కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజంగా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?”

నిజంగా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?”

“యజమానుడు తన యింటి . . . వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?”—మత్త. 24:45.

1, 2. నేడు యేసు మనల్ని ఏ మాధ్యమం ద్వారా పోషిస్తున్నాడు? మనం ఆ మాధ్యమాన్ని గుర్తించడం ఎందుకు ప్రాముఖ్యం?

 “సహోదరులారా, మీరు సరిగ్గా నాకు చాలా అవసరమైనప్పుడే, అదీ నా అవసరానికి తగిన సమాచారమే ఉన్న ఆర్టికల్స్‌ని అందించిన సందర్భాలు కోకొల్లలు.” మన ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవ చేస్తున్న సహోదరులను మెచ్చుకుంటూ ఓ సహోదరి రాసిన మాటలవి. మీకూ అలానే అనిపించిందా? మనలో చాలామందికి అలా అనిపించే ఉంటుంది. అందులో ఆశ్చర్యమేమీ లేదు.

2 మనకు కావాల్సిన పోషణ ఇస్తానని తాను చేసిన వాగ్దానాన్ని సంఘ శిరస్సైన యేసు నెరవేరుస్తున్నాడని చెప్పేందుకు, తగినవేళ మనకు లభించే ఆధ్యాత్మిక ఆహారమే ఓ రుజువు. ఆయన ఎవరి ద్వారా మనకు పోషణను ఇస్తున్నాడు? తన ప్రత్యక్షతకు సూచనను ఇస్తున్నప్పుడు యేసు, “తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు” ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుణ్ణి’ ఉపయోగించుకుంటానని చెప్పాడు. a[1](మత్తయి 24:45-47 చదవండి.) ఈ అంత్యకాలంలో తన నిజమైన అనుచరులను పోషించడానికి యేసు ఉపయోగించుకుంటున్న మాధ్యమం ఆ నమ్మకమైన దాసుడే. మనం ఆ నమ్మకమైన దాసుణ్ణి గుర్తించడం ప్రాముఖ్యం. ఆ దాసుడు ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం వల్లే మనం దేవునితో స్నేహాన్ని పెంపొందించుకోవడం సాధ్యమౌతుంది.—మత్త. 4:4; యోహా. 17:3.

3. నమ్మకమైన దాసుని గురించి గతంలో మన ప్రచురణలు ఏ వివరణ ఇచ్చాయి?

3 మరి, నమ్మకమైన దాసుని గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని మనమెలా అర్థంచేసుకోవాలి? గతంలో మన ప్రచురణలు ఇలా చెప్పాయి: ‘సా.శ. 33 పెంతెకొస్తు రోజున యేసు తన ఇంటివారిమీద నమ్మకమైన దాసుణ్ణి నియమించాడు. అప్పటి నుంచి ఏదైనా ఒక కాలంలో భూమ్మీద ఉండే అభిషిక్త క్రైస్తవులందరూ ఓ గుంపుగా ఆ దాసునిగా పరిగణించబడతారు. ఆ అభిషిక్తుల్ని ఒక్కొక్కరిగా చూస్తే, వాళ్లే ఇంటివాళ్లు. 1919లో యేసు “తన యావదాస్తి మీద” అంటే ఈ భూమ్మీద ఉన్న రాజ్యసంబంధ విషయాల మీద నమ్మకమైన దాసుణ్ణి నియమించాడు.’ అయితే నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని మరింత జాగ్రత్తగా అధ్యయనం చేసి, ప్రార్థనాపూర్వకంగా ధ్యానించిన తర్వాత ఇదివరకు మనకున్న అవగాహనలో సవరణ అవసరమని అర్థమైంది. (సామె. 4:18) కాబట్టి, ఇప్పుడు మనం ఆ ఉపమానాన్ని పరిశీలిద్దాం. అంతేకాక మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా ఆ ఉపమానంలోని విషయాలు మనకెలా వర్తిస్తాయో చూద్దాం.

ఆ ఉపమానం ఎప్పుడు నెరవేరింది?

4-6. నమ్మకమైన దాసుని గురించి యేసు చెప్పిన ఉపమానం 1914లో అంత్యదినాలు మొదలైన తర్వాతే నెరవేరనారంభించింది అన్న నిర్ధారణకు మనం ఎందుకు రావచ్చు?

4 నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని గురించిన ఉపమాన సందర్భాన్ని చూస్తే, అది నెరవేరడం ఆరంభమైంది సా.శ. 33 పెంతెకొస్తు రోజున కాదుగానీ, ఈ అంత్యకాలంలోనే అని తెలుస్తోంది. లేఖనాలు ఆ విషయాన్ని ఎలా నిర్ధారిస్తున్నాయో చూద్దాం.

5 తన ‘రాకడకు [“ప్రత్యక్షతకు,” NW], ఈ యుగసమాప్తికి’ సంబంధించిన ప్రవచనంలో భాగంగా యేసు నమ్మకమైన దాసుని గురించిన ఉపమానాన్ని కూడా చెప్పాడు. (మత్త. 24:3) ఆ ప్రవచనంలోని తొలి భాగం మత్తయి 24:4-22 వచనాల్లో నమోదై ఉంది. దానికి రెండు నెరవేర్పులు ఉన్నాయి. మొదటిగా, సా.శ. 33 నుండి సా.శ. 70 వరకున్న సంవత్సరాల్లో అది నెరవేరింది. రెండవదిగా, అది మరింత విస్తృతంగా మనకాలంలో నెరవేరుతుంది. అలాగని, నమ్మకమైన దాసుని గురించి యేసు చెప్పిన మాటలకు కూడా రెండు నెరవేర్పులు ఉంటాయా? లేదు.

6 మత్తయి 24:29లో నమోదై ఉన్న మాటలతో మొదలుకొని, యేసు ముఖ్యంగా మనకాలంలో జరిగే సంఘటనల మీదే దృష్టి నిలిపాడు. (మత్తయి 24:30, 42, 44 చదవండి.) మహాశ్రమల కాలంలో జరగనున్న వాటి గురించి చెబుతూ, ప్రజలు ‘మనుష్యకుమారుడు ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూతురు’ అని యేసు అన్నాడు. ఆ తర్వాత, అంత్యదినాల్లో జీవించే వాళ్లను ఉద్దేశించి, మెలకువగా ఉండమని అర్థిస్తూ, “ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు” అనీ, “మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును” అనీ యేసు అన్నాడు. b[2] అంత్యదినాల్లో జరిగే సంఘటనల గురించి చెబుతున్న ఈ సందర్భంలో, యేసు నమ్మకమైన దాసుని గురించిన ఉపమానం చెప్పాడు. కాబట్టి, నమ్మకమైన దాసుని గురించి యేసు చెప్పిన మాటలు 1914లో అంత్యదినాలు మొదలైన తర్వాతే నెరవేరనారంభించాయి అన్న నిర్ధారణకు మనం రావచ్చు. ఆ నిర్ధారణకు రావడం సబబే. ఎందుకని?

7. కోతకాలం ఆరంభమౌతున్న సమయంలో ఏ ప్రాముఖ్యమైన ప్రశ్న తలెత్తింది? ఎందుకు?

7 ఒకసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి: నిజంగా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?” మొదటి శతాబ్దంలో, అలాంటి ప్రశ్న వేయడానికి అసలు ఏ కారణమూ లేదు. మనం ముందటి ఆర్టికల్‌లో చూసినట్లుగా, దేవుని నడిపింపుకు రుజువుగా అపొస్తలులు అద్భుతాలు చేశారు, వాళ్ల ద్వారా ఇతరులకు కూడా అద్భుత వరాలు అనుగ్రహింపబడ్డాయి. (అపొ. 5:12) కాబట్టి, ‘నాయకత్వం వహించడానికి క్రీస్తు నిజంగా ఎవరిని నియమించాడు?’ అనే ప్రశ్నకు తావేలేదు. అయితే, 1914లో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఆ సంవత్సరంలో కోతకాలం ఆరంభమైంది. గోధుమల నుండి గురుగుల్ని వేరుచేయాల్సిన సమయం చివరకు రానేవచ్చింది. (మత్త. 13:36-43) అందుకే కోతకాలం ఆరంభమౌతున్న సమయంలో, ఈ ప్రాముఖ్యమైన ప్రశ్న తలెత్తింది: యేసు నిజ అనుచరులమని చెప్పుకుంటున్న నకిలీ క్రైస్తవులు చాలామంది ఉన్నారు కాబట్టి, గోధుమలైన అభిషిక్తుల్ని గుర్తుపట్టడం ఎలా? నమ్మకమైన దాసుని గురించి యేసు చెప్పిన ఉపమానంలో దానికి జవాబుంది. చక్కని ఆధ్యాత్మిక పోషణను పొందిన వాళ్లే క్రీస్తు అభిషిక్త అనుచరులు.

“నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?”

8. ఎందుకు అభిషిక్త క్రైస్తవులే నమ్మకమైన దాసునిగా ఉండాలి?

8 భూమ్మీది అభిషిక్త క్రైస్తవులే నమ్మకమైన దాసునిగా ఉండాలి. వాళ్లకు “రాజులైన యాజకసమూహము” అనే పేరుంది, అంతేకాదు “చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి [తమను] పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము” చేసే బాధ్యత వాళ్ల మీద ఉంది. (1 పేతు. 2:9) కాబట్టి, తోటి విశ్వాసులకు సత్యాన్ని బోధించాల్సింది ఆ ‘రాజులైన యాజక సమూహంలోని’ సభ్యులే.—మలా. 2:7; ప్రక. 12:17.

9. అభిషిక్త క్రైస్తవుల్లో అందరూ నమ్మకమైన దాసునిగా ఉంటారా? వివరించండి.

9 అలాగని, భూమ్మీది అభిషిక్త క్రైస్తవుల్లో అందరూ నమ్మకమైన దాసునిగా ఉంటారా? లేదు. వాస్తవమేమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి విశ్వాసులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే పనిని అభిషిక్తుల్లో అందరూ చేయరు. గోధుమలైన అభిషిక్త సహోదరుల్లో కొందరు స్థానిక సంఘాల్లో పరిచర్య సేవకులుగా లేదా సంఘ పెద్దలుగా సేవచేస్తారు. వాళ్లు ఇంటింటి పరిచర్యలో, సంఘంలో బోధిస్తారు; అంతేకాక ప్రధాన కార్యాలయం నుండి వచ్చే నిర్దేశాలకు నమ్మకంగా మద్దతిస్తారు. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరసహోదరీలకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే పనిలో వాళ్లకు వంతు లేదు. పైగా, అభిషిక్తుల్లో వినయంగల సహోదరీలు కూడా ఉన్నారు. వాళ్లు సంఘంలో బోధకులుగా ఉండడానికి ఎన్నడూ ప్రయత్నించరు.—1 కొరిం. 11:3; 14:34.

10. నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు ఎవరు?

10 మరైతే నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు ఎవరు? యేసు కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందిని పోషించిన రీతిగానే ఆ దాసునిలో, క్రీస్తు ప్రత్యక్షత కాలంలో ఆధ్యాత్మిక ఆహారాన్ని సిద్ధంచేసి పంచిపెట్టే అభిషిక్త సహోదరుల చిన్న గుంపు ఉంటుంది. ఈ అంత్యదినాలంతటిలో, నమ్మకమైన దాసునిగా ఉన్న అభిషిక్త సహోదరులు కలిసికట్టుగా ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవచేస్తూ వస్తున్నారు. ఇటీవలి దశాబ్దాల్లో, ఆ దాసునిగా సేవచేస్తున్నది యెహోవాసాక్షుల పరిపాలక సభే. ఏదేమైనా, యేసు ఉపమానంలోని “దాసుడు” అనే ఏకవచన పదం, ఆ దాసునిలో కొద్దిమందితో కూడిన ఓ చిన్న గుంపు ఉంటుందని సూచిస్తుంది. అందుకే, పరిపాలక సభలోని సభ్యులు నిర్ణయాల్ని కలిసికట్టుగా తీసుకుంటారు.

ఇంటివారు ఎవరు?

11, 12. (ఎ) నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు ఏ రెండు వేర్వేరు నియామకాల్ని పొందుతాడు? (బి) యేసు ఎప్పుడు తన ఇంటివారిమీద నమ్మకమైన దాసుణ్ణి నియమించాడు? అందుకోసం ఎవరిని ఎంచుకున్నాడు?

11 యేసు చెప్పిన ఉపమానంలో నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు రెండు వేర్వేరు నియామకాలు పొందుతాడనే విషయం గమనార్హం. మొదటిది ఇంటివారిమీద; రెండవది యజమాని యావదాస్తి మీద. ఆ ఉపమానం ఈ అంత్యకాలంలోనే నెరవేరుతుంది కాబట్టి, ఆ రెండు నియామకాలు 1914లో యేసు రాజ్యాధికారంతో ప్రత్యక్షమయ్యాకే జరగాలి.

12 ఇంతకీ నమ్మకమైన దాసుణ్ణి యేసు తన ఇంటివారిమీద ఎప్పుడు నియమించాడు? దానికి జవాబు తెలుసుకోవాలంటే మనం కోతకాలం మొదలైన 1914వ సంవత్సరంలో జరిగిన దాన్ని పరిశీలించాలి. మనం ముందే నేర్చుకున్నట్లు, ఆ సమయంలో ఎన్నో గుంపులు క్రైస్తవులమని చెప్పుకున్నాయి. యేసు ఏ గుంపును ఎంచుకొని నమ్మకమైన దాసునిగా నియమిస్తాడు? 1914 నుండి 1919 తొలి భాగం వరకు యేసు, ఆయన తండ్రి కలిసి ఆలయాన్ని అంటే, ఆరాధన కోసం చేయబడిన ఆధ్యాత్మిక ఏర్పాటును తనిఖీ చేసిన తర్వాత ఆ ప్రశ్నకు జవాబు దొరికింది. c[3] (మలా. 3:1) యెహోవాను, ఆయన వాక్యాన్ని హత్తుకొని ఉన్న నమ్మకమైన బైబిలు విద్యార్థుల చిన్న గుంపును చూసి యెహోవా, యేసు సంతోషించారు. అప్పటికి బైబిలు విద్యార్థులు ఎంతోకొంత శుద్ధి కావాల్సి ఉంది. అయితే ఆ స్వల్ప కాలవ్యవధిలో యెహోవా, యేసు కలిసి చేసిన తనిఖీకి, శుద్ధికి ఆ బైబిలు విద్యార్థుల గుంపు వినయంగా స్పందించింది. (మలా. 3:2-4) ఆ నమ్మకమైన బైబిలు విద్యార్థులు నిజంగా గోధుమల్లాంటి క్రైస్తవులు. ఆధ్యాత్మిక పునరుద్ధరణ కాలమైన 1919వ సంవత్సరంలో, యేసు వాళ్లలో నుండి సమర్థులైన అభిషిక్త సహోదరుల్ని ఎంపిక చేసుకొని, వాళ్లను తన ఇంటివారిమీద నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసునిగా నియమించాడు.

13. ఇంటివారిలో ఎవరు కూడా ఉన్నారు? ఎందుకు?

13 ఇంతకీ, ఇంటివారు ఎవరు? ఒక్కమాటలో చెప్పాలంటే, పోషణను అందుకునే వాళ్లే ఇంటివారు. అంత్యదినాలు ఆరంభమైన మొదట్లో, ఆ ఇంటివారిలో అందరూ అభిషిక్తులే ఉండేవాళ్లు. ఆ తర్వాత, ఇంటివారిలో వేరేగొర్రెలకు చెందిన గొప్ప సమూహం కూడా వచ్చి చేరింది. ఇప్పుడు క్రీస్తు నాయకత్వం కింద ఉన్న ‘ఒక్క మందలో’ అత్యధికులు వేరేగొర్రెలే. (యోహా. 10:16) నమ్మకమైన దాసుడు తగినవేళ అందిస్తున్న ఒకేవిధమైన ఆధ్యాత్మిక ఆహారం నుండి రెండు గుంపుల వాళ్లూ ప్రయోజనం పొందుతున్నారు. నేడు నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసునిగా ఉన్న పరిపాలక సభలోని సభ్యుల విషయమేమిటి? వాళ్లకు కూడా ఆధ్యాత్మిక పోషణ అవసరమే. కాబట్టి, యేసు నిజ అనుచరులైన ఇతరుల్లాగే తాము కూడా ఒక్కో వ్యక్తిగా ఆ ఇంటివారిలో భాగమేనని వాళ్లు వినయంగా గుర్తిస్తారు.

మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా మనమందరం ‘ఇంటివారమే.’ మనందరికీ తగినవేళ ఒకేవిధమైన ఆధ్యాత్మిక ఆహారం అవసరం

14. (ఎ) నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసునికి ఏ బాధ్యత ఉంది? అందులో భాగంగా ఆ దాసుడు ఏమి చేస్తాడు? (బి) నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసునికి యేసు ఏ హెచ్చరిక ఇచ్చాడు? (“దుష్టుడైన యొక దాసుడు . . . ” అనే బాక్సు చూడండి.)

14 యేసు నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసునికి బరువైన బాధ్యతను అప్పగించాడు. బైబిలు కాలాల్లో ఓ ఇంట్లో పనిచేసే నమ్మకస్థుడైన దాసునికి లేదా గృహనిర్వాహకునికి ఆ ఇంటి నిర్వహణా బాధ్యత ఉండేది. (లూకా 12:42) అదే విధంగా, విశ్వాస గృహపు నిర్వహణ చూసుకోవాల్సిన బాధ్యత నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసునికి ఉంది. దానిలో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా మన సంస్థకున్న ఆస్తిపాస్తులను; ప్రకటనా పనిని; సమావేశ కార్యక్రమాలను; పరిచర్యలో, వ్యక్తిగత అధ్యయనంలో, సంఘ అధ్యయనంలో ఉపయోగించడానికి కావాల్సిన బైబిలు సాహిత్యపు ఉత్పత్తిని నమ్మకమైన దాసుడు పర్యవేక్షిస్తాడు. ఇంటివారు ఆ నమ్మకమైన దాసుడు చేసే ఆధ్యాత్మిక ఏర్పాట్లన్నిటి మీద ఆధారపడతారు.

ఆ దాసుణ్ణి తన యావదాస్తి మీద నియమించేది ఎప్పుడు?

15, 16. యేసు నమ్మకమైన దాసుణ్ణి ఎప్పుడు “తన యావదాస్తి మీద” నియమిస్తాడు?

15 యేసు ఆ దాసునికి రెండవ నియామకాన్ని అంటే ‘తన యావదాస్తిని’ చూసుకునే బాధ్యతను ఎప్పుడు ఇస్తాడు? యేసు ఇలా అన్నాడు:“యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తిమీద వానినుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (మత్త. 24:46, 47) యేసు వచ్చి, ఆ దాసుడు ‘ఈలాగు చేయుచుండుట కనుగొన్నప్పుడు’ అంటే నమ్మకంగా ఆధ్యాత్మిక ఆహారం పెట్టడాన్ని చూసినప్పుడు ఆ దాసునికి రెండవ నియామకాన్ని ఇస్తాడని గమనించండి. దీన్నిబట్టి మొదటి నియామకానికి, రెండవ నియామకానికి మధ్య ఓ కాలనిడివి ఉంటుందని అర్థమౌతోంది. యేసు ఎప్పుడు, ఎలా దాసుణ్ణి తన యావదాస్తి మీద నియమిస్తాడో అర్థంచేసుకోవాలంటే మనం ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి: ఆయన ఎప్పుడు వస్తాడు? ఆయన యావదాస్తిలో ఏమేమి ఉన్నాయి?

16 యేసు ఎప్పుడు వస్తాడు? లేఖన సందర్భాన్ని పరిశీలిస్తే దానికి జవాబు దొరుకుతుంది. దానికి ముందున్న వచనాల్లో యేసు ‘వచ్చును’ అనే మాట, ఈ విధానాంతమప్పుడు తీర్పు ప్రకటనను వెలువర్చడానికి, తీర్పును అమలుపర్చడానికి ఆయన వచ్చే కాలానికి సంబంధించినది. d[4] (మత్త. 24:30, 42, 44) కాబట్టి, నమ్మకమైన దాసుని గురించిన ఉపమానంలో యేసు రావడం గురించిన ప్రస్తావన కూడా మహాశ్రమల కాలానికి సంబంధించినదే.

17. యేసు ఆస్తిలో ఏమేమి ఉన్నాయి?

17 యేసు ‘యావదాస్తిలో’ ఏమేమి ఉన్నాయి? “యావదాస్తి” అని యేసు ఉపయోగించిన మాట కేవలం భూమ్మీద ఉన్నవాటికే పరిమితం కాదు. నిజానికి, యేసుకు పరలోకంలో కూడా ఎంతో అధికారం ఉంది. ఆయన ఇలా అన్నాడు: “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.” (మత్త. 28:18; ఎఫె. 1:20-23) ఇప్పుడు ఆయన ఆస్తిలో, 1914 నుండి తన అధికారం కిందకు వచ్చిన మెస్సీయ రాజ్యం కూడా ఉంది. దాన్ని ఆయన తన అభిషిక్త అనుచరులతో పంచుకుంటాడు.—ప్రక. 11:15.

18. నమ్మకమైన దాసుణ్ణి యేసు “తన యావదాస్తి మీద” ఎందుకు సంతోషంగా నియమిస్తాడు?

18 పైన చెప్పుకున్న వాటి దృష్ట్యా, మనం ఏ నిర్ధారణకు రావచ్చు? తాను మహాశ్రమల కాలంలో తీర్పుతీర్చడానికి వచ్చినప్పుడు, ఆ నమ్మకమైన దాసుడు ఇంటివారికి యథార్థంగా తగినవేళ ఆధ్యాత్మిక ఆహారం పెడుతుండడాన్ని యేసు కనుగొంటాడు. అప్పుడు యేసు సంతోషంగా ఆ దాసునికి రెండవ నియామకాన్ని ఇస్తాడు, అంటే “తన యావదాస్తి మీద” నియమిస్తాడు. నమ్మకమైన దాసునిగా సేవచేస్తున్న సభ్యులు, క్రీస్తుతో పాటు సహపరిపాలకులుగా ఉండే తమ పరలోక బహుమానాన్ని పొందినప్పుడు ఆ రెండవ నియామకాన్ని అందుకుంటారు.

19. నమ్మకమైన దాసునిగా సేవచేసిన సభ్యులు పరలోకంలో ఇతర అభిషిక్తుల కన్నా గొప్ప బహుమానాన్ని పొందుతారా? వివరించండి.

19 నమ్మకమైన దాసునిగా సేవచేసిన సభ్యులు పరలోకంలో ఇతర అభిషిక్తుల కన్నా గొప్ప బహుమానాన్ని పొందుతారా? లేదు. ఒకసారి అభిషిక్తుల చిన్న గుంపుకు ఏదైనా వాగ్దానం చేయబడిందంటే, అది మిగతా అభిషిక్తులకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు, మరణానికి ముందు యేసు తన 11 మంది నమ్మకమైన అపొస్తలులతో ఏమి చెప్పాడో గమనించండి. (లూకా 22:28-30 చదవండి.) తమ విశ్వాస్యతను బట్టి వాళ్లు మంచి ప్రతిఫలాన్ని పొందుతారని యేసు వాళ్లకు వాగ్దానం చేశాడు. ఆయనతో కలిసి వాళ్లు రాజ్యాధికారంలో పాలుపంచుకుంటారు. అయితే 1,44,000 మందిలో ఉన్న ప్రతి ఒక్కరూ సింహాసనాసీనులై తనతో కలిసి పరిపాలిస్తారని యేసు కొన్నేళ్ల తర్వాత సూచించాడు. (ప్రక. 1:1; 3:21) అలాగే, మత్తయి 24:47 చెబుతున్నట్లుగా, ఆయన తన యావదాస్తిమీద కొందరు పురుషులను, అంటే నమ్మకమైన దాసునిగా సేవచేసే అభిషిక్త సహోదరులను నియమిస్తానని వాగ్దానం చేశాడు. వాస్తవానికి 1,44,000 మందిలో ప్రతి ఒక్కరూ పరలోకంలో యేసుకున్న అధికారంలో పాలుపంచుకుంటారు.—ప్రక. 20:4, 6.

1,44,000 మందిలో ప్రతీ ఒక్కరూ పరలోకంలో యేసుకున్న అధికారంలో పాలుపంచుకుంటారు (19వ పేరా చూడండి)

20. యేసు ఎందుకు నమ్మకమైన దాసుణ్ణి నియమించాడు? మీ కృతనిశ్చయం ఏమిటి?

20 మొదటి శతాబ్దంలో యేసు కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందిని పోషించాడు. ఇప్పుడు కూడా నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని ద్వారా యేసు అదే చేస్తున్నాడు. తన నిజ అనుచరులందరికీ అంటే అభిషిక్తులకు, వేరేగొర్రెలకు ఈ అంత్యదినాల్లో క్రమంగా తగినవేళ ఆధ్యాత్మిక ఆహారం పెట్టేలా చూసేందుకు యేసు నమ్మకమైన దాసుణ్ణి నియమించాడు. కాబట్టి, నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసునిగా సేవచేస్తున్న అభిషిక్త సహోదరులకు మనం యథార్థంగా మద్దతు ఇవ్వడం ద్వారా మన కృతజ్ఞతను వ్యక్తం చేయాలనే కృతనిశ్చయంతో ఉందాం.—హెబ్రీ. 13:7, 17.

 

a 2వ పేరా: [1] అంతకుముందు ఓ సందర్భంలో, యేసు ఇలాంటి ఉపమానాన్నే చెబుతూ, అందులో ‘దాసుణ్ణి’ “గృహనిర్వాహకుడు” అని పేర్కొన్నాడు.—లూకా 12:42-44.

b 6వ పేరా: [2] మత్తయి 24:42, 44 వచనాల్లో “వచ్చును” అని అనువాదమైన ఎర్ఖోమై అనే గ్రీకు పదానికి, మత్తయి 24:3లో “రాకడ [“ప్రత్యక్షత,” NW]” అని అనువాదమైన పరోసియ అనే గ్రీకు పదానికి మధ్య వ్యత్యాసం ఉంది. తీర్పుతీర్చడానికి రాకముందే క్రీస్తు అదృశ్య ప్రత్యక్షత ఆరంభమౌతుంది.

c 12వ పేరా: [3] ఈ సంచికలో ఉన్న ‘ఇదిగో నేను సదాకాలము మీతో కూడ ఉన్నాను’ అనే ఆర్టికల్‌లో 5-8 పేరాలు చూడండి.

d 16వ పేరా: [4] ఈ సంచికలో ఉన్న ‘ఇవి ఎప్పుడు జరుగును? మాతో చెప్పుము’ అనే ఆర్టికల్‌లో 14-18 పేరాలు చూడండి.