ఆనాటి జ్ఞాపకాలు
‘అంతకుముందెన్నడూ వినని అద్భుతమైన సందేశం’
“ఏంటీ ఇవన్నీ?” కెనడాలో ఉన్న సస్కత్‌చెవాన్‌లోని సస్కటూన్‌లో ఒకప్పుడు ఆయుధాలు నిలువ ఉంచిన స్థలంలో కుప్పగా పడివున్న 18 మీటర్ల చెక్క దుంగలను చూసి సహోదరుడు జార్జ్ నేష్ అడిగిన ప్రశ్న అది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సిగ్నల్ టవర్లను నిర్మించడానికి వాటిని ఉపయోగించారని ఆయనకు చెప్పారు. “ఈ దుంగలను ఉపయోగించి రేడియో టవర్లను నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచన నాకు వచ్చింది. దాంతో బైబిలు సత్యాలను ప్రసారం చేసే రేడియో స్టేషన్ మొదలుపెట్టాలనే పథకం రూపుదిద్దుకుంది” అని సహోదరుడు నేష్ అన్నాడు. సంవత్సరం తిరిగేసరికల్లా అంటే 1924లో, CHUC పేరుతో ఆ రేడియో స్టేషన్ తన ప్రసారాలను మొదలుపెట్టింది. కెనడాలో మతసంబంధ విషయాలను ప్రసారం చేసిన మొదటి రేడియో స్టేషన్లలో ఇది ఒకటి.
దరిదాపుగా ఐరోపా ఖండమంత విస్తీర్ణంలో ఉన్న కెనడాలో రేడియోల ద్వారా సాక్ష్యమివ్వడానికి అనువైన పరిస్థితులు అప్పట్లో ఉండేవి. సస్కటూన్ రేడియో స్టేషన్లో పనిచేసిన సహోదరి ఫ్లోరన్స్ జాన్సన్ ఇలా అంది: “మన రేడియో ప్రసారాల వల్ల, మనం స్వయంగా వెళ్లి కలవలేని ఎంతోమంది ప్రజల దగ్గరకు సత్యం చేరింది. ప్రజలకు అప్పట్లో రేడియో కొత్త కాబట్టి రేడియోలో ప్రసారమయ్యే కార్యక్రమాలన్నిటినీ వాళ్లు ఆత్రంగా వినేవాళ్లు.” 1926 కల్లా బైబిలు విద్యార్థులు (యెహోవాసాక్షులను అప్పట్లో అలా పిలిచేవాళ్లు) కెనడాలోని నాలుగు పట్టణాల్లో తమ సొంత రేడియో స్టేషన్లను నడపడం మొదలుపెట్టారు. a
ఆ రేడియో ప్రసారాల్లో ఎటువంటి కార్యక్రమాలు వచ్చేవి? స్థానిక సంఘంలో ఉన్న సహోదరసహోదరీలు వాయిద్యకారులతో, కొన్నిసార్లు చిన్నచిన్న వాద్యబృందాలతో కలిసి పాడే పాటలు వచ్చేవి. వాటితోపాటు సహోదరులిచ్చే ప్రసంగాలను, బైబిలు చర్చా కార్యక్రమాలను కూడా ప్రసారం చేసేవాళ్లు. అలాంటి చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న ఏమీజోన్స్ ఇలా గుర్తుచేసుకుంది: “పరిచర్యలో నన్ను నేను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు వాళ్లు, ‘ఓ మీరా! నేను రేడియోలో మీ గొంతు విన్నాను’ అనేవాళ్లు.”
హ్యాలిఫాక్స్, నోవస్కోటియా నగరాల్లోని బైబిలు విద్యార్థులు అప్పట్లో వినూత్నమైన ఒక పద్ధతిని ఉపయోగించుకున్నారు, ఆ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్లు చేసి తమకున్న బైబిలు ప్రశ్నలను అడిగే సౌలభ్యం ఉండేది. కార్యక్రమానికి వచ్చిన స్పందన గురించి ఒక సహోదరుడు ఇలా రాశాడు: “ఈ కార్యక్రమానికి శ్రోతల నుండి ఊహించనంత స్పందన వచ్చింది. ఎన్ని
ఫోన్‌కాల్స్ వచ్చేవంటే, కొన్నిసార్లు అన్ని ఫోన్కాల్స్నూ తీసుకోవడం మావల్ల అయ్యేది కాదు.”అపొస్తలుడైన పౌలు విషయంలో జరిగినట్లే ఈ సహోదరుల సందేశానికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. (అపొ. 17:1-5) వాళ్లు చెబుతున్న విషయాలు కొంతమంది శ్రోతలకు నచ్చాయి. ఉదాహరణకు, బైబిలు విద్యార్థులు స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్స్ గురించి రేడియోలో ప్రస్తావించినప్పుడు హెక్టర్ మార్షల్ అనే వ్యక్తి ఆరు సంపుటులను ఆర్డర్ చేశాడు. “సండే స్కూల్లో బోధించడానికి అవి నాకు ఉపయోగపడతాయని నేను అనుకున్నాను” అని ఆయన ఆ తర్వాత రాశాడు. కానీ వాటిలోని మొదటి సంపుటిని చదవడం పూర్తయ్యేసరికి ఆయన తాను వెళ్తున్న చర్చీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఉత్సాహంగా సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. 1998లో చనిపోయేంత వరకూ ఆయన యెహోవాకు నమ్మకంగా సేవ చేశాడు. తూర్పు నోవస్కోటియాలో “రాజ్యం, ప్రపంచ నిరీక్షణ” అనే ప్రసంగం రేడియోలో ప్రసారమైన మరుసటి రోజు కల్నల్ జె. ఎ. మెక్‌డొనాల్డ్ ఓ స్థానిక సహోదరునితో ఇలా అన్నాడు: “కేప్ బ్రెటన్ ద్వీపంలోని ప్రజలు తమ జీవితంలో ఎన్నడూ వినని ఒక అద్భుతమైన సందేశాన్ని నిన్న విన్నారు.”
కానీ మత నాయకులకు మాత్రం చాలా కోపం వచ్చింది. బైబిలు విద్యార్థుల కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న రేడియో స్టేషన్‌ను ధ్వంసం చేస్తామని హ్యాలిఫాక్స్లో కొంతమంది క్యాథలిక్కులు బెదిరించారు. మతనాయకుల ఒత్తిడి వల్ల బైబిలు విద్యార్థుల రేడియో స్టేషన్లకు అనుమతిని నిలిపివేస్తూ 1928లో అకస్మాత్తుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి ప్రతిస్పందనగా అక్కడి సహోదరసహోదరీలు ఆ అన్యాయాన్ని తీవ్రంగా నిరసిస్తూ ‘గాలి ఎవరి సొత్తు?’ అనే శీర్షికతో కరపత్రాన్ని పంచిపెట్టారు. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు రేడియో ప్రసారాల కోసం బైబిలు విధ్యార్థులకు అనుమతులు ఇవ్వలేదు.
కెనడాలో ఉన్న ఆ కొద్దిమంది యెహోవా సేవకుల ఉత్సాహాన్ని అది నీరుగార్చిందా? “మొదట్లో, అది శత్రువు సాధించిన గొప్ప విజయంలాగే మాకు అనిపించింది” అని సహోదరి ఇజబెల్ వేన్‌రైట్ ఒప్పుకుంది. “కానీ అలాంటి నిర్ణయాన్ని ఆపడం తన ఉద్దేశమైతే యెహోవా తప్పకుండా దాన్ని ఆపగలిగేవాడే. ఆపలేదు కాబట్టి, మేము రాజ్య సువార్తను ప్రకటించడానికి మరింత సమర్థవంతమైన పద్ధతి గురించి ఆలోచించాలని మాకు అర్థమైంది” అని కూడా ఆమె అంది. దాంతో, సాక్ష్యం ఇవ్వడానికి రేడియో మీద అతిగా ఆధారపడే బదులు కెనడాలోని బైబిలు విద్యార్థులు ప్రజలను వాళ్ల ఇళ్ల దగ్గరకే వెళ్లి కలుసుకునేందుకు కృషి చేయడం మొదలుపెట్టారు. ఏదేమైనా ఆ సంవత్సరాలన్నిటిలో ప్రజలు ‘అంతకుముందెన్నడూ వినని అద్భుతమైన సందేశం’ వినడంలో రేడియో చాలా పెద్ద పాత్ర పోషించింది.—కెనడాలోని మన ఆర్కైవ్స్ విభాగం నుండి.
a సహోదరులు డబ్బు చెల్లించి కెనడాలో ఉన్న ఇతర రేడియో స్టేషన్ల ద్వారా కూడా సాక్ష్యం ఇచ్చేవాళ్లు.