మీరు మీ విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి సిద్ధంగావున్నారా?
మీరు మీ విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి సిద్ధంగావున్నారా?
మీవిశ్వాసాన్ని సమర్థించుకోవాల్సిన పరిస్థితి మీకెప్పుడైనా ఎదురైందా? పరాగ్వేకు చెందిన సూసానా అనే 16 ఏళ్ల సహోదరికి ఏమి జరిగిందో చూడండి. ఆమె చదువుతున్న ఉన్నత పాఠశాలలో నీతిశాస్త్రాన్ని (నీతి సూత్రాలను, నడవడికి సంబంధించిన నియమాలను) బోధించే తరగతిలో, యెహోవాసాక్షులు “పాత నిబంధనను” అంగీకరించరని, యేసుక్రీస్తును, మరియను నమ్మరని ఒకరు వ్యాఖ్యానించారు. సాక్షులు వైద్యం చేయించుకోకుండా చనిపోవడానికైనా సిద్ధపడే ఛాందసులని కూడా ఆ చర్చలో పాల్గొన్న కొందరు ఆరోపించారు. ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేసేవారు?
సూసానా యెహోవాకు ప్రార్థన చేసి, జవాబివ్వడానికి చెయ్యెత్తింది. ఆ పీరియడ్ అయిపోవస్తోంది కాబట్టి మరో సందర్భంలో, యెహోవాసాక్షిగా తనకున్న నమ్మకాల గురించి వివరించడానికి అనుమతివ్వమని ఉపాధ్యాయురాలిని కోరింది. ఆమె వెంటనే దానికి అంగీకరించింది. తర్వాతి రెండు వారాలు సూసానా ప్రసంగానికి సిద్ధపడింది, ఆమె దానికోసం యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి? అనే బ్రోషూర్ను ఉపయోగించింది.
ఆ ప్రసంగం ఇచ్చే రోజు రానే వచ్చింది. మనకు యెహోవాసాక్షులు అనే పేరు ఎందుకు పెట్టబడిందో సూసానా వివరించింది. భవిష్యత్తు విషయంలో మనకున్న నిరీక్షణ గురించి, రక్తమార్పిడులను మనం ఎందుకు అంగీకరించమనే దాని గురించి కూడా ఆమె వివరించింది. ఆ తర్వాత, తనను ప్రశ్నలు అడగమని ఆమె విద్యార్థులను ఆహ్వానించింది. వారిలో చాలామంది ప్రశ్నలు అడగడానికి చెయ్యెత్తారు. వారు వేసిన ప్రశ్నలకు ఆ యౌవనస్థురాలు లేఖనాల్లో నుండి సమాధానం చెప్పడం విని ఆ ఉపాధ్యాయురాలు ముగ్ధురాలైంది.
“నేనొకసారి రాజ్యమందిరానికి వెళ్లాను, అక్కడ ఒక్క విగ్రహం కూడా లేదు” అని ఒక విద్యార్థి వ్యాఖ్యానించాడు. ఉపాధ్యాయురాలు దానికి కారణమేమిటో తెలుసుకోవాలనుకుంది. సూసానా కీర్తన 115:4-8, నిర్గమకాండము 20:4 వచనాలు చదివి వినిపించింది. దానికి ఆ ఉపాధ్యాయురాలు ఆశ్చర్యపోతూ ఇలా అంది, “విగ్రహాలు పెట్టుకోవడాన్ని బైబిలు ఖండిస్తుంటే మన చర్చీల నిండా విగ్రహాలు ఎందుకున్నాయి?”
ప్రశ్నా జవాబుల చర్చ 40 నిమిషాలపాటు కొనసాగింది. ‘రక్త రహిత చికిత్స—వైద్యశాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది (ఆంగ్లం) అనే వీడియోను చూడాలనుకుంటున్నారా?’ అని సూసానా విద్యార్థులను అడిగినప్పుడు వారందరూ ‘చూడాలనుకుంటున్నాం’ అని జవాబిచ్చారు. కాబట్టి ఉపాధ్యాయురాలు ఆ వీడియోను తర్వాతి రోజు చూపించడానికి ఏర్పాట్లు చేసింది. వారు ఆ వీడియో చూసిన తర్వాత, కొంతమంది యెహోవాసాక్షులు అంగీకరించే ప్రత్యామ్నాయ చికిత్సల గురించి సూసానా వివరించింది. దాని గురించి ఆ ఉపాధ్యాయురాలు, “ఇన్ని ప్రత్యామ్నాయ చికిత్సలున్నాయని నాకు తెలియదు. రక్తరహిత చికిత్సవల్ల ప్రయోజనాలున్నాయని కూడా నాకు తెలియదు” అని చెబుతూ, “ఈ చికిత్సలు యెహోవాసాక్షులకు మాత్రమేనా?” అని ప్రశ్నించింది. ఆ విధమైన చికిత్సలు అందరూ చేయించుకోవచ్చని విన్నప్పుడు ఆమె, “ఈ సారి యెహోవాసాక్షులు మా ఇంటికి వస్తే నేను వారిని ఆహ్వానిస్తాను” అని చెప్పింది.
సూసానా 20 నిమిషాల కోసమని సిద్ధపడిన చర్చ మూడు గంటలపాటు కొనసాగింది. వారం తర్వాత, చర్చి సభ్యులైన ఇతర విద్యార్థులు తమ నమ్మకాల గురించి ప్రసంగించారు. ముగింపులో, ప్రసంగమిచ్చిన విద్యార్థులను చాలామంది ప్రశ్నలు అడిగారు కానీ వారు తమ విశ్వాసాన్ని సమర్థించుకోలేకపోయారు. ఆ ఉపాధ్యాయురాలు వారినిలా అడిగింది, “యెహోవాసాక్షి అయిన మీ తోటి విద్యార్థిలా మీరెందుకు మీ విశ్వాసాన్ని సమర్థించుకోలేకపోతున్నారు?”
“వారు బైబిలును నిజంగా అధ్యయనం చేస్తారు. మేం చేయం” అని ఆ విద్యార్థులు దానికి జవాబిచ్చారు.
సూసానా వైపు చూస్తూ ఉపాధ్యాయురాలు ఇలా అన్నది: “మీరు బైబిలును నిజంగా అధ్యయనం చేస్తారు, అది చెప్పేదాని ప్రకారం నడుచుకోవడానికి కృషి చేస్తారు. మీరు ప్రశంసార్హులు.”
సూసానా నిశ్శబ్దంగా ఉండగలిగేదే కానీ ఆమె అలా ఉండకుండా, తన తరగతి విద్యార్థుల తప్పుడు అభిప్రాయాలను సరిచేసింది, అలా చేయడం ద్వారా ఆమె, సిరియన్లు చెరగా తీసుకుపోయిన పేరు తెలియని ఇశ్రాయేలు బాలిక మంచి మాదిరిని అనుసరించింది. ఆ బాలిక, సిరియా సైన్యాధిపతియైన నయమాను ఇంట్లో పనిచేసేది, ఆయన అసహ్యకరమైన చర్మ వ్యాధితో బాధపడేవాడు. ఆ బాలిక తన యజమానురాలితో ఇలా చెప్పింది: “షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయును.” ఆ బాలిక సత్య దేవుని గురించి సాక్ష్యమివ్వకుండా ఉండలేకపోయింది. ఆమె అలా సాక్ష్యమిచ్చినందుకు ఆమె యజమాని అయిన నయమాను యెహోవా ఆరాధకుడయ్యాడు.—2 రాజు. 5:3, 17.
అలాగే, సూసానా యెహోవా గురించి ఆయన ప్రజల గురించి ఇతరులకు సాక్ష్యమివ్వకుండా ఉండలేకపోయింది. ఇతరులు సూసానాను ఆమె నమ్మకాల గురించి అడిగినప్పుడు ఆమె తన విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి చొరవ తీసుకోవడం ద్వారా ఈ లేఖనాధారిత ఆజ్ఞకు విధేయురాలైంది: “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను, భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.” (1 పేతు. 3:15) అవకాశం వస్తే మీరు కూడా మీ విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి చొరవ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా?
[17వ పేజీలోని చిత్రం]
మీ విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి ఈ ఉపకరణాలు సహాయపడతాయి