కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుణ్ణి తెలుసుకున్నాం, మరి ఇప్పుడేమిటి?

దేవుణ్ణి తెలుసుకున్నాం, మరి ఇప్పుడేమిటి?

“మీరు దేవునిని ఎరిగినవారు.”—గల. 4:9.

1. విమానం బయలుదేరే ముందు పైలట్లు చిట్టా ప్రకారం ఎందుకు తనిఖీ చేసుకోవాలి?

 ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాల్ని నడిపే పైలట్లకు 30 పైచిలుకు సూచనలు ఉండే ఓ చిట్టా ఇస్తారు. విమానం బయలుదేరే ముందు ప్రతీసారి ఆ చిట్టా ప్రకారం జాగ్రత్తగా తనిఖీ చేయాలి. పైలట్లు ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఘోరమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తనిఖీ తప్పకుండా చేయాలని ముఖ్యంగా ఎలాంటి పైలట్లకు చెబుతారో తెలుసా? బాగా అనుభవం గడించిన పైలట్లకే! ఎందుకంటే, అనుభవజ్ఞులైన పైలట్లు ఒకలాంటి ధీమా వల్ల ఆ తనిఖీ పూర్తి చేయకుండా బయలుదేరే ప్రమాదం ఉంది.

2. క్రైస్తవులు ఎలాంటి తనిఖీ చిట్టా ప్రకారం సరిచూసుకోవాలి?

2 అత్యవసర సమయంలో మీ విశ్వాసం ప్రమాదానికి గురికాకూడదంటే, మీరు కూడా జాగ్రత్తపరుడైన పైలట్‌లా తనిఖీ చేసుకోవాల్సిన చిట్టా ఒకటుంది. మీరు ఈ మధ్యే బాప్తిస్మం తీసుకున్నా, ఎంతో కాలంగా దేవుని సేవలో ఉన్నా మీ విశ్వాసం, దైవభక్తి ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అలా ఎప్పటికప్పుడు, జాగ్రత్తగా సరిచూసుకోకపోతే మనం దేవునికి దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే బైబిలు మనల్ని ఇలా హెచ్చరిస్తోంది: “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.”—1 కొరిం. 10:12.

3. గలతీయలోని క్రైస్తవులు ఏమి చేయాల్సివుంది?

3 విశ్వాసం ఎంత బలంగా ఉందో సరిచూసుకుంటూ, దేవుడిచ్చిన స్వాతంత్ర్యం పట్ల కృతజ్ఞతతో ఉండాలని గలతీయలోని క్రైస్తవులకు పౌలు రాశాడు. యేసు తన ప్రాణాన్ని బలిగా అర్పించి, తన మీద విశ్వాసముంచే వాళ్లందరి కోసం దేవుణ్ణి తెలుసుకోవడానికి ఉన్న అత్యుత్తమ మార్గాన్ని తెరిచాడు. అంటే, దేవునికి పిల్లలయ్యే అవకాశం కల్పించాడు! (గల. 4:9) గలతీయులు, దేవునితో ఉన్న ఆ ప్రత్యేకమైన సంబంధాన్ని కాపాడుకోవాలంటే, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని పట్టుబట్టే యూదామత ఛాందసుల బోధలను తిరస్కరించాలి. ఆసక్తికరంగా, అప్పటి సంఘాల్లో సున్నతి పొందని అన్యులు అంతకుముందెన్నడూ ధర్మశాస్త్రం కింద లేరు! అయితే యూదులు, అన్యులు ఒకేలా ఆధ్యాత్మిక ప్రగతి సాధించాల్సి ఉంది. అలా జరగాలంటే, మోషే ధర్మశాస్త్రం ద్వారా తాము నీతిమంతులుగా తీర్చబడమని వాళ్లు గ్రహించాలి.

దేవుణ్ణి తెలుసుకోవడానికి వేసిన తొలి అడుగులు

4, 5. గలతీయులకు పౌలు ఏ సలహా ఇచ్చాడు? దాని గురించి మనమెందుకు తెలుసుకోవాలి?

4 ఏ కాలంలోని క్రైస్తవులైనా బైబిలు సత్యమనే ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి, పాత విషయాలకు తిరిగి వెళ్లకూడదని తెలుసుకునేలా గలతీయులకు అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సందేశాన్ని బైబిల్లో నమోదు చేసి ఉంచారు. గలతీయలోని క్రైస్తవులు మాత్రమే కాక, తనను ఆరాధించే వాళ్లందరూ స్థిరంగా ఉండాలని చెప్పడానికి యెహోవా ఈ విషయాన్ని రాయించాడు.

5 మనమెలా ఆధ్యాత్మిక బానిసత్వం నుండి విడుదల పొంది యెహోవాసాక్షులం అయ్యామో జ్ఞాపకం చేసుకోవాలి. దానికోసం ఈ రెండు ప్రశ్నల గురించి ఆలోచించండి: బాప్తిస్మం పొందడానికి అర్హత సాధించే క్రమంలో వేసిన తొలి అడుగులు మీకు గుర్తున్నాయా? మీరు దేవుణ్ణి తెలుసుకోవడం, ఆయన మిమ్మల్ని తెలుసుకోవడం ఎలా జరిగిందో, దానివల్ల మీరెలా నిజమైన ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని పొందారో గుర్తుందా?

6. మనం ఇప్పుడు ఏ చిట్టా గురించి తెలుసుకుంటాం?

6 బాప్తిస్మం తీసుకోవడానికి మనందరం తొమ్మిది అడుగులు వేశాం. ఆధ్యాత్మిక తనిఖీ చిట్టాలా పనిచేసే వీటి పట్టిక,  “బాప్తిస్మానికి, నిరంతర అభివృద్ధికి దోహదపడే తొమ్మిది అడుగులు” అనే బాక్సులో ఉంది. ఆ అడుగులను ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, లోకం అందించే వాటి కోసం వెనక్కి వెళ్లకూడదని తీర్మానించుకునే బలాన్ని పొందుతాం. జాగ్రత్తపరుడైన, అనుభవజ్ఞుడైన పైలట్‌ ప్రమాదాలు నివారించడం కోసం, బయలుదేరే ముందు తనిఖీ చిట్టాలోని విషయాలను సరిచూసుకుంటాడు. అలాగే, దేవుని సేవలో నమ్మకంగా కొనసాగాలంటే మనం కూడా ఓ ఆధ్యాత్మిక తనిఖీ చిట్టాను చూసుకుంటూ ఉండాలి.

దేవునికి తెలిసినవాళ్లు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి

7. మనం ఏ ప్రమాణాన్ని లేదా క్రమాన్ని పాటించాలి? ఎందుకు?

7 విమానం బయలుదేరే ముందు ప్రతీసారి ఓ క్రమపద్ధతిలో చేయాల్సినవి కొన్ని ఉంటాయని తనిఖీ చిట్టాను చూసినప్పుడల్లా పైలట్లకు గుర్తుకొస్తుంది. ఆ పైలట్‌లాగే, మనల్ని మనం ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి లేదా పరిశీలించుకోవాలి. అంతేకాక, బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి ఎలాంటి క్రమాన్ని పాటిస్తున్నామో కూడా చూసుకోవాలి. తిమోతికి రాస్తూ పౌలు ఇలా అన్నాడు: “క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్యప్రమాణమును గైకొనుము.” (2 తిమో. 1:13) ఆ ‘హితవాక్యాలు’ దేవుని వాక్యంలో ఉన్నాయి. (1 తిమో. 6:3) ‘సత్య ప్రమాణము’ లేదా ‘సత్య క్రమము,’ చిత్రాన్ని వేసే ముందు చిత్రకారుడు గీసుకునే నమూనా లాంటిది. మనం ఆ సత్య క్రమాన్ని చూసి, యెహోవా కోరుతున్న దాన్ని అర్థంచేసుకోగలుగుతాం, దాన్ని పాటించగలుగుతాం. కాబట్టి, ఎంతవరకు అలా పాటిస్తున్నామో తెలుసుకునేందుకు మనమిప్పుడు బాప్తిస్మానికి నడిపించిన అడుగులను పరిశీలిద్దాం.

8, 9. (ఎ) మన విశ్వాసాన్ని, జ్ఞానాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి? (బి) ఆధ్యాత్మిక అభివృద్ధి ఎంత విలువైనదో, అది నిరంతరం ఎలా కొనసాగుతుందో ఉపమానంతో చెప్పండి.

8 మన తనిఖీ చిట్టాలో మొట్టమొదటిది, జ్ఞానం సంపాదించుకోవడం. ఆ తర్వాత, విశ్వాసాన్ని పెంపొందించుకోవడం. అయితే, మనం ఆ రెండిటిలో అభివృద్ధి సాధిస్తూనే ఉండాలి. (2 థెస్స. 1:3) అభివృద్ధిలో ఎన్నో దశలు ఉంటాయి. “అభివృద్ధి” అంటే పెరగడం, విస్తరించడం. కాబట్టి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన ఆధ్యాత్మిక అభివృద్ధి కుంటుపడకుండా, నిరంతరంగా సాగిపోవాలి.

క్రైస్తవుల అభివృద్ధి చెట్టు ఎదుగుదలలా సాగాలి

9 మన ఆధ్యాత్మిక అభివృద్ధిని, చెట్టు అభివృద్ధితో పోల్చవచ్చు. చెట్టు వేర్లు నేల లోపలికి బాగా విస్తరించినప్పుడు అది ఏపుగా పెరుగుతుంది. లెబానోను పర్వతాల్లో పెరిగే దేవదారు చెట్లు 40 అడుగుల చుట్టుకొలతతో 12 అంతస్తుల ఎత్తువరకు ఎదుగుతాయి. వాటి వేర్లు భూమి పొరల్లోకి బాగా చొచ్చుకొని ఉంటాయి. (పరమ. 5:15) అలాంటి చెట్లు మొదట్లో చాలా వేగంగా ఎదుగుతాయి. ఆ తర్వాత కూడా వాటిలో అభివృద్ధి ఉంటుంది కానీ అది అంత స్పష్టంగా కనిపించదు. ఏ యేటికి ఆ యేడు, దాని కాండం ఇంకా బలిష్ఠంగా తయారౌతుంది, దాని వేర్లు ఇంకా లోతుగా, దూరంగా విస్తరిస్తాయి. దానివల్ల ఆ చెట్టు మరింత దృఢంగా అవుతుంది. క్రైస్తవుల ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా అలాగే ఉంటుందని చెప్పవచ్చు. మనం బైబిలు అధ్యయనం మొదలుపెట్టిన కొత్తలో ఆధ్యాత్మిక అభివృద్ధిని ఎంతో వేగంగా సాధించి, బాప్తిస్మం తీసుకొని ఉంటాం. సంఘంలోని తోటి క్రైస్తవులు ఆ అభివృద్ధిని చూసి సంతోషించివుంటారు. ఆ తర్వాత మనం పయినీరు సేవ చేయడానికి లేదా ఇతర బాధ్యతలు చేపట్టడానికి కూడా అర్హత సాధించివుంటాం. అయితే, ఆ తర్వాతి సంవత్సరాల్లో మన ఆధ్యాత్మిక అభివృద్ధి అంత ప్రస్ఫుటంగా కనిపించకపోవచ్చు. అయినా, “పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు” మన విశ్వాసం, జ్ఞానం అభివృద్ధి చెందుతూనే ఉండాలి. (ఎఫె. 4:13) అలా మనం, చిన్న మొక్కగా మొదలై బలమైన మహా వృక్షంగా ఎదిగే చెట్టులా ఉంటాం, అంటే పరిణతిగల క్రైస్తవులుగా తయారౌతాం.

10. పరిణతిగల క్రైస్తవులు కూడా ఎందుకు అభివృద్ధి సాధిస్తూనే ఉండాలి?

10 అయితే మన అభివృద్ధి అక్కడితో ఆగిపోకూడదు. దేవుని వాక్యమనే నేలలో మరింత స్థిరంగా పాతుకుపోవాలంటే మన జ్ఞానం విస్తరిస్తుండాలి, మన విశ్వాసం వేరుపారుతుండాలి. (సామె. 12:3) అలా తయారైన సహోదరసహోదరీలు క్రైస్తవ సంఘంలో చాలామంది ఉన్నారు. ఉదాహరణకు, 30 ఏళ్లకన్నా ఎక్కువ కాలం నుండి సంఘ పెద్దగా సేవచేస్తున్న ఒక సహోదరుడు తాను ఇప్పటికీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవుతూనే ఉన్నానని చెప్పాడు. ఆయనిలా అంటున్నాడు: “కాలక్రమంలో, బైబిలు మీద నాకున్న గౌరవం ఎంతగానో పెరిగింది. వివిధ సందర్భాల్లో బైబిలు సూత్రాలను, నియమాలను పాటించడానికి ఉన్న కొత్తకొత్త అవకాశాలను కనుగొంటూనే ఉన్నాను. పరిచర్య పట్ల నాకున్న అభిమానం కూడా పెరుగుతూనే ఉంది.”

దేవునితో ఉన్న స్నేహాన్ని పెంచుకుంటూ ఉండాలి

11. కాలం గడిచే కొద్దీ యెహోవాను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఏమి చేయాలి?

11 యెహోవాను మన స్నేహితునిగా, తండ్రిగా భావిస్తూ ఆయనకు దగ్గరవ్వడం కూడా మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో భాగమే. మనల్ని తన చెంతకు చేర్చుకున్నాడనే, మనల్ని ప్రేమిస్తున్నాడనే, ఆయన చేతుల్లో మనం సురక్షితంగా ఉన్నామనే భావనను మనం కలిగి ఉండాలన్నది యెహోవా కోరిక. ప్రేమగల తండ్రి ఒడిలో ఉన్న చంటిపిల్లాడిలా, నమ్మకస్థుడైన స్నేహితుని సమక్షంలో ఉన్న వ్యక్తిలా మనం భావించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే, యెహోవాతో అలాంటి సాన్నిహిత్యం పెంపొందించుకోవడం ఒక్క రోజులో అయ్యే పని కాదు. మనం యెహోవాను తెలుసుకోవడానికి, ప్రేమించడానికి సమయం పడుతుంది. కాబట్టి, యెహోవా గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే, ప్రతీరోజు ఆయన వాక్యాన్ని చదవడానికి కొంత సమయాన్ని కేటాయించాలని గట్టిగా నిర్ణయించుకోండి. కావలికోట, తేజరిల్లు! (ఆంగ్లం) పత్రికల ప్రతీ సంచికను, ఇతర బైబిలు ప్రచురణలను కూడా తప్పకుండా చదవండి.

12. యెహోవాకు మనం తెలియాలంటే మనం ఏమి చేయాలి?

12 మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలు, మంచి సహవాసం కూడా దేవుని స్నేహితుల ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడతాయి. (మలాకీ 3:16 చదవండి.) యెహోవా “చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి.” (1 పేతు. 3:12) సహాయం కోసం మనం చేసే ప్రార్థనలను యెహోవా ప్రేమగల తండ్రిలా వింటాడు. అందుకే మనం, “ప్రార్థనయందు పట్టుదల” కలిగివుండాలి. (రోమా. 12:12) దేవుని సహాయం లేకుండా మనం పూర్తిగా ఎదిగిన క్రైస్తవులుగా కొనసాగలేం. ఈ లోకపు ఒత్తిళ్లను మన సొంత శక్తితో అధిగమించలేం. పట్టుదలగా ప్రార్థన చేయడం మానుకుంటే, దేవుడు నిర్విరామంగా అనుగ్రహించే శక్తిని పూర్తిగా అందుకోలేం. మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? లేక, ఇంకా మెరుగుపడాల్సి ఉందనిపిస్తుందా?—యిర్మీ. 16:19.

13. క్రైస్తవులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించాలంటే సంఘంతో ఎందుకు సహవసించాలి?

13 “తనయందు నమ్మికయుంచు” వారినందరినీ యెహోవా ఇష్టపడతాడు. కాబట్టి, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా మనం, ఆయన గురించి తెలిసిన ఇతర క్రైస్తవులతో క్రమంగా సహవసించాలి. (నహూ. 1:7) నిరుత్సాహం ప్రబలంగా ఉన్న ఈ లోకంలో, మనల్ని ప్రోత్సహించే సహోదరసహోదరీలతో సమయం గడపడమే మంచిది. దానివల్ల వచ్చే ప్రయోజనాలేమిటి? “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును” మిమ్మల్ని పురికొల్పే వాళ్లు సంఘంలో ఉంటారు. (హెబ్రీ. 10:24, 25) పౌలు హెబ్రీయులకు రాసినట్లు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది సహోదర భావంతో, ఏకభావంతో మెలిగే ఆరాధకులు ఉన్న సంఘంలోనే సాధ్యపడుతుంది. తోటి క్రైస్తవులతో సహవసిస్తున్నప్పుడు మనం అలాంటి ప్రేమ చూపించగలుగుతాం. మీరు కూటాలకు ఎంత క్రమంగా వెళ్తున్నారో, వాటిలో ఎంతవరకు పాల్గొంటున్నారో ఎప్పటికప్పుడు మీ తనిఖీ చిట్టాతో సరిచూసుకోండి.

14. పశ్చాత్తాపం, మారుమనస్సు ఒక్కసారి చూపిస్తే ఎందుకు సరిపోదు?

14 మనం క్రైస్తవులం కావడానికి, మన పాపాలకు పశ్చాత్తాపపడ్డాం, మారుమనస్సు పొందాం. అయితే, ఒక్కసారి పశ్చాత్తాపపడితే సరిపోదు. ఎందుకంటే, అపరిపూర్ణులమైన మనలో పాపం ఎప్పుడూ కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న పాములా కాచుకు కూర్చుంటుంది. (రోమా. 3:9, 10; 6:12-14) మనం మన పొరపాట్లను, తప్పులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉండాలి. సంతోషకరంగా, మనం మన బలహీనతలతో పోరాడుతూ, మార్పులు చేసుకోవడానికి పట్టుదలగా కృషి చేస్తున్నప్పుడు యెహోవా మన విషయంలో సహనం వహిస్తాడు. (ఫిలి. 2:12; 2 పేతు. 3:9) స్వార్థకోరికలకు దూరంగా ఉంటూ మన సమయం, శక్తి, డబ్బు వంటివాటిని తెలివిగా ఉపయోగించుకుంటే తగిన మార్పులు చేసుకోవచ్చు. ఓ సహోదరి ఇలా రాసింది: “నేను సత్యంలోనే పెరిగినా, యెహోవా గురించి నా ఆలోచన మిగతా వాళ్లలా ఉండేది కాదు. ఆయనంటే అందరూ గజగజ వణికిపోవాలని, ఎన్నటికీ ఆయనకు నచ్చే విధంగా ఉండలేనని అనుకునేదాన్ని.” కాలక్రమంలో, ఆ సహోదరి సొంత వైఫల్యాల వల్ల “ఆధ్యాత్మికంగా తడబడింది.” దానిగురించి ఆమె ఇలా అంటోంది: “అప్పుడు నాకు యెహోవా మీద ప్రేమలేక కాదు, ఆయనను నిజంగా తెలుసుకోకపోవడం వల్లే అలా జరిగింది. అయితే, ఎన్నోసార్లు తీవ్రంగా ప్రార్థించిన తర్వాత, నా మనసు మారడం మొదలైంది. చంటిబిడ్డను నడిపించినట్లు యెహోవా, నా వేలు పట్టుకుని నెమ్మదిగా నడిపించాడు. నేను చేయాల్సింది నాకు చూపిస్తూ ఒక్కో అడ్డంకి దాటించాడు.”

15. యేసు, ఆయన తండ్రి దేన్ని గమనిస్తున్నారు?

15 రాజ్యసువార్త గురించి “ప్రజలతో చెప్పుడి [“మాట్లాడుతూ ఉండండి,” NW].” చెరసాల నుండి అద్భుతంగా విడుదల పొందిన పేతురుతో, ఇతర అపొస్తలులతో దేవదూత ఆ మాటలు చెప్పాడు. (అపొ. 5:19-21) పరిచర్యలో ప్రతీవారం ఎంతవరకు పాల్గొంటున్నామనేదే మన తనిఖీ చిట్టాలో చూసుకోవాల్సిన మరో విషయం. మన విశ్వాసం, పరిచర్య ఎలా ఉన్నాయో యేసు, ఆయన తండ్రి గమనిస్తారు. (ప్రక. 2:19) పైన చెప్పుకున్న సంఘ పెద్ద ఇలా అంటున్నాడు: “మనం ఉన్నదే పరిచర్య చేయడానికి!”

16. యెహోవాకు చేసుకున్న సమర్పణ గురించి ధ్యానించడం ఎందుకు మంచిది?

16 మీ సమర్పణ గురించి ధ్యానించండి. యెహోవాతో మనకున్న అనుబంధానికి ఏదీ సాటిరాదు. తనవాళ్లు ఎవరో యెహోవాకు తెలుసు. (యెషయా 44:5 చదవండి.) యెహోవాతో మీ అనుబంధం ఎంత దృఢంగా ఉందో జాగ్రత్తగా పరిశీలించుకోండి. అంతేకాక, ఎంతో ప్రాముఖ్యమైన మీ బాప్తిస్మం తేదీని జ్ఞాపకం ఉంచుకోండి. అలా చేస్తే, మీ బాప్తిస్మం మీ జీవితంలో మీరు తీసుకున్న అతిప్రాముఖ్యమైన నిర్ణయానికి సూచన అని మీకు గుర్తొస్తుంది.

ఓర్పుతో యెహోవాకు దగ్గరగా ఉండండి

17. యెహోవాకు దగ్గరగా ఉండాలంటే ఓర్పు ఎందుకు అవసరం?

17 ఓర్పు చాలా అవసరమని గలతీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పాడు. (గల. 6:9) ఆ లక్షణం, ఇప్పటి క్రైస్తవులకు కూడా అవసరమే. మనకు కష్టాలు వస్తాయి, కానీ యెహోవా మనకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తూనే ఉండండి. అప్పుడాయన మీ దుఃఖాన్ని, ఆందోళనను దూరం చేసి సంతోషాన్ని, శాంతిని అనుగ్రహించి మీకు ఉపశమనాన్ని దయచేస్తాడు. (మత్త. 7:7-11) దీని గురించి ఆలోచించండి: యెహోవా పిచ్చుకల గురించే శ్రద్ధ తీసుకుంటున్నాడంటే తనను ప్రేమిస్తూ, మీ జీవితాన్ని తనకు అంకితం చేసిన మీ గురించి ఇంకెంత శ్రద్ధ తీసుకోవాలి? (మత్త. 10:29-31) ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా ఎన్నడూ వెనుదిరగకుండా, పట్టుదలగా ముందుకు సాగండి. మనం యెహోవాకు తెలియడం వల్ల ఎంతటి గొప్ప దీవెనలు పొందుతాం!

18. దేవుణ్ణి తెలుసుకున్న మీరు ఇప్పుడేమి చేయాలనుకుంటున్నారు?

18 మీరు ఈ మధ్యే దేవుణ్ణి తెలుసుకుని బాప్తిస్మం తీసుకున్నారా, మరైతే ఇప్పుడు ఏమిటి? యెహోవాను ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ఉండండి. మీరు చాలా సంవత్సరాల క్రితం బాప్తిస్మం తీసుకున్న వాళ్లయితే, ఇప్పుడు ఏమిటి? మీరు కూడా, యెహోవా గురించిన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండండి. మనకు యెహోవాతో ప్రస్తుతమున్న అనుబంధంతో ఎన్నడూ సరిపెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక తనిఖీ చిట్టాతో సరిచూసుకుంటూ ముందుకు సాగాలి. అలాచేస్తే మన ప్రేమగల తండ్రి, స్నేహితుడు, దేవుడు అయిన యెహోవాతో మనకున్న అనుబంధాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం.—2 కొరింథీయులు 13:5, 6 చదవండి.