మన నిరీక్షణను బట్టి ఆనందిద్దాం
మన నిరీక్షణను బట్టి ఆనందిద్దాం
‘ఆ నిత్యజీవ నిరీక్షణను అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను.’—తీతు 1:1, 2.
వీటికి జవాబులు ఇవ్వగలరేమో చూడండి:
ఒక అభిషిక్త క్రైస్తవుడు యథార్థంగా ఉండి భూజీవితాన్ని ముగించినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందని మనకు ఎలా తెలుసు?
వేరే గొర్రెల నిరీక్షణ నిజమవడానికి, అభిషిక్త క్రైస్తవుల నిరీక్షణ నిజమవడానికి మధ్య ఎలాంటి సంబంధం ఉంది?
మన నిరీక్షణ నిజమవడాన్ని చూడాలంటే మనం ఎలాంటి ‘పరిశుద్ధమైన ప్రవర్తనను’ కలిగివుండాలి, ఎలాంటి ‘భక్తితో కూడిన క్రియలు’ చేయాలి?
1. యెహోవా ఇచ్చిన నిరీక్షణ మనం కష్టాల్ని తట్టుకునేందుకు ఎలా సహాయం చేస్తుంది?
యెహోవా “నిరీక్షణకర్తయగు దేవుడు” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. మనం ‘విస్తారమైన నిరీక్షణ గలవారమగుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని’ ఇస్తాడని, ‘విశ్వాసం ద్వారా మనలను సమస్తానందముతో, సమాధానముతో’ నింపుతాడని కూడా ఆయన అన్నాడు. (రోమా. 15:13) మనలో నిరీక్షణ ఉంటే ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలుగుతాం. అంతేగాక ఆనందంగా, సమాధానంగా ఉంటాం. ఆ నిరీక్షణ అభిషిక్త క్రైస్తవుల విషయంలోలాగే, ఇతర క్రైస్తవుల విషయంలో కూడా ‘నిశ్చలమును, స్థిరమునై ఆత్మకు లంగరువలే’ పనిచేస్తుంది. (హెబ్రీ. 6:17-19) జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు మనం మన నిరీక్షణపై ఆధారపడవచ్చు. అంతేకాక దానివల్ల మనం, అనుమానంతో లేదా అవిశ్వాసంతో కొట్టుకొనిపోకుండా ఉండగలుగుతాం.—హెబ్రీయులు 2:1; 6:11 చదవండి.
2. నేటి క్రైస్తవులకు ఏ రెండు నిరీక్షణలు ఉన్నాయి, అభిషిక్తులకున్న నిరీక్షణ విషయంలో ‘వేరే గొర్రెలకు’ చెందినవాళ్లు ఎందుకు ఆసక్తి చూపిస్తారు?
2 ఈ అంత్యదినాల్లో జీవిస్తున్న క్రైస్తవులకు పరలోక నిరీక్షణ గానీ భూనిరీక్షణ గానీ ఉంటుంది. అభిషిక్త క్రైస్తవుల ‘చిన్నమందలో’ మిగిలిన వాళ్లకు, పరలోకంలో అమర్త్యమైన జీవం పొంది క్రీస్తు రాజ్యంలో ఆయనతో కలిసి రాజులుగా, యాజకులుగా సేవ చేసే నిరీక్షణ ఉంది. (లూకా 12:32; ప్రక. 5:9, 10) వాళ్లకన్నా ఎంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న ‘వేరేగొర్రెలకు’ చెందిన ‘గొప్పసమూహంలోని’ సభ్యులకు మెస్సీయ రాజ్యంలో పౌరులుగా పరదైసు భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణ ఉంది. (ప్రక. 7:9, 10; యోహా. 10:16) ఇప్పటికీ భూమ్మీదున్న క్రీస్తు అభిషిక్త ‘సహోదరులకు’ చురుగ్గా మద్దతు ఇస్తేనే రక్షణ పొందుతామని వేరే గొర్రెలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. (మత్త. 25:34-40) అభిషిక్త క్రైస్తవులు తమ బహుమానాన్ని పొందుతారు, వేరే గొర్రెలు కూడా తాము ఎదురుచూసిన ఆశీర్వాదాల్ని పొందుతారు. (హెబ్రీయులు 11:39, 40 చదవండి.) మొదటిగా, అభిషిక్తులకున్న నిరీక్షణ గురించి పరిశీలిద్దాం.
అభిషిక్త క్రైస్తవులకున్న ‘సజీవమైన నిరీక్షణ’
3, 4. అభిషిక్తులు ఏ విధంగా ‘జీవంతో కూడిన నిరీక్షణ’ పొందగలిగేలా ‘మరలా జన్మిస్తారు’? ఆ నిరీక్షణ ఏమిటి?
3 అపొస్తలుడైన పేతురు అభిషిక్త క్రైస్తవులను ‘ఏర్పరచబడినవారు’ అని అంటూ వాళ్లకు రెండు పత్రికలు రాశాడు. (1 పేతు. 1:1) చిన్నమందకు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన నిరీక్షణ గురించి ఆయన వివరాలు ఇచ్చాడు. ఆయన తన మొదటి పత్రికలో ఇలా రాశాడు, “మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు.”—1 పేతు. 1:3-6.
4 పరలోక రాజ్య ప్రభుత్వంలో క్రీస్తుతో పాటు ఉండేందుకు యెహోవా ఎంపిక చేసిన కొద్దిమంది క్రైస్తవులు దేవుని ఆత్మాభిషిక్త కుమారులుగా ‘మరలా జన్మించాలి.’ క్రీస్తుతో పాటు రాజులుగా, యాజకులుగా ఉండడానికి దేవుడు వాళ్లను పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. (ప్రక. 20:6) ‘మరలా జన్మించడం’ వల్ల వాళ్లు ‘జీవంతో కూడిన నిరీక్షణ’ పొందుతారని పేతురు అన్నాడు. ఆ నిరీక్షణను ఆయన “పరలోకమందు” భద్రపర్చబడివున్న “అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము” అని అన్నాడు. సజీవమైన ఆ నిరీక్షణ వల్ల అభిషిక్తులు “మిక్కిలి ఆనందం” పొందుతారంటే అందులో ఆశ్చర్యం లేదు! అయితే, నమ్మకంగా ఉంటేనే వాళ్లు తమ బహుమానాన్ని పొందుతారు.
5, 6. అభిషిక్త క్రైస్తవులు తమ పిలుపును నిశ్చయం చేసుకోవడానికి ఎందుకు శాయశక్తులా కృషిచేయాలి?
5 అభిషిక్త క్రైస్తవులు తమ “పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు” శాయశక్తులా కృషిచేయాలని పేతురు తన రెండవ పత్రికలో వాళ్లను ప్రోత్సహించాడు. (2 పేతు. 1:10) విశ్వాసం, దైవభక్తి, సహోదర అనురాగం, ప్రేమ వంటి లక్షణాలను పెంపొందించుకోవడానికి వాళ్లు తీవ్రంగా కృషి చేయాలి. ‘ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండచేయును’ అని పేతురు అన్నాడు.—2 పేతురు 1:5-8 చదవండి.
6 పునరుత్థానం చేయబడిన యేసు, మొదటి శతాబ్దంలోని ఫిలదెల్ఫియ సంఘంలో ఉన్న ఆత్మాభిషిక్తులైన పెద్దలకు ఒక సందేశాన్ని ఇస్తూ ఇలా చెప్పాడు: “నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధనకాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.” (ప్రక. 3:10, 11) అభిషిక్త క్రైస్తవులు మరణం వరకు నమ్మకంగా ఉంటేనే “వాడబారని మహిమ కిరీటము” పొందుతారు.—1 పేతు. 5:4; ప్రక. 2:10.
రాజ్యంలోకి ప్రవేశించడం
7. యూదా తన పత్రికలో ఏ అద్భుతమైన నిరీక్షణ గురించి ప్రస్తావించాడు?
7 సుమారు సా.శ. 65వ సంవత్సరంలో యేసు తమ్ముడైన యూదా తన తోటి అభిషిక్త క్రైస్తవులకు ఒక పత్రిక రాస్తూ వాళ్లను “పిలువబడినవారు” అని సంబోధించాడు. (యూదా 1; హెబ్రీయులు 3:1 పోల్చండి.) దేవుని పరలోక రాజ్యానికి పిలవబడిన ‘క్రైస్తవులందరికీ’ ఉన్న రక్షణ అనే గొప్ప నిరీక్షణ గురించి ముఖ్యంగా ప్రస్తావిస్తూ పత్రిక రాయాలని ఆయన అనుకున్నాడు. (యూదా 3) వాళ్లకు చెప్పాల్సిన ఇతర ముఖ్యమైన విషయాలు ఉన్నప్పటికీ ఆ చిన్న పత్రిక ముగింపులో అభిషిక్త క్రైస్తవులకున్న అద్భుతమైన నిరీక్షణ గురించి ఆయన ఇలా రాశాడు: “తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా, మహిమయు మాహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.”—యూదా 24, 25.
8. యూదా 24, 25 ప్రకారం, ఒక అభిషిక్త క్రైస్తవుడు తన యథార్థతను నిరూపించుకున్నప్పుడు పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుందని మనకు ఎలా తెలుసు?
8 నమ్మకస్థులైన అభిషిక్త క్రైస్తవులు తొట్రిల్లి నాశనమవకుండా ఉండడానికి జాగ్రత్తపడతారు. తమను యేసుక్రీస్తు పునరుత్థానం చేసిన తర్వాత తాము ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొంది ఆనందంగా దేవుని సముఖంలో నిలబడతామనే బైబిలు ఆధారిత నిరీక్షణ వాళ్లకుంది. అభిషిక్త క్రైస్తవుల్లో ఒకరు చివరివరకు నమ్మకంగా ఉండి చనిపోతే, తప్పకుండా ‘అక్షయమైన, మహిమగల ఆత్మసంబంధ శరీరంతో’ పునరుత్థానం చేయబడతారు. (1 కొరిం. 15:42-44) ‘మారుమనస్సు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందంటే’ క్రీస్తు ఆత్మాభిషిక్త సహోదరుల్లో ఒకరు యథార్థంగా ఉండి భూజీవితాన్ని ముగించినప్పుడు పరలోకంలో ఇంకెంత ఎక్కువ సంతోషం కలుగుతుందో ఊహించండి! (లూకా 15:7) అప్పుడు గొప్ప ‘ఆనందంతో’ తన బహుమానాన్ని అందుకున్న అభిషిక్త క్రైస్తవునితో కలిసి యెహోవా, నమ్మకమైన ఆత్మ ప్రాణులు ఎంతో సంతోషిస్తారు.—1 యోహాను 3:2 చదవండి.
9. నమ్మకస్థులైన అభిషిక్త క్రైస్తవులకు రాజ్యంలో ప్రవేశం ఎలా ‘సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది’? ప్రస్తుతం భూమ్మీద ఉన్న అభిషిక్తులు ఆ నిరీక్షణ వల్ల ఏమి చేయగలుగుతారు?
9 పేతురు కూడా అభిషిక్త క్రైస్తవులకు రాస్తూ, వాళ్లు నమ్మకంగా ఉండి తమ పిలుపును నిశ్చయపర్చుకుంటే ‘మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో వాళ్లకు ప్రవేశం సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది’ అని అన్నాడు. (2 పేతు. 1:10, 11) వాళ్లకు పరలోక రాజ్యంలో ప్రవేశం ‘సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది,’ వాళ్ల క్రైస్తవ లక్షణాలు అందరికీ స్పష్టంగా కనబడతాయి. ‘సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది’ అనే విషయం జీవపు పరుగు పందెంలో పరుగెత్తడానికి కృషి చేసిన వాళ్లు ఆనందించే ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో సూచిస్తుంది. తాము ఎంతో నమ్మకంగా జీవించామనే విషయాన్ని గుర్తుచేసుకున్నప్పుడు వాళ్ల హృదయాలు అత్యానందంతో, కృతజ్ఞతతో ఉప్పొంగిపోతాయి. ప్రస్తుతం భూమ్మీద ఉన్న అభిషిక్త క్రైస్తవులు తమకున్న ఆ నిరీక్షణ వల్ల ‘కార్యసిద్ధి కోసం తమ మనసులను సిద్ధం చేసుకోగలుగుతారు.’—1 పేతు. 1:13, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
వేరేగొర్రెలకున్న ‘నిరీక్షణకు’ ఆధారం
10, 11. (ఎ) వేరేగొర్రెలకు ఏ నిరీక్షణ ఉంది? (బి) ఆ నిరీక్షణ నిజమవడంలో క్రీస్తు పాత్ర ఏమిటి, ‘దేవుని కుమారుల ప్రత్యక్షత’ పాత్ర ఏమిటి?
10 ‘క్రీస్తుతోడి వారసులుగా’ ఆత్మాభిషిక్తులైన ‘దేవుని పిల్లలకు’ మహిమాన్వితమైన నిరీక్షణ ఉందని అపొస్తలుడైన పౌలు రాశాడు. ఆ తర్వాత, లెక్కించలేనంత మంది ఉన్న వేరే గొర్రెలకు యెహోవా ఇచ్చిన అద్భుతమైన నిరీక్షణ గురించి చెబుతూ ఆయన ఇలా అన్నాడు: “దేవుని కుమారుల [అభిషిక్తుల] ప్రత్యక్షత కొరకు [మానవ] సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.”—రోమా. 8:14-21.
11 వాగ్దాన “సంతానము” ద్వారా మానవజాతిని “ఆది సర్పమైన” సాతాను అధీనంలో నుండి విడిపిస్తానని దేవుడు మాటిచ్చినప్పుడు మన ‘నిరీక్షణకు’ ఆధారాన్ని ఇచ్చాడు. (ఆది. 3:15; ప్రక. 12:9) ఆ ‘సంతానంలోని’ ప్రధాన భాగం యేసుక్రీస్తు. (గల. 3:16) మానవజాతి పాపమరణాల బానిసత్వం నుండి విడుదల పొందుతుందనే నిరీక్షణకు యేసు తన మరణపునరుత్థానాల ద్వారా గట్టి ఆధారాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నిరీక్షణ నిజమవడానికి, ‘దేవుని కుమారుల ప్రత్యక్షతకు’ సంబంధం ఉంది. మహిమ పొందిన అభిషిక్తులు ‘సంతానంలోని’ రెండవ భాగంగా ఉంటారు. యేసుతో కలిసి సాతాను దుష్టలోకాన్ని నాశనం చేసినప్పుడు వాళ్లు ‘ప్రత్యక్షమవుతారు.’ (ప్రక. 2:26, 27) దానివల్ల, మహాశ్రమలను దాటి వచ్చే వేరేగొర్రెలు రక్షింపబడతారు.—ప్రక. 7:9, 10, 14.
12. అభిషిక్తుల ప్రత్యక్షత వల్ల మానవజాతికి ఎలాంటి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి?
12 క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలనలో మానవ “సృష్టి” ఎంతో ఉపశమనం పొందుతుంది. మహిమ పొందిన “దేవుని కుమారులు” క్రీస్తుతోపాటు యాజకులుగా సేవ చేస్తూ యేసు విమోచన క్రయధన బలి ప్రయోజనాలను మానవజాతికి అన్వయించినప్పుడు మరో విధంగా ‘ప్రత్యక్షమవుతారు.’ పరలోక రాజ్య పౌరసత్వాన్ని పొందే మానవ “సృష్టి” పాపమరణాల ప్రభావం నుండి క్రమంగా విడుదల చేయబడుతుంది. దేవునికి లోబడే మనుష్యులందరూ ‘నాశనమునకు లోనైన దాస్యములో నుండి స్వాతంత్ర్యం పొందుతారు.’ వాళ్లు వెయ్యేళ్ల పరిపాలనంతటిలో, అలాగే దాని ముగింపులో వచ్చే చివరి పరీక్షలో యెహోవాకు నమ్మకంగా ఉంటే వాళ్ల పేర్లు ‘జీవగ్రంథంలో’ శాశ్వతంగా రాయబడతాయి. అప్పుడు వాళ్లు “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” అనుభవిస్తారు. (ప్రక. 20:7, 8, 11, 12) అది నిజంగా అద్భుతమైన నిరీక్షణ!
మన నిరీక్షణను సజీవంగా ఉంచుకోవడం
13. మన నిరీక్షణ దేనిమీద ఆధారపడి ఉంది? క్రీస్తు ఎప్పుడు ప్రత్యక్షమౌతాడు?
13 అభిషిక్తులు, వేరేగొర్రెలు తమ తమ నిరీక్షణలను సజీవంగా ఉంచుకోవడానికి సహాయం చేసే ఎన్నో విషయాలు పేతురు రాసిన రెండు ప్రేరేపిత పత్రికల్లో ఉన్నాయి. వాళ్ల నిరీక్షణ వాళ్లు చేసే క్రియలపై కాదుగానీ యెహోవా కృప పైనే ఆధారపడివుందని ఆయన ఆ పత్రికల్లో రాశాడు. “యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి” అని ఆయన రాశాడు. (1 పేతు. 1:13) తన నమ్మకమైన అనుచరులకు ప్రతిఫలాన్ని ఇవ్వడం ద్వారా, భక్తిహీన ప్రజలపై యెహోవా తీర్పులను అమలుచేయడం ద్వారా క్రీస్తు ప్రత్యక్షమౌతాడు.—2 థెస్సలొనీకయులు 1:6-10 చదవండి.
14, 15. (ఎ) మన నిరీక్షణను సజీవంగా ఉంచుకోవాలంటే మనం దేన్ని మనసులో ఉంచుకొని జీవించాలి? (బి) పేతురు ఏ సలహా ఇచ్చాడు?
14 మన నిరీక్షణను సజీవంగా ఉంచుకోవాలంటే మనం ‘యెహోవా దినం’ త్వరలోనే వస్తుందని మనసులో ఉంచుకొని జీవించాలి. అది ఇప్పుడున్న ‘ఆకాశములను’ అంటే మానవ పరిపాలనను, అలాగే ‘భూమిని’ అంటే దుష్ట మానవ సమాజాన్ని, ‘దానిమీదున్న కృత్యాలను’ నాశనం చేస్తుంది. పేతురు ఇలా రాశాడు, “ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు . . . ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.”—2 పేతు. 3:10-12.
15 ఇప్పుడున్న “ఆకాశముల” స్థానంలో ‘క్రొత్త ఆకాశములు’ అంటే క్రీస్తు రాజ్య ప్రభుత్వం, “భూమి” స్థానంలో ‘క్రొత్త భూమి’ అంటే భూమ్మీది నూతన మానవ సమాజం ఉంటాయి. (2 పేతు. 3:13) పేతురు ఆ తర్వాత, దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకం కోసం ‘కనిపెట్టుకొని’ ఉండాలంటే లేదా మన నిరీక్షణను సజీవంగా ఉంచుకోవాలంటే ఏమిచేయాలో స్పష్టంగా చెబుతూ ఇలా రాశాడు, “ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను, నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి.”—2 పేతు. 3:14.
మన నిరీక్షణకు అనుగుణంగా నడుచుకోవడం
16, 17. (ఎ) ‘పరిశుద్ధమైన ప్రవర్తనను’ కలిగివుండడం అంటే ఏమిటి? ‘భక్తితో కూడిన క్రియలు’ చేయాలంటే మనం ఏయే పనులు చేయాలి? (బి) మన నిరీక్షణ ఎలా నిజమౌతుంది?
16 మన నిరీక్షణను సజీవంగా ఉంచుకోవడం మాత్రమే కాదు దానికి అనుగుణంగా జీవించడం కూడా ప్రాముఖ్యం. ఆధ్యాత్మికంగా మనం ఎలా ఉన్నామో పరిశీలించుకోవాలి. “పరిశుద్ధమైన ప్రవర్తన” కలిగివుండాలంటే మనం నైతిక విషయాల్లో యథార్థంగా ఉంటూ ‘అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన’ కలిగివుండాలి. (2 పేతు. 3:11; 1 పేతు. 2:12) మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదర సహోదరీల పట్ల ప్రేమ కలిగివుండాలి. అంటే మన సంఘంలోని ఐక్యతను కాపాడడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. (యోహా. 13:35) యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలపర్చే పనులన్నీ ‘భక్తితో కూడిన క్రియలే.’ అంటే హృదయపూర్వకంగా ప్రార్థించాలి, ప్రతీరోజు బైబిలు చదవాలి, ధ్యానిస్తూ వ్యక్తిగత అధ్యయనం చేయాలి, కుటుంబ ఆరాధన చేయాలి, “రాజ్య సువార్త” ప్రకటించడంలో ఉత్సాహంగా పాల్గొనాలి.—మత్త. 24:14.
17 యెహోవా అనుగ్రహాన్ని పొందాలని, ప్రస్తుత దుష్టవిధానం ‘లయమైనప్పుడు’ ఆయన మనలను కాపాడాలని మనందరం కోరుకుంటాం. అప్పుడు మనం ‘అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానం చేసిన’ నిత్యజీవ నిరీక్షణ నిజమవడాన్ని కళ్లారా చూస్తాం.—తీతు 1:1, 2.
[అధ్యయన ప్రశ్నలు]
[22వ పేజీలోని చిత్రం]
అభిషిక్త క్రైస్తవులు ‘మరలా జన్మించడం’ వల్ల ‘జీవంతో కూడిన నిరీక్షణ’ పొందుతారు
[24వ పేజీలోని చిత్రం]
మీ కుటుంబంలో నిరీక్షణ సజీవంగా ఉండేలా చూసుకోండి