కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవ కుటుంబ సభ్యులారా, ‘సిద్ధంగా ఉండండి’

క్రైస్తవ కుటుంబ సభ్యులారా, ‘సిద్ధంగా ఉండండి’

క్రైస్తవ కుటుంబ సభ్యులారా, ‘సిద్ధంగా ఉండండి’

“మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి.”—లూకా 12:40.

1, 2. ‘సిద్ధంగా ఉండండి’ అని యేసు ఇచ్చిన హెచ్చరికను మనమెందుకు లక్ష్యపెట్టాలి?

 ‘మనుష్యకుమారుడు తన మహిమతో వచ్చి జనములను’ వేరు చేసినప్పుడు మీకు, మీ కుటుంబానికి ఏమౌతుంది? (మత్త. 25:31, 32) మనం ఊహించని సమయంలో ఆయన వస్తాడు కాబట్టి ‘సిద్ధంగా ఉండండి’ అనే యేసు హెచ్చరికను లక్ష్యపెట్టడం ఎంతో అవసరం.—లూకా 12:40.

2 కుటుంబమంతా ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండేందుకు కుటుంబంలోని ప్రతీ ఒక్కరు తమ తమ బాధ్యతలను చక్కగా ఎలా నెరవేర్చవచ్చో ముందటి ఆర్టికల్‌లో చూశాం. మన కుటుంబ ఆధ్యాత్మిక శ్రేయస్సుకు దోహదపడడానికి మనం ఇంకా ఏమి చేయాలో ఇప్పుడు పరిశీలిద్దాం.

మీ కంటిని “తేటగా” ఉంచుకోండి

3, 4. (ఎ) కుటుంబాలు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? (బి) మన కంటిని “తేటగా” ఉంచుకోవడం అంటే ఏమిటి?

3 క్రీస్తు వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలంటే కుటుంబాలు ఇతర విషయాల కారణంగా సత్యారాధన నుండి పక్కదారిపట్టకుండా జాగ్రత్తపడాలి. చాలా కుటుంబాలు వస్తుసంపదల కోసం ప్రాకులాడడం అనే ఉరిలో చిక్కుకున్నాయి కాబట్టి, కంటిని “తేటగా” ఉంచుకోవడం గురించి యేసు ఏమి చెప్పాడో పరిశీలించండి. (మత్తయి 6:22, 23 చదవండి.) దీపం మన దారిని వెలుగుమయం చేసి మనం పడిపోకుండా నడవడానికి సహాయపడినట్లే, ‘మనోనేత్రాలు’ మనం తొట్రిల్లకుండా నడుచుకోవడానికి సహాయం చేస్తాయి.—ఎఫె. 1:17, 18.

4 ఓ వస్తువును స్పష్టంగా చూడాలంటే మన కళ్లు మంచిగా పనిచేయాలి, ఆ వస్తువు మీదే దృష్టి నిలపగలగాలి. మనోనేత్రాల విషయంలో కూడా అంతే. అవి తేటగా ఉంటేనే మనం ఒక లక్ష్యంపై దృష్టి నిలపగలుగుతాం, ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక విషయాలకే మొదటి స్థానం ఇవ్వగలుగుతాం. అంతేకాని వస్తుసంపదలకు ప్రాముఖ్యతనిస్తూ కుటుంబ అవసరాలు తీర్చడంలోనే మునిగిపోం. (మత్త. 6:33) అంటే మనకున్న వాటితో సంతృప్తి చెందుతూ దేవుని సేవకు మన జీవితాల్లో మొదటి స్థానమిస్తాం.—హెబ్రీ. 13:5.

5. ఒక యౌవనస్థురాలు ఎలా తన ‘కంటిని’ దేవుని సేవ మీదే నిలిపింది?

5 తమ కంటిని తేటగా ఉంచుకోవడానికి పిల్లలకు శిక్షణనిస్తే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు, ఇతియోపియా దేశంలోని ఓ యౌవనస్థురాలి విషయమే తీసుకోండి. ఆమె చదువుల్లో ఎంత బాగా రాణించిందంటే కనీస విద్య పూర్తైన తర్వాత పైచదువుల కోసం ఆమెకు స్కాలర్‌షిప్‌ ఇవ్వజూపారు. అయితే ఆమె యెహోవా సేవకే ప్రాముఖ్యత ఇచ్చింది కాబట్టి ఆ స్కాలర్‌షిప్‌ను నిరాకరించింది. ఆ తర్వాత కొంతకాలానికే నెలకు 3,000 యూరోలు (దాదాపు 1,80,000 రూపాయలు) జీతం వచ్చే ఉద్యోగంలో చేరే అవకాశం ఆమెకు లభించింది. ఆ దేశ సగటు వేతనంతో పోలిస్తే అది చాలా ఎక్కువ. అయితే ఆమె తన ‘కంటిని’ పయినీరు సేవ మీదే నిలిపింది. కాబట్టి తన తల్లిదండ్రులను సంప్రదించకుండానే ఆ ఉద్యోగాన్ని నిరాకరించింది. అది తెలిసినప్పుడు వారికి ఏమనిపించింది? వారు ఎంతో సంతోషించారు, తన విషయంలో గర్వపడుతున్నామని ఆమెకు చెప్పారు.

6, 7. ఏ ప్రమాదం విషయంలో మనం ‘జాగ్రత్తపడాలి’?

6 మత్తయి 6:22, 23లోని యేసు మాటల్లో, దురాశ గురించిన ఓ హెచ్చరిక కూడా కనిపిస్తుంది. “తేటగా” లేదా ‘సరళంగా’ లేని కన్ను గురించి చెప్పడానికి యేసు “సంశ్లిష్టమైన” అనే పదాన్ని కాక “చెడిన” అనే పదాన్ని ఉపయోగించాడు. ‘చెడిన కన్ను’ ‘దుష్టమైనది, అసూయగలది’ అంటే, లోభత్వం లేదా దురాశగలది. (మత్త. 6:23, NW అధస్సూచి) దురాశను లేదా లోభత్వాన్ని యెహోవా ఎలా పరిగణిస్తాడు? “మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని [లేక ‘దురాశేగాని,’ NW అధస్సూచి], వీటి పేరైనను ఎత్తకూడదు” అని బైబిలు చెబుతోంది.—ఎఫె. 5:3.

7 ఇతరులు దురాశాపరులైతే మనం తేలిగ్గా గుర్తిస్తాం కానీ ఆ లక్షణం మనలో ఉంటే మాత్రం అంత తేలిగ్గా గుర్తించలేం. కాబట్టి, “మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి” అని యేసు ఇచ్చిన సలహాను పాటించడం మంచిది. (లూకా 12:15) అంటే, మనం వేటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామో పరిశీలించుకోవాలి. వినోదానికి, ఉల్లాసానికి, వస్తుసంపాదనకు ఎంత సమయాన్ని, డబ్బును వెచ్చిస్తున్నారో క్రైస్తవ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.

8. వస్తువులను కొంటున్నప్పుడు ఏ విషయాల గురించి ఆలోచిస్తే మనం ‘జాగ్రత్తపడగలుగుతాం’?

8 ఏ వస్తువునైనా కొనే ముందు కేవలం దాన్ని కొనడానికి అవసరమైన డబ్బు మీ దగ్గర ఉందా అని ఆలోచిస్తే సరిపోదు. ఇలాంటి అంశాల గురించి కూడా ఆలోచించండి: ‘ఆ వస్తువును తరచూ ఉపయోగించడానికి, దాన్ని మంచి స్థితిలో ఉంచుకోవడానికి కావాల్సినంత సమయం నాకు ఉంటుందా? దాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకోవడానికి ఎంతకాలం పడుతుంది?’ యౌవనులారా, లోకంలోని వ్యాపార ప్రకటనలను నమ్మి ఖరీదైన బట్టలను, వస్తువులను కొనిపెట్టమని అనవసరంగా తల్లిదండ్రులను ఒత్తిడి చేయకండి. నిగ్రహాన్ని చూపించండి. ఫలాని వస్తువు కొనడం వల్ల మనుష్యకుమారుడు వచ్చినప్పుడు మీ కుటుంబం సిద్ధంగా ఉండగలుగుతుందా అని కూడా ఆలోచించండి. ఒక కుటుంబంగా మీరంతా యెహోవా చేసిన ఈ వాగ్ధానం మీద నమ్మకముంచండి: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.”—హెబ్రీ. 13:5.

ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి కృషిచేయండి

9. ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి కృషిచేస్తే కుటుంబాలు ఎలా ప్రయోజనం పొందుతాయి?

9 కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించడానికి కృషిచేయడం వల్ల కూడా వారి విశ్వాసం, ఆధ్యాత్మికత బలపడతాయి. అంతేకాక, వారు యెహోవాను ఎంతమేరకు సంతోషపెడుతున్నారో, తమ జీవితంలో ఏ విషయాలకు ప్రాముఖ్యతనివ్వాలో గుర్తించగలుగుతారు.—ఫిలిప్పీయులు 1:9, 10 చదవండి.

10, 11. కుటుంబంగా మీరు ఏ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నారు? ఏ లక్ష్యాలను పెట్టుకోవాలని అనుకుంటున్నారు?

10 కుటుంబ శిరస్సు కుటుంబంలోని ప్రతీ వ్యక్తి సాధించగల చిన్నచిన్న లక్ష్యాలను పెట్టడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉదాహరణకు, మీరు ప్రతీరోజు దినవచనాన్ని చర్చించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. కుటుంబ సభ్యులు చేసే వ్యాఖ్యానాలను బట్టి యెహోవా పట్ల, సత్యం పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో కుటుంబ శిరస్సు తెలుసుకోవచ్చు. కుటుంబమంతా కలిసి క్రమంగా బైబిలు చదవడం వల్ల పిల్లలు చక్కగా చదవడం నేర్చుకుంటారు, అందులోని సందేశాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. (కీర్త. 1:1, 2) అంతేకాక, మన ప్రార్థనలను మెరుగుపరచుకోవడానికి కృషిచేయవచ్చు. అలాగే, ఆత్మ ఫలంలోని వివిధ లక్షణాలను పెంపొందించుకోవాలనే చక్కని లక్ష్యాన్ని కూడా పెట్టుకోవచ్చు. (గల. 5:22, 23) అంతేకాక, పరిచర్యలో ప్రజలపట్ల ఇంకా ఎక్కువ సహానుభూతి ఎలా చూపించాలో కూడా ఆలోచించవచ్చు. కుటుంబంగా అలా చేస్తే పిల్లలు దయ చూపించడం నేర్చుకుంటారు. అలాగే వారు క్రమ పయినీర్లుగా లేదా మిషనరీలుగా సేవ చేయాలనే కోరికను పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

11 మీరు, మీ కుటుంబం సాధించగల కొన్ని లక్ష్యాల గురించి ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులు పరిచర్యలో ఇంకా ఎక్కువ సమయాన్ని వెచ్చించగలరా? టెలిఫోనులో, వీధిలో, వ్యాపార స్థలంలో సాక్ష్యమిచ్చే విషయంలో మీకున్న భయాలను తీసేసుకోవడానికి మీరు కృషిచేయగలరా? రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మీరు సేవ చేయగలరా? వేరే భాష మాట్లాడే ప్రజలకు సువార్త ప్రకటించగలిగేలా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కొత్త భాష నేర్చుకోగలరా?

12. తమ కుటుంబాలు ఆధ్యాత్మికంగా ఎదగడానికి కుటుంబ శిరస్సులు ఏమి చేయవచ్చు?

12 మీరు కుటుంబ శిరస్త్సెతే, మీ కుటుంబం ఇంకా ఏయే రంగాల్లో అభివృద్ధి సాధించగలదో ఆలోచించండి. అందుకు తోడ్పడే నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకోండి. మీ కుటుంబ పరిస్థితులను, సామర్థ్యాలను మనసులో ఉంచుకొని సాధించగలిగే లక్ష్యాలనే పెట్టుకోండి. (సామె. 13:12) ఏదైనా మంచి లక్ష్యాన్ని సాధించడానికి నిజంగానే సమయం పడుతుంది. కాబట్టి టీవీ చూడడం తగ్గించి ఆ సమయాన్ని ఆధ్యాత్మిక విషయాలకు ఉపయోగించడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. (ఎఫె. 5:15, 16) మీ కుటుంబం కోసం మీరు పెట్టిన లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేయండి. (గల. 6:9) ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి కృషిచేసే కుటుంబాల అభివృద్ధి “అందరికి తేటగా కనబడు[తుంది].”—1 తిమో. 4:15.

క్రమంగా కుటుంబ ఆరాధన చేయండి

13. సంఘ కూటాల విషయంలో ఏ మార్పు చేయబడింది? మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?

13 క్రీస్తు వచ్చినప్పుడు కుటుంబాలు ‘సిద్ధంగా ఉండడానికి,’ 2009 జనవరి 1వ తారీఖు నుండి కూటాల విషయంలో చేయబడిన మార్పు ఎంతగానో తోడ్పడుతుంది. గతంలో సంఘ పుస్తక అధ్యయనం అని పిలువబడిన కూటం ఇప్పుడు దైవపరిపాలన పరిచర్య పాఠశాల, సేవాకూటం జరిగే రోజే నిర్వహించబడుతుంది కాబట్టి దానికోసం ప్రత్యేకంగా మరో రోజు సమకూడాల్సిన అవసరం లేదు. క్రైస్తవులు వారంలో ఒక సాయంత్రాన్ని కుటుంబ ఆరాధనకు కేటాయించి, ఆధ్యాత్మికంగా బలపడేందుకు ఈ ఏర్పాటు చేయబడింది. ఆ మార్పు చేయబడి ఇప్పటికి కొంతకాలమైంది కాబట్టి ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘నేను ఆ సమయాన్ని కుటుంబ ఆరాధన కోసం లేక వ్యక్తిగత అధ్యయనం కోసం ఉపయోగిస్తున్నానా? ఈ ఏర్పాటు ఎందుకు చేయబడిందో గుర్తించి తగిన విధంగా కృషిచేస్తున్నానా?’

14. (ఎ) కుటుంబ ఆరాధన లేక వ్యక్తిగత అధ్యయనం ముఖ్య ఉద్దేశం ఏమిటి? (బి) అధ్యయనం కోసం మనం ప్రతీవారం ఎందుకు సమయాన్ని కేటాయించాలి?

14 మనం దేవునికి మరింత దగ్గరవ్వాలన్నదే కుటుంబ ఆరాధన లేక వ్యక్తిగత అధ్యయనం ముఖ్య ఉద్దేశం. (యాకో. 4:8) మనం క్రమంగా బైబిలు చదవడానికి సమయం వెచ్చిస్తూ సృష్టికర్త గురించి ఎక్కువగా తెలుసుకుంటే ఆయనతో మన సంబంధం బలపడుతుంది. మనం యెహోవాకు ఎంతగా దగ్గరైతే అంతగా మన ‘పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణవివేకంతో, పూర్ణబలంతో’ ఆయనను ప్రేమించాలని కోరుకుంటాం. (మార్కు 12:30) దేవునికి లోబడాలని, ఆయనను అనుకరించాలని మనం ఖచ్ఛితంగా కోరుకుంటాం. (ఎఫె. 5:1) త్వరలో ‘మహా శ్రమలు’ రాబోతున్నాయి కాబట్టి మన కుటుంబ సభ్యులందరూ ఆధ్యాత్మికంగా ‘సిద్ధంగా ఉండాలంటే’ క్రమంగా కుటుంబ ఆరాధన చేయడం ఎంతో అవసరం. (మత్త. 24:20, 21) అలా చేస్తేనే మనం రక్షించబడతాం.

15. కుటుంబ ఆరాధన వల్ల కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది?

15 కుటుంబ సభ్యులు ఒకరికొకరు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశంతో కూడా కుటుంబ ఆరాధన ఏర్పాటు చేయబడింది. ప్రతీవారం కుటుంబమంతా కలిసి ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చిస్తే కుటుంబ సభ్యుల్లో ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం కలుగుతుంది. దంపతులిద్దరూ కలిసి బైబిల్లోని విషయాలను నేర్చుకుంటే ఆనందాన్ని పొందుతారు, ఒకరికొకరు మరింత దగ్గరౌతారు. (ప్రసంగి 4:12 చదవండి.) తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఆరాధించడం వల్ల “పరిపూర్ణతకు అనుబంధమైన” ప్రేమను పెంచుకొని ఐక్యంగా ఉంటారు.—కొలొ. 3:14.

16. బైబిలు అధ్యయనం కోసం ఒక సాయంత్రాన్ని కేటాయించడం వల్ల ముగ్గురు క్రైస్తవ సహోదరీలు ఎలా ప్రయోజనం పొందుతున్నారో వివరించండి.

16 బైబిలు అధ్యయనం కోసం ఒక సాయంత్రాన్ని కేటాయించడం వల్ల ముగ్గురు క్రైస్తవ సహోదరీలు ఎలా ప్రయోజనం పొందుతున్నారో పరిశీలించండి. ఈ ముగ్గురు వృద్ధ విధవరాండ్రు బంధువులు కాకపోయినా ఒకే నగరంలో జీవించేవారు, ఎన్నో సంవత్సరాల నుండి మంచి స్నేహితులు. తాము కలిసి ఎక్కువ సమయం గడపాలని, ఆ సమయాన్ని మామూలు విషయాల కోసమే కాక ఆధ్యాత్మిక విషయాల కోసం కూడా వెచ్చించాలని వారు అనుకున్నారు. కాబట్టి వారు కలిసి బైబిలు అధ్యయనం చేయడానికి ఒక సాయంత్రాన్ని కేటాయించుకున్నారు. వారు దేవుని రాజ్యం గురించి ‘సమగ్ర సాక్ష్యమివ్వండి’ (ఆంగ్లం) అనే పుస్తకాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. వారిలో ఒక సహోదరి ఇలా చెబుతోంది: “మేము ఆ సమయాన్ని ఎంత సంతోషంగా గడుపుతామంటే మా అధ్యయనం గంట కన్నా ఎక్కువసేపు సాగుతుంది. మొదటి శతాబ్దంలోని మన సహోదరులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఊహించుకొని, అలాంటి పరిస్థితులు ఎదురైతే మేము ఏమి చేస్తామో చర్చించుకుంటాం. నేర్చుకున్న వాటిని పరిచర్యలో ఉపయోగించడానికి ప్రయత్నిస్తాం. దానివల్ల రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో మునుపటికన్నా ఎక్కువ సంతోషాన్ని, మంచి ఫలితాలను పొందుతున్నాం.” ఈ ఏర్పాటు వల్ల వారు ఆధ్యాత్మికంగా బలపడడమేకాక ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు. వారు ఇలా అంటున్నారు: “ఈ ఏర్పాటును మేము ఎంతో విలువైనదిగా ఎంచుతున్నాం.”

17. కుటుంబ ఆరాధన సరిగ్గా జరగాలంటే ఏమి చేయాలి?

17 మరి మీ విషయమేమిటి? కుటుంబ ఆరాధన కోసం లేక వ్యక్తిగత అధ్యయనం కోసం ఒక సాయంత్రాన్ని కేటాయించడం వల్ల మీరెలా ప్రయోజనం పొందుతున్నారు? మనకు వీలైనప్పుడు మాత్రమే కుటుంబ ఆరాధన చేస్తే దాని నుండి పూర్తిగా ప్రయోజనం పొందలేం. నిర్ణయించుకున్న సమయంలో అధ్యయనం చేయడానికి కుటుంబంలోని ప్రతీ వ్యక్తి సిద్ధంగా ఉండాలి. చిన్నచిన్న విషయాల వల్ల దానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులకు ఉపయోగపడే సమాచారాన్ని ఎంచుకొని అధ్యయనం చేయాలి. చక్కని బోధనా పద్ధతులను ఉపయోగిస్తూ, గౌరవపూర్వకమైన ప్రశాంతమైన వాతావరణంలో అధ్యయనాన్ని నిర్వహిస్తే కుటుంబ సభ్యులందరూ ఆనందించగలుగుతారు.—యాకో. 3:18. a

‘మెలకువగా ఉంటూ సిద్ధంగా ఉండండి’

18, 19. మనుష్యకుమారుడు త్వరలో వస్తాడని తెలుసుకున్నారు కాబట్టి మీరు, మీ కుటుంబం ఏమి చేయాలి?

18 అంతకంతకూ దిగజారుతున్న నేటి లోక పరిస్థితులను చూస్తే 1914 నుండి సాతాను దుష్టవిధానానికి అంత్యదినాలు మొదలయ్యాయని తెలుస్తుంది. హార్‌మెగిద్దోను కారుమేఘాలు కమ్ముకొస్తున్నాయి. త్వరలోనే భక్తిహీనులపై యెహోవా తీర్పును అమలుచేయడానికి మనుష్యకుమారుడు వస్తాడు. (కీర్త. 37:10; సామె. 2:21, 22) కాబట్టి మీరు, మీ కుటుంబం ఏమి చేయాలి?

19 కంటిని “తేటగా” ఉంచుకోమని యేసు ఇచ్చిన సలహాను మీరు పాటిస్తున్నారా? లోకంలోని ప్రజలు ధనం, పేరుప్రతిష్ఠలు, అధికారం వంటి వాటికోసం ప్రాకులాడుతుండగా మీ కుటుంబం ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి కృషిచేస్తోందా? మీరు క్రమంగా కుటుంబ ఆరాధన లేక వ్యక్తిగత అధ్యయనం చేయగలుగుతున్నారా? దానివల్ల మీ కుటుంబం యెహోవాకు మరింత దగ్గరయ్యిందా, కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడిందా? ముందటి ఆర్టికల్‌లో చర్చించినట్లు భర్తగా, భార్యగా, పిల్లలుగా మీకు దేవుడు ఇచ్చిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తూ కుటుంబమంతా ‘మెలకువగా ఉండడానికి’ తోడ్పడుతున్నారా? (1 థెస్స. 5:6) అలా చేస్తే మనుష్యకుమారుడు వచ్చినప్పుడు మీరు ‘సిద్ధంగా ఉంటారు.’

[అధస్సూచి]

a కుటుంబ ఆరాధనలో ఏ సమాచారాన్ని పరిశీలించవచ్చు? దాని నుండి ప్రయోజనం పొందడానికి, దాన్ని ఆనందించడానికి ఏమి చేయవచ్చు? ఈ విషయాలకు సంబంధించిన సలహాల కోసం కావలికోట అక్టోబరు 15, 2009 సంచికలోని 29-31 పేజీలు చూడండి.

మీరేమి నేర్చుకున్నారు?

• క్రైస్తవ కుటుంబాలు ‘సిద్ధంగా ఉండడానికి’ కింది మూడు విషయాలు ఎలా సహాయం చేస్తాయి?

కంటిని “తేటగా” ఉంచుకోవడం.

ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకొని, వాటిని సాధించడం.

క్రమంగా కుటుంబ ఆరాధన చేయడం.

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రం]

కంటిని “తేటగా” ఉంచుకుంటే మనం లోకంలోని ఆకర్షణల వల్ల పక్కదారిపట్టం