ఆత్మానుసారంగా నడుచుకుంటూ మీ సమర్పణకు తగ్గట్టు జీవించండి
ఆత్మానుసారంగా నడుచుకుంటూ మీ సమర్పణకు తగ్గట్టు జీవించండి
“ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.” —గల. 5:16.
1. పెంతెకొస్తు రోజున ఎలాంటి బాప్తిస్మాలు ఇవ్వబడ్డాయి?
యేసు శిష్యులు సా.శ. 33 పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకున్నారు. అలా బాప్తిస్మం తీసుకున్న తర్వాతే వారు అన్య భాషల్లో మాట్లాడారు. వారు అద్భుతమైన ఆత్మవరం పొందడం వల్ల ఎన్నో కార్యాలు చేశారు. (1 కొరిం. 12:4-10) వాటిని చూసి, అపొస్తలుడైన పేతురు ప్రసంగాన్ని విన్న తర్వాత ప్రజలు ఎలా స్పందించారు? చాలామంది ‘హృదయంలో నొచ్చుకున్నారు.’ పేతురు ప్రోత్సాహంతో వారు పశ్చాత్తాపపడి బాప్తిస్మం తీసుకున్నారు. అప్పుడు ఏమి జరిగిందో బైబిలు చెబుతోంది: “అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి; ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి.” (అపొ. 2:22, 36-41) యేసు చెప్పినట్లుగానే వారు తండ్రి నామంలో, కుమారుని నామంలో, పరిశుద్ధాత్మ నామంలో నీటి బాప్తిస్మం తీసుకొని ఉంటారు.—మత్త. 28:19.
2, 3. (ఎ) పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకోవడానికి, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవడానికి మధ్యవున్న తేడాను వివరించండి? (బి) నిజ క్రైస్తవులు కావాలనుకునేవారందరూ ఎందుకు నీటి బాప్తిస్మం తీసుకోవాలి?
2 అయితే, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకోవడానికీ, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవడానికీ మధ్య ఏమైనా తేడా ఉందా? ఉంది. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకున్నవారు దేవుని ఆత్మాభిషిక్త కుమారులుగా కొత్తగా జన్మిస్తారు. (యోహా. 3:3) దేవుని పరలోక రాజ్యంలో క్రీస్తు తోటి రాజులుగా, యాజకులుగా ఉండేందుకు వారు అభిషేకించబడ్డారు. వారు క్రీస్తు ఆధ్యాత్మిక శరీరంలో భాగంగా ఉన్నారు. (1 కొరిం. 12:13; గల. 3:27; ప్రక. 20:6) కాబట్టి, సా.శ. 33లో, ఆ తర్వాతి కాలంలో క్రీస్తు తోటి వారసులుగా ఉండేందుకు ఆయా వ్యక్తులను యెహోవా ఎన్నుకున్నప్పుడు వారికి ఈ బాప్తిస్మాన్ని అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని ఇచ్చాడు. (రోమా. 8:15-17) అయితే, మనకాలంలో యెహోవా ప్రజల సమావేశాల్లో పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వబడే నీటి బాప్తిస్మం మాటేమిటి?
3 హృదయపూర్వకంగా యెహోవా దేవునికి చేసుకున్న సమర్పణకు సూచనగా నిజక్రైస్తవులు నీటి బాప్తిస్మం తీసుకుంటారు. పరలోక పిలుపు అందుకున్నవారు నీటి బాప్తిస్మం తీసుకుంటారు. వారే కాక నేడు, భూమ్మీద నిరంతరం జీవించే అవకాశమున్న లక్షలాదిమంది స్త్రీపురుషులు కూడా నీటి బాప్తిస్మం తీసుకోవాల్సిందే. ఒక వ్యక్తికి ఏ నిరీక్షణవున్నా ఆయన దేవుని ఆమోదాన్ని పొందాలంటే తండ్రి నామంలో, కుమారుని నామంలో, పరిశుద్ధాత్మ నామంలో నీటి బాప్తిస్మం తీసుకోవాల్సిందే. అలా బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులందరూ ‘ఆత్మానుసారముగా నడుస్తూ’ ఉండాలి. (గలతీయులు 5:16 చదవండి.) మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటూ మీ సమర్పణకు తగ్గట్టు జీవిస్తున్నారా?
‘ఆత్మానుసారంగా నడుచుకోవడం’ అంటే ఏమిటి?
4. ‘ఆత్మానుసారంగా నడుచుకోవడం’ అంటే ఏమిటి?
4 ‘ఆత్మానుసారంగా నడుచుకోవడం’ అంటే పరిశుద్ధాత్మ మీపై పనిచేయడానికి అనుమతిస్తూ దాని నిర్దేశాన్ని పాటించడమని అర్థం. మరో మాటలో చెప్పాలంటే మనం చేసే ప్రతీ పనిలో పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడడమని అర్థం. ఆత్మానుసారంగా నడుచుకోవడానికి, శరీరానుసారంగా నడుచుకోవడానికి మధ్యవున్న తేడాను గలతీయులు 5వ అధ్యాయం వివరిస్తోంది.—గలతీయులు 5:17, 18 చదవండి.
5. ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఎలాంటి కార్యాలకు దూరంగా ఉండాలి?
5 మీరు ఆత్మానుసారంగా నడుస్తున్నట్లయితే, “జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు” వంటి శరీర కార్యాలకు దూరంగా ఉండడానికి కృషి చేస్తారు. (గల. 5:19-21) ఒక విధంగా చెప్పాలంటే, మీరు ‘ఆత్మచేత శరీరక్రియలను చంపేస్తారు.’ (రోమా. 8:5, 13) అలా చేస్తే, శరీరేచ్ఛల ప్రకారం నడుచుకునే బదులు ఆత్మ సంబంధమైన విషయాలపై మనసు నిలుపుతూ, దాని నిర్దేశాల్ని పాటించగలుగుతారు.
6. ఆత్మఫలాన్ని కనబరచాలంటే ఏమి అవసరమో వివరించడానికి ఓ ఉదాహరణ చెప్పండి.
6 పరిశుద్ధాత్మ మీమీద పనిచేస్తున్నప్పుడు మీరు దేవుని లక్షణాలను అంటే ‘ఆత్మఫలంలోని’ లక్షణాలను చూపించగలుగుతారు. (గల. 5:22, 23) అయితే, ఆ లక్షణాలను చూపించడానికి మీరెంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తిస్తారు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక రైతు నేలను సాగుచేస్తున్నాడనుకుందాం. పంట చేతికి రావాలంటే సూర్యకాంతి, నీళ్లు ఎంతో అవసరం. ఇక్కడ, పరిశుద్ధాత్మను సూర్యకాంతితో పోల్చవచ్చు. ఆత్మ ఫలాన్ని కనబరచాలంటే పరిశుద్ధాత్మ మనకు అవసరం. అయితే, రైతు కష్టపడి పని చేయకపోతే పంట చేతికి వస్తుందా? (సామె. 10:4) అలాగే, హృదయమనే నేలను మీరు ఎలా సాగుచేస్తారనే దాన్నిబట్టి మీరు పరిశుద్ధాత్మ ఫలాన్ని ఎంత బాగా, ఎంత మేరకు ఫలిస్తారో తెలుస్తుంది. కాబట్టి మీరిలా ప్రశ్నించుకోండి: ‘ఆత్మఫలాన్ని ఫలించగలిగేలా నేను పరిశుద్ధాత్మ నిర్దేశం ప్రకారం నడుచుకుంటున్నానా?’
7. ఆత్మఫలాన్ని అలవర్చుకోవాలంటే చదవడం, ధ్యానించడం ఎంతో ప్రాముఖ్యమని ఎందుకు చెప్పవచ్చు?
7 సమృద్ధిగా పంట చేతికి రావాలంటే రైతు పంటకు నీరు పెట్టాలి. ఆత్మఫలాన్ని అలవర్చుకోవాలంటే, మీకు బైబిల్లో దొరికే, క్రైస్తవ సంఘంలో లభించే సత్యపు నీళ్లు అవసరం. (యెష. 55:1) పరిశుద్ధ లేఖనాలన్నీ దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయని మీరు చాలామందికి బోధించివుంటారు. (2 తిమో. 3:16, 17) నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని తరగతి, స్వచ్ఛమైన నీరులాంటి బైబిలు సత్యాలను సరిగ్గా అర్ధం చేసుకోవడానికి కావాల్సిన సమాచారాన్ని అందిస్తోంది. (మత్త. 24:45-47) కాబట్టి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలంటే దేవుని వాక్యాన్ని చదవాలనీ, ధ్యానించాలనీ మనకు దీన్నిబట్టి అర్థమౌతుంది. మీరిప్పటికే అలా చేస్తున్నట్లయితే, ప్రవక్తల మంచి మాదిరిని అనుసరిస్తున్నారని చెప్పవచ్చు. వారు అప్పట్లో తమకు అందుబాటులోవున్న సమాచారాన్ని “విచారించి పరిశోధించిరి.” ఆసక్తికరమైన విషయమేమిటంటే, దేవదూతలు కూడా వాగ్దానం చేయబడిన సంతానం గురించిన, అభిషిక్త క్రైస్తవ సంఘం గురించిన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడానికి ఎంతో ఇష్టపడ్డారు.—1 పేతురు 1:10-12 చదవండి.
ఆత్మచేత ఎలా నడిపించబడవచ్చు?
8. పరిశుద్ధాత్మ సహాయం కోసం యెహోవాకు ప్రార్థించడం ఎందుకు ప్రాముఖ్యం?
8 అయితే, కేవలం లేఖనాలను చదివి ధ్యానిస్తే సరిపోదు. మీరు యెహోవా సహాయం కోసం, నిర్దేశం కోసం ఎల్లప్పుడూ అడగాలి. ఆయన “అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా” చేయగలుగుతాడు. (ఎఫె. 3:20; లూకా 11:13) “నేను ‘అడగకముందే నాకేమి కావాలో తెలిసిన దేవుణ్ణి,’ ఫలానిది కావాలని ఎందుకు అడుగుతూ ఉండాలి” అని ఎవరైనా అడిగితే మీరెలా జవాబిస్తారు? (మత్త. 6:8) మీరు వారికి ఒక విషయం చెప్పవచ్చు. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించడం ద్వారా యెహోవా నడిపింపు అవసరమనే విషయాన్ని గుర్తిస్తున్నామని చూపిస్తాం. ఉదాహరణకు, ఎవరైనా సహాయం కోసం మీ దగ్గరికి వస్తే మీకు చేతనైనంత సహాయం చేస్తారు. ఆ వ్యక్తి మీమీద నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాడు కాబట్టి మీరలా చేస్తారు. (సామెతలు 3:27 పోల్చండి.) అలాగే, మీరు యెహోవాను పరిశుద్ధాత్మ సహాయం కోసం అడిగినప్పుడు ఆయన కూడా సంతోషంగా మీకు దాన్ని అనుగ్రహిస్తాడు.—సామె. 15:8.
9. కూటాలకు హాజరవడంవల్ల మీరెలా దేవుని ఆత్మ చేత నడిపించబడతారు?
9 మీరు కూటాలకు, సమావేశాలకు హాజరుకావడం ద్వారా కూడా దేవుని ఆత్మచేత నడిపించబడతారు. వాటికి హాజరుకావడానికి ప్రయత్నిస్తూ, అక్కడ అందించబడే సమాచారాన్ని శ్రద్ధగా వినడం చాలా ప్రాముఖ్యం. అలా చేస్తే మీరు “దేవుని మర్మములను” అర్థం చేసుకోగలుగుతారు. (1 కొరిం. 2:10) కూటాల్లో క్రమంగా వ్యాఖ్యానాలు చేయడం ద్వారా కూడా ప్రయోజనాలు పొందుతాం. మీరు గత నాలుగు వారాల్లో హాజరైన కూటాల గురించి ఒకసారి ఆలోచించండి. జవాబు చెప్పడం ద్వారా మీ విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి మీరెన్నిసార్లు చెయ్యెత్తారు? మీరు ఈ విషయంలో ప్రగతి సాధించాల్సిన అవసరముందా? అలాగైతే, రాబోయే వారాల్లో మీరేమి చేయాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. కూటాల్లో భాగం వహించడానికి మీరు చూపించే సుముఖతను చూసి యెహోవా మీకు పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇస్తాడు. అప్పుడే మీరు వెళ్లే కూటాల నుండి మరింత ప్రయోజనం పొందగలుగుతారు.
10. ఆత్మచేత నడిపించబడాలంటే ఏ ఆహ్వానాన్ని ఇతరులకు అందించాలి?
10 ఆత్మచేత నడిపించబడాలంటే మీరు ప్రకటన 22:17లో ఇవ్వబడిన ఈ ఆహ్వానానికి స్పందించాలి: “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” పరిశుద్ధాత్మ అభిషిక్త పెండ్లి కుమార్తె తరగతి ద్వారా జీవజలం గురించిన ఈ ఆహ్వానాన్నిస్తోంది. ఒకవేళ “రమ్ము” అనే పిలుపును మీరు అంగీకరించివుంటే, ఆ ఆహ్వానాన్ని ఇతరులకు కూడా అందించాలని తీర్మానించుకున్నారా? ప్రాణాల్ని రక్షించే ఈ పనిలో పాల్గొనడం ఎంత గొప్ప అవకాశం!
11, 12. ఈ ప్రకటనా పనిని పరిశుద్ధాత్మ ఎలా నిర్దేశిస్తోంది?
11 నేడు, ఈ ప్రాముఖ్యమైన పని పరిశుద్ధాత్మ నిర్దేశంలో జరుగుతోంది. మొదటి శతాబ్దంలో మిషనరీల కోసం కొత్త క్షేత్రాలను తెరిచే విషయంలో పరిశుద్ధాత్మ ఎలా నిర్దేశాన్నిచ్చిందో మనం బైబిల్లో చదువుతాం. ‘ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ’ అపొస్తలుడైన పౌలును, అతని సహవాసులను ‘ఆటంకపరిచింది.’ అంతేకాదు, వారిని బితూనియకు కూడా వెళ్లనివ్వలేదు. పరిశుద్ధాత్మ వారిని ఆ ప్రాంతాలకు వెళ్లనివ్వకుండా ఎలా ఆటంకపరిచిందో మనకు ఖచ్చితంగా తెలియదు కానీ, పరిశుద్ధాత్మ పౌలును మరింత విస్తారమైన ఐరోపా క్షేత్రానికి నడిపించిందనేది మాత్రం స్పష్టమౌతోంది. ఆయన ఓ దర్శనంలో, మాసిదోనియకు చెందిన వ్యక్తి సహాయం కోసం వేడుకోవడాన్ని చూశాడు.—అపొ. 16:6-10.
12 నేడు కూడా యెహోవా ఆత్మ ప్రపంచవ్యాప్త పనిని నిర్దేశిస్తోంది. అయితే నిర్దేశాన్నివ్వడానికి యెహోవా ఇప్పుడు అద్భుతమైన దర్శనాలేమీ ఇవ్వడంలేదు కానీ, తన అభిషిక్తులను పరిశుద్ధాత్మచేత నడిపిస్తున్నాడు. ప్రకటనా పనిలో, బోధనా పనిలో సహోదర సహోదరీలు చేయగలిగినదంతా చేయడానికి ఆ ఆత్మ వారిని ప్రేరేపిస్తోంది. మీరు కూడా ఈ ప్రాముఖ్యమైన పనిలో పాల్గొంటుండవచ్చు. ఉత్తేజకరమైన ఈ పనిలో మరింతగా పాల్గొని మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోగలరా?
13. పరిశుద్ధాత్మ నిర్దేశానికి మీరెలా లోబడవచ్చు? ఉదాహరణ చెప్పండి.
13 దేవుని ప్రజలకు ఇవ్వబడే సమాచారాన్ని మీ జీవితంలో పాటించడం ద్వారా మీరు పరిశుద్ధాత్మ ఇచ్చే నిర్దేశానికి లోబడవచ్చు. జపాన్‌కు చెందిన మిహోకో అనే యువ సహోదరి విషయమే తీసుకోండి. పయినీరు సేవ చేపట్టిన కొత్తలో తాను పునర్దర్శనాలు చేయలేనని, గృహస్థులకు ఆసక్తి కలిగేలా మాట్లాడడం తనకు చేతకాదని అనుకుంది. సరిగ్గా ఆ సమయానికి మన రాజ్య పరిచర్యలో క్లుప్తంగా పునర్దర్శనాలు చేసే విషయంలో చక్కని సలహాలు వచ్చాయి. ఆ తర్వాత, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? అనే బ్రోషురు విడుదలైంది. ఈ బ్రోషురు జపాన్ క్షేత్రంలో ఎంతగానో ఉపయోగపడింది. దీన్ని అందించే విషయంలో, ముఖ్యంగా క్లుప్తంగా పునర్దర్శనాలు చేసే విషయంలో వచ్చిన సలహాలను మిహోకో పాటించింది. బహుశా కొందరు గతంలో బైబిలు అధ్యయనాన్ని నిరాకరించి ఉండవచ్చు. అలాంటి వారితో సహితం ఆమె బైబిలు అధ్యయనాలను ప్రారంభించింది. ఆమె ఇలా చెబుతోంది: “నాకు ఎన్ని బైబిలు అధ్యయనాలు దొరికాయంటే కొన్నింటిని వాయిదా కూడా వేయాల్సి వచ్చింది! నేను ఒక సందర్భంలో 12 అధ్యయనాలు నిర్వహించాను.” యెహోవా సేవకులకు ఇవ్వబడే నిర్దేశాన్ని పాటిస్తూ ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే లెక్కలేనన్ని ఆశీర్వాదాలు మీ సొంతమౌతాయి.
దేవుని ఆత్మపై ఆధారపడండి
14, 15. (ఎ) తమ సమర్పణకు తగ్గట్టు జీవించడం అపరిపూర్ణులైన మానవులకు ఎలా సాధ్యమౌతుంది? (బి) మీరు మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవచ్చు?
14 నియమిత పరిచారకులుగా పరిచర్యలో భాగం వహించాల్సిన బాధ్యత మీపై ఉంది. (రోమా. 10:14) ఆ బాధ్యతను చేపట్టేందుకు కావాల్సిన అర్హతలు లేవని మీకనిపించవచ్చు. కానీ, దేవుడు అభిషిక్తుల్ని సమర్థులను చేసినట్లే మిమ్మల్ని కూడా సమర్థులను చేస్తాడు. (2 కొరింథీయులు 3:5 చదవండి.) మీరు చేయగలిగినదంతా చేస్తూ దేవుని ఆత్మపై ఆధారపడడం ద్వారా మీరు మీ సమర్పణకు తగినట్లు జీవించగలుగుతారు.
15 అయితే, పరిపూర్ణుడైన యెహోవా దేవునికి చేసుకున్న సమర్పణకు తగ్గట్టు జీవించడం అపరిపూర్ణ మానవులమైన మనకు సులభమేమీ కాదు. ఈ విషయంలో మీకు ఒక సమస్య ఎదురుకావచ్చు. మీ పాత స్నేహితులు మీ కొత్త జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయి, ‘మిమ్మల్ని దూషించవచ్చు.’ (1 పేతు. 4:4) అలాంటప్పుడు, మీరు ఎంతో ప్రాముఖ్యమైన కొత్త స్నేహాలను అంటే యెహోవాతో, యేసుక్రీస్తుతో స్నేహాన్ని పెంపొందించుకున్నారన్న విషయం మరచిపోకండి. (యాకోబు 2:21-23 చదవండి.) ప్రపంచవ్యాప్త ‘సహోదరత్వంలో’ భాగంగావున్న మీ స్థానిక సంఘంలోని సహోదర సహోదరీలను పరిచయం చేసుకోవడం కూడా ప్రాముఖ్యం. (1 పేతు. 2:17; సామె. 17:17) ఎల్లప్పుడూ మీపై మంచి ప్రభావం చూపించగల స్నేహితులను కలిగివుండడానికి యెహోవా తన ఆత్మ ద్వారా మీకు సహాయం చేస్తాడు.
16. పౌలులాగే మీరూ ‘బలహీనతలలో ఎందుకు సంతోషించవచ్చు?’
16 సంఘంలో మీకు సహాయం చేసే స్నేహితులు ఉన్నా రోజువారీ సమస్యల్ని అధిగమించడం మీకు కష్టమనిపిస్తుండవచ్చు. కొన్నిసార్లు మీకు ఎదురయ్యే సమస్యలవల్ల ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడవచ్చు. అంతేకాక, సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నట్లు మీకనిపించవచ్చు. సరిగ్గా అలాంటి సమయంలోనే మీరు పరిశుద్ధాత్మ సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాలి. “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (2 కొరింథీయులు 4:7-10; 12:10 చదవండి.) ఎలాంటి బలహీనతలున్నా వాటిని అధిగమించేందుకు దేవుని ఆత్మ సహాయం చేయగలదని పౌలుకు తెలుసు. బలహీనంగా ఉన్నప్పుడు, మీకు సహాయం అవసరమైనప్పుడు దేవుని చురుకైన శక్తి మిమ్మల్ని బలపర్చగలదు. తాను ‘బలహీనతలలో సంతోషించగలనని’ పౌలు రాశాడు. తాను బలహీనంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తనపై పనిచేయడాన్ని ఆయన చవిచూశాడు. మీరూ అలాంటి అనుభవాన్నే చవిచూడవచ్చు.—రోమా. 15:13.
17. మీ గమ్యస్థానం దిశలో ప్రయాణిస్తుండగా పరిశుద్ధాత్మ మీకెలా సహాయం చేయగలదు?
17 మనం దేవునికి చేసుకున్న సమర్పణకు తగ్గట్టు జీవించాలంటే మనకు ఆయన ఆత్మ సహాయం అవసరం. మిమ్మల్ని మీరు, తెరచాపలున్న ఓడకు కెప్టెన్‌గా ఊహించుకోండి. యెహోవాను నిరంతరం సేవించడమే మీరు చేరుకోవాలనుకునే గమ్యస్థానం. పరిశుద్ధాత్మ సురక్షితంగా ఆ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి అవసరమైన గాలిలాంటిది. సాతాను లోకంలో ప్రబలంగావున్న ఆత్మచేత అటు ఇటు కొట్టుకొనిపోవాలని మీరు కోరుకోరు. (1 కొరిం. 2:12) కాబట్టి, మీరు వెళ్లే దిశలో వీచే గాలిని గుర్తించి దానికి అనుగుణంగా ఓడను నడపాలి. సరైన దిశలో వీచే గాలిలాంటిదే పరిశుద్ధాత్మ. దేవుని వాక్యం ద్వారా, ఆయన సంస్థ ద్వారా పరిశుద్ధాత్మ సరైన దిశలో మిమ్మల్ని నడిపిస్తుంది.
18. ఇప్పుడు మీరు ఏ కృతనిశ్చయంతో ఉన్నారు? ఎందుకు?
18 మీరు యెహోవాసాక్షులతో అధ్యయనం చేస్తూ వారితో ఆధ్యాత్మిక సహవాసాన్ని ఆనందిస్తున్నప్పటికీ ఇంకా సమర్పణా, బాప్తిస్మం వంటి ప్రాముఖ్యమైన చర్యలు తీసుకోనట్లయితే మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ విషయంలో నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నాను?’ నేడు యెహోవా చిత్తం నెరవేర్చడంలో పరిశుద్ధాత్మ పోషించే పాత్ర ఏమిటో మీరు గుర్తించే ఉంటారు. అంతేకాక దానిపట్ల మీకు కృతజ్ఞత ఉండేవుంటుంది. అలాగైతే మీరు ఏది సరైనదని తెలుసుకున్నారో దాన్నే చేయండి. అప్పుడు యెహోవా మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఉదారంగా తన పరిశుద్ధాత్మను మీకు ఇస్తాడు. మీరు ఈ మధ్యకాలంలో బాప్తిస్మం తీసుకున్నా లేదా ఎన్నో సంవత్సరాల క్రితం తీసుకున్నా మీరిప్పటికే మీ జీవితంలో పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని ఖచ్చితంగా చవిచూసివుంటారు. దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని ఎలా బలపర్చగలడో మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మీరు నిత్యమూ అలాంటి ఆశీర్వాదాన్ని అనుభవించవచ్చు. కాబట్టి, ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉండాలనే కృతనిశ్చయంతో ఉండండి.
మీకు జ్ఞాపకమున్నాయా?
• ‘ఆత్మానుసారంగా నడుచుకోవడం’ అంటే ఏమిటి?
• ఎల్లప్పుడూ ‘ఆత్మానుసారంగా నడుచుకోవడానికి’ మీకు ఏది సహాయం చేస్తుంది?
• మీరు మీ సమర్పణకు తగ్గట్టు ఎలా జీవించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[15వ పేజీలోని చిత్రం]
మీ హృదయమనే నేలను సాగుచేసుకోవడానికి ఎంతో కృషి చేయాలి
[16, 17వ పేజీలోని చిత్రాలు]
మీరు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారా?