సరికొత్త హంగులతో అధ్యయన ప్రతి!
సరికొత్త హంగులతో అధ్యయన ప్రతి!
మరింత ఆకర్షణీయంగా ఉండేలా అధ్యయన ప్రతికి కొత్త రూపాన్నిచ్చాం. అంతేకాక, యెహోవా ఇచ్చిన అమూల్యమైన సత్యవాక్యాన్ని చదివేటప్పుడు మీకు మరింత సహాయకరంగా ఉండేలా దీన్ని రూపొందించాం. —కీర్త. 1:2; 119:97.
నాలుగు సంవత్సరాల క్రితం కావలికోట పత్రికను రెండు సంచికలుగా ప్రచురించడం ప్రారంభించాం. అప్పటినుండి బయటి పాఠకుల కోసం సార్వజనిక ప్రతిని, యెహోవాసాక్షులమైన మన కోసం అలాగే ప్రగతి సాధిస్తున్న బైబిలు విద్యార్థుల కోసం అధ్యయన ప్రతిని ప్రచురిస్తున్నాం.
ఎంతోకాలంగా యెహోవా సేవ చేస్తున్న ఒక సహోదరుడు అధ్యయన ప్రతి గురించి ఇలా రాశాడు, “మొట్టమొదటి కావలికోట అధ్యయన ప్రతిని చదివినప్పుడు అది ఎంతో అద్భుతంగా, ఆలోచింపజేసే విధంగా ఉందని నాకనిపించింది. బైబిల్లోని ప్రాముఖ్యమైన సత్యాలను క్షుణ్ణంగా వివరించిన తీరు నా హృదయాన్ని స్పృశించింది. అద్భుతమైన ఈ కొత్త అధ్యయన ప్రతిని తయారు చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను.” మరో సహోదరుడు ఇలా రాశాడు, “బైబిలు దగ్గర పెట్టుకొని అధ్యయన ప్రతిని చదవడంలో ఎక్కువ సమయం గడపడమంటే నాకు చాలా ఇష్టం.” మీకు కూడా అలాగే అనిపిస్తుందని మేము నమ్ముతున్నాం.
కావలికోట ప్రతిని 1879 నుండి నిర్విరామంగా ప్రచురించడం అంత చిన్న విషయమేమీ కాదు. ఈ అసాధారణ పని యెహోవా పరిశుద్ధాత్మ శక్తితో, ఆశీర్వాదంతో మాత్రమే సాధ్యమవుతోందన్న విషయం మీకు తెలిసిందే. (జెక. 4:6) ఈ 133 సంవత్సరాల్లో పత్రిక కవరుపేజీలో ఎన్నో మార్పులూ చేర్పులూ జరిగాయి. 2012వ సంవత్సరంలోని సంచికలన్నిటిలో కవరుపేజీ మీద సువార్త ప్రకటిస్తున్నట్లు చూపించే రంగురంగుల పెయింటింగ్ ఉంటుంది. అది యెహోవా రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యమివ్వాలనే దేవుని ఆజ్ఞను మనకు గుర్తుచేస్తుంది. (అపొ. 28:23) 2వ పేజీలో ఆ పెయింటింగ్‌కు ఆధారమైన అసలు ఫోటో ఉంటుంది. ఆ చిత్రంలో ఏమి జరుగుతోందో, అది ఏ దేశంలో జరుగుతోందో తెలిపే వివరణ కూడా ఉంటుంది. అది ఈ సంవత్సరమంతటిలో, యెహోవా ప్రజలు “లోకమందంతట” సువార్త ప్రకటిస్తున్నారని మనకు గుర్తుచేస్తుంది.—మత్త. 24:14.
ఈ పత్రికలో ఇంకా ఎలాంటి మార్పులు జరిగాయి? పునఃసమీక్ష బాక్సు ఇకపై అధ్యయన ఆర్టికల్ మొదట్లోనే ఉంటుంది. మీరు ఒక ఆర్టికల్ చదివి అధ్యయనం చేస్తున్నప్పుడు, ఏ ముఖ్యమైన అంశాల గురించి ఆలోచించాలో తెలుసుకోవడానికి ఆ బాక్సు సహాయం చేస్తుంది. అయితే, ఎప్పటిలాగే కావలికోట అధ్యయన నిర్వాహకులు అధ్యయనం ముగింపులో ఆర్టికల్‌ను పునఃసమీక్షించడానికి ఆ ప్రశ్నలు ఉపయోగించవచ్చు. మార్జిన్‌లు ఇంతకుముందుకన్నా పెద్దగా ఉంటాయి. పేజీల, పేరాల నంబర్లు ముందుకన్నా కాస్త పెద్దగా కనిపిస్తాయి.
ఈ నెల పత్రికలో, “ఆనాటి జ్ఞాపకాలు” అనే కొత్త శీర్షికను మీరు చూస్తారు. అది యెహోవాసాక్షుల ఆధునిక చరిత్రలోని కీలకమైన మార్పులను తెలియజేస్తుంది. “తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు” అనే శీర్షికతో అప్పుడప్పుడూ నిజ జీవిత అనుభవాలు వస్తాయి. ఇవి, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోటకు వెళ్లి సేవచేయడం వల్ల సహోదర సహోదరీలు అనుభవించిన ఆనందాన్ని, సంతృప్తిని వివరిస్తాయి.
ఈ పత్రిక సహాయంతో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం కోసం వెచ్చించే సమయాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించాలని మేము కోరుకుంటున్నాం.
ప్రచురణకర్తలు
[3వ పేజీలోని చిత్రం]
1879
[3వ పేజీలోని చిత్రం]
1895
[3వ పేజీలోని చిత్రం]
1931
[3వ పేజీలోని చిత్రం]
1950
[3వ పేజీలోని చిత్రం]
1974
[3వ పేజీలోని చిత్రం]
2008