‘దుఃఖిస్తున్న వాళ్ళందర్నీ ఓదార్చండి’
‘దుఃఖిస్తున్న వాళ్ళందర్నీ ఓదార్చండి’
‘దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకు యెహోవా నన్ను అభిషేకించెను.’—యెష. 61:1, 2.
1. దుఃఖిస్తున్న వాళ్ళ విషయంలో యేసు ఏమి చేశాడు? ఎందుకు అలా చేశాడు?
యేసుక్రీస్తు ఇలా అన్నాడు, “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.” (యోహా. 4:34) యెహోవా యేసుకు ఒక పని అప్పగించాడు. యేసు ఆ పని చేస్తున్నప్పుడు, ప్రజలపై తన తండ్రి చూపించినలాంటి ప్రేమనే చూపించాడు. (1 యోహా. 4:7-10) అపొస్తలుడైన పౌలు, యెహోవా ప్రేమ చూపించే ఒక విధానం గురించి చెబుతూ యెహోవా “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అని అన్నాడు. (2 కొరిం. 1:3) యెషయా ప్రవచించినట్లే, యేసు తన భూపరిచర్యలో తన తండ్రి చూపించినలాంటి ప్రేమనే చూపించాడు. (యెషయా 61:1, 2 చదవండి.) యెషయా ప్రవచనం తన విషయంలో నెరవేరిందని యేసు అన్నాడు. (లూకా 4:16-21) యేసు పరిచర్య చేస్తున్నప్పుడు, దుఃఖిస్తున్నవాళ్ళను ఓదార్చాడు, ప్రోత్సహించాడు, వాళ్ళకు మనశ్శాంతి కలిగేలా చేశాడు.
2, 3. యేసు అనుచరులు ఇతరులను ఎందుకు ఓదార్చాలి?
2 యేసు అనుచరులందరూ దుఃఖిస్తున్నవాళ్ళను ఓదార్చాలి. (1 కొరిం. 11:1) ‘ఒకరినొకరు ఆదరించి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి’ అని పౌలు అన్నాడు. (1 థెస్స. 5:11) ‘అపాయకరమైన కాలాల్లో’ జీవిస్తున్నందుకు ప్రజలందరికీ ఓదార్పు అవసరం. (2 తిమో. 3:1) తమ మాటల ద్వారా, పనుల ద్వారా బాధను, దుఃఖాన్ని కలుగజేసే ప్రజలు అంతకంతకూ ఎక్కువౌతున్నారు. అలాంటి ప్రజల మధ్య మంచివాళ్ళు జీవించాల్సి వస్తోంది.
3 బైబిలు ప్రవచించినట్లుగానే దుష్టవిధానం అంతమవ్వడానికి ముందున్న ఈ రోజుల్లో “స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తలిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు” చాలామంది ఉన్నారు. ‘దుర్జనులు, వంచకులు అంతకంతకూ చెడిపోతున్నారు’ కాబట్టి అలాంటి లక్షణాలున్న ప్రజలు ముందుకన్నా ఇప్పుడు ఎక్కువమంది అయిపోయారు.—2 తిమో. 3:2-4, 13.
4. మన కాలంలో భూమ్మీది పరిస్థితులు ఎలా తయారౌతున్నాయి?
4 లోకంలో పరిస్థితి అలా ఉందంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే బైబిలు చెబుతున్నట్లుగా, “లోకమంతయు దుష్టుని యందున్నది.” (1 యోహా. 5:19) ‘లోకమంతా’ అనే మాట ప్రస్తుతమున్న రాజకీయ, మత, వాణిజ్య వ్యవస్థలను సూచిస్తోంది. అంతేకాక, తన ఆలోచనల్ని వ్యాప్తి చేయడానికి సాతాను వాడుకునే మాధ్యమాలను కూడా అది సూచిస్తోంది. నిజంగా అపవాదియైన సాతానే “ఈ లోకాధికారి,” “ఈ యుగ సంబంధమైన దేవత.” (యోహా. 14:30; 2 కొరిం. 4:4) తనకు సమయం కొంచెమే ఉందని సాతానుకు తెలుసు కాబట్టి ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. అందుకే భూమ్మీదున్న పరిస్థితులు రోజురోజుకూ మరింత ఘోరంగా తయారౌతున్నాయి. (ప్రక. 12:12) యెహోవా త్వరలోనే సాతానును, అతని దుష్ట విధానాన్ని అంతం చేస్తాడనీ, విశ్వసర్వాధిపత్యపు వివాదాంశం కూడా పరిష్కారమౌతుందనీ తెలుసుకొని మనం ఓదార్పు పొందుతాం.—ఆది. 3వ అధ్యాయం; యోబు 2వ అధ్యాయం.
భూవ్యాప్తంగా సువార్త ప్రకటించబడుతోంది
5. ప్రకటనాపని గురించిన ప్రవచనం ఈ అంత్యదినాల్లో ఎలా నెరవేరుతోంది?
5 “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని యేసు ప్రవచించాడు. (మత్త. 24:14) యేసు ప్రవచించినట్లుగానే, యెహోవా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆయన రాజ్యం గురించిన సువార్తను ప్రకటిస్తున్నారు. ఇప్పుడు 1,07,000కు పైగా ఉన్న సంఘాల్లో 75,00,000 కన్నా ఎక్కువమంది సాక్షులు ఆ పని చేస్తున్నారు. దేవుని రాజ్యం గురించి యేసు ప్రకటించాడు, బోధించాడు. యెహోవాసాక్షులు కూడా అదే చేస్తున్నారు. (మత్త. 4:17) వాళ్ళు ఈ పని చేయడం ద్వారా, దుఃఖిస్తున్న ఎంతోమందిని ఓదార్చగలుగుతున్నారు. ఇటీవలి రెండు సంవత్సరాల్లోనే 5,70,601 మంది బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షులయ్యారు.
6. ప్రకటనాపనిలో జరుగుతున్న అభివృద్ధి గురించి మీరేమి అనుకుంటున్నారు?
6 యెహోవాసాక్షులు ఇప్పుడు బైబిలు సాహిత్యాలను 500 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించి, పంపిణీ చేస్తున్నారు. ఇంతకుముందు ఎవ్వరూ అలాంటి పని చేయలేదు. యెహోవా ప్రజలు ప్రస్తుతం సాతాను చెప్పుచేతల్లో ఉన్న లోకంలో జీవిస్తున్నప్పటికీ యెహోవా సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు, వాళ్ళ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యెహోవా పరిశుద్ధాత్మ సహాయం, నిర్దేశం లేకుండా ఆ పని చేయడం అసాధ్యం. భూవ్యాప్తంగా సువార్త ప్రకటించబడుతోంది కాబట్టి దాన్ని అంగీకరించేవాళ్ళు యెహోవా ప్రజలు పొందుతున్న ఓదార్పునే పొందవచ్చు.
సంఘంలో ఉన్న ఇతరులు మనల్ని ఓదార్చగలరు
7. (ఎ) మనకు బాధ కలిగించే ప్రతీదాన్ని యెహోవా ఇప్పుడే తీసేయాలని మనమెందుకు ఆశించలేం? (బి) మనం హింసల్ని, శ్రమల్ని సహించడం సాధ్యమేనని ఎలా చెప్పవచ్చు?
7 మనం దుష్టత్వంతో నిండిపోయిన లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఏదో ఒక రకమైన బాధను అనుభవిస్తూనే ఉంటాం. యెహోవా ఈ దుష్ట విధానాన్ని నాశనం చేయకముందే మనకు బాధ కలిగించే ప్రతీదాన్ని ఆయన తీసేయాలని మనం ఆశించకూడదు. ఆ రోజు కోసం మనం ఎదురుచూస్తుండగా మనకు హింసలు వస్తాయి. ఆ హింసల వల్ల, మనం యెహోవాకు నమ్మకంగా ఉండి ఆయన సర్వాధిపత్యాన్ని సమర్థిస్తామో లేదో రుజువౌతుంది. (2 తిమో. 3:12) అయితే మన పరలోక తండ్రి ఇచ్చే సహాయంతో, ఓదార్పుతో మనం థెస్సలొనీక సంఘంలోని అభిషిక్తుల్లాగే వ్యవహరించగలుగుతాం. వాళ్ళు హింసలు, శ్రమలు వచ్చినప్పుడు “ఓర్పును, విశ్వాసమును” చూపించారు.—2 థెస్సలొనీకయులు 1:3-5 చదవండి.
8. యెహోవా తన సేవకులను ఓదారుస్తాడని బైబిలు ఎలా చూపిస్తోంది?
8 తన సేవకులకు అవసరమైన ఓదార్పును యెహోవా ఖచ్చితంగా ఇస్తాడు. ఉదాహరణకు, ఏలీయా ప్రవక్తను దుష్ట రాణియైన యెజెబెలు చంపాలనుకున్నప్పుడు ఆయన భయపడి పారిపోయాడు. చివరకు, తాను చనిపోవాలని అనుకుంటున్నానని కూడా ఆయన అన్నాడు. అయితే, ఆ సమయంలో యెహోవా ఏలీయాను కించపరిచే బదులు ఆయనను ఓదార్చి, ప్రవక్తగా కొనసాగడానికి కావాల్సిన ధైర్యాన్నిచ్చాడు. (1 రాజు. 19:1-21) అపొస్తలుల కాలంలో కూడా, సంఘానికి యెహోవా చేసిన సహాయాన్ని చూస్తే ఆయన తన ప్రజల్ని ఎలా ఓదారుస్తాడో తెలుస్తుంది. యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలంతటా ఉన్న సంఘం సమాధానకరమైన పరిస్థితిని అనుభవించింది, అభివృద్ధి చెందింది. అంతేకాక, సంఘం “ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.” (అపొ. 9:31) మనం కూడా పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఆదరణను బట్టి యెహోవాకు రుణపడివున్నాం.
9. యేసు గురించి తెలుసుకోవడం ఎందుకు ఓదార్పును ఇస్తుంది?
9 క్రైస్తవులముగా మనం యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం ద్వారా, ఆయన మాదిరిని అనుసరించడం ద్వారా ఓదార్పు పొందాం. యేసు ఇలా అన్నాడు, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్త. 11:28-30) ప్రజలతో యేసు ఎంత దయగా, ప్రేమగా వ్యవహరించాడో తెలుసుకొని, ఆయనలా ఉండడానికి ప్రయత్నిస్తే మనం ఒత్తిడి నుండి కొంత ఉపశమనం పొందవచ్చు.
10, 11. సంఘంలో ఎవరు ఓదార్పును ఇవ్వగలరు?
10 మనం సంఘంలోని ఇతరుల నుండి కూడా ఓదార్పు పొందవచ్చు. ఉదాహరణకు, విశ్వాసం బలహీనమైపోతున్నవాళ్ళకు సంఘ పెద్దలు ఎలా సహాయం చేయవచ్చో ఆలోచించండి. యాకోబు ఇలా రాశాడు, ‘మీలో ఎవడైనను [ఆధ్యాత్మికంగా] రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు అతని కొరకు ప్రార్థనచేయవలెను.’ పెద్దలు అలా చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? “విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.” (యాకో. 5:14, 15) అయితే, సంఘ పెద్దల నుండి మాత్రమే కాక సంఘంలోని ఇతరుల నుండి కూడా ఓదార్పు పొందవచ్చు.
11 సాధారణంగా స్త్రీలు తమకున్న సమస్యల గురించి ఇతర స్త్రీలతోనే మాట్లాడడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వయసులో పెద్దవాళ్ళైన, ఎక్కువ అనుభవం ఉన్న సహోదరీలు తమకంటే చిన్న వయసులో ఉన్న సహోదరీలకు చక్కని సలహాలు ఇవ్వగలుగుతారు. పెద్ద వయసులో ఉన్న ఆ క్రైస్తవ స్త్రీలు బహుశా గతంలో అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొని ఉంటారు. ఆ సహోదరీలు తమకన్నా చిన్న వయసులో ఉన్నవాళ్ళు సమస్యల్ని చెప్పుకుంటున్నప్పుడు విని వాళ్ళపై శ్రద్ధ చూపించడం ద్వారా ఎంతో సహాయం చేయగలుగుతారు. (తీతు 2:3-5 చదవండి.) సంఘ పెద్దలు, సంఘంలోని ఇతరులు ‘ధైర్యం చెడినవారిని ధైర్యపరచవచ్చు,’ ధైర్యపరచాలి కూడా. (1 థెస్స. 5:14, 15) ‘ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, దేవుడు మన శ్రమ అంతటిలో మనల్ని ఆదరిస్తాడు’ అని గుర్తుంచుకోవడం మంచిది.—2 కొరిం. 1:4.
12. మనం కూటాలకు హాజరవడం ఎందుకు ప్రాముఖ్యం?
12 మనం ఓదార్పు పొందాలంటే కూటాలకు హాజరవడం చాలా ప్రాముఖ్యం. కూటాల్లో బైబిలు సమాచారాన్ని విన్నప్పుడు మనం ప్రోత్సాహాన్ని పొందుతాం. యూదా, సీల “పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి” అని బైబిలు చెబుతోంది. (అపొ. 15:32) కూటాలకు ముందూ తర్వాతా సంఘంలోని వాళ్ళందరూ ఒకరితో ఒకరు ప్రోత్సాహకరంగా మాట్లాడుకుంటారు. కాబట్టి, మనం ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పటికీ తోటి క్రైస్తవులతో సమయం గడపడం మంచిది. సహోదరుల నుండి దూరంగా ఉంటే పరిస్థితి మరింత ఘోరంగా తయారౌతుంది. (సామె. 18:1) కాబట్టి అలా చేయకుండా, అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటల్ని పాటించాలి, “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.”—హెబ్రీ. 10:24, 25.
బైబిలు మనకు ఓదార్పు ఇస్తుంది
13, 14. లేఖనాలు మనకు ఏయే విధాలుగా సహాయం చేస్తాయి?
13 మనం బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులమైనా లేక దేవుని గురించీ ఆయన సంకల్పాల గురించీ తెలుసుకోవడం ఈ మధ్యే మొదలుపెట్టిన వాళ్ళమైనా బైబిలు నుండి ఎంతో ఓదార్పు పొందవచ్చు. పౌలు ఇలా రాశాడు, “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.” (రోమా. 15:4) బైబిలు మనకు ఓదార్పునిచ్చి మనం ‘సన్నద్ధులమై ప్రతీ సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడేందుకు’ తోడ్పడుతుంది. (2 తిమో. 3:16, 17) బైబిలును, మన ప్రచురణలను చదవడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా మనం దేవుని సంకల్పాల గురించిన సత్యాన్ని తెలుసుకోవచ్చు, నిజమైన భవిష్యత్తు నిరీక్షణను పొందవచ్చు. అప్పుడు మనం ఓదార్పును, బైబిలు ఇచ్చే నిజమైన నిరీక్షణ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.
14 ఉపదేశించడానికి, ఇతరులను ఓదార్చడానికి లేఖనాలను ఉపయోగించడం ద్వారా యేసు మనకు మంచి మాదిరి ఉంచాడు. ఆయన పునరుత్థానం చేయబడిన తర్వాత తన శిష్యుల్లో ఇద్దరికి కనిపించి లేఖనాలను వివరించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఓదార్పు పొందివుంటారు. (లూకా 24:32) యేసు ఉంచిన చక్కని మాదిరిని పాటిస్తూ అపొస్తలుడైన పౌలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు లేఖనాలను ఉపయోగించాడు. బెరయలో ఆయన ప్రకటించిన సువార్తను విన్నవాళ్ళు ‘ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి ప్రతిదినం లేఖనాలను పరిశోధించారు.’ (అపొ. 17:2, 10, 11) కాబట్టి ప్రతీరోజు లేఖనాలను చదివి వాటి నుండి, అలాగే కష్టకాలాల్లో మనకు ఓదార్పునూ నిరీక్షణనూ ఇచ్చేలా తయారుచేయబడిన క్రైస్తవ ప్రచురణల నుండి ప్రయోజనం పొందుతూ ఉండడం అవసరం.
ఇతరులను వేరే విధాలుగా కూడా ఓదార్చవచ్చు
15, 16. మన సహోదరులకు సహాయం చేయడానికి, వాళ్ళకు ఆదరణ ఇవ్వడానికి మనం ఏమేమి చేయవచ్చు?
15 మన సహోదరులకు సహాయం చేయడానికి, వాళ్ళను ఓదార్చడానికి మనం ఎన్నో పనులు చేయవచ్చు. ఉదాహరణకు, వృద్ధులు లేదా అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్ళు బయటికి వెళ్ళి సరుకులు కొని తెచ్చుకోలేరు కాబట్టి వాళ్ళకు మనం ఆ సహాయం చేసిపెట్టవచ్చు. అవసరమైతే ఇతరుల కోసం ఇంటిపనులు చేసి పెట్టవచ్చు. అవన్నీ చేయడం ద్వారా వాళ్ళపై మనకు శ్రద్ధ ఉందని చూపిస్తాం. (ఫిలి. 2:4) మన సహోదరులు చూపిస్తున్న ప్రేమ, ధైర్యం, విశ్వాసం వంటి మంచి లక్షణాలను, వాళ్ళ సామర్థ్యాలను మనం ఎంతగా ఇష్టపడుతున్నామో వాళ్ళకు చెప్పవచ్చు.
16 వృద్ధులను చూడడానికి వెళ్ళి వాళ్ళు యెహోవా సేవలో తమ అనుభవాల గురించి, తాము పొందిన ఆశీర్వాదాల గురించి చెబుతున్నప్పుడు వినడం ద్వారా మనం వాళ్ళకు ఆదరణ ఇవ్వవచ్చు. దానివల్ల మనం కూడా ప్రోత్సాహాన్ని, ఆదరణను పొందవచ్చు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి బైబిలు గానీ బైబిలు సాహిత్యాలు గానీ చదవవచ్చు. బహుశా ఆ వారంలో చర్చించబోయే కావలికోట అధ్యయన ఆర్టికల్‌ను లేదా సంఘ బైబిలు అధ్యయనం కోసం నియమించబడిన సమాచారాన్ని వాళ్ళతో కలిసి చదవవచ్చు. మన సంస్థ విడుదల చేసిన ఒక డీవీడీని వాళ్ళతో కలిసి చూడవచ్చు. మన ప్రచురణల్లో నుండి కొన్ని ప్రోత్సాహకరమైన అనుభవాలను వాళ్ళకు చదివి వినిపించవచ్చు లేదా చెప్పవచ్చు.
17, 18. యెహోవా తన నమ్మకమైన సేవకులకు సహాయం చేస్తాడని, వాళ్ళను ఓదారుస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?
17 మన సహోదరులకు ఓదార్పు అవసరమని మనకు తెలిస్తే వాళ్ళకోసం మనం ప్రార్థిస్తాం. (రోమా. 15:30; కొలొ. 4:12) కష్టమైన పరిస్థితులవల్ల మనం బాధపడుతున్నా, ఇతరులను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నా మనం దావీదు చూపించినలాంటి విశ్వాసాన్ని చూపించవచ్చు. ఆయనిలా రాశాడు, “నీ భారము యెహోవామీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” (కీర్త. 55:22) యెహోవా మనకు ఎల్లప్పుడూ ఓదార్పును ఇస్తాడు, సహాయం చేస్తాడు, తన నమ్మకమైన సేవకులను ఎన్నడూ నిరాశపర్చడు.
18 గతంలో యెహోవా తన సేవకులకు ఇలా చెప్పాడు, “నేను, నేనే మిమ్ము నోదార్చువాడను.” (యెష. 51:12) యెహోవా మనల్ని కూడా ఓదారుస్తాడు, ఇతరులను ఓదార్చడానికి మనం చేసే ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు. మనకు ఏ నిరీక్షణ ఉన్నా, తన కాలంలోని అభిషిక్త క్రైస్తవులకు పౌలు చెప్పిన ఈ మాటల నుండి ఓదార్పు పొందవచ్చు, “మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, మీ హృదయములను ఆదరించి, ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక.”—2 థెస్స. 2:16, 17.
మీకు గుర్తున్నాయా?
• దుఃఖిస్తున్నవాళ్ళను ఓదార్చే పని ఎంత విస్తృతంగా జరుగుతోంది?
• ఇతరులను ఓదార్చడానికి మనం ఏమేమి చేయవచ్చు?
• యెహోవా తన ప్రజలను ఓదారుస్తాడని బైబిలు ఎలా చూపిస్తోంది?
[అధ్యయన ప్రశ్నలు]
[28వ పేజీలోని చిత్రం]
దుఃఖిస్తున్నవాళ్ళను ఓదార్చే పనిలో మీరు పాల్గొంటారా?
[30వ పేజీలోని చిత్రం]
వృద్ధులైనా యౌవనులైనా ఇతరులను ప్రోత్సహించవచ్చు