బహుమానాన్ని మనసులో ఉంచుకోండి
బహుమానాన్ని మనసులో ఉంచుకోండి
“బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.”—ఫిలి. 3:14.
తార్సువాడైన సౌలుగా కూడ పిలవబడిన అపొస్తలుడైన పౌలు ఒక గొప్ప కుటుంబంలో పుట్టాడు. ప్రఖ్యాత ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు దగ్గర తన పూర్వీకుల మతాన్ని గురించి నేర్చుకున్నాడు. (అపొ. 22:3) పౌలు భవిష్యత్తు ఉజ్వలంగా కనిపించినా ఆయన తన మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవుడయ్యాడు. ఆ తర్వాత ఆయన తన ముందుంచబడిన నిత్యజీవమనే బహుమానం కోసం అంటే దేవుని పరలోక రాజ్యంలో అమర్త్యమైన రాజుగా, యాజకునిగా ఉండే అవకాశం కోసం ఎదురుచూశాడు. ఆ రాజ్యం పరదైసు భూమిని పరిపాలిస్తుంది.—మత్త. 6:9; ప్రక. 7:4; 20:6.
2 పౌలు ఆ బహుమానాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతున్నానని చూపిస్తూ, ఇలా అన్నాడు: “ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.” (ఫిలి. 3:7, 8) మానవులపట్ల దేవుని ఉద్దేశమేమిటో తెలుసుకున్న తర్వాత పౌలు, అనేకమంది ప్రాముఖ్యమైనవిగా ఎంచే హోదా, సంపద, ఉద్యోగం, పలుకుబడి వంటివాటిని నష్టంగా పరిగణించాడు.
3 అప్పటి నుండి యెహోవా, యేసుక్రీస్తు గురించిన అమూల్యమైన జ్ఞానం సంపాదించుకోవడానికే తన జీవితంలో మరింత ప్రాముఖ్యతనిచ్చాడు. దేవునికి చేసిన ప్రార్థనలో ఆ జ్ఞానం గురించి యేసు ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహా. 17:3) నిత్యజీవ బహుమానాన్ని పొందాలనే బలమైన కోరిక పౌలుకు ఉందని ఫిలిప్పీయులు 3:14లోని ఈ మాటలనుబట్టి తెలుస్తుంది: “క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.” అవును, పరలోకంలో దేవుని రాజ్యంలో భాగంగా ఉంటూ నిత్యమూ జీవించే బహుమానాన్నే పౌలు ఎల్లప్పుడూ తన మనసులో ఉంచుకున్నాడు.
భూమిపై నిరంతర జీవితం
4 దేవుని చిత్తం చేయాలనుకునే చాలామంది దేవుని నూతన లోకంలో నిత్యజీవమనే బహుమానం పొందేందుకు ప్రయాసపడాలి. (కీర్త. 37:11, 29) ఇది నిజమైన నిరీక్షణ అని యేసు స్పష్టం చేశాడు. “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు” అని ఆయన అన్నాడు. (మత్త. 5:5) కీర్తనలు 2:8లో చెప్పబడినట్లు, ప్రధానంగా యేసే భూమిని స్వాస్థ్యంగా పొందుతాడు. అంతేగాక, పరలోకంలో 1,44,000 మంది ఆయనతోపాటు పరిపాలిస్తారు. (దాని. 7:13, 14, 22, 27) భూమ్మీద జీవించే గొర్రెల్లాంటివారు ‘లోకము పుట్టింది మొదలుకొని తమకు సిద్ధపరచబడిన’ రాజ్యంలోని భూసంబంధ భాగాన్ని ‘స్వతంత్రించుకుంటారు.’ (మత్త. 25:34, 46) “అబద్ధమాడనేరని” దేవుడు దీన్ని వాగ్దానం చేశాడు కాబట్టి, ఇదంతా ఖచ్చితంగా నెరవేరుతుందనే భరోసా మనకు ఇవ్వబడింది. (తీతు 1:1) దేవుని వాగ్దానాల నెరవేర్పు విషయంలో యెహోషువకు ఉన్న నమ్మకాన్నే మనమూ చూపించవచ్చు. ఆయన ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: ‘మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు. అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.’—యెహో. 23:14.
5 దేవుని నూతన లోకంలో జీవితం ఇప్పుడున్నట్లు నిరాశపర్చేదిగా లేక నిరుత్సాహకరంగా ఉండదు. అది ఎంతో భిన్నంగా ఉంటుంది. యుద్ధం, నేరం, పేదరికం, అన్యాయం, అనారోగ్యం, మరణం వంటివేవీ ఉండవు. పరదైసుగా మారిన ఈ భూమిపై సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు జీవిస్తారు. అప్పుడు జీవితం మనం ఊహించిన దానికన్నా ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది. ప్రతీరోజు
ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అది ఎంత అద్భుతమైన బహుమానం!6 నూతన లోకంలో భూవ్యాప్తంగా ఎలాంటి అద్భుతకరమైన సంఘటనలు జరుగుతాయో చూపించడానికి యేసు భూమ్మీద ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఆయనకు శక్తినిచ్చింది. ఉదాహరణకు, 38 ఏళ్లుగా పక్షవాతంతో ఉన్న వ్యక్తిని లేచి నడవమని యేసు చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి లేచి నడిచాడని బైబిలు చెబుతుంది. (యోహాను 5:5-9 చదవండి.) మరో సందర్భంలో యేసు ‘పుట్టు గుడ్డివాడిని’ స్వస్థపరచి చూపు పొందేలా చేశాడు. ఆ తర్వాత, తనను ఎవరు బాగుచేశారని కొందరు ఆయనను అడిగినప్పుడు, ఆయనిలా జవాబిచ్చాడు: “పుట్టు గ్రుడ్డివాని కన్ను లెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడు.” (యోహా. 9:1, 6, 7, 32, 33) దేవుడు యేసుకు శక్తినిచ్చాడు కాబట్టే ఆయన అవన్నీ చేయగలిగాడు. యేసు తాను వెళ్లిన ప్రతీ చోట ‘స్వస్థత కావలసినవారిని స్వస్థపరిచాడు.’—లూకా 9:11.
7 యేసు రోగులను, వికలాంగులను బాగుచేయడమే కాక చనిపోయినవారిని కూడా లేపాడు. ఉదాహరణకు, ఓ 12 ఏండ్ల బాలిక చనిపోయినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఎంతో దుఃఖంలో మునిగిపోయారు. కానీ యేసు ‘చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నాను’ అని అన్నాడు. వెంటనే ఆమె లేచి నడవడం మొదలుపెట్టింది! ఆమె తల్లిదండ్రులూ అక్కడున్న ఇతరులూ ఎలా ప్రతిస్పందించి ఉంటారో ఊహించుకోగలరా? (మార్కు 5:38-42 చదవండి.) ‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది’ కాబట్టి, దేవుని నూతన లోకంలో లక్షలాదిమంది పునరుత్థానం చేయబడినప్పుడు ప్రజలు ‘ఎంతో విస్మయం చెందుతారు.’ (అపొ. 24:14; యోహా. 5:28, 29) పునరుత్థానమైనవారు అప్పటి నుండి నిత్యం జీవించే అవకాశంతో ఓ కొత్త జీవితం ఆరంభిస్తారు.
8 పునరుత్థానం చేయబడినవారికి జీవం పొందే అవకాశం ఉంటుంది. వారు తమ మరణానికి ముందు చేసిన పాపాలనుబట్టి తీర్పు తీర్చబడరు. (రోమా. 6:7) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో విమోచన క్రయధన బలి ద్వారా వచ్చే ప్రయోజనాలను విధేయులైన మానవులకు అన్వయించబడినప్పుడు వారు క్రమంగా పరిపూర్ణులౌతారు. చివరకు ఆదాము పాపం వల్ల వచ్చిన పరిణామాలన్నిటి నుండి పూర్తిగా విడిపించబడతారు. (రోమా. 8:20) యెహోవా “మరెన్నడును ఉండకుండ మరణమును . . . మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.” (యెష. 25:8) అప్పుడు, ‘గ్రంథములు విప్పబడతాయి’ అని కూడా బైబిలు చెబుతోంది, అంటే నూతన లోకంలో జీవించేవారికి కొత్త సమాచారం ఇవ్వబడుతుంది. (ప్రక. 20:12) భూమి పరదైసుగా మారినప్పుడు “లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.”—యెష. 26:9.
9 పునరుత్థానం చేయబడినవారు ఆదాము నుండి వచ్చిన పాపాన్నిబట్టి కాక, తాము చేసే క్రియలనుబట్టే తీర్పు తీర్చబడతారు. ప్రకటన 20:12 ఇలా చెబుతోంది: “ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పుపొందిరి,” అంటే పునరుత్థానం చేయబడిన తర్వాత తాము చేసిన క్రియలనుబట్టి వారు తీర్పు తీర్చబడతారు. యెహోవా కనబరిచే న్యాయానికి, దయకు, ప్రేమకు అది ఎంత గొప్ప రుజువు! అంతేగాక, ఈ పాత లోకంలో వారు పొందిన చేదు అనుభవాలు “మరువబడును జ్ఞాపకమునకు రావు.” (యెష. 65:17) ప్రోత్సాహకరమైన కొత్త సమాచారం అందుబాటులోకి రావడమే కాక, జీవితం సంతోషకరంగా ఉంటుంది కాబట్టి గతంలో తమకు ఎదురైన చేదు అనుభవాలనుబట్టి వారు ఇక ఎన్నడూ బాధపడరు. అవన్నీ మరువబడతాయి. (ప్రక. 21:4) హార్మెగిద్దోనును తప్పించుకునే “గొప్పసమూహము” విషయంలో కూడా అలాగే జరుగుతుంది.—ప్రక. 7:9, 10, 14.
10 దేవుని నూతన లోకంలో ప్రజలు రోగమరణాలు లేని జీవితాన్ని గడపగలుగుతారు. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెష. 33:24) కొంతకాలానికి, కొత్త భూమ్మీద జీవించేవారు మరో అద్భుతమైన రోజు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో నిద్రలేస్తారు. సంతృప్తికరమైన పని చేస్తూ, కేవలం తమ శ్రేయస్సును కోరేవారితో గడిపేందుకు వారు ఎదురుచూస్తారు. అలాంటి జీవితం నిజంగానే ఓ అద్భుతమైన బహుమానం! యెషయా 33:24; 35:5-7 వచనాల్లోని ప్రవచనాలను చదివి ధ్యానించేందుకు కొంత సమయం తీసుకోండి. మీరు ఆ పరిస్థితుల్లో ఉన్నట్లు ఊహించుకోవడానికి ప్రయత్నించండి. ఆ విధంగా మీరు పొందబోయే బహుమానాన్ని ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోగలుగుతారు.
బహుమానాన్ని మరచిపోయిన కొందరు
11 మనం పొందబోయే బహుమానం గురించి తెలుసుకున్న తర్వాత, దాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకోవడానికి ఎంతో కృషి చేయాలి. ఎందుకంటే, మనం దాన్ని మరచిపోయే అవకాశముంది. ఉదాహరణకు, సొలొమోను ప్రాచీన ఇశ్రాయేలుకు రాజైనప్పుడు, ప్రజలకు సరిగ్గా న్యాయం తీర్చడానికి కావాల్సిన బుద్ధి, వివేచనలను ఇవ్వమని వినయంతో దేవునికి ప్రార్థించాడు. (1 రాజులు 3:6-12 చదవండి.) అందుకే, “దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను.” “సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటికంటెను అధికమై యుండెను.”—1 రాజు. 4:29-32.
12 అయితే, రాజుగా నియమించబడిన వ్యక్తి ‘గుర్రాలను విస్తారముగా సంపాదించుకోకూడదు,’ ‘తన హృదయము తొలగి పోకుండునట్లు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు’ అని యెహోవా గతంలో హెచ్చరించాడు. (ద్వితీ. 17:14-17) ఒక రాజు గుర్రాలను విస్తారంగా సంపాదించుకుంటే తాను రాజ్యాన్ని కాపాడడానికి రక్షణకర్తయైన యెహోవాపై ఆధారపడే బదులు సైనికశక్తిపై ఆధారపడుతున్నాడని చూపిస్తాడు. అనేక స్త్రీలను వివాహం చేసుకోవడం ప్రమాదకరం. ఎందుకంటే, వారిలో కొందరు అబద్ధారాధన చేసే అన్యజనాంగాలకు చెందినవారు కావచ్చు. అంతేకాక, యెహోవా సత్యారాధన నుండి వారు రాజును తప్పుదోవ పట్టించవచ్చు.
1 రాజు. 4:26) ఆయన 700 మంది భార్యలను చేసుకున్నాడు, 300 మంది ఉపపత్నులను ఉంచుకున్నాడు. వారిలో చాలామంది దగ్గర్లోవున్న అన్యజనాంగాలకు చెందినవారే. ‘అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు తిప్పగా అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను.’ అన్యజనాంగాలకు చెందిన తన భార్యలు చేసిన హేయమైన అబద్ధారాధనలో సొలొమోను కూడా భాగం వహించాడు. ఆ కారణంగా, ‘రాజ్యము నీకుండ కుండ నిశ్చయముగా తీసివేసెదను’ అని యెహోవా సొలొమోనుతో చెప్పాడు.—1 రాజు. 11:1-6, 11.
13 సొలొమోను ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఏది చేయకూడదని యెహోవా రాజులకు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడో సొలొమోను అదే చేశాడు. ఆయన వేలాది గుర్రాలను, రౌతులను సంపాదించుకున్నాడు. (14 సత్య దేవుని ప్రతినిధిగా ఉండడం ఎంతో గౌరవప్రదమైన విషయమని సొలొమోను మరచిపోయాడు. ఆయన అబద్ధ ఆరాధనలో పూర్తిగా కూరుకుపోయాడు. కొంతకాలానికి, ఇశ్రాయేలు జనాంగమంతా మతభ్రష్టులయ్యారు. దానివల్ల, ఆ జనాంగం సా.శ.పూ 607లో నాశనం చేయబడింది. యూదులు క్రమంగా సత్యారాధనను తిరిగి చేపట్టినప్పటికీ, ‘దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడును’ అని శతాబ్దాల తర్వాత యేసు వారికి చెప్పాల్సివచ్చింది. యేసు చెప్పినట్లే జరిగింది. ఆయనిలా అన్నాడు: “ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది.” (మత్త. 21:43; 23:37, 38) అవిధేయులవ్వడంవల్ల వారు సత్య దేవునికి ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. సా.శ. 70లో రోమా సైన్యం యెరూషలేమును, అక్కడున్న దేవాలయాన్ని నాశనం చేసింది. మిగిలివున్న యూదుల్లో అనేకమంది దాసులయ్యారు.
15 యేసు 12 మంది అపొస్తలులలో యూదా ఇస్కరియోతు ఒకడు. యూదా యేసు గొప్ప బోధలను విన్నాడు, దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన చేసిన అద్భుతాలనూ చూశాడు. అయినా యూదా తన హృదయాన్ని కాపాడుకోలేదు. యేసుకూ, అతని 12 మంది అపొస్తలులకూ చెందిన డబ్బు సంచిని చూసుకునే బాధ్యత ఆయనకు అప్పగించబడింది. అయితే, యూదా “దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను.” (యోహా. 12:6) ఆయన ఎంత దురాశాపరుడు అయ్యాడంటే చివరకు యేసును 30 వెండినాణాలకు అప్పగించడానికి వేషదారులైన యాజకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. (మత్త. 26:14-16) బహుమానంపై తన మనసు నిలుపుకోని మరో వ్యక్తి పౌలు సహచరుడైన దేమా. ఆయన తన హృదయాన్ని కాపాడుకోలేదు. “దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి . . . వెళ్లెను” అని పౌలు ఆయన గురించి చెప్పాడు.—2 తిమో. 4:10; సామెతలు 4:23 చదవండి.
మనందరికీ పాఠం
16 దేవుని సేవకులందరూ బైబిల్లోని ఉదాహరణల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే, “ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను” అని చెప్పబడింది. (1 కొరిం. 10:11) నేడు, మనం ఈ దుష్ట విధానపు చివరి రోజుల్లో జీవిస్తున్నాం.—2 తిమో. 3:1, 13.
17 “ఈ యుగ సంబంధమైన దేవత” అయిన సాతానుకు “సమయము కొంచెమే” ఉందనే విషయం తెలుసు. (2 కొరిం. 4:4; ప్రక. 12:12) క్రైస్తవ యథార్థతను విడిచిపెట్టేలా యెహోవా సేవకులను శోధించేందుకు అతడు తాను చేయగలిగినదంతా చేస్తాడు. ప్రచార మాధ్యమాలతోసహా ఈ లోకమంతా సాతాను అధీనంలో ఉంది. అయితే, మరింత శక్తివంతమైన “బలాధిక్యము” యెహోవా ప్రజల దగ్గరుంది. (2 కొరిం. 4:7) సాతాను మనమీదికి తెచ్చే ఎలాంటి పరీక్షనైనా తట్టుకొని నిలబడేందుకు కావలసిన శక్తిని ఇవ్వమని దేవుణ్ణి కోరవచ్చు. అందుకే, “తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును” అనే నమ్మకంతో మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలని ప్రోత్సహించబడుతున్నాం.—లూకా 11:13.
18 అంతేగాక, సాతాను దుష్టవిధానమంతా త్వరలోనే అంతమౌతుంది గానీ నిజ క్రైస్తవులు మాత్రం రక్షించబడతారని తెలుసుకొని మనం ప్రోత్సహించబడుతున్నాం. “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహా. 2:17) కాబట్టి, ఓ క్రైస్తవుడు యెహోవాతో తనకున్న సంబంధంకన్నా అత్యంత విలువైనదేదో ఈ ప్రస్తుత విధానంలో ఉందనుకోవడం ఎంత అవివేకం! సాతాను అధీనంలోవున్న లోకం గతించిపోతుంది. అయితే, తన నమ్మకమైన సేవకులను కాపాడేందుకు యెహోవా క్రైస్తవ సంఘాన్నిచ్చాడు. దేవుని నూతన లోకం సమీపిస్తుండగా, వారు ఈ వాగ్దానాన్ని నమ్మవచ్చు: “కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.” (కీర్త. 37:9) కాబట్టి, ఈ అద్భుతమైన బహుమానాన్ని ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోండి.
మీకు జ్ఞాపకమున్నాయా?
• తన ముందుంచబడిన బహుమానం విషయంలో పౌలుకు ఏమనిపించింది?
• భూమిపై నిరంతరం జీవించేవారు దేన్నిబట్టి తీర్పుతీర్చబడతారు?
• ఇప్పుడు మీరు చేయాల్సిన జ్ఞానయుక్తమైన పని ఏమిటి?
[అధ్యయన ప్రశ్నలు]
1. అపొస్తలుడైన పౌలు ముందు ఎలాంటి బహుమానం ఉంచబడింది?
2, 3. పరలోకంలో జీవించే బహుమానాన్ని పౌలు ఎంత విలువైనదిగా ఎంచాడు?
4, 5. నేడు దేవుని చిత్తం చేస్తున్న లక్షలాదిమందికి ఏ బహుమానం విషయంలో వాగ్దానం చేయబడింది?
6, 7. (ఎ) దేవుని నూతన లోకంలో మనం ఎదురుచూడగల పరిస్థితులను యేసు ఎలా చూపించాడు? (బి) చనిపోయిన వారికి కూడా ఓ కొత్త జీవితం ఎలా ఇవ్వబడుతుంది?
8, 9. (ఎ) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో ఆదాము నుండి వచ్చిన పాపానికి ఏమౌతుంది? (బి) చనిపోయినవారు దేనినిబట్టి తీర్పు తీర్చబడతారు?
10. (ఎ) దేవుని నూతన లోకంలో జీవితం ఎలా ఉంటుంది? (బి) బహుమానాన్ని ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోవాలంటే మీరేమి చేయాలి?
11. సొలొమోను తన పరిపాలనను చక్కగా ఎలా ఆరంభించాడో చెప్పండి.
12. ఇశ్రాయేలులో రాజులుగా నియమించబడేవారికి యెహోవా ఏ హెచ్చరిక ఇచ్చాడు?
13. సొలొమోను దేవుడిచ్చిన బహుమానాన్ని ఎలా మరచిపోయాడు?
14. సొలొమోనూ ఇశ్రాయేలు జనాంగమూ అవిధేయులవడంవల్ల ఏమి జరిగింది?
15. అత్యంత ప్రాముఖ్యమైన బహుమానాన్ని మరచిపోయిన కొంతమంది ఉదాహరణలు చెప్పండి.
16, 17. (ఎ) మనకు వ్యతిరేకంగా ఉన్నవారు ఎంత శక్తివంతులు? (బి) సాతాను మనమీదికి తెచ్చే ఎలాంటి పరీక్షనైనా తట్టుకొని నిలబడేందుకు మనకు ఏది సహాయం చేస్తుంది?
18. ఈ ప్రస్తుత విధానం విషయంలో మనకెలాంటి అభిప్రాయం ఉండాలి?
[12, 13వ పేజీలోని చిత్రం]
బైబిలు వృత్తాంతాలు చదువుతున్నప్పుడు మీరు బహుమానాన్ని పొందుతున్నట్లు ఊహించుకుంటున్నారా?