కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి’

‘దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి’

‘దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి’

“వారు . . . పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.”—అపొ. 4:31.

1, 2. పరిచర్యలో మంచి ఫలితాలు సాధించేందుకు మనం ఎందుకు కృషిచేయాలి?

 యేసు తన మరణానికి మూడు రోజుల ముందు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” పునరుత్థానం చేయబడిన యేసు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు, ‘సమస్త జనులను శిష్యులనుగా చేసి, మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి’ అని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. “యుగసమాప్తి వరకు” తాను వారితో ఉంటానని ఆయన వారికి మాటిచ్చాడు.—మత్త. 24:14; 26:1, 2; 28:19, 20.

2 మొదటి శతాబ్దంలో ప్రారంభమైన ఆ పనిలో యెహోవాసాక్షులమైన మనం చురుగ్గా పాల్గొంటున్నాం. ప్రాణాలను రక్షించే రాజ్య ప్రకటనా పనికన్నా, శిష్యులను చేసే పనికన్నా ప్రాముఖ్యమైనవి మరేవీలేవు. దీన్నిబట్టి మన పరిచర్యలో మంచి ఫలితాలు సాధించేందుకు కృషిచేయడం ఎంత ప్రాముఖ్యమో తెలుస్తుంది. పరిశుద్ధాత్మచేత నడిపించబడడం వల్ల మనం పరిచర్యలో ధైర్యంగా ఎలా పాల్గొనగలుగుతామో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. చక్కని నైపుణ్యంతో, క్రమం తప్పకుండా ప్రకటించేందుకు యెహోవా పరిశుద్ధాత్మ మనల్ని ఎలా నిర్దేశించగలదో తర్వాతి రెండు ఆర్టికల్స్‌లో చూస్తాం.

మనకు ధైర్యం అవసరం

3. రాజ్య సువార్త ప్రకటించడానికి మనకు ధైర్యం ఎందుకు అవసరం?

3 దేవుడు మనకు అప్పగించిన రాజ్య ప్రకటనా పని మనకు లభించిన ఓ అరుదైన గౌరవం, దాన్ని వేరే దేనితోనూ పోల్చలేం. అయితే, అది అంత సులభమైన పని కూడా కాదు. కొందరు రాజ్య సందేశాన్ని ఇష్టంగా వింటారు. కానీ, చాలామంది నోవహు దినాల్లోని ప్రజల్లాగే దాన్ని పట్టించుకోరు. ఆ కాలం ప్రజలు “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి” అని యేసు చెప్పాడు. (మత్త. 24:38, 39) మరికొందరైతే మనల్ని ఎగతాళి చేస్తారు లేదా వ్యతిరేకిస్తారు. (2 పేతు. 3:3) అధికారులు, తోటి విద్యార్థులు, తోటి ఉద్యోగులు, కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడ మనల్ని వ్యతిరేకించవచ్చు. వీటికి తోడు మనం మన సొంత బలహీనతలతో సతమతమౌతుండవచ్చు. ఉదాహరణకు, బిడియం, అవతలివారు మనకు దూరమౌతారేమోననే భయం మనకు ఉండవచ్చు. అనేక ఇతర విషయాలనుబట్టి కూడా మనం దేవుని వాక్యాన్ని ‘ధైర్యంగా’ ప్రకటించలేకపోతాం. (ఎఫె. 6:19, 20) దేవుని వాక్యాన్ని పట్టుదలతో ప్రకటించాలంటే మనకు ధైర్యం అవసరం. అయితే, మనం ధైర్యాన్ని ఎలా కూడగట్టుకోవచ్చు?

4. (ఎ) ధైర్యం అంటే ఏమిటి? (బి) థెస్సలొనీకయులతో మాట్లాడడానికి అపొస్తలుడైన పౌలు ఎలా ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు?

4 “ధైర్యం” అని అనువదించబడిన గ్రీకు పదానికి “దాపరికంలేకుండా, నిస్సంకోచంగా, ముక్కుసూటిగా” ప్రవర్తించడం అనే అర్థాలున్నాయి. అంతేకాక దానికి, “నిబ్బరంతో, ఆత్మవిశ్వాసంతో . . . సాహసంతో” ప్రవర్తించడం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ధైర్యంగా ప్రవర్తించడమంటే మొరటుగా మాట్లాడడమని కాదు. (కొలొ. 4:6) మనం ధైర్యంగా ప్రవర్తిస్తూనే అందరితో సమాధానంగా మెలగాలని కోరుకుంటాం. (రోమా. 12:18) అంతేకాక, పరిచర్యలో మనం ధైర్యంగా ఉంటూనే, ఆచితూచి మాట్లాడడంవల్ల పొరపాటున కూడా ఇతరులకు కోపం తెప్పించకుండా ఉండగలుగుతాం. నిజానికి, ధైర్యాన్ని కూడగట్టుకోవాలంటే మనకు కొన్ని ఇతర లక్షణాలు కూడా అవసరం. వాటిని పెంపొందించుకోవడానికి ఎంతో కృషిచేయాలి. ఇలాంటి ధైర్యం మనకు స్వతహాగా రాదు. అపొస్తలుడైన పౌలు, ఆయన సహచరులు ‘ఫిలిప్పీలో అవమానం పొందినప్పుడు’ థెస్సలొనీక ప్రజలకు ప్రకటించడానికి వారు ఎలా ‘ధైర్యము తెచ్చుకున్నారు?’ ‘దేవుడే’ వారికి ధైర్యాన్నిచ్చాడని పౌలు అన్నాడు. (1 థెస్సలొనీకయులు 2:2 చదవండి.) నేడు కూడా యెహోవా మన భయాలను పోగొట్టి మనలో ధైర్యాన్ని నింపగలడు.

5. పేతురు, యోహానులతోపాటు మరితర శిష్యులకు యెహోవా ధైర్యాన్ని ఎలా అనుగ్రహించాడు?

5 ఏ అధికారంతో ప్రకటిస్తున్నారని ప్రజల ‘అధికారులు, పెద్దలు, శాస్త్రులు’ అపొస్తలుడైన పేతురు యోహానులను అడిగినప్పుడు వారు, “దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి; మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేము” అని జవాబిచ్చారు. హింస ఆగిపోయేలా చేయమని కోరే బదులు వారు, వారి తోటి విశ్వాసులు, “ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి, . . . నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము” అని దేవుణ్ణి వేడుకున్నారు. (అపొ. 4:5, 19, 20, 29, 30) యెహోవా వారి ప్రార్థనలకు ఎలా జవాబిచ్చాడు? (అపొస్తలుల కార్యములు 4:31 చదవండి.) వారు ధైర్యం కూడగట్టుకునేలా తన పరిశుద్ధాత్మ సహాయాన్నిచ్చాడు. మన విషయంలోనూ అలాగే జరగవచ్చు. అయితే, మనం దేవుని పరిశుద్ధాత్మను పొంది, దానిచేత మన పరిచర్యలో ఎలా నిర్దేశించబడవచ్చు?

ధైర్యాన్ని ఎలా కూడగట్టుకోవచ్చు?

6, 7. దేవుని పరిశుద్ధాత్మను పొందడానికి మనం మొదటిగా ఏమి చేయాలి? ఉదాహరణలు చెప్పండి.

6 దేవుని పరిశుద్ధాత్మను పొందాలంటే మనం మొదట దాని కోసం వేడుకోవాలి. యేసు తన శ్రోతలకు ఇలా చెప్పాడు: “మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.” (లూకా 11:12, 13) కాబట్టి, మనం పరిశుద్ధాత్మ కోసం ఎప్పుడూ ప్రార్థించాలి. వీధిలో, వ్యాపార ప్రాంతాల్లో లేదా ఇతర సందర్భాల్లో ప్రకటించడానికి మనకు భయమేస్తుంటే యెహోవా పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థించి, ధైర్యాన్ని కూడగట్టుకునేందుకు సహాయం చేయమని ఆయనను కోరవచ్చు.—1 థెస్స. 5:17.

7 రోసా a అనే సహోదరి ఆ పనే చేసింది. ఒక రోజు పనిస్థలంలో ఓ స్కూల్‌ టీచరు, వేరే స్కూలువాళ్లు పిల్లలతో ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నారో తెలియజేసే ఓ నివేదికను చదవసాగింది. ఆ నివేదిక చదివి ఆమె ఎంత బాధపడిందంటే, “అసలు ఈ లోకానికి ఏమౌతోంది?” అని ఆవేదనను వ్యక్తం చేసింది. సాక్ష్యమివ్వడానికి దొరికిన అలాంటి మంచి అవకాశాన్ని వదలుకోకూడదని రోసా అనుకుంది. ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి ఆమె ఏమి చేసింది? “నేను యెహోవాకు ప్రార్థించి పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇవ్వమని కోరాను” అని ఆమె చెప్పింది. ఆమె చక్కని సాక్ష్యాన్నిచ్చి, మళ్లీ కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకోగలిగింది. న్యూయార్క్‌ నగరంలో ఉంటున్న మిలానీ అనే ఐదేళ్ల అమ్మాయి ఉదాహరణ కూడా తీసుకోండి. ఆ అమ్మాయి ఇలా చెప్పింది: “ప్రతీరోజు నేను స్కూలుకు వెళ్లే ముందు నేనూ మా అమ్మా యెహోవాకు ప్రార్థిస్తాం.” వారు దేనికోసం ప్రార్థిస్తారు? తమ నమ్మకాల గురించి, తమ దేవుని గురించి చెప్పేందుకు మిలానీకి ధైర్యమివ్వమని వాళ్లమ్మ ఆమెతో కలిసి ప్రార్థిస్తుంది. “దానివల్ల పుట్టినరోజులు, పండుగల విషయంలో తన నమ్మకాల గురించి మిలానీ వివరించగలిగింది, అవి జరుగుతున్నప్పుడు వాటికి దూరంగా ఉండగలిగింది” అని వాళ్లమ్మ చెప్పింది. ప్రార్థన చేస్తే, మనం ధైర్యాన్ని కూడగట్టుకోగలమని ఈ ఉదాహరణలు చూపించట్లేదా?

8. ధైర్యాన్ని కూడగట్టుకోవడం గురించి యిర్మీయా ప్రవక్త నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

8 అంతేకాక, యిర్మీయా ధైర్యాన్ని ఎలా కూడగట్టుకోగలిగాడో ఒకసారి ఆలోచించండి. యెహోవా ఆయనను జనాంగాలకు ప్రవక్తగా నియమించినప్పుడు యిర్మీయా, “నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదు” అని అన్నాడు. (యిర్మీ. 1:4-6) అయితే, కొంతకాలానికి యిర్మీయా ఎంత పట్టుదలతో, ధైర్యంతో ప్రకటించే ప్రవక్త అయ్యాడంటే, చాలామంది ఆయనను కేవలం విపత్తును ప్రకటించే వ్యక్తిగా చూశారు. (యిర్మీ. 38:3, 4) 65కన్నా ఎక్కువ సంవత్సరాలు ఆయన యెహోవా తీర్పులను ధైర్యంగా ప్రకటించాడు. ధైర్యసాహసాలతో ఆయన చేసిన ప్రకటనా పని ఎంతగా పేరుగాంచిందంటే దాదాపు 600 ఏళ్ల తర్వాత యేసు ధైర్యంగా మాట్లాడినప్పుడు యిర్మీయా మళ్లీ పుట్టాడని కొందరు అనుకున్నారు. (మత్త. 16:13, 14) ఒకప్పుడు దేవుని తీర్పులను ప్రకటించేందుకు వెనకాడిన ఆయన తన భయాన్ని ఎలా పోగొట్టుకున్నాడు? ఆయన ఇలా చెప్పాడు: “అది [దేవుని వాక్యం] నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడి యున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను.” (యిర్మీ. 20:9) యెహోవా వాక్యం ఆయనలో శక్తిని నింపి, ప్రకటించేలా చేసింది.

9. యిర్మీయామీద చూపించినట్లే దేవుని వాక్యం మనమీదా ప్రభావం చూపించగలదని ఎందుకు చెప్పవచ్చు?

9 హెబ్రీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (హెబ్రీ. 4:12) దేవుని సందేశం లేదా వాక్యం యిర్మీయామీద ప్రభావం చూపించినట్లే మనమీదా ప్రభావం చూపించగలదు. బైబిలును రాయడానికి దేవుడు మానవులను ఉపయోగించినా, అది మానవ జ్ఞానమున్న పుస్తకాల సంగ్రహం మాత్రం కాదని గుర్తుంచుకోండి. ఎందుకంటే బైబిలు దేవుని ప్రేరణతో రాయబడింది. 2 పేతురు 1:21లో మనమిలా చదువుతాం: “ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.” బైబిలును జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మన మనసులు పరిశుద్ధాత్మ ప్రేరణచేత రాయబడిన సందేశంతో నిండిపోతాయి. (1 కొరింథీయులు 2:10 చదవండి.) అప్పుడు ఆ సందేశం మనలో ‘అగ్నిలా మండుతుంది’ కాబట్టి, మనం దాని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండలేం.

10, 11. (ఎ) మనం పరిచర్యలో ధైర్యాన్ని కూడగట్టుకోవాలంటే బైబిలు అధ్యయనం ఎలా చేయాలి? (బి) మీ వ్యక్తిగత అధ్యయనాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు తీసుకోవాలనుకుంటున్న చర్యల్లో కనీసం ఒకదాని గురించి చెప్పండి.

10 బైబిలు అధ్యయనం నుండి మనం పూర్తి ప్రయోజనం పొందాలంటే దానిలోని సందేశం మన హృదయాన్ని తాకేలా, మన వ్యక్తిత్వాన్ని మార్చేలా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు, వినడానికి ఇష్టపడని ప్రజలకు అందించాల్సిన శక్తివంతమైన సందేశమున్న గ్రంథాన్ని తినమని ఒకానొక దర్శనంలో యెహెజ్కేలుకు ఆజ్ఞాపించబడింది. యెహెజ్కేలు ఆ సందేశాన్ని పూర్తిగా గ్రహించి, అది తనలో భాగమయ్యేలా చూసుకోవాలి. అలా చేస్తే ఇతరులకు సందేశాన్ని అందించే కష్టమైన పని ఆయనకు తేనెలా మధురమనిపిస్తుంది.—యెహెజ్కేలు 2:8–3:4, 7-9 చదవండి.

11 మన పరిస్థితి యెహెజ్కేలు పరిస్థితిలాగే ఉంది. చాలామంది, బైబిలు మాటలు వినడానికి అసలు ఇష్టపడరు. మనం పట్టుదలతో దేవుని వాక్యం గురించి ఇతరులకు ప్రకటించాలంటే, మనం దానిలోని సందేశాన్ని పూర్తిగా గ్రహించి, దాన్ని నమ్మేలా అధ్యయనం చేయడం ప్రాముఖ్యం. వీలైతే చేద్దాం లేకపోతే లేదు అనే ఆలోచనతో కాకుండా మనం క్రమం తప్పకుండా బైబిలు అధ్యయనం చేయాలి. “యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక” అని ఒకానొక కీర్తనకర్త పాడాడు. మనకూ ఆయనలాగే అనిపించాలి. (కీర్త. 19:14) బైబిలు సత్యాలు హృదయంలోకి ఇంకిపోయేలా చదివినదాన్ని ధ్యానించడానికి సమయం తీసుకోవడం ఎంత ప్రాముఖ్యం! కాబట్టి, మన వ్యక్తిగత బైబిలు అధ్యయనాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు కృషిచేయాలి. b

12. పరిశుద్ధాత్మ ద్వారా నిర్దేశించబడేందుకు క్రైస్తవ కూటాలు మనకు సహాయం చేస్తాయని ఎలా చెప్పవచ్చు?

12 అంతేకాక, ‘సమాజముగా కూడుకోవడం మానకుండా, ప్రేమ చూపించడానికి, సత్కార్యములు చేయడానికి ఒకనినొకడు పురికొల్పుకోవడం’ ద్వారా మనం యెహోవా పరిశుద్ధాత్మ నుండి ప్రయోజనం పొందగలుగుతాం. (హెబ్రీ. 10:24, 25) పరిశుద్ధాత్మచేత నడిపించబడేందుకు మనం చేయాల్సిన మంచి పనులు కొన్ని ఉన్నాయి. క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరుకావడానికి కృషి చేస్తూ, కూటాల్లో ఏకాగ్రతతో వినడం ద్వారా, నేర్చుకున్నవి అన్వయించుకోవడం ద్వారా మనం అలా నడిపించబడవచ్చు. ఎంతైనా యెహోవా తన సంఘం ద్వారా పరిశుద్ధాత్మ నిర్దేశాన్నిస్తున్నాడు కదా?—ప్రకటన 3:6 చదవండి.

ధైర్యాన్ని కూడగట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలొస్తాయి?

13. ప్రకటనా పనిలో మొదటి శతాబ్దపు క్రైస్తవులు సాధించిన ఫలితాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

13 పరిశుద్ధాత్మే విశ్వంలో అతి గొప్ప శక్తి. అది యెహోవా చిత్తం చేసేలా మానవుల్లో శక్తిని నింపగలదు. ఆ శక్తితోనే మొదటి శతాబ్దపు క్రైస్తవులు అసాధారణ స్థాయిలో ప్రకటనా పనిని చేయగలిగారు. వారు “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” సువార్త ప్రకటించగలిగారు. (కొలొ. 1:23) వారు “విద్యలేని పామరులు” అనే విషయం గుర్తుంచుకుంటే వారిని ఎంత గొప్ప శక్తి ప్రేరేపించిందో అర్థమౌతుంది.—అపొ. 4:13.

14. మనం ‘ఆత్మయందు తీవ్రతగలవారమై’ ఉండాలంటే ఏమి చేయాలి?

14 పరిశుద్ధాత్మ నిర్దేశానికి అనుగుణంగా జీవిస్తే మనం కూడా మన పరిచర్యను ధైర్యంగా చేయగలుగుతాం. పరిశుద్ధాత్మ కోసం ఎల్లప్పుడూ ప్రార్థించడం ద్వారా, శ్రద్ధగా వ్యక్తిగత అధ్యయనం చేయడం ద్వారా, చదివినదాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడం ద్వారా, క్రమంగా కూటాలకు హాజరవడం ద్వారా “ఆత్మయందు తీవ్రతగలవారై” ఉండగలుగుతాం. (రోమా. 12:11) ‘ఎఫెసుకు వచ్చిన అలెక్సంద్రియవాడైన అపొల్లో అనే ఓ యూదుని’ గురించి బైబిలు ఇలా చెబుతోంది: ‘అతడు ఆత్మయందు తీవ్రపడి యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి, బోధించాడు.’ (అపొ. 18:24, 25) ‘ఉత్తేజితమైన ఆత్మగలవారమై’ ఉంటే మనం మరింత ధైర్యంగా ఇంటింటి పరిచర్య చేయగలుగుతాం, అవకాశం దొరికినప్పుడు ఇతరులతో మాట్లాడగలుగుతాం.—రోమా. 12:11, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

15. మరింత ధైర్యంగా ప్రకటించడంవల్ల మనకు ఎలాంటి మేలు జరుగుతుంది?

15 మరింత ధైర్యంగా సాక్ష్యమివ్వగలిగినప్పుడు అది మనమీద మంచి ప్రభావం చూపిస్తుంది. మనం మన పనికున్న ప్రాముఖ్యతను, దానివల్ల జరిగే మేలును మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటాం కాబట్టి మన ఆలోచనా తీరు మెరుగుపడుతుంది. పరిచర్యలో సమర్థంగా బోధించగలిగినప్పుడు మన ఆనందం రెట్టింపు అవుతుంది. ప్రకటించడం ఎంత అత్యవసరమో మనకు తెలుసు కాబట్టి మనలో ఉత్సాహం పెరుగుతుంది.

16. పరిచర్య విషయంలో మన ఉత్సాహం నీరుగారిపోతే ఏమి చేయాలి?

16 పరిచర్య విషయంలో ఒకప్పుడున్నంత ఉత్సాహం మనకు ఇప్పుడు లేకపోతే ఏమి చేయాలి? మనల్ని మనం నిజాయితీగా పరిశోధించుకోవాలి. పౌలు ఇలా రాశాడు: “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి.” (2 కొరిం. 13:5) ఈ విషయాల గురించి ఆలోచించండి: ‘నేను ఇప్పటికీ ఆత్మయందు తీవ్రతగలవాడనై ఉన్నానా? నేను పరిశుద్ధాత్మ సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తున్నానా? ఆయన చిత్తం చేయడానికి ఆయన సహాయాన్నే తీసుకుంటున్నానని నా ప్రార్థనలు చూపిస్తున్నాయా? మనకు అప్పగించబడిన పరిచర్య విషయంలో ఎంతో రుణపడివున్నానని ప్రార్థనలో తెలియజేస్తున్నానా? నేను క్రమం తప్పకుండా వ్యక్తిగత అధ్యయనం చేస్తున్నానా? చదివినదాన్ని, విన్నదాన్ని ధ్యానించేందుకు నేను ఎంత సమయం తీసుకుంటున్నాను? నేను సంఘ కూటాలను ఏకాగ్రతతో వింటూ, వాటిలో చురుగ్గా పాల్గొంటున్నానా?’ ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచిస్తే మీరు మీ బలహీనతలను గుర్తించి, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోగలుగుతారు.

పరిశుద్ధాత్మ మీలో ధైర్యాన్ని నింపనివ్వండి

17, 18. (ఎ) మన కాలంలో ప్రకటనా పని ఏ స్థాయిలో జరుగుతోంది? (బి) దేవుని రాజ్య ప్రకటనా పనిని “పూర్ణ ధైర్యముతో” ఎలా చేయవచ్చు?

17 పునరుత్థానం చేయబడిన యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.” (అపొ. 1:8) అప్పుడు ప్రారంభమైన పని మునుపెన్నడూ లేని విధంగా ముందుకుసాగుతోంది. 230 కన్నా ఎక్కువ దేశాల్లో దాదాపు 70 లక్షలమంది యెహోవాసాక్షులు ప్రతీ సంవత్సరం రాజ్య ప్రకటనా పనిలో సుమారు 150 కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. ఇంకొకసారి జరిగే అవకాశమేలేని పనిలో ఉత్సాహంగా పాల్గొనడం మనకు ఎంత ఆనందాన్నిస్తుంది!

18 మొదటి శతాబ్దంలోలాగే, ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నిర్దేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రకటనా పని జరుగుతోంది. పరిశుద్ధాత్మ నిర్దేశానికి అనుగుణంగా నడుచుకుంటే, మనం “పూర్ణ ధైర్యముతో” పరిచర్యలో పాల్గొనగలుగుతాం. (అపొ. 28:31) కాబట్టి, దేవుని రాజ్య ప్రకటనా పనిలో పాల్గొంటుండగా పరిశుద్ధాత్మ నిర్దేశంలో నడుచుకుందాం!

[అధస్సూచీలు]

a పేర్లు మార్చబడ్డాయి.

b బైబిలు పఠనం నుండి, వ్యక్తిగత అధ్యయనం నుండి మీరు పూర్తి ప్రయోజనం పొందడానికి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకంలోని 21-32 పేజీల్లోవున్న “చదవడం మీద శ్రద్ధ వహించండి,” “అధ్యయనం ప్రతిఫలదాయకంగా ఉంటుంది” అనే అధ్యాయాలు చూడండి.

మీరు ఏమి నేర్చుకున్నారు?

• మనం దేవుని వాక్యాన్ని ధైర్యంగా ఎందుకు బోధించాలి?

• తొలి శిష్యులు ధైర్యంగా ఎలా బోధించగలిగారు?

• మనం ధైర్యాన్ని ఎలా కూడగట్టుకోవచ్చు?

• ధైర్యాన్ని కూడగట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలొస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[7వ పేజీలోని చిత్రం]

తమ పిల్లలు ధైర్యాన్ని కూడగట్టుకునేలా తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు?

[8వ పేజీలోని చిత్రాలు]

ఓ చిన్న ప్రార్థన చేసుకుంటే మీరు పరిచర్యలో ధైర్యాన్ని కూడగట్టుకోగలుగుతారు