కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవితం ఎలా సార్థకమౌతుంది?

జీవితం ఎలా సార్థకమౌతుంది?

జీవితం ఎలా సార్థకమౌతుంది?

“దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను.”​—⁠ప్రసం. 12:​13.

జీవితంలో అన్నింటిని అనుభవిస్తున్నట్లు కనిపించే ఒక వ్యక్తిని ఊహించుకోండి. ఆయన ప్రఖ్యాతిగాంచిన రాజు, భూమ్మీదున్న ధనవంతుల్లో ఒకడు, తన సమకాలీనుల్లో గొప్ప మేధావి. ఆయన ఎన్నో సాధించినా, ‘జీవితం ఎలా సార్థకమౌతుంది?’ అని తననుతాను ప్రశ్నించుకున్నాడు.

2 అలాంటి వ్యక్తి సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం నిజంగానే జీవించాడు. ఆయన పేరు సొలొమోను, ఆయన జీవితంలో సంతృప్తిని పొందడానికి తాను చేసిన ప్రయత్నాల గురించి ప్రసంగి పుస్తకంలో వివరించాడు. (ప్రసం. 1:​13) మనం సొలొమోను అనుభవం నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ప్రసంగి పుస్తకంలోని జ్ఞానయుక్త మైన మాటలు, మన జీవితాన్ని సార్థకం చేసే లక్ష్యాలను పెట్టుకునేందుకు దోహదపడగలవు.

‘గాలికోసం ప్రయాసపడడం’

3 దేవుడు భూమ్మీద ఎన్నో రమణీయమైనవాటిని సృష్టించాడు. ఆ సృష్టిలో మనకు ఎల్లప్పుడూ ఆనందం కలిగించే, మనల్ని ముగ్ధుల్ని చేసే, ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు కోకొల్లలు. అయితే, దేవుని సృష్టిని తరచిచూడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేందుకు కూడా మన జీవితం సరిపోదు. (ప్రసం. 3:​11; 8:​17) బైబిలు చెబుతున్నట్లు, మనం బ్రతికే కొద్ది దినాలు ఇట్టే గడిచిపోతాయి. (యోబు 14:​1, 2; ప్రసం. 6:​12) ఈ గంభీరమైన వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని మనం మన జీవితాన్ని జ్ఞానయుక్తంగా గడపాలి. మనం చెడు మార్గంలో నడిచేలా సాతాను లోకం మనల్ని ప్రభావితం చేయగలదు కాబట్టి, అదంత సులభమేమీ కాదు.

4 మన జీవితాలను వ్యర్థమైనవాటి కోసం వృథాచేయడం ఎంత ప్రమాదకరమైనదో తెలియజేయడానికి సొలొమోను, ప్రసంగి పుస్తకంలో ‘వ్యర్థము’ అనే పదాన్ని దాదాపు 30 సార్లు ఉపయోగించాడు. ‘వ్యర్థము’ అని అనువదించబడిన హెబ్రీ పదానికి పనికిమాలిన, అర్థం​లేని, నిష్ప్రయోజనమైన వంటి అర్థాలున్నాయి. (ప్రసం. 1:​2, 3) కొన్నిసార్లు, సొలొమోను ‘గాలికి ప్రయాసపడడం’ అనే పదబంధాన్ని ‘వ్యర్థము’ అనే పదానికి పర్యాయపదంగా ఉపయోగించాడు. (ప్రసం. 1:​14; 2:​11) నిజమే, గాలిని పట్టుకునేందుకు ప్రయత్నించడం వ్యర్థమే. ఎవరైనా దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వారికి ఏమీ చిక్కదు. బుద్ధిహీనమైన లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించడంవల్ల కూడా నిరాశే మిగులుతుంది. మనం ఈ విధానంలో ఎంతోకాలం జీవించం కాబట్టి, అలాంటి వ్యర్థమైనవాటికోసం మన సమయాన్ని వృథాచేసుకోలేం. అందుకే, ఆ తప్పు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో, సాధారణంగా ప్రజలు పెట్టుకునే లక్ష్యాల గురించి సొలొమోను చెప్పిన కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. మొదటిగా, ప్రజలు సుఖసంతోషాల కోసం, సంపదల కోసం చేసే ప్రయత్నం గురించి మనం పరిశీలిద్దాం. దాని తర్వాత, దేవుడు ఇష్టపడే పని ఎంత విలువైనదో మనం చర్చిద్దాం.

సుఖసంతోషాల కోసం ప్రయాసపడడంవల్ల ఆనందంగా ఉండగలమా?

5 నేడున్న అనేకమంది ప్రజల్లాగే సొలొమోను, సుఖసంతోషాలతో కూడిన జీవితం కోసం ప్రయాసపడడం ద్వారా సంతృప్తిని పొందేందుకు ప్రయత్నించాడు. ఆయనిలా అన్నాడు: “సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు.” (ప్రసం. 2:​10) ఆయన సుఖసంతోషాలను దేనినుండి పొందేందుకు ప్రయత్నించాడు? ప్రసంగి పుస్తకంలోని 2వ అధ్యాయం ప్రకారంగా, ఆయన ‘ద్రాక్షరసంతో తన దేహాన్ని సంతోష​పరచుకున్నాడు,’ అదే సమయంలో ఆయన ఆశానిగ్రహాన్ని కనబరిచాడు. అంతేకాక, ఆయన తోటలు నాటించడం, చెరువులు త్రవ్వించడం, రాజభవనాలను రూపకల్పనచేయడం, సంగీతాన్ని వినడం, మంచి ఆహారాన్ని ఆస్వాదించడం వంటివి కూడా చేశాడు.

6 స్నేహితులతో ఆనందంగా గడపడం తప్పని బైబిలు చెబుతోందా? ఎంతమాత్రం చెప్పడంలేదు. ఉదాహరణకు, రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత ప్రశాంతంగా భోజనం చేయడం దేవుని బహుమానమని సొలొమోను చెప్పాడు. (ప్రసంగి 2:​24; 3:​12, 13 చదవండి.) అంతేకాక, యౌవనస్థులు బాధ్యతాయుతమైన రీతిలో ‘సంతోషంగా ఉంటూ తమ హృదయాన్ని సంతుష్టిగా ఉంచుకోవాలని’ ​యెహోవాయే వారిని ప్రోత్సహిస్తున్నాడు. (ప్రసం. 11:⁠9) మనకు విశ్రాంతి, మంచి వినోదం అవసరమే. (మార్కు 6:⁠31 పోల్చండి.) అయితే, అవే మన సర్వస్వం కాకూడదు. ఉల్లాస కార్యకలాపాలు భోజనం చివర్లో తినే స్వీటులా ఉండాలే గానీ అవే భోజనంకాకూడదు. మీకు స్వీటు ఎంత ఇష్టమైనా, మీరు కేవలం దాన్నే తింటే వెగటు పుడుతుంది, మీకు కావల్సిన పోషణ కూడా లభించదు. అలాగే, జీవితంలో సుఖసంతోషాలకే ప్రాధాన్యతనివ్వడం ‘గాలి కోసం ప్రయాసపడడమే’ అని సొలొమోను గ్రహించాడు.​—⁠ప్రసం. 2:​10, 11.

7 అంతేకాక, అన్నిరకాల ఉల్లాస కార్యకలాపాలు మంచివి కావు. వాటిలో అనేకం ఆధ్యాత్మికంగా, నైతికంగా ఎంతో హానికరమైనవి. కేవలం ‘సంతోషంగా గడపాలనుకొని’ మాదక​ద్రవ్యాలకు, మద్యానికి బానిసలై, జూదమాడుతూ ఎంతమంది తమ జీవితాలను సర్వనాశనం చేసుకోలేదూ? మన హృదయాలు, కళ్లు మనకు హానికలిగించేవాటిని చేసేలా మనల్ని మోసగించగలవు, ఆలా చేసేందుకు అనుమతిస్తే వాటి పర్యావసానాలను మనం ఎదుర్కొంటామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని యెహోవా దయతో హెచ్చరించాడు.​—⁠గల. 6:⁠7.

8 అంతేకాక, మనం సుఖసంతోషాల కోసమే ప్రయాసపడితే అత్యంత ప్రాముఖ్యమైన విషయాలమీద తగిన అవధానం నిలపలేకపోతాం. జీవితం ఇట్టే గడిచిపోతుంది కాబట్టి మనం జీవించివుండే ఈ కొద్దికాలంలో మనకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యమే ఉంటుందని, మనకు సమస్యలుండవని చెప్పలేమన్నది గుర్తుంచుకోండి. అందుకే, సొలొమోను ఆ తర్వాత చెప్పినట్లు, మనం “విందు జరుగుచున్న యింటికి” వెళ్లడం కన్నా అంత్యక్రియలకు వెళ్లడం, ప్రాముఖ్యంగా యథార్థవంతులైన క్రైస్తవ సహోదరసహోదరీల అంత్యక్రియలకు వెళ్లడం మనకు ఎంతో ప్రయోజనం చేకూర్చవచ్చు. (ప్రసంగి 7:​2, 4 చదవండి.) అలాగని ఎందుకు చెప్పవచ్చు? యెహోవా నమ్మకమైన సేవకుడు మరణించినప్పుడు ఇవ్వబడే ప్రసంగాన్ని వింటూ, ఆయన జీవితం గురించి ఆలోచించినప్పుడు మనం మన జీవిత గమనాన్ని పరిశీలించుకునేందుకు ప్రోత్సహించబడవచ్చు. దానివల్ల, మనం మన శేష జీవితాన్ని జ్ఞానయుక్తంగా గడపేలా మన లక్ష్యాలను సరిచేసుకోవాల్సిన అవసరముందనే నిర్ణయానికి రావచ్చు.​—⁠ప్రసం. 12:​1, 2.

వస్తుసంపదలు మనకు సంతృప్తినిస్తాయా?

9 సొలొమోను ప్రసంగి పుస్తకం రాసేనాటికి భూమ్మీదున్న అత్యంత ఐశ్వర్యవంతుల్లో ఆయన ఒకడు. (2 దిన. 9:​22) ఆయనకు తాను కోరుకున్నవాటిని సంపాదించుకునే ధనం ఉండేది. “నేను చూసి కోరుకున్నదల్లా నేను పొందాను” అని ఆయన రాశాడు. (ప్రసం. 2:​10, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అయితే, వస్తుసంపదలు ఉన్నంతమాత్రాన సంతృప్తిగా ఉండలేమని ఆయన గ్రహించాడు. ఆయన, “ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తినొందడు” అనే నిర్ధారణకు వచ్చాడు.​—⁠ప్రసం. 5:​10.

10 వస్తుసంపదలు అశాశ్వతమైనవే అయినా, ధనం మనల్ని బలంగా ఆకర్షించగలదు. ఇటీవల అమెరికాలో జరిపిన సర్వేలో, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న 75 శాతంమంది విద్యార్థులు, “ఆర్థికంగా స్థిరపడడమే” తమ జీవిత ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఒకవేళ వారు ఆ లక్ష్యాన్ని సాధించినా, వారు నిజంగా సంతోషంగా ఉండగలరా? ఉండలేకపోవచ్చు. నిజానికి వస్తుసంపదకే ప్రాధాన్యత​నిస్తే సంతోషాన్ని, సంతృప్తిని పొందడం కష్టమని పరిశోధకులు తెలియజేశారు. ఎంతోకాలం క్రితం, సొలొమోను కూడా ఆ ముగింపుకే వచ్చాడు. ఆయన ఇలా రాశాడు: “నాకొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను . . . కూర్చుకొంటిని; . . . అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను.” * (ప్రసం. 2:​8, 11) దానికి భిన్నంగా, మనం మన జీవితంలో యెహోవాను పూర్ణహృదయంతో సేవిస్తూ ఆయన ఆశీర్వాదాన్ని పొందితే నిజమైన ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటాం.​—⁠సామెతలు 10:​22 చదవండి.

ఎలాంటి పని మనకు నిజమైన సంతృప్తినిస్తుంది?

11 యేసు, “నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను” అని అన్నాడు. (యోహా. 5:​17) యెహోవా, యేసు పనిచేయడం ద్వారా సంతృప్తి పొందుతారనడంలో సందేహంలేదు. యెహోవా తాను చేసిన సృష్టికార్యం నుండి సంతృప్తి పొందాడని సూచిస్తూ బైబిలు ఇలా తెలియజేస్తోంది: “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.” (ఆది. 1:​31) దేవుడు చేసినదంతా చూసి దేవదూతలు “జయధ్వనులు” చేయడం మొదలుపెట్టారు. (యోబు 38:​4-7) అలాగే, సంకల్పవంతమైన పని ఎంత విలువైనదో సొలొమోను గ్రహించాడు.​—⁠ప్రసం. 3:​13.

12 నిజాయితీగా పనిచేయడం ఎంత విలువైనదో చాలామంది గ్రహిస్తారు. ఉదాహరణకు, పేరుపొందిన చిత్రకారుడైన హొసే ఇలా అంటున్నాడు: “మనసులో ఊహించుకున్న చిత్రాన్ని యథాతథంగా క్యాన్వస్‌పై వేయగలిగితే పెద్ద పర్వతాన్ని అధిరోహించినంత ఆనందం కలుగుతుంది.” మిజెల్‌ * అనే వ్యాపారవేత్త ఇలా అన్నాడు: “పని చేయడం ద్వారా కుటుంబాన్ని పోషించుకోవచ్చు కాబట్టి అది సంతృప్తినిస్తుంది. ఏదో సాధించామనే తృప్తి కూడా మిగులుతుంది.”

13 అయితే, చాలా ఉద్యోగాలు విసుగుపుట్టించేవిగా ఉంటాయి, సృజనాత్మకంగా ఉండేందుకు అంతగా అవకాశాలు లభించవు. కొన్నిసార్లు ప్రజలు ఉద్యోగస్థలంలో ఉన్న వాతావరణాన్నిబట్టి నిరాశనిస్పృహలకు గురౌతారు. అంతేకాక, అన్యాయాన్ని కూడా ఎదుర్కొంటారు. సొలొమోను పేర్కొంటున్నట్లు సోమరి, బహుశా హోదాలో ఉన్న వ్యక్తులతో తనకున్న సంబంధాలను వాడుకుంటాడు కాబట్టి, కష్టపడి పనిచేసే వ్యక్తి పొందాల్సిన ప్రతిఫలాన్ని తాను చేజిక్కించుకుంటాడు. (ప్రసం. 2:​21) ఇతర విషయాలు కూడా నిరాశ కలిగించవచ్చు. ఎన్నో లాభాలు సంపాదించుకోవాలన్న ఆశతో ప్రారంభమైన వ్యాపారం, ఆర్థిక మాంద్యంవల్ల లేక అనూహ్య సంఘటనలవల్ల దెబ్బతినవచ్చు. (ప్రసంగి 9:⁠11 చదవండి.) సాధారణంగా, పనిలో విజయం సాధించడానికి ఎంతో ప్రయాసపడిన వ్యక్తి తాను ఇంతవరకు ‘గాలి కోసం ప్రయాసపడ్డానని’ గుర్తించి, నిరాశనిస్పృహలకు గురౌతాడు.​—⁠ప్రసం. 5:​16.

14 ఎన్నడూ నిరాశపరచని పని ఏదైనా ఉందా? పైన ప్రస్తావించబడిన చిత్రకారుడైన హొసే, “సంవత్సరాలు గడిచేకొద్దీ, చిత్రపటాలు కనుమరుగైపోవచ్చు లేక పాడైపోవచ్చు. కానీ ఆధ్యాత్మిక పనుల విషయంలో అలా జరగదు. నేను యెహోవాకు విధేయుడినై సువార్త ప్రకటిస్తూ, ఇతరులు దైవభక్తిగల క్రైస్తవులయ్యేందుకు సహాయం చేశాను. అది వారికి శాశ్వత ప్రయోజనం చేకూర్చింది. దానివల్ల నాకు కలిగిన ఆనందం వెలకట్టలేనిది” అని అంటున్నాడు. (1 కొరిం. 3:​9-11) మిజెల్‌ కూడా, వ్యాపారం ద్వారా వచ్చే సంతృప్తికన్నా రాజ్య సందేశం ప్రకటించడంలోనే అధిక సంతృప్తి పొందుతున్నానని చెబుతున్నాడు. “ఇతరులతో లేఖన సత్యాన్ని చర్చించిన తర్వాత అది వారి హృదయాన్ని స్పృశించిందని తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందానికి ఏదీ సాటిరాదు” అని ఆయన అంటున్నాడు.

‘నీ ఆహారం వేయుము’

15 చివరగా, జీవితం నిజంగా ఎలా సార్థకమౌతుంది? ఈ విధానంలో మనకున్న కొద్దిపాటి సమయాన్ని ఇతరులకు మేలు చేయడానికి, యెహోవాను సంతోషపరచడానికి వినియోగిస్తే మనం నిజమైన సంతృప్తిని పొందుతాం. మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు, మనం ఆధ్యాత్మిక విలువలను మన పిల్లలకు బోధించవచ్చు, యెహోవాను తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేయవచ్చు, మన సహోదరసహోదరీలతో శాశ్వత స్నేహబంధాలను ఏర్పరచుకోవచ్చు. (గల. 6:​10) ఇవన్నీ శాశ్వత ప్రయోజనాలను చేకూరుస్తాయి, వాటిని సాధించేవారు ఆశీర్వాదాలను అనుభవిస్తారు. సొలొమోను ఇతరులకు మేలు చేయడం ఎంత ప్రయోజనకరమైనదో వివరించడానికి ఎంతో ఆసక్తికరమైన పోలికను ఉపయోగించాడు. ఆయన ఇలా అన్నాడు: “నీ ఆహారమును నీళ్లమీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును.” (ప్రసం. 11:⁠1) యేసు, “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును” అని తన శిష్యులను ప్రోత్సహించాడు. (లూకా 6:​38) అంతేకాక, ఇతరులకు మేలు చేసేవారిని ఆశీర్వదిస్తానని యెహోవాయే వాగ్దానం చేశాడు.​—⁠సామె. 19:​17; హెబ్రీయులు 6:​10 చదవండి.

16 చిన్న వయసులోనే మనం మన భవిష్యత్తు విషయంలో జ్ఞానయుక్త మైన నిర్ణయాలు తీసుకోవాలని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. అలా చేస్తే, మనం తర్వాతి సంవత్సరాల్లో నిరాశనిస్పృహలకు గురికాకుండా ఉండగలుగుతాం. (ప్రసం. 12:​1, 2) లోకంలోని ఆకర్షణల కోసం ప్రాకులాడుతూ మన జీవితంలోని శ్రేష్ఠమైన సంవత్సరాలను వృథా​చేసుకొని, ఆ తర్వాత ఇంతకాలం మనం గాలికోసమే ప్రయాసపడ్డామని తెలుసుకోవడం ఎంత విచారకరం!

17 ప్రేమగల తండ్రిలాగే యెహోవా, మనం జీవితాన్ని ఆనందించాలని, ఇతరులకు మేలు చేయాలని, అనవసరమైన హృదయవేదనను తప్పించుకోవాలని కోరుకుంటున్నాడు. (ప్రసం. 11:​9, 10) అలా చేసేందుకు మీకు ఏమి దోహదపడుతుంది? ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించేందుకు ప్రయాసపడండి. కావ్యర్‌కు దాదాపు 20 ఏళ్ల క్రితం, వైద్యవృత్తి, పూర్తికాల పరిచర్య అనే రెండింటి మధ్య ఏదో ఒకటి ఎంపికచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఇలా అంటున్నాడు: “వైద్యునిగా పనిచేయడంవల్ల సంతృప్తి లభించినా, అనేకమంది సత్యం తెలుసుకునేలా సహాయం చేయడం ద్వారా నేను పొందిన ఆనందానికి ఏదీ సాటిరాదు. జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి పూర్తికాల సేవ నాకు సహాయం చేసింది. నేను పూర్తికాల సేవ ఇంకా ముందే ప్రారంభించాల్సింది అని బాధపడుతుంటాను.”

18 అయితే, మనం ప్రయాసపడి సంపాదించుకోవాల్సిన అత్యంత విలువైన విషయమేమిటి? “సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు” అని ప్రసంగి పుస్తకం చెబుతోంది. (ప్రసం. 7:⁠1) ఈ విషయాన్ని యేసు జీవితం ఎంతో చక్కగా ఉదాహరిస్తోంది. ఆయన ఖచ్చితంగా యెహోవా దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు. యేసు నమ్మకస్థునిగా ఉండి మరణించడం ద్వారా తన తండ్రి సర్వాధిపత్యం సరైనదని నిరూపించి, విమోచన క్రయధన బలిని అర్పించాడు, దానివల్ల మనం రక్షణపొందవచ్చు. (మత్త. 20:​28) ఆయన భూమ్మీదున్న కొద్దికాలంలో, జీవితం నిజంగా ఎలా సార్థకమౌతుందనే విషయంలో చక్కని మాదిరినుంచాడు. మనం ఆయన మాదిరిని అనుసరించడానికి కృషిచేయాలి.​—⁠1 కొరిం. 11:⁠1; 1 పేతు. 2:​21.

19 మనం కూడా దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవచ్చు. యెహోవా ముందు మంచి పేరు సంపాదించుకోవడం, ధనం కలిగివుండడం కన్నా ఎంతో విలువైనది. (మత్తయి 6:19-21 చదవండి.) యెహోవాకు సంతోషం కలిగించే పనులు చేయడానికి, మన జీవితాలను మెరుగుపర్చే పనులు చేయడానికి ప్రతీరోజు మనకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ఉదాహరణకు, మనం ఇతరులకు సువార్త ప్రకటించవచ్చు, మన వివాహబంధాన్నీ కుటుంబ బంధాన్నీ పటిష్ఠపరచుకోవచ్చు, వ్యక్తిగత అధ్యయనం ద్వారా, కూటాలకు హాజరుకావడం ద్వారా యెహోవాతో మన సంబంధాన్ని బలపరచుకోవచ్చు. (ప్రసం. 11:⁠6; హెబ్రీ. 13:​16) కాబట్టి, మీరు మీ జీవితాన్ని నిజంగా సార్థకం చేసుకోవాలనుకుంటున్నారా? అలా చేసుకోవాలనుకుంటే సొలొమోను ఇచ్చిన ఈ ఉపదేశాన్ని అనుసరిస్తూ ఉండండి: “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండ​వలెను, మానవకోటికి ఇదియే విధి.”​—⁠ప్రసం. 12:​13.

[అధస్సూచీలు]

^ పేరా 15 సొలొమోను వార్షిక ఆదాయం వెయ్యిన్ని మూడువందల ముప్పది రెండు మణుగులయెత్తు బంగారం (22,000 కేజీల కన్నా ఎక్కువే).​—⁠2 దిన. 9:​13.

^ పేరా 18 పేరు మార్చాం.

మీరెలా జవాబిస్తారు?

• జీవితంలో మనం పెట్టుకునే లక్ష్యాల విషయంలో గంభీరంగా ఆలోచించడానికి మనల్ని ఏది ప్రోత్సహించాలి?

• సుఖసంతోషాల కోసం, సంపదల కోసం ప్రయాసపడడాన్ని మనమెలా దృష్టించాలి?

• ఎలాంటి పని మనకు ఎల్లప్పుడూ సంతృప్తినిస్తుంది?

• మనం ప్రయాసపడి సంపాదించుకోవాల్సిన అత్యంత విలువైన విషయమేమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. ప్రసంగి పుస్తకాన్ని పరిశీలించడం ద్వారా మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

3. మనమందరం మానవ జీవితం గురించిన ఏ గంభీరమైన వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది?

4. (ఎ) ‘వ్యర్థము’ అనే పదానికి ఎలాంటి అర్థాలున్నాయి? (బి) ప్రజలు పెట్టుకునే ఏ లక్ష్యాల గురించి మనం పరిశీలిస్తాం?

5. సొలొమోను దేని నుండి సంతృప్తిని పొందేందుకు ప్రయత్నించాడు?

6. (ఎ) జీవితంలో కొన్ని మంచి విషయాలను ఆనందించడం ఎందుకు తప్పు కాదు? (బి) ఉల్లాస కార్యకలాపాల విషయంలో ఎలాంటి సమతుల్యం అవసరం?

7. మనం ఉల్లాస కార్యకలాపాలను జాగ్రత్తగా ఎందుకు ఎంపికచేసుకోవాలి?

8. మన జీవిత గమనం గురించి ఆలోచించడం ఎందుకు జ్ఞానయుక్తం?

9. ధనసమృద్ధి ఉన్నంతమాత్రాన ఏమి పొందలేమని సొలొమోను గ్రహించాడు?

10. మనం నిజమైన సంతృప్తిని, నిజమైన ఐశ్వర్యాన్ని ఎలా సంపాదించుకుంటాం?

11. పనికున్న విలువ గురించి లేఖనాలు ఏమి తెలియజేస్తున్నాయి?

12, 13. (ఎ) నిజాయితీగా పనిచేయడంవల్ల తమకు లభిస్తున్న సంతృప్తి గురించి ఇద్దరు వ్యక్తులు ఏమి చెప్పారు? (బి) కొన్నిసార్లు ఉద్యోగంలో నిరాశనిస్పృహలు ఎందుకు ఎదురుకావచ్చు?

14. ఏ పని ఎల్లప్పుడూ నిజమైన సంతృప్తినిస్తుంది?

15. జీవితం నిజంగా ఎలా సార్థకమౌతుంది?

16. మన భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడానికి ఏది సరైన సమయం?

17. శ్రేష్ఠమైన జీవితాన్ని ఎంపికచేసుకోవడానికి మీకు ఏమి సహాయం చేస్తుంది?

18. యేసు భూజీవితం ఎందుకు సార్థకమయ్యింది?

19. సొలొమోను ఏ జ్ఞానయుక్త మైన సలహా ఇచ్చాడు?

[23వ పేజీలోని చిత్రం]

ఉల్లాస కార్యకలాపాలకు మన జీవితంలో ఏ స్థానం ఇవ్వాలి?

[24వ పేజీలోని చిత్రం]

ప్రకటనా పనివల్ల మనకు అధిక సంతృప్తి ఎందుకు కలుగుతుంది?