కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసులా ప్రేమతో బోధించండి

యేసులా ప్రేమతో బోధించండి

యేసులా ప్రేమతో బోధించండి

“ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు.”—యోహా. 7:46.

1. యేసు బోధలను విన్న ప్రజలు ఎలా స్పందించారు?

యేసు బోధలు విని ప్రజలు ఎంతగా పులకించిపోయుంటారో ఒక్కసారి ఊహించండి! తనను కలుసుకున్నవారిమీద ఆయన ఎలాంటి ప్రభావం చూపించాడో బైబిలు చెబుతోంది. ఉదాహరణకు, యేసు ఊరివారు, ‘ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు’ అని సువార్త రచయిత అయిన లూకా అన్నాడు. ఆయన కొండమీది ప్రసంగాన్ని విన్నవారు ‘ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు’ అని మత్తయి రాశాడు. యేసును బంధించేందుకు పంపించబడిన బంట్రోతులు వట్టిచేతులతో తిరిగొచ్చి, “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు” అని చెప్పారని యోహాను తన సువార్తలో రాశాడు.—లూకా 4:22; మత్త. 7:28; యోహా. 7:46.

2. యేసు ఏ బోధనా పద్ధతులను ఉపయోగించాడు?

2 ఆ బంట్రోతులు పొరబడలేదు. యేసు నిస్సందేహంగా జీవించినవారిలోకెల్లా అత్యంత గొప్ప బోధకుడు. ఆయన స్పష్టంగా, అందరికీ అర్థమయ్యేలా, తిరుగులేని తర్కంతో బోధించాడు. ఆయన ఉపమానాలను, ప్రశ్నలను నైపుణ్యంగా ఉపయోగించాడు. తన శ్రోతలు గొప్పవారైనా సామాన్యులైనా వారికి అర్థమయ్యేటట్లు ఆయన బోధించాడు. ఆయన ఎంతో లోతైన విషయాలను బోధించినప్పటికీ వాటిని అర్థమయ్యేలా వివరించాడు. అయితే, ఆయన అంత గొప్ప బోధకుడు కావడానికి ఇవే కాక వేరే కారణాలు కూడ ఉన్నాయి.

ప్రేమ చాలా అవసరం

3. బోధించే విషయంలో యేసుకూ ఆయన కాలంలోని మతనాయకులకూ మధ్యవున్న తేడా ఏమిటి?

3 శాస్త్రులు పరిసయ్యుల్లో కూడ తెలివిగలవారు ఉండేవారని ఖచ్చితంగా చెప్పవచ్చు. వారికి జ్ఞానంతోపాటు దాన్ని ఇతరులతో పంచుకునే నైపుణ్యం కూడ ఉండేది. మరైతే, వారి బోధనా విధానానికీ యేసు బోధనా విధానానికీ ఎందుకు అంత తేడా కనిపించింది? ఆయన కాలంలోని మతనాయకులకు సామాన్య ప్రజలపట్ల ప్రేమలేదు సరికదా, వారిని చిన్నచూపు చూస్తూ ‘శాపగ్రస్తమైనవారిగా’ పరిగణించేవారు. (యోహా. 7:49) యేసు వారితో అలా ప్రవర్తించలేదు. వారు ‘కాపరిలేని గొర్రెలవలె విసికి చెదరివున్నారు’ కాబట్టి ఆయన వారిమీద కనికరపడ్డాడు. (మత్త. 9:36) ఆయన వారిపట్ల ఆప్యాయత, సానుభూతి, దయ చూపించాడు. అంతేకాక, ఆ మతనాయకులు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించలేదు. (యోహా. 5:42) అయితే, యేసు తన తండ్రిని ప్రేమించి ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. మతనాయకులు తమ స్వార్థం కోసం దేవుని వాక్యాన్ని వక్రీకరించారు. యేసు మాత్రం ‘దేవుని వాక్యాన్ని’ ఇష్టపడ్డాడు, దాన్ని బోధించాడు, వివరించాడు, సమర్థించాడు, దాని ప్రకారం జీవించాడు. (లూకా 11:28) క్రీస్తు ప్రేమామయుడు. తాను బోధిస్తున్నప్పుడు, ప్రజలతో వ్యవహరిస్తున్నప్పుడు, వారికి ఉపదేశిస్తున్నప్పుడు ఆయన ఎంతో ప్రేమను చూపించాడు.

4, 5. (ఎ) మనం ప్రేమతో బోధించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) ఇతరులకు బోధించడానికి జ్ఞానం, నైపుణ్యం కూడా ఎందుకు అవసరం?

4 మన విషయమేమిటి? క్రీస్తు అనుచరులముగా మనం మన పరిచర్యలో, మన జీవితంలో ఆయనను అనుకరించాలని కోరుకుంటాం. (1 పేతు. 2:21) ఇతరులకు బైబిలు జ్ఞానాన్ని అందించడమే కాక, యెహోవా లక్షణాలను, మరిముఖ్యంగా ఆయన ప్రేమను కనబరచాలన్నదే మన లక్ష్యం. మనకు జ్ఞానం ఎంతున్నా, నైపుణ్యాలు ఎన్ని ఉన్నా ప్రేమ చూపిస్తేనే మనం మన శ్రోతల హృదయాన్ని చేరుకుంటాం. శిష్యులను చేసే పనిలో మనం మంచి ఫలితాలు సాధించాలంటే మనం కూడ యేసులా ప్రేమతో బోధించాలి.

5 మనం మంచి బోధకులం కావాలనుకుంటే మనం బోధించే విషయాలు మనకు బాగా తెలుసుండాలి. దానికితోడు వాటిని బోధించే నైపుణ్యం కూడ ఉండాలి. ఆ రెండింటినీ సంపాదించుకునేందుకు యేసు తన శిష్యులకు సహాయం చేశాడు. మన కాలంలోనైతే యెహోవా తన సంస్థ ద్వారా మనకు కావాల్సిన శిక్షణను ఇస్తున్నాడు. (యెషయా 54:13; లూకా 12:42 చదవండి.) అయినా, బోధనా పనిలో మన మనసులనే కాక హృదయాలను కూడ లగ్నం చేసేందుకు మనం ప్రయత్నించాలి. మనకు జ్ఞానం, నైపుణ్యం, ప్రేమ ఉన్నట్లయితే, ఎంతో సంతృప్తినిచ్చే ఫలితాలు పొందవచ్చు. అలాగైతే, మనం బోధించేటప్పుడు ఎలా ప్రేమను చూపించవచ్చు? యేసు, ఆయన శిష్యులు ఎలా ప్రేమను చూపించారు? వీటికి జవాబులను మనమిప్పుడు చూద్దాం.

మనం యెహోవాను ప్రేమించాలి

6. మీరు ఇష్టపడే వ్యక్తి గురించి మీరెలా మాట్లాడతారు?

6 మనం ప్రేమించేవాటి గురించి ఇతరులతో చెప్పడానికి ఇష్టపడతాం. మన మనసుకు నచ్చేవాటి గురించి మాట్లాడుతున్నప్పుడు మన సంతోషం, ఉత్సాహం, ఆప్యాయత మన ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మరిముఖ్యంగా మనం ఇష్టపడే వారి గురించి మాట్లాడుతున్నప్పుడు అలా అవుతుంది. ఆ వ్యక్తి గురించి మనకు తెలిసింది ఇతరులకు చెప్పడానికి ఉత్సాహం చూపిస్తాం. మనం ఆ వ్యక్తిని పొగుడుతాం, గౌరవిస్తాం, ఆయన తరఫున మాట్లాడతాం. మనం ఎలాగైతే ఆయనకు, ఆయన లక్షణాలకు ఆకర్షితులమయ్యామో అలాగే ఇతరులూ ఆకర్షితులు కావాలని కోరుకుంటాం కాబట్టే అలా చేస్తాం.

7. దేవునిపట్ల ప్రేమతో యేసు ఏమి చేశాడు?

7 ఇతరుల్లో యెహోవాపట్ల ప్రేమను పెంచాలంటే ముందుగా మనం ఆయన గురించి తెలుసుకొని ఆయనను ప్రేమించాలి. ఎందుకంటే, సరైన విధంగా దేవుణ్ణి ఆరాధించాలంటే ఆయనను ప్రేమించాలి. (మత్త. 22:36-38) ఈ విషయంలో యేసు పరిపూర్ణమైన మాదిరినుంచాడు. ఆయన యెహోవాను పూర్ణ హృదయంతో, మనస్సుతో, ఆత్మతో, శక్తితో ఆరాధించాడు. పరలోకంలో తన తండ్రితో యేసు కోటానుకోట్ల సంవత్సరాలు గడిపాడు కాబట్టి ఆయనకు తన తండ్రి గురించి బాగా తెలుసు. అందుకే యేసు, “నేను తండ్రిని ప్రేమించుచున్నాను” అని చెప్పగలిగాడు. (యోహా. 14:31) ఆ ప్రేమ ఆయన మాటల్లో, చేతల్లో కనిపించింది. ఆ కారణంగా ఆయన ఎప్పుడూ దేవుడు ఇష్టపడేవాటినే చేశాడు. (యోహా. 8:29) ఆ ప్రేమ ఉండడంవల్లే దేవుని ప్రతినిధులమని చెప్పుకున్న వేషధారులైన మతనాయకులను ఖండించాడు. అంతేకాక, యెహోవా గురించి ఇతరులతో మాట్లాడి, వారు ఆయనను తెలుసుకొని, ప్రేమించేలా సహాయం చేశాడు.

8. దేవునిపట్ల ప్రేమతో యేసు శిష్యులు ఏమి చేశారు?

8 యేసులాగే మొదటి శతాబ్దంలోవున్న ఆయన శిష్యులు యెహోవాను ప్రేమించారు. వారికి ప్రేమ ఉండడంవల్లే ధైర్యంతో, ఉత్సాహంతో సువార్తను ప్రకటించారు. పలుకుబడిగల మతనాయకులు తమను వ్యతిరేకించినప్పటికీ యెరూషలేము అంతటా బోధించారు. వారు తాము చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేకపోయారు. (అపొ. 4:20; 5:28) యెహోవా తమకు అండగా ఉన్నాడని, తమను ఆశీర్వదిస్తాడని వారికి తెలుసు. యెహోవా వారిని ఆశీర్వదించాడు కూడ! అంతెందుకు, యేసు చనిపోయి ముప్ఫై ఏళ్లైనా పూర్తికాకముందే, సువార్త ‘ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడింది’ అని అపొస్తలుడైన పౌలు రాయగలిగాడు.—కొలొ. 1:23.

9. దేవునిపట్ల మనకున్న ప్రేమను ఎలా పెంచుకోవచ్చు?

9 మనం మంచి బోధకులం కావాలనుకుంటే మనం కూడ దేవునిపట్ల మనకున్న ప్రేమను ఎల్లప్పుడూ పెంచుకోవాలి. దాన్ని ఎలా పెంచుకోవచ్చు? తరచూ దేవునికి ప్రార్థించడంతోపాటు, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం, బైబిలు సాహిత్యాలను చదవడం, క్రైస్తవ కూటాలకు హాజరుకావడం వంటివి చేయడం ద్వారా ఆయనపట్ల మనకున్న ప్రేమను పెంచుకోవచ్చు. మనకు దేవుని జ్ఞానం పెరిగేకొద్ది మన హృదయాల్లో ఆయనపట్ల ప్రేమ కూడ పెరుగుతుంది. దేవునిపట్ల మనకున్న ప్రేమను మాటల్లో, చేతల్లో చూపించినప్పుడు ఇతరులు దాన్ని గమనించి యెహోవాకు దగ్గరకావచ్చు.—కీర్తనలు 104:33, 34 చదవండి.

బోధించేవాటిని ప్రేమించాలి

10. మంచి బోధకునికి ఉండే లక్షణమేమిటి?

10 ఓ మంచి బోధకుడు ఎప్పుడూ తాను బోధించేవాటిని ఇష్టపడతాడు. తాను బోధించేవి వాస్తవమైనవని, విద్యార్థులకు వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని నమ్ముతాడు. వాటిని ఆయన ఇష్టపడితే ఆయన ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. విద్యార్థులమీద అది ఎంతో ప్రభావం చూపిస్తుంది. తాను బోధించేవి తానే ఇష్టపడనప్పుడు, వేరేవాళ్లు వాటిని ఇష్టపడాలని ఆయన ఎలా ఆశించగలడు? దేవుని వాక్య బోధకులుగా మీరు మంచి మాదిరిని చూపించడం చాలా ప్రాముఖ్యం. మంచిశిక్షణ పొందిన లేదా “సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును” అని యేసు చెప్పాడు.—లూకా 6:40.

11. తాను బోధించినవాటిని యేసు ఎందుకు ప్రేమించాడు?

11 యేసు తాను బోధించేవాటిని ప్రేమించాడు. తాను చెప్పేవి అంటే పరలోక తండ్రి గురించిన సత్యం, ‘దేవుడు స్వయంగా పలికిన మాటలు,’ “నిత్యజీవపు మాటలు” చాలా ప్రాముఖ్యమైనవని ఆయనకు తెలుసు. (యోహా. 3:33, 34; 6:68) ప్రకాశవంతమైన వెలుగు చీకటిని చేధించినట్లే, యేసు బోధించిన సత్యాలు చెడ్డవాటిని బయటపెట్టి మంచివాటిని వెల్లడిచేశాయి. సాత్వీకులు అబద్ధమత నాయకుల మోసానికీ అపవాది అణచివేతకూ బలయ్యారు. వారికి యేసు బోధలు నిరీక్షణను, ఓదార్పును ఇచ్చాయి. (అపొ. 10:38) యేసు సత్యాన్ని ఎంతగా ప్రేమించాడో ఆయన బోధల్లో, చేతల్లో కనిపించింది.

12. అపొస్తలుడైన పౌలు సువార్తను ఎలా పరిగణించాడు?

12 యేసులాగే ఆయన శిష్యులు యెహోవా గురించిన, క్రీస్తు గురించిన సత్యాన్ని ఎంతగా ఇష్టపడి, దాన్ని అమూల్యంగా ఎంచారంటే, వ్యతిరేకులు కూడ వారి ప్రకటనా పనిని ఆపలేకపోయారు. పౌలు రోమాలోని తోటి విశ్వాసులకు ఇలా రాశాడు: “సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి . . . రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.” (రోమా. 1:15, 16) పౌలు సత్యం గురించి ప్రకటించడాన్ని ఓ గౌరవంగా భావించాడు. “శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు . . . నాకు ఈ కృప అనుగ్రహించెను” అని ఆయన రాశాడు. (ఎఫె. 3:8) పౌలు ఉత్సాహంగా యెహోవా గురించి ఆయన ఉద్దేశాల గురించి ఇతరులకు ప్రకటించాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

13. మనం సువార్తను ఎందుకు ప్రేమిస్తాం?

13 దేవుని వాక్యంలోని సువార్తవల్ల మనం సృష్టికర్త గురించి తెలుసుకొని ఆయనతో అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాం. ఆ సువార్తలో జీవితం గురించిన ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులున్నాయి. మన జీవితాన్ని మలచి, భవిష్యత్తు విషయంలో మనలో ఆశను నింపి, కష్టసమయాల్లో మనల్ని బలపర్చే శక్తి ఆ సువార్తకు ఉంది. అంతేకాక, ఏమి చేస్తే సంతృప్తినిచ్చే నిరంతర జీవితం పొందుతామో కూడ అది వివరిస్తుంది. సువార్తకన్నా అమూల్యమైన, ప్రాముఖ్యమైన విషయం మరొకటిలేదు. అది మనకు అనుగ్రహించబడిన వెలకట్టలేని బహుమతి. అది మనకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆ బహుమతిని ఇతరులతో పంచుకున్నప్పుడు మన ఆనందం రెట్టింపు అవుతుంది.—అపొ. 20:35.

14. మనం బోధించేవాటిపట్ల మన ప్రేమను ఎలా పెంచుకోవచ్చు?

14 సువార్తపట్ల మీకున్న ప్రేమను ఇంకా పెంచుకునేందుకు మీరు ఏమి చేయవచ్చు? దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ధ్యానించడానికి కొంత సమయం తీసుకోండి. ఉదాహరణకు, యేసు భూమ్మీదున్నప్పుడు ఆయనతో కలిసి పరిచర్యలో పాల్గొంటున్నట్లు లేదా అపొస్తలుడైన పౌలుతో ప్రయాణిస్తున్నట్లు ఊహించుకోండి. నూతనలోకంలో ఉన్నట్లు ఊహించుకోండి. అప్పుడు జీవితం ఎంత బాగుంటుందో ఆలోచించండి. సువార్తను వినడంవల్ల మీరు పొందిన ఆశీర్వాదాల గురించి ఆలోచించండి. సువార్తపట్ల మీకు ప్రగాఢమైన ప్రేమ ఉంటే మీ విద్యార్థులు దాన్ని గమనిస్తారు. అందుకే, మనం నేర్చుకున్నవాటి గురించి జాగ్రత్తగా ఆలోచించి, మనం బోధించేవాటి విషయంలో జాగ్రత్త వహించాలి.—1 తిమోతి 4:15, 16 చదవండి.

ప్రజలను ప్రేమించాలి

15. ఓ బోధకుడు తన విద్యార్థులను ఎందుకు ప్రేమించాలి?

15 ఓ మంచి బోధకుడు తన విద్యార్థులు నేర్చుకునేందుకు, తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పేందుకు ఆసక్తి చూపించేలా వారితో స్నేహపూరితంగా ప్రవర్తిస్తాడు. ప్రేమగల బోధకునికి విద్యార్థులపట్ల నిజమైన శ్రద్ధ ఉంటుంది కాబట్టి తనకు తెలిసిన విషయాలను వారికి చెబుతాడు. ఆయన వారి అవసరాలకు, గ్రహించే సామర్థ్యానికి తగ్గట్లు బోధిస్తాడు. తన విద్యార్థుల సామర్థ్యాలను, పరిస్థితులను గుర్తుంచుకొని బోధిస్తాడు. బోధకులకు అలాంటి ప్రేమ ఉంటే విద్యార్థులు దాన్ని గ్రహిస్తారు. అప్పుడు బోధించడం, నేర్చుకోవడం రెండూ ఆహ్లాదకరంగా సాగుతాయి.

16. యేసు ప్రజలపట్ల ఏయే విధాలుగా ప్రేమను చూపించాడు?

16 యేసు అలాంటి ప్రేమనే చూపించాడు. ఇతరులు రక్షించబడేలా ఆయన తన పరిపూర్ణమైన మానవ ప్రాణాన్ని అర్పించి, శ్రేష్ఠమైన ప్రేమను చూపించాడు. (యోహా. 15:13) ప్రజలకు సహాయం చేయడానికి, తన తండ్రి గురించి బోధించడానికి ఎల్లప్పుడూ సుముఖత చూపించాడు. ప్రజలు తన దగ్గరకు రావాలని ఆశించే బదులు తానే సువార్త ప్రకటించడానికి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వారిదగ్గరికి వెళ్లాడు. (మత్త. 4:23-25; లూకా 8:1) ఆయన వారి అవసరాలను అర్థంచేసుకొని ఓపికతో ప్రవర్తించాడు. అవసరమైనప్పుడు తన శిష్యులను ప్రేమతో సరిదిద్దాడు. (మార్కు 9:33-37) వారు సువార్తను సమర్థంగా ప్రకటిస్తారనే నమ్మకం ఉందని చెప్పడం ద్వారా వారిని ప్రోత్సహించాడు. ఏ బోధకుడూ యేసు చూపించినంత ప్రేమను చూపించలేదు. ఆయన శిష్యులను ప్రేమించాడు కాబట్టే వారూ ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను పాటించారు.—యోహాను 14:15 చదవండి.

17. యేసు శిష్యులు ఇతరులపట్ల ఎలా ప్రేమ చూపించారు?

17 యేసులాగే ఆయన శిష్యులూ తాము ప్రకటిస్తున్నవారిపట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపించారు. వారు హింసను సహిస్తూ, ప్రాణాలను సహితం లెక్కచేయకుండా పరిచర్య చేస్తూ సువార్త ప్రకటించగలిగారు. సువార్త విన్నవారిపట్ల ఎంత ఆప్యాయతతో వ్యవహరించారు! అపొస్తలుడైన పౌలు మన హృదయాల్ని స్పృశించే మాటలు అన్నాడు. ఆయన ఇలా రాశాడు: “స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.”—1 థెస్స. 2:7, 8.

18, 19. (ఎ) ప్రకటనా పనిచేయడానికి మనం ఇష్టపూర్వకంగా ఎందుకు త్యాగాలు చేస్తున్నాం? (బి) మనం చూపించే ప్రేమను ఇతరులు గమనిస్తారని అనడానికి ఓ ఉదాహరణ చెప్పండి.

18 దేవుణ్ణి తెలుసుకోవాలని, ఆయనకు సేవచేయాలని తపించేవారిని కనుగొనేందుకు మన కాలంలో కూడ యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా కృషిచేస్తున్నారు. నిజానికి, గత 17 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం 100 కోట్లకన్నా ఎక్కువ గంటలు సువార్త ప్రకటించే పనిలో, శిష్యులను చేసే పనిలో వెచ్చిస్తున్నాం. ఇప్పటికీ మనం అలాగే చేస్తున్నాం. ప్రకటనా పనికోసం మనం మన సమయాన్ని, శక్తిసామర్థ్యాలను, వస్తుసంపదను త్యాగం చేయాల్సివస్తున్నా మనం ఆ పనిని ఇష్టపూర్వకంగా చేస్తున్నాం. ప్రజలు నిత్యజీవం పొందేందుకు దోహదపడే జ్ఞానాన్ని సంపాదించుకోవాలని మన ప్రేమగల పరలోక తండ్రి ఆశిస్తున్నాడనే విషయాన్ని యేసు అర్థంచేసుకున్నాడు. యేసులాగే మనమూ అర్థంచేసుకున్నాం. (యోహా. 17:3; 1 తిమో. 2:3, 4) మనకు ప్రేమ ఉంది కాబట్టే యథార్థహృదయులు మనలాగే యెహోవాను తెలుసుకొని ఆయనను ప్రేమించేలా వారికి సహాయం చేస్తున్నాం.

19 మనం చూపించే ప్రేమను ఇతరులు గమనిస్తారు. ఉదాహరణకు, అమెరికాలోని ఓ పయినీరు సహోదరి మరణించినవారి బంధువులను ఓదార్చేందుకు ఉత్తరాలు రాస్తుంటుంది. ఆమె రాసిన ఉత్తరాన్ని అందుకున్న ఓ వ్యక్తి ఆమెకు ఇలా రాశాడు: “ముక్కూ ముఖం తెలియని ఓ వ్యక్తి కష్టసమయాలను సహించేందుకు కావాల్సిన ఓదార్పును ఇవ్వడానికి శ్రమ తీసుకొని మాకు ఉత్తరం రాయడం చూసి నేను మొదట ఆశ్చర్యపోయాను. ఏదేమైనా, మీకు సాటిమనిషిపట్ల, మానవులను జీవన మార్గంలో నడిపించే దేవునిపట్ల ప్రేమ ఉందని మాత్రం చెప్పగలను.”

20. ప్రేమతో బోధించడం ఎందుకు ప్రాముఖ్యం?

20 ప్రేమతో చేసే పనికి నైపుణ్యం తోడైతే ఓ కళాఖండమే తయారౌతుందని ఓ రచయిత అన్నాడు. మన విద్యార్థులు యెహోవాను తెలుసుకునేలా, హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించేలా సహాయం చేయడానికి మనం ప్రయత్నిస్తాం. మంచి బోధకులం కావాలనుకుంటే మనం దేవుణ్ణి, సత్యాన్ని, ప్రజలను ప్రేమించాలి. అలాంటి ప్రేమను అలవర్చుకొని దాన్ని పరిచర్యలో కనబరిస్తే మనం ఇవ్వడంలోవున్న ఆనందం మాత్రమే కాక, యేసును అనుకరిస్తూ, యెహోవాను సంతోషపెడుతున్నామనే సంతృప్తిని కూడ సొంతం చేసుకుంటాం.

మీరెలా జవాబిస్తారు?

• మనం ఇతరులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు,

దేవునిపట్ల

బోధించేవాటిపట్ల

బోధిస్తున్నవారిపట్ల ప్రేమ చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

యేసు బోధనా విధానానికీ, శాస్త్రులు పరిసయ్యుల బోధనా విధానానికీ మధ్యవున్న తేడా ఏమిటి?

[18వ పేజీలోని చిత్రం]

చక్కగా బోధించాలంటే జ్ఞానం, నైపుణ్యంతోపాటు ప్రాముఖ్యంగా ప్రేమ అవసరం