా పరిపాలించాడు. ఒక క్రొత్త పరిణామం తలెత్తడంతో ఆయన ఒక క్రొత్త పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. దేవుని ఆత్మకుమారునిగావున్న సాతాను తిరగబడి, యెహోవా పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా ఆదాము, హవ్వలను ప్రేరేపించినప్పుడు ఆ పరిణామం చోటుచేసుకుంది. ఆ తిరుగుబాటు దేవుని సర్వాధిపత్యానికి సవాలుగా నిలిచింది. ఏ విధంగా? నిషేధించబడిన ఫలాన్ని తింటే ‘చావనే చావవని’ సాతాను హవ్వకు చెప్పడం ద్వారా యెహోవా అబద్ధికుడని, అందువల్ల ఆయన నమ్మదగినవాడుకాదని ఆరోపించాడు. హవ్వతో సాతాను ఇంకా ఇలా అన్నాడు: “మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.” దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యంచేసి, తమ స్వేచ్ఛామార్గంలో వెళ్లడం ద్వారా ఆదాము, హవ్వల జీవితం మరింత మెరుగ్గా ఉంటుందని సాతాను వారికి సూచించాడు. (ఆదికాండము 3:1-6) అది దేవుని పరిపాలనా హక్కును నేరుగా సవాలు చేయడమే. యెహోవా ఏమిచేస్తాడు?

8 తన రాజ్యంలో తిరుగుబాటు జరిగినప్పుడు ఒక పరిపాలకుడు ఏమిచేస్తాడని మనమనుకుంటాం? చరిత్ర తెలిసినవాళ్లు అలాంటి కొన్ని సంఘటనలను గుర్తు చేసుకోవచ్చు. ఆ పరిపాలకుడు చూస్తూ ఊరుకోడు, చివరకు దయగల పరిపాలకుడైనా సరే, ఆ తిరుగుబాటుదార్లను రాజద్రోహానికి పాల్పడ్డ దోషులుగా నిర్ణయిస్తూ వారికి శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత ఆ పరిపాలకుడు తిరుగుబాటు దళాలను లోబర్చుకొని, శాంతిని పునరుద్ధరించే అధికారం ఒకరికి అప్పగించవచ్చు. అదేవిధంగా, యెహోవా తక్షణమే చర్య తీసుకుని ఆ తిరుగుబాటుదారులకు తీర్పు తీర్చడం ద్వారా పరిస్థితి పూర్తిగా తన ఆధీనంలోనే ఉందని చూపించాడు. ఆదాము హవ్వలు నిత్యజీవమనే బహుమానానికి తగినవారు కాదని ప్రకటించి ఆయన వారిని ఏదెను తోటలోనుండి వెళ్లగొట్టాడు.—ఆదికాండము 3:16-19, 22-24.

9 సాతానుకు వ్యతిరేకంగా తన తీర్పును ప్రకటిస్తూ యెహోవా తన సర్వాధిపత్యానికి సంబంధించిన ఒక కొత్త విధానాన్ని వెల్లడిచేశాడు, ఆ పరిపాలనా విధానం ద్వారా ఆయన తన రాజ్యమంతటిలో శాంతిభద్రతల్ని పునఃస్థాపిస్తాడు. సాతానుతో దేవుడు ఇలా అన్నాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.” (ఆదికాండము 3:15) ఆ విధంగా సాతానును, అతని దళాలను చితగ్గొట్టి, తన సర్వాధిపత్యపు హక్కును నిరూపించే అధికారాన్ని ‘సంతానానికి’ ఇవ్వాలనే తన సంకల్పాన్ని యెహోవా వెల్లడిచేశాడు.—కీర్తన 2:7-9; 110:1, 2.

10 ఆ “సంతానము” యేసుక్రీస్తు, ఆయన సహపాలకుల ఓ ప్రత్యేక గుంపు అని స్పష్టమైంది. వారంతా దేవుని మెస్సీయ రాజ్యంగా ఏర్పడతారు. (దానియేలు 7:13, 14, 27; మత్తయి 19:28; లూకా 12:32; 22:28-30) అయితే ఇదంతా వెంటనే వెల్లడిచేయబడలేదు. నిజానికి ఆ మొదటి ప్రవచన నెరవేర్పు ‘అనాదిగా రహస్యంగా ఉంచబడిన మర్మముగా’ ఉంది. (రోమీయులు 16:25) ఆ ‘మర్మము’ వెల్లడిచేయబడే కాలం కోసం, యెహోవా సర్వాధిపత్యమే సరైందని నిరూపిస్తూ మొదటి ప్రవచనం నెరవేరే కాలం కోసం విశ్వాసులు ఎన్నో శతాబ్దాలు ఎదురుచూశారు.—రోమీయులు 8:19-21.

“మర్మము” క్రమేణా వెల్లడిచేయబడింది

11 కాలం గడుస్తుండగా, ‘దేవుని రాజ్య మర్మానికి’ సంబంధించిన అంశాలను యెహోవా క్రమేణా వెల్లడిచేశాడు. (మార్కు 4:11) యెహోవా ఈ అంశాలను వెల్లడిచేసినవారిలో అబ్రాహాముకు కూడా ఉన్నాడు, ఆయన “దేవుని స్నేహితుడని” పిలవబడ్డాడు. (యాకోబు 2:23) అబ్రాహామును “గొప్ప జనముగా” చేస్తానని యెహోవా ఆయనకు వాగ్దానం చేశాడు. ఆ తర్వాత దేవుడు అబ్రాహాముతో ఇంకా ఇలా అన్నాడు: “రాజులు నీలోనుండి వచ్చెదరు,” “భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.”—ఆదికాండము 12:2, 3; 17:6; 22:17, 18.

12 అబ్రాహాము కాలానికల్లా మానవులు ఇతరులపై పరిపాలించే, ఇతరులపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలు జరిగాయి. ఉదాహరణకు, నోవహు మునిమనవడైన నిమ్రోదు గురించి బైబిలు ఇలా చెబుతోంది: “అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు.” (ఆదికాండము 10:8, 9) కాబట్టి, నిమ్రోదు, తమనుతామే పాలకులుగా చేసుకున్న ఇతరులు సాతాను చేతుల్లో కీలుబొమ్మలయ్యారనేది స్పష్టం. వారు వారి మద్దతుదారులు సాతాను సంతానంలో భాగమయ్యారు.—1 యోహాను 5:19.

13 మానవ పరిపాలకుల్ని ప్రవేశపెట్టేందుకు సాతాను ప్రయత్నిస్తూ వచ్చినా, యెహోవా సంకల్పం నిరాటంకంగా ముందుకు సాగుతూనే ఉంది. అబ్రాహాము మనవడైన యాకోబు ద్వారా యెహోవా ఇలా వెల్లడిచేశాడు: “షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైయుందురు.” (ఆదికాండము 49:10) “షిలోహు” అనే మాటకు “అది [రాజదండము] ఎవరిదో ఆయన; అది [రాజదండము] ఎవరికి చెందుతుందో ఆయన” అని అర్థం. అలా ఈ ప్రవచనార్థక మాటలు, ‘దండాన్ని’ లేదా ‘రాజదండాన్ని’ స్వీకరించే అంటే ‘ప్రజలపై’ లేదా సర్వమానవాళిపై పాలనాధికారాన్ని పొందే హక్కుదారుడు వస్తాడని సూచించాయి. ఆ హక్కుదారుడు ఎవరు?

“షిలోహు వచ్చువరకు”

14 యెహోవా తన ప్రజలపై రాజుగా ఉండేందుకు మొట్టమొదట యూదా వంశస్థుల్లో నుండి, యెష్షయి కుమారుడు, గొర్రెల కాపరి అయిన దావీదును ఎన్నుకున్నాడు. * (1 సమూయేలు 16:1-13) దావీదు పొరపాట్లు చేసినా, ఆయన యెహోవా సర్వాధిపత్యంపట్ల యథార్థంగావున్నాడు కాబట్టి ఆయన యెహోవా అనుగ్రహాన్ని పొందాడు. ఏదెను ప్రవచనానికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తూ యెహోవా దావీదుతో ఒక నిబంధన చేస్తూ, ఇలా అన్నాడు: “నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.” ఆ సంతతిలో దావీదు కుమారుడు, వారసుడైన సొలొమోను మాత్రమే ఉండడు, ఎందుకంటే ఆ నిబంధన ఇలా చెప్పింది: “అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను.” వాగ్దత్త రాజ్య “సంతానము” తగినకాలంలో దావీదు కుటుంబంలో జన్మిస్తాడని దావీదు నిబంధన స్పష్టం చేసింది.—2 సమూయేలు 7:12, 13.

15 దావీదుతో రాజుల వంశావళి మొదలైంది, వీరు ప్రధాన యాజకునిచేత పరిశుద్ధ తైలముతో అభిషేకించబడ్డారు. అందువల్ల ఈ రాజులు అభిషిక్తులని లేదా మెస్సీయలని పిలవబడ్డారు. (1 సమూయేలు 16:13; 2 సమూయేలు 2:4; 5:3; 1 రాజులు 1:39) వారు యెహోవా సింహాసనంపై కూర్చొని ఆయన తరఫున యెరూషలేము నుండి రాజులుగా పరిపాలించారని చెప్పబడింది. (2 దినవృత్తాంతములు 9:8) ఆ విధంగా యూదా రాజ్యం, యెహోవా సర్వాధిపత్యానికి చిహ్నంగావున్న దేవుని రాజ్యానికి ప్రాతినిధ్యం వహించింది.

16 యెహోవా సర్వాధిపత్యానికి రాజు, ప్రజలు లోబడినప్పుడు ఆయన వారిని సంరక్షిస్తూ, వారిని ఆశీర్వదించాడు. ప్రత్యేకంగా సొలొమోను పరిపాలన సాటిలేని శాంతి సంపదల కాలంగా ఉండడమేకాక, సాతాను ప్రభావం పూర్తిగా తొలగించబడి యెహోవా సర్వాధిపత్యమే సరైందని నిరూపించబడే దేవుని రాజ్య పాలనకు ప్రవచనార్థక పూర్వఛాయగా కూడా ఉంది. (1 రాజులు 4:20, 25) అయితే విచారకరంగా, దావీదు వంశావళిలోని చాలామంది రాజులు యెహోవా నియమాలు పాటించడంలో విఫలమయ్యారు, ప్రజలు విగ్రహారాధన, లైంగిక దుర్నీతి వంటి క్రియల్లో కూరుకుపోయారు. చివరకు, సా.శ.పూ. 607లో బబులోనీయులు ఆ రాజ్యాన్ని నాశనం చేసేందుకు యెహోవా అనుమతించాడు. యెహోవా సర్వాధిపత్యాన్ని కించపర్చాలనే సాతాను ప్రయత్నం ఫలించినట్లు కనిపించింది.

17 దావీదు వంశస్థుల రాజ్యం, అలాగే అంతకుముందున్న ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం పతనమవడం, యెహోవా సర్వాధిపత్యంలో ఏదో లోపముందనో లేదా అది విఫలమైందనో అనడానికి కాదుగానీ సాతాను ప్రభావంవల్ల, మానవులు దేవునికి దూరమవడంవల్ల మాత్రమే అలాంటి చెడు పర్యవసానాలు ఎదురవుతాయనడానికి రుజువుగా ఉంది. (సామెతలు 16:25; యిర్మీయా 10:23) తానింకా సర్వాధిపతిగానే ఉన్నానని చూపించేందుకు యెహోవా తన ప్రవక్తయైన యెహెజ్కేలు ద్వారా ఇలా ప్రకటించాడు: “తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము . . . నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.” (యెహెజ్కేలు 21:26, 27) ఆ మాటలు “స్వాస్థ్యకర్త” అయిన వాగ్దత్త “సంతానము” ఇంకా రానున్నాడని సూచించాయి.

18 మనమిప్పుడు సా.శ.పూ. 2వ సంవత్సరానికి వెళ్దాం. ఉత్తర పాలస్తీనాలోని గలిలయ పట్టణమైన నజరేతులో నివసిస్తున్న మరియ అనే కన్యక దగ్గరకు గబ్రియేలు దూత పంపించబడ్డాడు. ఆయనిలా చెప్పాడు: “ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.”—లూకా 1:31-33.

19 చివరకు, “మర్మము” వెల్లడిచేయబడే సమయం సమీపించింది. వాగ్దత్త ‘సంతానములో’ ముఖ్యమైనవాడు త్వరలో కనబడబోతున్నాడు. (గలతీయులు 4:4; 1 తిమోతి 3:16) సాతాను ఆయనను మడిమె మీద కొడతాడు. అయితే ఆ “సంతానము” తిరిగి సాతాను తలను చితగ్గొట్టి, అతణ్ణి అతని అనుయాయులను నాశనం చేస్తాడు. అంతేకాక దేవుని రాజ్యం సాతాను కలిగించిన నష్టాన్నంతటినీ పూరించడమేకాక, యెహోవా సర్వాధిపత్యమే సరైందని నిరూపిస్తుందని కూడా సాక్ష్యమిస్తాడు. (హెబ్రీయులు 2:14; 1 యోహాను 3:8) యేసు దీనిని ఎలా నెరవేరుస్తాడు? అనుకరించేందుకు ఆయన మనకెలాంటి మాదిరినుంచాడు? వీటికి జవాబులను మనం తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

[అధస్సూచి]

^ పేరా 19 ఇశ్రాయేలును పరిపాలించేందుకు దేవుడు మొదట ఎన్నుకున్న సౌలు బెన్యామీను గోత్రికుడు.—1 సమూయేలు 9:15, 16; 10:1.

మీరు వివరించగలరా?

• యెహోవాను విశ్వసర్వాధిపతిగా ఏది చేస్తోంది?

• యెహోవా రాజ్యాన్ని స్థాపించాలని ఎందుకు సంకల్పించాడు?

• యెహోవా ‘మర్మాన్ని’ ఎలా క్రమేణా వెల్లడిచేశాడు?

• దావీదు వంశస్థుల రాజ్యం పతనమైనా అన్నీ యెహోవా నియంత్రణలోనే ఉన్నాయని ఏది చూపిస్తోంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. సర్వాధిపతిగా విశ్వాన్ని పరిపాలించే హక్కు యెహోవాకు ఎందుకుంది?

2. యెహోవా ఆత్మసంబంధ రాజ్యాన్ని దానియేలు ఎలా వర్ణించాడు?

3. భౌతిక విశ్వంపై యెహోవా సర్వాధిపత్యం ఎలా విస్తరించింది?

4. యెహోవా తన సర్వాధిపత్యాన్ని మానవులపై ఎలా చూపిస్తాడు?

5. యెహోవా సర్వాధిపత్యం గురించి మనమేమి చెప్పవచ్చు?

6. దేవుని సర్వాధిపత్యానికి, ఆయన రాజ్యానికి ఎలాంటి సంబంధముంది?

7. యెహోవా తన సర్వాధిపత్యానికి సంబంధించి ఓ క్రొత్త పరిపాలనా విధానాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు?

8, 9. (ఎ) తన రాజ్యంలో తిరుగుబాటు జరిగినప్పుడు ఓ మానవ పరిపాలకుడు ఏమిచేస్తాడు? (బి) ఏదెనులో జరిగిన తిరుగుబాటుకు యెహోవా ఎలా ప్రతిస్పందించాడు?

10. (ఎ) ఆ “సంతానము” ఎవరని స్పష్టమైంది? (బి) మొదటి ప్రవచన నెరవేర్పు గురించి పౌలు ఏమిచెప్పాడు?

11. యెహోవా అబ్రాహాముకు ఏమని వాగ్దానం చేశాడు?

12. జలప్రళయం తర్వాత సాతాను సంతానమెలా దానికదే వెలుగులోకి వచ్చింది?

13. యాకోబు ద్వారా యెహోవా ఏ విషయాన్ని వెల్లడిచేశాడు?

14. యెహోవా దావీదుతో ఏ నిబంధన చేశాడు?

15. యూదా రాజ్యాన్ని దేవుని రాజ్యానికి నమూనాగా ఎందుకు దృష్టించవచ్చు?

16. యూదా రాజుల పరిపాలనా ఫలితాలు ఎలావున్నాయి?

17. దావీదు వంశస్థుల రాజ్యం పతనమైనా అన్నీ యెహోవా నియంత్రణలోనే ఉన్నాయని ఏది చూపిస్తోంది?

18. గబ్రియేలు దూత మరియకు ఏమని చెప్పాడు?

19. ఉత్తేజకరమైన ఏ సంఘటనలకు సమయం సమీపించింది?

[23వ పేజీలోని చిత్రం]

అబ్రాహాము ద్వారా యెహోవా దేనిని ముందుగానే సూచించాడు?

[25వ పేజీలోని చిత్రం]

దావీదు వంశస్థుల రాజ్య పతనం యెహోవా సర్వాధిపత్యం విఫలమైందనేందుకు ఎందుకు రుజువుకాదు?