కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ‘వేరుపారి స్థిరపడ్డారా’?

మీరు ‘వేరుపారి స్థిరపడ్డారా’?

మీరు ‘వేరుపారి స్థిరపడ్డారా’?

బలమైన ఈదురు గాలులకు ఇటూఅటూ కొట్టుకుంటున్న పెద్ద చెట్టును మీరెప్పుడైనా చూశారా? దాని మీద ఎంతో ఒత్తిడి పడుతున్నా అది పడిపోదు. ఎందుకు? దాని వేళ్లు భూమి లోపలి వరకు చొచ్చుకుపోయి బలంగా పాతుకుపోయివుంటాయి. మనం కూడా ఆ చెట్టులా ఉండొచ్చు. “వేరుపారి స్థిరపడి”తే తుఫానులాంటి తీవ్రమైన పరీక్షలొచ్చినప్పుడు మనం కూడా వాటిని సహించగలుగుతాం. (ఎఫె. 3:14-17) అయితే మనం దేనిలో వేరుపారి స్థిరపడాలి?

క్రైస్తవ సంఘానికి “క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయి” అని దేవుని వాక్యం చెబుతోంది. (ఎఫె. 2:20; 1 కొరిం. 3:11) ‘ఆయనలో వేరుపారినవారై, ఇంటివలె కట్టబడుచు, విశ్వాసమందు స్థిరపరచబడుచు, ఆయనయందుండి నడుచుకొనుడి’ అని దేవుని వాక్యం క్రైస్తవులను ప్రోత్సహిస్తోంది. మనం అలా నడుచుకుంటే మన విశ్వాసాన్ని పాడుచేసే వాటన్నిటి నుండి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఉదాహరణకు “నిరర్థక తత్వ జ్ఞానము” నుండి వచ్చే మోసపూరితమైన “చక్కని మాటలు” మన విశ్వాసంపై దాడి చేస్తాయి.—కొలొ. 2:4-8.

“వెడల్పు పొడుగు లోతు ఎత్తు”

అయితే మనం ఎలా “వేరుపారి”, ‘విశ్వాసమందు స్థిరపరచబడవచ్చు’? మన విశ్వాసం వేరుపారి స్థిరపడాలంటే ప్రాముఖ్యంగా దేవుని ప్రేరేపిత వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలి. మనం “సమస్త పరిశుద్ధులతో” కలిసి సత్యపు ‘వెడల్పు పొడుగు లోతు ఎత్తు గ్రహించాలని’ యెహోవా కోరుకుంటున్నాడు. (ఎఫె. 3:15-18) అందుకే పైపై జ్ఞానాన్ని అంటే దేవుని వాక్యంలోని “మూలపాఠములను” మాత్రం తెలుసుకుంటే సరిపోతుందిలే అని క్రైస్తవులెవరూ అనుకోకూడదు. (హెబ్రీ. 5:12; 6:1) బదులుగా మనలో ప్రతీ ఒక్కరూ బైబిలు సత్యాలు మరింత ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తి చూపించాలి.—సామె. 2:1-5.

అంటే దానర్థం సత్యమందు ‘వేరుపారి స్థిరపడడానికి’ ఎక్కువ జ్ఞానం సంపాదించడం మాత్రమే సరిపోతుందని కాదు. అలా అనుకుంటే బైబిల్లో ఏముందో సాతానుకు కూడా తెలుసు. కాబట్టి జ్ఞానం ఒక్కటే సరిపోదు. “జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను” మనం తెలుసుకోవాలి. (ఎఫె. 3:19) మనం యెహోవా మీద, సత్యం మీద ఉన్న ప్రేమతో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఖచ్చితమైన జ్ఞానాన్ని పెంచుకుంటే మన విశ్వాసం బలపడుతుంది.—కొలొ. 2:2.

మీకు ఎంతవరకు తెలుసో పరీక్షించుకోండి

బైబిల్లోని కొన్ని ప్రాముఖ్యమైన సత్యాల గురించి మీకు ఎంతవరకు తెలుసో ఇప్పుడే ఎందుకు పరీక్షించుకోకూడదు? అలా చేస్తే బైబిలు అధ్యయనాన్ని ఇంకా బాగా చేయాలని మీకనిపిస్తుంది. ఉదాహరణకు అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని ప్రారంభ మాటల్ని చదవండి. (“ఎఫెసీయులకు” అనే బాక్సును చూడండి.) వాటిని చదివిన తర్వాత, ‘ఈ బాక్సులో ఏటవాలుగా ఉన్న పదాల అర్థం నాకు తెలుసా?’ అని ప్రశ్నించుకోండి. ఒక్కోపదానికి ఉన్న అర్థం ఇప్పుడు తెలుసుకుందాం.

జగత్తు పునాది వేయబడకమునుపేనిర్ణయించబడింది

‘యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, [దేవుడు] మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు’ అని పౌలు తన తోటి విశ్వాసులకు రాశాడు. మనుష్యులలో నుండి కొంతమందిని దత్తత తీసుకుని తన పరిపూర్ణ పరలోక కుటుంబంలో చేర్చుకోవాలని యెహోవా నిర్ణయించుకున్నాడు. అలా దేవుడు దత్తత తీసుకున్న కుమారులు క్రీస్తుతో పాటు రాజులుగా పరిపాలిస్తారు, యాజకులుగా సేవచేస్తారు. (రోమా. 8:19-23; ప్రక. 5:9, 10) సాతాను మొదట్లో యెహోవా సర్వాధిపత్యాన్ని సవాలు చేసినప్పుడు, దేవుడు చేసిన మనుష్యుల్లో లోపం ఉందని అతడు పరోక్షంగా నిందించాడు. చెడుతనానికి మూలమైన అపవాదియైన సాతానుతో పాటు, విశ్వంలోని చెడుతనమంతటినీ కూకటి వేళ్లతో సహా పెకిలించడానికి దేవుడు మళ్లీ అదే మానవ కుటుంబంలోని వారిని ఎంచుకోవడం ఎంతో సమంజసంగా ఉంది. అయితే మానవుల్లో ఎవరెవరిని తన కుమారులుగా దత్తత తీసుకోవాలో యెహోవా ముందే నిర్ణయించలేదు. కానీ మానవుల్లో నుండి ఒక గుంపు లేదా తరగతి క్రీస్తుతో పాటు పరలోకంలో పరిపాలిస్తుందని దేవుడు నిర్ణయించాడు.—ప్రక. 14:3, 4.

వారు ఒక గుంపుగా “జగత్తు పునాదివేయబడకమునుపే” ఎంపిక చేసుకోబడ్డారని పౌలు తోటి క్రైస్తవులకు రాసినప్పుడు ఆయన ఏ “జగత్తు” గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు భూమిని లేదా మానవులను సృష్టించడానికి ముందున్న కాలం గురించి ఆయన మాట్లాడడం లేదు. ఒకవేళ అప్పుడే నిర్ణయించినట్లైతే అది అన్యాయమే అవుతుంది. ఆదాముహవ్వలు సృష్టించబడక ముందే వారు పాపం చేస్తారని దేవుడు నిర్ణయించి ఉంటే వారు చేసిన తప్పుకు వారెలా బాధ్యులౌతారు? అయితే ఆదాముహవ్వలు సాతానుతో చేయికలిపి దేవుని సర్వాధిపత్యం మీద తిరుగుబాటు చేయడం వల్ల తలెత్తిన పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? మన మొదటి తల్లిదండ్రులు తిరుగుబాటు చేసిన తర్వాతే యెహోవా ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే విడిపించబడడానికి అర్హులయ్యే అపరిపూర్ణ మానవులు అప్పటికి ఇంకా పుట్టలేదు.

“దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి”

ఎఫెసీయులకు రాసిన పత్రికలోని మొదటి వచనాల్లో పౌలు దేవుడు చేసిన ఏర్పాట్ల గురించి రాస్తూ అవి “దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి” చేయబడ్డాయని ఎందుకు అన్నాడు? పాపంలో చిక్కుకున్న మానవులను విడిపించాల్సిన అవసరం దేవునికి లేదని నొక్కిచెప్పడానికే ఆయనలా రాశాడు.

సహజసిద్ధంగా మనలో ఎవరమూ విడుదల పొందడానికి అర్హులం కాదు. మానవుల మీదున్న అమితమైన ప్రేమను బట్టి యెహోవా మనల్ని విడిపించే ఏర్పాట్లు చేశాడు. మన అపరిపూర్ణత, పాపభరిత స్వభావాన్ని పరిగణలోకి తీసుకుంటే పౌలు చెప్పినట్లు మన విడుదల నిజంగా దేవుని కృప వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు.

దేవుని చిత్తం గురించిన మర్మము

సాతాను చేసిన నష్టాన్ని ఎలా పూరిస్తాడో దేవుడు మొదట్లో చెప్పలేదు. అప్పట్లో అది “మర్మము”గా ఉంది. (ఎఫె. 3:4, 5) మానవుల పట్ల, భూమి పట్ల తన ఉద్దేశాన్ని ఎలా నెరవేరుస్తాడో యెహోవా క్రైస్తవ సంఘం స్థాపించినప్పుడు వివరించాడు. “కాలము సంపూర్ణమైనప్పుడు” దేవుడు ఒక “యేర్పాటు” చేస్తాడని, ఆ ఏర్పాటు వల్ల దేవుడు సృష్టించిన తెలివైన ప్రాణులందరు ఐక్యం చేయబడతారని పౌలు వివరించాడు.

సా.శ. 33 పెంతెకొస్తునాడు క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలించేవారిని సమకూర్చడం మొదలైనప్పుడు ఐక్యపర్చడంలోని మొదటి దశ ప్రారంభమైంది. (అపొ. 1:13-15; 2:1-4) దాని రెండవ దశలో క్రీస్తు మెస్సీయ రాజ్యం క్రింద భూపరదైసులో జీవించే వారు సమకూర్చబడతారు. (ప్రక. 7:14-17; 21:1-5) 1914 వరకు మెస్సీయ రాజ్యం స్థాపించబడలేదు కాబట్టి “యేర్పాటు” అనే పదం ఆ మెస్సీయ ప్రభుత్వాన్ని సూచించడం లేదు. కానీ విశ్వమంతా ఐక్యపర్చబడాలనే తన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో భాగంగా దేవుడు ఏర్పరచుకున్న కార్యనిర్వాహణా విధానాన్ని అది సూచిస్తోంది.

“బుద్ధి విషయమై పెద్దవారిలా”

మంచి అధ్యయన అలవాట్లు ఉంటే, సత్యం “వెడల్పు పొడుగు లోతు ఎత్తు” పూర్తిగా గ్రహించగలుగుతాం. ప్రస్తుతం ఎవరికీ తీరిక లేకుండా పోతుంది కాబట్టి అదే అదనుగా చేసుకుని సాతాను మనకున్న చదివే అలవాటును తగ్గించుకునేలా లేదా పూర్తిగా విడిపెట్టేలా చేయగలడు. మీ విషయంలో సాతానుకు ఆ అవకాశం ఇవ్వకండి. దేవుడిచ్చిన “వివేకమును” ఉపయోగించి “బుద్ధి విషయమై పెద్దవారిలా” తయారవ్వండి. (1 యోహా. 5:20; 1 కొరిం. 14:20) మీరొక విషయాన్ని ఎందుకు నమ్ముతున్నారో తెలుసుకోవడానికి కృషిచేయండి. అలా చేసినప్పుడు మీ నమ్మకాల విషయంలో ‘మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సమాధానము చెప్పుటకు’ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.—1 పేతు. 3:15.

పౌలు రాసిన పత్రికను మొదటిసారి ఎఫెసులోని సంఘంలో చదువుతున్నప్పుడు మీరు అక్కడే ఉన్నట్లు ఊహించుకోండి. ‘దేవుని కుమారుని గురించిన ఖచ్చితమైన జ్ఞానం’ పెంచుకునేలా ఆయన రాసిన మాటలు మిమ్మల్ని ప్రోత్సహించి ఉండేవి కదా? (ఎఫె. 4:11, 14, NW) తప్పకుండా ప్రోత్సహించి ఉండేవి! అందుకే, పౌలు రాసిన ఆ ప్రేరేపిత మాటలు ఇప్పటికీ మిమ్మల్ని ప్రోత్సహించనివ్వండి. యెహోవా పట్ల ప్రేమతో పాటు ఆయన వాక్యాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటే క్రీస్తు ప్రేమయందు ‘వేరుపారి స్థిరపడగలుగుతాం.’ అలా చేస్తే ఈ దుష్ట లోకం పూర్తిగా నాశనం కాకముందు సాతాను మీ మీదకు తీసుకొచ్చే ఎలాంటి పరీక్షలనైనా తట్టుకుని నిలబడగలుగుతారు.—కీర్త. 1:1-3; యిర్మీ. 17:7, 8

[27వ పేజీలోని బాక్సు/చిత్రం]

“ఎఫెసీయులకు”

“మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.”—ఎఫె. 1:3-10.