జీవిత కథ
యెహోవాపై ఆధారపడడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పొందాం
జీవితంలో ఎప్పుడేమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు, కొన్నిసార్లు అనుకోని సంఘటనలు ఎదురౌతాయి, భరించలేని కష్టాలు కూడా వస్తాయి. కానీ, తమ సొంత జ్ఞానంపై కాకుండా తనపై ఆధారపడే వాళ్లను యెహోవా తప్పకుండా దీవిస్తాడు. ఎన్నో ఆశీర్వాదాలతో నిండిన మా సుదీర్ఘ జీవన ప్రయాణంలో నేనూ నా భార్యా తెలుసుకున్నది అదే. మా గురించి క్లుప్తంగా . . .
అమెరికాలోని, ఒహాయోలో ఉన్న సీడార్ పాయింట్ వద్ద 1919లో, అంతర్జాతీయ బైబిలు విద్యార్థులు జరుపుకున్న ఒక జిల్లా సమావేశంలో మా అమ్మనాన్నలు కలుసుకున్నారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో వాళ్లు పెళ్లి చేసుకున్నారు. నేను 1922లో పుట్టాను, తర్వాత రెండు సంవత్సరాలకు తమ్ముడు పాల్ పుట్టాడు. నా భార్య గ్రేస్ 1930లో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు రూత్ హవెల్, రోయ్లు చిన్నప్పటినుండే సత్యంలో పెరిగారు. గ్రేస్వాళ్ల తాత, అమ్మమ్మలు కూడా బైబిలు విద్యార్థులే, వాళ్లు సహోదరుడు ఛార్లెస్ తేజ్రస్సెల్కు మంచి స్నేహితులు కూడా.
గ్రేస్ నాకు 1947లో పరిచయం అయ్యింది, 1949, జూలై 16న మేము పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందే మా జీవితం గురించి నిర్మొహమాటంగా మాట్లాడుకున్నాం. పిల్లల్ని కనకుండా మా జీవితం మొత్తం పూర్తికాల సేవలో గడపాలని తీర్మానించుకున్నాం. 1950, అక్టోబరు 1న మేమిద్దరం కలిసి పయినీరు సేవ మొదలుపెట్టాం. ఆ తర్వాత 1952లో మమ్మల్ని ప్రాంతీయ సేవ కోసం ఆహ్వానించారు.
ప్రయాణ సేవ, గిలియడ్ శిక్షణ
ఆ కొత్త బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడానికి మా ఇద్దరికి ఎంతో సహాయం అవసరమని మాకనిపించింది. నేను ఒకవైపు అనుభవజ్ఞులైన సహోదరుల నుండి నేర్చుకుంటూ, గ్రేస్‌కు సహాయం చేసేవాళ్ల కోసం వెదికాను. అప్పుడు, ప్రయాణ సేవలో మంచి అనుభవం ఉండి మా కుటుంబానికి ఎంతో కాలంగా తెలిసిన మార్వెన్ హోలీన్ అనే సహోదరుణ్ణి కలిశాను. ఆయనను ఇలా అడిగాను: “గ్రేస్‌కు వయసు తక్కువ, అనుభవం కూడా తక్కువే. తనకు పరిచర్యలో మంచి శిక్షణ ఇవ్వగల వాళ్లెవరైనా మీకు తెలుసా?” దానికి ఆయన “ఆఁ తెలుసు, ఎడ్నా వింకల్ అనే ఎంతో అనుభవంగల పయినీరు ఉంది. తను గ్రేస్‌కు తప్పకుండా సహాయం చేయగలదు” అని నాతో చెప్పాడు. ఆ తర్వాత ఎడ్నా గురించి గ్రేస్ ఇలా చెప్పింది: “ఆమెవల్ల, గృహస్థులతో ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడగలుగుతున్నాను. అభ్యంతరం చెప్పేవాళ్లతో ఎలా మాట్లాడాలో ఆమెకు బాగా తెలుసు. ఇంటివాళ్లు చెప్పేది జాగ్రత్తగా విని దానికి తగ్గట్లుగా ఎలా మాట్లాడాలో కూడా ఆమె నాకు నేర్పించింది. నాకు కావాల్సింది సరిగ్గా అలాంటి సహాయమే.”
నేను, గ్రేస్ కలిసి లోవా రాష్ట్రంతోపాటు మిన్నెసోటా, దక్షిణ డికోటా రాష్ట్రాల్లోని కొన్ని భాగాలు కలిసున్న రెండు సర్క్యూట్లలో సేవచేశాం. ఆ తర్వాత మేము న్యూయార్క్ 1వ సర్క్యూట్‌కి మారాం, దానిలో బ్రూక్లిన్, క్వీన్స్ ప్రాంతాలు ఉన్నాయి. ఆ నియామకానికి మాకు అనుభవం సరిపోదని
అప్పుడు ఎంతగా అనిపించిందో మేము ఎప్పటికీ మరచిపోలేం. ఆ సర్క్యూట్లో బ్రూక్లిన్ హైట్స్ సంఘం కూడా ఉంది, ఆ సంఘం వాళ్లు బెతెల్ రాజ్యమందిరంలో కూటాలు జరుపుకుంటారు. వాళ్లలో చాలామంది అనుభవజ్ఞులైన బెతెల్ సభ్యులున్నారు. ఆ సంఘంలో నేను మొట్టమొదటి సేవా ప్రసంగం ఇచ్చినప్పుడు సహోదరుడు నేథన్ నార్ నా దగ్గరకు వచ్చి, “మాల్కమ్, మేము ఏ విషయాల్లో మెరుగవ్వాలనే దానిగురించి చక్కని సలహాలు ఇచ్చావు. ప్రేమతో మాకు ఇలా సలహాలు ఇస్తూ సహాయం చేయకపోతే సంస్థకు నీ వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదనే విషయం గుర్తుంచుకో. ఇలాగే చేస్తూ ఉండు!” అని అన్నాడు. ఈ మాటలనే నేను గ్రేస్‌కు చెప్పాను. తర్వాత, మేము బెతెల్‌లో మాకిచ్చిన గదిలోకి వెళ్లి, ఆందోళన వల్ల నీరసించిపోయి ఏడ్చేశాం.“ప్రేమతో మాకు ఇలా సలహాలు ఇస్తూ సహాయం చేయకపోతే సంస్థకు నీ వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదనే విషయం గుర్తుంచుకో. ఇలాగే చేస్తూ ఉండు!”
కొన్ని నెలల తర్వాత 24వ గిలియడ్ పాఠశాలకు రమ్మనే ఆహ్వానం మాకు అందింది. 1955, ఫిబ్రవరిలో మేము పట్టభద్రులయ్యాం. అయితే మాకు శిక్షణ ఇచ్చేది మిషనరీ సేవకోసం మాత్రమే కాదని ఆ పాఠశాలకు వెళ్లే ముందే మాకు చెప్పారు. బదులుగా, ప్రయాణ సేవను మరింత సమర్థవంతంగా చేయడానికి అది ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ పాఠశాల మమ్మల్ని మరింత వినయస్థుల్ని చేసింది, దానికి హాజరవ్వడం నిజంగా ఓ అద్భుతమైన అనుభూతి.
ఆ పాఠశాల ముగిశాక మమ్మల్ని జిల్లా సేవకు నియమించారు. మేము సేవచేయాల్సిన ‘జిల్లాలో’ ఇండియానా, మిచిగాన్, ఒహాయో రాష్ట్రాలు ఉన్నాయి. 1955, డిసెంబరులో సహోదరుడు నార్ నుండి ఓ ఉత్తరం వచ్చినప్పుడు మేము ఆశ్చర్యపోయాం, అందులో ఆయనిలా రాశాడు: “నేనిప్పుడు అడిగే దానికి నిర్మొహమాటంగా, నిజాయితీగా జవాబివ్వండి. మీరు బెతెల్‌కు వచ్చి ఇక్కడే సేవచేయడానికి ఇష్టపడతారా? . . . లేదా బెతెల్‌లో కొంత కాలం ఉండి ఆ తర్వాత విదేశాల్లో సేవచేయడానికి ఇష్టపడతారా? ఒకవేళ ప్రాంతీయ, జిల్లా సేవలోనే ఉండాలనుకున్నా ఆ విషయం నాతో చెప్పండి.” మాకు ఏ సేవా నియామకం ఇచ్చినా, సంతోషంగా చేస్తామని మేము జవాబిచ్చాం. కొన్ని రోజులకే, బెతెల్‌కు రమ్మనే ఆహ్వానం మాకు అందింది.
బెతెల్‌లో పులకరింపజేసే సంవత్సరాలు
నేను బెతెల్‌లో గడిపిన అద్భుతమైన సంవత్సరాల్లో అమెరికా అంతటా ఎన్నో సంఘాల్లో, సమావేశాల్లో ప్రసంగాలు ఇచ్చాను. ఎంతోమంది యువ సహోదరులకు శిక్షణనివ్వడంలో భాగం వహించాను, ఆ తర్వాత వాళ్లు యెహోవా సంస్థలో పెద్దపెద్ద నియామకాలను చేపట్టారు. కొంతకాలానికి నేను, ప్రపంచవ్యాప్త ప్రకటన పనిని సంస్థీకరించే విభాగంలో, సహోదరుడు నార్కు కార్యదర్శిగా పనిచేశాను.
సేవా విభాగంలో నేను పనిచేసిన సంవత్సరాలు ఎంతో ఆనందంగా గడిచాయి. అక్కడ నేను, టీ. జే. (బడ్) సల్లీవన్తో పనిచేశాను. ఆయన ఆ విభాగానికి ఎన్నో ఏళ్లపాటు పర్యవేక్షకునిగా సేవచేశాడు. అయితే, అక్కడున్న వేరే సహోదరుల దగ్గరనుండి కూడా నేను ఎంతో నేర్చుకున్నాను. నాకు శిక్షణ ఇచ్చిన ఫ్రెడ్ రస్క్ అనే సహోదరుడు వాళ్లలో ఒకరు. “ఫ్రెడ్, నేను రాసే ఉత్తరాల్లో ఎందుకు అన్ని మార్పులు చేర్పులు చేస్తావు?” అని
ఆయనను అడగడం నాకు గుర్తొస్తేనే నవ్వొస్తుంది. అప్పుడు, ఆయన కాస్త నవ్వి నన్ను ఆలోచింపజేసే ఈ విషయం చెప్పాడు: “మాల్కమ్, నువ్వు ఏదైనా విషయం చెప్పావనుకో అది అర్థం అవ్వడానికి మరికొన్ని మాటలను దానికి జోడించవచ్చు, కానీ నువ్వు ఏదైనా రాసినప్పుడు, ముఖ్యంగా అది ఈ విభాగం నుండి వెళ్లేదైతే అది సరిగ్గా ఉండాలి, వీలైనంత ఖచ్చితంగా ఉండాలి.” తర్వాత ఆయన దయతో ఇలా అన్నాడు: “ధైర్యంగా ఉండు, నువ్విప్పుడు బాగా పనిచేస్తున్నావ్, ముందుముందు ఇంకా బాగా చేస్తావ్.”మేము బెతెల్‌లో ఉన్న సంవత్సరాల్లో గ్రేస్ చాలా రకాల నియామకాల్లో పనిచేసింది, బెతెల్ సభ్యుల గదులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వాటిలో ఒకటి. తను ఆ పనిని ఎంతో ఇష్టంగా చేసింది. మేము బెతెల్‌లో సేవ చేసినప్పుడు యౌవనులుగా ఉన్న కొంతమంది సహోదరులు ఇప్పటికీ గ్రేస్‌ను చూస్తే చిరునవ్వుతో ఇలా అంటారు: “మా మంచాన్ని, పరుపును ఎలా సర్దుకోవాలో మీరు నేర్పించారు, మీరు నేర్పిన పనిని మా అమ్మ కూడా ఎంతో ఇష్టపడింది.” ఆ తర్వాత, గ్రేస్ పత్రికల విభాగంలో, ఉత్తరప్రత్యుత్తరాల విభాగంలో, క్యాసెట్ల తయారీ విభాగంలో కూడా పనిచేసింది. అలాంటి వివిధ నియామకాల్లో పనిచేయడం వల్ల యెహోవా సంస్థలో ఏ పని చేసినా, ఎక్కడ చేసినా అది ఓ గొప్ప అవకాశమని, యెహోవా దీవెనని గ్రేస్ గుర్తించగలిగింది. ఈ రోజు వరకూ తాను అలాగే భావిస్తుంది.
మేము చేసుకున్న కొన్ని సర్దుబాట్లు
పంతొమ్మిదివందల డెబ్బైల మధ్య భాగంలో, వయసు పైబడుతున్న మా తల్లిదండ్రులకు సహాయం అవసరమని మాకు అర్థమైంది. దాంతో, మేము ఎంతో కష్టమైన ఓ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. బెతెల్‌ను, మేము ఎంతో ప్రేమించిన మా తోటి సహోదరసహోదరీలను విడిచిపెట్టి రావడం మాకు అస్సలు ఇష్టంలేదు. కానీ, తల్లిదండ్రులను చూసుకోవడం మా బాధ్యతని అనిపించింది. దాంతో, పరిస్థితులు మారితే మళ్లీ తప్పకుండా రావచ్చనే నమ్మకంతో మేము బెతెల్ నుండి వచ్చేశాం.
మమ్మల్ని మేము పోషించుకోవడానికి, నేను ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పనిచేయడం మొదలుపెట్టాను. నేను ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు మా మేనేజరు నాతో చెప్పిన ఈ మాటలు ఇప్పటికీ గుర్తే: “ఈ వ్యాపారంలో రాణించాలంటే, సాయంత్రాలు ప్రజలు ఇళ్లల్లో ఉన్నప్పుడు వాళ్లను కలవాలి. కాబట్టి, ప్రతీ సాయంత్రం ప్రజల్ని కలవడం కన్నా ఇంకేది మనకు ముఖ్యం కాదు.” అప్పుడు నేను ఇలా అన్నాను: “మీరు మీ అనుభవాన్ని బట్టి ఆ మాట చెబుతున్నారని నాకు తెలుసు, నేను దాన్ని గౌరవిస్తాను. కానీ, నేను నిర్వర్తించాల్సిన ఆధ్యాత్మిక బాధ్యతలు కొన్ని ఉన్నాయి, వాటిని నేను ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయలేదు ఇక ముందు కూడా చేయాలనుకోవట్లేదు. కాబట్టి, మీరన్నట్లే సాయంత్రాలు ప్రజల్ని కలుస్తాను, కానీ మంగళవారం, గురువారం సాయంత్రాలు మాత్రం మా కూటాలకు హాజరవ్వడం నాకు చాలా ప్రాముఖ్యం.” నా ఉద్యోగం వల్ల కూటాలకు వెళ్లడం మాననందుకు యెహోవా నిజంగా నన్ను ఆశీర్వదించాడు.
జూలై 1987లో, మా అమ్మ హాస్పిటల్లో చనిపోయింది, అప్పుడు మేము తన పక్కనే ఉన్నాం. అక్కడ పనిచేసే ఒక నర్సు గ్రేస్‌తో ఇలా అంది: “మీరు ఇక ఇంటికి వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోండి, మీరు మీ అత్తగారిని చూసుకుంటూ, ఎప్పుడూ ఇక్కడే ఉన్నారని అందరికీ తెలుసు. ఆత్మగౌరవంతో, మనశ్శాంతితో ఉండండి.”
మేము ఎంతగానో ప్రేమించిన బెతెల్‌లో సేవ చేయడానికి 1987, డిసెంబరులో మళ్లీ దరఖాస్తు చేసుకున్నాం. కానీ, కొన్ని
రోజులకే గ్రేస్‌కు పెద్దపేగు క్యాన్సర్ ఉందని తేలింది. సర్జరీ అయ్యి కోలుకున్నాక తనకు క్యాన్సర్ పూర్తిగా నయమైందని డాక్టర్లు చెప్పారు. ఈలోగా బెతెల్ నుండి ఓ ఉత్తరం వచ్చింది, ఆ ఉత్తరంలో మమ్మల్ని ప్రస్తుతమున్న సంఘంలోనే ఉండి సేవచేయమని సలహా ఇచ్చారు. దాంతో, మేము రాజ్య పనిలో శాయశక్తులా కృషిచేయాలని నిర్ణయించుకున్నాం.కొంతకాలానికి, నాకు టెక్సాస్ నగరంలో ఉద్యోగం దొరికింది. అక్కడున్న వెచ్చని వాతావరణం మాకు సరిపోతుందని అనిపించింది, మేమనుకున్నట్లే అక్కడి వాతావరణం ఉంది. ప్రస్తుతం టెక్సాస్‌లో ఉంటున్న మాపై గత 25 ఏళ్లుగా ఇక్కడ సహోదరసహోదరీలు ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు, వాళ్లు నిజంగా మాకు ఎంతో ఆప్తులు.
మేము నేర్చుకున్న పాఠాలు
పెద్దపేగు క్యాన్సర్ వల్ల, థైరాయిడ్ సమస్య వల్ల, ఈ మధ్యనే వచ్చిన రొమ్ము క్యాన్సర్వల్ల గ్రేస్ అప్పుడప్పుడు అనారోగ్యం పాలౌతుంటుంది. కానీ తన కష్టాల్ని బట్టి ఏనాడూ ఎవ్వరినీ నిందించలేదు, శిరసత్వాన్ని ధిక్కరించలేదు, నాకు సహకరించకుండా మానలేదు. “మీ అన్యోన్య దాంపత్యానికి, మీ ముఖాల్లో కనిపించే సంతోషానికి రహస్యం ఏమిటి?” అని తనను తరచూ చాలామంది అడుగుతారు. దానికి గ్రేస్ ఈ నాలుగు కారణాలను చెబుతుంది: “మేము చాలామంచి స్నేహితులం. ప్రతీరోజు తప్పకుండా మాట్లాడుకుంటాం. కలిసి సమయం గడపడానికి ఇష్టపడతాం. ఒకరి వల్ల ఒకరికి కోపం వస్తే, నిద్రబోయేలోపే క్షమాపణ చెప్పుకుంటాం.” మేము అప్పుడప్పుడు ఒకరి మనసును ఇంకొకరం బాధపెట్టినా, తర్వాత క్షమించుకొని మర్చిపోతాం. దానివల్లే, మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం.
“ఎల్లప్పుడూ యెహోవా మీద ఆధారపడండి, ఆయన ఏది అనుమతిస్తే దాన్ని అంగీకరించండి”
మాకు ఎదురైన సవాళ్ల నుండి మేము ఎన్నో మంచి పాఠాలు నేర్చుకున్నాం, అవి:
-
ఎల్లప్పుడూ యెహోవా మీద ఆధారపడండి, ఆయన ఏది అనుమతిస్తే దాన్ని అంగీకరించండి. మీ సొంత జ్ఞానంపై అస్సలు ఆధారపడకండి.—సామె. 3:5, 6; యిర్మీ. 17:7.
-
ఏ విషయంలోనైనా నడిపింపు కోసం యెహోవా వాక్యం వైపు చూడండి. యెహోవాకు, ఆయన నియమాలకు విధేయత చూపించడం చాలా ప్రాముఖ్యం. మీరు ఉంటే విధేయులుగా ఉంటారు లేదా అవిధేయులుగానైనా ఉంటారు, కానీ ఈ రెండిటి మధ్యలో ఉండడం సాధ్యం కాదు.—రోమా. 6:16; హెబ్రీ. 4:12.
-
యెహోవా దగ్గర మంచి పేరు సంపాదించుకోవడమే జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. వస్తుపరమైన వాటికి కాకుండా యెహోవాకు సంబంధించిన వాటికి మొదటి స్థానం ఇవ్వండి.—సామె. 28:20; ప్రసం. 7:1; మత్త. 6:33, 34.
-
మీరు వీలైనంత ఫలవంతంగా, ఉత్సాహంగా యెహోవా సేవ చేసేలా సహాయం చేయమని ఆయనకు ప్రార్థించండి. చేయలేని వాటిపై కాకుండా, చేయగలిగిన వాటిపైనే దృష్టిపెట్టండి.—మత్త. 22:37; 2 తిమో. 4:2.
-
యెహోవా ఆశీర్వాదం, ఆమోదం ఉన్న సంస్థ మరేదీ లేదని తెలుసుకోండి.—యోహా. 6:68.
నేను, గ్రేస్ ఒక్కొక్కరం 75 ఏళ్లకన్నా ఎక్కువ కాలం యెహోవా సేవ చేశాం. దంపతులముగా దాదాపు 65 ఏళ్లు సేవచేశాం. ఇన్ని దశాబ్దాలుగా, యెహోవా సేవలో మేమిద్దరం కలిసి అద్భుతమైన సమయాన్ని గడిపాం. యెహోవా మీద ఆధారపడడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో మా తోటి సహోదరసహోదరీలు కూడా అనుభవించి తెలుసుకోవాలనేదే మా ఆశ, దానికోసం మేము ప్రార్థిస్తున్నాం.