మలాకీ పుస్తకంలోని ముఖ్యాంశాలు
యెహోవా వాక్యము సజీవమైనది
మలాకీ పుస్తకంలోని ముఖ్యాంశాలు
యెరూషలేములోని దేవాలయ పునర్నిర్మాణం పూర్తై అప్పటికి 70 కంటే ఎక్కువ సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే, కాలం గడుస్తున్నకొద్దీ యూదుల ఆధ్యాత్మికత అంతకంతకు తగ్గిపోయింది. చివరికి యాజకులు కూడా భ్రష్టులైపోయారు. వారు నిజంగా ఎలాంటి స్థితిలో ఉన్నారో గుర్తించడానికి వారికి ఎవరు సహాయం చేస్తారు, ఆధ్యాత్మికంగా వారిని తిరిగి మంచి స్థితికి తీసుకురావడానికి ఎవరు ప్రయత్నిస్తారు? యెహోవా ప్రవక్తయైన మాలాకీకి ఈ పనిని అప్పగించాడు.
హెబ్రీ లేఖనాల్లో చివరిదైన ఈ పుస్తకాన్ని మలాకీ శక్తివంతమైన శైలిలో రాశాడు, దీనిలో దైవప్రేరేపిత ప్రవచనముంది. మలాకీ రాసిన ప్రవచన వాక్యం గురించి జాగ్రత్తగా ఆలోచించడం, ఇప్పుడున్న దుష్ట విధానం అంతమయ్యే “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము” కోసం మనం సిద్ధంగా ఉండడానికి సహాయపడుతుంది.—మలాకీ 4:5.
యాజకులు ‘అనేకులను అభ్యంతరపరచారు’
యెహోవా ఇశ్రాయేలీయులపట్ల తనకున్న భావాలను ఇలా వ్యక్తం చేశాడు: “నేను మీయెడల ప్రేమ చూపియున్నాను.” కానీ యాజకులు దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేశారు. ఎలా? ‘[ఆయన] బలిపీఠముమీద అపవిత్రమైన భోజనమును’ అర్పించడం ద్వారా, ‘కుంటిదానిని రోగముగలదానిని’ బలి అర్పించడం ద్వారా వారలా చేశారు.—మలాకీ 1:2, 6-8.
యాజకులు ‘ధర్మశాస్త్ర విషయములో అనేకులను అభ్యంతరపరచారు.’ ప్రజలు ‘ఒకరియెడల ఒకరు ద్రోహం చేసుకున్నారు.’ కొందరు అన్యస్త్రీలను వివాహం చేసుకున్నారు. ఇతరులు తాము ‘యౌవన కాలమందు పెండ్లిచేసికొన్న భార్యలను’ మోసం చేశారు.—మలాకీ 2:8, 10, 11, 14-16.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
2:2—దేవుని వాక్యాన్ని పాటించని యాజకుల “ఆశీర్వాద ఫలమును” యెహోవా ఎలా “శపిం[చాడు]”? దేవుడు ఎలా శపించాడంటే, అలాంటి యాజకులు ఇచ్చిన ఆశీర్వాదాలు శాపంగా మారతాయి.
2:3—యాజకుల ముఖములమీద ‘పేడ వేయడం’ అంటే అర్థమేమిటి? బలి అర్పించే పశువుల మలాన్ని పాళెం బయటకు తీసుకువెళ్ళి కాల్చివేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. (లేవీయకాండము 16:27) యాజకుల ముఖములమీద పేడ వేయడమంటే యెహోవా వారు అర్పించిన బలులను తిరస్కరించాడనీ, వాటిని అర్పించిన వారిని అసహ్యించుకున్నాడనీ అర్థం.
2:13—ఎవరి కన్నీళ్ళతో యెహోవా బలిపీఠం తడిచింది? ఈ కన్నీళ్ళు దేవాలయానికి వచ్చి, యెహోవా యెదుట తమ హృదయాలను కుమ్మరించుకున్న భార్యలవి. వాళ్ళనంతగా
బాధపెట్టినది ఏమిటి? యూదులైన వారి భర్తలు చట్టవిరుద్ధమైన కారణాల ఆధారంగా వారికి విడాకులిచ్చి వాళ్ళను వదిలేశారు, బహుశా యౌవనులైన అన్యస్త్రీలను వివాహం చేసుకోవడానికి వారలా చేసివుండవచ్చు.మనకు పాఠాలు:
1:14; 2:17. యెహోవా వేషధారణను సహించడు.
2:7-9. సంఘంలో బోధించే బాధ్యతగలవారు తాము బోధించే విషయాలు పరిశుద్ధ లేఖనాలైన దేవుని వాక్యానికి, ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ అందించే బైబిలు ఆధారిత ప్రచురణలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.—లూకా 12:42; యాకోబు 3:11.
2:10, 11. యెహోవా తన ఆరాధకులు “ప్రభువునందు మాత్రమే” వివాహం చేసుకోవాలనే సలహాను గంభీరంగా తీసుకోవాలని కోరుతున్నాడు.—1 కొరింథీయులు 7:39.
2:15, 16. సత్యారాధకులు యౌవనమున పెండ్లిచేసుకున్న తమ భార్యలతో తాము చేసిన వివాహ నిబంధనను గౌరవించాలి.
‘ప్రభువు తన ఆలయమునకు వచ్చును’
‘ప్రభువు [యెహోవా దేవుడు] నిబంధన దూత [యేసుక్రీస్తు]’తో కలిసి “తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును.” దేవుడు “తీర్పు తీర్చుటకై” తన ప్రజలవద్దకు వచ్చి అన్ని రకాల చెడుపనులు చేసేవారికి వ్యతిరేకంగా దృఢంగా సాక్ష్యమిస్తాడు. అంతేకాకుండా, యెహోవాకు భయపడేవారి కోసం “జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము” రాయబడుతుంది.—మలాకీ 3:1, 3, 5, 16.
“కొలిమి కాలునట్లు” ఉండే యెహోవా దినం రాబోతుంది, అది దుష్టులందరినీ దహించివేస్తుంది. ఆ దినం రావడానికి ముందు “తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రి[ప్పడానికి]” ఒక ప్రవక్త పంపించబడతాడు.—మలాకీ 4:1, 5, 6.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
3:1-3—“ప్రభువు” మరియు “నిబంధన దూత” ఎప్పుడు దేవాలయానికి వచ్చారు, వారికి ముందుగా ఎవరు పంపబడ్డారు? యెహోవా సూచనార్థకంగా సా.శ. 33 నీసాను 10న దేవాలయానికి వచ్చి దాన్ని శుభ్రపరిచాడు. అది యేసు దేవాలయంలోకి ప్రవేశించి అక్కడ క్రయవిక్రయాలు చేస్తున్నవారిని వెళ్లగొట్టిన సందర్భం. (మార్కు 11:15) ఈ సంఘటన, యేసు నియుక్త-రాజుగా అభిషేకించబడిన మూడున్నర సంవత్సరాల తర్వాత జరిగింది. అదేవిధంగా, యేసు యెహోవాతో కలిసి ఆధ్యాత్మిక ఆలయంలోకి ప్రవేశించి దేవుని ప్రజలు శుద్ధిచేయబడాల్సిన అవసరముందని గ్రహించినది ఆయన పరలోకంలో రాజుగా సింహాసనాన్ని అధిష్టించిన మూడున్నర సంవత్సరాల తర్వాతేనని అనిపిస్తోంది. మొదటి శతాబ్దంలో, యేసుక్రీస్తు రాకకు యూదులను సిద్ధంచేయడానికి బాప్తిస్మమిచ్చే యోహాను ముందుగా పంపించబడ్డాడు. ఆధునిక కాలంలో, యెహోవా తన ఆధ్యాత్మిక ఆలయానికి వచ్చేందుకు మార్గం సిద్ధంచేయడానికి ఒక దూత ముందుగానే పంపించబడ్డాడు. బైబిలు విద్యార్థుల ఒక గుంపు ఎంతో ముందుగానే, అంటే 1880లలోనే బైబిల్లోని అనేక ప్రాథమిక సత్యాలను తిరిగి యథార్థ ప్రజలకు బోధించడానికి ఒక బైబిలు విద్యాపనిలో పాల్గొనడం ప్రారంభించింది.
3:10—“పదియవభాగమంతా” లేదా దశమభాగం ఇవ్వడం మనకున్నదంతా యెహోవాకు ఇవ్వడాన్ని సూచిస్తుందా? మోషే ధర్మశాస్త్రం యేసు మరణంద్వారా కొట్టివేయబడింది కాబట్టి నేడు డబ్బు రూపేణా దశమభాగం చెల్లించాల్సిన అవసరంలేదు. అయినప్పటికీ, దశమ భాగం ఇవ్వడానికి సూచనార్థక భావం ఉంది. (ఎఫెసీయులు 2:14, 15) ఇది మనకున్నదంతా ఇవ్వడాన్ని సూచించడంలేదు. దశమభాగం ప్రతీ సంవత్సరం తీసుకురాబడేది, కానీ మనం మనకున్నదంతా యెహోవాకు ఒక్కసారే అంటే మన సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించినప్పుడు అర్పిస్తాం. అప్పటినుండి మనకున్నదంతా యెహోవాకే చెందుతుంది. అయినా, మనకున్నదాంట్లో కొంతభాగాన్ని అంటే సూచనార్థక దశమభాగాన్ని ఆయన సేవలో ఉపయోగించేందుకు మనం ఎంపిక చేసుకోవడాన్ని ఆయన అనుమతిస్తాడు. ఆ దశమభాగం ఎంతంటే, యెహోవా సేవలో ఉపయోగించేందుకు మన పరిస్థితులు ఎంత అనుమతిస్తే అంత, మన హృదయం ఎంత ప్రేరేపిస్తే అంత. యెహోవాకు మనమిచ్చేవాటిలో రాజ్య ప్రకటనా పని కోసం, శిష్యులను చేసే పని కోసం మనం వెచ్చించే సమయం, శక్తి, వనరులు ఉన్నాయి. ఇంకా వీటిలో క్రైస్తవ కూటాలకు హాజరవడం, తోటి విశ్వాసుల్లో అనారోగ్యంతో బాధపడుతున్నవారిని వృద్ధులను పరామర్శించడం, సత్యారాధనకు ఆర్థిక మద్దతు ఇవ్వడం కూడా ఉన్నాయి.
4:3—యెహోవా ఆరాధకులు ‘దుర్మార్గులను’ ఎలా ‘అణగద్రొక్కుతారు’? భూమ్మీదున్న దేవుని ప్రజలు నేడు ‘దుర్మార్గులను’ అక్షరార్థంగా ‘అణగద్రొక్కరు’ అంటే వారిపై ఆయన తీర్పులను అమలుచేయడంలో భాగం వహించరు. బదులుగా, ఇది భూమిపైనున్న యెహోవా సేవకులు సాతాను లోకం నిర్మూలమైన తర్వాత జరిగే విజయోత్సాహంలో మనస్ఫూర్తిగా భాగం వహించడంద్వారా సూచనార్థకంగా అలా చేస్తారని సూచిస్తోంది.—కీర్తన 145:20; ప్రకటన 20:1-3.
4:4—మనమెందుకు ‘మోషే ధర్మశాస్త్రమును జ్ఞాపకము చేసుకోవాలి’? ధర్మశాస్త్రాన్ని క్రైస్తవులు పాటించనవసరం లేదు, అయినప్పటికీ, అది “రాబోవుచున్న మేలుల ఛాయ[గా]” పనిచేస్తోంది. (హెబ్రీయులు 10:1) కాబట్టి, మోషే ధర్మశాస్త్రానికి అవధానమివ్వడం, దానిలో రాయబడిన విషయాలు ఎలా నెరవేరాయో మనం అర్థచేసుకోవడానికి సహాయం చేస్తుంది. (లూకా 24:44, 45) అంతేకాక ధర్మశాస్త్రంలో “పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు” ఉన్నాయి. క్రైస్తవ బోధలను, క్రైస్తవ ప్రవర్తనను మనం అర్థంచేసుకోవాలంటే దాన్ని అధ్యయనం చేయడం చాలా అవసరం.—హెబ్రీయులు 9:23.
4:5, 6—“ప్రవక్తయగు ఏలీయా” ఎవరికి సూచనగా ఉన్నాడు? “ఏలీయా” ప్రజల హృదయాలను సిద్ధపర్చడమనే పునఃస్థాపనా పనిని చేస్తాడని ప్రవచింపబడింది. సా.శ. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు, బాప్తిస్మమిచ్చే యోహానును “ఏలీయా”గా గుర్తించాడు. (మత్తయి 11:12-14; మార్కు 9:11-13) ఏలీయాకు ఆధునికదిన సారూప్యంగా ఉన్న వర్గం, “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు” పంపించబడింది. మనకాలంలో ఏలీయా మరెవరో కాదు, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[డు].” (మత్తయి 24:45) అభిషిక్త క్రైస్తవుల ఈ వర్గం, ఆధ్యాత్మిక పునఃస్థాపనా పనిని శ్రద్ధతో చేస్తూనే ఉంది.
మనకు పాఠాలు:
3:10. యెహోవాకు మనం ఇవ్వగలిగినంత ఇవ్వకపోతే ఆయనిచ్చే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం.
3:14, 15. యాజకుల చెడు మాదిరినిబట్టి యూదులు దేవుని సేవ అంత ప్రాముఖ్యమైనది కాదన్నట్లు దృష్టించడం మొదలుపెట్టారు. క్రైస్తవ సంఘంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు ఆదర్శప్రాయంగా ఉండాలి.—1 పేతురు 5:1-3.
3:16. యెహోవా తనకు భయపడేవారి పేర్లను, తనపట్ల నమ్మకంగా ఉండేవారి పేర్లను ఒక గ్రంథంలో రాసిపెడతాడు. సాతాను దుష్టలోకాన్ని నాశనం చేసేటప్పుడు ఆయన వారిని గుర్తుంచుకొని కాపాడతాడు. కాబట్టి, దేవునిపట్ల యథార్థతను కాపాడుకోవాలనే మన నిశ్చయత ఎన్నడూ బలహీనం కాకుండా చూసుకుందాం.—యోబు 27:5.
4:1. యెహోవాకు లెక్క అప్పచెప్పే రోజున ‘వేరుకు, చిగురుకు’ ఒకే గతి పడుతుంది, అంటే తల్లిదండ్రులు, పిల్లలు ఒకే తీర్పును పొందుతారు. తమ చిన్నారులపట్ల తల్లిదండ్రులకు ఎంత పెద్ద బాధ్యత ఉందో కదా! క్రైస్తవ తల్లిదండ్రులు దేవుని అనుగ్రహం పొందడానికి, ఆయన ఎదుట మంచి స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా కృషిచేయాలి.—1 కొరింథీయులు 7:14.
“దేవునియందు భయభక్తులు కలిగియుం[డుడి]”
“యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము[న]” ఎవరు రక్షించబడతారు? (మలాకీ 4:5) యెహోవా ఇలా చెబుతున్నాడు: “నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.”—మలాకీ 4:2.
దేవుని నామంపట్ల భక్తిపూర్వకమైన భయాన్ని కలిగివుండే వారిపై “నీతి సూర్యు[డైన]” యేసుక్రీస్తు ఉదయిస్తాడు, వారు యెహోవా అనుగ్రహాన్ని పొందుతారు. (యోహాను 8:12) “అతని రెక్కలు” వారికి “ఆరోగ్యము కలుగజేయును,” అంటే ఇప్పుడు వారికి ఆధ్యాత్మిక స్వస్థత కలుగుతుంది, అంతేగాక దేవుని నూతన లోకంలో శారీరక, మానసిక, భావోద్రేక స్వస్థత కలుగుతుంది. (ప్రకటన 22:1, 2) వారు “క్రొవ్విన దూడ[ల్లా]” ఉత్తేజంతో, సంతోషంతో గంతులువేస్తారు. అలాంటి ఆశీర్వాదాలు మనకు లభించబోతున్నాయి కాబట్టి, సొలొమోను ఇచ్చిన ఈ ఉపదేశాన్ని లక్ష్యపెడదాం: “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”—ప్రసంగి 12:13.
[26వ పేజీలోని చిత్రం]
ప్రవక్తయైన మలాకీ దేవునికి సమర్పించుకున్న ఉత్సాహంగల సేవకుడు
[29వ పేజీలోని చిత్రం]
మనం బోధించేది బైబిలుకు అనుగుణంగా ఉండాలి
[29వ పేజీలోని చిత్రం]
యెహోవా సేవకులు వివాహ సమయంలో తాము చేసిన నిబంధనను గౌరవిస్తారు