మీకు జ్ఞాపకమున్నాయా?
మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
• మనం “స్వచ్ఛమైన భాషను” అంటే దేవుని గురించిన, ఆయన ఉద్దేశాల గురించిన సత్యాన్ని ఎలా అనర్గళంగా మాట్లాడవచ్చు? (జెఫ. 3:9, NW)
మాట్లాడే భాషలాగే, “స్వచ్ఛమైన భాషను” అనర్గళంగా మాట్లాడాలంటే మనం శ్రద్ధగా వినాలి, అనర్గళంగా మాట్లాడేవారిని అనుకరించాలి, బైబిలు పుస్తకాల పేర్లను వివిధ బైబిలు లేఖనాలను కంఠతా పట్టాలి, ఒకే విషయాన్ని పదే పదే వినాలి, లోగొంతుకతో చదవాలి, వ్యాకరణాన్ని లేదా బైబిలు సత్యానికి సంబంధించిన విషయాలను విశ్లేషించాలి, ప్రగతిసాధిస్తూ ఉండాలి, అధ్యయనానికి సరియైన సమయాన్ని కేటాయించాలి, స్వచ్ఛమైన భాషను “మాట్లాడుతూ” ఉండాలి.—8/15, 21-25 పేజీలు.
• “మూడుపేటల త్రాడు” వివాహ జీవితానికి ఎలా అన్వయించవచ్చు?
“మూడు పేటల త్రాడు” అలంకారభావంలో ఉపయోగించబడింది. (ప్రసం. 4:12) ఈ ఉపమానాన్ని వివాహజీవితానికి అన్వయించినప్పుడు వివాహ బంధంలో రెండు పేటలు భార్యాభర్తలని మనం అనుకుంటే దానికి బలాన్ని చేకూర్చే మూడవ పేట యెహోవా దేవుడు. దంపతులు దేవునికి స్థానమిచ్చినప్పుడు సమస్యలను అధిగమించేందుకు కావాల్సిన ఆధ్యాత్మిక బలాన్ని పొందడమేకాక తమ వివాహ జీవితంలో సంతోషాన్ని కూడ పొందగలుగుతారు.—9/15, 16వ పేజీ.
• హెబ్రీయులు 6:2లో “హస్తనిక్షేపణము” లేదా చేతులు తలమీదుంచడం దేన్ని సూచిస్తుంది?
తలమీద చేతులుంచడం పెద్దల నియామకాన్ని సూచించే బదులు అద్భుతమైన ఆత్మవరాలివ్వడాన్ని సూచిస్తుండవచ్చు. (అపొ. 8:14-17; 19:6)—9/15, 32వ పేజీ.
• తన పిల్లలకు ఏ అవసరాలున్నాయని మంచి తండ్రి గుర్తిస్తాడు?
(1) తండ్రి ప్రేమ, (2) ఆయన మంచి మాదిరి, (3) సంతోషకరమైన వాతావరణం, (4) దేవునితో దగ్గరి సంబంధం ఉండాలని నేర్పించడం, (5) క్రమశిక్షణలో పెట్టడం, (6) వారిని కాపాడడం వంటి అవసరాలు పిల్లలకు ఉన్నాయని గుర్తిస్తాడు.—1/1, 20-23 పేజీలు.
• బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న సహోదరులు ఇతరులను ఎలా గౌరవించాలి?
తాను చేయడానికి ఇష్టపడనివాటిని చేయమని ఇతరులకు చెప్పకుండా ఉండడం ద్వారా పెద్దలు ఇతరులను గౌరవిస్తారు. ఫలాని పని ఎందుకు చేయమని చెబుతున్నారో, లేదా ఫలాని నిర్దేశాన్ని ఎందుకు ఇస్తున్నారో వివరించడం ద్వారా కూడ వారిని గౌరవిస్తారు.—10/15, 22వ పేజీ.
• వివాహ బంధానికి కట్టుబడి ఉండడానికి తోడ్పడే అంశాలు ఏమిటి?
దానికి ఈ రెండు అంశాలు తోడ్పడతాయి (1) వివాహ జీవితానికి ప్రాముఖ్యతనివ్వండి. (2) ఏ రకంగానూ నమ్మకద్రోహం చేయకండి. మీ సంసారం సాఫీగా సాగుతున్నా ఒడుదుడుకులున్నా మీరు మీ వివాహాన్ని సంతోషదాయకం చేసుకోవడానికే ఇష్టపడుతున్నారని మీ వివాహజతకు తెలియాలి.—1/1, 12-15 పేజీలు.
• ఇశ్రాయేలు కాపరి కోలకర్రను వాడిన విధానం నుండి క్రైస్తవ పెద్దలు ఏమి నేర్చుకోవచ్చు?
కాపరి పెద్ద కొంకి కర్రతో లేదా కోలకర్రతో తన మందను తోలేవాడు. గొర్రెలు దొడ్డిలోకి వస్తున్నప్పుడూ బయటికి వెళ్తున్నప్పుడూ కాపరి ద్వారం దగ్గర నిల్చొని పట్టుకున్న ‘కోలకర్ర క్రింద’ నుండి వెళ్లేవి. అలా వెళ్లడంవల్ల కాపరి వాటిని లెక్కపెట్టగలిగేవాడు. (లేవీ. 27:32) క్రైస్తవ కాపరి కూడ తన కాపుదలలో ఉన్న దేవుని మంద గురించి బాగా తెలుసుకోవాలి. అంతేకాదు, ప్రతీ ఒక్కరి బాగోగులు కూడ ఆయనకు తెలిసుండాలి.—11/15, 9వ పేజీ.