కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ప్రభువునందు నీవు అంగీకరించిన పరిచర్య విషయంలో జాగ్రత్తపడుము’

‘ప్రభువునందు నీవు అంగీకరించిన పరిచర్య విషయంలో జాగ్రత్తపడుము’

‘ప్రభువునందు నీవు అంగీకరించిన పరిచర్య విషయంలో జాగ్రత్తపడుము’

“ప్రభువునందు నీకు అప్పగింపబడిన [‘నీవు అంగీకరించిన,’ NW] పరిచర్యను నెరవేర్చుటకు . . . జాగ్రత్తపడుము.”​—⁠కొలొ. 4:​17.

మన పొరుగువారి విషయంలో మనకు ఒక ప్రాముఖ్యమైన బాధ్యత ఉంది. వారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, ‘మహాశ్రమలో’ వారు జీవిస్తారో మరణిస్తారో తేలుస్తాయి. (ప్రక. 7:​14) సామెతలు పుస్తక ప్రేరేపిత రచయిత ఇలా అన్నాడు: “చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా?” అవి ఎంత గంభీరమైన మాటలో కదా! ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం గురించి హెచ్చరించకపోతే మనం రక్తాపరాధులమౌతాం. వాస్తవానికి, అదే వాక్యంలో ఇంకా ఇలా ఉంది: “ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.” కాబట్టి, ప్రజలు ఎదుర్కొంటున్న అపాయకరమైన పరిస్థితి గురించి తమకు “తెలియదని” యెహోవా సేవకులు చెప్పడానికి వీలులేదు.​—⁠సామె. 24:​11, 12.

2 యెహోవా జీవాన్ని అమూల్యంగా ఎంచుతాడు. సాధ్యమైనంత ఎక్కువమంది రక్షించబడేలా సహాయం చేయడానికి శాయశక్తులా కృషి చేయాలని యెహోవా తన సేవకులను ప్రోత్సహిస్తున్నాడు. దేవుని వాక్యంలో ఉన్న ప్రాణరక్షక సందేశాన్ని దేవుని పరిచారకులందరూ ప్రకటించాలి. పొంచివున్న ముప్పును గమనించినప్పుడు కావలివాడు ఎలాగైతే హెచ్చరిస్తాడో మనం కూడా అలాగే హెచ్చరించాలి. నాశనమయ్యే ప్రమాదంలో ఉన్నవారి రక్తాపరాధం మనమీదకు రావాలని మనం కోరుకోం. (యెహె. 33:​1-7) కాబట్టి, ‘వాక్యాన్ని ప్రకటించడానికి’ మనం పట్టుదలతో కృషిచేయడం ఎంత ప్రాముఖ్యమో కదా!​—⁠2 తిమోతి 4:​1, 2, 5 చదవండి.

3 ఈ ఆర్టికల్‌లో, ప్రాణరక్షక పరిచర్యలో మీకెదురయ్యే ఆటంకాలను మీరెలా అధిగమించవచ్చో, అనేకమందికి మీరెలా సహాయం చేయవచ్చో తెలుసుకుంటారు. తర్వాతి ఆర్టికల్‌, ప్రాముఖ్యమైన సత్యాలను బోధించే బోధనా కళను మీరెలా పెంపొందించుకోవచ్చో వివరిస్తుంది. మూడవ ఆర్టికల్‌, ప్రపంచవ్యాప్తంగా రాజ్య ప్రచారకులకు లభిస్తున్న కొన్ని ప్రోత్సాహకరమైన ఫలితాల గురించి నివేదిస్తోంది. అయితే, మనం ఈ అంశాలను పరిశీలించే ముందు, మన కాలాలు ఎందుకు చాలా అపాయకరంగా ఉన్నాయో చర్చిద్దాం.

చాలామంది ఎందుకు నిరీక్షణ లేకుండా ఉన్నారు?

4 మనం “యుగసమాప్తి” సమయంలో జీవిస్తున్నామని, అంతం అతి సమీపంలో ఉందని ప్రపంచ సంఘటనలు సూచిస్తున్నాయి. “అంత్యదినములలో” ఎక్కువగా ఉంటాయని యేసు, ఆయన శిష్యులు ప్రవచించిన సంఘటనలను, పరిస్థితులను మానవులు అనుభవిస్తున్నారు. యుద్ధాలు, కరవులు, భూకంపాలు, ఇతర విపత్తులు చేరివున్న “వేదనలు” మానవులను పట్టిపీడిస్తున్నాయి. ఎక్కడ చూసినా అక్రమం, స్వార్థం, భక్తిహీన వైఖరి కనిపిస్తున్నాయి. బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించడానికి ప్రయత్నించేవారికి కూడా ఇవి ‘అపాయకరమైన కాలములే.’​—⁠మత్త. 24:​3, 6-8, 12; 2 తిమో. 3:​1-5.

5 అయితే, ఈ ప్రపంచ సంఘటనలకున్న నిజమైన ప్రాముఖ్యత గురించి చాలామందికి తెలియదు. అందుకే, చాలామంది తమ భద్రత, తమ కుటుంబ భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు. ప్రియమైనవారి మరణం లేక తమ జీవితంలో ఎదురైన విషాద ఘటనలు చాలామందికి వేదన కలిగిస్తున్నాయి. అలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయో, వాటికి పరిష్కారాన్ని ఎక్కడ కనుగొనవచ్చో ఖచ్చితంగా తెలియనందువల్ల వారు నిరీక్షణలేకుండా ఉన్నారు.​—⁠ఎఫె. 2:⁠12.

6 ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహాబబులోను” మానవులను ఏ మాత్రం ఓదార్చలేకపోయింది. వారిని ఓదార్చే బదులు అది తన “వ్యభిచార మద్యము” ద్వారా చాలామందిని ఆధ్యాత్మిక గందరగోళంలో ఊగిసలాడేలా చేసింది. అంతేకాక, అబద్ధమతం వేశ్యలా ప్రవర్తిస్తూ ‘భూరాజులను’ మోసగించి, వారిని తన అధీనంలో ఉంచుకుంది. అలాగే అది ప్రజలు తమ ప్రభుత్వాలకు పూర్తిగా లోబడేలా చేసేందుకు అబద్ధ సిద్ధాంతాలను, అభిచార సంబంధమైన ఆచారాలను ఉపయోగిస్తోంది. అలా అబద్ధమతం అధికారాన్ని, ప్రాబల్యాన్ని సంపాదించుకుంది, అయితే అది మతసంబంధమైన సత్యాన్ని మాత్రం పూర్తిగా తిరస్కరించింది.​—⁠ప్రక. 17:​1, 2, 5; 18:​22.

7 మానవుల్లో చాలామంది నాశనానికిపోయే మార్గంలో ఉన్నారని యేసు చెప్పాడు. (మత్త. 7:​13, 14) కొందరు బైబిలు బోధలను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు కాబట్టి వారు ఆ విశాల మార్గంలో ఉన్నారు. అయితే ఇతరులనేకులు మోసగించబడ్డారు లేదా యెహోవా తమనుండి నిజంగా ఏమి కోరుతున్నాడో తమ మత నాయకులు వారికి ఉపదేశించలేదు కాబట్టి ఆ మార్గంలో ఉన్నారు. బహుశా, వారిలో కొందరికి తమ జీవనశైలిని మార్చుకోవడానికిగల స్పష్టమైన లేఖన కారణాలను వివరిస్తే వారు దానిని మార్చుకోవచ్చు. కానీ మహాబబులోనులో ఉన్నవారు, బైబిలు ప్రమాణాలను అదేపనిగా తిరస్కరించేవారు మాత్రం “మహాశ్రమలో” రక్షించబడరు.​—⁠ప్రక. 7:​14.

“మానక” ప్రకటిస్తూ ఉండండి

8 యేసు, తన శిష్యులు రాజ్యసువార్తను ప్రకటించి శిష్యులను చేస్తారని చెప్పాడు. (మత్త. 28:​19, 20) అందుకే, నిజక్రైస్తవులు ప్రకటనా పనిలో పాల్గొనడాన్ని దేవునిపట్ల తమకున్న విశ్వసనీయతకు సంబంధించిన అంశంగా, తమ విశ్వాసానికి ఎంతో అవసరమైన అంశంగా ఎల్లప్పుడూ పరిగణించారు. కాబట్టి, యేసు తొలి అనుచరులు వ్యతిరేకత ఎదురైనా పట్టుదలతో ప్రకటించారు. ‘బహు ధైర్యముగా [ఆయన] వాక్యమును బోధిస్తూ’ ఉండడానికి తమకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థిస్తూ బలం కోసం వారు ఆయనమీద ఆధారపడ్డారు. దానికి జవాబుగా, యెహోవా వారిని పరిశుద్ధాత్మతో నింపగా వారు ధైర్యంతో దేవుని వాక్యాన్ని బోధించారు.​—⁠అపొ. 4:​18, 29, 30, 31.

9 వ్యతిరేకత మరింత తీవ్రమైనప్పుడు యేసు శిష్యులు సువార్త ప్రకటించడం మానేశారా? అస్సలు మానుకోలేదు. అపొస్తలుల ప్రకటనా పనినిబట్టి ఆగ్రహించిన యూదా మతనాయకులు అపొస్తలులను బంధించి, వారిని బెదిరించి, కొరడాలతో కొట్టించారు. అయినా, అపొస్తలులు “మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.” వారు “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను” అని స్పష్టంగా గ్రహించారు.​—⁠అపొ. 5:​28, 29, 40-42.

10 నేడు దేవుని సేవకుల్లో చాలామంది తమ ప్రకటనా పని కారణంగా దెబ్బలు తినలేదు లేక నిర్బంధించబడలేదు. అయితే, నిజక్రైస్తవులందరూ ఏదో ఒక విధమైన పరీక్షలను, కష్టాలను ఎదుర్కొంటారు. ఉదాహరణకు, మీ బైబిలు శిక్షిత మనస్సాక్షి కారణంగా మీరు ఇతరులు ఇష్టపడని విధంగా ప్రవర్తించాల్సిరావచ్చు లేక మీరు ఇతరులకు భిన్నంగా కనిపించవచ్చు. మీరు బైబిలు సూత్రాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి, మీరు వింతైన వ్యక్తులని తోటి ఉద్యోగులు, తోటి విద్యార్థులు, పొరుగువారు అనుకోవచ్చు. అయినా, వారి ప్రతికూల స్పందన మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు. లోకం ఆధ్యాత్మిక అంధకారంలో ఉంది, కానీ క్రైస్తవులు “జ్యోతులవలె [ప్రకాశించాలి].” (ఫిలి. 2:​14-16) బహుశా యథార్థవంతులైన కొందరు మీ సత్క్రియలను చూసి, వాటిని మెచ్చుకొని తత్ఫలితంగా యెహోవాను మహిమపర్చవచ్చు.​—⁠మత్తయి 5:16 చదవండి.

11 రాజ్య సందేశాన్ని ప్రకటిస్తూ ఉండడానికి మనకు ధైర్యం అవసరం. కొంతమంది మిమ్మల్ని అపహసించవచ్చు లేక ఏదో విధంగా మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించవచ్చు, చివరకు బంధువులు కూడా అలా చేయవచ్చు. (మత్త. 10:​36) అపొస్తలుడైన పౌలు తన పరిచర్యను నమ్మకంగా చేశాడు కాబట్టి ఆయన ఒకటికన్నా ఎక్కువసార్లు కొట్టబడ్డాడు. అలాంటి వ్యతిరేకత ఎదురైనప్పుడు ఆయన ఎలా స్పందించాడో గమనించండి: “ముందు శ్రమపడి అవమానముపొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమి” అని ఆయన రాశాడు. (1 థెస్స. 2:⁠2) ఆయన పట్టబడి, వస్త్రాలు లాగివేయబడి, బెత్తములతో కొట్టబడి, చెరసాలలో వేయబడిన తర్వాత కూడా సువార్త ప్రకటిస్తూ ఉండడానికి ఆయనకు నిజంగా ఎంతో ధైర్యం అవసరమైంది. (అపొ. 16:​19-24) ప్రకటిస్తూ ఉండడానికి కావాల్సిన ధైర్యం ఆయనకు ఎక్కడ నుండి వచ్చింది? ప్రకటించమని దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించాలనే ప్రగాఢమైన కోరికే ఆయనకు ధైర్యాన్నిచ్చింది.​—⁠1 కొరిం. 9:⁠16.

12 ప్రజలు అరుదుగా ఇళ్లల్లో ఉండే క్షేత్రాల్లో లేదా రాజ్య సందేశానికి అంతగా ప్రతిస్పందనలేని క్షేత్రాల్లో మన ఉత్సాహాన్ని కాపాడుకోవడం కూడా కష్టమే. అలాంటి పరిస్థితుల్లో మనమేమి చేయవచ్చు? ప్రజలకు అనియత సాక్ష్యమివ్వడానికి మనం అదనపు ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సిరావచ్చు. అంతేకాక, మనం ప్రకటించే సమయాన్ని మార్చుకోవాల్సిరావచ్చు లేదా చాలామందిని కలుసుకునే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రకటించేందుకు ప్రయత్నించాల్సిరావచ్చు.​—⁠యోహా. 4:​7-15 పోల్చండి; అపొ. 16:​13; 17:⁠17.

13 చాలామంది వృద్ధాప్యం, అనారోగ్యంలాంటి ఇబ్బందుల కారణంగా ప్రకటనా పనిలో ఎక్కువగా పాల్గొనలేకపోతున్నారు. మీరు వృద్ధాప్యంవల్ల లేక అనారోగ్యంవల్ల సేవలో ఎక్కువగా పాల్గొనలేకపోతే నిరుత్సాహపడకండి. యెహోవాకు మీ పరిమితులు తెలియడమేకాక, మీరు చేస్తున్న సేవనుబట్టి ఆయన సంతోషిస్తాడు. (2 కొరింథీయులు 8:​12 చదవండి.) వ్యతిరేకత, ఉదాసీనత లేక అనారోగ్యం, ఇలా మీరు ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా ఇతరులకు సువార్త ప్రకటించడానికి మీ పరిస్థితులు ​అనుమతించినంత మేరకు మీరు చేయగలిగినంతా చేయండి.​—⁠సామె. 3:​27; మార్కు 12:​41-44ను పోల్చండి.

‘మీ పరిచర్య విషయంలో జాగ్రత్తపడండి’

14 అపొస్తలుడైన పౌలు తన పరిచర్యను హృదయపూర్వకంగా చేశాడు, తోటి విశ్వాసుల్ని కూడా అలాగే చేయమని ఆయన ప్రోత్సహించాడు. (అపొ. 20:​20, 21; 1 కొరిం. 11:⁠1) పౌలు మొదటి శతాబ్దపు క్రైస్తవుడైన అర్ఖిప్పును ప్రత్యేకంగా ప్రోత్సహించాడు. ఆయన కొలొస్సయులకు రాసిన పత్రికలో, “ప్రభువునందు నీకు అప్పగింపబడిన [‘నీవు అంగీకరించిన,’ NW] పరిచర్యను నెరవేర్చుటకు . . . జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి” అని పేర్కొన్నాడు. (కొలొ. 4:​17) అర్ఖిప్పు ఎవరో, ఆయన పరిస్థితులు ఏమిటో మనకైతే తెలియదు, కానీ ఆయన పరిచర్యను అంగీకరించి ఉండవచ్చు. మీరు సమర్పిత క్రైస్తవులైతే, మీరు కూడా పరిచర్యను అంగీకరించారు. అయితే, మీరు పరిచర్యను నెరవేర్చేలా దాని విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్త వహిస్తున్నారా?

15 మన బాప్తిస్మానికి ముందు హృదయపూర్వక ప్రార్థనలో మనం యెహోవాకు మన జీవితాల్ని సమర్పించుకున్నాం. మనం ఆయన చిత్తాన్ని చేయాలని నిశ్చయించుకున్నామని దానర్థం. కాబట్టి, ఇప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘నా జీవితంలో దేవుని చిత్తం చేయడం నిజంగా అత్యంత ప్రాముఖ్యమైన అంశమా?’ మనకున్న వివిధ బాధ్యతలను నిర్వర్తించాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఉదాహరణకు మనకు కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉండవచ్చు. (1 తిమో. 5:⁠8) అయితే మనం మిగతా సమయాన్ని, శక్తిని ఎలా ఉపయోగిస్తున్నాం? మనం జీవితంలో దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం?​—⁠2 కొరింథీయులు 5:​14, 15 చదవండి.

16 మీరు జూనియర్‌ కాలేజీ విద్యను పూర్తిచేసుకున్న లేక పూర్తిచేయనున్న సమర్పిత యువక్రైస్తవులా? బహుశా మీకింకా బరువైన కుటుంబ బాధ్యతలు ఉండకపోవచ్చు. కాబట్టి, మీరు మీ జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నారు? యెహోవా చిత్తాన్ని ఉత్తమ రీతిలో చేస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటారు? చాలామంది పయినీరు సేవ చేసేందుకు తమ జీవితంలో సర్దుబాట్లు చేసుకొని, గొప్ప ఆనందాన్ని, సంతృప్తిని చవిచూశారు.​—⁠కీర్త. 110:⁠3; ప్రసం. 12:​1-2.

17 బహుశా మీరు యౌవనస్థులై ఉండవచ్చు. మీకు పూర్తికాల ఉద్యోగం ఉంది, అయితే మిమ్మల్ని మీరు పోషించుకోవడం తప్ప వేరే బాధ్యతలేవీ మీకంతగా ఉండకపోవచ్చు. మీ సమయం అనుకూలించినంతవరకు నిస్సందేహంగా మీరు సంఘ కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని ఆనందిస్తుండవచ్చు. మీరు మీ ఆనందాన్ని మరింత అధికం చేసుకునే అవకాశం ఉందా? మీరు మీ పరిచర్యను మరింత ఎక్కువగా చేయడం గురించి ఆలోచించారా? (కీర్త. 34:⁠8; సామె. 10:​22) కొన్ని ప్రాంతాల్లో, ప్రతీఒక్కరికీ సత్యాన్ని గురించిన జీవదాయక సందేశం ప్రకటించేందుకు ఎంతో సేవ చేయాల్సిన అవసరముంది. రాజ్య సందేశకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో బహుశా సేవచేసేందుకు మీరు మీ జీవితంలో సర్దుబాట్లు చేసుకోగలరా?​—⁠1 తిమోతి 6:​6-8 చదవండి.

18 అమెరికాకు చెందిన కెవన్‌, ఎలేనా ఉదాహరణ గురించి ఆలోచించండి. * ఆ ప్రాంతంలో క్రొత్తగా పెళ్లైన యువదంపతులు ఇళ్లు కొనాలనుకుంటారు, అందరిలాగే వారు కూడా ఒక ఇంటిని కొనాలనుకున్నారు. వారిద్దరు పూర్తిసమయం ఉద్యోగం చేస్తూ, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగలిగారు. అయితే, వారి ఉద్యోగాలు, ఇంటిపనుల కారణంగా పరిచర్యలో ఎక్కువగా పాల్గొనలేకపోయేవారు. తమ సమయాన్ని, శక్తిని తమ ఆస్తుల కోసమే ఎక్కువగా ధారపోస్తున్నామని వారు గుర్తించారు. అయితే వారు, సంతోషంగా ఉండే ఒక పయినీరు జంట గడుపుతున్న నిరాడంబరమైన జీవితాన్ని గమనించినప్పుడు తాము తమ జీవిత ప్రాధమ్యాలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. జ్ఞానయుక్త మైన నిర్ణయం తీసుకొనేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించిన తర్వాత, వారు తమ ఇంటిని అమ్మేసి ఒక అపార్ట్‌మెంట్‌లోకి మారారు. ఎలేనా తన ఉద్యోగస్థలంలో పార్ట్‌టైమ్‌ పనిచేస్తూ పయినీరు సేవ చేపట్టింది. తన భార్యకు పరిచర్యలో ఎదురౌతున్న అనుభవాలనుబట్టి ప్రోత్సహించబడిన కెవన్‌ తన ఉద్యోగాన్ని వదిలేసి పయినీరు సేవ చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత వారు రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ఒక దక్షిణ అమెరికా దేశానికి తరలివెళ్లారు. “మా వైవాహిక జీవితం ఎల్లప్పుడూ సంతోషకరంగానే ఉండేది, అయితే మేము దేవుని సేవను మరింత ఎక్కువ చేసేందుకు కృషి చేసినప్పుడు మా సంతోషం రెట్టింపు అయింది” అని కెవన్‌ అంటున్నాడు.​—⁠మత్తయి 6:​19-22 చదవండి.

19 నేడు భూమ్మీద సువార్త ప్రకటించడమనే అత్యంత ప్రాముఖ్యమైన పని జరుగుతోంది. (ప్రక. 14:​6, 7) అది యెహోవా నామం పరిశుద్ధపరచబడడానికి దోహదపడుతుంది. (మత్త. 6:⁠9) ప్రతి ఏడాది బైబిలు సందేశాన్ని అంగీకరించే వేలాదిమంది జీవితాలను బైబిలు సందేశం మెరుగుపరుస్తోంది, అది వారి రక్షణకు నడిపించగలదు. అయినా, “ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?” అని అపొస్తలుడైన పౌలు అడిగాడు. (రోమా. 10:​14, 15) అదెంత నిజమో కదా? మీ పరిచర్యను నెరవేర్చడానికి శాయశక్తులా కృషిచేయాలనే కృతనిశ్చయంతో మీరెందుకు ఉండకూడదు?

20 మీ బోధనా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడం ద్వారా కూడా ప్రజలు ఈ అంత్యదినాల ప్రాముఖ్యతను, తాము తీసుకునే నిర్ణయాల పర్యవసానాలను అర్థం చేసుకునేందుకు మీరు సహాయం చేయవచ్చు. మీరు ఆ నైపుణ్యాన్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చో తర్వాతి ఆర్టికల్‌ చర్చిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 23 పేర్లు మార్చబడ్డాయి.

మీరెలా జవాబిస్తారు?

• మానవులపట్ల క్రైస్తవులకు ఎలాంటి బాధ్యత ఉంది?

• మన ప్రకటనా పనిలో ఎదురయ్యే ఆటంకాలను మనం ఎలా అధిగమించాలి?

• మనం అంగీకరించిన పరిచర్యను మనమెలా నెరవేర్చవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మానవులపట్ల క్రైస్తవులకు ఎలాంటి బాధ్యత ఉంది?

3. ఈ ఆర్టికల్‌తోపాటు దీని తర్వాతి రెండు ఆర్టికల్స్‌ దేని గురించి చర్చిస్తాయి?

4, 5. మానవులు ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తున్నారు, చాలామంది వాటికెలా స్పందిస్తున్నారు?

6. “మహాబబులోను” తన అనుచరులకు ఎందుకు సహాయం చేయలేకపోయింది?

7. మానవుల్లో చాలామందికి ఏమి సంభవించవచ్చు, అయితే కొందరికి ఎలా సహాయం చేయవచ్చు?

8, 9. వ్యతిరేకత ఎదురైనప్పుడు మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏమి చేశారు, వారలా ఎందుకు చేశారు?

10. నేడు క్రైస్తవులు ఎలాంటి పరీక్షలను ఎదుర్కొంటున్నారు, అయినా వారి సత్ప్రవర్తనవల్ల ఎలాంటి ఫలితం లభించవచ్చు?

11. (ఎ) ప్రకటనా పనికి కొందరు ఎలా స్పందించవచ్చు? (బి) అపొస్తలుడైన పౌలు ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు, ఆయన దానికి ఎలా స్పందించాడు?

12, 13. కొందరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు, వాటిని అధిగమించడానికి వారెలా ప్రయత్నించారు?

14. అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు ఎలాంటి మాదిరి ఉంచాడు, ఆయన ఏ సలహా ఇచ్చాడు?

15. క్రైస్తవ సమర్పణలో ఏమి ఇమిడివుంది, అది ఏ ప్రశ్నలను ఉత్పన్నం చేయవచ్చు?

16, 17. యువక్రైస్తవులు లేక అంతగా బాధ్యతలులేనివారు ఏమి చేయడానికి ఆలోచించవచ్చు?

18. ఒక యువ జంట ఎలాంటి సర్దుబాట్లు చేసుకుంది, దానివల్ల ఎలాంటి ఫలితాలు లభించాయి?

19, 20. నేడు సువార్త ప్రకటించే పని ఎందుకు అత్యంత ప్రాముఖ్యమైనది?

[5వ పేజీలోని చిత్రం]

వ్యతిరేకత ఎదురైనా ప్రకటించడానికి ధైర్యం అవసరం

[7వ పేజీలోని చిత్రం]

ప్రజలు అరుదుగా ఇంట్లో ఉండే క్షేత్రాల్లో మీరు ప్రకటిస్తున్నట్లయితే మీరేమి చేయవచ్చు?