నేను ఒకరిని తప్పకుండా కలుసుకోవాలి!
నేను ఒకరిని తప్పకుండా కలుసుకోవాలి!
నేను ఒకరిని తప్పకుండా కలుసుకోవాలి! స్పెయిన్లో ఉంటున్న నేను ఇద్దరు పిల్లల తల్లిని. నేను తప్పకుండా కలుసుకుంటాననే వాగ్దానం ఒకరితో ఎందుకు చేశానో మీకిప్పుడు చెబుతాను.
నా బాల్యంలో మా ఇంటిలో మచ్చుకైనా శాంతి సామరస్యాలు ఉండేవి కావు. మా తమ్ముడు నాలుగేళ్ల ప్రాయంలో ఒక దుర్ఘటనలో చనిపోయినప్పుడు మా కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. దానికితోడు మా నాన్న దురలవాట్లవల్ల మా అమ్మకు అసలు సంతోషం కరువైంది. పరిస్థితులు ఎలా ఉన్నా ఆమె మాత్రం మా అన్నకు, నాకు మంచి నైతిక విలువలు నేర్పింది.
అనతికాలంలో మా అన్నకు పెళ్లైంది, నాకు కూడా పెళ్లైంది. మా పెళ్లిళ్లైన కొద్దికాలానికే మా అమ్మకు క్యాన్సర్ ఉందని తేలింది. ఆ తర్వాత ఆమె చనిపోయింది. కానీ ఆమె చనిపోయే ముందు మాకొక అమూల్యమైన నిధిని విడిచివెళ్లింది.
మా అమ్మకు పరిచయమున్న ఒకామె పునరుత్థానం గురించి లేఖనాలు ఇస్తున్న నిరీక్షణను గురించి మాట్లాడినప్పుడు మా అమ్మ బైబిలు అధ్యయనం చేయడానికి ఒప్పుకుంది. ఆమె చివరి గడియల్లో బైబిల్లోని నిరీక్షణా సందేశం ఆమె జీవితానికి సార్థకతనిచ్చి, సంతోషంగా ఉండేందుకు ఆమెకు సహాయం చేసింది.
బైబిల్లోని విషయాలు ఆమెపై చక్కని ప్రభావాన్ని చూపించడాన్ని చూసిన తర్వాత మా అన్నయ్య, నేను దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాం. నాకు రెండో సంతానం కలుగబోయే ఒక నెల ముందు నేను బాప్తిస్మం తీసుకొని ఒక యెహోవాసాక్షిని అయ్యాను. నాకు పండంటి పాప పుట్టింది, ఆమెకు లూసియా అని పేరుపెట్టాం.
నేను బాప్తిస్మం తీసుకున్న రోజు నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన రోజు. యెహోవా సేవకురాలిగా నిరంతరం సేవచేయడానికి నన్ను నేను సమర్పించుకోవడం దానికిగల ఒక కారణం. అంతేకాదు, నేనిప్పుడు నా నమ్మకాల గురించి మా ముద్దుల అబ్బాయికి, అమ్మాయికి చెప్పగలనన్న విషయం నా సంతోషానికి మరో కారణం.
ఆ సంతోషం ఎంతోకాలం నిలువలేదు. లూసియాకు నాలుగేళ్ల వయసునుండి తీవ్రమైన కడుపునొప్పి రావడం మొదలయ్యింది. చాలా వైద్య పరీక్షలు చేసిన తరువాత డాక్టరు మాకు సమస్యేమిటో వివరించాడు. ఆమె కాలేయంమీద నారింజ పండు పరిమాణంలో ఉన్న పెద్దకంతి ఏర్పడిందని చెప్పాడు. ఆ వ్యాధి పేరు న్యూరోబ్లాస్టోమా, అది వేగంగా పెరిగే క్యాన్సర్ కంతి. అలా ప్రారంభమైన లూసియా పోరాటం ఏడేళ్లపాటు సాగింది, ఆ ఏడేళ్లలో ఆమె ఎన్నో రోజులు ఆస్పత్రిలో గడపాల్సివచ్చింది.
స్వయంత్యాగ స్ఫూర్తి
ఆ కష్టకాలంలో లూసియా తరచూ నన్ను హత్తుకుని, నాకు ముద్దులు పెడుతూ ఓదార్చేది. ఆమె వ్యాధిని సహించిన విధానాన్ని చూసి ఆస్పత్రి సిబ్బంది కూడా ఎంతో ముగ్ధులయ్యారు. ఆమె ఎప్పుడూ నర్సులకు సహాయపడాలనుకునేది, పక్క వార్డుల్లో ఉన్న పిల్లలకు యోగర్ట్ (పెరుగులాంటిది), పళ్లరసాలు ఇంకా ఇతర వస్తువులను అందించడంలో వారికి సహాయపడేది. నర్సులు లూసియాకు తెల్లని కోటుతోపాటు “నర్సుల సహాయకురాలు” అని రాసివున్న చిన్న బ్యాడ్జికార్డును కూడా ఇచ్చారు.
ఆ ఆస్పత్రిలో పనిచేసే ఒక స్త్రీ లూసియా గురించి చెబుతూ, “లూసియాను చూసినప్పుడెల్లా నాకెంతో బాధేసేది. ఎంతో చురుగ్గా ఉండేది, సృజనాత్మకత ఉన్న అమ్మాయి, బొమ్మలు వేయడం అంటే ఎంతో ఇష్టపడేది. హావభావాలతో మాట్లాడేది, చిన్నదే అయినా ఎదిగిన పిల్లలా ప్రవర్తించేది.”
లూసియా దేవుని వాక్యం నుండి ధైర్యంగా, ప్రశాంతంగా ఉండడాన్ని నేర్చుకుంది. (హెబ్రీ. 4:12) దేవుని వాక్యం వాగ్దానం చేసినట్లుగా నూతనలోకంలో “మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు” అని నమ్మింది. (ప్రక. 21:4) ఇతరులపట్ల శ్రద్ధ చూపిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా బైబిలు సందేశాన్ని చెప్పేది. తను ఇక బాగవ్వనని తెలిసినప్పటికీ, పునరుత్థానం గురించిన బలమైన నిరీక్షణ ఉండడం వల్ల ఆమె ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలిగింది. (యెష. 25:8) చివరి క్షణం వరకు ఆమె వైఖరిలో ఎలాంటి మార్పులేదు.
ఆ రోజునే నేను తనను తప్పకుండా కలుస్తానని వాగ్దానం చేశాను. లూసియా తన కళ్లు తెరవలేకపోయింది. వాళ్ల నాన్న, నేను చేరోవైపున లూసియా చేతులను మా చేతుల్లో పట్టుకుని కూర్చున్నాం. నేను లూసియాతో, “బాధపడకు, నేను నిన్ను వదలి ఎక్కడికీ వెళ్లను, మెల్లగా ఊపిరి పీల్చుకో. నువ్వు పునరుత్థానం అయ్యేసరికి బాగైపోతావు. నువ్వు మళ్లీ బాధలు అనుభవించవు, నేను నీతోనే ఉంటాను” అని మెల్లగా చెవిలో చెప్పాను.
నేను ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. లూసియా పునరుత్థానం కోసం వేచివుండడం సులభం కాదని నాకు తెలుసు. కానీ నేను ఓర్పుగా యెహోవాపై నమ్మకముంచి ఆయనపట్ల యథార్థంగా ఉంటే నేను తప్పకుండా లూసియా పునరుత్థానమైనప్పుడు తనను కలుస్తాను.
లూసియా విడిచివెళ్లిన సంపద
నా భర్త అవిశ్వాసి. లూసియా ధైర్యంగా ఉండడం, సంఘం ఎంతో చక్కగా సహకరించడం నా భర్త హృదయంపై చెరగని ముద్రవేశాయి. లూసియా చనిపోయిన రోజున ఆయన నాతో, తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. కొన్ని వారాల తర్వాత ఆయన మా సంఘంలోని ఒక పెద్దను తనతో బైబిలు అధ్యయనం చేయమని కోరాడు. త్వరలోనే ఆయన అన్ని కూటాలకు హాజరవడం మొదలుపెట్టాడు. ఆయన ఎప్పటినుండో మానడానికి ప్రయత్నించినా మానుకోలేకపోయిన పొగతాగే అలవాటును యెహోవా సహాయంతో మానుకోగలిగాడు.
నేను లూసియా ఇక లేదనే దుఃఖాన్ని పూర్తిగా దిగమింగుకోలేకపోతున్నాను కానీ ఆమె మా కోసం విడిచివెళ్లిన సంపద విషయంలో మాత్రం యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలిని. నా భర్త, నేను అద్భుతమైన పునరుత్థాన నిరీక్షణను గుర్తుచేసుకుంటూ ఆమెను, ఉత్సాహంతో మెరిసే ఆమె గుండ్రటి కళ్లను, సొట్ట బుగ్గలను తిరిగి చూసే సమయాన్ని ఊహించుకుంటూ ఒకరినొకరం ఓదార్చుకుంటున్నాం.
ఆ విషాదం వేరే ఆమెను కూడా ఎంతో ప్రభావితం చేసింది. ఒక శనివారం ఉదయం వర్షం కురుస్తుండగా ఒక స్త్రీ మా ఇంటికి వచ్చింది. వాళ్ల అబ్బాయి కూడా లూసియా చదివిన స్కూల్లోనే చదువుతున్నాడు. వాళ్ల మరో అబ్బాయి కూడా 11 ఏళ్ల వయసులో క్యాన్సర్తో చనిపోయాడు. లూసియా చనిపోయిందని తెలుసుకున్న ఆమె మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. లూసియా మరణం తర్వాత నేనెలా ఉన్నానో చూడడానికి వచ్చిన ఆమె, మనం స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇతర తల్లులను ఓదార్చుదామని సలహా ఇచ్చింది.
నేను ఏ మానవులు అందించలేని నిజమైన ఓదార్పును బైబిలు వాగ్దానాల్లో కనుగొన్నానని ఆమెకు వివరించాను. నేను యోహాను 5:28, 29లోని యేసు మాటలను చదువుతున్నప్పుడు ఆమె కళ్లలో ఆశాకిరణం మెరిసింది. ఆమె బైబిలు అధ్యయనం చేయడానికి ఒప్పుకొని, కొంతకాలానికి ఆమె “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము”ను చవిచూసింది. (ఫిలి. 4:7) మేమిద్దరం బైబిలు అధ్యయనం చేస్తున్న సమయాల్లో తరచూ కాసేపు ఆగి, నూతనలోకంలో పునరుత్థానం చేయబడిన మా ఆత్మీయులను ఆహ్వానిస్తున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాం.
నిజంగానే లూసియా అల్పకాల జీవితం మా కోసం ఎల్లకాలం నిలిచివుండే సంపదను మిగిల్చి వెళ్లింది. ఆమె విశ్వాసం మా కుటుంబం ఐక్యంగా దేవుణ్ణి సేవించేలా చేసింది. అంతేకాదు నేను కూడా తనలాగే విశ్వాసంలో స్థిరంగా ఉండాలనే నా తీర్మానాన్ని మరింత బలపరిచింది. పునరుత్థాన అవకాశమున్న మన ఆత్మీయులను తప్పకుండా కలుసుకోవాలని మనమందరం కోరుకుంటాం!
[20వ పేజీలోని చిత్రం]
లూసియా గీసిన పరదైసు చిత్రం