కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఇవి ఎప్పుడు జరుగును? మాతో చెప్పుము’

‘ఇవి ఎప్పుడు జరుగును? మాతో చెప్పుము’

‘ఈ యుగసమాప్తికి సూచనలేవి?’—మత్త. 24:3.

1. అపొస్తలుల్లా మనకు కూడా ఏ కుతూహలం ఉంది?

 యేసు భూపరిచర్య ముగింపుకు వచ్చింది, ఆయన శిష్యులు తమ భవిష్యత్తు ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నారు. అందుకే, ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు, అపొస్తలుల్లో నలుగురు ఆయన్నిలా అడిగారు: ‘ఇవి ఎప్పుడు జరుగును? . . . ఈ యుగసమాప్తికి సూచనలేవి?’ (మత్త. 24:3; మార్కు 13:3) ఆ ప్రశ్నలకు జవాబుగా యేసు ఎన్నో వివరాలతో కూడిన ఓ ప్రవచనాన్ని చెప్పాడు. అది మత్తయి సువార్తలోని 24, 25 అధ్యాయాల్లో నమోదై ఉంది. ఆ ప్రవచనంలో, భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో గమనార్హమైన సంఘటనల గురించి యేసు చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం మనకు కూడా ఉంది.

2. (ఎ) గడిచిన సంవత్సరాల్లో, దేని విషయంలో మరింత స్పష్టమైన అవగాహన కోసం మనం ప్రయత్నించాం? (బి) ఏ మూడు ప్రశ్నలను మనం పరిశీలిస్తాం?

2 ఎన్నో సంవత్సరాలుగా, యెహోవా సేవకులు అంత్యదినాలకు సంబంధించి యేసు చెప్పిన ప్రవచనాన్ని ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేస్తూ వచ్చారు. యేసు చెప్పిన మాటలు ఎప్పుడు నెరవేరతాయో మరింత స్పష్టంగా అర్థంచేసుకోవడానికి వాళ్లు ప్రయత్నిస్తూ వచ్చారు. దానివల్ల లేఖనాల అవగాహన ఎలా మెరుగైందో తెలుసుకునేలా మనం మూడు విషయాలకు సంబంధించి “ఎప్పుడు” అనే ప్రశ్నను పరిశీలిద్దాం. ‘మహాశ్రమలు’ ఎప్పుడు మొదలౌతాయి? ప్రజల్ని ‘గొర్రెలుగా,’ ‘మేకలుగా’ తీర్పుతీర్చే పనిని యేసు ఎప్పుడు చేస్తాడు? యేసు ఎప్పుడు ‘వస్తాడు’?—మత్త 24:21; 25:31-33.

‘మహాశ్రమలు’ ఎప్పుడు మొదలౌతాయి?

3. ఒకప్పుడు, మహాశ్రమల కాలానికి సంబంధించి మన అవగాహన ఏమిటి?

3 మహాశ్రమలు 1914లో మొదటి ప్రపంచ యుద్ధంతో మొదలయ్యాయనీ, 1918లో యుద్ధం ముగిసినప్పుడు, అభిషిక్త శేషం సమస్త ప్రజలకు సువార్త ప్రకటించే అవకాశం కలిగేలా యెహోవా ఆ శ్రమలదినాల్ని ‘తక్కువ చేశాడనీ’ మనం ఎన్నో ఏళ్లపాటు అనుకున్నాం. (మత్త. 24:21, 22) ఆ ప్రకటనాపని పూర్తయ్యాక, సాతాను సామ్రాజ్యం కుప్పకూలుతుందని అనుకున్నాం. అలా, మహాశ్రమల్లో ఈ మూడు దశలు ఉంటాయని భావించాం: ఆరంభం (1914-1918), అంతరాయం (1918 నుండి), హార్‌మెగిద్దోనుతో ముగింపు.

4. అంత్యదినాలకు సంబంధించి యేసు చెప్పిన ప్రవచనాన్ని మరింత స్పష్టంగా అర్థంచేసుకోవడానికి ఏది సహాయం చేసింది?

4 అయితే, అంత్యదినాలకు సంబంధించి యేసు చెప్పిన ప్రవచనాన్ని మరింత పరిశీలించినప్పుడు, దానిలో ఒక భాగానికి రెండు నెరవేర్పులు ఉన్నాయని మనం గ్రహించాం. (మత్త 24:4-22) తొలి నెరవేర్పు సా.శ. మొదటి శతాబ్దంలో యూదయలో జరిగిందని, రెండవ నెరవేర్పు మన కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరగబోతుందని అర్థంచేసుకున్నాం. అది పలు విషయాల్లో మన అవగాహనను మెరుగుపర్చింది. a[1]

5. (ఎ) 1914లో ఎలాంటి కష్టకాలం మొదలైంది? (బి) అలాంటి పరిస్థితే, సా.శ. మొదటి శతాబ్దంలో ఎప్పుడు వచ్చింది?

5 మహాశ్రమల తొలి భాగం 1914లో మొదలవ్వలేదని కూడా మనం అర్థంచేసుకున్నాం. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, మహాశ్రమలు దేశాల మధ్య యుద్ధాలతో కాదుగానీ, అబద్ధమతం మీద దాడితో ఆరంభమౌతాయని బైబిలు ప్రవచనం తెలియజేస్తోంది. దాన్నిబట్టి, 1914లో మొదలైన సంఘటనలు, మహాశ్రమలకు ఆరంభం కాదుగానీ, అవన్నీ “వేదనలకు ప్రారంభము” అని మనకు అర్థమైంది. (మత్త. 24:8) అలాంటి ‘వేదనలే’ సా.శ. 33 నుండి సా.శ. 66 వరకు యెరూషలేము, యూదయ ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి.

6. ఏ సంఘటనతో మహాశ్రమలు మొదలౌతాయి?

6 ఏ సంఘటనతో మహాశ్రమలు మొదలౌతాయి? యేసు ఇలా చెప్పాడు: “ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే—చదువువాడు గ్రహించుగాక— యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను.” (మత్త. 24:15, 16) సా.శ. 66లో రోమా సైన్యం (“నాశనకరమైన హేయవస్తువు”) యెరూషలేముతో పాటు దాని ఆలయం (యూదుల దృష్టిలో పరిశుద్ధ స్థలం) మీద దాడి చేసినప్పుడు ఆ మాటలు మొదటిసారిగా నెరవేరాయి. భవిష్యత్తులో ఆ ప్రవచనం, ఐక్యరాజ్య సమితి (ఆధునిక కాలంలోని “హేయవస్తువు”) క్రైస్తవమత సామ్రాజ్యం (నామమాత్రపు క్రైస్తవుల దృష్టిలో పరిశుద్ధమైనది) మీద, మహాబబులోనులోని మిగతా భాగం మీద దాడి చేసినప్పుడు విస్తృత స్థాయిలో నెరవేరుతుంది. ప్రకటన 17:16-18 వచనాలు కూడా ఆ దాడి గురించి వర్ణిస్తున్నాయి. ఆ సంఘటనతోనే మహాశ్రమలు మొదలౌతాయి.

7. (ఎ) మొదటి శతాబ్దంలో ‘శరీరులు’ ఎలా ‘తప్పించుకున్నారు’? (బి) భవిష్యత్తులో ఏమి జరుగుతుంది?

7 “ఆ దినములు తక్కువ చేయబడును” అని కూడా యేసు చెప్పాడు. ఆ మాట, సా.శ. 66లో రోమా సైన్యం తన దాడిని ‘తక్కువ చేయడంతో’ మొదటిసారి నెరవేరింది. అప్పుడు, ఆ ‘శరీరులు తప్పించుకునేలా’ లేదా వాళ్లు తమ ప్రాణాలు కాపాడుకునేలా యెరూషలేము యూదయ ప్రాంతాల్లో ఉన్న అభిషిక్త క్రైస్తవులు పారిపోయారు. (మత్తయి 24: 22 చదవండి; మలా. 3:17) మరి, రాబోయే మహాశ్రమలప్పుడు ఏమి జరుగుతుంది? అబద్ధమతంతో పాటు సత్యమతం నాశనం కాకుండా ఉండేలా, ఐక్యరాజ్య సమితి అబద్ధమతం మీద చేసే దాడిని యెహోవా ‘తక్కువ చేస్తాడు.’ దానివల్ల దేవుని ప్రజలు కాపాడబడతారు.

8. (ఎ) మహాశ్రమల తొలి భాగం ముగిసిన తర్వాత ఏయే సంఘటనలు జరుగుతాయి? (బి) 1,44,000 మందిలో చివరి వ్యక్తి బహుశా ఏ సమయంలో తన పరలోక బహుమానాన్ని పొందవచ్చు? (అధస్సూచి చూడండి.)

 8 మహాశ్రమల తొలి భాగం ముగిసిన తర్వాత ఏమి జరుగుతుంది? మహాశ్రమల తొలి భాగం ముగిసింది మొదలుకొని హార్‌మెగిద్దోను ఆరంభం వరకు ఓ కాలనిడివి ఉంటుందని యేసు మాటలు సూచిస్తున్నాయి. ఆ కాలనిడివిలో ఏ సంఘటనలు చోటుచేసుకుంటాయి? దానికి జవాబు యెహెజ్కేలు 38:14-16 వచనాల్లో, మత్తయి 24:29-31 వచనాల్లో ఉంది. (చదవండి.) b[2]  ఆ కాలనిడివి అయిపోయాక, మహాశ్రమల ముగింపైన హార్‌మెగిద్దోను యుద్ధం మొదలౌతుంది. సా.శ. 70లో జరిగిన యెరూషలేము నాశనం ఈ హార్‌మెగిద్దోనుకు సాదృశ్యం. (మలా. 4:1) ముగింపులో వచ్చే హార్‌మెగిద్దోను వల్ల ఆ మహాశ్రమలు ‘లోకారంభము నుండి ఇప్పటివరకు కలగని’ విధంగా ఉంటాయి. (మత్త. 24:21) ఆ యుద్ధం ముగిశాక, క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన ఆరంభమౌతుంది.

9. మహాశ్రమల గురించి యేసు చెప్పిన ప్రవచనం యెహోవా ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

9 మహాశ్రమల గురించిన ఆ ప్రవచనం మనల్ని బలపరుస్తుంది. ఎందుకు? ఎలాంటి కష్టాలు ఎదురైనా, యెహోవా ప్రజలు ఓ గుంపుగా మహాశ్రమలను దాటతారనే భరోసాను ఆ ప్రవచనం ఇస్తుంది. (ప్రక. 7:9, 14) వీటన్నిటికి మించి మనం ఆనందంతో పరవశించిపోతాం. ఎందుకంటే, హార్‌మెగిద్దోనులో యెహోవా తన విశ్వసర్వాధిపత్యాన్ని నిరూపించుకుంటాడు, తన పవిత్ర నామాన్ని పరిశుద్ధపర్చుకుంటాడు.—కీర్త. 83:18; యెహె. 38:23.

ప్రజల్ని గొర్రెలుగా, మేకలుగా తీర్పుతీర్చే పనిని యేసు ఎప్పుడు చేస్తాడు?

10. ప్రజల్ని గొర్రెలుగా, మేకలుగా తీర్పుతీర్చే పని ఎప్పుడు జరుగుతుందని ఇదివరకు అనుకున్నాం?

10 యేసు తన ప్రవచనంలో భాగంగా ప్రజల్ని గొర్రెలుగా, మేకలుగా తీర్పుతీర్చడం గురించిన ఉపమానాన్ని చెప్పాడు. ఇంతకీ, ఆ తీర్పుతీర్చడం ఎప్పుడు జరుగుతుంది? (మత్త. 25:31-46) ఆ తీర్పుతీర్చే పని, 1914 మొదలుకొని అంత్యదినాల కాలమంతటిలో జరుగుతుందని మనం ఇదివరకు అనుకున్నాం. అందువల్ల, రాజ్యసందేశాన్ని తిరస్కరించి మహాశ్రమలకు ముందే మరణించిన వాళ్లు మేకలని, వాళ్లకు పునరుత్థాన నిరీక్షణ ఉండదని భావించాం.

11. ప్రజల్ని గొర్రెలుగా, మేకలుగా తీర్పుతీర్చే పనిని యేసు 1914లో మొదలుపెట్టే అవకాశం లేదని ఎలా చెప్పొచ్చు?

11 అయితే 1990ల మధ్య భాగంలో, మత్తయి 25:31లోని ఈ మాటలను కావలికోట పునఃపరిశీలించింది: “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.” దేవుని రాజ్యానికి యేసు 1914లోనే రాజుగా నియమితుడైనా, ఆయన అప్పుడే ‘సమస్త జనములకు’ తీర్పుతీర్చే న్యాయాధిపతిగా “తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడు” కాలేదని ఆ కావలికోట ప్రస్తావించింది. (మత్త. 25:32; దానియేలు 7:13 పోల్చండి.) ఏదేమైనా గొర్రెలు, మేకల గురించిన ఉపమానం యేసును ముఖ్యంగా తీర్పుతీర్చే న్యాయాధిపతిగా వర్ణిస్తోంది. (మత్తయి 25:31-34, 41, 46 చదవండి.) 1914లో యేసు రాజుగా నియమితుడైనా, సమస్త జనులకు తీర్పుతీర్చే న్యాయాధిపతి అవ్వలేదు. కాబట్టి ప్రజల్ని గొర్రెలుగా, మేకలుగా తీర్పుతీర్చే పనిని యేసు అప్పుడు మొదలుపెట్టే అవకాశం లేదు. c[3] మరైతే, తీర్పుతీర్చే పనిని యేసు ఎప్పుడు మొదలుపెడతాడు?

12. (ఎ) సమస్త జనులకు తీర్పుతీర్చే న్యాయాధిపతి పాత్రను యేసు మొట్టమొదటిసారిగా ఎప్పుడు పోషిస్తాడు? (బి) మత్తయి 24:30, 31 వచనాల్లో, మత్తయి 25:31-33, 46 వచనాల్లో ఏ సంఘటనల గురించి ఉంది?

 12 అబద్ధమత నాశనం జరిగిన తర్వాత, సమస్త జనులకు తీర్పుతీర్చే న్యాయాధిపతి పాత్రను యేసు మొట్టమొదటిసారిగా పోషిస్తాడని అంత్యదినాలకు సంబంధించి ఆయన చెప్పిన ప్రవచనం మనకు తెలియజేస్తుంది.  8వ పేరాలో పేర్కొన్నట్లుగా, ఆ సమయంలో జరిగే కొన్ని సంఘటనల గురించి మత్తయి 24:30, 31లో ఉంది. మీరు ఆ వచనాల్ని పరిశీలిస్తే, యేసు అక్కడ పేర్కొన్న సంఘటనలు, గొర్రెలు మేకల ఉపమానంలో చెప్పిన సంఘటనలు ఒకలాంటివేనని మీరు గమనిస్తారు. ఉదాహరణకు ఈ మాటలను గమనించండి: దూతలతో కలిసి మనుష్యకుమారుడు తన మహిమతో రావడం; సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడడం; గొర్రెలుగా తీర్పుతీర్చబడిన వాళ్లు “నిత్యజీవము” పొందబోతున్నందువల్ల తమ ‘తలలెత్తుకోవడం,’ d[4] మేకలుగా తీర్పుతీర్చబడిన వాళ్లు “నిత్యశిక్ష” పొందబోతున్నందువల్ల ‘రొమ్ము కొట్టుకోవడం.’—మత్తయి 25:31-33, 46.

13. (ఎ) ప్రజల్ని గొర్రెలుగా, మేకలుగా తీర్పుతీర్చే పనిని యేసు ఎప్పుడు చేస్తాడు? (బి) ఈ అవగాహన, పరిచర్య విషయంలో మనకున్న అభిప్రాయంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

13 మరిప్పుడు మనం ఏ నిర్ధారణకు రావచ్చు? యేసు మహాశ్రమల కాలంలో వచ్చినప్పుడు ప్రజల్ని గొర్రెలుగా, మేకలుగా తీర్పుతీరుస్తాడు. ఆ తర్వాత, మహాశ్రమల ముగింపైన హార్‌మెగిద్దోనులో మేకల్లాంటి ప్రజలు “నిత్యశిక్షకు” గురౌతారు. ఈ అవగాహన, పరిచర్య విషయంలో మనకున్న అభిప్రాయంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మన ప్రకటనాపని ఎంత ప్రాముఖ్యమైనదో గుర్తించడానికి అది సహాయం చేస్తుంది. ప్రజలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుని, “జీవమునకు పోవు” ఇరుకు ద్వారంలోకి ప్రవేశించడానికి మహాశ్రమలు ఆరంభమయ్యే వరకు సమయం మిగిలి ఉంది. (మత్త. 7:13, 14) నిజమే, ప్రజల స్వభావాన్ని చూసినప్పుడు ఫలానా వాళ్లు గొర్రెలని, ఫలానా వాళ్లు మేకలని మనకు అనిపించవచ్చు. కానీ గొర్రెలు ఎవరు, మేకలు ఎవరు అనే తుది తీర్పు వెలువడేది మాత్రం మహాశ్రమల కాలంలోనే అని మనం గుర్తుంచుకోవాలి. అందుకే రాజ్యసందేశాన్ని విని, దానికి అనుగుణంగా జీవితాల్ని మార్చుకునే అవకాశాన్ని వీలైనంత ఎక్కువమందికి అందించే పనిలో కొనసాగేందుకు మనకు మంచి కారణాలే ఉన్నాయి.

ప్రజలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి, మహాశ్రమలు ఆరంభమయ్యే వరకు సమయం మిగిలి ఉంది (13వ పేరా చూడండి)

యేసు ఎప్పుడు ‘వస్తాడు’?

14, 15. ఏ నాలుగు ప్రస్తావనలు భవిష్యత్తులో యేసు న్యాయాధిపతిగా రావడం గురించి మాట్లాడుతున్నాయి?

14 యేసు చెప్పిన ప్రవచనాన్ని మరింత పరిశీలించాక, అందులోని ఇతర ప్రాముఖ్యమైన సంఘటనల నెరవేర్పు కాలానికి సంబంధించిన మన అవగాహనను సవరించుకోవాల్సిన అవసరం ఉంటుందా? దానికి జవాబు ఆ ప్రవచనంలోనే ఉంది. దాన్ని ఇప్పుడు చూద్దాం.

15 మత్తయి 24:29–25:46 వచనాల్లో నమోదైన ప్రవచన భాగంలో యేసు ముఖ్యంగా ఈ అంత్యదినాల్లో, అలాగే రాబోయే మహాశ్రమల కాలంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయో చెప్పాడు. అక్కడ, తాను రావడం గురించి యేసు ఎనిమిది ప్రస్తావనలు చేశాడు. మహాశ్రమలకు సంబంధించి ఆయన ఇలా చెప్పాడు: ‘అప్పుడు మనుష్యకుమారుడు మేఘారూఢుడై వచ్చుట వారు చూతురు.’ “ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు.” “మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును.” గొర్రెలు, మేకల గురించిన ఉపమానంలో యేసు ఇలా చెప్పాడు: “తన మహిమతో మనుష్యకుమారుడు వచ్చును.” (మత్త. 24:30, 42, 44; 25:31) ఈ నాలుగు ప్రస్తావనల్లో ప్రతీది భవిష్యత్తులో క్రీస్తు న్యాయాధిపతిగా రావడానికి సంబంధించినదే. మరి మిగతా నాలుగు ప్రస్తావనలు యేసు చెప్పిన ప్రవచనంలో ఎక్కడ ఉన్నాయి?

16. యేసు రావడం గురించి ఏ ఇతర లేఖనాల్లో ఉంది?

16 నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని గురించి యేసు ఇలా చెప్పాడు: “యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.”కన్యకల గురించిన ఉపమానంలో యేసు ఇలా అన్నాడు: “వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను.”తలాంతుల గురించిన ఉపమానంలో యేసు ఇలా చెప్పాడు: ‘బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చెను.’అదే ఉపమానంలో యజమానుడు ఇలా అన్నాడు: “నేను వచ్చి . . . నా సొమ్ము తీసికొనియుందునే.” (మత్త. 24:46;25:10, 19, 27) యేసు రావడం గురించి చెబుతున్న ఈ నాలుగు సందర్భాల నెరవేర్పు కాలం ఎప్పుడు?

17. మత్తయి 24:46లో యేసు రావడం గురించిన ప్రస్తావనకు సంబంధించి మన ప్రచురణల్లో ఇదివరకు ఏమి తెలియజేశాం?

17 ముందటి పేరాలో మనం మాట్లాడుకున్న చివరి నాలుగు ప్రస్తావనలు, యేసు 1918లో రావడానికి సంబంధించినవని మన ప్రచురణల్లో ఇదివరకు తెలియజేశాం. ఉదాహరణకు, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ గురించి యేసు చెప్పిన మాటలను పరిశీలిద్దాం. (మత్తయి 24:45-47 చదవండి.) 46వ వచనంలో ఉన్న ప్రస్తావన 1918లో అభిషిక్తుల ఆధ్యాత్మిక పరిస్థితిని తనిఖీ చేసేందుకు యేసు వచ్చినప్పుడు నెరవేరిందని, 1919లో యజమానియైన యేసు తన దాసుణ్ణి యావదాస్తిమీద నియమించాడని గతంలో అనుకున్నాం. (మలా. 3:1) అయితే, యేసు చెప్పిన ప్రవచనాన్ని మరింత పరిశీలించాక, అందులోని కొన్ని అంశాల నెరవేర్పు కాలానికి సంబంధించిన మన అవగాహనను సవరించుకోవాల్సిన అవసరం ఉందని అర్థమైంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు?

18. యేసు చెప్పిన ప్రవచనంలోని విషయాల్ని మొత్తం కలిపి చూస్తే, ఆయన రావడానికి సంబంధించి ఏ విషయం స్పష్టమౌతోంది?

18 మత్తయి 24:46కు ముందున్న వచనాల్లో, “వచ్చును” అనే పదం, మహాశ్రమల కాలంలో తీర్పు ప్రకటన వెలువర్చడానికి, తీర్పును అమలుపర్చడానికి యేసు వచ్చే సమయాన్నే సూచిస్తుంది. (మత్త. 24:30, 42, 44) అంతేకాక, మనం  12వ పేరాలో చూసినట్లుగా, యేసు రావడం గురించి మత్తయి 25:31లో ఉన్న ప్రస్తావన కూడా భవిష్యత్తులో రానున్న ఆ తీర్పుకాలానికి సంబంధించినదే. కాబట్టి, నమ్మకమైన దాసుణ్ణి యావదాస్తిమీద నియమించడానికి యేసు రావడం గురించి మత్తయి 24:46, 47 వచనాల్లో ఉన్న ప్రస్తావన కూడా భవిష్యత్తులో రానున్న మహాశ్రమల కాలానికి సంబంధించినదే అన్న నిర్ధారణకు మనం రావడం సబబే.నిజానికి, యేసు చెప్పిన ప్రవచనంలోని విషయాల్ని మొత్తం కలిపి చూస్తే, యేసు రావడం గురించిన ఎనిమిది ప్రస్తావనల్లో ప్రతీది, భవిష్యత్తులో రానున్న మహాశ్రమలప్పుడు ఉండే తీర్పుకాలానికి సంబంధించినదేనని స్పష్టమౌతోంది.

19. లేఖన అవగాహనలో వచ్చిన ఏ సవరణలను మనం పరిశీలించాం? మనం తర్వాతి ఆర్టికల్స్‌లో ఏ ప్రశ్నలను పరిశీలిస్తాం?

19 ఈ ఆర్టికల్‌ అంతటిలో మనం ఏమి నేర్చుకున్నాం? ఈ ఆర్టికల్‌ ఆరంభంలో, మూడు విషయాలకు సంబంధించి “ఎప్పుడు” అనే ప్రశ్నను వేశాం. మొదటిగా, మహాశ్రమలు 1914లో మొదలవ్వలేదని, అవి భవిష్యత్తులో ఐక్యరాజ్య సమితి మహాబబులోను మీద దాడి చేసినప్పుడు మొదలౌతాయని మనం నేర్చుకున్నాం. రెండవదిగా, ప్రజల్ని గొర్రెలుగా, మేకలుగా తీర్పుతీర్చే పనిని యేసు 1914లో ప్రారంభించలేదని, అది మహాశ్రమల కాలంలోనే జరుగుతుందని మనం చూశాం. చివరిగా, యేసు 1919లో నమ్మకమైన దాసుణ్ణి “తన యావదాస్తిమీద” నియమించడానికి రాలేదని, అది మహాశ్రమల కాలంలోనే జరుగుతుందని మనం పరిశీలించాం. కాబట్టి, మూడు విషయాలకు సంబంధించి “ఎప్పుడు” అనే ప్రశ్నకు జవాబు ఒక్కటే. అదే భవిష్యత్తులో రానున్న మహాశ్రమల కాలం. మన అవగాహనలో వచ్చిన ఈ సవరణల వల్ల, నమ్మకమైన దాసుని గురించిన ఉపమానాన్ని మనం అర్థంచేసుకునే తీరు ఇంకేమైనా మారుతుందా? అలాగే, ఈ అంత్యకాలంలో నెరవేరుతున్న యేసు ఇతర ఉపమానాల్ని మనం అర్థంచేసుకునే తీరు ఏమైనా మారుతుందా? ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నలను మనం తర్వాతి ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం.

 

a 4వ పేరా: [1] మరింత సమాచారం కోసం కావలికోట ఫిబ్రవరి 15, 1994 సంచికలోని 8-21 పేజీలు, అలాగే మే 1, 1999 సంచికలోని 8-20 పేజీలు చూడండి.

b 8వ పేరా: [2] ‘ఏర్పరచుకొనినవారిని పోగుచేయడం’ గురించి కూడా ఈ వచనాల్లో ప్రస్తావించబడింది. (మత్త. 24:31) కాబట్టి, మహాశ్రమల తొలి భాగం ముగిసిన తర్వాత ఇంకా భూమ్మీద మిగిలిన అభిషిక్తులందరూ హార్‌మెగిద్దోను యుద్ధానికి ముందే ఏదో ఒక సమయంలో పరలోకానికి కొనిపోబడతారని తెలుస్తోంది. ఈ అవగాహన, కావలికోట (ఆంగ్లం) ఆగస్టు 15, 1990 సంచికలోని 30వ పేజీలో “పాఠకుల ప్రశ్నలు” శీర్షిక కింద వచ్చిన సమాచారాన్ని సవరిస్తోంది.

c 11వ పేరా: [3] కావలికోట అక్టోబరు 15, 1995 సంచికలోని 18-28 పేజీలు చూడండి.

d 12వ పేరా: [4] ఇలాంటి వృత్తాంతాన్ని లూకా 21:28లో చూడండి.