మోసంతో నిండిన లోకంలో నిజాయితీగా ఎలా ఉండవచ్చు?
మోసంతో నిండిన లోకంలో నిజాయితీగా ఎలా ఉండవచ్చు?
మనం పీల్చే గాలిలా మోసం ప్రతీచోట ఉంది. ప్రజలు అబద్ధాలాడుతున్నారు, ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, అప్పులు ఎగ్గొడుతున్నారు, దుర్నీతికరమైన వ్యాపారాలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి లోకంలో జీవిస్తున్నాం కాబట్టి నిజాయితీగా ఉండాలనే మన కృతనిశ్చయాన్ని దెబ్బతీసే పరిస్థితులను మనం తరచూ ఎదుర్కొంటాం. లోకంలోని ప్రజల్లా ప్రవర్తించాలనే ఆలోచనను మనమెలా ఎదిరిస్తూ ఉండవచ్చు? మనకు యెహోవా పట్ల సరైన భయం, బైబిలు సూత్రాల ప్రకారం శిక్షణ పొందిన మనస్సాక్షి, సంతృప్తి అనేవి ఉంటే ఎదిరించవచ్చు. అదెలాగో ఇప్పుడు పరిశీలిద్దాం.
యెహోవా పట్ల సరైన భయం
యెషయా ప్రవక్త ఇలా రాశాడు: “యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు.” (యెష. 33:22) యెహోవా అధికారాన్ని గుర్తిస్తే మనం ఆయన పట్ల భయం కలిగివుంటాం, మోసం చేయకూడదని నిశ్చయించుకుంటాం. సామెతలు 16:6 ఇలా చెబుతోంది: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.” యెహోవా పట్ల భయభక్తులు కలిగివుండడం అంటే ఆయన ఏదో చేస్తాడని గజగజ వణికిపోవడం కాదుగానీ మన క్షేమం గురించి ఎంతో ఆలోచిస్తున్న పరలోకపు తండ్రిని నొప్పించకూడదనే సరైన భయం కలిగివుండడమే.—1 పేతు. 3:12.
దానివల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతామో చూపించే ఒక అనుభవాన్ని పరిశీలిద్దాం. రీకార్డూ, ఆయన భార్య ఫెర్నాన్‌డ బ్యాంకు నుండి 700 డాలర్లు (దాదాపు 30,800 రూపాయలు) డ్రా చేశారు. a ఫెర్నాన్‌డ వాటిని లెక్కపెట్టుకోకుండానే తన పర్సులో పెట్టుకుంది. కొన్ని బిల్లులు కట్టి ఇంటికి వచ్చిన తర్వాత, ఫెర్నాన్‌డ పర్సులో దాదాపు డ్రా చేసినంత డబ్బు ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయారు. చివరకు, “బ్యాంకు క్యాషియర్ మనకు ఎక్కువ డబ్బు ఇచ్చింది” అని వారు అనుకున్నారు. ఇంకా చాలా బిల్లులు కట్టాలి కాబట్టి, ఆ డబ్బును తమ దగ్గరే ఉంచుకోవాలని వారికి మొదట అనిపించింది. రీకార్డూ ఇలా అంటున్నాడు: “ఆ డబ్బును తిరిగి ఇచ్చేందుకు శక్తినివ్వమని మేము యెహోవాకు ప్రార్థించాం. సామెతలు 27:11లో ఉన్నట్లుగా యెహోవాను సంతోషపరచాలనే కోరికతో ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాం.”
బైబిలు సూత్రాల ప్రకారం శిక్షణ పొందిన మనస్సాక్షి
బైబిలు చదివి, అందులో నేర్చుకున్న దాన్ని పాటించడానికి కృషిచేస్తే మన మనస్సాక్షి సరిగ్గా పనిచేస్తుంది. అలా, ‘సజీవమైన, బలముగలదైన దేవుని వాక్యము’ మన మనసుల్నే కాక హృదయాల్ని కూడా చేరుకొని, ‘అన్ని విషయాల్లో యోగ్యంగా [“నిజాయితీగా,” NW] ప్రవర్తించేందుకు’ మనలను పురికొల్పుతుంది.—హెబ్రీ. 4:12; 13:18.
జ్వావున్ ఉదాహరణే తీసుకోండి. ఆయన చాలా పెద్ద మొత్తంలో, అంటే దాదాపు 5000 డాలర్లు (దాదాపు 2,20,000 రూపాయలు) అప్పు చేశాడు. దాన్ని తీర్చకుండానే ఆయన మరో ఊరికి వెళ్లిపోయాడు. ఆ సంఘటన జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత జ్వావున్ సత్యం తెలుసుకున్నాడు. ఇప్పుడు తన మనస్సాక్షి బైబిలు సూత్రాల ప్రకారంగా శిక్షణ పొందింది కాబట్టి అప్పు ఇచ్చిన వ్యక్తిని కలవాలనుకున్నాడు. జ్వావున్ తన కొద్దిపాటి ఆదాయంతో భార్యను, నలుగురు పిల్లలను పోషించాల్సివుంది. అందుకే ఆ వ్యక్తి జ్వావున్ పరిస్థితిని అర్థం చేసుకుని అప్పును ఇన్‌స్టాల్మెంట్లలో తీర్చడానికి ఒప్పుకున్నాడు.
సంతృప్తి కలిగివుండండి
అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది . . . కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.” (1 తిమో. 6:6-8) జ్ఞానయుక్తమైన ఆ ఉపదేశాన్ని హృదయపూర్వకంగా పాటిస్తే దురాశతో, అవినీతితో కూడిన వ్యాపారాల్లో లేదా చిటికెలో డబ్బు సంపాదించే బూటకపు పథకాల్లో చిక్కుకోకుండా ఉంటాం. (సామె. 28:20) అంతేకాక, మన కనీస అవసరాలను దేవుడు తీరుస్తాడనే నమ్మకంతో ఆయన రాజ్యానికి మొదటి స్థానమివ్వగలుగుతాం.—మత్త. 6:25-34.
అయితే, ‘ధనానికి మోసం’ చేసే శక్తి ఉంది కాబట్టి దురాశకు, అత్యాశకు లోనయ్యే ప్రమాదాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. (మత్త. 13:22) ఆకాను ఉదాహరణ గుర్తు చేసుకోండి. ఇశ్రాయేలీయులు అద్భుతరీతిలో యొర్దాను నది దాటడాన్ని ఆయన కళ్లారా చూసి కూడా యెరికో పట్టణపు దోపుడు సొమ్ములోనుండి కొంత వెండిని, బంగారాన్ని, ఓ విలువైన వస్త్రాన్ని దురాశతో దొంగిలించాడు. దానివల్ల ఆయన ప్రాణాలు కోల్పోయాడు. (యెహో. 7:1, 20-26) అందుకే కొన్ని శతాబ్దాల తర్వాత యేసు, “మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి” అని హెచ్చరించాడు.—లూకా 12:15.
పని స్థలంలో నిజాయితీగా ఉండండి
అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండాలనే మన కృతనిశ్చయాన్ని పరీక్షించే కొన్ని సందర్భాలను ఇప్పుడు పరిశీలిద్దాం. పని స్థలంలో సాధారణంగా దొంగతనాలు జరుగుతున్నా మనం మాత్రం నిజాయితీగా ఉండాలంటే ‘ఏమీ అపహరించకూడదు.’ (తీతు 2:9, 10) ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న జూరాన్‌డీర్ తన ప్రయాణ ఖర్చుల లెక్కను నిజాయితీగా చూపించేవాడు. కానీ ఆయన తోటి ఉద్యోగస్థులు మాత్రం తాము ఖర్చు చేసిన దానికన్నా ఎక్కువ చూపించేవారు. ఎందుకంటే, వారి పైఅధికారి వారలా చేయడాన్ని అనుమతించేవాడు. జూరాన్‌డీర్ నిజాయితీగా ఉన్నందుకు ఆ అధికారి ఆయనను తిట్టడమేకాక, వ్యాపార ప్రయాణాల కోసం ఆయనను పంపడం ఆపేశాడు. కొంతకాలం తర్వాత, ఆ సంస్థ అకౌంట్స్‌ను తనిఖీ చేసినవారు జూరాన్‌డీర్ నిజాయితీని మెచ్చుకున్నారు. అంతేకాక, ఆయనకు ప్రమోషన్ కూడా ఇచ్చారు.
కస్టమర్‌ల దగ్గర సేవా చార్జీలను రెండుసార్లు వసూలు చేయమని సేల్స్‌మన్‌గా పనిచేసే ఆండ్రే అనే సహోదరునికి వాళ్ల యజమాని చెప్పాడు. అప్పుడాయన బైబిలు సూత్రాలను పాటించేందుకు కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించాడు. (కీర్త. 145:18-20) ఆయన తన యజమాని చెప్పినట్లు ఎందుకు చేయలేడో వివరించడానికి ప్రయత్నించాడు కానీ, ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. కాబట్టి ఆండ్రే మంచి ఆదాయం వచ్చే ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఆ యజమాని, ఇప్పుడు కస్టమర్‌ల దగ్గర ఎక్కువ చార్జీలు వసూలు చేయట్లేదని చెప్పి, ఆండ్రేను తిరిగి పనిలో చేరమని అడిగాడు. తర్వాత ఆండ్రేకు మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చింది.
అప్పులను తీర్చండి
“ఏమియు ఎవనికిని అచ్చియుండవద్దు” అని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఉపదేశమిచ్చాడు. (రోమా. 13:8) కొన్నిసార్లు, ‘అప్పిచ్చిన వ్యక్తి దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి అప్పు తీర్చకపోయినా ఫర్వాలేదు’ అని మనల్ని మనం సమర్థించుకునే అవకాశం ఉంది. కానీ బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు.”—కీర్త. 37:21.
ఏదైనా ‘అనూహ్యమైన’ సంఘటన కారణంగా అప్పు తీర్చలేకపోతే ఏమి చేయాలి? (ప్రసం. 9:11, NW) ఫ్రన్సీస్కూ ఉదాహరణే తీసుకోండి. తాను తాకట్టు పెట్టింది విడిపించడం కోసం ఆయన దాదాపు 7000 డాలర్లు (3,08,000 రూపాయలు) ఆల్‌ఫ్రెడో దగ్గర అప్పు చేశాడు. కానీ కొన్ని వ్యాపార సమస్యల వల్ల సమయానికి అప్పు తీర్చలేకపోయాడు. కాబట్టి, ఆల్‌ఫ్రెడోతో ఆ విషయం గురించి మాట్లాడి, కొన్ని ఇన్‌స్టాల్మెంట్లలో ఆ అప్పును తీరుస్తానని చెప్పాడు. దానికి ఆయన ఒప్పుకున్నాడు.
తప్పుడు అభిప్రాయాన్ని కలిగించకండి
మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలోని దంపతులైన అననీయ సప్పీరాల చెడు ఉదాహరణను గుర్తుచేసుకోండి. వారు తమ పొలం అమ్మిన తర్వాత వచ్చిన దాంట్లో కొంత మాత్రమే అపొస్తలుల దగ్గరకు తీసుకువచ్చి, మొత్తం అంత డబ్బే వచ్చిందని చెప్పారు. ఎందుకంటే, అందరి ముందు తామెంతో ఔదార్యం గలవారిగా కనబడాలని అనుకున్నారు. అయితే అపొస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ సహాయంతో వారి మోసాన్ని బట్టబయలు చేశాడు. తర్వాత యెహోవా శిక్షించడం వల్ల వారు చనిపోయారు.—అపొ. 5:1-11.
వారికి భిన్నంగా, బైబిలును రాసిన వ్యక్తులు ఎంతో నిష్కపటంగా తమ తప్పులను కూడా రాశారు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోనందువల్లే వాగ్దాన దేశాన్ని చేరుకోలేకపోయానని మోషే నిజాయితీగా రాశాడు. (సంఖ్యా. 20:7-13) యోనా కూడా నీనెవె వారికి ప్రకటించక ముందూ ప్రకటించిన తర్వాతా తాను కనబరచిన బలహీనతలను దాచుకోకుండా రాశాడు.—యోనా 1:1-3; 4:1-3.
మంచి ఫలితాలు రావని తెలిసినా సత్యం చెప్పాలంటే తప్పకుండా ధైర్యం కావాలి. స్కూలుకు వెళ్లే 14 ఏళ్ల నాటౌయకు ఎదురైన అనుభవమే అందుకు ఓ మంచి ఉదాహరణ. తాను పరీక్షలో తప్పుగా రాసిన ఒక సమాధానానికి మాష్టారు టిక్కు పెట్టి మార్కులు వేశాడు. ఆ మార్కుల వల్ల తనకు మంచి గ్రేడు వస్తుందని తెలిసినా ఆ విషయాన్ని మాష్టారుకు చెప్పింది. ఆమె ఇలా అంది: “యెహోవాను సంతోషపెట్టాలంటే నేను నిజాయితీగా ఉండాలని నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడూ చెప్పేవారు. నేను ఆ విషయాన్ని మా మాష్టారుకు చెప్పకపోయుంటే నా మనస్సాక్షి నన్ను వేధించేది.” నాటౌయ నిజాయితీని వాళ్ల మాష్టారు మెచ్చుకున్నాడు.
నిజాయితీగా ఉంటే యెహోవాను ఘనపర్చగలుగుతాం
17 ఏళ్ల జీజెల్‌కు కొన్ని డాక్యుమెంట్లు, 35 డాలర్లు (దాదాపు 1,540 రూపాయలు) ఉన్న ఒక పర్సు దొరికింది. ఆ పర్సు ఎవరిదో ఆ వ్యక్తికి దాన్ని తిరిగి ఇవ్వమని స్కూలు యాజమాన్యాన్ని ఆమె కోరింది. ఒక నెల తర్వాత జీజెల్ నిజాయితీని, మతపరమైన మంచి క్రమశిక్షణతో పెంచినందుకు ఆమె తల్లిదండ్రులను మెచ్చుకుంటూ ఆ స్కూలు వైస్ ప్రిన్సిపాల్ తరగతిలో ఒక ఉత్తరం చదివాడు. ఆమె ‘సత్క్రియలు’ యెహోవాను మహిమపరిచాయి.—మత్త. 5:14-16.
“స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు,” అపనమ్మకస్థులు ఉన్న లోకంలో నిజాయితీగా ఉండాలంటే ఎంతో కృషి అవసరం. (2 తిమో. 3:2) అయితే మనకు యెహోవా పట్ల సరైన భయం, బైబిలు సూత్రాల ప్రకారం శిక్షణ పొందిన మనస్సాక్షి, సంతృప్తి అనేవి ఉంటే మోసంతో నిండిన ఈ లోకంలో నిజాయితీగా ఉండగలుగుతాం. అంతేకాక ‘నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు’ అయిన యెహోవాకు మనం మరింత దగ్గరవ్వగలుగుతాం.—కీర్త. 11:7.
[అధస్సూచి]
a కొన్ని అసలు పేర్లు కావు.
[7వ పేజీలోని చిత్రాలు]
యెహోవా పట్ల సరైన భయం ఉంటే నిజాయితీగా ఉండాలన్న మన కృతనిశ్చయం బలపడుతుంది
[8వ పేజీలోని చిత్రం]
మనం నిజాయితీగా ఉంటే యెహోవాను మహిమపర్చగలుగుతాం