కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాతో సంబంధాన్ని పెంచుకోవడానికి పురుషులకు సహాయం చేయండి

యెహోవాతో సంబంధాన్ని పెంచుకోవడానికి పురుషులకు సహాయం చేయండి

యెహోవాతో సంబంధాన్ని పెంచుకోవడానికి పురుషులకు సహాయం చేయండి

‘ఇప్పటి నుండి మీరు మనుష్యులను పట్టువారై ఉంటారు.’—లూకా 5:10.

1, 2. (ఎ) యేసు ప్రకటిస్తున్నప్పుడు పురుషులు ఎలా స్పందించారు? (బి) మనం ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

 గలిలయలో ప్రకటనాపని చేస్తున్నప్పుడు యేసు, ఆయన శిష్యులు ఏకాంత ప్రదేశానికి వెళ్లేందుకు ఓడ ఎక్కినప్పుడు జనసమూహాలు కాలినడకన వాళ్లను వెంబడించాయి. అలా వచ్చినవాళ్లలో ‘స్త్రీలు, పిల్లలే గాక ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు’ ఉన్నారు. (మత్త. 14:21) మరో సందర్భంలో, యేసు దగ్గర స్వస్థత పొందడానికి, ఆయన బోధలు వినడానికి ఒక జనసమూహం వచ్చింది. ఆ సమూహంలో, ‘స్త్రీలు, పిల్లలే గాక నాలుగు వేలమంది పురుషులు’ ఉన్నారు. (మత్త. 15:38) దీన్నిబట్టి, యేసు దగ్గరకు వచ్చి ఆయన బోధలు వినేందుకు ఆసక్తి చూపించిన వారిలో చాలామంది పురుషులు ఉన్నారని తెలుస్తోంది. నిజానికి ఇంకా ఎక్కువమంది అలా రావాలని యేసు ఆశించాడు. ఎందుకంటే, ఎన్నో చేపలు వలకు చిక్కేలా ఒక అద్భుతం చేసిన తర్వాత యేసు తన శిష్యుడైన సీమోనుతో, ‘ఇప్పటి నుండి మీరు మనుష్యులను పట్టువారై ఉంటారు’ అన్నాడు. (లూకా 5:10) మానవజాతి అనే సముద్రంలో వలల్ని వేసి ‘పట్టుకునే’ ప్రజల్లో చాలామంది పురుషులు ఉంటారని ఆయన శిష్యులు ఆశించవచ్చు.

2 ఇప్పుడు కూడా పురుషులు, మనం ప్రకటించే లేఖనాధారమైన సమాచారంపై ఆసక్తి చూపించి తగిన చర్య తీసుకుంటున్నారు. (మత్త. 5:3) అయితే, చాలామంది ముందుకు వచ్చి యెహోవాతో సంబంధాన్ని పెంచుకోలేకపోతున్నారు. వాళ్లకు మనం ఎలా సహాయం చేయవచ్చు? యేసు కేవలం పురుషుల కోసం ఒక ప్రత్యేకమైన పరిచర్యను మొదలుపెట్టలేదు కానీ, తన కాలంలో ప్రత్యేకంగా పురుషులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలతో వ్యవహరించడానికి వాళ్లకు సహాయం చేయాలనుకున్నాడు. అయితే, ఆయన వాళ్లకు ఎలా సహాయం చేశాడో, మనం ఆయనను ఎలా అనుకరించవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ఇప్పుడు మనం ఈ మూడు విషయాల గురించి మాట్లాడుకుందాం: (1) డబ్బు గురించిన చింత, (2) ఇతరులు ఏమనుకుంటారోననే భయం, (3) ఇతరుల కన్నా తక్కువ వాళ్లమనే భావన.

డబ్బు గురించిన చింత

3, 4. (ఎ) చాలామంది పురుషులు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారు? (బి) కొంతమంది పురుషులు ఆధ్యాత్మిక విషయాల కన్నా డబ్బు సంపాదనకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు?

3 “బోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంటవచ్చెదను” అని ఒక శాస్త్రి యేసుతో అన్నాడు. అయితే, “మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు” అని యేసు చెప్పినప్పుడు ఆ శాస్త్రి తన ఆలోచన మార్చుకున్నాడు. ఆయన యేసు శిష్యుడయ్యాడనేందుకు బైబిల్లో ఏ ఆధారమూ లేదు. బహుశా ఆహారం గురించి, వసతి గురించి ఆయన చింతించి ఉంటాడు.—మత్త. 8:19, 20.

4 పురుషులు తరచూ ఆధ్యాత్మిక విషయాల కన్నా వస్తుపరమైన భద్రతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. చాలామంది ఉన్నత విద్య అభ్యసించి మంచి జీతం దొరికే ఉద్యోగం సంపాదించుకోవడాన్నే అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా పరిగణిస్తారు. లేఖనాలను అధ్యయనం చేసి దేవునితో దగ్గరి సంబంధాన్ని పెంచుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా డబ్బు సంపాదించడమే చాలా అవసరమైనదనీ సరైనదనీ వాళ్లు అనుకుంటారు. బైబిలు బోధిస్తున్న దాన్ని వాళ్లు ఇష్టపడుతుండవచ్చు కానీ, వాళ్లకున్న కాస్త ఆసక్తిని కూడా ‘ఐహిక విచారములు, ధనమోసము’ హరించివేస్తాయి. (మార్కు 4:18, 19) ఏ విషయాలకు మొదటి స్థానమివ్వాలో గ్రహించడానికి యేసు తన శిష్యులకు ఎలా సహాయం చేశాడో పరిశీలించండి.

5, 6. అంద్రెయ, పేతురు, యాకోబు, యోహాను డబ్బు సంపాదన కన్నా ప్రకటనాపనికి ఎక్కువ ప్రాముఖ్యతను ఎలా ఇవ్వగలిగారు?

5 అంద్రెయ, ఆయన సహోదరుడైన సీమోను పేతురు కలిసి చేపల వ్యాపారం చేసేవాళ్లు. యోహాను, ఆయన సహోదరుడైన యాకోబు, వాళ్ల తండ్రి జెబెదయి కూడా అదే వ్యాపారం చేసేవాళ్లు. వాళ్ల వ్యాపారం జీతగాళ్లను పెట్టుకొని పనిచేయించుకునేంత బాగా నడిచేది. (మార్కు 1:16-20) అంద్రెయ యోహానులు యేసు గురించి బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గర మొదటిసారి విన్నప్పుడు వాళ్లు యేసే మెస్సీయ అని బలంగా నమ్మారు. అంద్రెయ తన సహోదరుడైన సీమోను పేతురుకు ఆ విషయాన్ని చెప్పాడు. బహుశా యోహాను కూడా తన సహోదరుడైన యాకోబుతో చెప్పివుంటాడు. (యోహా. 1:29, 35-41) తర్వాతి నెలల్లో యేసు గలిలయ, యూదయ, సమరయ ప్రాంతాల్లో ప్రకటిస్తున్నప్పుడు ఆ నలుగురూ ఆయనతోపాటు ఉన్నారు. ఆ తర్వాత వాళ్లు మళ్లీ చేపల వ్యాపారం చేయడానికి తిరిగి వచ్చేశారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నా వాళ్లు పరిచర్యకు ప్రాధాన్యతను ఇవ్వలేదు.

6 యేసు కొంతకాలానికి పేతురును, అంద్రెయను తన వెంబడి వచ్చి ‘మనుష్యులను పట్టు జాలరులుగా’ మారమని ఆహ్వానించాడు. దానికి వాళ్లు ఏమి చేశారు? ‘వెంటనే వాళ్లు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.’ యాకోబు, యోహాను కూడా ‘వెంటనే తమ దోనెను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.’ (మత్త. 4:18-22) వాళ్లు పూర్తికాల పరిచర్య ఎలా చేపట్టగలిగారు? ఏదో భావోద్వేగంతో, క్షణికావేశంలో వాళ్లు ఆ నిర్ణయానికి వచ్చారా? లేదు. వాళ్లు అంతకుముందున్న కొన్ని నెలల్లో యేసు బోధలు విన్నారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు, నీతిపట్ల ఆయనకున్న ఆసక్తిని గమనించారు, ఆయన చేసిన ప్రకటనాపనికి ఎంతోమంది స్పందించడం చూశారు. దానివల్ల, యెహోవా మీద వాళ్లకున్న నమ్మకం, విశ్వాసం మరింత బలపడ్డాయి.

7. తన ప్రజల అవసరాలు తీర్చే విషయంలో యెహోవాకున్న సామర్థ్యంపై నమ్మకాన్ని పెంచుకోవడానికి బైబిలు విద్యార్థులకు మనం ఎలా సహాయం చేయవచ్చు?

7 యెహోవా మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి మన బైబిలు విద్యార్థులకు సహాయం చేసే విషయంలో మనం యేసును ఎలా అనుకరించవచ్చు? (సామె. 3:5, 6) ఈ విషయంలో, వాళ్లకు మనం బోధించే పద్ధతి కూడా ఎంతో సహాయం చేస్తుంది. మనం బోధిస్తున్నప్పుడు, తన రాజ్యానికి మొదటి స్థానమిచ్చేవాళ్లను మెండుగా ఆశీర్వదిస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని నొక్కి చెప్పవచ్చు. (మలాకీ 3:10; మత్తయి 6:33 చదవండి.) యెహోవా తన ప్రజల అవసరాలు ఎలా తీరుస్తాడో నొక్కి చెప్పేందుకు మనం ఎన్ని లేఖనాలు చూపించినా, ఈ విషయంలో మన మాదిరి కూడా వాళ్లపై ప్రభావం చూపిస్తుందని మరచిపోకూడదు. మన జీవితంలోని అనుభవాలను పంచుకోవడం వల్ల కూడా బైబిలు విద్యార్థులు యెహోవా మీద నమ్మకాన్ని పెంచుకోగలుగుతారు. మన ప్రచురణల్లో మనం చదివే ప్రోత్సాహకరమైన అనుభవాలను కూడా వాళ్లతో పంచుకోవచ్చు. a

8. (ఎ) బైబిలు విద్యార్థి ‘యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవడం’ ఎందుకు ప్రాముఖ్యం? (బి) బైబిలు విద్యార్థి తానుగా యెహోవా మంచితనాన్ని రుచి చూసేందుకు మనమెలా సహాయం చేయవచ్చు?

8 బలమైన విశ్వాసాన్ని పెంచుకోవాలంటే, ఇతరులు ఎలా యెహోవా ఆశీర్వాదాలను పొందారనే దాని గురించి చదవడం, వినడం మాత్రమే సరిపోదు. బైబిలు విద్యార్థి తానుగా కూడా యెహోవా మంచితనాన్ని రుచిచూడాల్సి ఉంటుంది. “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు” అని కీర్తనకర్త పాడాడు. (కీర్త. 34:8) యెహోవా ఉత్తముడని రుచి చూసేందుకు బైబిలు విద్యార్థికి మనమెలా సహాయం చేయవచ్చు? ఆర్థిక ఇబ్బందులున్న ఒక బైబిలు విద్యార్థి సిగరెట్‌ తాగడం, జూదం ఆడడం, అతిగా తాగడం వంటి చెడ్డ అలవాట్లను మానుకోవడానికి పోరాడుతున్నాడనుకోండి. (సామె. 23:20, 21; 2 కొరిం. 7:1; 1 తిమో. 6:10) వాటిని మానుకోవడానికి కావాల్సిన సహాయం కోసం యెహోవాకు ప్రార్థించమని చెప్పండి. యెహోవా సహాయంతో తన జీవితాన్ని మెరుగుపర్చుకున్నప్పుడు ఆయన యెహోవా మంచితనాన్ని చూడగలుగుతాడు. ప్రతీవారం బైబిలు అధ్యయనం కోసం సమయాన్ని కేటాయించడం, క్రైస్తవ కూటాలకు సిద్ధపడి హాజరవడం వంటివి చేసి ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానమివ్వమని బైబిలు విద్యార్థిని ప్రోత్సహిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో కూడా ఆలోచించండి. తన ప్రయత్నాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడని ఆయనకు అనిపించినప్పుడు ఆయన విశ్వాసం మరింత బలపడుతుంది.

ఇతరులు ఏమనుకుంటారోననే భయం

9, 10. (ఎ) నీకొదేము, అరిమతయియ యోసేపు యేసు బోధల పట్ల ఆసక్తి చూపించినా, ఆ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారు? (బి) యేసును అనుసరించడానికి ఇప్పుడు కొంతమంది పురుషులు ఎందుకు సంకోచిస్తున్నారు?

9 ఇతరులు ఏమనుకుంటారోననే భయం వల్ల కొంతమంది పురుషులు క్రీస్తును పూర్తిగా అనుసరించడానికి సంకోచిస్తారు. నీకొదేము, అరిమతయియ యోసేపు యేసు బోధల పట్ల ఆసక్తి చూపించినా, ఆ విషయం ఇతర యూదులకు తెలిస్తే వాళ్లు ఏమంటారో, ఏమి చేస్తారో అనే భయం వల్ల దాన్ని రహస్యంగా ఉంచారు. (యోహా. 3:1, 2; 19:38) వాళ్లు అలా భయపడడానికి కారణం ఉంది. మతనాయకులు యేసును ఎంతో ద్వేషించేవాళ్లు కాబట్టి ఆయనపై విశ్వాసం చూపించిన వాళ్లను సమాజమందిరం నుండి వెలివేసేవాళ్లు.—యోహా. 9:22.

10 ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా దేవునిపై, బైబిలుపై లేదా మతంపై ఎక్కువ ఆసక్తి చూపించారంటే వాళ్ల తోటి ఉద్యోగులు, స్నేహితులు లేదా బంధువులు వాళ్లను కించపరుస్తుంటారు. మరికొన్ని ప్రాంతాల్లోనైతే మతం మార్చుకోవడం గురించి మాట్లాడడం కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా సైన్యంలో, రాజకీయాల్లో లేదా సమాజసేవలో చురుగ్గా పాల్గొనే వ్యక్తికి తోటివాళ్ల ఒత్తిడిని తట్టుకోవడం కష్టమౌతుంది. ఉదాహరణకు, జర్మనీలోని ఒక వ్యక్తి ఇలా ఒప్పుకున్నాడు, “సాక్షులైన మీరు బైబిలు గురించి చెప్పేది సత్యమే. కానీ ఈ రోజు నేను సాక్షినైతే, రేపటికల్లా దాని గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది. తోటి ఉద్యోగులు, ఇరుగుపొరుగు వాళ్లు, మా క్లబ్బులో వాళ్లు ఏమనుకుంటారు? అది నేను సహించలేను.”

11. మనుష్యులకు భయపడకుండా ఉండేందుకు తన శిష్యులకు యేసు ఎలా సహాయం చేశాడు?

11 యేసు అపొస్తలులు పిరికివాళ్లు కాకపోయినా, వాళ్లు మనుష్యులకు భయపడేవాళ్లు. (మార్కు 14:50, 66-72) ఇతరుల నుండి ఎంత ఒత్తిడి వచ్చినా ప్రగతి సాధించేందుకు వాళ్లకు యేసు ఎలా సహాయం చేశాడు? తర్వాతి రోజుల్లో ఎదురయ్యే హింసను తట్టుకోవడానికి వాళ్లను ఆయన సిద్ధం చేశాడు. “మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు” అని ఆయన అన్నాడు. (లూకా 6:22) నిందలు వస్తాయని వాళ్లు ఎదురుచూడాల్సిందేనని ఆయన తన అనుచరులకు చెప్పాడు. ‘మనుష్యకుమారుని నిమిత్తమే’ వాళ్ల మీదికి నిందలు వస్తాయి. సహాయం కోసం, బలం కోసం యెహోవాపై ఆధారపడినంతకాలం ఆయన వాళ్లకు సహాయం చేస్తాడని కూడా యేసు వాళ్లకు అభయం ఇచ్చాడు. (లూకా 12:4-12) అంతేకాక, తన శిష్యులతో సహవసించి వాళ్లతో స్నేహం చేయడానికి యేసు కొత్తవాళ్లను కూడా ఆహ్వానించాడు.—మార్కు 10:29, 30.

12. బైబిలు విద్యార్థులు మనుష్యులకు భయపడకుండా ఉండేందుకు మనం వాళ్లకు ఏయే విధాలుగా సహాయం చేయవచ్చు?

12 బైబిలు విద్యార్థులు మనుష్యులకు భయపడకుండా ఉండేందుకు మనం కూడా వాళ్లకు సహాయం చేయాలి. రాగల సమస్య గురించి ముందుగానే ఊహిస్తే దాన్ని ఎదుర్కోవడం సులభంగా ఉంటుంది. (యోహా. 15:19) ఉదాహరణకు, తన తోటి ఉద్యోగులు లేదా ఇతరులు అడిగే ప్రశ్నలకు సరళమైన, సహేతుకమైన, బైబిలు ఆధారిత జవాబులను ఇవ్వడాన్ని మీ బైబిలు విద్యార్థులకు నేర్పించగలరేమో ఆలోచించండి. బైబిలు విద్యార్థికి మనం మాత్రమే స్నేహితులుగా ఉండే బదులు సంఘంలోని ఇతరులకు ముఖ్యంగా ఆయన లాంటి పరిస్థితులే ఉన్నవాళ్లకు పరిచయం చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా క్రమం తప్పకుండా హృదయపూర్వకంగా ప్రార్థించమని ఆయనకు నేర్పించాలి. అలా చేస్తే ఆయన యెహోవా దేవునికి దగ్గరై, యెహోవాను తన ఆశ్రయ దుర్గంగా చేసుకోగలుగుతాడు.—కీర్తన 94:21-23; యాకోబు 4:8 చదవండి.

ఇతరుల కన్నా తక్కువ వాళ్లమనే భావన

13. కొందరు పురుషులు ఎందుకు ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనకుండా వెనకడుగు వేస్తారు?

13 సరిగ్గా చదవలేకపోవడం వల్ల లేదా తమ మనసులో ఉన్న విషయాలను చక్కగా బయటకు చెప్పలేకపోవడం వల్ల లేదా బిడియం వల్ల కొందరు పురుషులు ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనకుండా వెనకడుగు వేస్తారు. తమ అభిప్రాయాల్ని, భావాల్ని పదిమందిలో చెప్పడానికి కొందరు పురుషులు ఇబ్బందిపడతారు. అధ్యయనం చేయడం, క్రైస్తవ కూటాల్లో వ్యాఖ్యానించడం లేదా తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడం అనే ఆలోచనే కొంతమందికి భయం పుట్టిస్తుంది. ఒక క్రైస్తవ సహోదరుడు ఇలా ఒప్పుకున్నాడు, “చిన్నప్పుడు నేను వేగంగా తలుపు దగ్గరికి వెళ్లి డోర్‌ బెల్‌ నొక్కినట్లు నటించి, ఎవరూ వినలేదని నన్ను ఎవరూ చూడలేదని అనుకుంటూ నిశ్శబ్దంగా వెళ్లిపోయేవాణ్ణి. . . . ఇంటింటికీ వెళ్లడమనే తలంపు నన్ను శారీరకంగా అనారోగ్యుణ్ణి చేసింది.”

14. దయ్యం పట్టిన ఒక అబ్బాయిని యేసు శిష్యులు ఎందుకు బాగుచేయలేకపోయారు?

14 దయ్యం పట్టిన ఒక అబ్బాయిని తాము బాగుచేయలేకపోయినప్పుడు యేసు శిష్యులకు ఎలా అనిపించివుంటుందో ఆలోచించండి. ఆ అబ్బాయి వాళ్ల తండ్రి యేసు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, “[నా కుమారుడు] చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు; నీ శిష్యుల యొద్దకు వానిని తీసికొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరి.” యేసు ఆ దయ్యాన్ని వెళ్లగొట్టి ఆ అబ్బాయిని స్వస్థపర్చాడు. ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేక పోతిమి?” అని అడిగారు. దానికి యేసు ఇలా జవాబిచ్చాడు, “మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి—ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదు.” (మత్త. 17:14-20) కొండలా కనిపించే అడ్డంకులను జయించాలంటే యెహోవా మీద విశ్వాసం అవసరం. ఒక వ్యక్తి ఈ విషయాన్ని మరచిపోయి తన సొంత సామర్థ్యాలపై ఆధారపడితే ఏమి జరుగుతుంది? ఆయన తన ముందున్న అడ్డంకులను జయించలేకపోవడం వల్ల, యెహోవాను సేవించడానికి తగినవాణ్ణి కాదని అనుకోవచ్చు.

15, 16. ఇతరులకన్నా తక్కువ వాళ్లమని భావిస్తున్న వాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు?

15 యెహోవా సేవ ఇతరులు చేస్తున్నంతగా తాము చేయలేకపోతున్నామని బైబిలు విద్యార్థులు బాధపడుతుంటే, తమ సామర్థ్యాల మీద కాదుగానీ యెహోవా మీద నమ్మకం ఉంచమని వాళ్లను ప్రోత్సహించాలి. “దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. . . . మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” అని పేతురు రాశాడు. (1 పేతు. 5:6, 7) బైబిలు విద్యార్థి ఈ లేఖనాన్ని పాటించాలంటే యెహోవాతో సంబంధాన్ని పెంచుకునేలా మనం ఆయనకు సహాయం చేయాలి. ఆధ్యాత్మిక విషయాలను ఇష్టపడే వ్యక్తి వాటిని చాలా విలువైనవిగా ఎంచుతాడు. ఆయన దేవుని వాక్యాన్ని ప్రేమించి తన జీవితంలో ‘ఆత్మ ఫలంలోని’ లక్షణాలను కనబరుస్తాడు. (గల. 5:22, 23) ఆయన ప్రార్థనాపరుడుగా ఉంటాడు. (ఫిలి. 4:6, 7) అంతేకాక, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి లేదా ఎలాంటి నియామకాన్నైనా విజయవంతంగా పూర్తిచేయడానికి కావాల్సిన ధైర్యం కోసం, బలం కోసం ఆయన దేవుని మీద ఆధారపడతాడు.—2 తిమోతి 1:7, 8 చదవండి.

16 కొంతమంది బైబిలు విద్యార్థులకు చదవడం, మాట్లాడడం వంటి సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి సహాయం అవసరం కావచ్చు. ఇంకొంతమంది విద్యార్థులు యెహోవా గురించి తెలుసుకోకముందు చేసిన చెడ్డ పనులవల్ల ఆయన సేవకు తాము తగినవాళ్లం కాదని అనుకోవచ్చు. విషయమేదైనా, వాళ్లకు అవసరమైంది ప్రేమతో, దయతో కూడిన సహాయమే. “రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు” అని యేసు అన్నాడు.—మత్త. 9:12.

ఎక్కువమందికి సహాయం చేయండి

17, 18. (ఎ) పరిచర్యలో ఎక్కువమంది పురుషులను కలవాలంటే మనం ఏమి చేయాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

17 బైబిల్లో మాత్రమే ఉన్న చాలా సంతృప్తికరమైన సమాచారానికి ఇంకా ఎక్కువమంది పురుషులు స్పందిస్తారని మనం ఆశిస్తున్నాం. (2 తిమో. 3:16, 17) కాబట్టి మన పరిచర్యలో ఎక్కువమంది పురుషులను కలవాలంటే ఏమి చేయాలి? వాళ్లు ఇంట్లో ఉండే సమయంలో అంటే సాయంకాలాల్లో గానీ, వారాంతాల్లో మధ్యాహ్నం పూట గానీ, లేదా సెలవుల్లో గానీ ఎక్కువసేపు పరిచర్య చేయడం ద్వారా వాళ్లను కలవవచ్చు. సహోదరులైతే ఇంటింటి పరిచర్యలో మగవాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. వీలైనప్పుడు తోటి ఉద్యోగులైన పురుషులకు సాక్ష్యమివ్వవచ్చు, సంఘంలోని సహోదరీల అవిశ్వాసులైన భర్తలకు సత్యాన్ని అందజేయడానికి ప్రయత్నించవచ్చు.

18 మనం కలిసిన ప్రతి ఒక్కరికీ సాక్ష్యమిస్తుండగా, మన సందేశాన్ని గ్రహించేవాళ్లు సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకాన్ని కలిగివుండవచ్చు. సత్యం పట్ల నిజమైన ఆసక్తి చూపిస్తున్నవాళ్లకు ఓపిగ్గా సహాయం చేద్దాం. అయితే, దేవుని సంస్థలో బాధ్యతల్ని చేపట్టడానికి అర్హులయ్యేలా బాప్తిస్మం తీసుకున్న పురుషులకు మనమెలా సహాయం చేయవచ్చు? తర్వాతి ఆర్టికల్‌లో ఈ ప్రశ్నకు జవాబు చూద్దాం.

[అధస్సూచి]

a కావలికోట పత్రికల్లో వచ్చే జీవిత కథలను చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానం ఇవ్వడానికి పురుషులకు ఎలా సహాయం చేయవచ్చు?

• తోటివారి ఒత్తిడిని ఎదుర్కోవడానికి కొత్తవాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు?

• ఇతరులకన్నా తక్కువ వాళ్లమని బాధపడుతున్న కొంతమందికి ఎలా సహాయం చేయవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[25వ పేజీలోని చిత్రం]

పురుషులకు సువార్త ప్రకటించడానికి అవకాశాల్ని కల్పించుకుంటారా?

[26వ పేజీలోని చిత్రం]

పరీక్షల్ని ఎదుర్కోవడానికి మీ బైబిలు విద్యార్థిని మీరెలా సిద్ధం చేయవచ్చు?