కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మెలకువగా ఉండండి”

“మెలకువగా ఉండండి”

“మెలకువగా ఉండండి”

“అన్నిటి అంతము సమీపమైయున్నది. . . . ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.”​—⁠1 పేతు. 4:⁠7.

యేసుక్రీస్తు భూమ్మీదున్నప్పుడు ప్రధానంగా దేవుని రాజ్యం గురించే బోధించాడు. ఆ రాజ్యం ద్వారా యెహోవా తన విశ్వసర్వాధిపత్యం సరైనదని నిరూపించుకొని తన నామాన్ని పరిశుద్ధపరచుకుంటాడు. అందుకే, దేవునికి ఇలా ప్రార్థించమని యేసు తన శిష్యులకు బోధించాడు: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్త. 4:17; 6:​9, 10) ఆ రాజ్యం అతి త్వరలో సాతాను లోకాన్ని నాశనంచేసి భూవ్యాప్తంగా దేవుని చిత్తం నెరవేరేలా చేస్తుంది. దానియేలు ప్రవచించినట్లు, దేవుని రాజ్యం “ముందు చెప్పిన [ప్రస్తుతమున్న] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”​—⁠దాని. 2:⁠44.

2 యేసు శిష్యులు ఆ రాజ్య స్థాపన కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు కాబట్టే, వారు ఆయనను “నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అని అడిగారు. (మత్త. 24:⁠3) క్రీస్తు రాజ్యాధికారంతో రావడాన్ని భూమ్మీదున్నవారు చూడలేరు కాబట్టి వారు దాన్ని గ్రహించేలా సూచన ఇవ్వబడుతుంది. లేఖనాల్లో ప్రవచించబడినట్లు, ఆ సూచనలో వివిధ అంశాలు ఉంటాయి. ఆ సమయంలో జీవించే యేసు అనుచరులు వాటిని చూసి ఆయన పరలోకంలో పరిపాలించడం మొదలుపెట్టాడని గ్రహించగలుగుతారు. అంతేకాక, బైబిల్లో చెప్పబడిన ఈ లోక దుష్టవిధానపు “అంత్యదినములు” ఆ సూచనతో ఆరంభమౌతాయి.​—⁠2 తిమో. 3:​1-5, 13; మత్త. 24:​7-14.

అంత్యదినాల్లో మెలకువగా ఉండండి

3 అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.” (1 పేతు. 4:⁠7) యేసు అనుచరులు ఆయన రాజ్యాధికారంతో వచ్చాడని తెలియజేసే ప్రపంచ సంఘటనలను జాగ్రత్తగా గమనిస్తూ మెలకువగా ఉండాలి. ప్రస్తుత దుష్టవిధానాంతం సమీపించేకొద్దీ వారు మరింత మెలకువగా ఉండాలి. యేసు తన శిష్యులను ఇలా హెచ్చరించాడు: ‘[సాతాను లోకంమీద తీర్పు అమలుచేసేందుకు] ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండండి.’​—⁠మార్కు 13:​35, 36.

4 లోకంలోని ప్రజలు సాతాను అధీనంలో ఉన్నారు కాబట్టి ప్రపంచ సంఘటనల ప్రాముఖ్యతను గమనించలేదు. అందుకే, క్రీస్తు రాజ్యాధికారంలో ఉన్నట్లు వారు గుర్తించలేరు. అయితే, క్రీస్తు నిజ అనుచరులు మెలకువగా ఉంటూ గత శతాబ్దంలో ఎందుకు అలాంటి సంఘటనలు జరిగాయో గుర్తించారు. క్రీస్తు 1914 నుండి పరలోకంలో రాజ్యాధికారం చేస్తున్నాడనడానికి మొదటి ప్రపంచ యుద్ధంతోపాటు దాని తర్వాత జరిగిన సంఘటనలు ఖచ్చితమైన రుజువులని 1925 నుండి యెహోవాసాక్షులు గుర్తించారు. అలా సాతాను అధీనంలోవున్న ఈ దుష్టవిధానానికి అంత్యదినాలు ప్రారంభమయ్యాయి. లోకంలోని పరిస్థితులను జాగ్రత్తగా గమనించే చాలామందికి ఈ లోక సంఘటనలు ఎందుకిలా జరుగుతున్నాయో తెలియకపోయినా మొదటి ప్రపంచ యుద్ధానికి ముందున్న పరిస్థితులకూ, అప్పటినుండి ఉన్న పరిస్థితులకు మధ్యవున్న పెద్ద తేడాను గమనించగలుగుతున్నారు.​—⁠“అల్లకల్లోల యుగం ప్రారంభమైంది” అనే బాక్సును చూడండి.

5 దాదాపు ఒక శతాబ్ద కాలంగా ప్రపంచంలో జరుగుతున్న భయంకరమైన సంఘటనలు, మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని రుజువుచేస్తున్నాయి. సాతాను విధానంపైకి తన శక్తివంతమైన దూతల సైన్యాన్ని నడిపించమని క్రీస్తుకు దేవుడు ఆజ్ఞ ఇవ్వడానికి ఇక కొంచెం సమయమే మిగిలివుంది. (ప్రక. 19:​11-21) అప్రమత్తంగా ఉండాలని నిజక్రైస్తవులు ఆజ్ఞాపించబడ్డారు. కాబట్టి, ఈ విధానాంతం కోసం ఎదురుచూస్తుండగా మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండడం ఎంతో ప్రాముఖ్యం. (మత్త. 24:42) మనం అప్రమత్తంగా ఉంటూ క్రీస్తు నిర్దేశంలో జరగాల్సిన ఓ పనిని భూవ్యాప్తంగా చేయాలి.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పని

6 మనం ప్రస్తుత దుష్టవిధానపు అంత్యదినాల్లో ఉన్నామని తెలియజేసే వివిధ అంశాలున్న సూచనలో భాగంగా యెహోవా సేవకులు చేయాల్సిన పని గురించి కూడ ప్రవచించబడింది. ఆ సూచనలోని వివిధ అంశాలను వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన ఈ పనిని గురించి కూడ యేసు పేర్కొన్నాడు. ఆయన చెప్పిన ప్రవచనంలో ఈ ప్రాముఖ్యమైన వాక్యం ఉంది: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”​—⁠మత్త. 24:⁠14.

7 సువార్త ప్రకటనా పని గురించి యేసు చెప్పిన ప్రవచనానికి సంబంధించిన కొన్ని వాస్తవాల గురించి ఆలోచించండి. 1914లో అంత్యదినాలు ప్రారంభమైనప్పుడు సువార్త ప్రకటించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు వారి సంఖ్య లక్షలకు చేరుకుంది. ఇప్పుడు 1,00,000 కన్నా ఎక్కువ సంఘాల్లో 70,00,000కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తున్నారు. 2008లో, యెహోవాసాక్షులతోపాటు 1,00,00,000 మంది క్రీస్తు మరణ జ్ఞాపకార్థానికి హాజరయ్యారు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన వారి సంఖ్య గమనార్హంగా పెరిగింది.

8 ఈ విధానాంతం వచ్చే ముందు దేవుని రాజ్యం గురించి ప్రపంచమంతటా ఎంత సమగ్రంగా సాక్ష్యమివ్వబడుతోంది! సాతాను “ఈ యుగ సంబంధమైన దేవత”గా ఉన్నప్పటికీ ఇదంతా జరుగుతుంది. (2 కొరిం. 4:⁠4) ఈ లోకంలోని రాజకీయ, మత, వాణిజ్య ప్రచార మాధ్యమాలు వాని ప్రలోభానికి గురౌతున్నాయి. అయినా సాక్ష్యపు పని ఇంత అద్భుతంగా విజయం సాధించడానికి కారణమేమిటి? యెహోవా సహాయమే దానికి కారణం. అందుకే, రాజ్య ప్రకటనా పనిని ఆపేందుకు సాతాను ఎంత ప్రయత్నించినా అది ఆశ్చర్యకరమైన విధంగా ముందుకు సాగుతూనే ఉంటుంది.

9 రాజ్య ప్రకటనా పని విజయం సాధించడంతోపాటు యెహోవా ప్రజల సంఖ్య పెరగడం, యెహోవా గురించి, ఆయన సంకల్పం గురించి వారి జ్ఞానం పెరగడం ఒక అద్భుతమేనని మనం చెప్పవచ్చు. ఆయన తన ప్రజలకు సహాయం చేయకపోతే అంటే వారికి నిర్దేశాన్నిస్తూ, వారిని కాపాడకపోతే ప్రకటనా పని జరగడం అసాధ్యం. (మత్తయి 19:26 చదవండి.) మెలకువగా ఉంటూ సేవచేయడానికి ఇష్టపడేవారిమీద దేవుని పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. అందుకే ఈ ప్రకటనా పని విజయవంతంగా ముగింపుకువచ్చి, ‘అటుతరువాత అంతము వస్తుంది’ అనే నమ్మకంతో మనం ఉండవచ్చు. ఆ సమయం ఎంతో దూరంలో లేదు.

“మహాశ్రమలు”

10 “మహాశ్రమల” కాలంలో ఈ దుష్టవిధానం నాశనం అవుతుంది. (ప్రక. 7:14) మహాశ్రమలు ఎంతకాలం కొనసాగుతాయో బైబిలు చెప్పడంలేదు గానీ యేసు, “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు” అని చెప్పాడు. (మత్త. 24:21) రెండవ ప్రపంచ యుద్ధంలో 5 నుండి 6 కోట్లమంది చనిపోయారు. ఇప్పటికే ప్రపంచం అనుభవించిన అలాంటి శ్రమలతో పోలిస్తే, రాబోయే మహాశ్రమలు ఎంతో తీవ్రంగా ఉంటాయి. అవి హార్‌మెగిద్దోను యుద్ధంతో ముగుస్తాయి. అప్పుడు సాతాను భూవ్యవస్థలోని ప్రతీ భాగాన్ని నాశనం చేసేందుకు యెహోవా తన తీర్పును అమలుచేసే సైన్యాలను పంపిస్తాడు.​—⁠ప్రక. 16:​14-16.

11 మహాశ్రమల్లోని మొదటి ఘట్టం ఎప్పుడు ప్రారంభమౌతుందో బైబిలు ప్రవచనాలు చెప్పకపోయినా ఏ అసాధారణ సంఘటనతో అది ప్రారంభమౌతుందో వివరిస్తున్నాయి. రాజకీయ శక్తులు అబద్ధమతాలన్నిటినీ నాశనం చేయడంతోనే అది ప్రారంభమౌతుంది. ప్రకటన 17, 18 అధ్యాయాల్లో అబద్ధమతం ప్రపంచంలోని రాజకీయ వ్యవస్థలతో అనైతిక సంబంధం పెట్టుకునే వేశ్యతో పోల్చబడింది. త్వరలో రాజకీయ శక్తులు “ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివే[స్తాయని]” ప్రకటన 17:16 చెబుతోంది.

12 అది జరిగే సమయం వచ్చినప్పుడు అబద్ధమత సామ్రాజ్యాన్నంతటినీ నాశనం చేసేలా దేవుడు ‘తన సంకల్పము కొనసాగించునట్లు వారికి [రాజకీయ నాయకులకు] బుద్ధి పుట్టిస్తాడు.’ (ప్రక. 17:17) కాబట్టి ఇది దేవుడు తీసుకొచ్చే నాశనమని చెప్పవచ్చు. చాలా కాలంగా తన చిత్తానికి వ్యతిరేకంగావున్న సిద్ధాంతాలను బోధించిన, తన సేవకులను హింసించిన వేషధారణతో నిండిన మతానికి దేవుడు అలా తీర్పు తీరుస్తాడు. అబద్ధమతంపైకి ఈ నాశనం వస్తుందని లోకంలోని ప్రజలు ఊహించరు. అయితే యెహోవా నమ్మకమైన సేవకులకు మాత్రం ఆ నాశనం గురించి తెలుసు. అంతేకాక, ఈ అంత్యదినాల్లో వారు దాని గురించి ప్రజలకు బోధిస్తూనే ఉన్నారు.

13 అబద్ధమతం నాశనం కావడం చూసి ప్రజలు ఎంతో విభ్రాంతి చెందుతారు. కొందరు “భూరాజులు” కూడ, ‘అయ్యో, అయ్యో, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా’ అని దాని నాశనం గురించి ఏడుస్తారని బైబిలు ప్రవచనం చెబుతోంది. (ప్రక. 18:​9, 10, 16, 19) ‘ఒక్క గడియ’ అనే మాట బైబిల్లో ఉపయోగించబడడాన్నిబట్టి దాని నాశనం అతి వేగంగా జరుగుతుందని తెలుస్తుంది.

14 అబద్ధమతం నాశనం చేయబడిన కొంతకాలానికి తీర్పు సందేశాలను ప్రకటిస్తున్న యెహోవా సేవకులపై కూడా దాడి జరుగుతుందని మనకు తెలుసు. (యెహె. 38:​14-16) ఆ దాడి ప్రారంభమైనప్పుడు దాడి చేసేవారు, తన నమ్మకమైన సేవకులను కాపాడతానని వాగ్దానం చేసిన యెహోవాను ఎదుర్కోవాల్సివుంటుంది. యెహోవా ఇలా అన్నాడు: ‘నేను రోషమును మహా రౌద్రమును గలిగినవాడనై ప్రమాణం చేస్తున్నాను. నేను యెహోవానై యున్నానని వారు తెలుసుకుంటారు.’ (యెహెజ్కేలు 38:​18-23 చదవండి.) ‘మిమ్మును [తన నమ్మకమైన సేవకులను] ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే’ అని దేవుడు తన వాక్యంలో చెప్పాడు. (జెక. 2:⁠8) కాబట్టి, శత్రువులు ప్రపంచవ్యాప్తంగా తన సేవకుల మీద దాడిచేయడం మొదలుపెట్టినప్పుడు యెహోవా చర్యతీసుకుంటాడు. ఆయన చర్య తీసుకోవడంతో మహాశ్రమల చివరి ఘట్టం అంటే హార్‌మెగిద్దోను యుద్ధం ప్రారంభమౌతుంది. క్రీస్తు నాయకత్వంలో శక్తివంతమైన దేవదూతల సేనలు సాతాను లోకంమీద యెహోవా తీర్పులను అమలుచేస్తాయి.

మనం ఏమి చేయాలి?

15 ఈ దుష్టవిధానాంతం వేగంగా సమీపిస్తుందని తెలుసుకున్న తర్వాత మనమేమి చేయాలి? అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక . . . మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.” (2 పేతు. 3:11) దేవుని నియమాలకు అనుగుణంగా మనం ప్రవర్తించేలా, యెహోవాపట్ల మనకున్న ప్రేమను చూపించే విధంగా దైవభక్తితో జీవించేలా తగిన చర్యలు తీసుకునేందుకు మెలకువగా ఉండాలని ఆ మాటలు నొక్కిచెబుతున్నాయి. దైవభక్తితో ప్రవర్తించాలంటే అంతానికి ముందు రాజ్య ప్రకటనా పనిలో మనం చేయగలిగినదంతా చేయాలి. అంతేకాక, పేతురు ఇలా చెప్పాడు: “అన్నిటి అంతము సమీపమైయున్నది. . . . ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.” (1 పేతు. 4:⁠7) తన పరిశుద్ధాత్మ ద్వారా, ప్రపంచవ్యాప్త సంఘం ద్వారా నిర్దేశాన్ని ఇవ్వమని కోరుతూ యెహోవాకు తరచూ ప్రార్థించాలి. అలా చేయడం ద్వారా మనం యెహోవాకు దగ్గరౌతాం, ఆయనపట్ల మనకున్న ప్రేమను చూపిస్తాం.

16 ఈ ప్రమాదకరమైన కాలాల్లో, దేవుని వాక్యంలోని ఈ ఉపదేశాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి: “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.” (ఎఫె. 5:​15, 16) చరిత్రలో మునుపెన్నడూ లేనంత దుష్టత్వం ఇప్పుడుంది. యెహోవా చిత్తం చేయకుండా ప్రజలను అడ్డగించడానికి లేదా వారిని పక్కదారి పట్టించడానికి సాతాను ఎన్నో పన్నాగాలను పన్నాడు. దేవుని సేవకులముగా మనకు ఈ విషయం తెలుసు కాబట్టి దేవునిపట్ల మనకున్న యథార్థతను దెబ్బతీయగల దేన్నైనా మన జీవితంలో అనుమతించాలని కోరుకోం. అంతేకాక, అతి త్వరలో ఏమి జరుగనుందో మనకు తెలుసు కాబట్టి మనం యెహోవాపై, ఆయన ఉద్దేశాలపై పూర్తి నమ్మకముంచుతాం.​—⁠1 యోహాను 2:​15-17 చదవండి.

17 “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది” కాబట్టి, చనిపోయినవారిని తిరిగి బ్రతికిస్తానని దేవుడు చేసిన అద్భుతమైన వాగ్దానం నెరవేరుతుంది. (అపొ. 24:​14, 15) “పునరుత్థానము కలుగబోవుచున్నది” అని ఎంత ఖచ్చితంగా చెప్పబడిందో గమనించండి. యెహోవా ఆ మాట ఇచ్చాడు కాబట్టి దాన్ని అనుమానించాల్సిన అవసరంలేదు. యెషయా 26:19లో ఇలా వాగ్దానం చేయబడింది: “మృతులైన నీవారు బ్రదుకుదురు . . . మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.” ఈ మాటల మొదటి నెరవేర్పు దేవుని ప్రాచీన సేవకులు తమ స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు జరిగింది. కాబట్టి, నూతనలోకంలో కూడ అవి అక్షరాలా నెరవేరతాయనే నమ్మకంతో మనం ఉండవచ్చు. పునరుత్థానం చేయబడినవారు తమ ఆత్మీయులను తిరిగి కలుసుకున్నప్పుడు భూమ్మీద ఎంత ఆనందకరమైన పరిస్థితి ఉంటుంది! అతి త్వరలో సాతాను లోకం నాశనం చేయబడి దేవుని నూతన లోకం స్థాపించబడుతుంది. కాబట్టి, మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండడం ఎంత ప్రాముఖ్యం!

మీకు జ్ఞాపకమున్నాయా?

• యేసు ప్రధానంగా దేని గురించి బోధించాడు?

• రాజ్య ప్రకటనా పని ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున జరుగుతోంది?

• మెలకువగా ఉండడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

అపొస్తలుల కార్యములు 24:​14, 15లో చేయబడిన వాగ్దానంలోని ఏ మాటలు మీకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1. యేసు ప్రధానంగా దేని గురించి బోధించాడు?

2. (ఎ) యేసు రాజ్యాధికారంతో వచ్చాడని ఆయన అనుచరులకు ఎలా తెలుస్తుంది? (బి) ఆ సూచన దేని ఆరంభాన్ని కూడ తెలియజేస్తుంది?

3. క్రైస్తవులు ఎందుకు మెలకువగా ఉండాలి?

4. యెహోవా సేవకులకు, సాతాను లోకంలోనివారికి మధ్యవున్న తేడాను వివరించండి. (బాక్సును కూడ చూడండి.)

5. మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

6, 7. అంత్యదినాల్లో రాజ్య ప్రకటనా పని ఎలా అభివృద్ధి చెందింది?

8. వ్యతిరేకత ఎదురైనా మన ప్రకటనా పని ఎందుకు ఆగిపోలేదు?

9. రాజ్య ప్రకటనా పని విజయం సాధించడంతోపాటు యెహోవా ప్రజల సంఖ్య పెరగడం, యెహోవా గురించిన జ్ఞానం పెరగడం ఒక అద్భుతమేనని ఎలా చెప్పవచ్చు?

10. రాబోయే మహాశ్రమలను యేసు ఎలా వర్ణించాడు?

11, 12. మహాశ్రమలు ఏ సంఘటనతో ప్రారంభమౌతాయి?

13. అబద్ధమతం అతి వేగంగా నాశనం చేయబడుతుందని దేన్నిబట్టి తెలుస్తుంది?

14. యెహోవా శత్రువులు చివరగా తన సేవకులమీద దాడిచేసినప్పుడు ఆయన ఏమి చేస్తాడు?

15. ఈ దుష్టవిధానాంతం దగ్గర్లో ఉందని తెలుసుకున్న తర్వాత మనమేమి చేయాలి?

16. దేవుని ఉపదేశాన్ని మనం ఎందుకు ఖచ్చితంగా పాటించాలి?

17. చనిపోయినవారు పునరుత్థానం చేయబడినప్పుడు హార్‌మెగిద్దోనును తప్పించుకున్నవారు ఎలా స్పందిస్తారు?

[16వ పేజీలోని బాక్సు/చిత్రం]

అల్లకల్లోల యుగం ప్రారంభమైంది

అల్లకల్లోల యుగం: అలెన్‌ గ్రీన్‌స్పాన్‌ 2007వ సంవత్సరంలో అడ్వెంచర్స్‌ ఇన్‌ ఎ న్యూ వరల్డ్‌ అనే పుస్తకాన్ని రాశాడు. అమెరికా దేశ కేంద్ర బ్యాంకింగ్‌ వ్యవస్థనంతటినీ పర్యవేక్షించే యునైటెడ్‌ స్టేట్స్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బోర్డ్‌కు ఆయన దాదాపు 20 సంవత్సరాలు అధ్యక్షునిగా పనిచేశాడు. 1914కు ముందున్న ప్రపంచ పరిస్థితులకూ ఆ తర్వాతి పరిస్థితులకూ మధ్యవున్న పెద్ద వ్యత్యాసాన్ని గ్రీన్‌స్పాన్‌ ఇలా వివరించాడు:

“1914కు ముందు దేశాల మధ్య, ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొనివున్నట్లు, సాంస్కృతికంగా, సాంకేతికపరంగా దేశాలు అభివృద్ధి సాధించే దిశలో అడుగులు వేస్తున్నట్లు కనిపించాయని అప్పటి నివేదికలనుబట్టి తెలుస్తుంది. మానవ సమాజం ఎంత అభివృద్ధి సాధించిందంటే అది పరిపూర్ణతకు చేరుకోవచ్చని అనిపించింది. దయాదాక్షిణ్యాలు చూపించకుండా ప్రజలతో బానిస వ్యాపారం చేసే పరిస్థితి పంతొమ్మిదవ శతాబ్దంలో ముగిసింది. మానవత్వం చూపించకుండా హింసకు పాల్పడే పరిస్థితి తగ్గిపోయింది. . . . పంతొమ్మిదవ శతాబ్దమంతటిలో ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అభివృద్ధి శరవేగంగా జరిగి రైలు మార్గాలు, టెలిఫోను, విద్యుత్‌ కాంతి, సినిమా, మోటారు కారు, గృహ సౌకర్యాలు వంటివెన్నో అందుబాటులోకి వచ్చాయి. వైద్య సదుపాయాలు, పౌష్ఠిక ఆహారం, మంచినీళ్లు చాలామందికి అందుబాటులోకి రావడంవల్ల ప్రజల సగటు ఆయుష్షు పెరిగింది . . . ఈ ప్రగతి ఇలాగే కొనసాగుతుందని అందరూ అనుకున్నారు.”

అయితే . . . “వినాశకరమైన రెండవ ప్రపంచ యుద్ధంకన్నా మొదటి ప్రపంచ యుద్ధకాలంలోనే ప్రజల మధ్య, దేశాల మధ్య సంబంధాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి, అభివృద్ధికి ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధం ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసింది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు హద్దులూ, సమస్యలంటూ లేని భవిష్యత్తు మానవులు అనుభవించనున్నారని నాకు అనిపించేది. దాన్ని నేను మరచిపోలేకపోతున్నాను. ఒక శతాబ్దం ముందటికీ ఇప్పటికీ మన ఆలోచనా విధానంలో పెనుమార్పు వచ్చినా మన ప్రస్తుత ఆలోచనవిధానం మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం అప్పటి అభివృద్ధికి అడ్డంకిగా నిలిచినట్లే నేడు ఉగ్రవాదం, భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌) లేదా ఊపందుకున్న జనసమ్మతమైన విధానాలు ప్రపంచీకరణవల్ల జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటాయా? దానికి ఎవరూ ధైర్యంగా జవాబు చెప్పలేరు.”

తాను చదువుకునే రోజుల్లో అర్థశాస్త్రానికి ఆచార్యుడైన బెన్జమిన్‌ ఎమ్‌. ఆండర్సన్‌ (1886-1949) చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ గ్రీన్‌స్పాన్‌ ఇలా అన్నాడు: “మొదటి ప్రపంచ యుద్ధానికి ముందున్న ప్రపంచ పరిస్థితులు ఇంకా గుర్తున్నవారు ఆ కాలాన్ని ఎంతో అపురూపంగా గుర్తుంచుకుంటారు. లోకం అప్పుడున్నంత భద్రతను ఇప్పటివరకు చవిచూడలేదు.”​—⁠ఎకనామిక్స్‌ అండ్‌ ద పబ్లిక్‌ వెల్ఫేర్‌.

జి. జె. మేయర్‌ ఎ వరల్డ్‌ అన్డన్‌ అనే పుస్తకాన్ని 2006లో ప్రచురించాడు. దానిలో కూడ ఆయన అలాంటి ముగింపుకే వచ్చాడు. ఆ పుస్తకంలో ఇలా ఉంది: “సాధారణంగా చారిత్రక సంఘటనలు ‘ప్రతీదాన్ని మారుస్తాయి’ అని చెబుతారు. మహాయుద్ధం [1914-1918] విషయంలో కూడ ఇది నిజమైంది. ఆ యుద్ధంవల్ల నిజంగానే ప్రతీదీ మారింది: సరిహద్దులు, ప్రభుత్వాలు, దేశాల భవిష్యత్తు వంటివే కాక ప్రపంచం విషయంలో, తమ విషయంలో అప్పటినుండి ప్రజల అభిప్రాయం మారింది. అది ఇంతకుముందున్నంత భద్రత లేని ఆధునిక లోకాన్ని సృష్టించింది.”

[18వ పేజీలోని చిత్రం]

హార్‌మెగిద్దోనులో యెహోవా శక్తివంతమైన దేవదూతల సేనను పంపిస్తాడు