కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అపొస్తలుల కార్యముల పుస్తకంలోని ముఖ్యాంశాలు

అపొస్తలుల కార్యముల పుస్తకంలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

అపొస్తలుల కార్యముల పుస్తకంలోని ముఖ్యాంశాలు

అపొస్తలుల కార్యముల పుస్తకం, క్రైస్తవ సంఘం ఎలా స్థాపించబడిందో, అదెలా అంచెలంచెలుగా విస్తరించిందో సమగ్రంగా వివరిస్తోంది. వైద్యుడైన లూకా రాసిన ఈ పుస్తకం, సా.శ. 33 నుండి సా.శ. 61 వరకు అంటే 28 సంవత్సరాల కాలంలో జరిగిన క్రైస్తవ కార్యకలాపాల గురించిన ఉత్తేజపర్చే వృత్తాంతాన్ని అందిస్తోంది.

అపొస్తలుల కార్యముల పుస్తకంలోని మొదటి భాగం అపొస్తలుడైన పేతురు పరిచర్య గురించి, తర్వాతి భాగం అపొస్తలుడైన పౌలు పరిచర్య గురించి వివరిస్తోంది. లూకా ఈ పుస్తకంలో “మేము” “మనము” లాంటి సర్వనామాలు ఉపయోగించడాన్నిబట్టి ఆయన కూడా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అక్కడున్నాడని తెలుస్తోంది. ఈ పుస్తకంలోని సందేశాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయడం ద్వారా మనం దేవుని లిఖిత వాక్యానికున్న శక్తిపట్ల, ఆయన పరిశుద్ధాత్మపట్ల మన మెప్పును ఇంకా అధికం చేసుకోవచ్చు. (హెబ్రీ. 4:​12) అంతేకాకుండా అలా అధ్యయనం చేయడం, మనం స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించేలా, రాజ్య నిరీక్షణపట్ల మన విశ్వాసాన్ని బలపర్చుకునేలా మనల్ని పురికొల్పుతుంది.

పేతురు ‘పరలోకరాజ్యపు తాళపుచెవులను’ ఉపయోగించాడు

(అపొ. 1:​1–11:​18)

అపొస్తలులు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ధైర్యంగా సాక్ష్యమిచ్చారు. పేతురు “పరలోకరాజ్యముయొక్క” మొదటి ‘తాళపుచెవిని,’ “అతని వాక్యము అంగీకరించిన” యూదులకు, యూదామత ప్రవిష్టులకు జ్ఞానాన్ని, రాజ్యంలోకి ప్రవేశించే సదవకాశాన్ని ఇచ్చేందుకు ఉపయోగించాడు. (మత్త. 16:​19; అపొ. 2:⁠5, 41) ఉప్పెనలా పెల్లుబికిన వ్యతిరేకతవల్ల శిష్యులు చెల్లాచెదురయ్యారు, దీనివల్ల ప్రకటనా పని స్తంభించిపోలేదు కానీ ఇంకా ఎక్కువగా విస్తరించింది.

సమరయవారు దేవుని వాక్యాన్ని అంగీకరించారని తెలుసుకున్న వెంటనే యెరూషలేములోవున్న అపొస్తలులు పేతురును, యోహానును వారి దగ్గరకు పంపించారు. రాజ్యంలో ప్రవేశించే అవకాశాన్ని సమరయులకు ఇవ్వడానికి పేతురు రెండవ తాళపుచెవిని ఉపయోగించాడు. (అపొ. 8:⁠14-17) బహుశా యేసు పునరుత్థానమైన ఒక సంవత్సరంలోపే తార్సువాడైన సౌలు తన వ్యక్తిత్వాన్ని మార్చుకొని, క్రైస్తవునిగా మారిపోయాడు. సా.శ. 36లో పేతురు మూడవ తాళపుచెవిని ఉపయోగించినప్పుడు, సున్నతిపొందని అన్యులపై పరిశుద్ధాత్మ వరం కుమ్మరించబడింది.​—⁠అపొ. 10:​45.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:⁠44-47; 4:⁠34, 35​—⁠విశ్వాసులు ఎందుకు తమ ఆస్తులను అమ్మి, ఆ సొమ్మును పంచిపెట్టారు? కొత్తగా విశ్వాసులైన అనేకులు సుదూర ప్రాంతాల నుండి యెరూషలేముకు వచ్చారు. వారి దగ్గర కొద్దిరోజులకు సరిపడా ఆహార పదార్థాలు మాత్రమే ఉన్నాయి. అయినా వారు తమ కొత్త విశ్వాసాన్ని గురించి ఎక్కువ తెలుసుకోవడానికీ, ఇతరులకు సాక్ష్యమిచ్చేందుకూ ఇంకొన్ని రోజులు అక్కడే ఉండాలనుకున్నారు. వారికి సహాయం చేయడానికి క్రైస్తవులు కొంతమంది తమ ఆస్తులను అమ్మి, ఆ సొమ్మును అవసరంలో ఉన్నవారికి పంచిపెట్టారు.

4:⁠13​—⁠పేతురు, యోహానులు విద్యలేని పామరులా? కాదు, వారు చదువుకున్నవారు. అయితే వారు మతపరమైన శిక్షణ పొందడానికి రబ్బీల పాఠశాలలకు వెళ్ళలేదు కాబట్టే వారు “విద్యలేని పామరులు” అని పిలువబడ్డారు.

5:​34-39​—⁠బయటి ప్రజలకు అనుమతిలేని మహాసభలో గమలీయేలు ఏమి మాట్లాడాడో లూకా ఎలా తెలుసుకోగలిగాడు? బహుశా మూడు విధాలుగా తెలుసుకునే అవకాశం ఉంది: (1) ఒకప్పుడు గమలీయేలుకు శిష్యుడైన పౌలు లూకాకు తెలియజేసివుండవచ్చు; (2) అపొస్తలులపట్ల సానుభూతివున్న మహాసభ సభ్యుల్లో నీకొదేము వంటివారిని లూకా సంప్రదించివుండవచ్చు; (3) లూకా దైవిక ప్రేరణ​ద్వారా సమాచారాన్ని పొందివుండవచ్చు.

7:⁠59​—⁠స్తెఫను యేసుకు ప్రార్థించాడా? లేదు. మనుష్యులు యెహోవానే ఆరాధించాలి, ఆయనకు మాత్రమే ప్రార్థించాలి. (లూకా 4:⁠8 *; 6:​12) స్తెఫను మామూలు సందర్భాల్లోనైతే యేసు నామాన యెహోవాకే ప్రార్థించేవాడు. (యోహా. 15:​16) అయితే ఈ సందర్భంలో స్తెఫను ‘మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచివున్న’ ఒక దర్శనాన్ని చూశాడు. (అపొ. 7:​56) యేసు చనిపోయిన వారిని పునరుత్థానం చేసే అధికారం పొందాడని స్తెఫనుకు స్పష్టంగా తెలుసు కాబట్టి, ఇక్కడాయన తనను పునరుత్థానం చేసేందుకు గుర్తుపెట్టుకోమని యేసును అడిగాడే తప్ప నేరుగా ఆయనకు ప్రార్థించలేదు.

మనకు పాఠాలు:

1:⁠8. ప్రపంచవ్యాప్తంగా యెహోవా ఆరాధకులు పరిశుద్ధాత్మ సహాయంతోనే ప్రకటనా పనిని చేయగలుగుతున్నారు.

4:​36–5:​11. కుప్రవాడైన యోసేపుకు హెచ్చరికా పుత్రుడు [ఆదరణ పుత్రుడు, అధస్సూచి] అని అర్థమున్న బర్నబా అనే పేరు పెట్టబడింది. ఆయన ఇతరులతో స్నేహపూర్వకంగా, ఆప్యాయంగా, దయగా ఉంటూ వారికి సహాయం చేసేవాడు కాబట్టే అపొస్తలులు ఆయనకు ఆ పేరు పెట్టివుండవచ్చు. మనం బర్నబాలా ఉండాలే తప్ప, వేషధారణతో అబద్ధాలాడి మోసం చేసిన అననీయ, సప్పీరాల్లా ఉండకూడదు.

9:⁠23-25. ప్రకటనా పనిని కొనసాగించేందుకు శత్రువుల నుండి పారిపోవడం పిరికితనం కాదు.

9:⁠28-30. కొన్ని స్థలాల్లో లేదా కొంతమంది వ్యక్తులకు సాక్ష్యమివ్వడం వల్ల మనం శారీరక, నైతిక, ఆధ్యాత్మిక ప్రమాదంలో పడే అవకాశముంటుంది. కాబట్టి మనం ఎక్కడ, ఎవరికి ప్రకటించాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

9:​31. సమాధానకరమైన లేదా ప్రశాంతమైన పరిస్థితులున్నప్పుడు అధ్యయనం చేయడంద్వారా, ధ్యానించడంద్వారా మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి బాగా కృషి చేయాలి. అలా చేయడం, మనం నేర్చుకున్నవి పాటించడంద్వారా యెహోవాకు భయపడి నడుచుకోవడానికి, పరిచర్యను ఉత్సాహంగా చేయడానికి సహాయం చేస్తుంది.

పౌలు ఉత్సాహంగా చేసిన పరిచర్య

(అపొ. 11:⁠19-28:⁠31)

అగబు సా.శ. 44లో బర్నబా, సౌలులు “యొక సంవత్సరం[నుండి]” ప్రకటిస్తూవున్న అంతియొకయకు వచ్చి, “గొప్ప కరవు” రాబోతోందని ప్రవచించాడు. అది రెండు సంవత్సరాల తర్వాత నెరవేరింది. (అపొ. 11:​26-28) బర్నబా, సౌలులు యెరూషలేములో సహాయక పనులను పూర్తిచేసుకొన్న తర్వాత వారిద్దరూ అంతియొకయకు తిరిగి వెళ్ళారు. (అపొ. 11:​29, 30; 12:​25) సా.శ. 47లో అంటే సౌలు మారిన దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఆయన, బర్నబాలు పరిశుద్ధాత్మచేత మిషనరీ యాత్ర కోసం పంపించబడ్డారు. (అపొ. 13:​1-4) సా.శ. 48లో వారు ‘పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన’ అంతియొకయకు తిరిగొచ్చారు.​—⁠అపొ. 14:​26.

దాదాపు తొమ్మిది నెలల తర్వాత, పౌలు (సౌలు అనే పేరు కూడా ఉంది) సీలను తన సహచరునిగా ఎన్నుకుని, తన రెండవ మిషనరీ యాత్రకు బయలుదేరాడు. (అపొ. 15:​40) యాత్ర మధ్యలో తిమోతి, లూకా కలిసి, ఆయనతో​పాటు వెళ్తారు. తర్వాత, లూకా ఫిలిప్పీలోనే ఉండి​పోయాడు. పౌలు తన మిషనరీ పనిని చేసుకుంటూ ఏథెన్సుకు, ఆ తర్వాత కొరింథుకు వెళ్లాడు. అక్కడ ఆయన అకుల, ప్రిస్కిల్లాలను కలుసుకొని, ఒక సంవత్సరం ఆరునెలలు వారి దగ్గరే ఉన్నాడు. (అపొ. 18:​11) పౌలు తిమోతిని, సీలను కొరింథులోనే విడిచి, సా.శ. 52 ప్రారంభంలో తనతోపాటు అకుల, ప్రిస్కిల్లాను తీసుకుని ఓడలో సిరియాకు వెళ్ళాడు. (అపొ. 18:​18) అకుల, ప్రిస్కిల్లాలు ఆయనతోపాటు ఎఫెసుకు వెళ్లి అక్కడే ఉండిపోతారు.

పౌలు సిరియాలోని అంతియొకయలో కొంతకాలం ఉన్న తర్వాత, సా.శ. 52లో తన మూడవ మిషనరీ యాత్రను ప్రారంభించాడు. (అపొ. 18:​23) ఎఫెసులో యెహోవా “వాక్యము ప్రబలమై వ్యాపిం[చింది].” (అపొ. 19:​20) పౌలు దాదాపు మూడు సంవత్సరాల వరకు అక్కడే ఉన్నాడు. (అపొ. 20:​31) సా.శ. 56 పెంతెకొస్తుకల్లా పౌలు యెరూషలేముకు వచ్చాడు. ఆయన బంధించబడిన తర్వాత అధికారులకు ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు. రోమాలో పౌలు రెండు సంవత్సరాల వరకు (సా.శ. 59-61 వరకు) ఒక ఇంటిలో బంధించబడ్డాడు, అయితే ఆయన అక్కడ కూడా రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ, “ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన సంగతుల[ను]” బోధించాడు.​—⁠అపొ. 28:​30, 31.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

14:7-13​—⁠లుస్త్రలోవున్న ప్రజలు ‘బర్నబాను ద్యుపతి [బృహస్పతి, అధస్సూచి] అని, పౌలును హెర్మే’ అని ఎందుకు పిలిచారు? గ్రీకు పురాణాల్లో బృహస్పతి దేవుళ్ళకు అధిపతి, అతని కుమారుడు హెర్మే తన వాక్‌పటిమకు పేరుగాంచాడు. లుస్త్రలో పౌలే ఎక్కువగా మాట్లాడాడు కాబట్టి అక్కడి ప్రజలు ఆయనను హెర్మే అని బర్నబాను బృహస్పతి అని పిలిచారు.

16:⁠6, 7​—⁠ఆసియ, బితూనియలలో ప్రకటించకూడదని పరిశుద్ధాత్మ పౌలును, ఆయన సహచరులను ఎందుకు వారించింది? పరిచర్య చేసేవారు కొంతమంది మాత్రమే ఉన్నారు. కాబట్టి, పరిశుద్ధాత్మ వారిని మరింత ఫలవంతమైన క్షేత్రాలవైపుకు నడిపించింది.

18:12-17​—⁠ప్రజలు సోస్తెనేసును కొడుతున్నప్పుడు గల్లియోను అధిపతి ఎందుకు జోక్యం చేసుకోలేదు? పౌలును వ్యతిరేకించిన అల్లరిమూకకు నాయకుడైన సోస్తెనేసుకు తగిన శాస్తే జరుగుతోందని గల్లియోను అనుకొని ఉండవచ్చు. అయితే, ఈ సంఘటనవల్ల మేలే జరిగిందనిపిస్తోంది, సోస్తెనేసు క్రైస్తవునిగా మారాడు. ఆ తర్వాత పౌలు సోస్తెనేసును “సహోదరుడు” అని పేర్కొన్నాడు.​—⁠1 కొరిం. 1:⁠1.

18:​18​—⁠పౌలు ఎలాంటి మ్రొక్కుబడి చేసుకున్నాడు? పౌలు నాజీరు మ్రొక్కుబడి చేసుకునివుండవచ్చని కొందరు పండితులు చెబుతున్నారు. (సంఖ్యా. 6:​1-21) అయితే, పౌలు ఎలాంటి మ్రొక్కుబడి చేసుకున్నాడో బైబిలు చెప్పడం లేదు. అంతేకాదు, ఆ మ్రొక్కుబడిని తను మారడానికి ముందు చేశాడా లేక ఆ తర్వాత చేశాడా, ఆయన అప్పుడే మ్రొక్కుకున్నాడా లేక దానిని చెల్లిస్తున్నాడా అనే విషయాల గురించి కూడా బైబిలేమీ చెప్పడంలేదు. విషయమేదైనా అలా మ్రొక్కుబడి చేసుకోవడం తప్పేమీ కాదు.

మనకు పాఠాలు:

12:​5-11. మనం మన సహోదరుల గురించి ప్రార్థన చేయవచ్చు, చేయాలి కూడా.

12:​21-23; 4:​14-18. దేవునికి మాత్రమే చెందాల్సిన ఘనతను హేరోదు ఇష్టపూర్వకంగా అంగీకరించాడు. స్తుతికి, గౌరవానికి తాము పాత్రులము కామనుకున్నప్పుడు వెంటనే దాన్ని స్థిరంగా తిరస్కరించిన పౌలు, బర్నబాలకు హేరోదు ఎంత భిన్నంగా ఉన్నాడో కదా! యెహోవా సేవలో మనం ఏమి చేసినా సరే దాని ఘనత మనకు రావాలని ఆశించ​కూడదు.

14:​5, 6. మనం జాగ్రత్తగా ఉంటే పరిచర్యలో కొనసాగగలుగుతాం.​—⁠మత్త. 10:​23.

14:​22. శ్రమలు వస్తాయని క్రైస్తవులకు తెలుసు. అయితే వారు తమ విశ్వాసం విషయంలో రాజీపడి ఆ శ్రమలను తప్పించుకునే ప్రయత్నం చేయరు.​—⁠2 తిమో. 3:​12.

16:⁠1, 2. క్రైస్తవ యౌవనస్థులు సంఘంలో దేవుని సేవ చేయడానికి కృషి చేయాలి, మంచి పేరు సంపాదించుకోవడం కోసం యెహోవా సహాయాన్ని కోరాలి.

16:⁠3. సువార్త ఇతరులకు అంగీకారయుక్తంగా ఉండడం కోసం లేఖన సూత్రాలకు అనుగుణంగా ఉండే ఏ పనైనా చేసేందుకు మనం వెనుకాడకూడదు.​—⁠1 కొరిం. 9:​19-23.

20:​20, 21. ఇంటింటికి సాక్ష్యమివ్వడం మన పరిచర్యలో ప్రాముఖ్యమైన భాగం.

20:​24; 21:​13. మన జీవితాన్ని కాపాడుకోవడంకన్నా దేవునిపట్ల యథార్థంగా ఉండడమే ఎంతో ప్రాముఖ్యం.

21:​21-26. మంచి సలహాను స్వీకరించడానికి మనం సుముఖంగా ఉండాలి.

25:​8-12. క్రైస్తవులు నేడు “సువార్తపక్షమున వాదించుట[కు]”, దాన్ని న్యాయపరంగా “స్థిరపరచుట[కు],” మనకున్న న్యాయపరమైన హక్కులను ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోవాలి కూడా.​—⁠ఫిలి. 1:⁠7.

26:​24, 25. ‘మనుష్యులకు’ మనం చెప్పేది వెఱ్ఱితనంగా అనిపించినా మనం “సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే” ప్రకటించాలి.​—⁠1 కొరిం. 2:⁠14.

[అధస్సూచి]

^ పేరా 13 ఆదిమ గ్రీకు భాషలో ప్రభువు అనే పదానికి బదులు యెహోవా అని ఉంది.

[30వ పేజీలోని చిత్రం]

పేతురు “రాజ్యముయొక్క తాళపుచెవు[లను]” ఎప్పుడెప్పుడు ఉపయోగించాడు?

[31వ పేజీలోని చిత్రం]

ప్రపంచవ్యాప్తంగా సాక్ష్యమిచ్చే పని పరిశుద్ధాత్మ సహాయంతోనే జరుగుతోంది