యెహోవాతో మీ సంబంధం ఎలావుందని మీ ప్రార్థనలు చూపిస్తున్నాయి?
యెహోవాతో మీ సంబంధం ఎలావుందని మీ ప్రార్థనలు చూపిస్తున్నాయి?
“ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు.”—కీర్త. 65:2.
1, 2. యెహోవా సేవకులు నమ్మకంతో ఎందుకు ప్రార్థించవచ్చు?
యెహోవా తన నమ్మకమైన సేవకులు చేసే విన్నపాలను పెడచెవిన పెట్టడనీ, ఆయన తప్పక వింటాడనీ మనం నమ్మవచ్చు. లక్షలాదిమంది యెహోవాసాక్షులు ఒకే సమయంలో ప్రార్థించినా ఆయన వారందరి ప్రార్థనలు వినగలడు.
2 దేవుడు తన విజ్ఞాపనలు విన్నాడని నమ్మిన దావీదు తాను రాసిన కీర్తనలో ఇలా అన్నాడు: “ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు.” (కీర్త. 65:2) దావీదు యెహోవాను యథార్థంగా ఆరాధించాడు కాబట్టే, దేవుడాయన ప్రార్థనలు విన్నాడు. మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను యెహోవాను నమ్ముతున్నానని, సత్యారాధనే నాకు అత్యంత ప్రాముఖ్యమని నా ప్రార్థనలు చూపిస్తున్నాయా? అసలు నెనెలాంటి వ్యక్తినని నా ప్రార్థనలు చెబుతున్నాయి?’
దీనమనసుతో యెహోవాను ప్రార్థించండి
3, 4. (ఎ) మనమెలాంటి మనసుతో దేవుణ్ణి ప్రార్థించాలి? (బి) ఘోరమైన పాపం చేశామన్న ‘దిగులు’ మనల్ని వేధిస్తుంటే ఏమిచేయాలి?
3 దేవుడు మన ప్రార్థనలు వినాలంటే, మనం దీనమనసుతో ప్రార్థించాలి. (కీర్త. 138:6) దావీదులాగే మనం కూడా “దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను [‘దిగులును,’ NW] తెలిసికొనుము నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము” అని యెహోవాను వేడుకోవాలి. (కీర్త. 139:23, 24) మనమలా వేడుకోవడమే కాదు, మనల్ని పరిశోధించే అవకాశం దేవునికివ్వాలి, ఆయన వాక్యోపదేశానికి లోబడాలి. అప్పుడు యెహోవా నిత్యజీవం పొందేందుకు దోహదపడే “నిత్యమార్గమున” మనల్ని నడిపిస్తాడు.
4 ఘోరమైన పాపం చేశామన్న ‘దిగులు’ మనల్ని వేధిస్తుంటే ఏమి చేయాలి? (కీర్తన 32:1-5 చదవండి.) అపరాధ భావాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తే, తీవ్ర వేసవిలో చెట్టు ఎండిపోయినట్లే మనం మన శక్తిని కోల్పోతాం. పాపం చేసినందువల్ల ఆనందాన్ని పోగొట్టుకున్న దావీదు అనారోగ్యంపాలై ఉండవచ్చు. అయితే చేసిన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడంవల్ల ఆయనెంతో నెమ్మది పొంది ఉంటాడు. ‘తన అతిక్రమములు పరిహరించబడ్డాయని,’ యెహోవా తనను క్షమించాడని గ్రహించిన దావీదు ఎంత ఆనందించి ఉంటాడో ఊహించండి. చేసిన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడం నెమ్మది కలిగించడమే కాక, క్రైస్తవ పెద్దలు అందించే సహాయం ఆ అపరాధి యెహోవాతో తిరిగి తన సంబంధాన్ని నెలకొల్పుకునేందుకు దోహదపడుతుంది.—సామె. 28:13; యాకో. 5:13-16.
దేవునికి విజ్ఞాపనచేస్తూ, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి
5. యెహోవాకు విజ్ఞాపన చేయడమంటే ఏమిటి?
5 ఏ కారణంవల్లనైనా మనం చింతిస్తుంటే, పౌలు ఇచ్చిన ఈ సలహాను పాటించాలి: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” (ఫిలి. 4:6) “విజ్ఞాపన” అంటే దీనమనసుతో “మనవి చేసుకోవడం” అని అర్థం. ముఖ్యంగా ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా హింసించబడుతున్నప్పుడు సహాయం కోసం, నిర్దేశం కోసం యెహోవాను వేడుకోవాలి.
6, 7. ఏయే కారణాలను బట్టి మన ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి?
6 అవసరమున్నప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తే, అది యెహోవాతో మన సంబంధం గురించి ఏమి చెబుతుంది? “కృతజ్ఞతాపూర్వకముగా” మన విన్నపాలు దేవునికి తెలియజేయాలని పౌలు చెప్పాడు. కాబట్టి, మనం కూడా దావీదులా యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించవచ్చు. ఆయనిలా 1 దిన. 29:11-13.
అన్నాడు: “యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు. . . . మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.”—7 యేసు ఆహారం కోసం, ప్రభువురాత్రి భోజనానికి ఉపయోగించిన రొట్టె ద్రాక్షారసం కోసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. (మత్త. 15:36; మార్కు 14:22, 23) యేసులాగే మనం కూడా ఆహారం విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంతోపాటు, “నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి” ఆయన ‘న్యాయ విధులను బట్టి’ ప్రస్తుతం మనకు బైబిలు నుండి లభిస్తున్న ఆయన వాక్కును బట్టి లేదా సందేశాన్ని బట్టి కూడా “యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు” చెల్లించాలి.—కీర్త. 107:15; 119:62, 105.
ఇతరుల కోసం ప్రార్థించండి
8, 9. తోటి క్రైస్తవుల కోసం మనం ఎందుకు ప్రార్థించాలి?
8 మనమెలాగూ మన కోసం ప్రార్థించుకుంటాం, అయితే మనం ఇతరుల కోసం, బహుశా మనకు తెలియని సహోదరుల కోసం కూడా ప్రార్థించాలి. అపొస్తలుడైన పౌలుకు కొలొస్సయిలోని విశ్వాసులందరూ పేరుపేరునా తెలిసి ఉండకపోవచ్చు, అయినా ఆయన ఇలా రాశాడు: “క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.” (కొలొ. 1:3, 4) అంతేకాక, పౌలు థెస్సలొనీకయలోని క్రైస్తవుల గురించి కూడా ప్రార్థించాడు. (2 థెస్స. 1:11, 12) మనమలా ఇతరుల కోసం చేసే ప్రార్థనలు మనమెలాంటి వారమనే విషయంతోపాటు మన సహోదర సహోదరీలపై మనకెలాంటి అభిప్రాయముందో కూడా చూపిస్తాయి.
9 అభిషిక్త క్రైస్తవుల కోసం, ‘వేరే గొర్రెల’ కోసం చేసే ప్రార్థనలు దేవుని సంస్థపట్ల మనకెంత శ్రద్ధవుందో రుజువుచేస్తాయి. (యోహా. 10:16) ‘సువార్త మర్మమును తెలియజేయుటకై తనకు వాక్ఛక్తి అనుగ్రహింపబడునట్లు’ విజ్ఞాపనచేయుమని పౌలు తోటి క్రైస్తవులను కోరాడు. (ఎఫె. 6:17-20) మనం కూడా అలా ఇతర క్రైస్తవుల కోసం ప్రార్థిస్తున్నామా?
10. ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు అది మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
10 ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు వారి పట్ల మనకున్న అభిప్రాయం మారవచ్చు. మనం అంతగా ఇష్టపడని వ్యక్తి గురించి ప్రార్థించినప్పుడు కూడా అలాగే జరగవచ్చు. (1 యోహా. 4:20, 21) అలాంటి ప్రార్థనలు ప్రోత్సాహకరంగా ఉండడమేకాక అవి మన సహోదరులతో ఐక్యమత్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. అంతేకాక, అలాంటి ప్రార్థనలు మనకు క్రీస్తులాంటి ప్రేమ ఉందని చూపిస్తాయి. (యోహా. 13:34, 35) ప్రేమ దేవుని ఆత్మ ఫలంలో ఒక లక్షణం. అయితే, ఆత్మ ఫలంలోని లక్షణాలైన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహాన్ని చూపించేలా మనకు పరిశుద్ధాత్మను ఇమ్మని యెహోవాను వేడుకుంటున్నామా? (లూకా 11:13; గల. 5:22, 23) అలా చేసినప్పుడు, మనం పరిశుద్ధాత్మానుసారంగా నడుచుకుంటున్నట్లు, పరిశుద్ధాత్మను అనుసరించి జీవిస్తున్నట్లు మన మాటలు చేతలు చూపిస్తాయి.—గలతీయులకు 5:16, 25 చదవండి.
11. మన కోసం ప్రార్థించమని ఇతరులను కోరడం సరియైన విషయమే అని ఎందుకు చెప్పవచ్చు?
11 మన పిల్లలు పరీక్షల్లో కాపీ కొట్టేందుకు శోధించబడ్డారని మనకు తెలిసినప్పుడు వారి కోసం ప్రార్థించాలి. అంతేకాక నిజాయితీగా, ఏ తప్పూ చేయకుండా ఉండేలా వారికి లేఖన ఉపదేశాన్ని కూడా ఇవ్వాలి. పౌలు కొరింథీయులోని క్రైస్తవులకు ఇలా రాశాడు: ‘మీరు ఏ తప్పూ చేయకుండా ఉండాలని దేవునికి ప్రార్థిస్తున్నాం.’ (2 కొరిం. 13:7, ఈజీ-టు-రీడ్ వర్షన్) అలాంటి ప్రార్థనలను బట్టి యెహోవా ఆనందిస్తాడు, మనకూ మంచి పేరు వస్తుంది. (సామెతలు 15:8 చదవండి.) అపొస్తలుడైన పౌలు కోరినట్లే మనం కూడా మన కోసం ప్రార్థించమని ఇతరులను కోరవచ్చు. “మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాము” అని ఆయన రాశాడు.—హెబ్రీ. 13:18.
మన ప్రార్థనలు ఇంకా ఎంతో తెలియజేస్తాయి
12. ప్రాముఖ్యంగా మనం ఏ అంశాల గురించి ప్రార్థించాలి?
12 మనం యెహోవాను సంతోషంతో ఉత్సాహంతో ఆరాధిస్తున్నామని మన ప్రార్థనలు చూపిస్తున్నాయా? మన ప్రార్థనలో ముఖ్యంగా దేవుని చిత్తానికి, రాజ్య సువార్త ప్రకటించడానికి, యెహోవా సర్వాధిపత్యం సరైనదని నిరూపించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి ప్రాముఖ్యతనిస్తున్నామా? యేసు మాదిరి ప్రార్థన చూపిస్తున్నట్లు మన ప్రార్థనలో వాటికే ప్రథమ స్థానం ఇవ్వాలి. మాదిరి ప్రార్థనలోని ప్రారంభపు మాటలు ఇలా చెబుతున్నాయి: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.”—మత్త. 6:9, 10.
13, 14. మన ప్రార్థనలు మన గురించి ఏమి వెల్లడిస్తాయి?
13 మన తలంపులు, ఇష్టాయిష్టాలు, కోరికలు ఏమిటో దేవునికి మనం చేసే ప్రార్థనలు వెల్లడిచేస్తాయి. మనం ఎలాంటి వారమో యెహోవాకు తెలుసు. సామెతలు 17:3 ఇలా చెబుతోంది: “వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే.” కాబట్టి, హృదయంలో ఏముందో యెహోవా చూస్తాడు. (1 సమూ. 16:7) మన కూటాలు, పరిచర్య, సహోదర సహోదరీల గురించి మనకెలాంటి అభిప్రాయముందో ఆయనకు తెలుసు. క్రీస్తు “సహోదరుల” గురించి మనం ఏమనుకుంటున్నామో యెహోవాకు తెలుసు. (మత్త. 25:40) మనం మనస్ఫూర్తిగా కోరుకున్నదే ప్రార్థనలో అడుగుతున్నామా లేక ఊరకనే పదాలను వల్లిస్తున్నామా అనేది కూడా ఆయనకు తెలుసు. “మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు” అని యేసు అన్నాడు.—మత్త. 6:7.
14 ప్రార్థనలో ఉచ్ఛరించే మాటలనుబట్టి మనం దేవునిపై ఎంతగా ఆధారపడుతున్నామో కూడా తెలుస్తుంది. “[యెహోవా] నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును” అని దావీదు అన్నాడు. (కీర్త. 61:3, 4) ఒకరకంగా చెప్పాలంటే, దేవుడు తన ‘గుడారాన్ని మనమీద కప్పినప్పుడు’ మనం సురక్షితంగా ఉంటాం. (ప్రక. 7:15) ఎలాంటి విశ్వాస పరీక్షలు ఎదురైనా యెహోవా ‘మనపక్షాన’ ఉంటాడన్న నమ్మకంతో ఆయనకు ప్రార్థించడం ఎంతో ఓదార్పునిస్తుంది.—కీర్తన 118:5-9 చదవండి.
15, 16. సేవాధిక్యతలు చేపట్టాలనే మన కోరిక విషయంలో ఏమి గ్రహించడానికి ప్రార్థన సహాయం చేయవచ్చు?
15 మన ఆలోచనల గురించి నిజాయితీగా యెహోవాకు ప్రార్థించినప్పుడు అవి ఎంతవరకు సరైనవో తెలుసుకోగలుగుతాం. ఉదాహరణకు, దేవుని ప్రజలను పర్యవేక్షించాలని ఆశించేది ప్రకటనా పనిలో, సంఘంలో చేయగలిగింది చేయాలనే ఉద్దేశంతోనా? లేక ‘ప్రధానత్వాన్ని,’ ఇతరులపై ‘అధికారం’ చెలాయించాలనే ఉద్దేశంతోనా? 3 యోహాను 9, 10; లూకా 22:24-27 చదవండి.) మనం హృదయపూర్వకంగా యెహోవాకు ప్రార్థించినప్పుడు మనలో ఏమైనా చెడు కోరికలు, చెడు తలంపులువుంటే వాటిని గుర్తించగలుగుతాం.
దేవుని ప్రజలు అలాంటి ఉద్దేశంతో సేవచేయకూడదు. (16 క్రైస్తవ స్త్రీలు, తమ భర్తలు పరిచర్య సేవకులుగా, ఆ తర్వాత పైవిచారణకర్తలుగా లేక పెద్దలుగా సేవ చేయాలని ఎంతగానో కోరుకోవచ్చు. వీరు తాము కోరుకునే విషయం గురించి వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థించడంతో పాటు మంచి మాదిరిగా ఉండేందుకు కృషిచేయాలి. ఇలా కృషిచేయడం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుల మాటలు, ప్రవర్తన సరిగా ఉన్నప్పుడే సంఘ సభ్యులకు ఆయనపై సదభిప్రాయం ఏర్పడుతుంది.
ఇతరుల తరఫున చేసే ప్రార్థనలు
17. వ్యక్తిగత ప్రార్థనప్పుడు ఏకాంతంగా ఉండడం ఎందుకు మంచిది?
17 తన తండ్రికి ప్రార్థన చేయడానికి యేసు తరచు ఏకాంత ప్రదేశానికి వెళ్లాడు. (మత్త. 14:13; లూకా 5:16; 6:12) మనమూ ఏకాంతంగా ప్రార్థించాలి. ప్రశాంత వాతావరణంలో మౌనంగా ప్రార్థించినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు యెహోవాను సంతోషపెట్టడమే కాక, ఆయన ఆరాధనలో స్థిరంగా నిలబడేందుకూ దోహదపడవచ్చు. అయితే, యేసు బహిరంగంగా కూడా ప్రార్థించాడు, సరైన పద్ధతిలో ఎలా బహిరంగ ప్రార్థన చేయవచ్చో పరిశీలిద్దాం.
18. సంఘం తరఫున ప్రార్థిస్తున్నప్పుడు సహోదరులు ఏ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి?
18 మన కూటాల్లో బాధ్యతగల పురుషులు సంఘం తరఫున బహిరంగంగా ప్రార్థిస్తారు. (1 తిమో. 2:8) ఆ ప్రార్థన చివర్లో తోటి విశ్వాసులు ‘అలా జరుగును గాక’ అని అర్థమిచ్చే “ఆమెన్” అని చెప్పగలగాలి. వారలా చెప్పాలంటే ప్రార్థనలోని మాటలతో ఏకీభవించాలి. యేసు నేర్పిన మాదిరి ప్రార్థనలో అభ్యంతరకరమైన మాటలేవీ లేవు. (లూకా 11:2-4) అంతేకాక, ఆయన తన శ్రోతలందరి ప్రతీ అవసరం లేదా సమస్య గురించి ప్రార్థించలేదు. స్వంత విషయాల గురించి బహిరంగంగా కాదుగానీ వ్యక్తిగతంగా ప్రార్థించడం మంచిది. బహిరంగంగా ప్రార్థించేటప్పుడు రహస్యంగా ఉంచాల్సిన విషయాలను ప్రస్తావించకూడదు.
19. బహిరంగ ప్రార్థన సమయంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి?
19 అందరి తరఫున ఎవరైనా ప్రార్థిస్తున్నప్పుడు మనం ‘దైవ భయం’ చూపించాలి. (1 పేతు. 2:17) వేరే సమయంలో లేదా స్థలంలో చేసే కొన్ని పనులు క్రైస్తవ కూటాల్లో చేయడం సభ్యతగా ఉండకపోవచ్చు. (ప్రసం. 3:1) ఉదాహరణకు, ప్రార్థన చేయబడుతున్న సమయంలో అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకోవాలని కొందరు అనుకోవచ్చు. అయితే ఇలా చేతులు పట్టుకోవడం కూటానికి హాజరైన కొత్తవారితో సహా కొందరికి అభ్యంతరకరంగా ఉండవచ్చు లేదా వారి ఏకాగ్రతను పాడుచేయవచ్చు. కొందరు దంపతులు ఇతరులకు అభ్యంతరం కలగని విధంగా చేతులు పట్టుకోవచ్చు. అయితే బహిరంగ ప్రార్థన సమయంలో ఒకరినొకరు హత్తుకుని నిలబడితే అది చూసేవారికి అభ్యంతరకరంగా ఉండవచ్చు. ఆ దంపతులకు యెహోవా మీద భక్తికన్నా తమ ప్రణయాత్మక సంబంధం మీదే ఎక్కువ ధ్యాసవుందని చూసేవారు అనుకోవచ్చు. దేవునిపై మిక్కిలి గౌరవంతో ‘సమస్తం దేవుని మహిమ కోసం చేస్తూ’ ఇతరుల ఏకాగ్రతను పాడుచేసే లేదా ఇతరులకు అభ్యంతరం కలిగించే ప్రవర్తనకు దూరంగా ఉందాం.—1 కొరిం. 10:31, 32; 2 కొరిం. 6:3.
దేనికోసం ప్రార్థించాలి?
20. రోమీయులు 8:26, 27లోని విషయాన్ని వివరించండి.
20 కొన్నిసార్లు మన వ్యక్తిగత ప్రార్థనలో ఏమి చెప్పాలో మనకు తెలియకపోవచ్చు. “యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ [పరిశుద్ధ] ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు [దేవుడు] ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును” అని పౌలు రాశాడు. (రోమా. 8:26, 27) ఎంతోమంది చేసిన ప్రార్థనలను యెహోవా దేవుడు బైబిల్లో రాయించాడు. దేవుడు ఈ ప్రార్థనలను మనం చేయాలనుకున్న ప్రార్థనల్లాగే పరిగణించి వాటికి జవాబిస్తాడు. దేవునికి మన గురించేకాక, తన పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిలు రచయితలు రాసిన మాటల అర్థం కూడా తెలుసు. పరిశుద్ధాత్మ మన పక్షాన “విజ్ఞాపన” చేసినప్పుడు యెహోవా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. అయితే బైబిల్లోని విషయాలను ఎక్కువ తెలుసుకునేకొద్దీ ఏ విషయాల గురించి ప్రార్థించాలో మనకు వెంటనే స్ఫురిస్తుంది.
21. తర్వాతి ఆర్టికల్లో ఏమి పరిశీలిస్తాం?
21 మనం తెలుసుకున్నట్లుగా మన ప్రార్థనలు మన గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తాయి. ఉదాహరణకు, అవి యెహోవాతో మనకు ఎంత సన్నిహిత సంబంధముందో, మనకు ఆయన వాక్యంలోని విషయాలు ఎంత బాగా తెలుసో వెల్లడించవచ్చు. (యాకో. 4:8) తర్వాతి ఆర్టికల్లో మనం బైబిల్లో రాయబడిన కొన్ని విన్నపాలను, ప్రార్థనాపూర్వకంగా పలికిన మాటలను పరిశీలిస్తాం. లేఖనాలను అలా పరిశీలించడం దేవునికి మనం చేసే ప్రార్థనలపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?
మీరెలా జవాబిస్తారు?
• యెహోవాకు ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి?
• తోటి విశ్వాసుల కోసం ఎందుకు ప్రార్థించాలి?
• మన గురించి మన తలంపుల గురించి మన ప్రార్థనలు ఏమి చెబుతున్నాయి?
• బహిరంగ ప్రార్థనలప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి?
[అధ్యయన ప్రశ్నలు]
[4వ పేజీలోని చిత్రం]
మీరు క్రమంగా యెహోవాను స్తుతిస్తున్నారా? ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారా?
[6వ పేజీలోని చిత్రం]
బహిరంగ ప్రార్థనలప్పుడు మన ప్రవర్తన ఎల్లప్పుడూ యెహోవాకు మహిమతేవాలి