‘యెహోవా తన ముఖకాంతిని వారిపై ప్రకాశింపజేశాడు’
‘యెహోవా తన ముఖకాంతిని వారిపై ప్రకాశింపజేశాడు’
మన ముఖంలో ముప్పైకన్నా ఎక్కువ కండరాలు ఉంటాయి. మనం నవ్వడానికే 14 కండరాలు ఉపయోగిస్తాం. ఈ కండరాలే లేకపోతే మీరు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీ మాటలు ఎవరికైనా నచ్చుతాయా? అస్సలు నచ్చవు. బధిరులకైతే ఈ ముఖకవళికలు ఇతరులకు నచ్చేలా మాట్లాడడానికి మాత్రమే కాకుండా వేరే విధంగా కూడా ఉపయోగపడతాయి. ఈ ముఖకవళికలకు చక్కని అభినయం తోడైతే అవి ఎంతో చక్కగా వేర్వేరు ఆలోచనలను భావాలను తెలియజేస్తాయి. ఈ సంజ్ఞా భాష మాట్లాడేవారు చిన్నచిన్న వివరాలను కూడా వదలకుండా అర్థం చేసుకోవడానికి కష్టమనిపించే వాటిని సైతం ఉన్నదున్నట్టు వ్యక్తం చేయడాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు.
ఈ మధ్యకాలంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బధిరులు ఏ మనిషి ముఖంలోను కనిపించనన్ని హావభావాలు, కళ ఉన్న ఓ ముఖాన్ని చూస్తున్నారు. అలంకారార్థంగా చెప్పాలంటే, వారు ‘యెహోవా ముఖాన్ని’ చూస్తున్నారు. (విలా. 2:19, NW) ఇది దానంతటదే జరిగింది కాదు. యెహోవా ఎప్పటినుండో వారి పట్ల గొప్ప ప్రేమను చూపిస్తున్నాడు. ప్రాచీన ఇశ్రాయేలు కాలంలో కూడా ఆయన వారిపట్ల ప్రేమ చూపించాడు. (లేవీ. 19:14) మన కాలంలో కూడా ఆయన చెవిటివారిని ప్రేమిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని [దేవుడు] యిచ్ఛయించుచున్నాడు.” (1 తిమో. 2:4) దేవుని గురించిన సత్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడం ద్వారా చాలామంది బధిరులు ఆయన ముఖాన్ని చూడగలుగుతున్నారు. బధిరులు వినలేరు కదా, మరి వాళ్లు ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదిస్తున్నారు? దీని జవాబు తెలుసుకునేముందు సంజ్ఞా భాష (సైగలతో సంభాషించడం) చెవిటివారికి ఎందుకు అవసరమో చూద్దాం.
కళ్లతో వింటారు
బధిరుల గురించి, సంజ్ఞా భాష గురించి రకరకాల అపోహలున్నాయి. వాటిలో కొన్నింటిని తొలగించుకుందాం. బధిరులు వాహనాలను నడపగలరు. పెదాల కదలికలనుబట్టి ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోవడం వాళ్లకు చాలా కష్టం. కళ్లులేని వారు చదువుకునే బ్రెయిలీ లిపికీ సంజ్ఞా భాషకూ సంబంధమే లేదు. సంజ్ఞా భాషంటే విషయాలను నటించి చూపించడం మాత్రమే కాదు. ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగించగలిగే ప్రధాన సంజ్ఞా భాషంటూ ఏదీ లేదు. అంతే కాకుండా ప్రాంతాన్నిబట్టి కూడా సంజ్ఞలు మారుతుంటాయి.
బధిరులు చదవగలరా? బధిరుల్లో కొంతమంది బాగా చదవగలిగినా, వారిలో చాలామందికి చదవడం కష్టమనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే మాట్లాడే భాష నుండే లిపి వచ్చింది. సాధారణ పిల్లవాడు భాషను ఎలా నేర్చుకుంటాడో ఆలోచించండి. పుట్టినప్పటి నుండి, తన చుట్టూ ఉన్నవారు స్థానిక భాషలో మాట్లాడుకోవడం ఆ పిల్లవాడికి వినిపిస్తుంటుంది. అలా కొంతకాలానికే పదాలను కలిపి వాక్యాలను కూర్చడం నేర్చుకుంటాడు. ఇది సహజంగానే మాట్లాడే భాష వినడం వల్లే నేర్చుకుంటారు. చదవడం నేర్చుకుంటున్నప్పుడు తానప్పటివరకు పలికిన పదాలే, ఉచ్చారణలే కాగితం మీద అక్షర రూపంలో ఉందని ఇట్టే గ్రహిస్తాడు.
మిమ్మల్ని వేరే దేశానికి తీసుకెళ్లి బయటి శబ్దాలేవీ వినిపించని అద్దాల గదిలో ఉంచారనుకోండి. ఆ దేశ భాషను మీరు ముందెప్పుడూ వినలేదు. అక్కడి ప్రజలు అద్దం బయటి నుండే మీతో ఏదో చెప్పాలని ప్రతీరోజు
ప్రయత్నిస్తున్నారు. వారి మాటలు మీకు వినబడడం లేదు గాని వాళ్ల పెదాలు కదలడం మాత్రం మీకు కనిపిస్తుంది. వారు చెప్పేది మీకు అర్థం కావడంలేదని గ్రహించి, ఆ మాటల్నే ఓ కాగితం మీద రాసి అద్దం బయట నుండి చూపిస్తారు. మీకది అర్థమౌతుందని వాళ్లనుకోవచ్చు. కానీ అది మీకెంతవరకు అర్థమౌతుంది? అసలు మీరెప్పుడూ వినని భాషను వాళ్లు రాసి చూపిస్తున్నారు కాబట్టి వారు రాసింది మీకు అర్థం కాక, వారితో సంభాషించడం సాధ్యంకాకపోవచ్చు. చాలామంది బధిరులు సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.సంజ్ఞా భాషను ఉపయోగించి బధిరులు చక్కగా సంభాషించగలరు, ఇతరులు ఆ భాషలో చెప్పేది కూడా వాళ్లు అర్థంచేసుకోగలరు. సంజ్ఞా భాషలో ఒక వ్యక్తి వివిధ రకాల సైగలు చేస్తూ తాను చెప్పాలనుకున్నది చెబుతాడు. ఆయన ముఖకవళికలతో పాటు గాల్లో చేసే సైగలు సంజ్ఞా భాష వ్యాకరణం ప్రకారం ఉంటాయి. అలా కనిపించే భాష అంటే కళ్లతో చూసి సమాచారాన్ని అర్థం చేసుకునే భాష తయారౌతుంది.
చెవిటివారు సంజ్ఞలతో మాట్లాడుతున్నప్పుడు తమ చేతులతో, శరీరంతో, ముఖంతో వారు చేసే దాదాపు ప్రతీ కదలికకు ఏదో ఒక అర్థం ఉంటుంది. ఎదుట వారిని ఆకట్టుకునేందుకు మాత్రమే వారు ముఖంలో హావభావాలు చూపించరు. అవన్నీ సంజ్ఞా భాష వ్యాకరణంలో చాలా ముఖ్యమైన అంశాలు. ఉదాహరణకు, ఆలోచింపజేసే ప్రశ్నలు లేదా అవును కాదు అని సమాధానం రాబట్టే ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కనుబొమ్మలు పైకెత్తుతారు. ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎందుకు, ఎలా వంటి ప్రశ్నలు అడిగేటప్పుడు కనుబొమ్మలు కిందకు దించుతారు. కొన్నిరకాల నోటి కదలికలతో ఓ వస్తువు ఎంత పెద్దతో లేదా ఒకానొక చర్య ఎంత తీవ్రమైనదో చూపిస్తారు. బధిరులు సంజ్ఞలతో మాట్లాడుతున్నప్పుడు రకరకాలుగా తల ఆడిస్తారు, భుజాలు పైకెత్తుతారు, బుగ్గలు ఆడిస్తారు, కను రెప్పలాడిస్తారు. అలాంటి హావభావాలు చెబుతున్న విషయంలోని చిన్న చిన్న వివరాలను తెలియజేయడానికి తోడ్పడతాయి.
ఇలా రకరకాల హావభావాల వల్ల అవతలి వ్యక్తి సమాచారాన్ని ఎంతో సునాయాసంగా అర్థం చేసుకుంటాడు. సంజ్ఞా భాష తెలిసిన బధిరులు ఇలాంటి హావభావాలతో, సంజ్ఞలతో కవిత్వమైనా సాంకేతిక విషయమైనా, ప్రేమైనా హాస్యమైనా, దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా ఇలా ఏ విషయాన్నైనా అవలీలగా వివరించగలరు.
సంజ్ఞా భాష ప్రచురణలు మార్పు తెచ్చాయి
యెహోవా జ్ఞానం సంజ్ఞా భాషలో వివరించబడినప్పుడు బధిరులు ఆ సందేశాన్ని అర్ధంచేసుకోగలుగుతారు, మరో మాటలో చెప్పాలంటే ఆ సందేశాన్ని విని దాన్ని పంపించిన వ్యక్తిపై “విశ్వాసం” చూపించగలుగుతారు. అందుకే, యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బధిరులకు సువార్త ప్రకటించడానికీ వారి ప్రయోజనార్థం ప్రచురణలను ఇవ్వడానికీ కృషిచేస్తున్నారు. (రోమా. 10:14) ప్రస్తుతం, ప్రపంచమంతటా 58 సంజ్ఞా భాష అనువాద బృందాలు ఉన్నాయి. ఇప్పుడు 40 భాషల్లో సంజ్ఞా భాష ప్రచురణలు డీవీడీ రూపంలో అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల ఏమైనా మంచి ఫలితాలొచ్చాయా?
జెరామీ అమ్మానాన్నలు ఇద్దరూ చెవిటివారే. ఆయన ఇలా అంటున్నాడు: “కావలికోట అర్టికల్లోని కొన్ని పేరాలను అర్థం చేసుకోవడానికే మా నాన్న తన గదిలో ఎన్నో గంటలు కుస్తీలు పడడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఉన్నట్టుండి గది నుండి బయటకు వచ్చి, ‘నాకర్థమయ్యింది! నాకర్థమయ్యింది!’ అని ఉత్సాహంతో సైగలు చేసేవారు. ఆ తర్వాత తనకు అర్థమైన విషయాన్ని నాకు
వివరించేవారు. అప్పుడు నాకు 12 ఏళ్లే. నేను ఆ పేరాలను త్వరత్వరగా చదివి, ‘నాన్నా, దానర్థం అది కాదనుకుంటా. దానర్థం . . . ’ అని సైగ చేసి చెప్పేవాడిని. నన్ను ఆపమని సంజ్ఞ చేసి, తానే స్వయంగా దానర్థం తెలుసుకోవడానికి తిరిగి తన గదిలోకి వెళ్లిపోయేవారు. నిరాశపడి తిరిగి తన గదిలోకి వెళ్తున్నప్పుడు ఆయనలోని పట్టుదలను చూసి ఆశ్చర్యపోవడం నేనెప్పటికీ మరచిపోలేను. అయితే, సంజ్ఞా భాషా ప్రచురణలు డీవీడీ రూపంలో రావడంవల్ల ఇప్పుడు ఆయన విషయాలను మరింత చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నారు. యెహోవా గురించి వివరిస్తున్నప్పుడు ఆయన ముఖం వెలిగిపోవడం చూసి నేనెంతో సంతోషిస్తున్నాను.”సాక్షులైన ఒక జంట అనుభవాన్ని కూడా తీసుకోండి. వారు చిలీలో ఉంటున్న హెసెన్యా అనే అమ్మాయితో మాట్లాడారు. ఆమె బధిరురాలు. వాళ్లమ్మ అనుమతి తీసుకుని నా బైబిలు కథల పుస్తకము—డీవీడీని చిలీ సంజ్ఞా భాషలో ఆ అమ్మాయికి చూపించారు. వారు ఇలా చెబుతున్నారు: “ఒక కథను చూసినప్పుడు హెసెన్యా నవ్వి అంతలోనే ఏడ్వడం మొదలుపెట్టింది. ‘ఎందుకు ఏడుస్తున్నావ్?’ అని వాళ్లమ్మ అడిగినప్పుడు, ‘ఇది నాకెంతో నచ్చింది’ అని చెప్పింది. డీవీడీలో ఉన్నదంతా తన కూతురు అర్థం చేసుకోగలుగుతుందని వాళ్లమ్మ గ్రహించింది.”
వెనిజ్యులాలోని ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక బధిరురాలు ఉంది. ఆమెకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆమె మళ్లీ గర్భవతి అయింది. మరొక బిడ్డను పెంచే స్తోమత లేక ఆమె ఆమె భర్త గర్భస్రావం చేయించాలనుకున్నారు. యెహోవాసాక్షులు ఆ దంపతులను కలిశారు. ఇదేమీ తెలియని సాక్షులు వెనిజ్యులా సంజ్ఞా భాషలోవున్న దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే వీడియోలోని 12వ పాఠాన్ని వారికి చూపించారు. ఆ పాఠంలో గర్భస్రావం, నరహత్య గురించి దేవుని అభిప్రాయమేమిటో వివరించబడింది. వారు తనతో ఆ పాఠాన్ని అధ్యయనం చేసినందుకు ఎంతో రుణపడివున్నానని ఆ తర్వాత ఆమె సాక్షులతో చెప్పింది. ఆ దంపతులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అలా డీవీడీ రూపంలోవున్న ఒక సంజ్ఞా భాషా ప్రచురణ ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది.
బధిరురాలైన లొరాన్ అనే సాక్షిని తీసుకోండి. ఆమె ఇలా చెప్పింది, “బైబిలు చదవడం ఒక పెద్ద పజిల్‌ను పూరించడంలాంటిది. పజిల్‌లోని కొన్ని ఖాళీలను నింపలేకపోయినట్లే, నేను బైబిలు చదువుతున్నప్పుడు కొన్ని విషయాలను అర్థంచేసుకోలేకపోయాను. అయితే, బైబిలు సత్యాలు సంజ్ఞా భాషలో మరింతగా అందుబాటులోకి వచ్చేసరికి ఆ ఖాళీలను నింపగలిగాను.” 38 సంవత్సరాలు నుండి యెహోవాసాక్షిగా ఉన్న బధిరుడైన జార్జ్ ఇలా అంటున్నాడు: “ఒక విషయాన్ని ఇతరుల సహాయం తీసుకోకుండా తెలుసుకోగలిగినప్పుడు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం తప్పకుండా పెరుగుతాయి. యెహోవాకు దగ్గరవడానికి సంజ్ఞా భాష డీవీడీలు నాకెంతో సహాయపడ్డాయి.”
“ఇప్పుడు కూటాలు నా భాషలో జరుగుతున్నాయి!”
సంజ్ఞా భాషా ప్రచురణలు ప్రచురించడంతోపాటు యెహోవాసాక్షులు పూర్తిగా సంజ్ఞా భాషలోనే కూటాలు జరిగే సంఘాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా 1,100కన్నా ఎక్కువ సంజ్ఞా భాషా సంఘాలు ఉన్నాయి. అక్కడ బధిరులతో వారి భాషలోనే మాట్లాడతారు, బైబిలు సత్యాలను కూడా వాళ్లు ఆలోచించే తీరులోనే అంటే వారి భాషలోనే నేర్పిస్తారు. బధిరుల సంస్కృతిని, వారి జీవితానుభవాన్ని గౌరవిస్తూ వారికి నేర్పిస్తారు.
సంజ్ఞా భాషా సంఘాలను ఏర్పాటు చేయడం వల్ల ఏదైనా మేలు జరిగిందా? 1955లో బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయిన సిరల్ అనుభవాన్నే తీసుకోండి. ఆయన చాలా సంవత్సరాలు ప్రచురణలను చదువుతూ అర్థం చేసుకోగలిగినంత అర్థం చేసుకోవడానికి కృషిచేశాడు. అంతేకాక, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరయ్యాడు. కొన్నిసార్లు సంజ్ఞా భాష అనువాదకులు అందుబాటులో ఉండేవారు, కొన్నిసార్లు ఉండేవారు కాదు. అనువాదకులెవరూ లేనప్పుడు తోటి సాక్షుల సహాయాన్ని తీసుకునేవాడు. వారు స్టేజీ మీద చెబుతున్న వాటిని ప్రేమతో రాసిచ్చేవారు. అయితే, ఆయన సాక్షి అయిన దాదాపు 34 సంవత్సరాలకు అంటే 1989లో అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో మొట్టమొదటి సంజ్ఞా భాష సంఘం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ఆ సంఘంలో ఒక సభ్యునిగా ఉండడం సిరల్కు ఎలా అనిపిస్తుంది? “అడవిలో నుండి బయటపడినట్లు, చీకటి గుహలో నుండి వెలుగులోకి వచ్చినట్లు అనిపిస్తోంది. ఇప్పుడు కూటాలు, నా భాషలో జరుగుతున్నాయి!”
బధిరులు క్రమంగా కూడుకుని దేవుని గురించి నేర్చుకునేలా ఆయనను ఆరాధించేలా యెహోవాసాక్షుల సంజ్ఞా భాషా సంఘాలు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అక్కడ ఒకరితో ఒకరు అనుబంధాలు పెంచుకుని, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. బధిరులు ఇతరులతో అంత సులువుగా సంభాషించలేక సమాజంలో ఒంటరివారౌతారు. అదే సంజ్ఞా భాషా క్రైస్తవ సంఘంలో అయితే వారు ఇతరులతో సంభాషించగలుగుతున్నారు, సహవసించగలుగుతున్నారు. ఈ సంఘాల్లో బధిరులు నేర్చుకుంటారు, అభివృద్ధి చెందుతారు, యెహోవా సేవను ఎక్కువ చేయగలుగుతారు. ఎంతోమంది బధిరులైన సాక్షులు పూర్తికాల సువార్తికులుగా సేవచేస్తున్నారు. కొందరైతే వేరే దేశాలకు వెళ్లి అక్కడున్న బధిరులకు యెహోవా గురించి బోధిస్తున్నారు. బధిరులైన క్రైస్తవ సహోదరులు చక్కగా బోధించడాన్ని, సంస్థీకరించడాన్ని, కాపరులుగా సేవచేయడాన్ని నేర్చుకుంటున్నారు. అలా వారిలో చాలామంది సంఘంలో బాధ్యతలను చేపట్టడానికి కూడా అర్హత సంపాదిస్తున్నారు.
అమెరికాలో 100కన్నా ఎక్కువ సంజ్ఞా భాషా సంఘాలు, దాదాపు 80 వరకు సంజ్ఞా భాషా గుంపులు ఉన్నాయి. బ్రెజిల్లో సుమారు 300 సంజ్ఞా భాషా సంఘాలు, 400కన్నా ఎక్కువ గుంపులు ఉన్నాయి. మెక్సికోలో ఇంచుమించు 300 సంజ్ఞా భాషా సంఘాలున్నాయి. రష్యాలో 30కన్నా ఎక్కువ సంజ్ఞా భాషా సంఘాలు, 113 గుంపులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
యెహోవాసాక్షులు సంజ్ఞా భాషలో సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు సంజ్ఞా భాషల్లో 120 కన్నా ఎక్కువ సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాల వల్ల తగినవేళ ఆధ్యాత్మిక ఆహారాన్ని పొందే ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘంలో తాము కూడా ఉన్నామని బధిరులు గ్రహిస్తారు.
లెనార్డ్ అనే బధిరుడు 25 సంవత్సరాలుగా యెహోవా సేవ చేస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “యెహోవాయే సత్యదేవుడని నాకు మొదటి నుండి తెలిసినప్పటికీ, దేవుడు కష్టాల్ని ఎందుకు అనుమతిస్తున్నాడో నేనెప్పుడూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. దాంతో, కొన్నిసార్లు ఆయన మీద నాకు కోపం వచ్చేది. సంజ్ఞా భాషలో జరిగిన సమావేశంలో ఇవ్వబడిన ఒక ప్రసంగంలో ఆయన ఎందుకు కష్టాలను అనుమతిస్తున్నాడో నాకు అర్థమయ్యింది. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత నా భార్య తన మోచేత్తో చిన్నగా పొడిచి, ‘మీకు జవాబు దొరికిందా?’ అని అడిగింది. జవాబు దొరికిందని మనస్ఫూర్తిగా చెప్పగలిగాను. ఈ 25 సంవత్సరాల్లో ఎప్పుడూ నేను యెహోవాను విడిచిపెట్టనందుకు నేను ఆయనకు ఎంతో రుణపడివున్నాను. యెహోవాను నేనెప్పుడూ ప్రేమించాను, కాకపోతే ఆయనను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. ఈ రోజు ఆయన నాకు అర్థమయ్యాడు!”
హృదయపూర్వక కృతజ్ఞతలు
యెహోవా గురించి తెలుసుకున్న బధిరులు ఆయన ముఖంలో ఎలాంటి “హావభావాలు” చూస్తున్నారు? ప్రేమ, కనికరం, న్యాయం, యథార్థత, కృప లాంటి వాటిని ఆయన ముఖంలో చూస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బధిరులైన సాక్షులు యెహోవా ముఖాన్ని చూస్తున్నారు, మున్ముందు కూడా మరింత స్పష్టంగా చూస్తూనేవుంటారు. బధిరుల పట్ల ప్రేమతో ‘యెహోవా తన ముఖకాంతిని వారిపై ప్రకాశింపజేస్తున్నాడు.’ (సంఖ్యా. 6:25, ఈజీ-టు-రీడ్ వర్షన్) యెహోవాను తెలుసుకున్నందుకు బధిరులు ఎంత కృతజ్ఞత చూపిస్తున్నారు!
[24, 25వ పేజీలోని చిత్రాలు]
ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,100 సంజ్ఞా భాషా సంఘాలున్నాయి
[26వ పేజీలోని చిత్రాలు]
యెహోవా ముఖం బధిరులపై ప్రకాశించింది