కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి’

‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి’

‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి’

“నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. . . . నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.”—యెహో. 1:7-9.

వీటికి మీ సమాధానాలు ఏమిటో చూడండి:

హనోకు, నోవహు ఎలా ధైర్యం చూపించారు?

పూర్వకాలంలోని కొందరు స్త్రీలు విశ్వాసం, ధైర్యం చూపించే విషయంలో ఎలా చక్కని మాదిరి ఉంచారు?

యౌవనప్రాయంలో ధైర్యం చూపించిన ఏ కొందరి ఉదాహరణలు మీకు నచ్చాయి?

1, 2. (ఎ) కొన్నిసార్లు సరైనది చేయాలంటే మనకు ఏమి అవసరమౌతుంది? (బి) మనం ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

 భయానికి, భీతికి, పిరికితనానికి విరుద్ధమైనదే ధైర్యం. సాధారణంగా బలవంతుడూ, పరాక్రమవంతుడూ అయిన వ్యక్తిని ధైర్యవంతుడని మనం అనుకుంటాం. కొన్నిసార్లు సరైనది చేయడానికి మనకు అచంచలమైన ధైర్యం అవసరమౌతుంది.

2 బైబిల్లో ప్రస్తావించబడిన కొంతమంది వ్యక్తులు భయానక పరిస్థితుల్లో ఎంతో ధైర్యాన్ని చూపించారు. మరికొంతమందేమో, సాధారణంగా యెహోవా సేవకులకు ఎదురయ్యే పరిస్థితుల్లో ధైర్యాన్ని కనబరిచారు. వాళ్ల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనం ఎలా ధైర్యాన్ని చూపించవచ్చు?

భక్తిహీన లోకంలో ధైర్యంగా సాక్ష్యమిచ్చిన వ్యక్తులు

3. భక్తిహీనుల విషయంలో హనోకు ఏమని ప్రవచించాడు?

3 జలప్రళయానికి ముందటి కాలంలో భూమ్మీదున్న దుష్టుల మధ్య ఒక వ్యక్తి యెహోవాసాక్షిగా ఉండాలంటే ఎంతో ధైర్యం అవసరమయ్యేది. అలాంటి ప్రజల మధ్య, “ఆదాము మొదలుకొని యేడవవాడైన” హనోకు ఈ ప్రవచనాన్ని ధైర్యంగా ప్రకటించాడు, “ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు [యెహోవా] తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.” (యూదా 14, 15) ఆ ప్రవచనం నెరవేరి తీరుతుంది కాబట్టి యెహోవా ఆ దుష్టవిధానానికి తీర్పు తీర్చకముందే అది జరిగినట్లుగా హనోకు మాట్లాడాడు. నిజంగానే, భూవ్యాప్తంగా వచ్చిన జలప్రళయంలో భక్తిహీనులు నాశనమయ్యారు.

4. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నోవహు ‘దేవునితో నడిచాడు’?

4 హనోకు ప్రకటనాపని ముగిసిన 650కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత అంటే సా.శ.పూ. 2370లో జలప్రళయం వచ్చింది. ఆ మధ్యకాలంలో నోవహు జీవించాడు. ఆయన తన కుమారులతో కలిసి ఒక ఓడను నిర్మించాడు. దుష్టులుగా మారిన దేవదూతలు మనుష్యుల రూపందాల్చి అందమైన స్త్రీలను పెళ్లిచేసుకొని నెఫీలులను కన్నారు. అంతేకాక, భూమ్మీద దుష్టత్వం పెచ్చుపెరిగిపోయి అంతటా హింస చెలరేగింది. (ఆది. 6:1-5, 9, 11) అలాంటి పరిస్థితులు ఉన్నా, ‘నోవహు దేవునితో నడిచాడు,’ ధైర్యంగా ‘నీతిని ప్రకటించాడు.’ (2 పేతురు 2:4, 5 చదవండి.) ఈ అంత్యదినాల్లో మనకు కూడా అలాంటి ధైర్యమే అవసరం.

విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపించినవాళ్లు

5. మోషే విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఎలా చూపించాడు?

5 మోషే ఎంతో విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపించాడు. (హెబ్రీ. 11:24-27) ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చి అరణ్యంలో వాళ్లను నడిపించడానికి యెహోవా సా.శ.పూ. 1513 నుండి సా.శ.పూ. 1473 వరకు మోషేను ఉపయోగించుకున్నాడు. ఆ నియామకానికి తగినవాణ్ణి కాదని మోషే అనుకున్నాడు, కానీ చివరకు దాన్ని అంగీకరించాడు. (నిర్గ. 6:12) ఆయన తన అన్న అహరోనుతో కలిసి ఐగుప్తీయుల నిరంకుశ పరిపాలకుడైన ఫరో దగ్గరికి వెళ్లి యెహోవా తీసుకురాబోయే పది తెగుళ్ల గురించి ధైర్యంగా ప్రకటించాడు. యెహోవా ఆ తెగుళ్లతో ఐగుప్తీయుల దేవుళ్లను అవమానపర్చి తన ప్రజల్ని విడుదల చేశాడు. (నిర్గ., 7-12 అధ్యాయాలు) దేవుడు మోషేకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపించాడు. మనకు కూడా దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు.—ద్వితీ. 33:27.

6. ఒకవేళ అధికారులు మనల్ని ప్రశ్నిస్తే ధైర్యంగా సాక్ష్యమివ్వడానికి మనకేది సహాయం చేస్తుంది?

6 మనకు కూడా మోషేకు ఉన్నలాంటి ధైర్యమే ఉండాలి. ఎందుకంటే యేసు ఇలా అన్నాడు, ‘వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు,—ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నదే గాని మాటలాడువారు మీరు కారు.’ (మత్త. 10:18-20) ఒకవేళ అధికారులు మనల్ని ప్రశ్నిస్తే విశ్వాసంతో, ధైర్యంతో గౌరవపూర్వకంగా సాక్ష్యమివ్వడానికి యెహోవా ఆత్మ మనకు సహాయం చేస్తుంది.—లూకా 12:11, 12 చదవండి.

7. యెహోషువ ఎందుకు ధైర్యంగా ఉండి విజయం సాధించగలిగాడు?

7 మోషే తర్వాత ఇశ్రాయేలీయులపై నాయకుడిగా నియమించబడిన యెహోషువ దేవుని ధర్మశాస్త్రాన్ని క్రమంగా అధ్యయనం చేయడం వల్ల ఆయన విశ్వాసం, ధైర్యం బలపడ్డాయి. సా.శ.పూ. 1473లో ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో, “నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము” అని దేవుడు ఆజ్ఞాపించాడు. ధర్మశాస్త్రాన్ని పాటించడంవల్ల యెహోషువ వివేకంగా నడుచుకున్నాడు, విజయం సాధించాడు. యెహోవా ఆయనకు ఇలా చెప్పాడు, “దిగులుపడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.” (యెహో. 1:7-9) ఆ మాటలు యెహోషువను ఎంత బలపర్చి ఉంటాయో కదా! నిజంగానే, యెహోవా ఆయనకు తోడుగా ఉన్నాడు. దానివల్ల, కేవలం ఆరు సంవత్సరాల్లోనే అంటే సా.శ.పూ. 1467కల్లా వాగ్దాన దేశంలోని చాలా పట్టణాలను ఆయన జయించాడు.

ధైర్యం చూపించిన పరాక్రమంగల స్త్రీలు

8. విశ్వాసం, ధైర్యం చూపించడంలో రాహాబు ఎలాంటి మాదిరిని ఉంచింది?

8 గడిచిన శతాబ్దాల్లో ఎంతోమంది పరాక్రమంగల స్త్రీలు యెహోవా ఆరాధన కోసం సాహసాలు చేశారు. ఉదాహరణకు, యెరికో పట్టణానికి చెందిన వేశ్యయైన రాహాబు దేవునిపై విశ్వాసం ఉంచి, యెహోషువ పంపించిన వేగులవాళ్లలో ఇద్దరిని ధైర్యంగా తన ఇంట్లో దాచింది. ఆ తర్వాత వాళ్లను పట్టుకోవడానికి రాజు పంపించిన భటుల్ని తప్పుదారి పట్టించింది. దానివల్ల, ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని జయించినప్పుడు ఆమె, ఆమె ఇంటివాళ్లు రక్షించబడ్డారు. రాహాబు పాపభరితమైన వేశ్యావృత్తి మానేసి యెహోవాను నమ్మకంగా ఆరాధించింది. అంతేకాక, మెస్సీయకు పూర్వీకురాలు కూడా అయింది. (యెహో. 2:1-6; 6:22, 23; మత్త. 1:1, 5) విశ్వాసం, ధైర్యం చూపించినందుకు ఆమె ఎంతగా ఆశీర్వదించబడిందో కదా!

9. దెబోరా, బారాకు, యాయేలు ధైర్యాన్ని ఎలా చూపించారు?

9 దాదాపు సా.శ.పూ. 1450లో యెహోషువ మరణించిన తర్వాత ఇశ్రాయేలులో న్యాయాధిపతులు న్యాయం తీర్చారు. కనాను రాజైన యాబీను 20 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులను అణగద్రొక్కాడు. అప్పుడు యెహోవా ఆ రాజుపై చర్య తీసుకునేందుకు ప్రవక్త్రి అయిన దెబోరా ద్వారా న్యాయాధిపతియైన బారాకును ప్రేరేపించాడు. బారాకు 10,000 మందిని వెంటబెట్టుకొని రాజైన యాబీను సైన్యానికి అధిపతియైన సీసెరాతో యుద్ధం చేయడానికి తాబోరు కొండమీదికి వెళ్లాడు. అప్పటికే సీసెరా కీషోను వాగు దగ్గర తన సైన్యంతో, 900 యుద్ధ రథాలతో ఉన్నాడు. ఇశ్రాయేలీయులు వాళ్లతో యుద్ధానికి దూసుకెళ్లారు. ఆ సమయంలో యెహోవా ఒక వరద వచ్చేటట్లు చేసినందువల్ల యుద్ధ భూమంతా బురదమయం కావడంతో కనానీయుల యుద్ధ రథాలు ముందుకు కదల్లేకపోయాయి. యుద్ధంలో బారాకు మనుష్యులదే పైచేయి కావడంతో “సీసెరాయొక్క సర్వసేనయు కత్తివాత కూలెను.” సీసెరా అక్కడి నుండి పారిపోయి యాయేలు గుడారంలో తలదాచుకున్నాడు. కానీ, ఆయన నిద్రపోతున్నప్పుడు యాయేలు ఆయనను చంపేసింది. ప్రవక్త్రి అయిన దెబోరా ప్రవచిస్తూ బారాకుతో చెప్పిట్లుగానే, వాళ్లు సాధించిన విజయానికి “ఘనత” యాయేలుకు వెళ్లింది. దెబోరా, బారాకు, యాయేలు ధైర్యంగా చర్య తీసుకున్నందు వల్ల ఇశ్రాయేలు “నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.” (న్యాయా. 4:1-9, 14-22; 5:20, 21, 31) దైవభక్తిగల చాలామంది స్త్రీపురుషులు అలాంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపించారు.

మన మాటలతో ఇతరులను ధైర్యపర్చవచ్చు

10. మన మాటలతో ఇతరుల్లో ధైర్యాన్ని నింపవచ్చని ఎందుకు చెప్పవచ్చు?

10 మన మాటలతో తోటి ఆరాధకుల్లో ధైర్యాన్ని నింపవచ్చు. సా.శ.పూ. 11వ శతాబ్దంలో దావీదు రాజు తన కుమారుడైన సొలొమోనుతో ఇలా అన్నాడు, “నీవు బలముపొంది, ధైర్యము తెచ్చుకొని యీ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతోకూడ నుండును; యెహోవా మందిరపు సేవను గూర్చిన పనియంతయు నీవు ముగించువరకు ఆయన నిన్ను ఎంతమాత్రమును విడువక యుండును.” (1 దిన. 28:20) దానితో, సొలొమోను ధైర్యంగా చర్య తీసుకొని యెరూషలేములో యెహోవా కోసం అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు.

11. ఇశ్రాయేలు బాలిక ధైర్యంగా చెప్పిన మాటల వల్ల ఒక వ్యక్తికి ఎలాంటి మేలు జరిగింది?

11 సా.శ.పూ. పదవ శతాబ్దంలో చెరగా కొనిపోబడిన ఒక ఇశ్రాయేలు బాలిక ధైర్యంగా చెప్పిన మాటల వల్ల ఒక కుష్ఠు రోగికి మేలు జరిగింది. కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న సిరియా సైన్యాధిపతియైన నయమాను దగ్గర ఆమె దాసురాలిగా పనిచేసేది. ఎలీషా ద్వారా యెహోవా చేసిన అద్భుతాల గురించి విన్న ఆమె తన యజమాని భార్య దగ్గరికి వెళ్లి, నయమాను ఇశ్రాయేలు దేశానికి వెళ్తే దేవుని ప్రవక్త ఆయనను బాగుచేస్తాడని చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే నయమాను ఇశ్రాయేలు దేశానికి వెళ్లి అద్భుతరీతిలో స్వస్థత పొందాడు, ఆ తర్వాత యెహోవా ఆరాధకుడయ్యాడు. (2 రాజు. 5:1-3, 10-17) మీరూ ఆమెలాగే దేవుణ్ణి ప్రేమిస్తున్న యౌవనస్థులైతే మీ టీచర్లకు, తోటి విద్యార్థులకు, మరితరులకు సాక్ష్యమివ్వడానికి యెహోవా మీకు కూడా ధైర్యాన్నిస్తాడు.

12. హిజ్కియా రాజు చెప్పిన మాటలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించాయి?

12 కష్టకాలాల్లో మనం ఆచితూచి మాట్లాడితే ఇతరుల్లో ధైర్యాన్ని నింపవచ్చు. సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో అష్షూరీయులు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా రాజు తన ప్రజలతో ఇలా అన్నాడు, “మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు. మాంససంబంధమైన బాహువే అతనికి అండ; మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు.” ఆయన చెప్పిన మాటలకు ప్రజలు ఎలా స్పందించారు? “జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.” (2 దిన. 32:7, 8) అలాంటి మాటలు, హింసలు ఎదురైనప్పుడు మనలో, ఇతర క్రైస్తవుల్లో ధైర్యాన్ని నింపుతాయి.

13. ధైర్యం చూపించే విషయంలో ఆహాబు రాజు దగ్గర గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్న ఓబద్యా ఎలాంటి మాదిరిని ఉంచాడు?

13 కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పకుండా ఉండడం ద్వారా కూడా ధైర్యాన్ని చూపించవచ్చు. సా.శ.పూ. పదవ శతాబ్దంలో దుష్ట రాణియైన యెజెబెలు యెహోవా ప్రవక్తల్ని చంపమని ఆజ్ఞ జారీ చేసినప్పుడు, ఆహాబు రాజు దగ్గర గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్న ఓబద్యా ఒక్కో “గుహలో ఏబదేసి” మంది చొప్పున వంద మంది ప్రవక్తలను ధైర్యంగా దాచిపెట్టాడు. (1 రాజు. 18:4) దైవభయంగల ఓబద్యాలాగే నేడు యెహోవా నమ్మకమైన సేవకుల్లో చాలామంది తమ తోటి విశ్వాసుల గురించిన వివరాలను హింసించేవాళ్లకు చెప్పకుండా వాళ్లను కాపాడి ధైర్యాన్ని ప్రదర్శించారు.

ధైర్యం చూపించిన ఎస్తేరు రాణి

14, 15. ఎస్తేరు రాణి విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఎలా చూపించింది? దాని వల్ల వచ్చిన ఫలితమేమిటి?

14 దుష్టుడైన హామాను సా.శ.పూ. ఐదవ శతాబ్దంలో పారసీక సామ్రాజ్యంలో ఉన్న యూదా జనాంగాన్ని నిర్మూలం చేసేందుకు ఒక పన్నాగం పన్నినప్పుడు రాణియైన ఎస్తేరు ఎంతో విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపించింది. అది తెలుసుకున్న యూదులు దుఃఖంలో మునిగిపోయి ఉపవాసం చేశారు. ఆ సమయంలో వాళ్లు యెహోవాకు మనస్ఫూర్తిగా ప్రార్థించి ఉంటారు. (ఎస్తే. 4:1-3) ఎస్తేరు రాణి కూడా ఎంతో దుఃఖపడింది. యూదులను సమూలంగా నాశనం చేయడానికి రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరు అన్న మొర్దెకై ఆమెకు పంపించాడు. అంతేకాక, తోటి యూదుల తరఫున రాజును వేడుకునేందుకు రాజ సముఖంలోకి వెళ్లమని మొర్దెకై ఆమెకు ఆజ్ఞాపించాడు. కానీ, రాజు అనుమతి లేకుండా ఆయన సముఖానికి వెళ్తే మరణశిక్ష విధించబడుతుందనే నియమం ఆ రాజ్యంలో ఉండేది.—ఎస్తే. 4:4-11.

15 మొర్దెకై ఎస్తేరుతో ఇలా అన్నాడు, ‘నీవు మౌనముగా ఉంటే విడుదల మరియొక దిక్కునుండి వచ్చును. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో?’ షూషనులో ఉన్న యూదులందరినీ సమకూర్చి తనకోసం ఉపవాసం ఉండమని ఎస్తేరు మొర్దెకైతో చెబుతూ, ‘నేనును ఉపవాసముందును; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను’ అంది. (ఎస్తే. 4:12-17) ఎస్తేరు ధైర్యంగా చర్య తీసుకుంది, యెహోవా తన ప్రజల్ని విడుదల చేశాడని ఆమె పేరుతో ఉన్న బైబిలు పుస్తకం చెబుతోంది. నేటి అభిషిక్త క్రైస్తవులు, వాళ్ల సహవాసులు కూడా శ్రమల కాలంలో అలాంటి ధైర్యాన్నే చూపిస్తారు. ‘ప్రార్థన ఆలకించే’ దేవుడు వాళ్లకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు.—కీర్తన 65:2; 118:6 చదవండి.

‘ధైర్యం తెచ్చుకోండి’

16. యేసు ఉదాహరణ నుండి క్రైస్తవ సంఘంలోని యౌవనస్థులు ఏమి నేర్చుకోవచ్చు?

16 మొదటి శతాబ్దంలో, యేసు 12 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఆలయంలోని ‘బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండెను. ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును, ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి.’ (లూకా 2:41-50) ఆయన బాలుడే అయినా, ఆలయంలోని బోధకులను ప్రశ్నించేంత విశ్వాసం, ధైర్యం అప్పటికే ఆయనకు ఉన్నాయి. యేసు ఉదాహరణను మనసులో ఉంచుకుంటే, క్రైస్తవ సంఘంలోని యౌవనస్థులు తమ ‘నిరీక్షణ గురించి హేతువు అడిగే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పడానికి’ దొరికే అవకాశాలన్నిటినీ ఉపయోగించుకోగలుగుతారు.—1 పేతు. 3:15, 16.

17. ‘ధైర్యం తెచ్చుకోండి’ అని యేసు తన శిష్యులను ఎందుకు ప్రోత్సహించాడు? మనమెందుకు ధైర్యంగా వ్యవహరించాలి?

17 ‘ధైర్యంగా ఉండండి’ అని యేసు ప్రోత్సహించాడు. (మత్త. 9:2, 22) ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు, “ఇదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను.” (యోహా. 16:32, 33) లోకం యేసు తొలి అనుచరులను ద్వేషించినట్లే మనల్ని కూడా ద్వేషిస్తుంది. అయినా మనం లోకంలోని వాళ్లలా మారకుండా ఉందాం. దేవుని కుమారుడు చూపించిన ధైర్యం గురించి ధ్యానిస్తే ఈ లోకం వల్ల కలుషితం కాకుండా ఉండేందుకు కావాల్సిన ధైర్యాన్ని పొందవచ్చు. యేసు లోకాన్ని జయించాడు, మనం కూడా జయించవచ్చు.—యోహా. 17:16; యాకో. 1:27.

18, 19. పౌలు తనకు విశ్వాసం, ధైర్యం ఉన్నాయని ఎలా చూపించాడు?

18 అపొస్తలుడైన పౌలు ఎన్నో పరీక్షల్ని ఎదుర్కొన్నాడు. ఒక సందర్భంలో, రోమా సైనికులు పౌలును కాపాడకపోయుంటే యెరూషలేములోని యూదులు ఆయనను చంపి ముక్కలు ముక్కలు చేసివుండేవాళ్లే. ఆ రోజు రాత్రి, “ప్రభువు అతని యొద్ద నిలుచుండి—ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడ సాక్ష్యమియ్యవలసియున్నదని చెప్పెను.” (అపొ. 23:11) ఆయన ప్రభువు చెప్పినట్లే చేశాడు.

19 కొరింథులోని సంఘాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నించిన ‘మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలులను’ ఆయన ధైర్యంగా గద్దించాడు. (2 కొరిం. 11:5; 12:11) పౌలు తన అపొస్తలత్వానికి రుజువుల్ని చూపించగలిగాడు కానీ వాళ్లు చూపించలేకపోయారు. చెరసాలలో వేయబడడం, దెబ్బలు తినడం, ప్రమాదకరమైన ప్రయాణాలు చేయడం, ఇతర అపాయాల్లో చిక్కుకోవడం, ఆకలిదప్పులతో ఉండడం, తరచుగా జాగరణలు చేయడం, తోటి సహోదరుల గురించి చింతించడం వంటి వాటన్నిటినీ ఆయన రుజువులుగా చూపించగలిగాడు. (2 కొరింథీయులు 11:23-28 చదవండి.) విశ్వాసం, ధైర్యం చూపించే విషయంలో ఆయన ఉంచిన చక్కని మాదిరిని బట్టి దేవుడే ఆయనకు బలాన్నిచ్చాడని తెలుస్తోంది.

20, 21. (ఎ) మనం అన్ని సందర్భాల్లో ధైర్యాన్ని కూడగట్టుకోవాలని చూపించేందుకు ఒక ఉదాహరణ ఇవ్వండి. (బి) ఎలాంటి పరిస్థితుల్లో మనకు ధైర్యం అవసరం కావచ్చు? అయితే మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

20 క్రైస్తవులందరూ తీవ్రమైన హింసను ఎదుర్కొంటారని చెప్పలేం. అయినా, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవాలంటే మనమందరం ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. ఈ ఉదాహరణను పరిశీలించండి, బ్రెజిల్‌లోని ఒక యువకుడు ఓ ముఠాలో సభ్యునిగా ఉన్నాడు. బైబిలు అధ్యయనం చేసిన తర్వాత, తన జీవితంలో మార్పులు చేసుకోవడం అవసరమని గ్రహించాడు. కానీ ఒక చిక్కొచ్చిపడింది. అదేమిటంటే, ముఠాను వదిలేసి వెళ్లేవాళ్లను చంపేసేవాళ్లు. ఆయన ఎంతో ప్రార్థించి, ఇకపై తాను ఎందుకు ఆ ముఠాలో సభ్యునిగా ఉండలేడో ముఠా నాయకుడికి బైబిలును ఉపయోగించి వివరించాడు. దాంతో ఆ యువకుణ్ణి ఏమీ చేయకుండా వదిలేశారు. ఆ తర్వాత ఆయన రాజ్య ప్రచారకుడు అయ్యాడు.

21 రాజ్య సువార్త ప్రకటించడానికి ధైర్యం అవసరం. స్కూల్లో తమ యథార్థతను కాపాడుకోవడానికి క్రైస్తవ పిల్లలకు ధైర్యం అవసరమౌతుంది. ఉద్యోగం చేస్తున్నవాళ్లు సమావేశంలోని అన్ని కార్యక్రమాలకు హాజరవడానికి సెలవు అడగాలంటే ధైర్యం అవసరం కావచ్చు. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాల్లో మనకు ధైర్యం అవసరమౌతుంది. మనకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా మనం చేసే ‘విశ్వాససహితమైన ప్రార్థనలు’ యెహోవా వింటాడు. (యాకో. 5:15) మన ప్రార్థనలు విని వాటికి జవాబుగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు, దాని సహాయంతో మనం ‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండగలుగుతాం!’

[అధ్యయన ప్రశ్నలు]

[11వ పేజీలోని చిత్రం]

భక్తిహీన లోకంలో హనోకు ధైర్యంగా ప్రకటించాడు

[12వ పేజీలోని చిత్రం]

యాయేలు నిబ్బరం కలిగి ధైర్యాన్ని చూపించింది