కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘బహుమానం పొందేలా పరుగెత్తండి’

‘బహుమానం పొందేలా పరుగెత్తండి’

‘బహుమానం పొందేలా పరుగెత్తండి’

“మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.”—1 కొరిం. 9:24.

1, 2. (ఎ) పౌలు దేన్ని ఉదాహరణగా తీసుకొని హెబ్రీ క్రైస్తవులను ప్రోత్సహించాడు? (బి) మనం ఏమి చేయాలని ఆయన చెప్పాడు?

 పౌలు పరుగుపందెమును ఉదాహరణగా తీసుకొని హెబ్రీ క్రైస్తవులను ప్రోత్సహించాడు. వాళ్ళు పందెంలో పరుగెత్తే వ్యక్తుల్లాంటివాళ్ళని ఆయన వాళ్ళకు రాసిన ఉత్తరంలో చెప్పాడు. అయితే ఆ పందెంలో వాళ్ళతోపాటు వేరేవాళ్ళు కూడా ఉన్నారని పౌలు వాళ్ళకు గుర్తుచేశాడు. గతంలో యెహోవా నమ్మకమైన సేవకులు ఎంతోమంది ఆ పందెమును పూర్తిచేశారు. వాళ్ళు ‘మేఘమువలె ఆవరించియున్న గొప్ప సాక్షి సమూహములా’ ఉన్నారని పౌలు అన్నాడు. ఆ నమ్మకమైన సేవకులు విశ్వాసంతో చేసిన పనులను, కృషిని హెబ్రీ క్రైస్తవులు ఎప్పుడూ గుర్తుంచుకుంటే పందెమును పూర్తిచేయాలని గట్టిగా నిర్ణయించుకోగలుగుతారు.

2 యెహోవా నమ్మకమైన సేవకుల్లో కొంతమంది గురించి ముందటి ఆర్టికల్‌లో చర్చించాం. వాళ్ళకు దేవునిపై బలమైన విశ్వాసం ఉన్నందువల్ల వాళ్ళు చనిపోయేంతవరకు ఆయన పట్ల యథార్థంగా ఉండగలిగారు. వాళ్ళు పందెం పూర్తయ్యేంతవరకు పరుగెత్తారు. వాళ్ళలాగే మనం కూడా పందెమును ఎలా పూర్తిచేయవచ్చు? పౌలు ఇలా రాశాడు: “మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి . . . మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.”—హెబ్రీ. 12:1, 2.

3. గ్రీసు దేశస్థుల పరుగుపందాల్లో పాల్గొనేవాళ్ళ గురించి పౌలు చెప్పిన మాటల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

3 ‘ప్రతీ భారాన్ని విడిచిపెట్టాలి’ అని పౌలు ఎందుకు అన్నాడు? పౌలు కాలంలోని క్రైస్తవుల గురించి తెలియజేస్తున్న బ్యాక్‌గ్రౌండ్స్‌ ఆఫ్‌ అర్లీ క్రిస్టియానిటీ అనే పుస్తకం ఆ కాలంలోని పరుగుపందాల్లో ప్రజలు ఎలా పరుగెత్తేవాళ్ళో చెబుతోంది. దానిలో ఇలా ఉంది: “గ్రీసు దేశస్థులు ఒంటిమీద బట్టలు లేకుండానే సాధన చేసేవాళ్ళు, పోటీలో పాల్గొనేవాళ్ళు.” a ఈ రోజుల్లో అలా పరుగెత్తడం సరైనది కాదనిపించవచ్చు. అయితే అప్పటివాళ్ళు బహుమానాన్ని పొందకుండా ఏదీ తమను అడ్డగించకూడదని అలా పరుగెత్తేవాళ్ళు. కాబట్టి, నిరంతర జీవితమనే బహుమానాన్ని పొందకుండా చేసే దేన్నైనా తమ జీవితంలో పక్కనబెట్టాల్సిందే అనే ఉద్దేశంతో ‘ప్రతీ భారాన్ని విడిచిపెట్టాలి’ అని పౌలు హెబ్రీ క్రైస్తవులతో అన్నాడు. ఆ సలహా అప్పటి హెబ్రీ క్రైస్తవులకే కాదు ఇప్పుడు మనకు కూడా మంచిదే. అయితే మన జీవితంలో ఏవి ‘భారంగా’ ఉండి మనం పరుగుపందెమును పూర్తిచేయకుండా అడ్డుకోవచ్చు?

‘ప్రతీ భారాన్ని విడిచిపెట్టాలి’

4. నోవహు కాలంలోని ప్రజలు అప్పుడు ఏమి చేస్తున్నారు?

4 ‘ప్రతీ భారాన్ని విడిచిపెట్టాలి’ అని పౌలు అన్నాడు. పందెంలో ఏకాగ్రత నిలపకుండా చేసి, దాన్ని పూర్తిచేయడానికి మనం శాయశక్తులా కృషి చేయకుండా అడ్డగించేది ఏదైనా ‘భారమే.’ ఇంతకీ ఏవి మనకు భారంగా ఉండగలవు? యేసు మాటలను పరిశీలిస్తే అవేమిటో తెలుసుకోవచ్చు. ఆయన నోవహు కాలం గురించి మాట్లాడాడు. విశ్వాసంగల వ్యక్తుల గురించి పౌలు ప్రస్తావించిన వాళ్ళలో నోవహు కూడా ఉన్నాడు. “నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును” అని యేసు వివరించాడు. (లూకా 17:26) నోవహు కాలంలోని ప్రపంచం అంతమైంది, మనకాలంలోని ప్రపంచం కూడా అంతమౌతుందన్నది నిజమే. అయితే, నోవహు కాలంలో జలప్రళయానికి ముందు ప్రజలు ఎలా ఉండేవారో మన కాలంలో కూడా అలాగే ఉంటారని యేసు వివరించాడు. (మత్తయి 24:37-39 చదవండి.) నోవహు కాలంలో చాలామంది దేవుని గురించి తెలుసుకోవాలనుకోలేదు, ఆయనకు ఇష్టమైన విధంగా జీవించాలనుకోలేదు. ఆ ప్రజలు అప్పుడు ఏమి చేస్తున్నారు? తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ విషయాలు జీవితంలో సర్వసాధారణమైనవే. కానీ, అప్పటి ప్రజలకు దేవుని సందేశాన్ని వినడం కన్నా అవే ప్రాముఖ్యమైనవైపోయాయి. అందుకే, వాళ్ళు “ఎరుగక పోయిరి” అని యేసు అన్నాడు. అంటే వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు.

5. పరుగుపందెమును విజయవంతంగా పూర్తిచేయడానికి మనకు ఏమి సహాయం చేస్తుంది?

5 నోవహుకు, ఆయన కుటుంబ సభ్యులకు ఉన్నట్లే మనకు కూడా ప్రతీరోజు ఎంతో పని ఉంటుంది. డబ్బు సంపాదించుకోవడానికి కష్టపడి పనిచేయాలి. మన గురించి, మన కుటుంబం గురించి శ్రద్ధ తీసుకోవాలి. దీనికోసం మనం ఎంతో సమయాన్ని, శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే, మన జీవిత అవసరాల గురించి మనం ఆందోళనపడే అవకాశముంది. అంతేకాక, మనం మన జీవితాలను యెహోవాకు సమర్పించుకున్నాం కాబట్టి ప్రకటించడం, కూటాలకు సిద్ధపడి వాటికి హాజరవడం, కుటుంబంతో బైబిలు అధ్యయనం చేయడం, వ్యక్తిగత అధ్యయనం చేయడం వంటి ప్రాముఖ్యమైన ఇతర బాధ్యతలు మనకు ఉంటాయి. దేవుని సేవలో నోవహు చేయాల్సింది ఎంతో ఉన్నా, ఆయన యెహోవా చెప్పిన ప్రతీదాన్ని ‘చేశాడు.’ (ఆది. 6:22) మనం కూడా యెహోవా చెప్పిన ప్రతీదాన్ని చేసి పందెమును పూర్తిచేయాలని కోరుకుంటున్నట్లయితే, ఆ పందెమును పూర్తిచేయకుండా మనల్ని అడ్డగించే ఎలాంటి భారాన్నైనా విడిచిపెట్టడం చాలా ప్రాముఖ్యం.

6, 7. యేసు చెప్పిన ఏ మాటల్ని మనమెప్పుడూ గుర్తుంచుకోవాలి?

6 ‘ప్రతీ భారాన్ని విడిచిపెట్టాలి’ అని పౌలు ఏ ఉద్దేశంతో అన్నాడు? జీవితంలో మనకున్న ప్రతీ బాధ్యతను విడిచిపెట్టాలనే ఉద్దేశంతో ఆయన అలా చెప్పలేదు. ఎందుకంటే, కొన్ని బాధ్యతలు ప్రాముఖ్యమైనవి. అయితే జీవితావసరాల గురించి యేసు ఏమి చెప్పాడో గుర్తుంచుకోండి. “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.” (మత్త. 6:31, 32) ఒకవేళ తిండి, బట్ట వంటి జీవితావసరాల గురించే ఎక్కువగా ఆలోచిస్తే అలాంటివి కూడా మనకు భారంగా తయారయ్యే ప్రమాదముందని యేసు మాటల నుండి మనం అర్థంచేసుకోవచ్చు. వాటివల్ల మనం పందెంలో పరుగెత్తకుండా ఆగిపోయే ప్రమాదముంది.

7 “ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును” అని యేసు చెప్పాడని గుర్తుంచుకోండి. మన తండ్రియైన యెహోవా మనకు అవసరమైనవాటిని ఇస్తాడని ఆ మాటల నుండి తెలుస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ‘ఇవన్నీ’ అనే మాట మనం కోరుకున్న ప్రతీదాన్ని సూచించకపోవచ్చు. అయినా ‘అన్యజనులు విచారించే విషయాల’ గురించి మనం విచారించకూడదని యేసు చెప్పాడు. ఎందుకు? ఆ తర్వాత ఆయన తన శ్రోతలతో ఇలా అన్నాడు, “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.”—లూకా 21:34, 35.

8. మనం ఇప్పుడు ఎందుకు ‘ప్రతీ భారాన్ని విడిచిపెట్టాలి’?

8 మన పరుగుపందెంలో గమ్యాన్ని సూచించే గీత చాలా దగ్గర్లో ఉంది. కాబట్టి పందెమును పూర్తిచేయడానికి దేన్నీ అడ్డురానివ్వకూడదని కోరుకుంటాం. అందుకే, మనం ‘ప్రతీ భారాన్ని విడిచిపెట్టాలి.’ మనం జీవితావసరాలను తీర్చుకోవడంతో తృప్తిచెందాలి. “సంతుష్టి సహితమైన దైవభక్తి” కలిగివుండాలని అపొస్తలుడైన పౌలు రాసిన మాటల్లో ఉన్న సలహా అదే. (1 తిమో. 6:6) కాబట్టి మనం పౌలు ఇచ్చిన సలహాను పాటిస్తే, పందెంలో బహుమానాన్ని గెల్చుకోవడం చాలా సులభమౌతుంది.

“సుళువుగా చిక్కులబెట్టు పాపము”

9, 10. (ఎ) మనలను సుళువుగా చిక్కులబెట్టే పాపము ఏది? (బి) క్రైస్తవుల విశ్వాసానికి ఏమి జరిగే ప్రమాదముంది?

9 ‘సుళువుగా చిక్కులబెట్టు పాపాన్ని’ కూడా మనం విడిచిపెట్టాలని పౌలు చెప్పాడు. “సుళువుగా చిక్కులబెట్టు” అని అనువదించబడిన గ్రీకు పదం, బైబిలంతటిలో ఈ ఒక్క వచనంలోనే కనిపిస్తుంది. ఆల్బర్ట్‌ బార్నెస్‌ అనే బైబిలు పండితుడు ఇలా చెప్పాడు, “ఆ కాలంలో పరుగుపందెంలో పాల్గొనే వ్యక్తులు, కాళ్ళకు చుట్టుకుపోయి పరుగెత్తడాన్ని కష్టతరం చేసేలాంటి బట్టలు వేసుకునేవాళ్ళుకాదు. అలాగే క్రైస్తవులు కూడా క్రైస్తవ పరుగుపందెంలో పరుగెత్తడాన్ని కష్టతరం చేసే దేన్నీ అడ్డురానివ్వకూడదు.” క్రైస్తవులు తమను చిక్కుల్లో పడవేసే దేన్నైనా అంటే తమ విశ్వాసాన్ని బలహీనపర్చే లేదా చివరకు విశ్వాసం కోల్పోయేలా చేసే దేన్నైనా అడ్డురానివ్వకూడదు. ఇంతకీ క్రైస్తవులు ఎలా తమ విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది?

10 క్రైస్తవులు తమ విశ్వాసాన్ని అకస్మాత్తుగా కోల్పోరు. అది మెల్లమెల్లగా జరుగుతుంది, తమ విశ్వాసం రోజురోజుకూ బలహీనమైపోతుందని వాళ్ళకు తెలియకపోవచ్చు. హెబ్రీ క్రైస్తవులకు రాసిన పత్రిక మొదట్లో పౌలు ఆ ప్రమాదం గురించే హెచ్చరించాడు. విశ్వాసం నుండి “కొట్టుకొనిపోకుండునట్లు” జాగ్రత్తపడాలని, “విశ్వాసములేని దుష్టహృదయము” ఎన్నడూ పెంపొందించుకోకుండా జాగ్రత్తపడాలని ఆయన చెప్పాడు. (హెబ్రీ. 2:1; 3:12) ఒకవేళ పందెంలో పాల్గొనే వ్యక్తి, కాళ్ళకు చుట్టుకుపోయే బట్టలు వేసుకొని పరుగెత్తితే కింద పడిపోతాడు. కాబట్టి పందెంలో పరుగెత్తడానికి తగని బట్టలు వేసుకుంటే కిందపడిపోతామని వాళ్ళు గుర్తించాలి. పందెంలో పాల్గొనే వ్యక్తి ఈ ప్రమాదాన్ని పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఎప్పుడు రావచ్చు? అజాగ్రత్తగా ఉన్నప్పుడు అంటే, ఎవరైనా హెచ్చరించినప్పటికీ దాన్ని పట్టించుకోనప్పుడు ఆ పరిస్థితి రావచ్చు. లేదా మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని చూపించినప్పుడు అంటే, తాను బలవంతుడిననీ అస్సలు పడిపోననీ అనుకున్నప్పుడు కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. లేదా ఆయన గమ్యంపై మనసు నిలపకపోయినప్పుడు అంటే, ఇతర విషయాల గురించే ఆలోచిస్తూ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి రావచ్చు. పౌలు ఇచ్చిన సలహా అంతటి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

11. దేనివల్ల మనం విశ్వాసం కోల్పోయే ప్రమాదముంది?

11 క్రైస్తవులు కొన్నిసార్లు తాము చేసే పనుల వల్లే విశ్వాసాన్ని కోల్పోతారని మనం ఎన్నడూ మరచిపోకూడదు. “సుళువుగా చిక్కులబెట్టే పాపము” గురించి మరో పండితుడు కూడా మాట్లాడాడు. మన పరిస్థితులు, మన స్నేహితులు, మన తప్పుడు కోరికలు మనపై బలమైన ప్రభావం చూపిస్తాయని ఆయన వివరించాడు. అవి మన విశ్వాసాన్ని బలహీనపర్చగలవు లేదా చివరకు విశ్వాసం కోల్పోయేలా చేయగలవు.—మత్త. 13:3-9.

12. విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే ఏ హెచ్చరికల్ని లక్ష్యపెట్టడం ప్రాముఖ్యం?

12 మనం చూసేవి, వినేవి మన ఆలోచనలపై, కోరికలపై ప్రభావం చూపిస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా ఎంచుకోమని నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి హెచ్చరిస్తూనే ఉంది. ఎక్కువ డబ్బు, ఎక్కువ వస్తువులు కావాలని ఆశించడం వల్ల వచ్చే ప్రమాదం గురించి కూడా దాసుని తరగతి హెచ్చరించింది. ఈ లోకంలోని వినోదాన్ని ప్రేమించి లేదా ప్రతీ అధునాతన పరికరం కావాలని కోరుకొని వాటికే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే అత్యంత ప్రాముఖ్యమైన విషయాల గురించి ఆలోచించడానికి సమయం ఉండదు. దాసుని తరగతి ఎక్కువ కట్టుబాట్లు విధిస్తోందనుకొని అదిచ్చే హెచ్చరికల్ని నిరాకరించడం ప్రమాదకరం. మనకు చాలా విశ్వాసం ఉంది కాబట్టి ఆ హెచ్చరికలు మనకు కాదు ఇతరులకే అని మనం అనుకోకూడదు. సాతాను ఈ లోకపు ఆలోచనా తీరును, కోరికలను ఉపయోగించి మనం ఆ హెచ్చరికల్ని పట్టించుకోకుండా చేస్తాడు. మనం పరుగుపందెమును పూర్తిచేయడం సాతానుకు ఇష్టం లేదు. కొంతమంది అజాగ్రత్తగా ఉన్నందుకు, మితిమీరిన ఆత్మ విశ్వాసం చూపించినందుకు లేదా లోక సంబంధ విషయాల వల్ల గమ్యంపై మనసు నిలపకపోయినందుకు తమ విశ్వాసాన్ని కోల్పోయారు. ఒకవేళ మనకు అలా జరిగితే నిరంతర జీవితమనే బహుమానాన్ని పోగొట్టుకునే ప్రమాదముంది.—1 యోహా. 2:15-17.

13. లోకంలోని ప్రజల్లా ఆలోచించకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి?

13 ప్రతీరోజు సాతాను లోకంలోని ప్రజలు మనం కూడా వాళ్ళలాగే ఆలోచించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకు ప్రాముఖ్యమనిపించిన విషయాల్నే మనం కూడా ప్రాముఖ్యమైనవిగా ఎంచాలని కోరుకుంటారు. మనం కూడా వాళ్ళలాగే ప్రవర్తించాలని కోరుకుంటారు. (ఎఫెసీయులు 2:1, 2 చదవండి.) అయితే, లోక ప్రజల ఆలోచన మనపై ప్రభావం చూపించడానికి మనం అనుమతించాలో వద్దో నిర్ణయించుకునే అవకాశం మనకుంది. వాళ్ళ ఆలోచన మన చుట్టూ ఉన్న గాలిలాంటిదని పౌలు అన్నాడు. అయితే అది విషపూరితమైనది. మనం ఎలాగైతే విషపూరితమైన గాలిని పీల్చుకోకూడదని కోరుకుంటామో అలాగే లోక ప్రజల ఆలోచనా తీరు వల్ల మన ఆలోచన మారకుండా జాగ్రత్తపడాలని కోరుకోవాలి. పందెంలో పరుగెత్తుతూ ఉండాలంటే మనమేమి చేయాలి? చివరివరకు పందెంలో పరుగెత్తినవాళ్ళలో చక్కని మాదిరిగావున్న యేసును అనుకరించాలి. (హెబ్రీ. 12:1, 2) ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు కూడా మంచి మాదిరే. ఆయన కూడా చివరివరకు పందెంలో పరుగెత్తాడు, తన మాదిరిని అనుకరించమని తోటి సహోదరులను ప్రోత్సహించాడు.—1 కొరిం. 11:1; ఫిలి. 3:14.

బహుమానాన్ని ఎలా ‘పొందవచ్చు’?

14. పరుగుపందెమును పూర్తిచేయడాన్ని పౌలు ఎంత ప్రాముఖ్యమైనదిగా ఎంచాడు?

14 పరుగుపందెమును పూర్తిచేయడాన్ని పౌలు ఎంత ప్రాముఖ్యమైనదిగా ఎంచాడు? చివరిసారిగా ఎఫెసు పెద్దలతో మాట్లాడినప్పుడు పౌలు ఇలా అన్నాడు, “నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.” (అపొ. 20:24) కాబట్టి, పరుగుపందెమును పూర్తిచేయడానికి పౌలు తన ప్రాణాలతో సహా దేన్నైనా త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు. సువార్త ప్రకటించడానికి పౌలు ఎంతో కృషి చేశాడు. ఒకవేళ తాను పందెమును పూర్తిచేయకపోతే తన కృషి అంతా వ్యర్థమైపోతుందని ఆయన అన్నాడు. చివరివరకు చాలా కష్టపడుతూ ఉండాలని ఆయనకు తెలుసు. బహుమానాన్ని అప్పటికే గెల్చేసుకున్నానని ఆయన అనుకోలేదు. (ఫిలిప్పీయులు 3:12, 13 చదవండి.) అయితే చనిపోవడానికి కొంతకాలం ముందు ఆయన ఇలా అనగలిగాడు, “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.”—2 తిమో. 4:7.

15. ఏమి చేయమని పౌలు తన తోటి సహోదరులను ప్రోత్సహించాడు?

15 తన తోటి సహోదరులు కూడా పరుగుపందెమును పూర్తిచేయాలని పౌలు కోరుకున్నాడు. సొంత రక్షణ కోసం కృషి చేయమని ఫిలిప్పీయులను ఆయన ప్రోత్సహించాడు. “జీవవాక్యమును” గట్టిగా “పట్టుకొని” ఉండాలని ఆయన వాళ్ళకు గుర్తుచేశాడు. అలా చేయడం తనకెందుకు ప్రాముఖ్యమో చెబుతూ ఇలా అన్నాడు, “నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయకారణము కలుగును.” (ఫిలి. 2:16) ఆయన కొరింథులోని క్రైస్తవులను కూడా ఇలా ప్రోత్సహించాడు, “మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.”—1 కొరిం. 9:24.

16. నిజంగానే బహుమానాన్ని పొందుతామని మనం ఎందుకు నమ్మాలి?

16 మారథన్‌ రేసులో గమ్యాన్ని సూచించే గీత గమ్యస్థానానికి చేరువయ్యేంతవరకు కనిపించదు. కానీ పరుగెత్తే వ్యక్తి దాన్ని మనసులో ఉంచుకుంటాడు కాబట్టి దానికి తాను దగ్గరౌతున్నట్లు గ్రహిస్తాడు. అంతేకాక, పరుగుపందెం ముగుస్తుందని గుర్తించినప్పుడు ఆయన దాన్ని పూర్తిచేయాలని మరింత గట్టిగా నిర్ణయించుకుంటాడు. క్రైస్తవ పరుగుపందెం కూడా అలాంటిదే. నిజంగానే బహుమానాన్ని పొందుతామని మనం నమ్మాలి. అలా నమ్మితే పరుగుపందెమును పూర్తిచేసి బహుమానాన్ని గెల్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకోగలుగుతాం.

17. నిజంగానే బహుమానాన్ని పొందుతామని నమ్మేందుకు విశ్వాసం మనకు ఎలా సహాయం చేస్తుంది?

17 పౌలు ఇలా రాశాడు, “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.” (హెబ్రీ. 11:1) అబ్రాహాము, శారా సౌకర్యవంతమైన తమ ఊరును వదిలేసి ‘పరదేశుల్లా, యాత్రికుల్లా’ జీవించడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు ఎలా ఆ విధంగా జీవించగలిగారు? దేవుని వాగ్దానాలు నెరవేరతాయని వాళ్ళు నమ్మారు. వాళ్ళు ఆ వాగ్దానాల నెరవేర్పును ‘దూరమునుండి చూశారు.’ మోషే ‘అల్పకాల పాపభోగాన్ని, ఐగుప్తు ధనాన్ని’ నిరాకరించాడు. అలా చేయడానికి కావాల్సిన విశ్వాసం, ధైర్యం ఆయనకు ఎలా వచ్చాయి? ఆయన “ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.” (హెబ్రీ. 11:8-13, 24-26) పైన ప్రస్తావించిన వాళ్ళందరూ ‘విశ్వాసంతో’ నడుచుకున్నారని పౌలు అన్నాడు. వాళ్ళకు బలమైన విశ్వాసం ఉండేది కాబట్టి నిజంగానే బహుమానాన్ని పొందుతామని నమ్మారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా వాళ్ళు బహుమానాన్ని మరచిపోలేదు. తమకు దేవుడు సహాయం చేస్తున్నాడని, భవిష్యత్తుకు సంబంధించి తాను చేసిన వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడని వాళ్ళకు తెలుసు.

18. పందెంలో చివరివరకు పరుగెత్తాలంటే ఏమి చేయాలి?

18 హెబ్రీయులకు రాసిన పత్రికలోని 11వ అధ్యాయంలో ప్రస్తావించబడిన నమ్మకమైన స్త్రీపురుషుల గురించి లోతుగా ఆలోచించి వాళ్ళ మాదిరిని అనుకరించవచ్చు. అలా చేస్తే మనం మన విశ్వాసాన్ని బలపర్చుకొని “సుళువుగా చిక్కులబెట్టు పాపమును” విడిచిపెట్టగలుగుతాం. (హెబ్రీ. 12:1) తమ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి కృషి చేస్తున్న సహోదరులతో సమకూడడం ద్వారా మనం ‘ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరం పురికొల్పుకోగలుగుతాం.’—హెబ్రీ. 10:24, 25.

19. పందెంలో మన పరుగును కొనసాగించడం ఇప్పుడు ఎందుకు ప్రాముఖ్యం?

19 క్రైస్తవ పరుగుపందెం ముగింపుకు వచ్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే గమ్యాన్ని సూచించే గీత మనకు కనిపిస్తోంది. యెహోవా మనకు సహాయం చేస్తాడు, మనకు ఆయనపై బలమైన విశ్వాసం ఉంది కాబట్టి, ‘ప్రతీ భారాన్ని, సుళువుగా చిక్కులబెట్టు పాపాన్ని విడిచిపెట్టగలుగుతాం,’ పందెంలో మన పరుగును కొనసాగించగలుగుతాం, మన తండ్రియైన యెహోవా మనకు వాగ్దానం చేసిన బహుమానాన్ని పొందగలుగుతాం.

[అధస్సూచి]

a అది చాలా విభ్రాంతికరమైనదని ప్రాచీన యూదులు అనుకునేవాళ్ళు. గ్రీసు దేశస్థులకు ఉన్నట్లే యెరూషలేములో కూడా ఒక క్రీడాగృహాన్ని నిర్మించాలని మతభ్రష్ట ప్రధాన యాజకుడైన యాసోను కోరినప్పుడు చాలామంది యూదులకు కోపమొచ్చిందని ఒక ప్రాచీన గ్రంథం చెబుతోంది.—మక్కబీయులు రెండవ గ్రంథము 4:7-17.

మీకు గుర్తున్నాయా?

• మనం ‘ప్రతీ భారాన్ని విడిచిపెట్టాలంటే’ ఏమి చేయాలి?

• క్రైస్తవులు ఎలా తమ విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదముంది?

• మనం ఎందుకు బహుమానంపై మనసు నిలపాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[23వ పేజీలోని చిత్రం]

మనల్ని “సుళువుగా చిక్కులబెట్టు పాపము” ఏది? అది మనల్ని ఎలా చిక్కులో పడవేయగలదు?