క్రైస్తవులు గోధుమల్లా జల్లించబడుతున్నప్పుడు ఏమి చేయాలి?
క్రైస్తవులు గోధుమల్లా జల్లించబడుతున్నప్పుడు ఏమి చేయాలి?
యేసు తాను మరణించే ముందు తన శిష్యులను ఇలా హెచ్చరించాడు, “ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను.” (లూకా 22:31) ఆయన మాటల భావమేమిటి?
యేసు భూమ్మీద జీవించిన కాలంలో, గోధుమల కోతకు చాలా సమయం, కృషి అవసరమయ్యేవి. కోతకోసేవారు ముందుగా, పొలంలో నుండి గోధుమ వెన్నులు పోగుచేసేవారు. తర్వాత వాటిని చదునుగావున్న రాయికేసి కొట్టేవారు లేదా వెన్నులను నులిమేందుకు వ్యవసాయ పశువులతో నూర్చేడి కర్రపలకను వాటిపై తిప్పేవారు. ఇలా చేయడంవల్ల వెన్నుల నుండి గోధుమలు వేరవడమేకాక వాటిపై ఉన్న పొట్టు కూడా ఊడిపోయేది. ఆ తర్వాత రైతులు, గింజలను, పొట్టును వేరుచేయడానికి దానిని తూర్పారబట్టేవారు. దానితో మంచిగింజలు నేలపై పడతాయి, పొట్టు గాలికి ఎగిరిపోయేది. చివరిగా గోధుమల్లోనుండి వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు వాటిని జల్లించేవారు.
యేసు చెప్పినట్లుగానే సాతాను పూర్వం యేసు శిష్యులపై దాడి చేస్తూనే వచ్చాడు, అలాగే నేడు మనపై కూడా దాడిచేస్తున్నాడు. (ఎఫె. 6:11) నిజమే, జీవితంలో మనకెదురయ్యే ప్రతీ సమస్యకూ నేరుగా సాతానే కారణం కాదు. (యాకో. 4:13-15) అయినప్పటికీ, మనం యథార్థతను కోల్పోయేలా చేయడానికి అతడు తనకు అందుబాటులో ఉన్న ప్రతీ మాధ్యమాన్ని ఉపయోగించుకోవడానికి ఆత్రంగా ఉన్నాడు. ఉదాహరణకు, మనం ఐశ్వర్యాసక్తితో కూడిన జీవిన విధానాన్ని అనుసరించేలా, అభ్యంతరకరమైన వినోదాన్ని ఎంచుకునేలా, లేదా లైంగిక దుర్నీతికి పాల్పడేలా మనల్ని శోధించవచ్చు. ఈ లోకం అందించే విద్య, ఉద్యోగాల్లో పూర్తిగా మునిగిపోయేలా ఒత్తిడి చేసేందుకు తోటి విద్యార్థులను, తోటి ఉద్యోగులను లేదా అవిశ్వాస బంధువులను కూడా అతడు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, దేవునిపట్ల మనకున్న యథార్థతను కోల్పోయేలా చేయడానికి హింసను ఉపయోగించవచ్చు. నిజానికి, మనల్ని సూచనార్థక భావంలో జల్లించడానికి సాతాను మరెన్నో మార్గాలను ఉపయోగిస్తాడు.
ఈ బలమైన శత్రువును మనమెలా ఎదిరించగలం? మనం కేవలం మన బలంపై ఆధారపడితే అది సాధ్యం కాదు. సాతాను మనకన్నా ఎంతో బలవంతుడు. అయితే సాతానుకన్నా యెహోవా ఇంకా ఎంతో బలవంతుడని మనకు తెలుసు. మనకు యెహోవాపై పూర్తి నమ్మకం ఉంటే, సహించడానికి జ్ఞానం ధైర్యం కోసం పట్టుదలతో ప్రార్థిస్తే, ఆయన మార్గనిర్దేశంపై పూర్తిగా ఆధారపడితే, సాతాను దాడుల్ని ఎదిరించేలా ఆయన మనల్ని బలపరుస్తాడు.—కీర్త. 25:4, 5.
పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు “మేలు కీడులను వివేచించే” సామర్థ్యం మనకుంటే, సాతాను తంత్రాలవల్ల మనం మోసపోకుండా ఉంటాం. (హెబ్రీ. 5:13, 14) ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి యెహోవా మనకు సహాయం చేయగలడు. ఆ తర్వాత మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరైనదే చేసేందుకు కృషిచేయాలి. మనం యెహోవా చూపించిన మార్గంలో నడిస్తే, సరైనదే చేయడానికి మనం ధైర్యంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పకుండా బలపరుస్తాడు.—ఎఫె. 6:10.
సాతాను మనల్ని గోధుమల్లా జల్లించవచ్చు. కానీ యెహోవా దయచేసే బలంతో, దృఢమైన విశ్వాసంతో అతడిని ఎదిరించవచ్చు. (1 పేతు. 5:9) “అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును” అని యెహోవా వాక్యం మనకు అభయమిస్తోంది.—యాకో. 4:7.