యేసుకు స్వంత బైబిలు ఉండేదా?
యేసుకు స్వంత బైబిలు ఉండేదా?
యేసుకు స్వంత బైబిలు ఉండేదికాదు. ఎందుకు? ఎందుకంటే నేడు మన దగ్గరున్నట్లుగా పూర్తి బైబిలు యేసు కాలంలో అందుబాటులో లేదు. కానీ, సమాజమందిరాల్లో లేఖనాలు వ్రాయబడివున్న గ్రంథపుచుట్టలు భద్రపరచబడి ఉండేవి, అవే ఆ తర్వాత, మనకిప్పుడు తెలిసిన బైబిల్లో భాగంగా తయారయ్యాయి. యేసు, నజరేతులోని సమాజమందిరంలో యెషయా గ్రంథపుచుట్టలో నుండి చదివాడు. (లూకా 4:16, 17) అపొస్తలుడైన పౌలు, పిసిదియలోనున్న అంతియొకయలో, ‘ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల లేఖనాలను చదవడం’ విన్నాడు. (అపొస్తలుల కార్యములు 13:14, 15) శిష్యుడైన యాకోబు, “సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున” మోషే లేఖనములు ‘చదవబడుతున్నాయని’ చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 15:21.
మొదటి శతాబ్దంలో ప్రజల దగ్గర పరిశుద్ధ లేఖనాల స్వంత గ్రంథపుచుట్టలు ఉండేవా? రాణియైన కందాకే క్రింద మంత్రిగావున్న ఐతియొపీయుడైన నపుంసకుని దగ్గర ఉండేవి, ఎందుకంటే శిష్యుడైన ఫిలిప్పు గాజాకు వెళ్ళే మార్గంలో ఆయన్ని కలిసినప్పుడు ఆయన, ‘తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుతున్నాడు.’ (అపొస్తలుల కార్యములు 8:26-30) అపొస్తలుడైన పౌలు, “పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను” తీసుకురమ్మని తిమోతికి చెప్పాడు. (2 తిమోతి 4:13) అవి ఏ పుస్తకాలో పౌలు ప్రస్తావించనప్పటికీ అవి బహుశా హెబ్రీ లేఖనాల్లోని భాగాలై ఉండవచ్చు.
సెమిటిక్ భాషల ప్రొఫెసర్ ఆలన్ మిలార్డ్ చెబుతున్నట్లుగా, యూదుల్లో “పాలస్తీనాలోని ఉన్నతవర్గం వారి దగ్గర, పండితులమని చెప్పుకొనేవారందరి దగ్గర, కొంతమంది పరిసయ్యుల దగ్గర, నీకొదేములాంటి బోధకుల దగ్గర” మాత్రమే బహుశా లేఖనాల స్వంత గ్రంథపుచుట్టలు ఉండేవి. దానికొక కారణమేమిటంటే వాటి ఖరీదు చాలా ఎక్కువ ఉండడమే. “ఒక యెషయా ప్రతి ఆరు నుండి పది దేనారాలు ఉండవచ్చు” అని మిలార్డ్ అంచనా వేస్తూ, పూర్తి హెబ్రీ బైబిలు వ్రాయడానికి “15 నుండి 20 చుట్టలు అవసరమౌతాయి” అని చెబుతున్నాడు లేదా వాటి ఖరీదు దాదాపు అర్థసంవత్సరం జీతమంత ఉంటుంది.
యేసు దగ్గరగానీ ఆయన శిష్యుల దగ్గరగానీ బైబిలు గ్రంథపుచుట్టల స్వంత ప్రతులు ఉండేవో లేదో బైబిలు చెప్పడం లేదు. అయితే, యేసు లేఖనాల్లో ప్రావీణ్యం కలిగివున్నాడనీ, ఆయన వాటిని సూచించగలిగేవాడనీ, వాటిని చూడకుండా చెప్పగలిగేవాడనీ అనడంలో సందేహమే లేదు. (మత్తయి 4:4, 7, 10; 19:4, 5) ఆ విషయం, బైబిలు నేడు అతి తక్కువధరలో, సులభంగా లభ్యమౌతోంది కాబట్టి మనం దాని గురించి బాగా తెలుసుకొనేలా మనల్ని పురికొల్పవద్దా?