దేవుని నీతిని యేసు ఎలా ఘనపరుస్తున్నాడు?
దేవుని నీతిని యేసు ఎలా ఘనపరుస్తున్నాడు?
“దేవుడు . . . తన నీతిని కనుపరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసముద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను.”—రోమా. 3:25, 26.
1, 2. (ఎ) మానవుల పరిస్థితి గురించి బైబిలు ఏమి బోధిస్తోంది? (బి) మనం ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?
ఏదెను తోటలో జరిగిన తిరుగుబాటును వివరించే బైబిలు వృత్తాంతం చాలామందికి తెలుసు. ఆదాము పాపంవల్ల వచ్చిన పరిణామాలను మనమందరం అనుభవిస్తున్నాం. అది ఈ మాటల్లో స్పష్టమౌతోంది: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమా. 5:12) మంచి చేయాలని మనం ఎంత ప్రయత్నించినా పొరపాట్లు చేస్తుంటాం కాబట్టి దేవుని క్షమాపణ మనకు అవసరం. అంతెందుకు, అపొస్తలుడైన పౌలు కూడా ఇలా విలపించాడు: “నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను?”—రోమా. 7:19, 24.
2 మనం పాపులముగా పుట్టాం కాబట్టి ఇలాంటి ప్రాముఖ్యమైన ప్రశ్నలు వేసుకుంటే మంచిది: పాపాన్ని వారసత్వంగా పొందకుండా నజరేయుడైన యేసు ఎలా జన్మించాడు? ఆయన ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు? యేసు తన జీవితం ద్వారా యెహోవా నీతిని ఎలా ఘనపరిచాడు? ప్రాముఖ్యంగా, క్రీస్తు మరణం ద్వారా ఏమి సాధ్యమైంది?
దేవుని నీతి సవాలు చేయబడింది
3. సాతాను హవ్వను ఎలా మోసపరిచాడు?
3 మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు మూర్ఖంగా దేవుని సర్వాధిపత్యాన్ని తిరస్కరించి, “అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పము” పరిపాలనలోకి రావడానికి ఇష్టపడ్డారు. (ప్రక. 12:9) అది ఎలా జరిగిందో చూడండి. “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” అనే ప్రశ్నను సాతాను హవ్వను అడగడం ద్వారా యెహోవా పరిపాలనా విధానం నీతియుక్తమైనదేనా అని సవాలు చేశాడు. దానికి హవ్వ, తాము ఒకానొక చెట్టు ఫలాన్ని తినకూడదని, తింటే చనిపోతామని దేవుడు ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞను సాతానుకు చెప్పింది. అప్పుడు సాతాను, “మీరు చావనే చావరు” అని చెప్పడం ద్వారా దేవుడు అబద్ధమాడాడని నిందించాడు. దేవుడు వారి నుండి మంచిదేదో దాస్తున్నాడనీ, ఆ పండు తింటే వారు దేవునిలా మంచి చెడులను గుర్తించగలుగుతారనీ హవ్వ నమ్మేలా సాతాను ఆమెను మోసపరిచాడు.—ఆది. 3:1-5.
4. మానవులు ఎలా దేవుని ప్రత్యర్థియైన సాతాను పరిపాలనలోకి వచ్చారు?
4 మరో మాటలో చెప్పాలంటే, దేవుని నుండి స్వతంత్రంగా ఉంటే మానవులు సంతోషంగా ఉంటారని సాతాను సూచించాడు. దేవుని సర్వాధిపత్యం నీతియుక్తమైనదని సమర్థించే బదులు ఆదాము తన భార్య మాట విని, దేవుడు తినొద్దన్న పండును ఆయన కూడా తిన్నాడు. అలా ఆదాము యెహోవా ముందు తనకున్న పరిపూర్ణ స్థానాన్ని వదులుకొని మనల్ని క్రూరమైన పాపమరణాల బానిసత్వంలోకి తెచ్చాడు. ఆదాము చేసిన పాపంవల్ల మానవజాతి దేవుని ప్రత్యర్థి, ‘ఈ యుగ సంబంధమైన దేవత’ అయిన సాతాను పరిపాలనలోకి వచ్చింది.—2 కొరిం. 4:4; రోమా. 7:14.
5. (ఎ) యెహోవా చెప్పిన మాట ఎలా నిజమైంది? (బి) దేవుడు ఆదాముహవ్వలకు కలుగబోయే సంతానానికి ఏ భవిష్యత్తును వాగ్దానం చేశాడు?
5 తాను ముందు చెప్పినట్లే యెహోవా ఆదాముహవ్వలకు మరణశిక్ష విధించాడు. (ఆది. 3:16-19) అలాగని దేవుని సంకల్పం విఫలమైపోయిందని దానర్థమా? కానేకాదు! ఆదాముహవ్వలకు శిక్ష విధించేటప్పుడు యెహోవా, ఆదాముకు కలుగబోయే సంతానానికి గొప్ప భవిష్యత్తును వాగ్దానం చేశాడు. సాతాను చేత మడిమె మీద కొట్టబడే ఓ ‘సంతానాన్ని’ తీసుకొచ్చే విషయంలో యెహోవా తన సంకల్పాన్ని ప్రకటించడం ద్వారా అలా చేశాడు. అయితే, వాగ్దానం చేయబడిన ఆ ‘సంతానం’ తన మడిమెకు తగిలిన గాయం నుండి కోలుకొని సాతాను ‘తలమీద కొడతాడు.’ (ఆది. 3:15) యేసుక్రీస్తు చేయబోయే దాని గురించి మరింత వివరణనిస్తూ బైబిలు ఇలా చెబుతోంది: “అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.” (1 యోహా. 3:8) అయితే యేసు ప్రవర్తన, ఆయన మరణం దేవుని నీతిని ఎలా ఘనపరిచాయి?
యేసు బాప్తిస్మానికున్న అర్థమేమిటి?
6. యేసు ఆదాము నుండి పాపాన్ని వారసత్వంగా పొందలేదని మనకెలా తెలుసు?
6 మానవునిగా యేసు, ఒకప్పుడు పరిపూర్ణుడిగావున్న ఆదాముకు సరిసమానమైన వ్యక్తి అయ్యుండాలి. (రోమా. 5:14; 1 కొరిం. 15:45) అలా జరగాలంటే, యేసు ఓ పరిపూర్ణ మానవునిగా జన్మించాలి. అయితే, అది ఎలా సాధ్యమైంది? గబ్రియేలు దూత యేసు తల్లియైన మరియకు ఈ స్పష్టమైన వివరణను ఇచ్చాడు: “పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.” (లూకా 1:35) యేసు బాలుడిగా ఉన్నప్పుడు, ఆయన జననం గురించి బహుశా మరియ ఆయనకు కొన్ని విషయాలు చెప్పివుండవచ్చు. అందుకే ఒక సందర్భంలో యేసు తల్లియైన మరియ, ఆయనను పెంచిన యోసేపు ఆయనను దేవాలయంలో కనుగొన్నప్పుడు బాలుడైన యేసు, “నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా?” అని అన్నాడు. (లూకా 2:49) కాబట్టి, తాను దేవుని కుమారుడిననే విషయం యేసుకు చిన్నప్పటినుండే తెలుసని స్పష్టమౌతోంది. అందుకే, ఆయన తన జీవితంలో దేవుని నీతిని ఘనపర్చడానికే ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు.
7. యేసు దగ్గర ఎలాంటి అమూల్యమైన సొత్తులున్నాయి?
7 ఆరాధన కోసం జరిగే కూటాలకు క్రమంగా హాజరవడం ద్వారా యేసు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎంతో ఆసక్తిని చూపించాడు. ఆయన హెబ్రీ లేఖనాల్లో చదివినవాటినీ, ఇతరులు చదువుతుండగా విన్నవాటినీ తన పరిపూర్ణమైన మేదస్సుతో అర్థం చేసుకొనివుంటాడు. (లూకా 4:16) మానవుల కోసం బలి అర్పించడానికి కావాల్సిన అమూల్యమైన సొత్తు అంటే పరిపూర్ణ శరీరం కూడా ఆయనకు ఉంది. యేసు బాప్తిస్మం పొందినప్పుడు ప్రార్థించడమేకాక, కీర్తన 40:6-8 వచనాల్లోని ప్రవచన మాటల గురించి కూడా ఆలోచించి ఉంటాడు.—లూకా 3:21; హెబ్రీయులు 10:5-10 చదవండి. a
8. బాప్తిస్మం తీసుకోకుండా యేసును ఆపాలని బాప్తిస్మమిచ్చు యోహాను ఎందుకు ప్రయత్నించాడు?
8 బాప్తిస్మం తీసుకోకుండా యేసును ఆపాలని బాప్తిస్మమిచ్చు యోహాను ముందు అనుకున్నాడు. ఎందుకు అలా అనుకున్నాడు? ఎందుకంటే, యూదులు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపపడుతూ దానికి సూచనగా బాప్తిస్మం తీసుకోవడానికి యోహాను దగ్గరకు వచ్చేవారు. యేసు నీతిమంతుడు కాబట్టి ఆయన ఏ విషయంలోనూ పశ్చాత్తాపపడనక్కర్లేదని ఆయన దగ్గరి బంధువైన యోహానుకు తెలిసివుంటుంది. అయితే, తాను బాప్తిస్మం తీసుకోవడం సరైనదేనని యేసు యోహానుకు అభయమిచ్చాడు. “నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది” అని యేసు ఆయనకు వివరించాడు.—మత్త. 3:15.
9. యేసు బాప్తిస్మం దేన్ని సూచించింది?
9 మొదట్లో ఆదాముకు ఉన్నట్లే ఓ పరిపూర్ణ మానవజాతికి తండ్రి అయ్యే సామర్థ్యం పరిపూర్ణ వ్యక్తిగా తనకుందని యేసు అనుకొనగలిగి ఉండేవాడే. కానీ తన విషయంలో యెహోవా చిత్తం అది కాదు కాబట్టి యేసు అలాంటి భవిష్యత్తును ఎన్నడూ కోరుకోలేదు. వాగ్దానం చేయబడిన సంతానం లేదా మెస్సీయ పాత్రను పోషించేందుకు యేసును దేవుడు ఈ భూమ్మీదకు పంపించాడు. ఆ పాత్రను నెరవేర్చడంలో భాగంగా యేసు తన పరిపూర్ణ మానవ జీవాన్ని బలిగా అర్పించాలి. (యెషయా 53:5, 6, 12 చదవండి.) అయితే, యేసు బాప్తిస్మం మన బాప్తిస్మంలాంటిది కాదు. అప్పటికే ఆయన యెహోవా సమర్పిత జనాంగమైన ఇశ్రాయేలులో భాగంగా ఉన్నాడు కాబట్టి ఆయన యెహోవాకు చేసుకునే సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకోలేదు. కానీ, మెస్సీయ గురించి లేఖనాల్లో చెప్పబడినట్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు తనను తాను అర్పించుకోవడానికే ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు.
10. మెస్సీయగా దేవుని చిత్తం నెరవేర్చడంలో భాగంగా యేసు ఏమి చేయాలి? యేసు దీని విషయంలో ఎలా భావించాడు?
10 దేవుని రాజ్యం గురించి ప్రకటించి, శిష్యులను తయారు చేసి, వారిని భవిష్యత్తులో శిష్యులను చేసే పనికి సిద్ధం చేయాలన్నది కూడా యేసు విషయంలో యెహోవా చిత్తం. అంతేకాక, తనను తాను దేవునికి అర్పించుకోవడంలో భాగంగా, యెహోవా నీతియుక్త సర్వాధిపత్యానికి మద్దతునిస్తున్నానని చూపించడానికి యేసు హింసను సహించి, క్రూరంగా మరణించేందుకు ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చాడు. యేసు తన పరలోక తండ్రిని నిజంగా ప్రేమించాడు కాబట్టి ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడ్డాడు, తన శరీరాన్ని బలిగా అర్పించడం ఎంతో సంతృప్తినిస్తుందని ఆయన గ్రహించాడు. (యోహా. 14:31) పాపమరణాల బానిసత్వం నుండి మానవుల్ని తిరిగి కొనడానికి తాను తన పరిపూర్ణ జీవపు విలువను దేవునికి విమోచన క్రయధనంగా చెల్లించవచ్చనే విషయం తెలుసుకొని కూడా యేసు ఎంతో సంతోషించాడు. ఈ బరువైన బాధ్యతల్ని మోయడానికి యేసు తనను తాను అర్పించుకున్నప్పుడు దేవుడు ఆయనను అంగీకరించాడా? నిస్సందేహంగా అంగీకరించాడు.
11. వాగ్దానం చేయబడిన మెస్సీయగా లేదా క్రీస్తుగా యేసును తాను అంగీకరిస్తున్నానని యెహోవా ఎలా చూపించాడు?
11 బాప్తిస్మం తర్వాత యొర్దాను నది నుండి యేసు బయటికి వచ్చినప్పుడు యెహోవా ఆయనను ఆమోదించాడని నాలుగు సువార్తల రచయితలూ చెబుతున్నారు. “ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద [యేసుమీద] నిలిచెను . . . ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిని” అని బాప్తిస్మమిచ్చు యోహాను అన్నాడు. (యోహా. 1:32-34) అంతేకాక, ఆ సందర్భంలో యెహోవా, “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను” అని అన్నాడు.—మత్త. 3:17; మార్కు 1:11; లూకా 3:22.
మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు
12. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మూడున్నర సంవత్సరాలు యేసు ఏమి చేశాడు?
12 బాప్తిస్మం తీసుకున్న తర్వాత మూడున్నర సంవత్సరాలు యేసు తన తండ్రి గురించి, ఆయన సర్వాధిపత్యం ఎంత నీతియుక్తమైనదనే దానిగురించి బోధించడంలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. వాగ్దాన దేశమంతటా కాలినడకన వెళ్లడంవల్ల ఆయన అలసిపోయాడు కానీ, సత్యం గురించి సమగ్రంగా సాక్ష్యమిచ్చే విషయంలో ఆయనను ఏదీ ఆపలేకపోయింది. (యోహా. 4:6, 34; 18:37) దేవుని రాజ్యం గురించి యేసు ఇతరులకు బోధించాడు. అద్భుతరీతిలో రోగులను స్వస్థపరచడం ద్వారా, ఆకలితోవున్న జనసమూహాలకు ఆహారం పెట్టడం ద్వారా, చివరికి చనిపోయినవారిని తిరిగి లేపడం ద్వారా భవిష్యత్తులో దేవుని రాజ్యం మానవుల కోసం ఏమి చేస్తుందో యేసు చూపించాడు.—మత్త. 11:4, 5.
13. ప్రార్థన గురించి యేసు ఏమి బోధించాడు?
13 తన బోధలు, తన స్వస్థత కార్యాలు తనవల్లే జరిగాయని చెప్పుకునే బదులు, వినయంగా యెహోవానే ఘనపరచి యేసు మనకు అత్యుత్తమ మాదిరినుంచాడు. (యోహా. 5:19; 11:41-44) మనం ఏ ప్రాముఖ్యమైన విషయాల గురించి ప్రార్థించాలో కూడా యేసు తెలియజేశాడు. దేవుని నామం ‘పరిశుద్ధపరచబడాలనీ,’ దేవుని “చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును” నెరవేరేలా సాతాను దుష్ట పరిపాలన స్థానంలో దేవుని నీతియుక్తమైన పరిపాలన రావాలనీ మనం మన ప్రార్థనల్లో వేడుకోవాలి. (మత్త. 6:9, 10) అంతేకాక, ‘రాజ్యాన్ని, [దేవుని] నీతిని మొదట వెదకడం’ ద్వారా మన ప్రార్థనలకు తగిన విధంగా ప్రవర్తించాలని కూడా యేసు మనల్ని ప్రోత్సహించాడు.—మత్త. 6:33.
14. యేసు పరిపూర్ణుడైనా, దేవుని సంకల్పంలో తనకున్న పాత్రను నెరవేర్చడానికి ఆయన ఎందుకు ప్రయాసపడాల్సి వచ్చింది?
14 తన బలి మరణం సమీపిస్తుండగా తనపైవున్న బరువైన బాధ్యత గురించి మరింతగా ఆలోచించాడు. యేసు అన్యాయమైన విచారణనూ, క్రూరమైన మరణాన్నీ సహించడంపైనే తన తండ్రి సంకల్పం, తన తండ్రి నామం ఘనపరచబడడం ఆధారపడివున్నాయి. తన మరణానికి ఐదు రోజుల ముందు యేసు ఇలా ప్రార్థించాడు: “ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును?—తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందు కోసరమే నేను ఈ గడియకు వచ్చితిని.” సాధారణంగా మానవులకు కలిగే ఇలాంటి భావాలను వ్యక్తం చేసిన తర్వాత, యేసు తన గురించి ఆలోచించుకోకుండా తానెంతో ప్రాముఖ్యతనివ్వాల్సిన విషయం గురించి ఆలోచిస్తూ, “తండ్రీ, నీ నామము మహిమపరచుము” అని ప్రార్థించాడు. దానికి యెహోవా వెంటనే ప్రతిస్పందిస్తూ, “నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును” అని అన్నాడు. (యోహా. 12:27, 28) అవును, యథార్థతకు సంబంధించి ఏ మానవుడూ ఎదుర్కోనంత పెద్ద పరీక్షను ఎదుర్కోవడానికి యేసు సిద్ధపడ్డాడు. అయితే, తన పరలోక తండ్రి చెప్పిన ఆ మాటల్ని విన్నప్పుడు యెహోవా సర్వాధిపత్యాన్ని ఘనపరిచి, అదే సరైనదని నిరూపించే విషయంలో తాను విజయం సాధిస్తానన్న బలమైన నమ్మకం ఆయనలో నిస్సందేహంగా కలిగివుంటుంది. ఆయన విజయం సాధించాడు కూడా.
యేసు మరణం వల్ల ఏది సాధ్యమైంది?
15. తన మరణానికి ముందు యేసు “సమాప్తమైనది” అని ఎందుకు చెప్పాడు?
15 హింసాకొయ్యమీద ఎంతో వేదనను అనుభవిస్తూ చివరి శ్వాస విడిచే ముందు, యేసు “సమాప్తమైనది” లేదా నెరవేర్చబడింది అని అన్నాడు. (యోహా. 19:30) మూడున్నర సంవత్సరాల్లో అంటే తన బాప్తిస్మం నుండి మరణంవరకు తాను చేసిన సేవలో దేవుని సహాయంతో ఆయన ఎన్నో గొప్ప పనులు చేశాడు. యేసు మరణించినప్పుడు ఓ పెద్ద భూకంపం వచ్చింది. యేసు మరణశిక్షను అమలుచేయడానికి వచ్చిన ఓ రోమా శతాధిపతి దాన్ని చూసి, “నిజముగా ఈయన దేవుని కుమారుడు” అని అన్నాడు. (మత్త. 27:54) దేవుని కుమారుణ్ణని చెప్పుకున్నందుకు యేసును ఇతరులు హేళన చేయడాన్ని ఆ అధికారి చూసివుంటాడు. యేసు ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ తన యథార్థతను నిలుపుకొని సాతాను పచ్చి అబద్ధికుడని నిరూపించాడు. దేవుని సర్వాధిపత్యాన్ని సమర్థించేవారందరి విషయంలో సాతాను ఈ సవాలు చేశాడు: “తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా”? (యోబు 2:4) యేసుతో పోలిస్తే ఆదాముహవ్వలు అంత కష్టమైన పరీక్షను ఎదుర్కోలేదు. యేసు నమ్మకంగా ఉండడం ద్వారా, ఆదాముహవ్వలు కూడా తమకు ఎదురైన పరీక్షను నెగ్గి నమ్మకంగా ఉండగలిగేవారే అని చూపించాడు. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా యేసు తన జీవితం ద్వారా, తన మరణం ద్వారా యెహోవా సర్వాధిపత్యం నీతియుక్తమైనదని సమర్థించాడు, దాన్ని ఘనపరిచాడు. (సామెతలు 27:11 చదవండి.) యేసు మరణంవల్ల ఇంకేమైనా సాధ్యమైందా? సాధ్యమైంది!
16, 17. (ఎ) క్రీస్తుకు పూర్వం జీవించిన తన సేవకులను యెహోవా ఎందుకు నీతిమంతులుగా పరిగణించగలిగాడు? (బి) నమ్మకంగా ఉన్నందుకు తన కుమారునికి యెహోవా ఎలా ప్రతిఫలమిచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పటికీ ఏమి చేస్తున్నాడు?
16 యేసు భూమ్మీదకు రాకముందు ఎంతోమంది యెహోవా సేవకులు జీవించారు. దేవుడు వారిని నీతిమంతులుగా పరిగణించాడు, పునరుత్థాన నిరీక్షణను అనుగ్రహించాడు. (యెష. 25:8; దాని. 12:13) అయితే, పరిశుద్ధుడైన యెహోవా దేవుడు పాపులైన మానవులను న్యాయపరమైన ఏ కారణాన్నిబట్టి అంత అద్భుతరీతిలో ఆశీర్వదించగలడు? దానికి బైబిలు ఇలా జవాబిస్తోంది: “పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసముద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.”—రోమా. 3:25, 26. b
17 యెహోవా యేసును పునరుత్థానం చేసి, ఈ భూమ్మీదకు రాకముందు ఆయనకు పరలోకంలోవున్న స్థానంకన్నా మరింత గొప్ప స్థానాన్ని ప్రతిఫలంగా ఇచ్చాడు. ఇప్పుడు యేసు మహిమాన్విత ఆత్మ ప్రాణిగా అమర్త్యతను అనుభవిస్తున్నాడు. (హెబ్రీ. 1:3) ప్రధాన యాజకునిగా, రాజుగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు, దేవుని నీతిని ఘనపరిచేలా తన అనుచరులకు ఇప్పటికీ సహాయం చేస్తున్నాడు. తన కుమారునిలా తన నీతిని ఘనపరిచి, తనను యథార్థంగా సేవించేవారికి పరలోక తండ్రియైన యెహోవా ప్రతిఫలమిస్తాడు కాబట్టి మనం యెహోవాకు ఎంత కృతజ్ఞత చూపించాలి!—కీర్తన 34:3; హెబ్రీయులు 11:6 చదవండి.
18. తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏ విషయాన్ని చర్చిస్తాం?
18 హేబెలు కాలం నుండి నమ్మకస్థులుగా ఉన్న మానవులు వాగ్దానం చేయబడిన సంతానంపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని కనబరిచారు కాబట్టి వారు యెహోవాతో దగ్గరి సంబంధాన్ని అనుభవించారు. తన కుమారుడు సంపూర్ణ యథార్థతను కనబరుస్తాడనీ, తన మరణం ద్వారా ‘లోకపాపాన్ని’ సంపూర్ణంగా తీసేస్తాడనీ యెహోవాకు తెలుసు. (యోహా. 1:29) యేసు మరణం నేడు జీవిస్తున్న మానవులకు కూడా మేలు చేస్తుంది. (రోమా. 3:26) అయితే, క్రీస్తు విమోచన క్రయధనం వల్ల మీరు ఏ ఆశీర్వాదాలను పొందవచ్చు? దీన్ని మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
[అధస్సూచీలు]
a గ్రీకు సెప్టువజింటు అనువాదం ప్రకారం, అపొస్తలుడైన పౌలు ఇక్కడ కీర్తన 40:6-8 వచనాలను ఎత్తిరాశాడు. ఆ అనువాదంలో “నాకొక శరీరమును అమర్చితివి” అన్న మాటలు కూడా ఉన్నాయి. కానీ, ఈ మాటలు ప్రస్తుతం అందుబాటులోవున్న ప్రాచీన హెబ్రీ లేఖనాల అనువాదాల్లో లేవు.
b 6, 7 పేజీల్లోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.
మీరెలా జవాబిస్తారు?
• దేవుని నీతి ఎలా సవాలు చేయబడింది?
• యేసు బాప్తిస్మం దేన్ని సూచించింది?
• యేసు మరణం వల్ల ఏమి సాధ్యమైంది?
[అధ్యయన ప్రశ్నలు]
[9వ పేజీలోని చిత్రం]
యేసు బాప్తిస్మం దేన్ని సూచించిందో మీకు తెలుసా?