కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యోహాను సువార్తలోని ముఖ్యాంశాలు

యోహాను సువార్తలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

యోహాను సువార్తలోని ముఖ్యాంశాలు

క్రీస్తు జీవితం గురించిన, పరిచర్య గురించిన ప్రేరేపిత వృత్తాంతాన్ని రాసినవారిలో ‘యేసు ప్రేమించిన శిష్యుడైన’ యోహాను చివరివాడు. (యోహా. 21:20) యోహాను సువార్త దాదాపు సా.శ. 98లో రాయబడింది. దానిలో మిగతా మూడు సువార్తల్లోలేని విషయాలే ఎక్కువగా ఉన్నాయి.

అపొస్తలుడైన యోహాను నిర్దిష్టమైన ఉద్దేశంతో ఈ సువార్తను రాశాడు. యోహాను తాను రాసిన విషయాల గురించి ఇలా చెబుతున్నాడు: “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.” (యోహా. 20:​31) కాబట్టి, ఈ సువార్తలో ఉన్న విషయాలు నిజంగా మనకెంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.—హెబ్రీ. 4:12

‘ఇదిగో, దేవుని గొఱ్ఱెపిల్ల’

(యోహా.1:​1–11:⁠54)

బాప్తిస్మమిచ్చు యోహాను, యేసును చూసినప్పుడు గొప్ప నమ్మకంతో ఇలా ప్రకటించాడు: “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.” (యోహా. 1:​29) యేసు సమరయ, గలిలయ, యూదయ ప్రాంతాలతోపాటు, యొర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతంలో కూడా సంచరిస్తూ ఆ ప్రాంతాల్లో ఆయన ప్రకటించి, బోధించి, అద్భుతకార్యాలు చేశాడు. ఆయన అలా చేస్తుండగా ‘అనేకులు ఆయన దగ్గరకు వచ్చి, ఆయనమీద విశ్వాసముంచారు.’​—⁠యోహా. 10:​41, 42.

యేసు చేసిన అద్భుతాల్లో, లాజరు పునరుత్థానం అసాధారణమైనది. నాలుగు రోజుల ముందు చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతకడం చూసి అనేకులు యేసుపై విశ్వాసముంచారు. అయితే ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆయనను చంపాలనుకున్నారు. కాబట్టి, యేసు బయలుదేరి “అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి” వెళ్లాడు.​—⁠యోహా. 11:​53, 54.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​35, 40​—⁠అంద్రెయ కాక ఇంకా ఏ శిష్యుడు బాప్తిస్మమిచ్చు యోహానుతోపాటు నిల్చొని ఉన్నాడు? ఈ సువార్త రచయిత ఎల్లప్పుడూ బాప్తిస్మమిచ్చు యోహానును “యోహాను”గానే పేర్కొన్నాడు గానీ ఈ సువార్తలో తన పేరును ప్రస్తావించలేదు. కాబట్టి ఈ సందర్భంలో పేరు ప్రస్తావించబడని శిష్యుడు సువార్త రచయితైన యోహానే అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

2:​20​—⁠ఏ దేవాలయం ‘నలువదియారు సంవత్సరాల్లో కట్టబడింది’? యూదయదేశపు రాజైన హేరోదు, జెరూబ్బాబెలు నిర్మించిన మందిరాన్ని పునర్నిర్మించాడు. యూదులు ఆ దేవాలయం గురించే ప్రస్తావిస్తున్నారు. చరిత్రకారుడైన జోసీఫస్‌ ప్రకారం, ఆ దేవాలయ నిర్మాణపని హేరోదు పరిపాలనలోని 18వ సంవత్సరంలో అంటే సా.శ.పూ. 18/17లో ప్రారంభమైంది. ఆలయంతోపాటు ఇతర ప్రాముఖ్యమైన నిర్మాణాలు కట్టడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది. అయితే యూదులు, ఆలయ నిర్మాణపని పూర్తవడానికి 46 సంవత్సరాలు పట్టిందని చెప్పడాన్నిబట్టి, ఆ పని సా.శ. 30లోని పస్కా పండగ తర్వాత కూడా కొనసాగిందని మనకు తెలుస్తోంది.

5:​14​—⁠వ్యాధులు పాపం చేయడంవల్ల వస్తాయా? అన్ని సందర్భాల్లో అలా రావు. యేసు స్వస్థపరచిన వ్యక్తి పుట్టుకతో వచ్చే అపరిపూర్ణత కారణంగానే 38 సంవత్సరాలు వ్యాధితో బాధపడ్డాడు. (యోహా. 5:​1-9) యేసు ఉద్దేశం ఏమిటంటే, ఆ వ్యక్తికి ఇప్పుడు దయ చూపించబడింది కాబట్టి, ఆయన రక్షణ మార్గాన్ని అనుసరించి, ఇకమీదట బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. ఆయన ఆ విధంగా పాపం చేస్తే వ్యాధికన్నా ఘోరమైనది ఆయనకు సంభవించవచ్చు. అంతేకాక ఆయన క్షమించరాని పాపం చేసి పునరుత్థానంలేని మరణాన్ని పొందడానికి అర్హుడయ్యే అవకాశం కూడా ఉంది.​—⁠మత్త. 12:​31, 32; లూకా. 12:​10; హెబ్రీ. 10:26, 27.

5:​24, 25​—⁠“మరణములో నుండి జీవములోనికి దాటియున్న” వారెవరు? ఒకప్పుడు ఆధ్యాత్మికంగా నిర్జీవస్థితిలో ఉన్నప్పటికీ, యేసు మాటలు విన్న తర్వాత ఆయనమీద విశ్వాసముంచి, తమ పాప మార్గాల్ని విడిచిపెట్టినవారిని ఉద్దేశించి యేసు అలా అన్నాడు. వారు ‘మరణములో నుండి జీవములోనికి దాటుతారు’ అంటే వారికి విధించబడిన మరణశిక్ష ఎత్తివేయబడుతుంది. అంతేకాక వారికి దేవునిమీద విశ్వాసం ఉంది కాబట్టి వారికి నిత్యజీవంపొందే ఉత్తరాపేక్ష ఇవ్వబడింది.​—⁠1 పేతు. 4:​3-6.

5:​26; 6:​53​—⁠ఒకరు ‘తనలో తానే జీవము కలిగి ఉండడం’ అంటే ఏమిటి? యేసుక్రీస్తు విషయంలోనైతే, దేవుని నుండి రెండు నిర్దిష్ట సామర్థ్యాలను ఆయన పొందడాన్ని అది సూచిస్తోంది. అంటే మానవులు యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగివుండేందుకు మార్గం సుగమం చేసే సామర్థ్యం, మృతులను పునరుత్థానం చేయడం ద్వారా వారికి జీవాన్నిచ్చే సామర్థ్యం ఆయన పొందడాన్ని సూచిస్తోంది. యేసు అనుచరుల విషయంలోనైతే, ‘తమలో తాము జీవముకలిగి’ ఉండడమంటే, వారు సంపూర్ణ​భావంలో జీవంలోకి ప్రవేశించడమని అర్థం. అభిషిక్త క్రైస్తవులు, పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడినప్పుడు అలా సంపూర్ణభావంలో జీవంలోకి ప్రవేశిస్తారు. భూనిరీక్షణగల విశ్వాసుల విషయంలోనైతే, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన ముగిసిన వెంటనే జరిగే చివరి పరీక్షలో కృతార్థులైన తర్వాతే వారు సంపూర్ణభావంలో జీవంలోకి ప్రవేశిస్తారు.​—⁠1 కొరిం. 15:​51-53; ప్రక. 20:⁠5, 7-10.

6:​64​—⁠ఇస్కరియోతు యూదా తనను అప్పగిస్తాడని యేసుకు అతణ్ణి ఎన్నుకున్నప్పటి నుండే తెలుసా? ఆయనకు తెలియదని స్పష్టమౌతోంది. అయితే, సా.శ. 32వ సంవత్సరంలో, యేసు “మీలో ఒకడు సాతాను” అని ఒక సందర్భంలో తన అపొస్తలులతో అన్నాడు, బహుశా అప్పుడే ఇస్కరియోతు యూదాలో దుష్ప్రవర్తన ‘మొదలైనట్లు’ యేసు గమనించి ఉండవచ్చు.​—⁠యోహా. 6:​66-71.

మనకు పాఠాలు:

2:⁠4. యేసు బాప్తిస్మం పొందిన, దేవుని ఆత్మాభిషిక్త కుమారునిగా తాను తన పరలోక తండ్రి నిర్దేశాన్ని తీసుకోవాలని మరియకు సూచిస్తున్నాడు. యేసు తన పరిచర్యను అప్పుడప్పుడే ప్రారంభిస్తున్నప్పటికీ, ఆయనకు ఆ గడియ గురించి తెలుసు అంటే తన బలి మరణంతో సహా తనకు అప్పగించబడిన పనిని నెరవేర్చాల్సిన సమయం గురించి ఆయనకు బాగా తెలుసు. ఆయన దేవుని చిత్తాన్ని చేసే విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఆయన తల్లియైన మరియ వంటి సన్నిహిత కుటుంబ సభ్యులకు కూడా లేదు. మనం యెహోవా దేవుణ్ణి అలాంటి కృతనిశ్చయంతోనే సేవించాలి.

3:​1-9. యూదుల అధికారియైన నీకొదేము ఉదాహరణ నుండి మనం రెండు పాఠాలను నేర్చుకుంటాం. మొదటిగా, నీకొదేము వినయాన్ని, వివేచనను కనబర్చాడు, తన ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించాడు. అంతేకాక ఒక మామూలు వడ్రంగి కుమారుణ్ణి దేవునిచేత పంపించబడిన బోధకునిగా గుర్తించాడు. అలాగే, నేడు నిజక్రైస్తవులకు వినయం అవసరం. రెండవదిగా, యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఆయన శిష్యుడ​య్యేందుకు నీకొదేము వెనకాడాడు. బహుశా మనుష్యుల భయంవల్ల, మహాసభలో తనకున్న హోదాను కోల్పో​కూడదని అనుకోవడంవల్ల, లేక ధనవ్యామోహంవల్ల ఆయన అలా చేసివుంటాడు. దీనినుండి మనమొక విలువైన పాఠాన్ని నేర్చుకోవచ్చు: అలాంటి భావాలు ‘మనం మన సిలువను [“హింసాకొయ్య,” NW]ఎత్తుకొని యేసును వెంబడించకుండా’ ఆటంకపరచనివ్వకూడదు.​—⁠లూకా 9:​23.

4:​23, 24. మన ఆరాధన దేవునికి ఆమోదకరంగా ఉండాలంటే అది బైబిల్లో తెలియజేయబడిన సత్యానికి అనుగుణంగా ఉండాలి, అది పరిశుద్ధాత్మ నిర్దేశానుసారంగా ఉండాలి.

6:​27. “నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము” కోసం కష్టపడడమంటే మన ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకోవడం కోసం కృషిచేయడమని భావం. మనం అలా చేసినప్పుడు ధన్యులమౌతాం లేక సంతోషంగా ఉంటాం.​—⁠మత్త. 5:⁠3.

6:​44. యెహోవాకు మనపట్ల శ్రద్ధ ఉంది. మనకు వ్యక్తి​గతంగా ప్రకటించబడేలా చేయడం ద్వారా, ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించి వాటిని అన్వయించుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించడం ద్వారా యెహోవా మనల్ని తన కుమారుని దగ్గరికి ఆకర్షిస్తాడు.

11:​33-36. మన మనోభావాలను వ్యక్తపరచడం బలహీనతకాదు.

ఆయనను వెంబడిస్తూ ఉండండి’

(యోహా. 11:​55–21:⁠25)

సా.శ. 33 పస్కా పండుగ దగ్గరపడుతుండగా యేసు బేతనియకు తిరిగివచ్చాడు. నీసాను 9న యేసు గాడిదపిల్లపై యెరూషలేముకు వచ్చాడు. నీసాను 10న యేసు మళ్ళీ దేవాలయానికి వచ్చాడు. తన తండ్రి నామం మహిమపరచబడాలన్న ఆయన ప్రార్థనకు జవాబుగా ఆకాశము నుండి ఒక శబ్దం ఇలా చెప్పింది: “నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును.”​—⁠యోహా. 12:⁠28.

పస్కా భోజన సమయంలో యేసు తన అనుచరులకు వీడ్కోలు ఉపదేశాన్నిచ్చి వారికోసం ప్రార్థించాడు. యేసు నిర్బంధించబడి, విచారణ చేయబడి, హింసాకొయ్యపై చంపబడి, ఆ తర్వాత పునరుత్థానం చేయబడ్డాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

14:​2​—⁠యేసు తన నమ్మకమైన అనుచరుల కోసం పరలోకంలో “స్థలము” ఎలాసిద్ధపరుస్తాడు’? వారికోసం స్థలాన్ని సిద్ధపరచడంలో భాగంగా యేసు, దేవుని సముఖమునకు వెళ్ళి తన రక్తం యొక్క విలువను దేవునికి అర్పించడం ద్వారా క్రొత్త నిబంధనను అమలులోకి తెస్తాడు. అలా సిద్ధపరచడంలో భాగంగానే ఆయన రాజ్యాధికారాన్ని స్వీకరిస్తాడు. ఆ తర్వాత ఆయన ఆత్మాభిషిక్త అనుచరుల పరలోక పునరుత్థానం ఆరంభమౌతుంది.​—⁠1 థెస్స. 4:​14-17; హెబ్రీ. 9:​12, 24-28; 1 పేతు. 1:​19; ప్రక. 11:​15.

19:​11​—⁠యేసు తనను అప్పగించినవాని గురించి పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు ఇస్కరియోతు యూదాను ఉద్దేశించే మాట్లాడాడా? ఇస్కరియోతు యూదాను ఉద్దేశించిగానీ, ఎవరో ఒక వ్యక్తిని ఉద్దేశించిగానీ యేసు అలా అనలేదు. బదులుగా, ఆయనను చంపడంలో భాగం వహించిన అపరాధులందరినీ ఉద్దేశించి యేసు అలా అన్నాడని అనిపిస్తోంది. ఆ అపరాధులు ఎవరంటే ఇస్కరియోతు యూదా, “ప్రధానయాజకులు, మహా సభవారందరు,” బరబ్బను విడుదల చేయమని కోరేలా ప్రేరేపించబడిన ‘జనసమూహములు.’​—⁠మత్త. 26:​59-65; 27:​1, 2, 20-22.

20:​17​—⁠యేసు తనను ముట్టుకోవద్దని లేదా పట్టుకోవద్దని మగ్దలేనే మరియతో ఎందుకు చెప్పాడు? ముట్టుకోవడం అని అనువదించబడిన గ్రీకు క్రియా పదానికి పట్టుకోవడం అనే భావం ఉంది. యేసు పరలోకానికి ఆరోహణం కాబోతున్నాడు కాబట్టి తాను ఆయనను ఇక ఎన్నడూ చూడనని భావించి ఆమె అలా పట్టుకొని ఉంటుంది. యేసు తాను అప్పుడే విడిచి వెళ్ళడంలేదని ఆమెకు హామీ ఇవ్వాలనే ఉద్దేశంతో, తనను అలా పట్టుకునే బదులు తన శిష్యుల దగ్గరకు వెళ్లి తన పునరుత్థానం గురించిన వార్తను వారికి తెలియజేయమని ఆమెతో చెప్పాడు.

మనకు పాఠాలు:

12:​36. “వెలుగు సంబంధులుగా” తయారవ్వాలంటే దేవుని వాక్యమైన బైబిల్లోని ఖచ్చితమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ తర్వాత, అలా సంపాదించుకున్న జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఇతరులను ఆధ్యాత్మిక అంధకారంలో నుండి దేవుని వెలుగులోకి తీసుకురావాలి.

14:⁠6. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. యేసుమీద విశ్వాసముంచి, ఆయన మాదిరిని అనుకరించడం ద్వారా మాత్రమే మనం యెహోవాకు సన్నిహితులం కాగలం.​—⁠1 పేతు. 2:⁠21.

14:​15, 21, 23, 24; 15:​10. మనం దేవుని చిత్తానికి విధేయులమైతే దేవుని ప్రేమలో, ఆయన కుమారుని ప్రేమలో నిలిచివుండగలుగుతాం.​—⁠1 యోహా. 5:⁠3.

14:​26; 16:​13. యెహోవా పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది, మనం నేర్చుకున్న విషయాలను జ్ఞప్తికి తెస్తుంది. అంతేకాక మనం సత్యాలు తెలుసుకునేందుకు సహాయంచేస్తుంది. కాబట్టి అది విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, అవగాహనను, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు సహాయం చేయగలదు. కాబట్టి, మనం ముఖ్యంగా ఆ ఆత్మను ఇవ్వమ్మని అడుగుతూ పట్టుదలతో ప్రార్థించాలి.​—⁠లూకా 11:​5-13.

21:​15, 19. యేసు పేతురును, ‘వీరికంటే [“వీటికన్నా,” NW] అంటే ఈ చేపలకన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?’ అని అడిగాడు. యేసు అలా అడగడం ద్వారా, పేతురు చేపలు పట్టే వృత్తిలో కొనసాగే బదులు తనను ఎల్లప్పుడూ అనుసరించాలనే నిర్ణయాన్ని తీసు​కోవాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పాడు. ఈ సువార్తలో ఉన్న విషయాలను పరిశీలించిన తర్వాత, మనల్ని ఆకర్షించే అవకాశమున్న వాటికన్నా ఎక్కువగా యేసును ప్రేమించాలనే దృఢనిశ్చయంతో ఉందాం. అవును, ఆయనను హృదయపూర్వకంగా అనుసరిస్తూ ఉందాం.

[31వ పేజీలోని చిత్రం]

నీకొదేము ఉదాహరణ నుండి మనమేమి నేర్చుకోవచ్చు?