సవాళ్లను అధిగమించేందుకు మీ పిల్లలకు సహాయం చేయండి
సవాళ్లను అధిగమించేందుకు మీ పిల్లలకు సహాయం చేయండి
యువతీ యువకులు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వారు సాతాను దుష్టలోకంలో కనిపించే లౌకికాత్మను ఎదుర్కోవాల్సివస్తుంది, అలాగే ‘యౌవనేచ్ఛలతో’ పోరాడాల్సి వస్తుంది. (2 తిమో. 2:22; 1 యోహా. 5:19) అంతేకాక, వారు ‘సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడానికి’ కృషిచేస్తారు కాబట్టి తమ నమ్మకాలను వ్యతిరేకించేవారి నుండి అపహాస్యాన్నీ, కొన్నిసార్లు వేధింపులనూ ఎదుర్కోవాల్సి వస్తుంది. (ప్రసం. 12:1, 2) తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ విన్సెంట్ అనే సహోదరుడు ఇలా అన్నాడు: “నేను సాక్షిని అయినందుకు నన్ను ఎవరో ఒకరు ఎప్పుడూ వేధించేవారు, బెదిరించేవారు లేదా కొట్లాటకు దిగేవారు. ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉండేదంటే కొన్నిసార్లు నాకు స్కూలుకు వెళ్లాలనిపించేది కాదు.” a
లోకం నుండి వచ్చే ఒత్తిళ్లతోపాటు మన పిల్లలు, తోటివారిలా ఉండాలనే కోరికతో కూడా పోరాడాల్సివుంది. “ఇతరులు మనల్ని వేరుగా చూస్తే మనకు బాధేస్తుంది” అని 16 ఏళ్ల క్యాత్లీన్ అనే సహోదరి అంటోంది. అలెన్
అనే యువ సహోదరుడు ఇలా ఒప్పుకుంటున్నాడు: “శని ఆదివారాల్లో తమతో రమ్మని మా స్కూలు ఫ్రెండ్స్ ఎప్పుడూ నన్ను ఆహ్వానించేవారు. నాకు కూడా వెళ్లాలనిపించేది.” యువతీ యువకులు సహజంగానే స్కూలు క్రీడల్లో పాల్గొనాలని ఎంతగానో ఆశపడతారు. అయితే, వాటిలో పాల్గొంటే వారు చెడు సహవాసాలు చేసే అవకాశముంది. తాన్యా అనే యువ సహోదరి ఇలా అంటోంది: “నాకు క్రీడలంటే చాలా ఇష్టం. టీమ్‌లో ఆడమని స్కూలు కోచ్‌లు నన్ను బలవంతం చేసేవారు, కాదని వారితో చెప్పడం కష్టమయ్యేది.”సవాళ్లను అధిగమించేందుకు మీ పిల్లలకు మీరెలా సహాయం చేయవచ్చు? పిల్లలకు కావాల్సిన నడిపింపు ఇవ్వమని యెహోవా తల్లిదండ్రులను ఆదేశించాడు. (సామె. 22:6; ఎఫె. 6:4) యెహోవాకు విధేయులై ఉండాలన్న కోరిక పిల్లల్లో కలిగేలా చేయడమే దైవభయంగల తల్లిదండ్రుల లక్ష్యం. (సామె. 6:20-23) అలాచేస్తే, తల్లిదండ్రులు దగ్గరలేనప్పుడు కూడా పిల్లలు లోక ఒత్తిడిని ఎదిరించడానికి ప్రయత్నిస్తారు.
ఉద్యోగం, పిల్లలను పెంచడం, సంఘ బాధ్యతలు వంటి వాటన్నిటికీ న్యాయం చేయడం తల్లిదండ్రులకు కష్టమైన పనే. కొందరు ఒంటరి తల్లిగా/తండ్రిగా ఉంటూ లేదా సత్యంలోలేని భాగస్వామి నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటూ అవన్నీ చేయాల్సివుంటుంది. ఏది ఎలావున్నా, పిల్లలకు బోధించి వారికి అవసరమైన సహాయం చేసేందుకు సమయాన్ని కేటాయించాలని యెహోవా తల్లిదండ్రుల నుండి ఆశిస్తున్నాడు. కాబట్టి తోటివారి నుండి ఎదురయ్యే ఒత్తిడి, శోధన, వేధింపుల వంటివాటిని తట్టుకొని నిలబడేందుకు మీ పిల్లలకు మీరెలా సహాయం చేయవచ్చు?
యెహోవాతో వ్యక్తిగత సంబంధం
మొదటిగా, యెహోవా నిజమైన వ్యక్తి అని మీ పిల్లలు తెలుసుకోవాలి. ‘అదృశ్యుడైనవానిని చూసేలా’ మీ పిల్లలకు సహాయం చేయాలి. (హెబ్రీ. 11:27) పైన ప్రస్తావించబడిన విన్సెంట్ యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకునేలా తన తల్లిదండ్రులు తనకెలా సహాయం చేశారో గుర్తుచేసుకుంటున్నాడు. ఆయన ఇలా అన్నాడు: “ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో వారు నాకు నేర్పించారు. చిన్నప్పటి నుండే ప్రతీ రోజు పడుకునేముందు ప్రార్థన చేసుకునేవాణ్ణి. అలా యెహోవా నాకు నిజమైన వ్యక్తి అయ్యాడు.” మీరు మీ పిల్లలతో కలిసి ప్రార్థిస్తున్నారా? వారు ప్రార్థనలో యెహోవాను ఏమి అడుగుతారో వినండి. వారు తమ ప్రార్థనలో చెప్పిన వాటినే మళ్లీమళ్లీ చెబుతున్నారా? లేదా యెహోవా గురించి వారెలా భావిస్తున్నారో తెలియజేస్తున్నారా? వారి ప్రార్థనలను వింటే ఆధ్యాత్మికంగా వారు ఎంత ప్రగతి సాధించారో మీరు తెలుసుకోవచ్చు.
యౌవనస్థులు యెహోవాకు దగ్గరవడానికి మరో ప్రాముఖ్యమైన మార్గం కూడా ఉంది, అది వ్యక్తిగత బైబిలు అధ్యయనం. పైన ప్రస్తావించబడిన క్యాత్లీన్ ఇలా చెబుతోంది: “చిన్నప్పటి నుండి బైబిలు చదివే అలవాటు ఉండడంవల్ల నాకెంతో మేలు జరిగింది. ప్రజలు నన్ను వ్యతిరేకించినా యెహోవా నాకు తోడుగా ఉంటాడనే నమ్మకం అది నాలో కలిగించింది.” మీ పిల్లలు వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేస్తున్నారా?—కీర్త. 1:1-3; 77:12.
తల్లిదండ్రులు ఇచ్చే నిర్దేశానికి పిల్లలందరూ ఒకేలా స్పందించరు. అంతేకాక, వారి వయసును బట్టి వారి ఆధ్యాత్మిక ప్రగతి ఉండవచ్చు. అయితే తల్లిదండ్రులు, కావాల్సిన నిర్దేశం ఇవ్వకపోతే యౌవనస్థులు యెహోవాను నిజమైన వ్యక్తిగా తెలుసుకోవడం కష్టం. తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని పిల్లల మనసుల్లో నాటాలి. అప్పుడే వారు, ఎక్కడున్నా ప్రతీ విషయంలో యెహోవా ఆలోచనను గ్రహించగలుగుతారు. (ద్వితీ. 6:6-9) యెహోవా తమ పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటాడని మీ పిల్లలు నమ్మాలి.
మనసువిప్పి మాట్లాడేలా పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?
పిల్లలతో మాట్లాడడం ద్వారా కూడ వారికి సహాయం చేయవచ్చు. పిల్లలు మనసువిప్పి మాట్లాడాలంటే, వారిని ప్రశ్నలు అడగడంతోపాటు వారు చెబుతున్న విషయాలను ఓపిగ్గా వినాలి. వారి జవాబులు మీరు అనుకున్న దానికి వేరుగా ఉన్నాసరే వారు చెబుతున్నది ఓపిగ్గా వినాలి. ఇద్దరు అబ్బాయిల తల్లి యాన్ ఇలా చెబుతోంది: “వారి మనసులో ఏమి ఉందో, వారు ఎదుర్కొనే సమస్యలు ఏమిటో నాకు అర్థమయ్యేంత వరకు నేను ప్రశ్నలు అడుగుతాను.” వారు చెబుతున్నది మీరు శ్రద్ధగా వింటున్నారని మీ పిల్లలకు అనిపిస్తోందా? పైన ప్రస్తావించబడిన తాన్యా ఇలా అంటోంది: “మా అమ్మానాన్నలు మేము చెప్పేది శ్రద్ధగా విని, మా మాటల్ని గుర్తుపెట్టుకునేవారు. మా క్లాస్‌మేట్స్ పేర్లు కూడా వారికి తెలుసు. వారి గురించి, గతంలో మేము చర్చించుకున్న విషయాల గురించి అప్పుడప్పుడు
అడిగి తెలుసుకునేవారు.” కాబట్టి పిల్లల మనసులో ఏముందో తెలుసుకోవాలంటే వారు చెప్పేది వినాలి, విన్నది గుర్తుపెట్టుకోవాలి.భోజనం చేస్తున్నప్పుడు అలా మాట్లాడుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుందని చాలా కుటుంబాలు గ్రహించాయి. విన్సెంట్ ఇంకా ఇలా అంటున్నాడు: “కలిసి భోజనం చేయడానికి మా కుటుంబం ఎంతో ప్రాముఖ్యతనిచ్చేది. వీలైనప్పుడల్లా కుటుంబంతో కలిసి భోజనం చేయాలని మా అమ్మానాన్నలు చెప్పేవారు. భోజనం చేసేటప్పుడు టీవీ చూడడానికి, రేడియో వినడానికి లేదా ఏదో ఒక పుస్తకం చదవడానికి అనుమతినిచ్చేవారు కాదు. మేము సరదాగా మాట్లాడుకునేవారం కాబట్టి, ఆ సమయంలో నాకెంతో ప్రశాంతంగా అనిపించేది. దానివల్ల నేను స్కూల్లో ఉండే గందరగోళాన్ని, ఒత్తిళ్లను సులభంగా ఎదుర్కోగలిగేవాణ్ణి. భోజన సమయాల్లో అమ్మానాన్నలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాణ్ణి కాబట్టి తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు సహాయం కోసం ఏ సంకోచం లేకుండా వారిని అడగగలిగేవాణ్ణి.”
“వారంలో ఎన్నిసార్లు కుటుంబమంతా కలిసి భోజనం చేస్తాం?” అని ప్రశ్నించుకోండి. ఈ విషయంలో మీరు కావాల్సిన మార్పులు చేసుకుంటే, మీ పిల్లలు ముందుకన్నా మరింత చక్కగా, దాపరికం లేకుండా మీతో మాట్లాడే అవకాశం కలుగుతుందేమో ఆలోచించండి.
ప్రాక్టీసు చేయడం ఎందుకు చాలా అవసరం?
కుటుంబ ఆరాధన దాపరికం లేకుండా మాట్లాడుకునే అవకాశం కల్పిస్తుంది. దానివల్ల యౌవనస్థులు సమస్యలను ఎలా అధిగమించాలో తెలుసుకోగలుగుతారు. పైన ప్రస్తావించబడిన అలెన్ ఇలా అంటున్నాడు: “మా తల్లిదండ్రులు మా మనసుల్లో ఉన్నది రాబట్టడానికి కుటుంబ ఆరాధన సమయాన్ని ఉపయోగించేవారు. మాకు ఎదురౌతున్న సమస్యల గురించే వారు ఆ సమయంలో చర్చించేవారు.” అలెన్ వాళ్ల అమ్మ ఇలా చెబుతోంది: “కుటుంబ అధ్యయనమప్పుడు వివిధ సన్నివేశాల్లో ఎలా వ్యవహరించాలో ప్రాక్టీసు చేయడానికి కొంత సమయాన్ని తీసుకునేవాళ్లం. ఇలా ప్రాక్టీసు చేయడం వల్ల మా పిల్లలు తమ విశ్వాసాన్ని ఎలా సమర్థించాలో, తాము నమ్మేదే సత్యం అని ఎలా రుజువు చేయాలో తెలుసుకున్నారు. దీనివల్ల వారు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలిగారు.”
తోటివారి నుండి ఒత్తిడి ఎదురైనప్పుడు పిల్లలు కేవలం కాదు, కూడదు అని చెప్పి వెళ్లిపోతే సరిపోదు. కొన్ని పనులు ఎందుకు చేస్తారో, మరి కొన్నింటిని ఎందుకు చేయరో కూడా చెప్పగలగాలి. తమ విశ్వాసం కారణంగా
అపహసించబడినప్పుడు ధైర్యంగా నిలబడగలిగే ఆత్మవిశ్వాసం వారికి ఉండాలి. తమ నమ్మకాలను సమర్థించలేకపోతే వారు సత్యారాధనకు సంబంధించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేరు. కుటుంబ అధ్యయనమప్పుడు వివిధ సన్నివేశాల్లో ఎలా వ్యవహరించాలో ప్రాక్టీసు చేస్తే వారిలో ధైర్యం పెరుగుతుంది.మీరు కుటుంబ ఆరాధన చేస్తున్నప్పుడు ప్రాక్టీసు చేయగల కొన్ని సన్నివేశాలు 18వ పేజీలోని బాక్సులో ఉన్నాయి. ఈ సన్నివేశాలు సహజంగా ఉండేందుకు మీ పిల్లలు ఇచ్చే జవాబులను వారి తోటివిద్యార్థుల్లా సవాలు చేయండి. అలా ప్రాక్టీసు చేయడంతోపాటు మీ పిల్లలు తమ జీవితంలో పాటించగల కొన్ని బైబిలు ఉదాహరణలను కూడా వారితో చర్చించండి. అలా ఇంట్లో శిక్షణ పొందితే స్కూల్లో, ఇతర స్థలాల్లో ఎదురయ్యే సవాళ్లను మీ పిల్లలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.
మీ ఇల్లు సురక్షితమైన స్థలమా?
రోజూ స్కూలు అయిపోయిన వెంటనే ఇంటికి తిరిగి రావాలనిపించే విధంగా మీ ఇల్లు ఉందా? అది సురక్షితమైన స్థలమైతే మీ పిల్లలు ప్రతీరోజూ తమకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలుగుతారు. ఇప్పుడు బెతెల్‌లో సేవచేస్తున్న ఒక సహోదరి ఇలా అంటోంది: “మా ఇల్లు సురక్షితమైన స్థలంగా ఉండడం నాకెంతగా సహాయం చేసిందంటే స్కూల్లో పరిస్థితి ఎంత కష్టంగావున్నా ఇంటికి వస్తే అన్నీ సర్దుకుంటాయన్న ధైర్యం నాకు ఉండేది.” మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది? “క్రోధములు, కక్షలు, భేదములు,” వంటి లక్షణాలు ఎప్పుడూ కనిపిస్తాయా లేదా “ప్రేమ, సంతోషము, సమాధానము” వంటి లక్షణాలకు అది నెలవా? (గల. 5:19-23) ఇంట్లో సమాధానం కరువైతే మీరు దాన్ని పిల్లలకు సురక్షితమైన స్థలంగా మార్చేందుకు ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా?
సవాళ్లను ఎదుర్కొనేందుకు మీరు మీ పిల్లలకు మరో విధంగా కూడా సహాయం చేయవచ్చు. మంచి సహవాసం కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయండి. ఉదాహరణకు, మీ కుటుంబ ఉల్లాస కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక పరిణతిగల సహోదర సహోదరీలను కూడా చేర్చుకోగలరేమో ఆలోచించండి. లేదా ప్రయాణ పైవిచారణకర్తలను లేక ఇతర పూర్తికాల సేవకులను మీ ఇంటికి భోజనానికి పిలవొచ్చు. మీ పిల్లలకు స్నేహితులుకాగల మిషనరీలు లేదా బెతెల్ సభ్యులు మీకు తెలుసా? తెలిస్తే మీ పిల్లలకు చెప్పండి. మీ పిల్లలు వారికి ఉత్తరం రాయవచ్చు, ఈ-మెయిల్ పంపించవచ్చు లేదా అప్పుడప్పుడు ఫోన్ చేయవచ్చు. అలా వారు ఆ సహోదర సహోదరీలకు మంచి స్నేహితులు కాగలుగుతారు. అలాంటి వారితో స్నేహం చేస్తే మీ పిల్లలు సరైన మార్గంలో నడుస్తూ ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోగలుగుతారు. అపొస్తలుడైన పౌలుతో స్నేహం చేయడంవల్ల తిమోతి ఎంత ప్రయోజనం పొందాడో ఆలోచించండి. (2 తిమో. 1:13; 3:10) పౌలుతో సన్నిహితంగా సహవసించడం వల్ల తిమోతి ఆధ్యాత్మిక లక్ష్యాలపైనే మనసు నిలపగలిగాడు.—1 కొరిం. 4:17.
మీ పిల్లల్ని మెచ్చుకోండి
సాతాను లోకం నుండి ఒత్తిడి ఎదురైనా యువతీయువకులు ధైర్యంగా సరైనది చేయడాన్ని చూసి యెహోవా సంతోషిస్తున్నాడు. (కీర్త. 147:11; సామె. 27:11) మీ పిల్లలు మంచి మార్గంలో నడుస్తున్నందుకు మీరూ సంతోషిస్తుండవచ్చు. (సామె. 10:1) వారి గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి, వీలైనన్నిసార్లు వారిని ప్రేమతో మెచ్చుకోండి. యెహోవా తల్లిదండ్రులకు మంచి మాదిరిని ఉంచాడు. యేసు బాప్తిస్మమప్పుడు యెహోవా, “నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నాను” అని అన్నాడు. (మార్కు 1:11) తాను ఎదుర్కోబోయే అనేక సవాళ్లను అధిగమించేందుకు తన తండ్రి ఇచ్చిన ఆ అభయం ఆయనను ఎంతగా బలపరచివుంటుంది! అలాగే మీరు వాళ్లను ప్రేమిస్తున్నారని చెప్పండి, వారు సాధించేవాటిని మెచ్చుకోండి.
ఒత్తిళ్లకు, వ్యతిరేకతకు, అపహాస్యానికి గురికాకుండా మీ పిల్లలను మీరు పూర్తిగా కాపాడలేరనుకోండి. అయినా మీరు మీ పిల్లలకు ఎన్నో విధాలుగా సహాయం చేయవచ్చు. యెహోవాతో సన్నిహిత సంబంధం వృద్ధి చేసుకునేందుకు వారికి సహాయం చేయండి. దాపరికంలేకుండా మాట్లాడుకునే వాతావరణాన్ని కల్పించండి. వారికి ఎదురయ్యే సవాళ్లను కుటుంబ ఆరాధన సమయంలో చర్చించండి, మీ ఇంటిని సురక్షిత స్థలంగా మార్చుకోండి. అలా చేసినప్పుడు మీ పిల్లలు తమకు ఎదురయ్యే అనేక సవాళ్లను అధిగమించగలుగుతారు.
[అధస్సూచి]
a కొన్ని పేర్లను మార్చాం.
[18వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
సన్నివేశాలను ప్రాక్టీసు చేయడం మంచిది
యువతీయువకులకు ఎదురయ్యే కొన్ని పరిస్థితులు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. కుటుంబ ఆరాధన సమయంలో ఈ సన్నివేశాల్లో కొన్నింటిని ప్రాక్టీసు చేయడానికి ప్రయత్నించండి.
▸ స్కూలు క్రీడల్లో పాల్గొనమని కోచ్ మీ అమ్మాయిని అడిగాడు.
▸ స్కూలు నుండి ఇంటికి వస్తున్నప్పుడు మీ అబ్బాయిని సిగరెట్టు తాగమని అడిగారు.
▸ మళ్లీ ప్రకటనా పని చేసినట్లు తెలిస్తే కొడతామని కొంతమంది యువకులు మీ అబ్బాయిని బెదిరించారు.
▸ ఇంటింటి పరిచర్యలో మీ అమ్మాయికి తోటివిద్యార్థి ఎదురైతే.
▸ తోటి విద్యార్థులందరి ముందు మీ అమ్మాయిని జెండా వందనం ఎందుకు చేయవు అని అడిగితే.
▸ యెహోవాసాక్షిగా ఉన్నందుకు మీ అబ్బాయిని ఓ కుర్రాడు ఎప్పుడూ హేళన చేస్తుంటే.
[17వ పేజీలోని చిత్రం]
మీ పిల్లలు వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేస్తున్నారా?
[19వ పేజీలోని చిత్రం]
మీ ఉల్లాస కార్యకలాపాల్లో ఆధ్యాత్మిక పరిణతిగల సహోదర సహోదరీలను చేర్చుకుంటున్నారా?