“ఆహా, ఈ చిత్రం ఎంత బాగుందో!”
కావలికోట కొత్త సంచికను తెరిచినప్పుడు మీకు ఎన్నిసార్లు అలా అనిపించింది? లేక వేరేవాళ్లతో అలా ఎన్నిసార్లు అన్నారు? పరిపరివిధాలుగా ఆలోచించి, ఎంతో కష్టపడి రూపొందించే ఆ అందమైన చిత్రాలూ ఫోటోల వెనక ఒక ఉద్దేశం ఉంది. మనం బాగా ఆలోచించడానికి, అర్థంచేసుకోవడానికి అవి చక్కని బోధనా ఉపకరణాలుగా పనిచేస్తాయి. ఆ చిత్రాలు ప్రత్యేకించి మనం కావలికోట అధ్యయనానికి సిద్ధపడుతున్నప్పుడు, వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఉదాహరణకు, ప్రతీ అధ్యయన ఆర్టికల్‌లోని ప్రారంభ చిత్రాన్ని ఆ ఆర్టికల్ కోసం ఎందుకు ఎంపిక చేశారో ఆలోచించండి. అది దేన్ని వివరిస్తుంది? ఆర్టికల్ ముఖ్యాంశానికి లేదా ముఖ్య లేఖనానికి ఆ చిత్రంతో ఎలాంటి సంబంధం ఉంది? అందులో ఉన్న ఇతర చిత్రాలను కూడా గమనించి, అవి చర్చాంశానికి ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాయో, మీ జీవితానికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచించండి.
ప్రతీ చిత్రం, ఆర్టికల్‌కు ఎలా అన్వయిస్తుందో లేక వ్యక్తిగతంగా తమకెలా ఉపయోగపడుతుందో చెప్పమని కావలికోట అధ్యయన నిర్వాహకుడు సహోదరసహోదరీలను ఆహ్వానిస్తాడు. కొన్ని సందర్భాల్లో, చిత్రాన్ని వివరించే వాక్యంతో పాటు, అది ఏ పేరాకు సంబంధించిందో తెలిపే సూచన కూడా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో, ఆయా చిత్రాలను ఏ పేరాలో చర్చిస్తే బాగుంటుందో అధ్యయన నిర్వాహకుడే నిర్ణయించుకోవచ్చు. ఈ విధంగా, దేవుని వాక్యంలోని విషయాలను పాఠకులకు కళ్లకు కట్టినట్లు చూపించడానికి చేసిన ప్రయత్నం నుండి మనమందరం పూర్తి ప్రయోజనం పొందుతాం.
ఒక సహోదరుడు ఇలా అన్నాడు, “అద్భుతంగా రాసిన ఓ ఆర్టికల్ చదివాక చిత్రాలను చూస్తే, కేకు మీద ఉన్న తియ్యని క్రీమ్‌లా అనిపిస్తుంది.”