భూమ్మీద నిత్యజీవం గురించి యేసు బోధించాడా?
భూమ్మీద నిత్యజీవం గురించి యేసు బోధించాడా?
‘[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు.’—ప్రక. 21:4.
1, 2. మొదటి శతాబ్దంలో చాలామంది యూదులు భూమ్మీద నిరంతరం జీవించాలని ఆశించినట్లు మనకెలా తెలుసు?
సమాజంలో పేరుప్రతిష్ఠలున్న ధనవంతుడైన ఓ యువకుడు యేసు దగ్గరికి పరిగెత్తుకొనివచ్చి, ఆయన ముందు మోకాళ్లూని, “సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదును” అని అడిగాడు. (మార్కు 10:17) ఆ యువకుడు ఎక్కడ నిత్యజీవం పొందాలనుకున్నాడు? పరలోకంలోనా, భూమ్మీదనా? మనం ముందటి ఆర్టికల్లో చూసినట్లు, శతాబ్దాల క్రితం దేవుడు యూదులకు పునరుత్థానం విషయంలో, భూమ్మీద నిరంతరం జీవించే విషయంలో నిరీక్షణను ఇచ్చాడు. మొదటి శతాబ్దంలోని అనేకమంది యూదులు కూడ దాని కోసం ఎదురుచూశారు.
2 యేసు స్నేహితురాలైన మార్త భూమ్మీద జరగబోయే పునరుత్థానాన్ని మనసులో ఉంచుకొని, మరణించిన తన సహోదరుడు “అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదును” అని చెప్పివుంటుంది. (యోహా. 11:24) అప్పట్లో సద్దూకయ్యులు పునరుత్థానం జరుగుతుందని నమ్మలేదన్నమాట వాస్తవమే. (మార్కు 12:18) అయితే, జుడేయిజమ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీస్ ఆఫ్ ద క్రిస్టియన్ ఇరా అనే తన పుస్తకంలో జార్జ్ ఫుట్ మూరే ఇలా రాశాడు: “గతంలో మరణించినవారు ఏదో ఒక రోజు పునరుత్థానం చేయబడతారని చాలామంది విశ్వసించారన్న వాదనను రెండవ లేదా మొదటి శతాబ్దపు రచనలు . . . బలపరుస్తున్నాయి.” కాబట్టి, యేసు దగ్గరికి వచ్చిన ధనవంతుడు భూమ్మీద నిరంతరం జీవించాలని కోరుకున్నాడని మనకు తెలుస్తుంది.
3. మనం ఈ ఆర్టికల్లో ఏ ప్రశ్నల గురించి చర్చిస్తాం?
3 భూమ్మీద నిరంతరం జీవించడం గురించి యేసు బోధించలేదని నేడు చాలా మతాలవారు, బైబిలు విద్వాంసులు అంటారు. చనిపోయిన తర్వాత కూడ ఆత్మలోకంలో బ్రతికేవుంటామని చాలామంది అనుకుంటారు. కాబట్టి, క్రైస్తవ గ్రీకు లేఖనాలను చదివేవారు ‘నిత్యజీవం’ అనే మాట ఎక్కడ కనిపించినా అది పరలోక జీవితాన్నే సూచిస్తుందని అనుకుంటారు. వారి నమ్మకం సరైనదేనా? మానవులు నిత్యజీవాన్ని ఎక్కడ పొందుతారని యేసు చెప్పాడు? ఆయన శిష్యులు ఏమని నమ్మారు? మనం భూమ్మీద నిత్యమూ జీవించవచ్చని క్రైస్తవ గ్రీకు లేఖనాలు బోధిస్తున్నాయా?
“పునర్జననమందు” నిత్యజీవం
4. “పునర్జననమందు” ఏమి జరుగుతుంది?
4 అభిషిక్త క్రైస్తవులు పరలోకం నుండి భూమిని పరిపాలించేందుకు పునరుత్థానం చేయబడతారని బైబిలు బోధిస్తోంది. (లూకా 12:32; ప్రక. 5:9, 10; 14:1-3) అయితే, నిత్యజీవం గురించి మాట్లాడిన ప్రతీసారి యేసు మనసులో కేవలం ఆ గుంపు మాత్రమే లేదు. ఆస్తినంతా బీదలకు ఇచ్చేసి తనను వెంబడించమని యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని విని దుఃఖించిన ఆ యువకుడు అక్కడినుండి వెళ్లిపోయినప్పుడు యేసు ఏమి చెప్పాడో గమనించండి. (మత్తయి 19:28, 29 చదవండి.) యేసు తన అపొస్తలులకు ‘ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారిని’ అంటే అభిషిక్తులను మినహాయించి మానవులందరినీ పరిపాలించి తీర్పుతీర్చే విషయంలో వాగ్దానం చేశాడు. (1 కొరిం. 6:2) తనను వెంబడించే ‘ప్రతీఒక్కరూ’ పొందే బహుమతి గురించి కూడ ఆయన చెప్పాడు. వారు కూడ ‘నిత్యజీవాన్ని స్వతంత్రించుకుంటారు’ అని ఆయన వాగ్దానం చేశాడు. ఇవన్నీ “పునర్జననమందు” జరుగుతాయి.
5. ‘పునర్జననం’ అనే మాటను వివరించండి.
5 యేసు దేన్ని మనసులో ఉంచుకొని ‘పునర్జననం’ అనే మాటను ఉపయోగించాడు? ఈజీ-టు-రీడ్ వర్షన్ బైబిలులో ఆ మాట “క్రొత్త ప్రపంచం” అని అనువదించబడింది. పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం బైబిలు దాన్ని “నవ యుగం” అని అనువదించింది. యేసు ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఆ మాటను ఉపయోగించాడు కాబట్టి, శతాబ్దాలుగా యూదులు విశ్వసిస్తూ వచ్చిన నమ్మకం గురించే ఆయన ఈ సందర్భంలో మాట్లాడాడని స్పష్టమౌతుంది. ఆదాముహవ్వలు పాపం చేయకముందు ఏదెను తోటలో ఉన్నలాంటి పరిస్థితులు భూమ్మీద మళ్లీ ఏర్పడాలంటే పునఃసృష్టి జరగాలి. అలా జరిగినప్పుడే ‘క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి సృష్టిస్తాను’ అని దేవుడు చేసిన వాగ్దానం నెరవేరుతుంది.—యెష. 65:17.
6. నిత్యజీవ నిరీక్షణ విషయంలో గొర్రెలు మేకల ఉపమానం నుండి మనం ఏమి తెలుసుకోవచ్చు?
6 యేసు యుగసమాప్తి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడ నిత్యజీవం గురించి ప్రస్తావించాడు. (మత్త. 24:1-3) “మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపర[చును]” అని ఆయన చెప్పాడు. ప్రతికూల తీర్పును పొందేవారు ‘నిత్యశిక్షను నీతిమంతులు నిత్యజీవమును’ పొందుతారు. క్రీస్తు ఆత్మాభిషిక్త ‘సహోదరులకు’ నమ్మకంగా మద్దుతునిచ్చేవారే నిత్యజీవాన్ని పొందే “నీతిమంతులు.” (మత్త. 25:31-34, 40, 41, 45, 46) పరలోక రాజ్యంలో రాజులుగా ఉండేందుకు అభిషిక్తులు ఎంపిక చేయబడతారు కాబట్టి, “నీతిమంతులు” ఆ రాజ్యంలో భూమ్మీదుండే ప్రజలైవుండాలి. బైబిల్లో ఇలా ప్రవచించబడింది: “సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు [యెహోవా నియమించిన రాజు] రాజ్యము చేయును.” (కీర్త. 72:8) ఆయన పరిపాలనలో ప్రజలు భూమ్మీద నిత్యజీవాన్ని అనుభవిస్తారు.
యోహాను సువార్త ఏమి చెబుతోంది?
7, 8. యేసు నీకొదేముతో ఏ రెండు నిరీక్షణల గురించి మాట్లాడాడు?
7 మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో యేసు ఏయే సందర్భాల్లో “నిత్యజీవం” అనే మాటను ఉపయోగించాడో చూశాం. యేసు నిత్యజీవం గురించి ప్రస్తావించిన దాదాపు 17 సందర్భాలను యోహాను తన సువార్తలో పేర్కొన్నాడు. భూమ్మీద నిరంతరం జీవించడం గురించి యేసు ఏమి చెప్పాడో తెలుసుకునేందుకు వాటిలో కొన్నింటిని మనమిప్పుడు పరిశీలిద్దాం.
8 యేసు మొదటిసారి నీకొదేము అనే పరిసయ్యునితోనే నిత్యజీవం గురించి మాట్లాడాడని యోహాను రాశాడు. ఆయన నీకొదేముతో, “ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడు” అని చెప్పాడు. కాబట్టి, పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు ఖచ్చితంగా ‘క్రొత్తగా జన్మించాలి.’ (యోహా. 3:3-5) యేసు ఆ మాట చెప్పి ఊరుకోలేదు. ఆయన ఆ తర్వాత మానవులందరికీ ఉన్న నిరీక్షణ గురించి మాట్లాడాడు. (యోహాను 3:16 చదవండి.) అభిషిక్త అనుచరులు పరలోకంలో, మిగతావారు భూమ్మీద నిత్యమూ జీవిస్తారని యేసు అక్కడ ప్రస్తావించాడు.
9. యేసు సమరయ స్త్రీతో ఏ నిరీక్షణ గురించి చెప్పాడు?
9 యేసు యెరూషలేములో నీకొదేముతో మాట్లాడిన తర్వాత, ఉత్తరానున్న గలిలయ ప్రాంతానికి వెళ్లాడు. దారిలో ఆయన సమరయలోని సుఖారనే ఊరికి సమీపంలో యాకోబు బావి దగ్గర ఓ స్త్రీని కలిశాడు. ఆమెతో, “నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును” అని చెప్పాడు. (యోహా. 4:5, 6, 14) మానవులందరూ నిత్యమూ జీవించేందుకు దేవుడు చేసిన ఏర్పాట్లను ఆ నీళ్లు సూచిస్తున్నాయి. ప్రకటన గ్రంథంలో, “దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును” అని దేవుడు చెప్పాడు. (ప్రక. 21:5, 6; 22:17) కాబట్టి, రాజ్యవారసులైన అభిషిక్తులే కాక భూనిరీక్షణ ఉన్న నమ్మకమైన దేవుని సేవకులు కూడ నిత్యజీవాన్ని పొందుతారని యేసు సమరయ స్త్రీతో చెప్పాడు.
10. బేతెస్ద కోనేరు దగ్గర అనారోగ్యంతోవున్న ఓ వ్యక్తిని బాగుచేసిన తర్వాత తనను వ్యతిరేకిస్తున్న యూదులకు నిత్యజీవం గురించి యేసు ఏమి చెప్పాడు?
10 ఆ తర్వాతి ఏడాది కూడ, యేసు యెరూషలేముకు వెళ్లాడు. అక్కడ ఆయన బేతెస్ద కోనేరు దగ్గర అనారోగ్యంతోవున్న ఓ వ్యక్తిని బాగుచేశాడు. అలా బాగుచేసినందుకు యూదులు ఆయనను తప్పుబట్టారు. అప్పుడు, “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు” అని యేసు చెప్పాడు. తన తండ్రి “తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు” అని చెప్పిన తర్వాత, “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు” అని ఆయన అన్నాడు. అంతేకాక, “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన [మనుష్యకుమారుని] శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు” అనే హామీనిచ్చాడు. (యోహా. 5:1-9, 19, 22, 24-29) భూమ్మీద నిరంతరం జీవించాలన్న యూదుల ఆశను నెరవేర్చేందుకు దేవుడు తననే నియమించాడని, మరణించినవారిని లేపడం ద్వారా తాను వారి ఆశలను నెరవేరుస్తానని హింసిస్తున్న ఆ యూదులకు యేసు చెప్పాడు.
11. భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణను కూడ యేసు మనసులో ఉంచుకొని యోహాను 6:48-51లోని మాటలు అన్నాడని ఎలా చెప్పవచ్చు?
11 గలిలయలో, యేసు అద్భుతంగా ఇచ్చే ఆహారం కోసం వేలాదిమంది ఆయనను అనుసరించసాగారు. యోహాను 6:40, 48-51 చదవండి.) ఆయన, “నేనిచ్చు ఆహారము . . . నా శరీరమే” అని చెప్పాడు. పరలోకంలో తనతో పరిపాలించేవారికే కాక విమోచించదగిన మానవ ‘లోకానికి’ కూడ ‘జీవాన్ని’ ఇవ్వడానికి యేసు తన ప్రాణాన్ని అర్పించాడు. “ఎవడైనను ఈ ఆహారము భుజించితే,” అంటే యేసు బలికున్న విమోచనా శక్తిపైన విశ్వాసముంచితే అతనికి నిత్యజీవం పొందే అవకాశముంటుంది. మెస్సీయ పరిపాలనలో భూమ్మీద నిరంతరం జీవిస్తామని యూదులు ఎంతోకాలంగా నమ్మారు. యేసు దాన్ని కూడ మనసులో ఉంచుకొనే ‘ఎల్లప్పుడూ జీవించడం’ గురించి మాట్లాడాడు.
యేసు “జీవాహారము” అనే మరో రకమైన ఆహారం గురించి మాట్లాడాడు. (12. యేసు ఏ నిరీక్షణను మనసులో ఉంచుకొని తన ‘గొర్రెలకు నిత్యజీవాన్ని ఇస్తాను’ అని తన వ్యతిరేకులతో అన్నాడు?
12 ఆ తర్వాత, యెరూషలేములో ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతున్నప్పుడు, యేసు తన వ్యతిరేకులతో ఇలా అన్నాడు: “మీరు నా గొఱ్ఱెలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను.” (యోహా. 10:26-28) యేసు ఈ సందర్భంలో పరలోక జీవితం గురించే మాట్లాడాడా లేదా భూపరదైసులో నిత్యజీవాన్ని కూడ మనసులో ఉంచుకొని మాట్లాడాడా? ఈ మాటలు అనడానికి కొంతకాలం ముందు, యేసు తన అనుచరులకు ఈ హామీనిచ్చాడు: “చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” (లూకా 12:32) అయితే, ఆలయ ప్రతిష్ఠిత సమయంలోనే యేసు ఇలా అన్నాడు: “ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను.” (యోహా. 10:16) వీటన్నిటినిబట్టి, పరలోకంలో జీవించే అవకాశమున్న “చిన్నమంద” మాత్రమే కాక, భూమిపై నిరంతరం జీవించే అవకాశమున్న లక్షలాది ‘వేరేగొఱ్ఱెలను’ కూడ మనసులో ఉంచుకొని యేసు ఆ వ్యతిరేకులతో ఆ మాటలు అన్నాడని చెప్పవచ్చు.
ఆ నిరీక్షణను వివరించాల్సిన అవసరం రాలేదు
13. ‘నీవు నాతోకూడ పరదైసులో ఉందువు’ అని యేసు అన్న మాటల భావమేమిటి?
13 మానవులకు నిరీక్షణ ఉందని హింసాకొయ్యపై వేదనను అనుభవిస్తున్నప్పుడు యేసు గట్టి భరోసాను ఇచ్చాడు. యేసు పక్కన వేలాడదీయబడిన ఓ నేరస్థుడు, “యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము” అని కోరుకున్నాడు. యేసు అతనితో, ‘నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నేడు నీతో చెప్పుచున్నాను’ అని వాగ్దానం చేశాడు. (లూకా 23:42, 43, NW) బహుశా ఆ వ్యక్తి యూదుడై ఉంటాడు కాబట్టి పరదైసు గురించి అతనికి కొత్తగా వివరించాల్సిన అవసరం రాలేదు. భవిష్యత్తులో ఈ భూమ్మీద నిరంతరం జీవించే అవకాశముందని అతనికి తెలుసు.
14. (ఎ) పరలోక నిరీక్షణ గురించి యేసు చెప్పిన మాటలను అర్థంచేసుకోవడం అపొస్తలులకు కష్టమైందని ఎలా చెప్పవచ్చు? (బి) పరలోక నిరీక్షణను యేసు అనుచరులు ఎప్పుడు బాగా అర్థంచేసుకున్నారు?
14 అయితే, పరలోక నిరీక్షణ గురించి మాట్లాడినప్పుడు యేసు వివరించాల్సివచ్చింది. వారికోసం పరలోకంలో స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానని యేసు తన శిష్యులతో అన్నప్పుడు వారు ఆయన మాటలను అర్థంచేసుకోలేకపోయారు. (యోహాను 14:2-5 చదవండి.) ఆ తర్వాత ఆయన వారితో, “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును” అని అన్నాడు. (యోహా. 16:12, 13) సా.శ. 33 పెంతెకొస్తునాడు, క్రీస్తు అనుచరులు భావిరాజులుగా దేవుని ఆత్మ ద్వారా అభిషేకించబడిన తర్వాతే, తమ సింహాసనాలు పరలోకంలో ఉంటాయని గుర్తించారు. (1 కొరిం. 15:49; కొలొ. 1:5; 1 పేతు. 1:3, 4) తమకు పరలోక నిరీక్షణ ఉందనే విషయం అప్పుడు వారికి అర్థమైంది. ఆ తర్వాత రాయబడిన క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని ప్రేరేపిత పత్రికలు ఆ నిరీక్షణ గురించి ముఖ్యంగా వివరించాయి. అయితే, భూమ్మీద నిత్యమూ జీవించే నిరీక్షణను ఈ పత్రికలు బలపరుస్తున్నాయా?
ప్రేరేపిత పత్రికలు ఏమి చెబుతున్నాయి?
15, 16. దైవప్రేరణతో హెబ్రీయులకు రాసిన పత్రిక, పేతురు మాటలు భూమ్మీద నిరంతరం జీవించే అవకాశముందని ఎలా సూచిస్తున్నాయి?
15 అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో, తన తోటి విశ్వాసులను “పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందిన పరిశుద్ధ సహోదరులారా” అని పిలిచాడు. అయితే, దేవుడు “రాబోవు లోకమును” యేసుకు లోబరచాడని కూడ ఆయన చెప్పాడు. (హెబ్రీ. 2:3, 5; 3:1) ఇక్కడ “రాబోవు లోకము” యేసుక్రీస్తు పరిపాలనలో ఉండే భూవ్యవస్థను సూచిస్తోంది. “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” అని దేవుడు చేసిన వాగ్దానాన్ని యేసు అప్పుడు నెరవేరుస్తాడు.—కీర్త. 37:29.
16 మానవుల భవిష్యత్తు గురించి దైవప్రేరణతో అపొస్తలుడైన పేతురు కూడ రాశాడు. ఆయన, “ఇప్పుడున్న ఆకాశము [‘ఆకాశములు,’ NW] భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవి” అని రాశాడు. (2 పేతు. 3:7) ఇప్పుడున్న ప్రభుత్వాలనే ఆకాశాల స్థానంలో, దుష్ట మానవ సమాజం స్థానంలో ఏమి వస్తాయి? (2 పేతురు 3:13 చదవండి.) వాటి స్థానంలో ‘కొత్త ఆకాశాలు’ అంటే దేవుని మెస్సీయ రాజ్యం, ‘కొత్త భూమి’ అంటే సత్యారాధకులుండే నీతియుక్తమైన మానవ సమాజం వస్తాయి.
17. ప్రకటన 21:1-4లో మానవుల భవిష్యత్తు గురించి ఏమి చెప్పబడింది?
17 మానవులు తిరిగి పరిపూర్ణులవుతారని చెబుతూ బైబిలు చివరి పుస్తకం మనల్ని ఉత్తేజపరుస్తోంది. (ప్రకటన 21:1-4 చదవండి.) ఏదెను తోటలో మానవులు పాపంచేసినప్పటి నుండి విశ్వాసులైన మానవులు దాని కోసమే ఎదురుచూశారు. నీతిమంతులు వృద్ధాప్య సమస్యలు లేకుండా నిరంతరం పరదైసు భూమ్మీద జీవిస్తారు. హెబ్రీ లేఖనాలూ క్రైస్తవ గ్రీకు లేఖనాలూ ఆ నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. నేటికీ యెహోవా నమ్మకమైన సేవకులు దాని నుండి బలాన్ని పొందుతున్నారు.—ప్రక. 22:1, 2.
మీరు వివరించగలరా?
• యేసు దేన్ని మనసులో ఉంచుకొని ‘పునర్జననం’ అనే మాటను ఉపయోగించాడు?
• యేసు నీకొదేముతో దేని గురించి మాట్లాడాడు?
• తన ప్రక్కన వేలాడదీయబడిన నేరస్థునికి యేసు ఏమని వాగ్దానం చేశాడు?
• భూమ్మీద నిరంతరం జీవించే అవకాశముందనే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక, పేతురు మాటలు ఎలా బలపరుస్తున్నాయి?
[అధ్యయన ప్రశ్నలు]
[8వ పేజీలోని చిత్రం]
గొర్రెల్లాంటివారు భూమ్మీద నిత్యజీవాన్ని పొందుతారు
[10వ పేజీలోని చిత్రం]
యేసు నిత్యజీవం గురించి ఇతరులతో మాట్లాడాడు