తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు బ్రెజిల్లో
ప్రస్తుతం 30 ఏళ్ల వయసున్న రూబ్యా (1) అనే సహోదరి కొన్ని సంవత్సరాల క్రితం, దక్షిణ బ్రెజిల్‌లోని ఓ చిన్న సంఘంలో సేవ చేస్తున్న సాండ్రా (2) అనే ఒక పయినీరు సహోదరిని చూడడానికి అక్కడికి వెళ్లింది. అప్పుడు జరిగిన ఓ సంఘటన రూబ్యా జీవితాన్నే మార్చేసింది. ఏమిటా సంఘటన? ఆమె మాటల్లోనే విందాం.
“నేను విన్న మాటలు నిజమేనా?”
“తను బైబిలు అధ్యయనం చేస్తున్న ఒక స్త్రీ దగ్గరకు సాండ్రా నన్ను తీసుకెళ్లింది. మాటల మధ్యలో ఆ స్త్రీ ఇలా అంది: ‘సాండ్రా, నాతో పాటు పనిచేసే ముగ్గురు అమ్మాయిలు బైబిలు నేర్చుకుంటామని అడిగారు, కానీ వాళ్లు కొంతకాలం వరకు ఆగాల్సిందేనని నేను వాళ్లకు చెప్పాను. ఎందుకంటే ఈ సంవత్సరం మరో కొత్త బైబిలు అధ్యయనం మొదలు పెట్టేంత సమయం నీకు లేదుగా.’ నేను విన్న మాటలు నిజమేనా అని నాకు అనిపించింది.
యెహోవా గురించి నేర్చుకోవాలనుకునే వాళ్లు కొంతకాలం వరకు ఆగాలా! మా సంఘంలోనైతే ఒక్క అధ్యయనం సంపాదించడానికే నేను నానా కష్టాలు పడ్డాను. ఆ ఊరిలోని వాళ్లకు సహాయం చేయాలని ఆ క్షణంలోనే, ఆ విద్యార్థి ఇంట్లో ఉండగానే నాకు బలంగా అనిపించింది. తర్వాత కొంతకాలానికే నేను నివసిస్తున్న పెద్ద నగరాన్ని విడిచిపెట్టి సాండ్రా పయినీరు సేవ చేస్తున్న ఆ చిన్న ఊరికి వచ్చేశాను.”దానివల్ల రూబ్యాకు ఎలాంటి ప్రతిఫలం లభించింది? ఆమె ఇలా అంటోంది: “అక్కడికి వెళ్లిన రెండు నెలల్లోనే నేను 15 బైబిలు అధ్యయనాలు మొదలు పెట్టాను. చెబితే అసలు నమ్మరు గానీ నా పరిస్థితి కూడా సాండ్రాలాగే తయారైంది, నాతో బైబిలు అధ్యయనం చేయడానికి చాలామంది విద్యార్థులు కొంతకాలం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.”
తన పరిచర్య ఎలావుందో పరిశీలించుకోవాలనే పురికొల్పు పొందాడు
ప్రస్తుతం 20వ పడిలో ఉన్న డయేగో (3) అనే సహోదరుడు, దక్షిణ బ్రెజిల్‌లోని ప్రూడెంటాపూలీస్ అనే ఒక చిన్న ఊరిలో సేవ చేస్తున్న కొంతమంది పయినీర్లను కలవడానికి వెళ్లాడు. ఆ సందర్శనం, తన పరిచర్యను మళ్లీ ఒకసారి పరిశీలించుకునేలా ఆయన్ను పురికొల్పింది. ఆయనిలా వివరిస్తున్నాడు: “నేను ప్రతీ నెల పరిచర్యలో కేవలం కొన్ని గంటలు మాత్రమే వెచ్చిస్తూ సంఘంలో మొక్కుబడిగా సేవ చేస్తుండేవాణ్ణి. కానీ ఆ పయినీర్లను కలిసి వాళ్ల అనుభవాలు విన్నాక, సంతోషంగా పరిచర్య చేస్తున్న ఆ సహోదరులకు, నామమాత్రంగా సేవ చేస్తున్న నాకు ఎంత తేడా ఉందో గ్రహించాను. వాళ్లు ఎంత ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నారో చూసినప్పుడు నా జీవితం కూడా వాళ్ల జీవితంలాగే అర్థవంతంగా ఉంటే బాగుంటుందని నాకనిపించింది.” వాళ్లను కలిసి వచ్చిన తర్వాత డయేగో పయినీరు సేవ మొదలుపెట్టాడు.
యౌవనులైన మీ పరిస్థితి కూడా డయేగో పరిస్థితిలానే ఉందా? మీరు ఒకవైపు ప్రకటనా పనికి, కూటాలకు వెళ్తున్నప్పటికీ మీ పరిచర్య ఏ మాత్రం కొత్తదనం లేకుండా యాంత్రికంగా తయారైందని అనిపిస్తోందా? అలాగైతే రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు వెళ్లి సేవ చేయడం ద్వారా ఆనందాన్ని చవిచూసేలా మీరు మీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోగలరా? కానీ ఇప్పుడు మీకున్న సౌకర్యాలను విడిచిపెట్టి అలా వెళ్లడం కష్టమనిపించవచ్చు. అయినా చాలామంది యువతీయువకులు అలా వెళ్లారు. వీలైనంత ఎక్కువగా యెహోవా సేవ చేసేలా వాళ్లు తమ ఆశలను, ఆశయాలను మార్చుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. అలాంటి నిర్ణయమే తీసుకున్న బ్రూనో అనే ఓ సహోదరుని అనుభవాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం.
సంగీతమా? పరిచర్యా?
ప్రస్తుతం 28 ఏళ్లున్న బ్రూనో (4) కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రఖ్యాత సంగీత పాఠశాలలో సంగీతం అభ్యసించాడు. ఓ వాయిద్య బృందానికి నాయకత్వం వహించాలన్నదే ఆయన లక్ష్యం. చివరికి
బ్రూనో తన విద్యలో ఎంతో రాణించాడు. చాలా సందర్భాల్లో వాయిద్య బృందంతో కలిసి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆయనను ఆహ్వానించారు. అలా ఈ లోకంలో ఆయన బంగారు భవిష్యత్తుకు బాట ఏర్పడింది. “అయినా, జీవితంలో ఏదో లోటు ఉందని నాకు అనిపించింది” అని బ్రూనో అన్నాడు. ఆయనింకా ఇలా అన్నాడు, “నేను యెహోవాకు సమర్పించుకున్నప్పటికీ ఆయన సేవలో చేయాల్సినదంతా చేయకపోవడం వల్ల నాకు మనశ్శాంతి కరువైందని గ్రహించాను. నా బాధను యెహోవాకు ప్రార్థనలో తెలియజేశాను, సంఘంలో అనుభవంగల సహోదరులతో కూడా మాట్లాడాను. బాగా ఆలోచించిన తర్వాత, సంగీతాన్ని పక్కన పెట్టి పరిచర్యకు మొదటి స్థానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. తర్వాత సంగీత పాఠశాలకు వెళ్లడం మానేసి, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్లాను.” ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?సౌ-పావ్లో పట్టాణానికి సుమారు 260 కిలోమీటర్ల దూరంలో, ఇంచుమించు 7,000 జనాభా ఉన్న గ్వాపీయార అనే ఊరికి వెళ్లి బ్రూనో సేవ చేయడం మొదలుపెట్టాడు. అది ఆయన జీవితంలో పెద్ద మార్పు. ఆయన ఇలా అన్నాడు: “అక్కడికి వెళ్లాక టీవీ, ఫ్రిజ్, ఇంటర్నెట్ వంటివేవీ లేని చిన్న ఇంట్లో ఉన్నాను. కానీ గతంలో మా ఇంట్లోలేనివి ఇక్కడ ఉన్నాయి, ఈ ఇంటి చుట్టూ కూరగాయలు, పండ్లు ఉన్న మంచి తోట ఉంది.” అక్కడున్న చిన్న సంఘంలో సేవ చేసేటప్పుడు బ్రూనో వారానికి ఒకసారి కొంత ఆహారం, నీళ్లు, సాహిత్యం సిద్ధం చేసుకుని మోటరుసైకిలు మీద దగ్గరున్న పల్లెటూళ్లకు వెళ్లి ప్రకటించేవాడు. ఆ ప్రాంతాల్లో చాలా మంది ఇంతకు ముందెన్నడూ సువార్త వినలేదు. “నేను 18 బైబిలు అధ్యయనాలు నిర్వహించాను. ఆ బైబిలు విద్యార్థులు తమ జీవితాల్లో మార్పులు చేసుకోవడం చూసినప్పుడు నాకు చెప్పలేని ఆనందం కలిగింది” అని బ్రూనో అంటున్నాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “నా జీవితంలో ఉన్న లోటు ఏమిటో నేను అప్పుడు గ్రహించాను, రాజ్యసంబంధ విషయాలకు మొదటి స్థానం ఇవ్వడం ద్వారా వచ్చే సంతృప్తి నాకు ఇదివరకు లేదని అర్థమైంది. నేను వస్తుసంపదల కోసం ప్రాకులాడి ఉంటే ఈ సంతృప్తిని ఎన్నడూ పొందివుండేవాణ్ణి కాదు.” మరి అక్కడ బ్రూనోకు ఖర్చుల కోసం డబ్బు ఎలా? “గిటార్ పాఠాలు నేర్పించడం ద్వారానే” అని చిరునవ్వుతో ఆయన అంటున్నాడు. ఒక విధంగా చూస్తే, బ్రూనో ఇంకా సంగీత విద్వాంసుడే.
“నేను ఇక్కడే ఉండిపోయాను”
ప్రస్తుతం 30వ పడికి దగ్గర్లో ఉన్న మారీయానా (5) పరిస్థితి కూడా బ్రూనో పరిస్థితిలానే ఉండేది. ఆమె అప్పట్లో లాయరు వృత్తిలో ఉండేది. ఆ పనిలో ఆమెకు డబ్బు బాగా వస్తున్నప్పటికీ లోలోపల ఏదో అసంతృప్తి ఉండేది. “నేను ‘గాలి కోసం ప్రయాసపడుతున్నట్లు’ నాకు అనిపించేది” అని ఆమె అంటోంది. (ప్రసం. 1:17) పయినీరు సేవను చేపట్టడం గురించి ఆలోచించమని చాలామంది సహోదరసహోదరీలు ఆమెను ప్రోత్సహించారు. దానిగురించి ఆలోచించిన తర్వాత తను నివసించే పట్టణానికి వేల కిలోమీటర్ల దూరంలో బొలీవియా దగ్గర్లోని బార-డూ-బూగ్రెస్ అనే ఒక మారుమూల సంఘానికి వెళ్లి సహాయం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమె స్నేహితురాళ్లు, బీయాంక (6), కారోలీన్ (7), జూలీయాన (8) కూడా ఆమెతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఏం జరిగింది?
మారీయానా ఇలా అంటోంది: “మొదట్లో మూడు నెలల కోసమని అక్కడకి వెళ్లాను. కానీ ఆ మూడు నెలలు గడిచే సమయానికి నా చేతిలో 15 బైబిలు అధ్యయనాలు ఉన్నాయి. అయితే, సత్యానికి తగినట్లు జీవితంలో మార్పులు చేసుకోవడానికి ఆ విద్యార్థులకు ఎంతో సహాయం అవసరం. కాబట్టి నేను వెళ్లిపోతున్నానని వాళ్లతో చెప్పడానికి ధైర్యం చాల్లేదు. అందుకే నేను ఇక్కడే ఉండిపోయాను.” నిజానికి మిగిలిన ముగ్గురు సహోదరీలు కూడా అదే చేశారు. అలా చేయడంవల్ల మారీయానా జీవితానికి ఏదైనా కొత్త అర్థం చేకూరిందా? ఆమె ఇలా వివరిస్తోంది: “తమ జీవితాల్ని మెరుగుపర్చుకునేలా ప్రజలకు సహాయం చేసేందుకు యెహోవా నన్ను ఉపయోగించుకుంటున్నాడనే ఆలోచనే ఓ గొప్ప అనుభూతి. నిజంగా ప్రయోజనాన్నిచ్చే వాటికోసం నేను నా సమయాన్ని, శక్తిని ధారపోస్తున్నానని తెలుసుకోవడం ఓ ఆశీర్వాదం.” తన సేవ గురించి కారోలీన్ ఎలా భావిస్తుందో ఆమె స్వయంగా చెప్పిన ఈ మాటల్లో చూడవచ్చు: “రోజంతా రాజ్య సంబంధ విషయాల కోసమే కష్టపడతాను కాబట్టి నిద్రకు ఉపక్రమించే సమయానికి మనసంతా ఎంతో తృప్తిగా ఉంటుంది. నా బైబిలు విద్యార్థులకు ఎలా సహాయం చేయాలన్న దానిగురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాను. వాళ్లు జీవితాల్లో మార్పులు చేసుకోవడం చూస్తే అద్భుతమనిపిస్తుంది. ‘యెహోవా ఉత్తముడని’ నేను స్వయంగా రుచి చూసి తెలుసుకున్నాను.” అక్కడ సేవ చేస్తున్న మిగతా ముగ్గురు సహోదరీలు కూడా అలాగే భావిస్తున్నారు.—కీర్త. 34:8.
మారుమూల ప్రాంతాల్లో రాజ్య సువార్తను ప్రకటించడానికి ప్రపంచ నలుమూలల నుండి “ఇష్టపూర్వకముగా” ముందుకు వస్తున్న యౌవన సహోదరసహోదరీల సంఖ్య రోజురోజుకీ పెరగడాన్ని చూసి యెహోవా ఎంత సంతోషిస్తున్నాడో కదా! (కీర్త. 110:3; సామె. 27:11) అలాంటి వాళ్లందరూ యెహోవా మెండైన ఆశీర్వాదాలను రుచి చూస్తారు.—సామె. 10:22.