పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
“యాషారు గ్రంథము,” “యెహోవా యుద్ధముల గ్రంథము” అనే రెండు గ్రంథాలను లేఖనాలు ప్రస్తావిస్తున్నాయి. (యెహో. 10:12; సంఖ్యా. 21:14) కానీ, ఆ రెండు గ్రంథాలు బైబిలు ప్రామాణిక పుస్తకాల పట్టికలో కనిపించవు. ఇవి కనుమరుగైన ప్రేరేపిత పుస్తకాలా?
ఆ రెండు గ్రంథాలు ప్రేరేపితమైనవనీ ఆ తర్వాత కనుమరుగైపోయాయనీ అనుకోవడానికి ఏ ఆధారం లేదు. ప్రేరేపిత బైబిలు రచయితలు కొన్ని ఇతర పుస్తకాలను ప్రస్తావించారు. వాటిలో కొన్ని ఆధునిక పాఠకులకు పరిచయంలేని విధంగా ప్రస్తావించబడిన బైబిలు భాగాలు కావచ్చు. ఉదాహరణకు, “దీర్ఘదర్శి సమూయేలు మాటలు,” “ప్రవక్తయగు నాతాను మాటలు,” “దీర్ఘదర్శి గాదు మాటలు” అని మొదటి దినవృత్తాంతములు 29:30లో పేర్కొనబడింది. ఆ ముగ్గురి మాటలే, మనకు తెలిసిన మొదటి సమూయేలు, రెండవ సమూయేలు లేదా న్యాయాధిపతుల గ్రంథాలు కావచ్చు.
అయితే, కొన్ని పుస్తకాల పేర్లు బైబిలు పుస్తకాల పేర్లలాగే కనిపించవచ్చు కానీ, అవి నిజానికి బైబిల్లోని భాగాలు కావు. ఉదాహరణకు, ‘యూదారాజుల వృత్తాంతముల గ్రంథము,’ ‘యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథము’ ‘ఇశ్రాయేలు రాజుల గ్రంథము,’ ‘ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథము’ అనే నాలుగు ప్రాచీన గ్రంథాల పేర్లను తీసుకుందాం. వాటి పేర్లు మనకు తెలిసిన బైబిలు పుస్తకాలైన మొదటి రాజులు, రెండవ రాజులు గ్రంథాల పేర్లలాగే కనిపించినా ఆ గ్రంథాలు ప్రేరేపితమైనవి కావు, బైబిలు ప్రామాణిక పుస్తకాల పట్టికలో చేర్చబడలేదు. (1 రాజు. 14:29; 2 దిన. 16:11; 20:34; 27:7) అవి, ప్రవక్త అయిన యిర్మీయా, ఎజ్రా బైబిలు వృత్తాంతాలను రాసిన కాలంలో అందుబాటులోవున్న చరిత్ర పుస్తకాలు మాత్రమే అయుండొచ్చు.
నిజమే, కొందరు బైబిలు రచయితలు తమకు అందుబాటులో ఉన్న ప్రేరేపితంకాని చరిత్రాంశాలను లేదా దస్తావేజులను ప్రస్తావించారు లేదా సమాచారం కోసం వాటిని పరిశీలించారు. ‘మాదీయుల, పారసీకుల రాజ్యసమాచార గ్రంథము’ గురించి ఎస్తేరు 10:2లో ప్రస్తావించబడింది. అలాగే, లూకా కూడా సువార్తను రాసే ముందు అన్ని విషయాలను ‘మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొన్నాడు.’ లూకా సువార్తలోని యేసు వంశావళి వివరాలను రాయడానికి తాను అందుబాటులోవున్న గ్రంథాలను పరిశోధించానని చెప్పేందుకే లూకా అలా రాసివుంటాడు. (లూకా 1:1; 3:23-38) లూకా పరిశోధించిన గ్రంథాలు ప్రేరేపితమైనవి కాకపోయినా ఆయన రాసిన సువార్త మాత్రం ప్రేరేపితమైనదే. అంతేకాక, అది మనకు ఎంతో ప్రయోజనకరమైనది.
అయితే, ప్రశ్నలో ప్రస్తావించబడిన “యాషారు గ్రంథము,” “యెహోవా యుద్ధముల గ్రంథము” అనే రెండు గ్రంథాల విషయానికి వస్తే, అవి అప్పట్లో అందుబాటులోవున్న ప్రేరేపితంకాని గ్రంథాలుకావచ్చు. అందుకే యెహోవా వాటిని భద్రపరచలేదు. బైబిలులో ప్రస్తావించబడిన ఆ రెండు పుస్తకాలను చూసిన బైబిలు విద్వాంసులు అవి ఇశ్రాయేలీయులకూ వారి శత్రువులకూ మధ్య జరిగిన యుద్ధాలనూ వివరిస్తూ రాయబడిన పద్యాల, పాటల సంగ్రహాలనే నిర్ధారణకు వచ్చారు. (2 సమూ. 1:17-27) “ప్రాచీన ఇశ్రాయేలులో వృత్తిరీత్యా గాయకులైనవారు భద్రపరచిన పద్యాలు, పాటల సంగ్రహమే” ఆ గ్రంథాల్లో ఉండివుండొచ్చని ఒక బైబిలు ఎన్సైక్లోపీడియా చెబుతోంది. అప్పట్లో ప్రవక్తలుగా, దీర్ఘదర్శులుగా యెహోవా ఉపయోగించిన వ్యక్తులు కూడా కొన్ని పుస్తకాలను రాశారు. కానీ, అవి ఆయన ప్రేరేపించి రాయించిన పుస్తకాలు కావు. ‘ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి’ మన కాలంలోనివారికి ఉపయోగపడే లేఖనాల్లో వాటిని చేర్చాలని ఆయన అనుకోలేదు.—2 తిమో. 3:16; 2 దిన. 9:29; 12:15; 13:22.
కాబట్టి, కొన్ని పుస్తకాలు బైబిల్లో ప్రస్తావించబడి బైబిలు రచయితల చేత ఉపయోగించబడినంత మాత్రాన అవి ప్రేరేపితమైనవని మనం అనుకోకూడదు. అయితే, యెహోవా దేవుడు ‘తన వాక్యము’ ఉన్న పుస్తకాలన్నిటినీ భద్రపరిచాడు. అవి ‘నిత్యమూ నిలుస్తాయి.’ (యెష. 40:8) అవును, మనం ‘సన్నద్ధులమై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడడానికి’ కావాల్సిన వాటినే యెహోవా ప్రస్తుతం మన దగ్గరవున్న 66 పుస్తకాల్లో ఉండేలా చూశాడు.—2 తిమో. 3:16, 17.