సమగ్ర సాక్ష్యమివ్వాలనే కృతనిశ్చయంతో ఉందాం
సమగ్ర సాక్ష్యమివ్వాలనే కృతనిశ్చయంతో ఉందాం
‘ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమివ్వమని [“సమగ్రసాక్ష్యమివ్వమని,” NW] ఆయన మాకు ఆజ్ఞాపించాడు.’ —అపొ. 10:42.
ఇటలీ శతాధిపతి అయిన కొర్నేలి తన బంధువులను, మిత్రులను సమావేశపరిచినప్పుడు మనుష్యులతో దేవుడు వ్యవహరించే విధానంలో ఒక గొప్ప మార్పు చోటుచేసుకుంది. కొర్నేలి దైవభక్తిగలవాడు. యేసు గురించి ‘ప్రజలకు ప్రకటించి సమగ్ర సాక్ష్యమివ్వాలనే ఆజ్ఞ’ అపొస్తలులకు ఇవ్వబడిందని అపొస్తలుడైన పేతురు సమావేశమైనవారితో చెప్పాడు. పేతురు సాక్ష్యమివ్వడంవల్ల మంచి ఫలితాలొచ్చాయి. సున్నతిపొందని అన్యులు దేవుని పరిశుద్ధాత్మను పొంది బాప్తిస్మం తీసుకున్నారు. అలా యేసుతోపాటు పరలోకంలో రాజులుగా పరిపాలించే అవకాశం వారికి లభించింది. పేతురు సమగ్ర సాక్ష్యమివ్వడంవల్ల ఎంత మంచి ఫలితాలొచ్చాయి!—అపొ. 10:22, 34-48.
2 అది సా.శ. 36వ సంవత్సరం. దానికి రెండేళ్ల క్రితం క్రైస్తవత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తికి ఓ అనుభవం ఎదురైంది. అది ఆయన జీవితాన్నే మార్చేసింది. తార్సువాడైన సౌలు దమస్కుకు వెళ్తున్నప్పుడు యేసు ఆయనకు కనబడి, “పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడును” అని ఆజ్ఞాపించాడు. అంతేకాక, యేసు శిష్యుడైన అననీయను సౌలు కోసం వెదకమని నిర్దేశించాడు. సౌలు “అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను” కూడ సాక్ష్యమిస్తాడని యేసు అభయాన్నిచ్చాడు. (అపొ. 9:3-6, 13-20) అననీయ సౌలుతో, ‘మన పితరుల దేవుడు సకల మనుష్యులయెదుట తనకు సాక్షిగా ఉండేందుకు నిన్ను నియమించాడు’ అని చెప్పాడు. (అపొ. 22:12-16) ఆ తర్వాత పౌలుగా పేరుపొందిన సౌలు సాక్ష్యమిచ్చే నియామకాన్ని ఎంత గంభీరంగా తీసుకున్నాడు?
ఆయన సమగ్రంగానే సాక్ష్యమిచ్చాడు!
3 పౌలు ఆ తర్వాత చేసిన సాక్ష్యపు పనిని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అయితే ప్రస్తుతం మనం సుమారు సా.శ. 56వ సంవత్సరంలో పౌలు ఇచ్చిన ప్రసంగాన్ని చర్చిద్దాం. అది అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో ఉంది. ఆయన మూడవ మిషనరీ యాత్ర చివర్లో ఈ ప్రసంగాన్ని ఇచ్చాడు. ఆయన ఏజియన్ సముద్రపు ఓడరేవు అయిన మిలేతులో దిగి, తనను చూడడానికి రమ్మని ఎఫెసు సంఘంలోని పెద్దలకు కబురు పంపించాడు. ఆయన ఎఫెసుకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అయితే ఆ పెద్దలు ఆయనను కలుసుకోవాలంటే వంపులు తిరిగిన రోడ్ల మీదుగా ప్రయాణించాలి. పౌలు కబురు అందినప్పుడు ఆ పెద్దలు ఎంతగా సంతోషించివుంటారో మీరు ఊహించగలరు. (సామెతలు పోల్చండి.) వారు ఆయనను కలుసుకునేందుకు ఇష్టపడినా మిలేతుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సివుంటుంది. కొందరు సెలవు తీసుకొని ఉంటారు, మరికొందరు తమ దుకాణాలు కొన్నిరోజులపాటు మూసేసివుంటారు. వారిలాగే నేడు చాలామంది క్రైస్తవులు ప్రతీ సంవత్సరం జరిగే జిల్లా సమావేశంలో ఒక్క కార్యక్రమం కూడ తప్పిపోకుండా జాగ్రత్తపడతారు. 10:28
4 పెద్దలు మిలేతుకు వచ్చేంతవరకు అంటే ఆ మూడు నాలుగు రోజులు పౌలు ఏమి చేసివుంటాడని మీరనుకుంటున్నారు? ఆయన పరిస్థితిలో మీరు ఉంటే ఏమి చేసివుండేవారు? (అపొస్తలుల కార్యములు 17:16, 17 పోల్చండి.) ఎఫెసు పెద్దలకు పౌలు చెప్పిన మాటలనుబట్టి మనకు కొంత విషయం అర్థమౌతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఏమి చేస్తూ వచ్చాడో, ఎఫెసులో ఉన్నప్పుడు ఆయన ఏమి చేశాడో వారికి వివరించాడు. (అపొస్తలుల కార్యములు 20:18-21 చదవండి.) తనతో ఎవరూ విభేదించరనే నమ్మకంతో ఆయన, ‘నేను ఆసియలో కాలుపెట్టిన దినమునుండి ఎలా [“సమగ్రంగా,” NW] సాక్ష్యమిచ్చానో మీకు తెలుసు’ అని చెప్పాడు. యేసు తనకిచ్చిన నియామకాన్ని నిర్వర్తించాలనే కృతనిశ్చయాన్ని పౌలు చూపించాడు. ఎఫెసులో ఆయన ఆ పనిని ఎలా చేశాడు? ఆయన యూదులు ఎక్కువగా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వారికి ప్రకటించేవాడు. దాదాపు సా.శ. 52-55 మధ్యకాలంలో, పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు సమాజమందిరంలో ‘ప్రసంగిస్తూ, ఒప్పిస్తూ’ గడిపాడు. అయితే యూదులు “కఠినపరచబడినవారై యొప్పుకొనక” పోయినప్పుడు పౌలు ఆ పట్టణంలో వేరేచోట ఇతరులకు సువార్త ప్రకటించాడు. అలా ఆయన ఆ పెద్ద పట్టణంలో యూదులకు, గ్రీకు దేశస్థులకు సాక్ష్యమిచ్చాడు.—అపొ. 19:1, 8, 9.
5 కొంతకాలానికి వారిలో కొందరు సంఘ పెద్దలయ్యేందుకు అర్హులయ్యారు. పౌలు మిలేతులో ఉన్నప్పుడు వారితోనే మాట్లాడాడు. పౌలు తాను ఎలా సాక్ష్యమిచ్చాడో వారికి గుర్తుచేశాడు. ఆయన వారితో, “ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధిం[చాను]” అని చెప్పాడు. ఆయన ఇక్కడ విశ్వాసులకు చేసిన కాపరి సందర్శనాల గురించి మాట్లాడుతున్నాడని మనకాలంలో కొందరు వాదించారు. అయితే వారి వాదన సరికాదు. ‘బహిరంగంగా, ఇంటింటా బోధించడం’ అనే మాట ముఖ్యంగా అవిశ్వాసులకు చేసే సాక్ష్యపు పనికి వర్తిస్తుందని పౌలు తర్వాత చెప్పిన మాటలనుబట్టి స్పష్టమౌతుంది. ఆయన “దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును” సాక్ష్యమిచ్చానని చెప్పాడు. పశ్చాత్తాపపడి, యేసు పట్ల విశ్వాసముంచాల్సిన అవిశ్వాసులకు పౌలు సాక్ష్యమిచ్చాడని దీన్నిబట్టి స్పష్టమౌతుంది.—అపొ. 20:20, 21.
6 క్రైస్తవ గ్రీకు లేఖనాలను విశ్లేషించిన ఒక విద్వాంసుడు, అపొస్తలుల కార్యములు 20:20 గురించి ఇలా చెప్పాడు: “పౌలు ఎఫెసులో మూడు సంవత్సరాలు ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు ప్రతీ ఇంటికి వెళ్లాడు. అలా వెళ్లలేకపోయాడనుకున్నా ఆయన ప్రతీఒక్కరికైతే ప్రకటించాడు (26వ వచనం). ఈ లేఖనంలో ఆయన ఇంటింటా, బహిరంగంగా ప్రకటించాడనడానికి కావాల్సిన రుజువు ఉంది.” ఆ విద్వాంసుడు చెబుతున్నట్లు పౌలు అక్షరాలా ప్రతీ ఇంటికి వెళ్లి ప్రకటించాడో లేదో మనకు తెలియదు గానీ తాను ఎలా సాక్ష్యమిచ్చాడో, దానివల్ల ఎలాంటి ఫలితాలొచ్చాయో ఎఫెసు పెద్దలు మరచిపోకూడదని పౌలు ఆశించాడు. ఆయన చేసిన సాక్ష్యపు పని గురించి లూకా ఇలా చెప్పాడు: “యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.” (అపొ. 19:10) అయితే, ఆసియలోని “వారందరూ” వాక్యాన్ని ఎలా వినగలిగారు? మన సాక్ష్యపు పని గురించి ఇది ఏమి తెలియజేస్తుంది?
7 పౌలు బహిరంగంగా, ఇంటింటా ప్రకటించినప్పుడు ఆయన చెప్పిన సందేశాన్ని ఎంతోమంది విన్నారు. ఆయన సందేశాన్ని విన్నవారందరూ వ్యాపారానికి మరోచోటికి వెళ్లకుండా, తమ బంధువుల దగ్గరికి వెళ్లకుండా, ప్రశాంతత కోసం వేరే ప్రాంతానికి వెళ్లకుండా ఎఫెసులోనే ఉండిపోయారని మీరనుకుంటున్నారా? అలా ఉండిపోయే అవకాశమే లేదు. చాలామంది నేడు ఆ కారణాలతోనే వేరే ప్రాంతానికి తరలివెళ్లారు, మీరూ అలా తరలివెళ్లుంటారు. అంతేకాక, ఆ కాలంలో ఇతర ప్రాంతాలవారు తమ బంధుమిత్రులను కలుసుకోవడానికో వ్యాపార పనుల నిమిత్తమో ఎఫెసుకు వచ్చేవారు. వారు అక్కడికి వచ్చినప్పుడు పౌలును కలుసుకొనివుంటారు లేదా ఆయన సాక్ష్యాన్ని వినుంటారు. తమ సొంత ఊళ్లకు చేరుకున్న తర్వాత వారు ఏమి చేసివుంటారు? సత్యాన్ని స్వీకరించినవారు సాక్ష్యమిచ్చివుంటారు. మరికొందరు విశ్వాసులుగా మారకపోయినా ఎఫెసులో విన్నదాని గురించి ఇతరులకు చెప్పివుంటారు. అలా వారి బంధువులు, పొరుగువారు లేదా తమతో వ్యాపార లావాదేవీలు జరిపేవారు సత్యాన్ని విన్నారు. వారిలో కొందరు దాన్ని స్వీకరించివుంటారు. (మార్కు 5:14 పోల్చండి.) మీరు సమగ్రంగా సాక్ష్యమివ్వడంవల్ల వచ్చే ఫలితాల గురించి ఇదేమి తెలియజేస్తుంది?
8 ఎఫెసులో తాను చేసిన పరిచర్య గురించి రాస్తూ పౌలు “ఫలవంతమైన కార్యాలు చెయ్యటానికి నాకొక గొప్ప అవకాశం” దొరికిందని అన్నాడు. (1 కొరిం. 16:8, 9, ఈజీ-టు-రీడ్ వర్షన్) ఆయనకు ఏ అవకాశం దొరికింది? ఎలా దొరికింది? పౌలు ఎఫెసులో ఎంతోకాలం పరిచర్య చేయడంవల్ల సువార్త వ్యాప్తిచెందింది. ఎఫెసుకు కొంత దూరంలో ఉన్న కొలొస్సయి, లవొదికయ, హియెరాపొలి పట్టణాల ఉదాహరణ చూద్దాం. పౌలు ఆ మూడు పట్టణాలకు ఎప్పుడూ వెళ్లలేదు. కానీ సువార్త వారికి చేరుకుంది. ఎపఫ్రా ఆ ప్రాంతానికి చెందినవాడే. (కొలొ. 2:1; 4:12, 13) పౌలు సాక్ష్యాన్ని ఎఫెసులో విని ఎపఫ్రా క్రైస్తవుడయ్యాడా? బైబిలు దాని గురించి స్పష్టంగా ఏమి చెప్పడంలేదు. అయితే, పౌలు ప్రతినిధిగా ఆయన తన సొంత పట్టణంలో సత్యాన్ని ప్రకటించివుంటాడు. (కొలొ. 1:7,8) ఎఫెసులో పౌలు పరిచర్య చేసిన సంవత్సరాల్లో క్రైస్తవ సందేశం ఫిలదెల్ఫియ, సార్దీస్, తుయతైర వంటి పట్టణాలకు కూడ చేరివుంటుంది.
9 కాబట్టి, పౌలు చెప్పిన ఈ మాటలను ఎఫెసులోని పెద్దలు అంగీకరించడానికి తగినన్ని కారణాలున్నాయి: “అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి [‘సమగ్ర,’ NW] సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.” 2009 కోసం ఎంపిక చేయబడిన ప్రోత్సాహకరమైన, పురికొల్పునిచ్చే వార్షికవచనాన్ని ఆ లేఖనం నుండి తీసుకున్నారు, దానిలో ఇలా ఉంది: ‘సువార్త గురించి సమగ్రంగా సాక్ష్యమివ్వండి.’—అపొ. 20:24, NW.
మనకాలంలో సమగ్రంగా సాక్ష్యమివ్వడం
10 ‘సువార్తను గురించి ప్రజలకు సమగ్ర సాక్ష్యం ఇవ్వమనే’ ఆజ్ఞ అపొస్తలులకే కాదు ఇతరులకు కూడ వర్తిస్తుంది. గలిలయలో సమకూడిన దాదాపు 500మంది శిష్యులతో మాట్లాడుతూ పునరుత్థానం చేయబడిన యేసు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” ఆ ఆజ్ఞ మనకాలంలోని నిజ క్రైస్తవులందరికీ వర్తిస్తుంది, ఎందుకంటే ఆయన ఇలా అన్నాడు: “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.”—మత్త. 28:19, 20.
11 ఉత్సాహంగల క్రైస్తవులు ‘సమగ్రంగా సాక్ష్యమిచ్చేందుకు’ ప్రయత్నిస్తూ ఆ ఆజ్ఞకు లోబడతారు. పౌలు ఎఫెసులోని పెద్దలకు చెప్పిన ప్రకారం ప్రాముఖ్యంగా ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం ద్వారా మనం అలా చేయవచ్చు. చక్కని ఫలితాలిచ్చే మిషనరీ సేవ గురించి 2007లో తాను రాసిన ఒక పుస్తకంలో డేవిడ్ జి. స్టూవర్ట్ జూనియర్ ఇలా రాశాడు: ‘యెహోవాసాక్షులు వేదికపైనుండి అర్థంకాని సిద్ధాంతపరమైన ఉపన్యాసాలను ఇచ్చే బదులు తమ నమ్మకాలను ఇతరులతో ఎలా పంచుకోవాలో బోధిస్తారు. అది ఎంతో మంచి ఫలితాలనిచ్చింది. తమ నమ్మకాలను ఇతరులకు చెప్పడానికి చాలామంది యెహోవాసాక్షులు ఇష్టపడతారు.’ వారలా సాక్ష్యమివ్వడంవల్ల వచ్చిన ఫలితాలేమిటి? ‘1999లో నేను తూర్పు ఐరోపాలోని రెండు ముఖ్యపట్టణాల్లో సర్వేచేశాను. వారిలో కేవలం 2 నుండి 4 శాతం మందే తమకు లేటర్ డే సెయింట్లు లేదా “మార్మొన్లు” సువార్త ప్రకటించారని చెప్పారు. అయితే దాదాపు 70 శాతంమంది యెహోవాసాక్షులు చాలాసార్లు తమను కలుసుకున్నారని చెప్పారు.’
12 మీ ప్రాంతంలోని ప్రజలు యెహోవాసాక్షుల పని గురించి అలాగే చెప్పుకుంటుండవచ్చు. మీకూ దానిలో వంతు ఉండొచ్చు. మీరు ఇంటింటి పరిచర్యలో ప్రజలను “వ్యక్తిగతంగా కలుసుకొని” స్త్రీలు, పురుషులు, యువకులు అనే తేడా లేకుండా ఆందరికీ ప్రకటించివుంటారు. కొందరిని “ఎన్నోసార్లు” కలుసుకున్నా వారు వినకపోయుండొచ్చు. మరికొందరు బైబిలు వచనాన్ని లేదా లేఖనంలోని ఒక అంశాన్ని వివరిస్తున్నప్పుడు కొద్దిగా వినుండొచ్చు. ఇంకా కొందరికి మీరు చక్కని సాక్ష్యమివ్వగలిగారు, వారు దాన్ని సంతోషంగా స్వీకరించారు. మనం ‘సువార్త గురించి సమగ్రంగా సాక్ష్యమిస్తున్నప్పుడు’ అలాంటి ప్రతిస్పందనలు మనకు ఎదురుకావచ్చు. “ఎన్నోసార్లు” కలుసుకున్నా పెద్దగా ఆసక్తి చూపించనివారు ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకున్న ఉదాహరణలు మీకు ఎన్నో తెలిసేవుంటాయి. వారికిగానీ, వారి ఆత్మీయులకుగానీ ఏదో జరగడంవల్ల వారు తమ మనసులను మార్చుకొని సత్యాన్ని అంగీకరించివుంటారు. వారిప్పుడు మన సహోదసహోదరీలు. కాబట్టి, ఇటీవల మీ సందేశాన్ని ఎవరూ వినకపోయినా నిరుత్సాహపడకండి. ప్రతీ ఒక్కరూ సత్యంలోకి వస్తారని ఆశించలేం. అయినా మనం శ్రద్ధతో ఉత్సాహంగా సమగ్ర సాక్ష్యమిస్తూ ఉండాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు.
మనం ఊహించని ఫలితాలు
13 పౌలు పరిచర్యవల్ల ఆయన సాక్ష్యాన్ని విన్నవారు మాత్రమే క్రైస్తవులుగా మారలేదు. మన విషయంలోనూ అంతే. ఇంటింటి పరిచర్యలో క్రమంగా పాల్గొని వీలైనంత ఎక్కువమందికి ప్రకటించడానికి ప్రయత్నిస్తాం. మనం పొరుగువారికి, తోటి ఉద్యోగులకు, తోటి విద్యార్థులకు, బంధువులకు సువార్త ప్రకటిస్తాం. మన ప్రయత్నాలకు ఎలాంటి ఫలితాలొస్తాయో మనకు తెలుస్తుందా? కొందరి విషయంలో వెంటనే మంచి ఫలితాలు రావచ్చు. మరికొందరి విషయంలోనైతే సత్యమనే విత్తనం వెంటనే కాకపోయినా కొంతకాలానికి వారి హృదయంలో మొలకెత్తి అభివృద్ధిచెందవచ్చు. ఒకవేళ అలా జరగకపోయినా, మనం ఎవరితోనైతే మాట్లాడతామో వారు మనం చెప్పిన విషయాల గురించి, మన నమ్మకాల గురించి, మన ప్రవర్తన గురించి ఇతరులకు చెప్పవచ్చు. వారు సత్యపు విత్తనాలను తమకు తెలియకుండానే దాన్ని ఇష్టపడేవారి హృదయంలో నాటవచ్చు.
14 మచ్చుకు ఒక ఉదాహరణ చూద్దాం, రాయన్, ఆయన భార్య మ్యాండీ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు. రాయన్ తన ఉద్యోగ స్థలంలో తోటి ఉద్యోగస్థునికి అనియత సాక్ష్యమిచ్చాడు. హిందూ మతానికి చెందిన ఆ వ్యక్తి రాయన్ కనబడే తీరునుబట్టి, మాట్లాడేతీరునుబట్టి ముగ్ధుడయ్యాడు. మాటల మధ్యలో రాయన్ పునరుత్థానం, చనిపోయినవారి స్థితి వంటి విషయాల గురించి ప్రస్తావించాడు. జనవరి నెలలో ఒక సాయంత్రం ఆ వ్యక్తి యెహోవాసాక్షుల గురించి ఏమైనా తెలుసా అని తన భార్య జోడీని అడిగాడు. ఆమె క్యాథలిక్ కాబట్టి, సాక్షులు “ఇంటింటి పరిచర్య”లో పాల్గొంటారని మాత్రం తనకు తెలుసని చెప్పింది. అందుకే ఆమె ఇంటర్నెట్లో “యెహోవాసాక్షులు” అనే పేరు కోసం వెతికినప్పుడు ఆమెకు www.watchtower.org. అనే వెబ్సైట్ దొరికింది. ఆ వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని, బైబిలును, ఆసక్తికరమైన ఆర్టికల్స్‌ను కొన్ని నెలలు చదువుతూ వచ్చింది.
15 జోడీ మ్యాండీలు నర్సులు కాబట్టి, కొంతకాలానికి వారిద్దరు కలుసుకునే అవకాశం దొరికింది. జోడీ అడిగిన ప్రశ్నలకు మ్యాండీ జవాబులిచ్చింది. కొన్నిరోజుల తర్వాత మళ్లీ చర్చించుకునే అవకాశం వారికి దొరికింది. జోడీ ఆ చర్చను “ఆదాము నుండి అర్మగిద్దోను” వరకున్న విషయాలమీద జరిగిన చర్చ అని అంటోంది. జోడీ బైబిలు అధ్యయనానికి అంగీకరించి, కొంతకాలానికి రాజ్యమందిరానికి వెళ్లడం మొదలుపెట్టింది. అక్టోబరులో జోడీ బాప్తిస్మం తీసుకోని ప్రచారకురాలైంది. ఫిబ్రవరిలో బాప్తిస్మం తీసుకుంది. ఆమె ఇలా రాసింది: “ఇప్పుడు నేను సత్యం తెలుసుకొని ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను.”
16 తాను ఒక వ్యక్తికి సాక్ష్యమిస్తే మరొకరు సత్యంలోకి వస్తారని రాయన్ అసలు అనుకోలేదు. నిజమే, ‘సమగ్ర సాక్ష్యమివ్వాలనే’ కృతనిశ్చయంతో ప్రకటించడంవల్ల వచ్చిన ఫలితాలను రాయన్ స్వయంగా చూడగలిగాడు. మీ విషయంలోనైతే మీరు ఇంటింటా, ఉద్యోగస్థలంలో, పాఠశాలలో సాక్ష్యమిస్తున్నప్పుడు లేదా అనియత సాక్ష్యమిస్తున్నప్పుడు మీరు ఎవరితోనైతే మాట్లాడతారో వారి నుండి ఇతరులకు మీకు తెలియకుండానే సువార్త చేరవచ్చు. ‘ఆసియలో’ తన సాక్ష్యపు పనివల్ల వచ్చిన ఫలితాలను పౌలు చూడనట్లే, మీరు సమగ్ర సాక్ష్యమివ్వడంవల్ల వచ్చిన సత్ఫలితాలన్నిటినీ చూసే అవకాశం ఉండకపోవచ్చు. (అపొస్తలుల కార్యములు 23:11; 28:23 చదవండి.) కాబట్టి, మీరు సమగ్రంగా సాక్ష్యమిస్తూ ఉండడం ఎంత ప్రాముఖ్యం!
17 ఇంటింటి పరిచర్య ద్వారా మరితర విధానాల ద్వారా సాక్ష్యమివ్వాలని మనకు ఇవ్వబడిన ఆజ్ఞను 2009వ సంవత్సరంలో మనం గంభీరంగా తీసుకుందాం. అప్పుడు మనం పౌలులాగే ఇలా చెప్పగలుగుతాం: “అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి [‘సమగ్ర,’ NW] సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.”
మీరెలా జవాబిస్తారు?
• మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పేతురు, పౌలు, మరితరులు ఎలా సమగ్రంగా సాక్ష్యమిచ్చారు?
• మన సాక్ష్యపుపనివల్ల ఎందుకు అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలు రావచ్చు?
• 2009 వార్షిక వచనం ఏమిటి? ఇది ఈ సంవత్సరానికి తగినదే అని మీకు ఎందుకు అనిపిస్తుంది?
[అధ్యయన ప్రశ్నలు]
1. కొర్నేలి ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు, తమకు ఏ ఆజ్ఞ ఇవ్వబడిందని పేతురు చెప్పాడు?
2. సాక్ష్యమివ్వాలనే ఆజ్ఞ కేవలం 12 మంది అపొస్తలులకు మాత్రమే ఇవ్వబడలేదని మనకు ఎలా తెలుసు?
3. (ఎ) మనం ఇప్పుడు ఏ వృత్తాంతాన్ని చర్చించనున్నాం? (బి) పౌలు కబురు అందిన తర్వాత ఎఫెసు పెద్దలు ఏమి చేశారు, వారు మనకు ఎలాంటి మాదిరినుంచారు?
4. పౌలు ఎఫెసులో కొన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు సాక్ష్యమివ్వడానికి ఏ పద్ధతి పాటించాడు?
5, 6. పౌలు ఇంటింటా ప్రకటించినప్పుడు అవిశ్వాసులతో మాట్లాడాడని మనం ఎందుకు నమ్మవచ్చు?
7. పౌలు సాక్ష్యమివ్వడంవల్ల ఆయన సాక్ష్యాన్ని విన్నవారే కాక, ఇతరులు కూడ ఎలా ప్రయోజనం పొందివుంటారు?
8. ఆసియా ప్రాంతంలోని ప్రజలందరూ సత్యాన్ని ఎలా వినుంటారు?
9. (ఎ) పౌలు హృదయంలో ఏ కోరిక ఉంది? (బి) 2009లో వార్షిక వచనం ఏమిటి?
10. సమగ్ర సాక్ష్యం ఇవ్వాలనే ఆజ్ఞ మనకు కూడ వర్తిస్తుందని ఎలా చెప్పవచ్చు?
11. యెహోవాసాక్షులు ఏ ప్రాముఖ్యమైన పనికి పేరుగాంచారు?
12. (ఎ) మన ప్రాంతంలోని ప్రజల ఇంటికి మనం “ఎన్నోసార్లు” ఎందుకు వెళ్తాం? (బి) మన సందేశం విషయంలో తమ అభిప్రాయాన్ని మార్చుకున్నవారి అనుభవం చెప్పండి.
13. మనం సాక్ష్యమివ్వడంవల్ల ఎలా ఊహించని ఫలితాలు రావచ్చు?
14, 15. ఒక సహోదరుడు సాక్ష్యమివ్వడంవల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?
16. సమగ్ర సాక్ష్యమిచ్చేందుకు మనం చేసే ప్రయత్నాల విషయంలో ఏమి జరగవచ్చని ఫ్లోరిడాలోని సహోదరుని ఉదాహరణ చూపిస్తుంది?
17. మీరు 2009లో ఏమి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు?
[19వ పేజీలోని బ్లర్బ్]
2009 వార్షిక వచనం: ‘సువార్త గురించి సమగ్రంగా సాక్ష్యమివ్వండి.’ —అపొ. 20:24, NW.
[17వ పేజీలోని చిత్రం]
పౌలు ఇంటింటికి వెళ్లి సాక్ష్యమిచ్చేవాడని ఎఫెసులోని పెద్దలకు తెలుసు
[18వ పేజీలోని చిత్రం]
మీరు సమగ్రంగా సాక్ష్యం ఇవ్వడంవల్ల ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయి?